ఇటీవల ఖాకీ: బీహార్ ఫైల్స్ అనే వెబ్ సిరీస్ చూడటం జరిగింది.ఇది నాలుగేళ్ళ క్రితం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పటికీ నేను కాస్తా ఆలశ్యం గా చూశాను.ఎలాంటి అంచనాలు లేకుండా చూడటం మొదలుపెట్టి మొత్తం ఏడు ఎపిసోడ్ లు అయిపొయేసరికి ఒక మంచి అనుభూతి కలిగింది.
ఒకానొక కాలం లో మనం పింటూ మహతో అనే బీహార్ గ్యాంగ్ స్టార్ గురించి చదివేవాళ్ళం.దోపిడీలు,కిడ్నాప్ లు,జైలు సిబ్బంది ని ఏమర్చి పారిపోవడం ఇవన్నీ మళ్ళీ మెదిలాయి. ఈ కథ అంతా కూడా మహతో ని ఆధారంగా చేసుకొని సాగినదే!
అమిత్ లోధా అనే ఐపిఎస్ అధికారి రాసిన ఒక పుస్తకం నుంచి తీసుకున్నది.రాజస్థాన్ నుంచి ఒక యువ ఐపిఎస్ అధికారి రైలు లో వస్తుంటాడు. బీహార్ లో ని ఒక జిల్లా లో జాయిన్ కావడానికి. ఆ రైల్లోనే కొంతమంది ప్రయాణీకులు ఇతడిని చూసి జోక్ లు వేసుకుంటూంటారు.పోలీస్ అధికారి మామూలు డ్రెస్ లో ఉంటాడు.ఏమీ అనకుండా నిశ్శబ్దం గా చూసి ఊరుకుంటాడు.
కాసేపయిన తర్వాత వాళ్ళ ప్రశ్న కి జవాబు చెబుతాడు,తాను కొత్తగా బీహార్ కి కేటాయించబడిన ఐపిఎస్ అధికారినని...అవతలి వాళ్ళు ఖంగు తిని సారీ చెబుతారు. అంతేగాక సగటు బీహారి తత్వాన్ని వివరిస్తారు. నేను..అని కాకుండా మనం..అని మీరు ఎప్పుడైతే బీహారి వ్యక్తి తో మెలుగుతారో అతను మీతో ఎప్పటికీ స్నేహంగా ఉంటాడు.
మాది బుద్ధుడు నడిచిన భూమి,మహావీరుడు నడిచిన భూమి. వెళ్ళండి మీకు తెలుస్తుంది అంటారు. ఈ యువ అధికారి పేరు అమిత్ లోధా. ఈయన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్ కి వెళతాడు. అక్కడ ఒక చెట్టు కింద తలపాగా చుట్టుకొని కుర్చీలో కూర్చుని వచ్చిన జనాలతో జోక్ లు వేసుకుంటూ ఒక మనిషి కనబడతాడు.
లోపల ఆఫీస్ లో ఎవరూ కనిపించరు. అక్కడ అలా వెయిట్ చేసిన తర్వాత,ఆ తలపాగా వ్యక్తి వచ్చి నేనే నీ సుపీరియర్ ని అని చెప్పి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటాడు. అమిత్ లోధా కి మతి పోతుంది.
పింటూ మహతో పేరు ని చందన్ మహతో అని మార్చారు. చిన్న సైజు కూలీ, లారీ డ్రైవర్ గా పనిచేసే మహతో రకరకాల అనుభవాల ద్వారా గ్యాగ్ స్టర్ గా ఎదుగుతాడు.చదువు పెద్దగా లేకపొయినప్పటికీ ఇతరుల్ని మాటలతో బురుడీ కొట్టించే కళ బాగా ఉంటుంది.ఇతనికి చ్యవన్ ప్రాశ్ సాహు అనే మరో వ్యక్తి జైలులో పరిచయం అవుతాడు.
ఇద్దరూ కలిసి జైలు నుంచి పారిపోతారు. ముగ్గురు జైలు సిబ్బంది ని హత్య చేసి బయటకి వచ్చిన వీళ్ళు తమ సామాజిక వర్గానికి చెందిన యువత ని తమ మాటలతో ఆకట్టుకొని కిడ్నాప్ లు,లూటీలు చేస్తుంటారు. వీళ్ళు దోచుకునేది ఎక్కువగా మార్వాడి వ్యాపారస్తుల్ని,ఇతర సంపన్నుల్ని.అమిత్ లోధా మార్వాడి వ్యాపారస్తులకి ఏ ఒక్కరికీ డబ్బులు ఇవ్వొద్దని ధైర్యం చెబుతాడు.దాంతో నెల మామూళ్ళు ఆగిపోతాయి.చందన్ మహతో ఫోన్ ని ట్రాక్ చేసి అతడి అనుచరుల్ని అరెస్ట్ చేయడం మొదలుపెడతాడు.
మహతో ,వెనుకబడిన వర్గాల కి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తూ పొలిటికల్ బేస్ ని నిర్మించుకుని పోలీస్ ల నుంచి తప్పించుకుంటూ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాడు.బీహార్ కుల రాజకీయాలు అంతటా ఎలా పెనవేసుకుని ఎలా ఉంటాయో దర్శకుడు బాగా ఎలివేట్ చేశాడు.
అయిదుగురు యాదవ్ ల్ని హత్య చేసి జైలు కి వచ్చిన మహతో ని రాజ్ పుత్ వర్గం అభిమానంగా చూస్తారు. తనకు నమ్మక ద్రోహం చేసిన అభ్యుదయ్ సింగ్ అనే రాజ్ పుత్ ని చంపడం తో వాళ్ళు ఇతడికి వ్యతిరేకం అవుతారు. రాష్ట్ర రాజకీయాల్లో మహతో కీలకంగా మారడం తో అతడిని మట్టుబెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి.
బీహార్ సామాజిక కోణాన్ని ,గ్రామీణ వ్యవస్థని,పేదరికానికి గల కారణాల్ని చక్కటి కథ గా మన ముందు దర్శనమిస్తుంది. పోలీస్ అధికారుల్ని నియమించడం లో జరిగే నేపథ్యాన్ని ఈ వెబ్ సిరీస్ లో కళ్ళకి కట్టినట్లు చూపించాడు.
ఫోటోగ్రఫీ హాయిగా ఉంది. బీహార్ గ్రామ సీమలు,చుట్టుపక్కలున్న అడవులు అందంగా ఉన్నాయి.మహతో గా నటించిన అవినాష్ తివారి, అమిత్ లోధా గా నటించిన కరణ్ టక్కర్ లు మన మనసులో చాలా కాలం నిలిచిపోతారు.వీలైతే చూడండి.నేను చెప్పింది తక్కువ,గ్రహించడానికి చాలా ఉంది. నిజ జీవితం లో మహతో 300 మందిని చంపినట్లుగా రికార్డులు చెబుతుండగా,దాంటో 30 మంది పోలీసులు. అదీ కొసమెరుపు.
.jpg)
.jpg)


