Friday, May 11, 2018

అసలు ఒక కధ ఎప్పుడు పాఠకుడిని కదిలిస్తుంది...?ఈ మధ్య కాలం లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు రచయితలు గా పరిణామం చెంది ఆ రంగం లో చక్కగా పురోగమించడం చూస్తున్నాము.ఆ విధంగా భారతీయ ఆంగ్ల రచనా ధోరణులపై తమదైన ముద్ర వేసి దూసుకుపోతున్నారు.దానితో పాటు కుదురైన మార్కెటింగ్ వ్యూహాలతో పేరు కి పేరు,డబ్బు కి డబ్బు రెండిటిని అందిపుచ్చుకుంటున్నారు.చేతన్ భగత్ తో ప్రారంభమై ఇప్పుడు అనేకమంది తమ జాతకాన్ని ఈ రచనా రంగం లో పరీక్షించుకుంటున్నారు.ఆ కోవ లోకే చెందిన మరో రచయిత రవీందర్ సింగ్.ఇంఫోసిస్ లో కొంత కాలం పని చేసి దానికి రిజైన్ చేసి పూర్తి కాలం రచయిత గా అవతరించాడు.ఇప్పటిదాకా ఎనిమిది నవలలు రాశాడు.I too had a love story,Your dreams are mine అలాంటివి.ఇంకా నలభై ఏళ్ళు లోపులోనే ఉన్న ఈ యువకుడు దేశం లోని ప్రముఖ రచయితల్లో ఒకరి గా రూపొందాడు.సంవత్సరం మొత్తం మీద మెట్రో లు,నాన్ మెట్రోలు ఇలా అదీ ఇదీ అనకుండా దేశం లోని వివిధ నగరాలు,పట్టణాలు తిరుగుతూ తన పాఠకుల్ని కలుసుకుంటూ ఉంటాడు.

ఈయన ఒరిస్సా రాష్ట్రం లోని బర్లా అనే చిన్న పట్టణం నుంచి వచ్చాడు.ప్రస్తుతం బ్లాక్ ఇంక్ అనే సంస్థ స్థాపించి అనేక ప్రయోగాలు చేస్తున్నాడు రచనా రంగం లో.అనేకమంది యువ రచయితల్ని దీనినుంచి పరిచయం చేశాడు.ఓ మూడు ఏళ్ళ క్రితం రవీందర్ సింగ్ ఒక కధా సంకలనాన్ని ఎడిట్ చేశాడు.దీనిలో మొత్తం 21 కధలు ఉన్నాయి.మిమ్మల్ని బాగా కదిలించిన ఏదైనా సంఘటన ఆధారంగా కధ రాసి పంపమని కొత్త వాళ్ళకి పిలుపు ఇచ్చాడు.కొన్ని వందల కధలు దేశ వ్యాప్తం గా రాగా,వాటిని వడపోసి 21 కధల్ని ఓ సంకలనం గా వేశారు.పెంగ్విన్ వాళ్ళు.ఆ సంకలనం పేరు Tell me a story .రోజువారి జీవితం లోనుంచి అనేక కోణాల్ని చూపించే కధలు దీని లో ఉన్నాయి.తాను చిన్నప్పుడు అంబాలా లోని మిలటరీ క్వార్టర్ లో ఉన్నప్పుడు కలిగిన అనుభవాలను ,యుద్ధం జరిగే సమయం లో సైనిక కుటుంబం లోని వాతావరణం గురించి And then the planes came కధ లో సంఘమిత్ర బోస్ వర్ణించింది.

The end of the tunnel లో మృత్యువు ని బయట ఎక్కడో చూడటం ,తన ఇంట్లోనే చూడటం మధ్య గల తేడాని కృష్ణాషిష్ జెనా చిత్రించాడు.జార్ఖాండ్ రాష్ట్రం లో ని ఒక గ్రామం లో కరెంట్ లేని ఓ రాత్రి జరిగిన విషాద సంఘటన కదిలిస్తుంది.అపరాజిత దత్తా అనే ఆమె రాశారు.దీని లోని ప్రతి కధ మనల్ని కదిలిస్తుంది.మన దేశ పరిస్థితులని చిత్రిక పడుతుంది.ముఖ్యంగా చదివించే గుణం ఆసాంతామూ అన్ని కధల్లోనూ కనిపించింది.అసలు ఒక కధ ఎప్పుడు పాఠకుడిని కదిలిస్తుంది.దానిలో ఉండవలసిన గుణాలు ఏమిటి..?అని ప్రశ్నించినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఏ సంఘటన అయితే రచయిత మస్తిష్కం లో నాని నాని అనేక విధాలుగా గిలకొట్టబడి ఇక బయటకి రాక తప్పదు అనుకున్నప్పుడు వచ్చే ఆ కధ ,దాని కధయే వేరు.ఆనందం అనిపించింది ఏమిటంటే ఈ కధాసంపుటి లో ఒక తెలుగు రచయిత్రి కూడా ఉన్నది ఆమె పేరు పోతిన ప్రశాంతి అని విశాఖపట్టణం వాసి.Suicide అనే ఆ కధ వైవాహేతర సంబంధాలు ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయి అనేది విశదీకరించింది.వీలుంటే ఈ పుస్తకాన్ని చదవండి.అమెజాన్ లో కూడా లభ్యమవుతుంది.---Murthy Kvvs   

Wednesday, May 2, 2018

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

బహుశా అదే కృష్ణారావు గారి ఇల్లు కావచ్చుననుకుంటూ అటువైపు గా నడిచాడతను.చుట్టుపక్కల పెద్ద గా ఇళ్ళు లేవు.కానీ కూతవేటు దూరం లో మాత్రం ఓ రెండు మూడు కుటుంబాలు ఉన్న జాడ అగుపిస్తున్నది.కాసేపు ఆగి ఆ భవనాన్ని అలాగే చూశాడు.భవనానికి రాయి,సున్నం వాడినట్లు తోచింది.గాలి రావడం కోసం పెద్ద పెద్ద కిటికీలు...లోపలకి ప్రవేశించగానే విశాలమైన హాలు ,దానికి రెండు వేపులా చిన్న హాళ్ళు,వెలుతురు రావడానికి పైన నిర్మించిన జాలీలు,మధ్యలో ఉన్న హాలు కి అనుసంధానం గా వెనుక మరో విశాలమైన గది ఉన్నది.కింద నిర్మాణం గాక పైన కూడా ఇలాగే ఇంచు మించు ఉన్నది ఇంకో అంతస్తు.ప్రస్తుతం దీని లో ఒక హాస్టల్ వంటిది ఉన్నది.ఆ పాత భవంతి కే సున్నాలు వేసి నడిపిస్తున్నారు.

దుమ్ముగూడెం కి దగ్గర లోని లక్ష్మి నగరం లో ఇంకా ఆ పరిసర ప్రాంతం లో బ్రిటీష్ వారు అలనాడు నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయని ఓ మిత్రుడు చెపితే తను ఇక్కడకి చూడటానికి వచ్చాడు.అంతే కాదు అక్కడ కొన్ని తెల్ల వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయని దాని మీద వారి పేర్లూ అవీ కూడా చెక్కి ఉన్నాయని తెలిసింది.మన కి దగ్గర లోని చరిత్ర ని మనం తెలుసుకోలేకపోతే ఎలా ..అదే తనని ఇక్కడకి రప్పించింది.అయితే తను ఇప్పుడు తిరుగాడుతున్నది వర్క్ షాప్ ప్రాంతం లో...అలాగని ఇప్పుడేదో వర్క్ షాప్ అక్కడుందని అనుకోకండి.బ్రిటీష్ వాళ్ళు ఇక్కడ గోదావరి మీద లాకులు నిర్మించారు.ఇక్కడ నుంచి కలప ఇంకా ఇతర వస్తువులు పైకి వెళ్ళేవి జలరవాణా ద్వారా..!అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడకి అనేక ఉత్పత్తులు దిగేవి.అలా ఆ లాకుల్ని మెయింటైన్ చేయడానికి ఏర్పరిచిందే ఆ వర్క్ షాప్.ప్రస్తుతం అది లేదు,గాని పేరు మాత్రం మిగిలిపోయింది.

ఆ ప్రాంతం లో అర్ధ శతాబ్దం పైబడి ఇంకా అదృష్టవశాత్తు జీవించి ఉన్న ఆ చింత,రావి ఇంకా ఇతర వృక్షాలకి గనక నోళ్ళు ఉండి ఉంటే అప్పటి గాధల్ని ఏమేమి చెప్పి ఉండేవో..?!అక్కడ తిరుగాడుతున్న ఒక పిల్లవాడిని అప్పటి సమాదుల్ని గురించి ప్రశ్నించగా అవి రోడ్డు కి పక్కనున్న ములకపాడు చివరి లో ఉన్నాయని చెప్పాడు.తను కలవాలనుకున్న కృష్ణా రావు గారి ఇల్లు కూడా అటే ఉంటుందని చెప్పాడు.

ఒక పది నిమిషాల్లో అటు చేరుకున్నాడు.ఆయన బయటకి వచ్చి ఈ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూడసాగారు.తను ఫలానా పత్రిక విలేకరి అని అలనాటి బ్రిటీష్ వారి నిర్మాణాల్ని పరిశీలించి ఒక వార్తా కధనాన్ని రాయడానికి వచ్చానని చెప్పడం తో కృష్ణారావు గారు ఎంతో సంతోషించారు.

" అవును..నా గురించి ఎలా తెలుసు" రావు గారే అడిగారు.

" మీరు ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నట్లు మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు.ఈ పరిసరాల మీద మీకు మంచి అవగాహన ఉందని నాకు తెలుసు" అన్నాడు తను.

" ఓ..మొత్తానికి మీరు సామాన్యుల్లా లేరే..!ఈ కాలం లో కూడా మీ వంటి జిజ్ఞాసువులు ఉండటం ఆనందం గా ఉంది.." రావు గారు నవ్వుతున్నప్పుడు వార్ధాక్యం వల్ల వేలాడుతున్న బుగ్గల పైని చర్మం ఒక గంభీరత ని కలిగిస్తోంది.

" మీ సహకారం కావాలి..రావు గారు,ఆ తెల్ల సమాధుల దగ్గరకి దారి చూపించగలరా "

" అదిగో...అక్కడ దూరం గా పాత ప్రహరీ కనిపిస్తున్నదే... ఆ లోపలే బ్రిటీష్ వారి సమాధులు కొన్ని ఉన్నాయి ..వెళ్ళి చూస్తూ ఉండండి..ఇంట్లో చిన్న పని చూసుకొని వచ్చి మీతో జాయిన్ అవుతా "
సరే..అని చెప్పి కదిలాడు తను.ఇంచు మించు ఓ వంద గజాల దూరం ఉంటుందేమో..అది..!నాలుగు వేపులా పాతబడిన గోడలు..! ముందు ఒక ఇనుప గేటు..నామ మాత్రం గా ఉంది.చుట్టూతా పొలాలు ఇంకా కొన్ని చెట్లు ..నివాసాలు మాత్రం ఏమీ కనిపించలేదు.మనం పెద్దగా గమనించము గాని ఒక ప్రాంతం దగ్గరకి గాని ఒక మనిషి దగ్గరకి గాని వెళ్ళినపుడు దానికే పరిమితమైన కొన్ని వైబ్రేషన్స్ మన చుట్టూ అల్లుకుంటాయి.అవి మన ఆలోచనల సూక్ష్మ లోకం లో ఏవో వ్యక్తీకరించడానికి వీలుపడని ప్రభావాలని మోపుతుంటాయి.

వేసవి కావడం వల్ల చిరు చెమటలు పడుతున్నాయి తనకి.అస్థిపంజరం లా ఉంది స్మశానం.లోనికి ప్రవేశించగానే తనలో కలిగిన భావమది.ఇక్కడ ఈ సమాధుల్లో తిరిగి లేవలేని గాఢ నిద్ర లో ఉన్న వీరి వెనుక ఎలాంటి ఆవేదనలు ఉండేవో,ఆకాంక్షలు ఉండేవో ..!తమ తమ జీవిత కాలాల్లో వారు అనుభవించిన సుఖమేమిటో ,దుఖమేమిటో..! రవి అస్తమించని సామ్రాజ్యమని గర్వించిన బ్రిటీష్ ప్రాభావం నేడు లుప్తమైపోయింది.ఇక్కడ సమాధి చేయబడ్డ బ్రిటీష్ జాతీయులలో ఎన్ని రకాలు ఉన్నారో...ఒక డయ్యర్ ఉండి ఉండవచ్చును లేదా ఒక బ్రౌన్ ఇంకా ఓ కాటన్ ఉండివుండవచ్చును.ఆనాటి బ్రిటీష్ మహా సామ్రాజ్యం లో వీరు చిన్న మర మేకులు గా పనిచేసినవారు కావచ్చు.స్థానిక ప్రజలతో వారి సంభందాలు ఎన్ని కోణాలలో ఉండేవో ...!

కొన్ని సమాధులు పాలరాతి తో ఫ్రేం చేయబడి ఉన్నాయి.ఇంకొన్ని నున్న గా ఉన్న నల్ల రాతి తో నిర్మించబడిఉన్నాయి.పిచ్చి మొక్కలు బాగా పెరిగిన ఆ ప్రాంగణం తైల సంస్కారం లేని కుర్రాడిలా ఉంది.ప్రతి సమాధి పైన చనిపొయిన వ్యక్తి వివరాలు ఉన్నాయి.తనకి మొదటి గా కనబడిన సమాధి "అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్ " అనే అతనిది.దాని మీద చెక్కిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో భద్రాచలం ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్ గాను స్పెషల్ ఏజెంట్ గానూ పనిచేశాడు.తను ఇరవై ఐదవ ఏటనే సమాధి కాబడ్డాడు దాని మీద ఉన్న జనన మరణ వివరాల ప్రకారం..!ఆ రోజుల్లో సివిల్ సర్విసెస్ లో సెలెక్ట్ కావడానికి గరిష్ట వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే అనేది గుర్తుకు వచ్చింది.మరి అంత పిన్న వయసు లో ఎలా చనిపోయాడు..కారణమేమిటో..? ఈ.ఎం.ఫోరెస్టర్ రాసిన ఏ పాసేజ్ టు ఇండియా నవల లోని యువ సివిల్ సర్విస్ అధికారులు గుర్తుకు వచ్చారు.

ఈ ఏజెన్సీ లో పనిచేయడం మా వల్ల కాదు అంటూ ఆరోగ్య కారణాలతో బయటకి వెళ్ళడానికి ప్రయత్నించే నేటి ఉద్యోగులు ఆ రోజు ల్లో అయితే ఇక్కడ పని చేయగలిగేవారా..?సరే... కారణాలు ఏమైనా గాని వాళ్ళ ఉద్యోగం కోసమో,జీతం రాళ్ళ కోసమో..అటువంటి ఒక మొక్కవోని లాయల్టి తమ ప్రభుత్వం మీద ఉండటం వల్లనే గదా ఈ మారు మూలకి వచ్చింది.బ్రిటిష్ వారికి ప్రభుత్వం అంటే రాణి యొక్క ఆజ్ఞ యే.కల లో కూడా దానిని వారు మీరరు.ఆ ఏకతా సూత్రమే ,ఆ బంధనమే వాళ్ళ ని ప్రపంచ విజేతలు గా నిలిపింది.  

ఇంకొంచెం ముందుకి వెళితే...ఒక సమాధి పై మిస్ సారా క్లెయిర్ అని ఉంది,దాని పక్క నే ఉన్న మరో సమాధి పై మిస్ డొరోతి అని చెక్కి ఉంది.వాటిమీద వివరాల్ని బట్టి వాళ్ళు ఇద్దరూ మిషనరీ టీచర్స్.ఆ స్మశానం లో అన్నిటికన్నా అందం గా ఉన్న సమాధి సరిగ్గా మధ్య లో ఉంది.అది ఒక పదిహేనేళ్ళ అమ్మాయిది పేరు చూస్తే మిస్ హెన్రిటా చార్లోట్ అని ఉంది.ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ హాస్పిటల్స్,మద్రాస్ అని ఉంది.మరి ఇక్కడ ఎందుకు సమాధి చేయబడిందో..!

దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే చాలా సమాధులు ఘోరంగా తవ్వబడి ఉన్నాయి.లోపల నిధులు లాంటివి ఉంటాయనేమో పిచ్చి పిచ్చి గా తవ్వి పడేశారు కొంతమంది పనికిమాలిన వెధవలు.లేదా ఒక కాలక్షేపం కోసమైన ధ్వంసం చేసే మనుషులున్న దేశం మనది.ఏమీ ప్రయోజనం ఉండనక్కరలేదు.అదో సరదా..అంతే..!తను ఇలాంటి సంఘటనల్ని ఎన్నైనా చెప్పగలడు.

" హలో.." వెనుక నుంచి ఓ స్వరం.

వొళ్ళు ఝల్లుమంది.వెనక్కి తిరిగి చూస్తే రావు గారు.ఎంతైనా తాను ఉన్నది స్మశానం లో గదా..!

"రండి..రండి..మీ గురించే అనుకుంటున్నా"

" ఏమిటి..వీటిలో లీనమై పోయినట్లున్నారే.."

" అవును ..ఆ కాలం లోకి వెళ్ళిపోయా.."
" నాకు ఇరవై ఏళ్ళు వచ్చేదాక ఇక్కడే ఉన్నా.అప్పట్లో ఈ పరిసరాలన్నీ కోలాహలం గా ఉండేవి.." చెప్పారు రావు గారు.

"ఆ వైభవమంతా ఏమైనట్లు.."

" అదే నాకూ అనిపిస్తుంది..కాలం చిత్రమైనది.నగరం వెలసిన చోటు దిబ్బ అవుతుంది.ఒకనాటి దిబ్బ అవసరాన్ని బట్టి నగరం అవుతుంది"

" అంత పెద్ద గా ఉండేదా"

" చెప్పుకోదగ్గ ఊరే...భద్రాచలం కంటే ఈ ప్రాంతం జనాల తో కళ కళ లాడుతూ ఉండేది.పైగా జలరవాణా కి ప్రాధాన్యత వల్ల ఇక్కడ కొన్ని బ్రిటీష్ కుటుంబాలు ఉండేవి.ఈ పక్కనే దుమ్ముగూడేం దగ్గర గోదావరి నది మీద ఆనకట్ట కట్టారు.కొంత మంది తెల్లవాళ్ళతో నాకు పరిచయం ఉంది."

"ఆ విశేషాలు కొన్ని చెప్పండి.."

"నాకూ చెప్పాలనే ఉంది.మళ్ళీ మీలాంటి శ్రోత నాకు దొరకకపోవచ్చు.భద్రాచలం పరిసర ప్రాంతాల లోని గిరిజన  పల్లెల్లో సాధ్యమైనన్ని  యెయిడెడ్ పాఠశాలల్నిపెట్టడం వల్ల విద్య ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది.అవతల వర్క్ షాప్ ప్రాంతం లో పీడిత వర్గాలకి చెందిన బాల బాలికలకి హాస్టల్స్ నడిపేవారు.ఇంకా వారికి లేసులు అల్లకం లో ,కార్పెంట్రి లో శిక్షణ ఇచ్చేవారు.ఎనిమిదవ తరగతి దాకా చదివిన వారిని టీచర్ ట్రైనింగ్ కి పంపి ఉద్యోగాలు ఇప్పించేవారు...సారా క్లెయిర్ ,డొరోతి అమ్మగార్లు ఇక్కడ ఇంచార్జ్ లు గా ఉండేవారు" చెప్పారు రావు గారు.

"కాని బ్రిటీష్ వారు మనల్ని దోచుకున్నది నిజం కాదా .." ప్రశ్నించాడు తను.

" అభివృద్ది చెందిన జాతి ,చెందని ప్రాంతానికి వెళ్ళి సంపద ని ఆర్జించడం లోక స్వభావం లోనే ఉంది.ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నదదే...రూపాలు వేరు కావచ్చు.కాసేపు చరిత్ర పుస్తకాల్లో చదివినది అవతల ఉంచండి.బ్రిటీష్ వాళ్ళు చేసినదంతా రైట్ అని అనను.అయితే ఒకటి మాత్రం నిజం...మనం పైకి ఎన్ని చెప్పినా ...ఈ దేశం లోని అధో జగత్తు వర్గాలకి విద్య అనే ద్వారం తెరిచింది బ్రిటీష్ వారు మాత్రమే..అంటే కాదనగలమా!వాళ్ళు ప్రారంభించిన కొన్ని పనులు మన అభివృద్ధిని వేగిరపరిచాయి.అనేక మూఢనమ్మకాల తో కునారిల్లే సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన రాజారాం మోహన్ రాయ్,వీరేశలింగం పంతులు,ఫూలే ఇంకా ఇలాంటి వారికి చేయూతనిచ్చారు.ఈ రోజున ఇంగ్లీష్ అనే కిటికీ ద్వారా ఎంత ప్రపంచాన్ని చూస్తున్నాం..ఎన్ని దేశాలలో కి పరుగులు తీస్తున్నాం..?"

" చైనా ,జపాన్ లాంటి దేశాలు ఇంగ్లీష్ కాకుండా వారి మాతృ భాషల తోనే అభివృద్ది చెందలేదా" వాదించాడు తను.

" వాటి ఆత్మ వేరు.మన దగ్గర ఉన్నన్ని వందల ఉపకులాలు,భాషలు అక్కడలేవు.అవసరమైనప్పుడు ఐక్యం గా పోరాడే జాతీయ సమైక్యత అక్కడి సంస్కృతి లో ఇమిడి ఉంది.ఏరోజునా చైనా గాని జపాన్ గాని యూరోపియన్ల చేత రాజకీయం గా పరిపాలింపబడలేదు ..దాని కారణం అదే..!కాని మనం.. దేశం అనే భావన ఎక్కడుంది..? కుల ప్రయోజనాలు,ప్రాంత ప్రయోజనాలు ఆ తర్వాతనే ఏదైనా..!" రావు గారి లోక జ్ఞానం ఎంత లోతైనదో అర్ధం అవుతోంది.

"మరోలా అనుకోకపోతే ఓ సందేహం...మీరు ఇంత మారుమూల ప్రదేశం లో ఎందుకున్నారు రిటైర్ అయిన తరువాత"

" నేను రిటైర్ అయ్యే ఇరవై ఏళ్ళు దాటింది...ఎక్కడ మనసు ఉంటే అక్కడ నివసించాలి.అన్నీ అవే వస్తాయి.మనం బద్ధకించనపుడు.మనకి ఇష్టమైనపుడు.."

"మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు.నాకు ఇంత గా సహకరించినందుకు.."

" ఆ ..దానిదేముందిలెండి...!మరి ఈ ఆర్టికల్ కి ఏమి పేరు పెడతారు..?"

"ఒక స్మశానం -కొన్ని స్మృతులు "

"బావుంది.." నవ్వుతూ అభినందించారు రావు గారు. (సమాప్తం)  

Tuesday, April 24, 2018

ఆ రోజు (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఆ రోజు  (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఇది నిజమేనా...! ఊహా గానమా..! లేదా ఇంకేమైనా ఉందా ఆ వార్త వెనుక...?ఏమైనా కానీ..!ఆ వార్త చదివిన తర్వాత కాసేపు ఒళ్ళు జలదరించిన మాట మాత్రం వాస్తవం.ఎన్ని రకాలుగా సర్ది చెప్పుకున్నా అది నిజం.ఇంతకీ ఏమిటది ..అంటున్నారా..అక్కడకే వస్తున్నా..!రెండు రోజుల క్రితం "ఒరిస్సా పోస్ట్" ఇంగ్లీష్ డైలీ ని నా లాప్ టాప్ లో చదువుతుండగా ఒక విచిత్రమైన వార్త తారసపడింది.అయినా ఆ దిన పత్రిక తో నీకేం పని..అనవద్దు.ఒరిస్సా గురించిన రోజువారి వార్తలు,ఇంకా సాంస్కృతిక, సాహిత్య,సామాజిక పరిణామాలు దానిద్వారా తెలుసుకుంటూ ఉంటాను.అది అనే కాదు వివిధ రాష్ట్రాల్లో నుంచి వెలువడే రకరకాల న్యూస్ పోర్టల్స్ ని ఆన్ లైన్ లో చదవడం నాకు ఓ హాబీ.ముఖ్యంగా ఆంగ్లంలో మరీ సులువు.తధాగత శతపథి సంపాదకుడు గా వెలువడే ఈ ఒరిస్సా పోస్ట్ ఇంగ్లీష్ డైలి యొక్క శైలి కూడా నాకు నచ్చుతుంది.

సరే..ఇంకా ముందుకి వస్తాను.ఆ రోజు నేను చదివిన విచిత్ర వార్త ఏమిటంటే అది ఆత్మల గురించిన విషయం.అవును మీరు సరిగానే చదివారు. భువనేశ్వర్ లోని రైల్వే స్టేషన్ నుంచి జన్ పథ్ మార్గ్ లోని బిగ్ బజార్ వరకు ఉన్న మార్గం అంతా "ఆత్మల" కి ఆలవాలమైన ప్రదేశమని ...ముఖ్యంగా అర్ధరాత్రిళ్ళు వేళ ..కొంతమందికి కొన్ని అనుభవాలు కలిగాయని ..అదీ ఆ వార్త సారాంశం.ఇంతకీ ఇదెవరు చెప్పారని అనుకుంటున్నారు ...?ఆ భువనేశ్వర్ లోనే ఉన్న ఇండియన్ పేరా నార్మల్ సొసైటి వాళ్ళు.అతీంద్రియ శక్తుల మీద పరిశోధన చేసే ఓ సభ్యుల బృందం అది.

మరయితే దానికీ నీకు లంకె ఏమిటి అని నన్ను అడగవచ్చు.ఉంది.ఒక నెల క్రితం నేను భువనేశ్వర్ వెళ్ళి ఉండకపోతే ...ఆ  రోడ్డు మీదుగా నడిచి ఉండకపోతే ..సవాలక్ష వార్తల్లో ఇది ఒకటిగా చదివి మర్చిపోయే వాణ్ణి..!

*  *  *  *   *

ఆ రోజు నాకు బాగా గుర్తు.నాకున్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే ఒక ప్రణాళిక వేసుకొని నేను ప్రయాణాలు చేయను.మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు కూడా.దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతుంటాను.అయినా వాటిని వెంటనే మర్చిపోతుంటాను.ప్రయాణం ఇచ్చే అనుభూతి ముందు అవెంతా..?ఓ బ్లాగర్ మిత్రుణ్ణి కలవడానికి ఇంకా భువనేశ్వర్ ని మళ్ళీ ఓసారి దర్శించడానికి బయలుదేరాను.ఆన్ లైన్ లో చెక్ చేస్తే సమీప రైల్వే స్టేషన్ నుంచి టికెట్ దొరికే పరిస్థితి లేదు.వెంటనే విశాఖ బస్ ఎక్కేశాను.అక్కడ దిగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ని అందుకున్నాను.మధ్యానం రెండున్నర దాటింది.మాస్టర్ కేంటిన్ ఏరియా లోని రైల్వెయ్ స్టేషన్ లో దిగేసరికి.భువనేశ్వర్ లోని విశేషం ఏమిటంటే పచ్చదనం బాగా ఉండటం వల్ల నో ఏమో పెద్ద వేడి గా అనిపించలేదు.రైల్వెయ్ స్టేషన్ ముందు నుంచి అశోక్ నగర్ మెయిన్ రోడ్ మీదకి పోవడానికి రెండు దారులు ఉన్నాయి.మళ్ళీ అవి పోయి జన్ పథ్ మార్గ్ కి కలుస్తాయి .అక్కడ ఒక చౌరస్తా.నేను ఎడమ వేపున బస్ స్టాప్ ముందు నుంచి దారి తీశాను.గతం లో నేను దిగిన హోటల్ కి అది దగ్గర మార్గం.మళ్ళీ ఎడమ వేపు ఉన్న గల్లీ లోకి తిరిగాను.దాన్ని ఝన్ ఝన్ వాలా అని పిలుస్తారు.అక్కడ వరసాగ్గా ఉన్న హోటళ్ళ లో రెండవదే అమృత హోటల్.

గతం లో రెండేళ్ళ క్రితం వచ్చినపుడు అప్పుడప్పుడే నిర్మాణం పూర్తయిన దశ లో ఉంది.ఒక కొత్త వాసన.ఇప్పుడు కొద్దిగా పాతబడింది ..అయినా శుభ్రత కి వచ్చిన లోటు ఏమీ లేదు.ముందర పూల మొక్కలు ఆహ్లాదకరం గా ఉన్నాయి.అప్పుడు రెసెప్షన్ లో గణేశ్ మిశ్రా అనే యువకుడు ఉండేవాడు.అతని స్థానం లో ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తి.హోటల్ రేట్లు అప్పటికీ ఇప్పటికీ పెద్ద గా పెరగలేదు అనిపించింది.సింగిల్ రూం నీట్ గా ఉంది.మల్లె పూవు లాంటి బెడ్,ఒక కుర్చి,ఒక టీ పాయ్ ,కప్ బోర్డ్ ..అంతా హాయి గా ఉంది.రిసెప్షన్ కౌంటర్ ఎదురు గా ఇంతలేసి కళ్ళ తో పూరీ జగన్నాధుని చిత్ర పటం.తన సోదరీ సోదరుని తో..!

సాయంత్రం కాగానే తలారా స్నానం కానిచ్చాను.ప్రయాణం వల్ల కలిగిన నిద్ర మత్తు వదిలిపోయింది. హోటల్ నుంచి బయటబడ్డాను.ఆ ఝన్ ఝన్ వాలా నుంచి తిన్నగా నడుచుకుంటూ వచ్చి ప్రధాన రహదారి మీద కి వచ్చాను.కనుచూపు మేర వరకు నగరం దేదీప్యమానం గా వెలిగిపోతోంది.ఇంకా ముందుకు సాగుతూ పండా మార్ట్ దాకా వచ్చి వీధి తిండి ఏదైనా ప్రయత్నించుదాం అనుకున్నాను.
దహి వడ-ఆలూ దం ని రుచి చూశాను.ఫరవాలేదు అనిపించింది.అక్కడే ఉన్న ఓ హోర్డింగ్ లో పరిశీలనగా చూస్తే తోశాలి ప్రాంగణం లో హేండి క్రాఫ్ట్స్ కి సంబందించిన ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లు గా రాసి ఉంది.అంత కన్నా ముందు అదే చోట జరుగుతున్న  సత్యజీత్ జెనా యొక్క మ్యూజికల్ ప్రోగ్రాం నన్ను ఆకర్షించింది.సరెగమ లిటిల్ చాంప్స్ లో తను మంచి ప్రతిభని కనబరిచిన బాల గాయకుడు.కియోంజర్ జిల్లా కి చెందిన అతను ఆ ఒక్క ప్రొగ్రాం తో ఎంతోమందిని ఆకర్షించాడు.
అది రాత్రి ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుందని ఉంది.ఇక ఆలశ్యం ఎందుకని బారా ముండా వెళ్ళే బస్ ఎక్కాను.చేరుకునేసరికి అక్కడ అంతా కోలాహలం గా ఉంది.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ ఉన్నాయి.తెలుగు వారి స్టాల్స్ ఉన్నాయా అని చూశాను.ఉన్నాయి.అదేమిటో గాని మనాళ్ళు గదా అని పరాయి రాష్ట్రం లో పలకరించామో మనల్ని ఇంకా చులకన గా చూసి చెప్పిన దానికి ఒక్క పైసా తగ్గించరు.కొన్ని గతానుభవాలు అలా ఉన్నాయిలెండి.

భువనేశ్వర్ ఈ రాష్ట్రానికి రాజధాని అయితే ,కటక్ సాంస్కృతిక రాజధాని గా భావిస్తారు.ప్రాచీనమైనవీ,ఆధునికమైనవీ అన్నీ కలిపి  ఒక నగరం లో కొన్ని వందల గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది ఈ భువనేశ్వర్ లోనే.ఒక ప్లాన్ ప్రకారం ఏర్పడిన నగరాల్లో ఇది ఒకటి.విపరీతమైన నగరపు  వత్తిడి అనేది ఎక్కడా ఫీలవ్వము.అంతా చూసుకొని హోటల్ కి బయలు దేరాను.అప్పటికి రాత్రి పది అయింది.ప్రధాన వీధుల్లో తప్పా మిగతా చోట్లా పెద్ద గా జనాలు కనిపించడం లేదు.ఝున్ ఝున్ వాలా కి దారి తీసే మొదట్లో నే ఆటో దిగాను.దాని పక్కనే యూకో బ్యాంక్ శాఖ.ఇంకో పక్క సగం కూలిన అపార్ట్మెంట్ ..ఏమిటో ఒక ప్రేత కళ గోచరించింది ఆ పరిసరాల్లో..!

  ఎక్కడో ఒక కుక్క దూరంగా మొరుగుతున్న శబ్దం...!ఆ యూకో బ్యాంక్ పక్కనున్న చిన్న వీధి నుంచి ముందుకు సాగుతున్నాను.జనాలు బయట ఎవరూ కనబడటం లేదు.మా హోటల్ లోకి వచ్చి రిసెప్షన్ లో తాళాలు తీసుకుని రూం తెరిచి బెడ్ మీద వాలిపోయాను.కాసేపు రెస్ట్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళి ఫ్రెష్ అయి నిద్ర పట్టక టి.వి. ని ఆన్ చేశాను.దామోదర్ రౌత్ అనే మినిస్టర్ ని అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదవి నుంచి తొలగించారు.ఓ టివి,కళింగ టివి,ఈ టివి ఒడియా ఇలా ప్రాంతీయ చానెళ్ళు అన్నిట్లో అదే చర్చ,వార్తలూనూ.బ్రాహ్మల మీద ఆయన తీవ్ర విమర్శలు చేసిన దరిమిల ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందట.దాని మీద రెండు వర్గాలు గా చీలి రగడ జరుగుతోంది..!

ఒరియా సమాజం మౌలికం గా ఉత్తరాది కే దగ్గరగా ఉంటుంది,దక్షిణ జిల్లాల్లో కొంత తెలుగు వారి ప్రాధాన్యత ఉన్నప్పటికీ..!అక్కడ రాజకీయ ,వ్యాపార,సామాజిక ఇంకా అన్ని రంగాలన్నిటిలోను పై భాగం లో ఉండేది పట్నాయక్ లు అనబడే  కరణాలు ఇంకా బ్రాహ్మణులు.ఆటో రిక్షా నడిపే వారి దగ్గర నుండి ముఖ్యమంత్రి పీఠం దాకా వీరు తారసపడటం మనం చూడవచ్చు.ఇదొక రకమైన సామాజిక చిత్రపటం.

అలా చానెళ్ళు తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడు వొచ్చిందో నిద్ర వచ్చేసింది.ఓ గంట పాటు సోయి లేనట్లు గా నిద్రపోయాను.ఎందుకో కళ్ళు తెరిచి చూస్తే టి.వి. వాగుతూనే ఉంది.లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.ఓపిక తెచ్చుకొని లేచి బట్టలు విప్పేసి లుంగి కట్టుకున్నాను.టి.వి.ని ఆఫ్ చేశాను.జీరో బల్బ్ ఆన్ చేసి మిగతా లైట్లు ఆఫ్ చేశాను.మళ్ళీ బెడ్ మీద ఒరగడం తో జీవుడు నిద్ర లోకి జారుకుంటున్నాడు.ప్రాణం హాయి గా ఏ లోకాలకో చేరుకుంటోంది ..విశ్రాంతి లో..!ఇహ కాసేపు అలాగే గాఢ నిద్ర లోకి జారుకుంటే మళ్ళీ తెల్లవారు జామునే తెలివి వచ్చెదేమో..!

ఒక వైపు ఒత్తిగిల్లి పడుకున్నాను గదా..!ఉన్నట్లుండి ఎవరో తన వెనుక భాగాన్ని నాకు ఆనించి కూచున్నట్లుగా అనుభూతి కలిగింది. నా లోపల జీవుడు ఎలర్ట్ అయ్యాడు..ఎవరది అని ప్రశ్నిస్తూ..! కళ్ళు తెరవాలని ప్రయత్నించాను.ఎవరో ఫెవికోల్ తో నా రెప్పల్ని అలా అంటించేసినట్లు అవి తెరుచుకోవడం లేదు.మళ్ళీ ప్రయత్నించాను.అబ్బే లాభం లేదు.ఏమయింది నాకు...!ఎవరది 'అని అడుగుదామని నోరు మెదపబోయాను.ఈ పెదాలు తెరుచుకోవడం లేదు.ఈ అవయవాలు అన్నిటిని నేనేగా నియంత్రించవలసింది..? మరి నా మాట వినడం లేదేమిటి ఇవి..?  
అశక్తుడనై అలాగే పడుకుని నిశితం గా గమనిస్తున్నాను..!జరుగుతున్న దాన్ని కళ్ళు తెరవకుండానే..!కొన్ని సెకండ్లు గడిచిన తర్వాత నా కటి ప్రదేశం పై ఎవరో చేతి తో తడుముతున్న అనుభూతి కలుగుతోంది.వెన్ను లో చలి పుట్టడం అంటే ఏమిటో మొదటిసారి గా అర్ధమయింది.వెంటనే నా ఆధ్యాత్మిక గురువులు గుర్తుకు వచ్చి మనసు లోనే  ప్రార్దించాను. ఈ సంకటం నుంచి దాటించమని.నా గది చుట్టూరా మీ రక్షణ వలయాన్ని ఏర్పరచండి అని..!అలా పది నిమిషాలు గడిచాయి.వాన వెలిసి పొయినట్లుగా అయింది.ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి,పెదాలూ  తెరుచుకున్నాయి..ఇప్పుడు ఒక కొత్త మనిషిని అయినట్లయింది.మెల్లిగా లేచి బెడ్ చివరనే కూర్చున్నాను.కాసిన్ని నీళ్ళు తాగి ట్యూబ్ లైట్ వేసుకున్నాను.బాత్ రూం కి వెళ్ళి వచ్చి నిద్రకి ఉపక్రమించాను.లేచేసరికి తెల్లవారింది.ఇక ఎలాటి అసుర శక్తులు దరి జేరినా ఇక భయపడను.ఆ తర్వాత మరో మూడు రోజులు అదే రూం లో ఉన్నాను.మళ్ళీ ఆ సంఘటన పునరావృతమవుతుందా అని చూశాను గాని ఎందుకనో అలా జరగలేదు...!దానికి కారణం ఏమిటి అంటే ఏదో ఒకటి మీకు నేను చెప్పగలను.కాని అదేదీ సరైనది కాదు అని నాకు తెలుసు .

నేను తిరుగుప్రయాణం చేసే రోజు అది..!చెక్ అవుట్ చేసేటప్పుడు అడిగాను రిసెప్షన్ లో ఉన్నతన్ని" ఈ మధ్య కాలం లో ఎవరైనా మీ హోటల్ చుట్టుపక్కలా సూసైడ్ చేసుకొని చనిపోయారా " అని..!ఆ హోటల్ లో జరిగిందా అంటే బాగోదు గదా..!

" లేదు..లేదు..అలాంటిది ఏమీ లేదు" అన్నాడతను,నిర్ఘాంతపోతూ..!

"ధన్యబాద్" అని చెప్పి నా లగేజ్ తీసుకొని బయటకి నడిచాను.గేటు దగ్గర ఉన్న చౌకీదార్ నన్ను చూసి ఒద్దికగా సేల్యూట్ చేశాడు.
ఓ పది నోటు తీసి అతని చేతి లో పెట్టాను.తలవని తలంపు గా వెనక్కి తిరిగి చూస్తే రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి అక్కడి నుంచే నా వేపు తదేకం గా చూస్తున్నాడు.ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా తను..!తెలియదు..!ఇంకో పావు గంట లో నా రైలు పట్టుకోవాలి ,నాకిప్పుడు టైం కూడా లేదు ,పిలిచినా వెనక్కి వెళ్ళడానికి..! (సమాప్తం)    

Thursday, March 29, 2018

దంతెవాడ (కధ) --మూర్తి కె.వి.వి.ఎస్.

దంతెవాడ (కధ)
 --మూర్తి కె.వి.వి.ఎస్.

కుంటకి చేరుకునేసరికి రమారమి ఉదయం పది అయింది.బస్ ఊరి పొలిమేరలోనే ఆగింది...బస్ స్టాండ్ లో కాకుండా!చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన బస్సులు మాత్రమే ఆ స్టాండ్ దాకా అనుమతింప బడతాయిట.ఆ తర్వాత తెలిసింది.భద్రాచలం నుంచి కుంట సుమారు గా అరవై అయిదు కిలో మీటర్లు ఉంటుంది.ఆ ఊరు ఉండేది చత్తీస్ ఘడ్ లో అయినా తెలుగువాళ్ళు ఎక్కువ కావడం మూలాన వాళ్ళు ఇక్కడ భద్రాచలం డివిజన్ ప్రాంతం తో అవినాభావ సంబంధం కలిగిఉండేవారు.వ్యాపారాలకో ,ఉద్యోగాలకో ,వ్యవసాయానికో అక్కడికి వెళ్ళిన తెలుగు కుటుంబాల పిల్లలు ఇక్కడకి వచ్చినప్పుడల్లా అక్కడి విశేషాలు తెలుస్తుండేవి. అయితే ఇప్పుడంతా పరిస్థితులు మారిపోయినవి.దుమ్ముగూడెం,చర్ల ,వెంకటాపురం ఇలా డివిజన్ లోని ఏ మండలం నుంచి అడ్డంగా పడిపోయినా కొంతసేపటికి చత్తీస్ ఘడ్ లోని ఏదో ఊరికి చేరుకుంటాము.

బస్ దిగి అలా ఊళ్ళోకి మెల్ల గా నడవసాగాడు శ్రీను.కుంట మరీ గ్రామం కాదు,అలా అని పెద్ద పట్టణమూ కాదు.చాలా రాష్ట్రాల్లో మాదిరిగా ఇంకా అడవుల విధ్వంసం మొదలవలేదు ఇక్కడ. అందుకనే కాబోలు నలువేపులనుంచి చల్లని స్పర్శతో కూడిన గాలులు హాయిగా శరీరాన్ని తాకుతున్నాయి.వీధులు శుభ్రంగా ఉన్నాయి.ఇరువేపులా ఎలాంటి మానవ విసర్జితాలూ లేకుండా...! ఒక ప్రదేశం లోని సభ్యతా సంస్కారాలు ఇలాంటి చిన్న విషయాల్లోనే వెల్లడవుతుంటాయి.ఎర్రని నేల.ఊరినిండా పచ్చదనం.కాంక్రీట్ రోడ్ కి అటూ ఇటూ దుఖాణాలు.డాబాలు ఉన్నాయి.పెంకిటిళ్ళూ ఉన్నాయి.కొన్ని రెండు మూడూ అంతస్థుల ఇళ్ళు...అలా ఆ రోడ్డు గుండా తిన్నగా వెళ్ళి ఎడమ వేపు తిరగ్గా అక్కడ బస్ స్టాండ్ కనిపించింది. దానికి ఒక పక్కగా ఒక చిన్న ఇడ్లీ బండి కనిపించింది.

" ఏక్ చాయ్ లావ్ భాయ్" అన్నాడు శ్రీను.

ఒక గ్లాస్ లో నిండుగా పోసి ఇచ్చాడు ఆ టీ బండి వాలా..!చాలా వేడిగా ఉంది.ఊదుకుంటూ మధ్య మద్య లో కొద్దిగా సమయం తీసుకుంటూ తాగుతున్నాడు శ్రీను..!

" తెలుగు వాళ్ళా" అడిగాడు ఆ బండి యజమాని.తాగే టీ లోపలకెళ్ళి పొలమారింది శ్రీనుకి.

" అవును ..ఏంటి మీకు తెలుగు వచ్చా " అన్నాడు.

" మెం తెలుగు వాళ్ళమేనండి ..వ్యాపారం మీద ఇటు వచ్చేశాం"

" అలాగా ..ఏ ఊరు మీది"

" అసలు మా పూర్వీకులది తూ గో జి జిల్లా రాజోలు అండి...భద్రాచలం లో బ్రిడ్జ్ కట్టే సమయం లో పనికోసం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.అక్కడి నుంచి క్రమేపి మేము ఇక్కడ హోటల్ పెట్టుకుందామని వచ్చాము.వచ్చి సుమారు గా ఏడేళ్ళు అవుతోంది " అన్నాడాయన.


"ఏం ..ఏడు సంవత్సరాలు! దాదాపు గా పది ఏళ్ళు దాటుతోంది " అంతలోనే అతని భార్య అందుకొని అన్నది.అలా అనేసి దగ్గర్లో ఉన్న బోరింగ్ దగ్గర కెళ్ళింది నీళ్ళ బిందె తీసుకురావడానికి.

" ఆ..ఆ..అవుద్దండి...అసలు సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయో  అర్ధం కావట్లేదు.యమ స్పీడ్ గా ఎల్లిపోతందండి కాలం" అన్నాడతను.

" ఫర్లేదా ..ఎలా ఉంది బిజినెస్..."

" మన వైపు వేసే దోసె అంటే చచ్చిపోతారండీ ఇటు"

" అయితే ఓకె అన్నమాట.అన్నట్టు రామ్మోహన్ అని ఒక మాస్టార్ ..ఇక్కడ ...ఏమైనా ఐడియా ఉందా మీకు " డబ్బులిస్తూ అడిగాడు శ్రీను.

" ఆ..గుర్జీ...అండి..!తెలియదు కాని ఇలా ముందు నుంచి వెళ్ళిపోయి ..ఆ మూలమలుపు దగ్గర ఇళ్ళలో ఎవరినైనా అడగండి ..గుర్జీ లు అక్కడ కొంతమంది ఉన్నట్లున్నారు "

గుర్జీ ..ఏంటబ్బా..? అనుకున్నాడు.అంతలోనే తట్టింది అది గురూజీ కి వచ్చిన తిప్పలని.  
మొత్తానికి రామ్మోహన్ ఇల్లు ఈజీగానే దొరికింది.ఒక చిన్న సంస్థానం లా ఉంది.ముందు బిజినెస్ కాంప్లెక్స్ లా కొన్ని పోర్షన్లు ఉన్నాయి.దాని పక్కనుంచి వెళితే ఆయన ఇల్లు ఉంది.మంచి గార్డెన్ ఉంది...దాని ముందు.విశాలంగా హాయి గా ఉంది ఆ నివాసం.లోనికి వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించాడు రామ్మోహన్.లోపల ఇల్లు అదీ చూస్తే మంచి టేస్టే ఉందీయనకి అనిపించింది.

కుశల ప్రశ్నలు అయినతర్వాత ఫ్రెష్ అయ్యాడు శ్రీను  .ఆ తర్వాత  అతని కాసేపు విశ్రాంతి తీసుకోమని ఓ రూం లోకి పంపాడు.అలసట గా ఉందేమో శరీరం ..పన్నెండు గంటలకి గాని మెలకువ వచ్చింది.హాల్లోకి వచ్చి కూర్చున్నాడు శ్రీను


" మీ గురించి మా బావ గారు ఫోన్ చేశారు" నవ్వుతూ చెప్పాడు రామ్మోహన్.కాదు నేనే చేయించాను అందాం అనుకొని ఆగిపోయాడుశ్రీను.
.లోపలకి వెళ్ళి భార్య కి వంట చేయమని పురమాయించి అతని కొడుకు ని తీసుకొచ్చి శ్రీను కి పరిచయం చేశాడు రామ్మోహన్.

" వీడు మా చిన్నాడు...ఇక్కడే టెంత్ చదువుతున్నాడు హిందీ మీడియం.అలాగే మాకు వ్యాపారం లో కూడా సహకరిస్తుంటాడు "

" అదేమిటి...మీరు మాస్టారు గదా ఇక్కడ"

" మా బావ గారు చెప్పాడా...కరక్టే.కాని ఇక్కడ బడిపంతుళ్ళకి అంత జీతాలేమీ ఉండవండి.నేను సిమెంట్ షాప్ చూసుకుంటాను.మా ఆవిడ కిరాణం షాప్ ..అంతా మా ఎదురు కాంప్లెక్స్ లోనే"

" మరి బడికి వెళ్ళకపోతే ఎలా... సమస్య కాదా "

" భలే వారే...అసలు వెళితేనే సమస్య"

" అదేమిటి.."

" నేను చేసేది కుంట బ్లాక్ లోని ఒక గ్రామంలో...అక్కడకి రోజు వెళితే అలా రావద్దని అనే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు."లోపల వాళ్ళ"  ప్రభావం ఎక్కువ లెండి.ఇంకో వైపు ఊళ్ళో వాళ్ళతో కొద్దిగా ఎక్కువ సాన్నిహిత్యం గా ఉన్నా పోలీస్ ల కన్ను ఉంటుంది.ఎందుకొచ్చిన తంటాలు మనకి...అవన్నీ అవసరమా..?అందుకే నెలకి ఒకటి రెండుసార్లు ఊర్లో పెద్దలకి కనబడి వచ్చేస్తుంటాను"

"ఓహో ఆ సమస్య ఉందా.. మరి మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు..చెప్పలేదు"

" చెన్నై లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు "

" ఎందుకు..ఇక్కడ దగ్గర్లో జగ్దల్ పూర్ లో ఆ కాలేజీలు లేవా"

" ఉన్నాయిలే గాని..బయట ప్రపంచం కూడా తెలియాలిగదా పిల్లలకి " ఎందుకనో అసలు కారణం అది కాదనిపించింది.రెట్టించదలచలేదు.

అంతలోనే వాళ్ళవిడ వచ్చి వంట సిద్ధమయినట్లు తెలిపింది.మాటల్లో పడి కాలాన్ని గమనించలేదు.ఒంటి గంట కావస్తున్నది.తను లేస్తూ శ్రీను వేపు తిరిగి అడిగాడు రామ్మోహన్ " అన్నట్లు శ్రీను గారు ..ఒక బీర్ ఏమైనా తీసుకుంటారా" అని.

" హ్మ్..ఎప్పుడైనా...రేర్ గా"

" పదండి" అంటూ ఇద్దరూ కలసి ఎదురు గా ఉన్న కాంప్లెక్స్ లో ఒక రూం లోకి వెళ్ళారు.లోపల నాలుగు కుర్చీలు ,ఓ టీపాయ్ ,ఒక బీరువా ఉంది.ఇలాంటి కార్యక్రమాలకి ఈ రూం ని కేటాయించుకున్నట్లు అర్ధమయింది.కూర్చున్న తర్వాత బీర్ ల మూతలు తీసి జాగ్రత్త గా ద్రవాన్ని రెండు గ్లాస్ ల్లో నింపాడు రామ్మోహన్. ఇద్దరూ చెరో బీర్ ని లేపిన తర్వాత,రామ్మోహన్ మెల్లిగా లేచి బీరువా తాళం తీసి దానిలో నుంచి ఒక పెద్ద వోడ్కా బాటిల్ తీశాడు. రెండు గ్లాస్ ల్లో సగం దాకా బీర్ ని పోసి మిగతా సగాన్ని వోడ్కా తో నింపాడు.శ్రీను కి కంగారు పుట్టింది.

" రామ్మోహన్ గారు...ఏమిటండీ అది.అసలే నా కెపాసిటి ఒక బీరున్నర ..అలాంటిది మీరు అలా కాక్ టైల్ చేసి పారేస్తే ఎలా.."

" అబ్బా..ఊరుకొండి గురూ గారు...మీరు మళ్ళీ మళ్ళీ కలుస్తారా ఏమిటి ..?తాగితే కొద్దిగా అయినా కిక్ ఎక్కాలిగదండి ..లేకపోతే ఎందుకు...తాగడం..! ఒమర్ ఖయ్యాం ఏమన్నాడో తెలుసా ..తాగడం తప్పు కాదు...తాగి తెలివి లో ఉండడం తప్పు అని..!"

సరే..కానీ..!ఒక్కోళ్ళకి ఒక్కో రోజు వస్తుంది.వాళ్ళేం చెప్పినా వినాలి తప్పదు..!మెల్లిగా ఆ ద్రవాన్ని ఆస్వాదించసాగారు.

" ఆ ..చెప్పండి శ్రీను గారు...ఎందుకు ఇటు వేపు ప్రయాణం పెట్టుకున్నారు " అడిగాడు రామ్మోహన్.

" మా నాన్న గారికి మోకాలు నొప్పులండి ..ఇక్కడ దంతెవాడ లో ఎవరో నాటు  మందు ఇస్తామంటేనూ బయలుదేరా ...మీ బావగారు నా క్లాస్ మేట్ లేండి...మాటల్లో చెప్పాడు మీరు ఇక్కడ కుంట లో ఉంటారని..వీలుంటే కలిసి వెళ్ళమని చెప్పాడు.."

" బస్ లు ఇక్కడనుంచి ఉంటాయిలే గాని...రోడ్ మాత్రం అద్వానం గా ఉంటుంది..అయిదారు గంటల ప్రయాణం ! ఓ పని చేయండి ఎదైనా వెహికిల్ ఎంగేజ్ చేసుకుంటే తొందర గా వెళ్ళచ్చు"

" నాకు మాత్రం పనేం ఉంది గనక..మెల్లగా బస్ లోనే వెడతా"

" సరే మీ ఇష్టం"

" రామ్మోహన్ గారు..ఎలా ఉంది ఇక్కడ పరాయి రాష్ట్రం లో జీవితం"

" ఇంకా ఏం పరాయి...మా చిన్నప్పుడే ఇక్కడకి వచ్చేశాం. మా నాన్నగారు ఆర్.ఎం.పి . వైద్యుని గా పనిచేసేవారు.అప్పుడు ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతం గా ఉండేది.ఒక పదేళ్ళ నుంచే బాగా డిస్టర్బ్ అయింది.ఈ కుంట లో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు.మిగతా అంతా నార్త్ నుంచి వచ్చిన మార్వాడీలు ఇంకా బెంగాలీ వాళ్ళు ఉంటారు.వ్యాపారం కూడా ఎక్కువ గా వీళ్ళ చేతి లోనే ఉంది"

" ఎందుకని అలజడి..ఇదంతా"

"రకరకాల వాళ్ళు రకరకాలు గా చెబుతారు.ఇక్కడ ఆదివాసీల్లో కొంతమంది మాత్రం  తెలుగు వాళ్ళు వచ్చి మా ప్రాంతమంతా కల్లోలం చేశారు అని ఆరోపిస్తుంటారు.."

" అది నిజమా"

" హ్మ్..పాక్షిక సత్యం"

" పేపర్ లో చత్తిస్ ఘడ్ గురించి వార్తలంటూ చదివితే...హింసాత్మక ఘటనల గురించే చదువుతుంటాం"

" అటువాళ్ళు ఇటు వాళ్ళ మధ్య లో పాపం అనేక గ్రామాలు మనుషులు లేకుండా ఖాళీ అయిపోయాయి.బతుకు తెరువు కోసం బోర్డర్ లో తెలుగు ప్రాంతాలకి వలస వస్తుంటారు..."

" అవును ఆ వార్తలు కూడా చదువుతుంటాము. అక్కడ కూడా నివాసం ఇంకా ఇతర సౌకర్యాల కోసం వాళ్ళ దిన దిన పోరాటం..మిర్చి పొలాల్లో నూ,భద్రా చలం లో బస్ స్టాండ్ కి దగ్గర్లోను ,పాల్వంచ ఇంకా ఆ పైనకి పనుల కోసం గుంపులు గుంపులు గా వెళుతూ కనిపిస్తుంటారు..ఇతరులు ఎవరి తోను వాళ్ళు మాటాడగా నేను చూడలేదు..వాళ్ళ పనేమిటో అంతే..అన్నట్లుగా ఉంటారు ..లౌక్యం అనేది ఒకటుంది అని వీరికి తెలుసా అని తోస్తుంది చూసినప్పుడల్లా  "

" ఈ అతివాదం వేపు ఎక్కువగా ఆకర్షింపబడింది మడియా ఆదివాసిలు.వీరితో పోలిస్తే ముడియా తెగ వారు అభివృద్దిపొందిన వారు గా చెప్పవచ్చు.ఒకప్పుడు సల్వా జుడుం లో ఎక్కువ గా వీరే ఉండే వారు.సరే..జరిగి పోయిన చరిత్ర అనుకొండి"

" నెల్లిపాక అవతల ఓ గ్రామం లో ఒక రైతు చెపుతుండగా విన్నాను.ఈ చత్తిస్ ఘడ్ నుంచి వచ్చిన  కూలీలే చక్కగా పనిచేస్తారండి ..ఎక్కువ మాట్లాడరు..ఒక్క మిరప కాయ కూడా కింద వదిలి పెట్టరు ..శుబ్రంగా మిర్చి కోసి వాళ్ళకి రావాల్సింది తీసుకొని వెళ్ళిపోతారు అని"

" నాగరికత కానీ మాయ తెలివితేటలు గాని ఎంత మనిషి లో అభివృద్ధి చెందుతుంటే అంత కమ్మ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఆయా సమాజల్లో పెరుగుతుంటాయి.అసలు ప్రేమ ఏదో నకిలీ ప్రేమ ఏదో కనిపెట్టలేనంత ఇది గా మనుషుల ప్రవర్తనలు రూపుదాల్చుతుంటాయి.ఇదొక రకమైన వార్.కనిపించని వార్.ఒకడిని మించి ఒకడు ఎదగాలని లేదా తనను తాను రక్షించుకోవాలని...ఒక ఎన్ జి వో వాళ్ళు అదే హెల్త్ కేర్ కి సంబందించి  పిలిస్తే వెళ్ళాను ఒకసారి ఎఫెక్ట్  అయిన గ్రామానికి...!అక్కడ జరిగిన సంఘటన లో నలుగురైదుగురు గ్రామస్తులు మృత్యు వాత బడ్డారు.దానిలో ఒక సంవత్సరం వయసున్న చిన్న పిల్ల కూడా ఉంది..."

" అరే..చాలా దారుణం గా అనిపిస్తోంది..ఆ తల్లిదండ్రులు ఎంత విలపించిఉంటారో " బాధ గా అన్నాడు శ్రీను.

" అక్కడకే వస్తున్నా.ఒక నిజం చెప్పనా...నువు నమ్మవు...ఆ చంటి పిల్ల యొక్క తల్లి అక్కడే కూర్చుని ఉంది.ఆమె కంటిలో చుక్క నీరు లేదు.ఎవరితోనూ తన బాధనీ చెప్పుకోవడం లేదు. ఆ పిల్ల శవం ముందే ఏ శబ్దమూ లేకుండా కూర్చుని ఉంది.బాధ లేదని అనడానికి లేదు.అయితే దాన్ని వ్యక్తపరిచి తోటి వారి నుంచి జాలిని పొందే విధానం ఆమె కి తెలియదు"  చెప్పుకుపోతున్నాడు రామ్మోహన్. లోపలకి వెళ్ళిన మందు అతనిలోని కొన్ని తెరలని చింపి వేసింది.

ఇంతలో మొబైల్ మోగింది.సరే ..పదమని భోజనం కి లేచాము. ఇవాళ దంతెవాడ కి ప్రయాణం కుదరని పని.విశ్రాంతి తీసుకొని రేపు బయలు దేరాలి.ఇలా తనలో శ్రీను అనుకుంటూ ఉండగానే రామ్మోహన్ లోకి ఆ వార్త ప్రసారం అయిందో ఏమో .." ఇవ్వాళ ఏం వెళతారు లే గాని రేపు బయలు దేరండి" అన్నాడు. -- మూర్తి కె.వి.వి.ఎస్.      

Saturday, March 24, 2018

"నీది నాది ఒకే కధ" సినిమా ఎలా ఉందంటే...


ఒక కొత్త భావన తో ముందు కి వెళ్ళాలనే తపన తో తీసిన సినిమా గా చెప్పవచ్చు.సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు నావి రాయాలనిపించింది.మొత్తం మీద చెప్పాలంటే ఈ మధ్య వచ్చే చాలా సినిమాల కంటే రియలిస్టిక్ అప్రోచ్ తో ఉన్నది..అది ఒప్పుకుతీరాలి.హీరో ఇల్లు గాని పరిసరాలు గాని మిగతా పాత్రల హావభావాలు గాని నేల విడిచి కాకుండా సహజత్వానికి దగ్గర గా ఉన్నాయి.

కధ ఈనాటి మన సమాజం లోని విషయాల్ని ఎత్తి చూపింది.చర్చించింది.ప్రతి చోట కనిపించే సన్నివేశాలే సాధ్యమైనంత వినోదాత్మకం గా తెర పైకి ఎక్కించారు. అసలు పిల్లలు సెటిల్ అవడం అంటే ఏమిటి..దానిలో పేరేంట్స్ పోషించే పాత్ర ఏమిటి.. ఫాల్స్ ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపొయి ఫలానా జాబ్ చేస్తేనే గొప్ప లేదా ఆ పిల్లలు చెత్త అనుకునే తత్వం దాని పర్యావసానాలు ..ఇవన్నిటిని బేస్ చేసుకొని కధ అల్లుకున్నారు.

అన్నిటి కన్నా ముందు తను చేసే పని తనకి ఆనందం ఇవ్వాలి.అదీ మొత్తం మీద చెప్పింది.దాని తర్వాతనే ఆదాయమూ ,ప్రిస్టేజ్ ఇంకా అదీ ఇదీను ..! డాక్టర్లు,సాఫ్ట్ వేర్ నిపుణులు ఇంకా ఇలాంటి హై ప్రొ ఫైల్ వృత్తులు తప్ప మిగతావేవి గౌరవ నీయమైనవీ కావా.. వారు ఆనందం గా బ్రతకడం లేదా ..ఇలాంటి అంశాల్ని లేవనెత్తింది ఈ సినిమా..!

అసలు ఈ గొర్రె దాటుడు మనస్తత్వం తెలుగు వాళ్ళ లో ఉన్నట్లుగా ఎవరిలో ను కనిపించదు.దానికి కారణం ఇదే, కొన్ని పనులు మాత్రమే గొప్పవనీ ఇంకొన్ని కానివని ఒక మూఢ నమ్మకం.న్యూజి లాండ్ లో ప్లంబర్ కి ఉన్న గిరాకీ మరెవరకీ ఉండదు.చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయులకి ఉన్న విలువ మన దేశం లో కలెక్టర్ కన్నా ఏ మాత్రం తక్కువ కాదు.అంతదాకా ఎందుకు...మృదంగం,వీణ,వేణువు ఇంకా ఎన్నో సంగీత వాయిద్యాలు వాయించే కళాకారులకు,లలిత కళలకు  తమిళనాడు కేరళ వంటి  రాష్ట్రాలలో ఇచ్చే విలువ మనము ఇవ్వము.ఏమిటి దానివల్ల వచ్చే సంపాదన..ఇదే మన ఆలోచన.ఒక స్థాయి దాటిన తర్వాత అవీ ఆదాయాన్ని ఇస్తాయి.కీర్తి నీ ఇస్తాయి.కాని ఏమాత్రం పేరేంట్స్ ధైర్యం చేయరు..ఎందుకు...అదే సెటిల్ మెంట్ ప్రాబ్లం..!

మారుతున్న కాలాన్ని బట్టి ప్రాధాన్యాలు మారాలి.మారతాయి.తప్పదు.అందుకని సెంటిమెంట్ కోణం లో చూసి ఒకరిని అనుకోవడం వ్యర్ధం.ఒకప్పటి మన జీవితాలు వేరు.ఇప్పుడు వేరు.దానికి తగ్గట్లు జీవన శైలి మారాలి.ఒకరిని పోషించవలసిన అవసరం లేనప్పుడు మనిషి తన ఆనందం కోసం తాను ఏదైనా చేయవచ్చు.ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి జీవితం వారు నిర్మించుకోవాలి అనే ఆలోచన సమాజం లో రానంతవరకు ఇలాంటి రాపిడులు తప్పవు.మనం పాశ్చాత్య సమాజాల్ని వారి పై పైని అలవాట్లని అనుకరిస్తాం గాని వ్యక్తి నిర్మాణం లో వారు అనుసరించే పద్ధతుల్ని అమానవీయం అంటూ తీసిపారేస్తాము.

సరే..సినిమా కి వద్దాము.మొదటి సగం అంతా ఎక్కువ గా హీరో తెంపరి తనం లాంటి,అతి తెలివి లాంటి శైలి లో ఉంటాడు.అదేమిటో గాని మన తెలుగు సినిమాల్లో హీరో ప్రవర్తన చాలా వల్గర్ గా  వంకర గా అడ్డ దిడ్డం  గా  చూపెట్టి ఇలా ఉంటేనే  యూత్ అని కంఫర్మ్ చేయడం ఒక ఫేషన్ గా తయారయింది.ఇది మారవలసిన అవసరం ఉంది.పర్సనాలిటీ డెవెలప్మెంట్ పేరు తో వచ్చే పుస్తకాల్లోని డొల్లని ఈ సినిమాల్లో తూర్పార బట్టారు.ఎన్ ఎల్ పి ట్రైనర్స్ ని కూడా ..పోసాని పాత్ర ద్వారా..!ఇలాంటివి ముందు విదేశాల్లో ఎప్పుడో వచ్చినవే ..మనకా ట్రెండ్ కాస్త లేట్ గా ప్రారంభమయింది.మనం ఎవరినుంచైతే ఈ పనుల్ని కాపీ కొట్టామో వారి రంగ భూమి వాళ్ళ ఒక్క దేశమే కాదు ఈ ప్రపంచం అంతా.అక్కడే వచ్చింది గేప్ అంతా అన్వయించుకోవడం లో.

పోసాని వెనుక స్వామి వివేకానంద పెద్ద బొమ్మ ని చూపెట్టడం ఏమిటో...అర్ధం కాలేదు.ఆయన బోధనల్లో సందార్భానుసారం గా వచ్చే కొన్ని గొప్ప ప్రభోదాత్మక వాక్యాలు వాడుకోవడం అనేది మన సమాజం లో ఉన్నదనా..నిజానికి వాటి యొక్క పొడిగింపు చాలా దీర్ఘం గా ఉంటుంది.వాటి ఉద్దేశ్యం మౌలికం గా వేరు ..అది పొడి పొడి గా ఆయన కొటేషన్లు చదివే వాళ్ళకి అంతరార్ధం బోధపడదు.అందులోను మనకి అనువైనవే తీసుకుంటామాయే.

హీరో చెల్లె పాత్ర డబ్బింగ్ కృతకంగా ఉంది.తండ్రి పాత్రధారి సహజం గా ఉన్నాడు.ఆ మధ్య వచ్చిన ధనుష్ సినిమా లోని తండ్రి పాత్ర జ్ఞప్తికి వచ్చింది.హీరోయిన్ పాత్ర ఓకె.ఎందుకో ఆమె చెప్పే వెర్షన్ కన్విన్సింగ్ గా అనిపించలేదు.ఇలాంటి లోతైన సినిమా కి డైలాగ్స్ ఇంకా చక్కగా రాయవచ్చునేమో అనిపించింది.మొత్తం మీద వివిధ వృత్తుల వారిని సమీకరించి తండ్రి వద్ద వారి తో చెప్పించే సీను...ఇలాంటివి ఇంకొన్ని బాగా పండాయి.మొదటి అటెంప్ట్ లోనే ఒక నూతన ఒరవడిని చూపెట్టగలిగినందుకు దర్శకుడిని సంగీత దర్శకుడిని ఇలా ఈ టీం అంతటిని అభినందించవలసిందే. Murthy Kvvs   

Sunday, January 28, 2018

"వనవాసి" అనే అనువాద నవల గురించి...ఆలశ్యమే కాని చదవ గలిగాను.ఎంత గాఢమైన ముద్ర మనసు మీద.ఒక గొప్ప నవల చదివిన అనుభూతి,ఎన్నో జీవితాల లోకి..ఎన్నో మనం ఊహించలేని ప్రదేశాల లోకి ,అరణ్యం యొక్క నిజ హృదయం లోకి ప్రవేశించిన అనుభూతి.ఎప్పుడో 1930 ల లో రాయబడినది.అప్పటి బతుకు చిత్రాల్ని అత్యంత చేరువ గా చూస్తున్న రసోద్వేగం.ఇది అంతా దేని గురించి చెబుతున్నానా ..ఇటీవలనే చదివిన "వనవాసి" అనే అనువాద నవల గురించి.బెంగాలీ మూలం భిభూతి భూషణ్ బంధోపాధ్యాయ.అనువాదం చేసిన వారు సూరంపూడి సీతారాం.

ఉత్తమ పురుష లో సాగుతూ పోయే ఈ నవల కాల పరీక్షకి తట్టుకొని నిలిచిన రచన.అసలు అరణ్యం యొక్క ఆ సౌందర్య జ్వాల ఇంత సమున్నతమైనదా అనిపించక మానదు.ఆంగ్లేయులు పాలిస్తున్న కాలం అది.కలకత్తా మహా నగరం లో ఒక సగటు నిరుద్యోగి ..ఉద్యోగ అన్వేషణ లో భాగంగా వెదుకుతూ పోగా  బీహార్ లోని ఒక ఎస్టేట్ కి మేనేజర్ గా నియమించబడతాడు.ఫూల్కియ,లవటూలియ వంటి పేర్లున్న చిన్న జనావాసాలు..వేల ఎకరాల దట్టమైన అరణ్యాలు,దానిలోని రకరకాల జంతు జాలం,కొండకోనలు ..వీటి అన్నిటి మధ్య ఈ కధానాయకుని కేంప్ కార్యాలయం...రాత్రయితే చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దం..దూరమ్నుంచి ఏవో జంతువుల అరుపులు..అందాల వెన్నెల లో దారి తెన్ను లెక్క చేయక గుర్రం పై చేసే ప్రయాణాలు..!

అంతులేని పేదరికం, అవిద్య ,అమాయకత్వం నిండిన జనాలు కొంతమది అయితే ప్రతి అవకాశాన్ని తమకి అనుకూలం గా మార్చుకోవాలనే తపన మరికొందరకి.అటువంటి పాత్రల లో ఎంతో వైవిధ్యం.అరణ్యం లోని భూమిని వాస యోగ్యం గా చేసి సాగు చేయడానికి జనాలకి ఇచ్చి తరువాత దాని నుంచి శిస్తులు వసూలు చేయడం ..అదీ అందుకు గాను ప్రధాన పాత్ర అయిన సత్య చరణ్ ఇక్కడకి పంపబడతాడు. ఈ అడవి లోకి వచ్చి ఒక రోజు కాగానే అతనికి విచారం పొంగుకు వస్తుంది.మళ్ళీ కలకత్తా పోయి నిరుద్యోగి గా ఉన్నా ఫర్వాలేదు అనుకుంటాడు.అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అరణ్యం లోని అంతరంగం అతడిని ఆకట్టుకొంటుంది.క్రమేపి దాన్ని విడిచి ఉండలేని స్థితి కి వస్తాడు.

ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఈ దేశం లో ..అయినా ప్రజలు తమకి పట్టనట్లు గానే జీవిస్తుంటారు.వారి అవసరాలు చాలా తక్కువ.ఎక్కువగా ఉండేది గంగోతా తెగ ప్రజలే.మటుక్ నాధ్ అనబడే పూజారి ఈ అటవీ ప్రాంతానికి వచ్చి చిన్న పాఠశాల పెట్టుకోవడానికి స్థలం అడిగి తీసుకొని ఉన్న ఒక్క శిష్యుని తో కాలక్షేపం చేస్తుంటాడు.రాస్ బిహారి సింగ్ అనే రాజ్ పుత్ వడ్డీ వ్యాపారి అక్కడి గంగోతా లకి వడ్డీలకి ఇచ్చి బాగా గడిస్తుంటాడు.పగటి వేషగాళ్ళు ..వారి యొక్క ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఉండే స్వభావం,యుగళ ప్రసాద్ అనే అతని అడవి లో మొక్కలు నాటుతూ దాన్ని సమ్రక్షించే పద్దతి...ఎంతో చరిత్ర కలిగినప్పటికీ బయట ప్రపంచానికి తెలియకుండానే ఆ అడవి లో కాలం గడిపే సంతాల్ తెగ ప్రజలు...ఇంకా ఇలా ఎన్నో వైవిధ్య భరిత ప్రపంచం లో తలమునకలవుతూ ...అడవి భూమి ని ..అక్కడి వన సంపద ని ..అభివృద్ది పేరు తో రూపు మార్చి చివరకి అక్కడనుంచి కలకత్తా ప్రయాణమవుతాడు.

తను వచ్చినప్పటి అరణ్యాన్ని ,ఇప్పటి ఈ అడవి ని చూసి బాధపడతాడు.ఇప్పుడు మనం అనుకునే పర్యావరణ పరిరక్షణ అనే భావన ని ఆ రోజుల్లోనే ఆలోచించినందుకు రచయిత ని అభినందించకుండా ఉండలేము.ఈ నవల లో ఆయా ఋతువుల లో ని వన శోభ ని వర్ణించిన విధానం నాకు తెలిసి నభూతో నభవిష్యతి.భిభూతి భూషణ్ యొక్క ప్రతిభ బహుముఖీనమైనది..అటు సంస్కృత కావ్యాలను ఇటు పాశ్చాత్య రచనా  సంప్రదాయాలను బాగా అర్ధం చేసుకొని దానికి తనదైన శైలి ని అద్దినాడని చెప్పవచ్చును.మన కళ్ళ ముందు పాత్రలన్నీ తిరుగుతూ నర్తిస్తున్నవా అనిపిస్తాయి.ఒక్క మాట కూడా పొల్లు ఉండదు.అయితే దీనిలోని అతి ప్రధాన పాత్ర అరణ్యం.ప్రతి తెలుగు పాఠకుడు ఈ నవల తప్పక చదవాలి.లేనట్లయితే ఆ లోటు ఎప్పటికీ లోటే. 

Friday, January 5, 2018

ఆ రోజున ఏమైనా రాస్తానో లేదో నాకు తెలియదు.

వచ్చే పన్నెండున వివేకానంద జయంతి.ఆ రోజున  ఏమైనా రాస్తానో లేదో నాకు తెలియదు.ఎందుకంటే ఒక రోజు అంజలి ఘటించి మళ్ళీ వచ్చే ఏడు అదే తేదీ కోసం చూడటము నాకైతే కష్టమైన పని.వివేకానందుని పరిధి చాలా విస్తృతమైనది.కొన్నిసార్లు అనిపిస్తుంది ...ఎంత ఆయన జీవిత సంఘటనల లోకి వెళుతుంటే అంత భావ విప్లవకారుని గా దర్శనమిస్తాడు.దానిలో అనేక కోణాలు.ఆయన ఒక మార్మిక  కవి,భాష్యకారుడు,గాయకుడు,కళా విమర్శకుడు,వివిధ సంస్కృతుల్ని సమ దృష్టితో వ్యాఖ్యానించిన ద్రష్ట.కాని మనలో  చాలా మందికి హైందవ ఝంఝామారుతం గానే తెలుసును..ఈ పేరు తో మొదట పిలిచినది ఒక పాశ్చాత్య పత్రికనే.   

దాదాపు మూడు  దశాబ్దాల క్రితం వివేకానందుని అంశ నన్ను కదిలించినది.మళ్ళీ మళ్ళీ ఆయన రాసిన, మాట్లాడిన వాటిని చదువుతూనే ఉన్నాను.కొత్త కొత్త అర్ధాలు స్ఫురిస్తుంటాయి ఎప్పటికప్పుడు.కొన్ని సూక్తులు గా కాక ఆ పుస్తకాల లోని ప్రతి అక్షరమూ.అలా చదవగలిగినప్పుడే కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి.నా శరీరం లోని నిద్ర లేచిన ప్రతి శక్తి దాని లోని పర్యవసానమే అనిపిస్తుంది.దానికి కృతజ్ఞత వ్యక్తీకరించడానికి కూడా నాకు తగిన మాటలు దొరకవు వెంటనే.

ఈ సందర్భంగా ఒక సంఘటన చెప్పాలని ఉంది.అది 1897 ,కలకత్తా లోని బాఘ్ బజార్ నందు ఉన్న బాబు బలరాం బోస్ అనే శిష్యుని ఇంట్లో మాట్లాడుతుంటాడు.మాక్స్ ముల్లర్ రాసిన వేద భాష్యాల మీద ఉన్న పుస్తకాన్ని ఒకాయన తీసుకు రాగా దాని మీదకి చర్చ మళ్ళుతుంది.అప్పుడు ఆయన ఇలా అంటాడు " నేను యూరపు ప్రయాణం లో ఉన్నప్పుడు ఆ దంపతుల్ని కలుసుకున్నాను..వారి ఇంటిలో వశిష్టుడు ,అరుంధతి వలె నాకు కనిపించారు.అలనాటి భాష్యకారుడైన ఆ శాయనాచార్యుడే మళ్ళీ ఇప్పుడు ఈ మాక్స్ ముల్లర్ రూపం లో జన్మించినట్లు అనిపించింది.శ్రీ రామకృష్ణుల పట్ల ఆయనకి ఎంత గౌరవమో!నాకు వీడ్కోలు చెప్పేసమయం లో ఆయన కంటిలో నీళ్ళు నిండినవి".

" శాయనుడు మళ్ళీ జన్మించితే పావనమైన మన దేశం లో జన్మించాలి గాని  అక్కడ ఎందుకు జన్మించాలి " అని ప్రశ్నిస్తాడు ఒకాయన.

" రుషి ఎక్కడైనా జన్మిస్తాడు భూమి మీద ...దీనికి వ్యతిరేక భావం ఉంటే అది మన అజ్ఞానం.ఇరవై ఏళ్ళు వేద వాజ్మయాన్ని అర్ధం చేసుకొని ప్రపంచానికి అర్ధం అయ్యే ఇంగ్లీష్ భాష  లో  అందివ్వడం కోసం కృషి చేశాడు..అంతే గాక ఇంకో ఇరవై ఏళ్ళు దాన్ని ప్రచురించే పని లో ఉన్నాడు...మొత్తం నలభై ఏళ్ళు తను జీవితాన్ని ఒక కార్యం కోసం వినియోగించాడు.ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వాల్యూం లు అన్నిటిని ప్రచురించడానికి గాను లక్ష రూపాయలు ఇచ్చింది.ఒక పనిని చేపడితే దాన్ని తుదముట్టించాడానికి తమ జీవితాల్ని అర్పించే ఈ గుణమే వారి గొప్పతనానికి కారణము...మనకో....పిల్లలు సరిగా ఎదగకుండానే పెళ్ళి...ఆ తర్వాత కుటుంబ భారం..వారికి పిల్లలు..ఇలా గడిచిపోతుంది.ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి.ఒక లక్ష్యం కలిగిన వ్యక్తి లేని వాని కంటే తక్కువ తప్పులు చేస్తాడు". 

Murthy Kvvs                 

Sunday, December 31, 2017

మరి మనకి ఎందుకని ఆ దారిద్ర్యం అంటే.మనకి హిపోక్రసీ...ఇంగ్లీష్ లో రాస్తే తెలుగు ద్రోహి అనే ఒక మూఢనమ్మకం..ఎవరైనా ఒక చోటికి వెళ్ళాలి అనుకునేది ఎందుకు...అదీ తన ప్రాంతం కాక ఇంకో చోటికి..!తనది కాని చూడని..వినని...ఏదో కొత్తదనాన్ని చూడటానికి..!దాన్ని ఆస్వాదించడానికి..అదే కాదు దాని నుంచి నేర్చుకోడానికి.అది ఏ చిన్నదైనా సరే.లోకం దృస్టిలో దానికి విలువ లేకపోవచ్చును...కాని మనలో ఏదో ఓ మూల ఓ దీపం వెలిగిన అనుభూతి.అదిగో దానికే తిరుగుతుంటా. ఈ తిరిగే దానికి కూడా ..ఎక్కడో ఓ మూల రక్తం లో దానికి సంభందించిన గత స్మృతుల జ్ఞాపకాలు కూడా తడుముతుండాలేమో.లేకపోతే ప్రతి ఒక్కనికీ ఈ తిరిగే ధ్యాస ఉండదే..అదీ గుంపు గా కాక..!రక్షణ ని కనిపించని ఏదో శక్తి కి వదిలిపెట్టి..!గాలి వలె...!

సరే...నా ఒడిస్సా ప్రయాణం తాలుకు విశేషాలకి వస్తాను. ఈ నెల చివరి వారం లో జరిగినది.గతం లో మూడు మార్లు భుబనేశ్వర్ లో దిగి యున్నాను.ఈ ఊరికి నాకు గతం లో ఏమైనా అనుబంధం ఉన్నదా అనిపిస్తుంది కొన్ని మార్లు.నా అర్థం కొన్ని గత జన్మ ల లో..!అలా లేనిదే ఒక ప్రాంతం గాని,ఒక మనిషి గాని మనకి చేరువ గారు..అవి మనల్ని అలరించవు.ఎంత దగ్గరున్న ఎంత దూరమున్నా..!ఒక ప్రూఫ్ ఇవ్వవయ్యా అంటే భౌతిక శాస్త్ర పరంగా నేను ఇవ్వలేను.అది ధ్యానం లో కొంత పురోగమించిన వారికి తెలియును.సరే...మనం వద్దాము.ఇంకో విషయానికి.

ఒరిస్సా అనగానే మనం ఏమనుకుంటాము.ఒక బాగా వెనకబడిన రాష్ట్రం అని.కొన్ని వాట్లని పేపర్లని చదువుతాము.ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాము.ప్రతి సారి అదే ఇది గా భావిస్తుంటాము.కొన్ని వాట్లలో గావచ్చును.కాని అక్కడ నుంచి నేర్చుకోవలసినవి ఏమీ లేవా అంటే చాలా ఉన్నాయి.ప్రతి ప్రదేశానికి దేని ప్రత్యేకత దానిది.అలా ఉంటుంది..అది అంతే.నాకు తెలిసి ప్రతి ఒరియా భద్రలోకీయుని లోను ఒక గొప్ప చదువరి ఉన్నాడు.షేక్స్పియర్ నుంచి ఇప్పటి చేతన్ భగత్ దాకా.చాలా మంది తెలుగు కవులకంటే ఒరియా కవులు వారి భాష తో పాటు ఇంగ్లీష్ లో కూడా మంచి డొక్కశుద్ది గలవారు.ఆంగ్ల,ఒరియా భాషల్లో అవలీల గా కవిత్వం రాయగలవారు ఎందరో సీతాకాంత్ మహాపాత్ర నుంచి రమాకాంత్ దాస్ వరకు ..అంటే నేటి తరం దాకా.నేను బాగా శోధించ గా తేలింది ఏమంటే వారు బెంగాలీ భద్రలోకీయుల్ని ఆదర్శం గా తీసుకుంటారని.మాతృ భాషతో పాటు ఇంగ్లీష్ లో ను లోపలకి వెళ్ళుట.

మనోజ్ దాస్ వంటి కధా రచయితలు ఆంగ్ల ,ఒరియా భాషల్లో అవలీల గా ఎన్నో పుస్తకాలు వెలువరించారు.మరి మనకి ఎందుకని ఆ దారిద్ర్యం అంటే.మనకి హిపోక్రసీ...ఇంగ్లీష్ లో రాస్తే తెలుగు ద్రోహి అనే ఒక మూఢనమ్మకం.ఏమయ్యా ఇంగ్లీష్ గొప్ప...అని అనవచ్చు.నువు నీ భాషని మించి దేశానికి,ప్రపంచానికి నీ బాధ వినిపించవచ్చు.ఎంతైనా వాదించు..ఏమైనా అనుకో మిత్రమా..!నీకు ఒక గొప్ప కిటికీ తెరుచుకోదు..భావం లో గాని..భాష లో గాని...అర్ధం చేసుకోవడం లో గాని.ఇంకా అలా చాలా వాటిల్లో.ఆ వెనుకబాటు తనం అలా ఉంటుంది.ఎప్పటికీ.
---Murthy kvvs

Sunday, December 17, 2017

చెప్పేది ఎక్కువ.చేసేది తక్కువ.అంటే ఇదే.

మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలు మొదలైనాయి.మిశ్రమ ఫలితాలు వెలువడుతున్నాయి.కొంతమంది ఒకలా ...ఇంకొకళ్ళు ఇంకోలా.గరికపాటి ని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించాటడ...ఆంధ్ర సి ఎం ని పిలువ లేదని.అసలు ఈ రాజకీయాలు అన్నీ ఆయనకి అవసరమా... అవి రాజకీయ నాయకులు పరస్పర అవసరం కోసం చేసుకునేవి.ఇవాళ తిట్టుకుంటారు..ఇంకోరోజు పిచ్చగా పొగుడుకుంటారు..అవసరాన్ని బట్టి.అంతదాక ఎందుకు హైద్రాబాద్ లో సాఫ్ట్ ఫేర్ అభివ్రుద్ది అంత బాబు పుణ్యమే అని కెటీయార్ ఫీలర్ వదిలాడు కొన్ని రోజుల క్రితమే.

కనక తెలుగు భాష ,సాహిత్యం శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు.గరికపాటి ఒక పొలిటీషియన్ లా వ్యవహరించాడు తప్ప సరస్వతీ పుత్రుని గా కాదు.ఇటువంటి ఓ ప్రకటన ఇచ్చినందుకు ఆయనకి ఆంధ్ర అధికార వర్గాల్లో పలుకుబడి పెరగవచ్చుగాక.కాని తెలుగు భాష కి సంబందించి ఆయన ప్రేమ ఏమిటో అర్ధం అయింది.బతకనేర్చిన తనం ఒక్క మాటలో చెప్పాలంటే.

అసదుద్దీన్ ఒవైసీ ని ఈసారి ప్రముఖంగా చెప్పవలసిందే.తెలుగు లో మాట్లాడి ..చివరన తప్పులున్నచో మన్నించమని కోరాడు.అది మామూలు విషయం కాదు.అది కెసియార్ యొక్క మిత్రత్వం కి ఇచ్చిన విలువ.అది దమ్మున్నవాడు చేసే పని.మా తెలుగుల మనసులు గెలుచుకున్నావు ఒవైసీ ....నీకు సాల్యూట్.తమిళనాడు గాని కేరళ వెళ్ళినా అక్కడ ఆ యా భాషల్లోనే మతపరమైన పాటలు ప్రసంగాలు సాగుతాయి.అట్లా అని అక్కడి వారికి అరభీ భాష రాదని కాదు...తాము ఎక్కడ జన్మించామో ఆ భాషల్ని గౌరవించాలనే స్పృహ వారికి వున్నది.ఇక్కడ లేదని కాదు.

వాళ్ళు తెలుగు లో మాట్లాడటానికి ప్రయత్నించే లోపే వచ్చిన బ్రోకెన్ ఉర్దూ లో మాట్లాడుతూ వారి ప్రయత్నాన్ని అడ్డుకునే మన సగటు తెలుగులది.చెప్పేది ఎక్కువ.చేసేది తక్కువ.అంటే ఇదే.  

Monday, December 4, 2017

దీని లో పాత్రలు వెంటాడుతాయిశరదిందు బందోపాధ్యాయ్ బెంగాలీ లో రాసిన కొన్ని పరిశోధనాత్మక కధల్ని నిన్ననే ముగించాను.రూపా వాళ్ళు వేశారు.మోణిమాల ధర్ అనే  షిల్లాంగ్ లో పనిచేసే అధ్యాపకురాలు ఇంగ్లీష్ లోకి అనువదించారు.ఇది కొన్న రోజున ఎలాంటి అంచనాలు లేవు,ఓ డిటెక్టివ్ చేసే పనుల గురించి రాసి ఉండవచ్చునని ఒక ఊహ మాత్రం ఉండింది.కాని చదివిన పిమ్మట కొన్ని దీని లో పాత్రలు వెంటాడుతాయి.బ్యోం కేష్ ఇంకా అతని సహాయకుడు అజిత్ ..వీరు ఇరువురి యొక్క సమస్యల్ని పరిష్కరించే తీరు కధల వెంబడి అలా నడిపించుకుపోతుంది.

ఈ శరదిందు బందోపాధ్యాయ్ 1889 -1970 కాలం లో జీవించాడు.వృత్తిరీత్య వకీలు అయినప్పటికి క్రమేపి దానికి దూరమై రాయడమే పనిగా పెట్టుకొని జీవించాడు.హిందీ సినిమాలకి కొన్నిటికి స్క్రిప్ట్ రాశాడు.అనేక నవలలు,కధలు వ్యాసాలు రాసినప్పటికి అతను సృష్టించిన సత్యాన్వేషి (డిటెక్టివ్ లా ) బ్యోం కేష్ పాత్ర బెంగాల్ లో ప్రతి ఇంటికి తెలిసిన పాత్ర గా మారింది.ఈ కధలు దూరదర్శన్ లో కూడా వచ్చాయి.మొత్తం ఏడు కధలు ఉన్నాయి.ఆపకుండా చదివించాయి.

అనువాదకురాలు సరళమైన భాష లో రాశారు.అయితే ప్రతి వాక్యాన్ని ,దాని అర్ధాన్ని పఠిత కి చక్క గా అందించగలిగారు.కధ యొక్క పేర్లను కృతకమైన అనువాదం లో కాకుండా దగ్గరగా ఉండే మాటల్లో కి తెచ్చారు.అయితే అది సారాంశాన్ని బలపరిచేది గానే ఉన్నది.ఉదాహరణకి రక్తముఖి నీల అనే టైటిల్ ని ద డెడ్లీ డైమండ్ గా మార్చారు.నిజం గా అది డెడ్లీ నే..అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు జైలు కి పోవడమే లెక్క.సస్పెన్స్ తో పాటుగా సందర్భానుసారం గా కొన్ని సాంస్కృతిక విషయాలూ తెలుస్తుంటాయి.