Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Tuesday, June 20, 2023

తంగేడు పక్షపత్రిక లో ప్రచురితమైన నా కథ "ఆ రెండు చెట్లు"

 







తంగేడు పక్షపత్రిక లో ప్రచురితమైన నాకథ "ఆ రెండు చెట్లు" (16-30 June, 2023 issue)

Monday, March 25, 2019

రేపటి కోసం (కధ)

రేపటి కోసం (కధ)----మూర్తి కె.వి.వి.ఎస్.
నిన్నటి పేపర్ లో ఆ వార్త చూసిన దగ్గర నుంచి మనసు వికలమై,దేని మీదా లగ్నం చేయలేకపోతున్నాను.కేవలం నా ఒక్కడికి మాత్రమే అలా అనిపిస్తున్నదా లేదా అందరకీ అలా నే అనిపిస్తున్నదా..ఒక వేళ అనేకమంది ని ఆ వార్త అంత లా కదిలిస్తే మరి జనాల్లో కదలిక ఏదీ..?సమాజం లో రావలసినంత అలజడి రావడం లేదేం..?చదివిన రోజున కాస్త బాధ పడటం ...మళ్ళీ యధా విధి గా ఎవరి దైనందిన కార్యకలాపాల్లో వారు మునిగిపోవడం..!అదేనా జరుగుతున్నది..?

" హలో శ్రీనివాస్ గారూ..! ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" పలకరించాడు మా కొలీగ్ సాంబశివరావు.వెంటనే ఈ లోకం లోకి వచ్చి పడ్డాను.

"ఏం లేదు సార్ ...నిన్నటి వార్త ..ఒకటుంది లెండి..దాని గురించే ఆలోచిస్తున్నాను" అన్యాపదేశం గా జవాబిచ్చాను.

"ఏమిటీ ..మిమ్మల్ని అంతగా కదిలించిన వార్త"

" అదే...మన ఊరి లో నే జరిగిన సంఘటన.తనని ప్రేమించలేదని ఒకమ్మాయిని కొబ్బరి బొండాలు నరికే కత్తి తో నరికి చంపాడే ఒక అబ్బాయి.దాని గురించే ఆలోచిస్తున్నా.."

" ఇలాంటివి ఇంచుమించు ఇప్పుడు ప్రతి ఊళ్ళో నూ జరుగుతున్నాయి..మనం అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం గదా"
"అదేమిటండి...నరికి చంపడం ఏమిటి..?అసలు అంతంత కోపాలు ఏమిటి ఈ వయసుల్లో.ప్రేమలు గీమలూ ఈ రోజునే కొత్తగా వచ్చాయా..!ఇష్టం లేకపోతే అంతటి తో వదిలెయ్యాలి లేదా ఏదైనా నోటి తో మాట్లాడుకోవాలి గాని నరికి చంపితే ప్రాణం మళ్ళీ వస్తుందా,అయినా ఒక ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు ,వీళ్ళకి చెప్పే నాధుడే లేడా "కాస్త కోపం గా నే అన్నాను.

"ఎవరు చెపితే ఎవరు వింటారు.ఈ నాటి యువత కి చెప్పేలానే ఉందా ..మాకు అంతా తెలుసు అనే దారి లో ఉన్నారు " వేదాంత ధోరణి లో చెప్పాడు సాంబశివరావు.

కాలేజీ అయిపోయింది.ఇల్లు దగ్గరలోనే గనక నడుచుకుంటూ వెళుతున్నాను.రోడ్డు మీద వెళుతున్న కాలేజీ పిల్లల్ని చూస్తున్నాను.ఇంత సౌమ్యంగా కనిపించే ఈ పిల్లలు ఏ కొద్ది ప్రేమ విఫలమైతే నో ఎందుకని సైకో ల్లా మారిపోతున్నారు,ఏమిటి కారణం..?ఆలోచిస్తున్నాను.వీళ్ళని ఇంతలా ప్రభావితం చేస్తున్నవి ఏమిటి..? సినిమాలు ఇంకా టి.వి.సీరియల్స్ ....కక్ష తీర్చుకో....వెంటాడు..వేటాడు...రక్తాన్ని చిందించు ..ఇవేగదా నేటి యువతరానికి ఇచ్చే సందేశాలు..!ముఖ్యంగా అమ్మాయి ప్రేమ నిరాకరిస్తే ఘోరంగా కక్ష తీర్చుకునే పైశాచికత్వం అదో ఫేషన్ లా ,ట్రెండ్ లా తీర్చిదిద్దుతున్నారు కొన్ని సినిమాల్లో..! అవతల జీవితం నాశనం,ఇవతల జైల్ లో పడి వీడి జీవితం నాశనం..దీనివల్ల ఎవరు ఏం బావుకున్నట్లు...!

నా ముందు ఒక అమ్మాయి,అబ్బాయి ..మా కాలేజీ వాళ్ళే కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు.ఇప్పుడు హాయి గా నవ్వుకుంటూ బాగానే కనిపిస్తున్నారు.మళ్ళీ రేపు ఏ లవ్ ఫెయిల్ అవుతేనో ...పేపర్ లో మరో వార్త చూడవలసి వస్తుందా తనకి....నాలో నేనే ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.నీ పిచ్చి గాని మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు ..అంతరాత్మ మూలిగింది.లేదు లేదు తనకి తోచింది తను చెప్పాలి.తను ప్రపంచం లో తిరిగి చూసింది,చదివింది,అర్ధం చేసుకున్నది ఈ యువతరం తో పంచుకోవాలి.వారి లో తలెత్తుతున్న పెడ ధోరణి ని ఏ కొద్ది గా మార్చగలిగినా తన జీవితం ధన్యమే అనుకున్నాను.

అవును...రేపు ఫేర్ వెల్ ఫంక్షన్ ఉన్నది కాలేజ్ లో..!ఆ వేదిక ని తను ఉపయోగించుకోవాలి..!వాళ్ళ మెదడు లో ఒక కొత్త విత్తనాన్ని నాటాలి.ఏమో అది పెరిగి పెరిగి వృక్షమై మరెన్నో విత్తనాల్ని అనేక మెదళ్ళ లో పాదుకొల్పుతుందేమో..!ఒక ప్రయత్నం చేద్దాం నష్టం ఏముంది.ఆ రోజు ..ఆ క్షణం రానే వచ్చింది.మా ప్రిన్స్ పాల్ గారు సభకి అధ్యక్షత వహించారు.నా వంతు వచ్చింది మాట్లాడటానికి.
"మై డియర్ యంగ్ ఫ్రెండ్స్...ప్రస్తుతం మిమ్మల్ని మిత్రులు గా భావించే నేను ఒక ప్రత్యేక విషయం చెప్పాలని అనుకుంటున్నా.ఈ రోజున ఫేర్ వెల్ జరుగుతున్నది.మళ్ళీ మీరు మాకు కనబడరు.ఒక వేళ కనబడినా అది వేరు గా ఉంటుంది.ఈ సమయం లో ఉండే అనుబంధం వేరు.ప్రతి ఒక్కరికి యవ్వనం లో కలిగే అనుభూతులు కొన్ని ఉంటాయి.అమ్మాయిలైనా ,అబ్బాయిలైనా ..ఒకటి గుర్తు ఉంచుకొండి ప్రేమ అనేది జీవితం లో ఒక భాగం మాత్రమే తప్పా అదే జీవితం మొత్తం కాదు.కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత మీకు అది అర్ధం అవుతుంది.ముఖ్యంగా అబ్బాయిలకి చెప్పేది ఏమంటే ...అమ్మాయిలు కొద్దిగా నవ్వుతూ మాటాడితే ..దాన్ని మీరు మరీ ఎక్కువగా ఊహించుకోకూడదు.ఈ అమ్మాయి నాకే సొంతం ,నా తోనే మాటాడాలి,నన్నే ప్రేమించాలి అలా ఊహించుకోవద్దు.మీరు సరదాగా ఇంకో మనిషి తో ఎలా మాటాడాలి అని అనుకుంటారో వాళ్ళూ అదే భావం తో మాటాడాలి అని అనుకోవచ్చు.అంత మాత్రం చేత ఎక్కువ గా మీకు మీరే ఊహించుకొని వారి జీవితాల్లోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టాలని అనుకోవద్దు.మీరు కెరీర్ మీద దృష్టి పెట్టి చక్కగా ఎదిగితే జీవితం లో అన్నీ అవే వెంటనట్టి వస్తాయి.సినిమాల్లోనూ ,టివి ల్లోనూ చూపించే సన్నివేశాలు అవి అర్ధ సత్యాలు.వాటినే అనుకరించాలని అనుకోవద్దు.పేపర్ల లో చూడండి..ఇవేళా రేపు...అన్నీ రక్తసిక్త ప్రేమ వార్తలే..!ప్రేమ లో తేడాలొచ్చాయని నరకడాలు,ప్రాణాలు తీసుకోడాలు ..ఏమిటివి..? పాశ్చత్యుల  పేపర్లు చూస్తే ఎక్కువ గా చంపేది చంపబడేది ధన సంపాదన కోసం,అదే మన దేశం లో చూస్తే ..ఇలాంటి అటూ ఇటూ గాని ప్రేమల కోసం..!ఒకటే గుర్తు పెట్టుకొండి ఎవరకీ ఎవరి ప్రాణాన్నీ హరించే హక్కు లేదు.జీవితం చాలా విశాలమైనది.ఒక ద్వారం మూసుకుంటే మరొకటి తెరుచుకుంటుంది.ఇదంతా ఎందుకు చెప్పానో కొన్నాళ్ళ తర్వాత మీకే తెలుస్తుంది,మరి శెలవు" అంటూ నా ప్రసంగాన్ని ముగించాను.ఎలా ఫీలయ్యారు వీళ్ళు అని వాళ్ళ ముఖాల్లోకి చూశాను.అందరూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు గా అనిపించారు.అంటే లోపల పడిన ఆలోచనలు వాటి పని అవి చేస్తున్నాయన్నమాట.

అదే నాకూ కావలసింది. స్టాఫ్ అంతా నావేపు మెచ్చుకోలు గా చూశారు.మీ అందరి తరపునా నేను వీళ్ళకి చెప్పాను,అంతే..నాలో నేనే అనుకున్నాను. (సమాప్తం) 

Thursday, December 13, 2018

నా డైరీ లోని కొన్ని పేజీలు..!(కధ)--మూర్తి కె.వి.వి.ఎస్.


2-10-2018

ఇప్పుడు సిగిరియా వద్ద ఉన్నాను.శ్రీలంక లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం.రావణుడి వంశీకులు కట్టిన కోట దగ్గర.లయన్ రాక్ గా పిలువ బడే కొన్ని వందల మీటర్ల ఎత్తైన పర్వతం.దాని మీద కట్టిన కోట.శిధిలమై ఉన్నది.అలాగని గుర్తు పట్టలేనంతగా కాదు.శిల్ప సంపద,రహస్య సొరంగాలు,స్నానమాడే కొలనులు ఇలా అలనాటి దర్పానికి ప్రతీక గా ఇంకా నిలిచే ఉన్నాయి.ఎన్ని వేసవులు.ఎన్ని గాడ్పులు.ఎన్ని తుఫానులు..ఎన్ని వర్షపాతాలు...ఎన్నిటినో తట్టుకొని ఇంకా తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి.ఆ ఎత్తైన కొండకి చుట్టూరా కొన్ని మైళ్ళ పర్యంతం చుట్టూరా కందకాలు,వాటిలోని నిర్మల ప్రవాహాలు, ఆ దరులకిరువేపులా పచ్చని ప్రకృతి...బండరాళ్ళు పేర్చి కందకాలకి కట్టిన గోడలు...చుట్టూరా అరణ్యం...దానిలోనే ఈ కట్టడాలు..!ఒకానొక కాలం లో ఈ చోటులన్నీ ఎంత వైభవం తో తులతూగినవో...ఎవరెవరు ఇక్కడ తమ పాద ముద్రలు వదిలి కాల గర్భం లో కలిసిపోయారో..!ఇక్కడ నేను వదిలిన పాద ముద్రలు ,కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఎవరైనా గుర్తుపడతారా...?సూక్ష్మ ప్రపంచం ని వీక్షించే ఏ యోగీశ్వరులో బహుశా ఆనవాలు పట్టవచ్చునేమో..!

అన్నట్టు రావణుడు ఆ భారత దేశం లోని దండకారణ్యం నుంచి ఇక్కడి దాకా సీతమ్మ ని తీసుకు వచ్చాడా..?ఎటువంటిది ఆ ఆకాశగమనం చేసిన వాహనం..!ఎన్నో సందేహాలు ముప్పిరిగొన్నాయి.వాల్మీకి భావనా ఝరి ఎన్నో ఏళ్ళు దాటి అలా సాగుతూనే ఉన్నది.ఏది ఏమైనా ఒక  సాంస్కృతిక బంధాన్ని నిర్మించాడు ఆ మహా కావ్యం తో..!నిజమో..ఊహ నో...కల్పనా చాతుర్యమో...ఒక్కొక్కరికీ ఒక లాగా ..! ఎవరి దృష్టి వారిది.ఈ సిగిరియా ని ఆధారం గా చేసుకుని ఎంత జీవన వ్యాపారం ఇక్కడ..?హోటళ్ళు,వివిధ రకాల అంగళ్ళు,ఆటోలు,మిగతా వాహనాలు ఇంకా వివిధ దేశాల టూరిస్టులు ...నిర్విరామంగా ..యాత్రామయం..!చిన్నప్పుడు చదివిన,విన్న రామాయణ ఘట్టాలు చుట్టుముడుతూన్నాయి నా ప్రమేయం లేకుండానే..!

3-10-2018

సిగిరియా నుంచి బయలు దేరాను.బస్సు సాగిపోతూన్నది కాండీ వైపు.అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ శ్రీలంక లో ఉందని అంటారు.అయితే ఆ ప్రాంతం ఏమిటని ఎందరినో అడిగాను.ఎవరూ నాకు సరిగా చెప్పలేకపోయారు.చరిత్ర ఒక్కోసారి పుక్కిట పురాణాల్లో కప్పివేయబడి ఉంటుంది.కొన్నిసార్లు జానపదుల నోళ్ళలో వివిధ రూపాలు గా నాని గుర్తు పట్టలేని తీరుగా తయారవుతుంది.ఒక్కోసారి కల్పన ఏదో పుక్కిట పురాణమేదో చెప్పలేని స్థితి.ఈ లంక లో ఎక్కడ చూసినా బుద్ధ వైభవమే..!రమారమి పాతిక వేల పై చిలుకు ప్రదేశాల్లో ఎక్కడ తవ్వినా బుద్ధుని తాలుకు చరిత్ర ని తెలిపే వైనమే..!మన దేశం నుంచే ఇక్కడికి వచ్చిన బౌద్ధం మన దగ్గర సన్నటి ధార గా పరిణమించడం ..ఏ చారిత్రక మలుపుల విభాత సంధ్య లో మరి ఏమి జరిగిన ప్రభావమో..!ఒకానొక కాలం లో బహుశా సముద్ర ప్రయాణం ని భారత దేశం లో నిషేధించడం అనేది ..బౌద్ధ మతం తో సంగమం అనేది మళ్ళీ జరగకూడదనేనా..?అయితే దానివల్ల ప్రపంచ పోకడలకు దూరం అవడం వల్ల నిలవ నీరు గా ఉన్న మన దేశాన్ని ఇతర జాతులు కబళించడం సులువు అయింది.

ఇండోనేషియా,సుమత్రా,బాలి వంటి సుదూర ద్వీపాల్లో సైతం భారతీయ సంస్కృతి లోని ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ భాష లోను,సంస్కృతి లోనూ నేటికీ కనబడతాయి.అంటే ఒకానొక సమయం లో మనవాళ్ళూ సముద్రాలు దాటి జైత్ర యాత్రలు చేశారు.ఆ తర్వాత ఎప్పుడైతే సముద్రయానం నిషేధించబడిందో అక్కడినుంచే మన క్షీణ దశ ప్రారంభమయింది.అంతదాకా ఎందుకు ఈ లంక లోనే చూసినా భారతీయ ఆత్మ ఇప్పటికీ ప్రతి మూలన అనుభవమవుతూనే ఉంటుంది.ఆ తూర్పు వేపున తమిళులు బాగా ఉన్నచోటనే కాదు శ్రీలంక లోని ప్రతి మూలన మనల్ని మనమే చూసుకున్నట్లుగా ఉంటుంది.ఏదో పరాయి దేశం లో ఉన్నట్లు గా ఉండదు.విమానాశ్రయం లో ఇమిగ్రేషన్ అధికారులు మన పాస్ పోర్ట్ ని అడిగి చెక్ చేసినప్పుడు మాత్రమే వేరే దేశం లో ఉన్నట్లు స్పృహ వస్తుంది.

4-10-2018

సిగిరియా నుంచి కాండీ వచ్చి ఒక హోటల్ లో సేదతీరాము.ఈ కాండీ ఇక్కడి పురాతన నగరాల్లో ఒకటి.ఎన్నో రాజవంశాల పాలనలు...బ్రిటీష్ పాలన వరకు..!ఈ దేశం లో ఎక్కడికి వెళ్ళినా వెన్నంటి వస్తూనే ఉన్నది పచ్చదనం.బుద్ధుని పన్ను యొక్క అవశేషం పైన కట్టిన ఆలయం ఈ కాండీ యొక్క ప్రత్యేకత.ఎంతో మంది విదేశీయులు.స్వదేశీయులు అంతటా ఈ ఆలయ సమీపం లో..!ఈ ఆలయం ముందే ఉన్నది క్వీన్స్ హోటల్ అనబడే గత కాలపు భవనం.ఇప్పటికీ వీడని రాజసం ఆ కట్టడం లో..!ఆ ఆలయ ప్రవేశానికి చెల్లించాను వెయ్యి రూపాయలు.అదీ శ్రీలంక కరెన్సీ లో.బుద్ధుని కి సమర్పించడానికి తామర పూలు,ఇంకా ఇతర పూలు తీసుకువెళుతున్నారు.ఆలయం లోకి అడుగుపెడుతూనే అక్కడి గోడల పై తధాగతుని జీవితాన్ని వివరించే ఎన్నో రంగురంగుల చిత్రాలు.తెల్లటి పొడవైన స్థూపం లోపల.ఇంకా ఎన్నో శిల్పాలు.కలప ని ధారళంగా వాడిన నిర్మాణం.మా ఊరి రామాలయం లో లాగానే అక్కడక్కడ కొంతమంది కింద కూర్చునే దీక్ష గా బౌద్ధ శాస్త్రాల్ని ఆలపిస్తున్నారు.అగరు పొగలు దట్టం గా సాగుతున్నాయి.ఉన్నట్టుండి శంఖారావాలు...ఢంకా రావాలు...ఊరేగింపు లోపలకి ప్రవేశిస్తోంది.కెమేరాలు క్లిక్ మనిపిస్తున్నారు.ఎటువంటి ఆటంకాలు లేవు కెమేరాలకి..!

తధాగతుని దర్శించుకుని బయటకి వచ్చాము.మాతో పాటు వచ్చిన బస్సు లో ని ప్రయాణికులు వాళ్ళు కూడా దర్శించుకుని బయటకు వచ్చారు.ఆలయం ముందే ఉన్న జలాశయాల్ని చూస్తూ ఆనందిస్తూ ఉండగా ఒక చిన్నపిల్లవాడు తప్పించుకు పోయాడు.ఇక చూడండి.తల్లిదండ్రుల బాధ.ఇలా వచ్చేప్పుడు అసలు చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారో తెలియదు.ఆ బస్సు లో కూడా అయిదేళ్ళ పిల్లవాడు మహా గోల.మిగతా ప్రయాణీకుల సహనాన్ని పరీక్షించే విధంగా  అందరి సామాన్లు చికాకు చేసేవారు.ముందు ఎంతో ఓర్పు తో ఉన్నా అబ్బా ఏం పిల్లలురా  బాబూ అనిపించసాగింది.అయితే వీడి తల్లిదండ్రులు మాత్రం అదేదో గొప్ప సంగతి లా విలాసం గా ముద్దు చేస్తోంటే మిగతా వాళ్ళకి చిర్రెత్తసాగింది.మన ఆనందం ఇతరులకి ఖేదం కాకూడదనే ఇంగితం ఎందుకు ఉండదో కొందరకి..!మొత్తానికి వాడు ఆ జనప్రవాహం లో ఒక చోట దొరికాడు.హమ్మయ్యా ..పోనీలే అనిపించింది.

5-10-2018

సరే...కాండీ నుంచి బయలుదేరాము.అక్కడినుంచి కొలొంబో వైపు సాగుతున్నాము.ఈ మధ్య లోనే నుగారవాలియ అనే ఊరు.బస్సు వెళుతుంటే ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.లోయలు ,జలపాతాలు,మధ్యలో తగిలే జనసముదాయాలు హాయిగా గూర్చుతున్నాయి. గత కొన్ని రోజులు గా చూస్తున్నా.ప్రతి రోజు ఎంతో కొంత వర్షం పడుతూనే ఉంది.వెంటనే వెలిసిపోతూనే ఉంది.ఎక్కడా ఇదే స్థితి ఈ ద్వీపం లో..!మేఘాలు గుత్తులు గుత్తులు గా కొండలమీది నుంచి ఆనుకుని సాగుతున్నాయి.నుగారవాలియా లోనే ఒక గుడి ముందు ఆగింది బస్సు.అది ఆంజనేయుని గుడి.బయట ద్వారానికి అటూ ఇటు ఆంజనేయుని శిల్పాలు.లోపలకి వెళ్ళినచో సీతారామ దర్శనం లక్ష్మణ సమేతం గా జరుగుతుంది.ఇక్కడి విశేషం ఏమిటంటే ఈ గుడి చుట్టూరా ఆనుకుని కొంత అటవీ భగం వున్నది.పొడుగైన చెట్ల తో  అశోక వనం లా ఉన్నది.ఈ ప్రాంతం లోనే సీతాదేవి వనవాసం లో గడిపినది అంటూ అక్కడ ఓ బోర్డ్ పై రాసి ఉన్నది.నిజంగా ఇప్పటికీ ఆ మహా సాధ్వీ అక్కడే ఉన్నట్లు అనిపించింది.ఆధారాలు ఇమ్మంటే ఇవ్వలేను.

అలా ప్రయాణిస్తూ ...సాయత్రం కి చిన్మయ మిషన్ వాళ్ళు కట్టిన ఇంకో ఆంజనేయుని గుడికి చేరుకున్నాము.ఈ లంక లో ఈ మహానుభావునికి ఎంత పాపులారిటీ నో..!ఇది ఒక పెద్ద గుట్ట మీద ఉంది.కింద నుంచి పైకి ఆటో లు వెళుతున్నాయి.పై నుంచి కిందకి చూస్తే ఈ భూగ్రహం ఇంత అందమైన ప్రదేశాలకి ఆలవాలమా అనిపించకమానదు.మెట్లు ఎక్కేసరికి కొద్దిగా కాళ్ళు పీకినా ఈ సుందర దృశ్యాలు కనిపించి నా అలసట ని మటుమాయం చేశాయి.బస్ ముందుకి సాగుతున్న కొద్దీ టీ ఫేక్టరీలు ,తోటలు విరివిగా కనిపిస్తున్నాయి.రాత్రి తొమ్మిది దాటింది కొలొంబో చేరుకునేసరికి.అప్పటికే బుక్ చేసిన ఓ హోటల్ లో దిగాము.ఇహ ఇప్పుడు అసలైన పని రేపటినుంచి ప్రారంభం కాబోతున్నది.అసలు ఈ దేశం లోకి అడుగు పెట్టిన ఉద్దేశ్యం అదే.ఇవన్నీ ..ఇప్పటి వరకూ తిరిగినది అంతా బోనస్ లాంటిదే.!ప్రపంచ శాంతి సమావేశాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి.అనేక దేశాల వాళ్ళు పాల్గోనబోతున్నారు దీనిలో..!మన దేశం నుంచి నేనూ ఒక ప్రతినిధి గా రావడం జరిగినది.తిరువళ్ళువర్ అన్నట్లు ఒక పని చేస్తున్నప్పుడు ,ఆ పని మూలం గా మరి యొక పని ని చేయడం అనేది ఎలాంటిది అంటే ఒక ఏనుగు ని పట్టి దాని సాయం తో మరి యొక ఏనుగు ని పట్టడం లాంటిది. (The end)

Thursday, November 29, 2018

పోలింగ్ డ్యూటి (కధ) ---మూర్తి కె.వి.వి.ఎస్.

పోలింగ్ డ్యూటీ(కధ)--మూర్తి కె.వి.వి.ఎస్.
ఈ రోజున పేపర్ లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చదవ గానే కొన్ని ఏళ్ళ కిందటి విషయాలు మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. పోలింగ్ బూత్ ఉన్న ఆ వూరు లో దిగేసరికి సాయంత్రం నాలుగు దాటింది.ఎలక్షన్ డ్యూటీ చేసే సిబ్బంది మొత్తం మేము అయిదు మందిమి ఉన్నాము. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్,ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్,మిగతా ముగ్గురు పోలింగ్ క్లర్క్ లు.ఈ మారు మూల పల్లె లో ఉన్న ఓ పాఠశాల ని పోలింగ్ బూత్ గా పెట్టారు.మా అందర్నీ దింపేసిన బస్ ఇంకా ముందు కి సాగిపోయింది.మరింత మంది సిబ్బందిని వారి వారికి కేటాయించిన ప్రదేశాల్లో దింపడానికి..!

చూడటానికి ఇంతేనా అన్నట్లు ఉంటుంది గాని ప్రభుత్వ అధికారులకి ఆ ఎలెక్షన్ తతంగం అంతా జరిపించడానికి ఎంత యాతనో..ఎంత చికాకు వ్యవహారాలో..!ఏ మాత్రం ఎక్కడ పొరబాటు జరిగినా వెనకా ముందు చూడకుండా ఎన్ని అక్షింతలో..!మేము అయిదుగురం అయిదు ప్రదేశాల్లో పనిచేస్తున్నవాళ్ళం.ఈ ఎన్నికల డ్యూటీ పుణ్యమా అని ఇక్కడ ఇలా ఓ చోటా కలుసుకున్నాం.దేశం లో ప్రజాస్వామ్యమనే ఈ జగన్నాధ రధాన్ని కదిలించే యజ్ఞం లో మేమూ ఇలా మా పాత్ర నిర్వహించబోతున్నాము.

అయితే ఇలాంటివి గతం లో చేయక పోలేదు.కాని ఏ సారి అనుభవం ఆ సారిదే.దానిలో అన్ని రుచులూ కలిసి ఉంటాయి.ఎన్ని రకాల మనుషులు..ఎన్ని రకాల అనుభవాలు.సరే...పాఠశాలలో కి దిగిన వెంటనే మా ప్లానింగ్ ప్రారంభించాము.ఇప్పటి లా అప్పుడు ఈవిఎం మెషిన్ లు లేవు.అప్పటి వ్యవహారం వేరు.ఓటర్లు రావడానికి,మళ్ళీ వెళ్ళడానికి వీలు గా కర్రల తో కట్టాము.బ్యాలట్ బాక్స్ ఎక్కడ పెట్టాలి..అది సీక్రెట్ గా ఉండాలి,మళ్ళీ వెలుతురు వచ్చేలా ఉండాలి కనక ఓ కిటికీ మూలకి పెట్టాలి అనుకున్నాము.ఆ విధంగా అక్కడ టేబిల్ వేసి దానికి చుట్టూ దుప్పటి తో కట్టాము.వెదుర కర్రల సాయం తో..!
మొత్తానికి ఎలాగో ఆ పని అంతా పూర్తి చేశాము.ఓటర్లు రావడానికి,ఓటేసిన తర్వాత బయటకి వెళ్ళడానికి..అదంతాట్రయిల్స్ కూడా వేశాము.సంతృప్తి గా తోచింది.బ్యాలట్ పేపర్ల మీద సంతకాలు,వాటిని జాగ్రత్త గా లెక్క పెట్టుకోవడం,ఇంకా ఇతర స్టేట్యూటరీ పత్రాల్ని పూరించి పెట్టుకోవడం, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాము.ఈ పోలింగ్ డ్యూటీ అనేది సమిష్టి కృషి తో సాఫీ గా సాగిపోతుంది.ఉన్న పోలింగ్ సిబ్బంది లో నువు చిన్న నేను పెద్ద అనుకుంటే సరిగా సాగదు.ఆ విషయం ని మిగతా వారికి అర్ధం అయ్యేలా చెప్పాను.ఉన్నవారి లో అంతా సమానమేనని అందరం కలిసి ఈ కార్యాన్ని సఫలం చేద్దామని ఉత్సాహపరిచాను.అదృష్టవశాత్తు అంతా మంచి సిబ్బందే నా టీం లో పడ్డారు.

రాత్రి రమారమి ఎనిమిది అయింది.ఆ గ్రామం లో ఉన్నది ఒకటే వీధి.బల్బులు గుడ్డి గా వెలుగుతున్నాయి.పెద్ద వెలుగని చెప్పడానికి లేదు.ఉన్నదానితోనే సరిపుచ్చుకోవాలి.ఆ చివరి నుంచి ఈ చివరకి ఓ సారి సర్వే చేశాను.జనాల అలికిడి లేదు.చిన్న బడ్డీ కొట్టు కూడా లేదు.ఒక వేళ ఉన్నా మూసేసి ఉంటారు.దారి కి అటూ ఇటూ రకరకాల తుప్పలు ఉన్నాయి.ఈ గ్రామం కి ఆనుకొని ఉన్న మరో నాలుగు చిన్న గ్రామాలు..ఆ ప్రజలు కూడా ఇక్కడకే ఓటు వేయడానికి వస్తారు.మాకు ఉన్న లిస్ట్ లోని సమాచారం మేరకు..!

బడి కి వచ్చేసరికి ఏజెంట్లు వచ్చారు.రేపు ఉదయమే ఏడు లోపల రమ్మని వారికి చెప్పాను.వాళ్ళకి గుర్తింపు కార్డ్ లు ఇవ్వడం,మాక్ పోలింగ్ నిర్వహించడం అలాంటివి ఉంటాయని వారికి వివరించాను.వాళ్ళకి తెలియదని కాదు గాని మా పని మేం చేయాలి గదా..!మాకు కేటాయించిన స్థానిక గ్రామాధికారి రాలేదని ,ఈ రాత్రికి భోజనాలు ఎక్కడైన వండించితే వారికి డబ్బులిస్తామని మేము ఏజెంట్ లకి చెప్పాము.ఎందుకనో వాళ్ళు పెడ మొగం గా ఉన్నారు.ఈ రాత్రికి కష్టమండీ..అంటూ తప్పించుకు పోయారు.ఊళ్ళో చూస్తేనేమో తలుపులు బిడాయించుకుని ఉన్నారు.హోటల్స్ దగ్గర లో ఏమీ లేవు.లోపల ఆత్మారాముడు మూలుగుతున్నాడు.
"సార్ ..నేను వచ్చేటపుడు మూడు బిస్కెట్ పాకెట్ లు,మూడు బన్ లు తెచ్చాను.ఈ రాత్రికి వాటిని లాగిద్దాం.రేపు తెల్లారిన తర్వాత మిగతా సంగతి చూద్దాం" అన్నాడు మా టీం లోని పోలింగ్ క్లర్క్.హమ్మయా అని నిట్టూర్చి చాలా జాగ్రత్త గా వాటిని వాటాలు వేసుకుని తిన్నాము.కొంతలో కొంత నయం.ఆ బడి ప్రాంగణం లోనే ఓ బోర్వెల్ ఉంది.నీటి కి ఇబ్బంది లేదు లే..అని ఇంకొంచెం ధైర్యం వచ్చింది.నీళ్ళు కడుపు నిండా పట్టించాము.నిద్ర కి ఉపక్రమించాము.ఒకే దుప్పటిని అడ్డం గా పరిచి బయట వరండా లో పడుకున్నాము.నా జన్మకి నేనెప్పుడూ ఈ ఊరి లో ఇలా ఇక్కడ పడుకుంటానని ఊహించలేదు.అదే విధి మరి.విచిత్రం గా ఒక్క దోమా లేదు.నక్షత్రాల కాంతి వింత గా పరుచుకుంటోంది.ఉన్నట్టుండి ఒక చల్లని తెమ్మెర మమ్మల్ని జోల పుచ్చుతున్నట్లు గా వీయసాగింది.మెల్లగా నిద్ర లోకి జారుకున్నాము.ఎంత లోపల రేపటి పోలింగ్ గురించిన ఆందోళన ఉన్నప్పటికీ..!

పొద్దుటే అయిదు కల్లా తెలివి వచ్చింది.లేచి మొహం కడుక్కుని స్నానం కానిచ్చాను.చేయవలసిన కార్యక్రమాల ఎజెండాని రాసుకున్నాను.మళ్ళీ సామాగ్రి మొత్తాన్ని ఓ సారి సమీక్షించుకున్నాను.మిగతా నలుగురు సిబ్బంది ఓ గంటకి లేచారు.చకచకా వారి పనులు కానిచ్చారు.ఏజెంట్ లు వస్తున్నారు ఒక్కొక్కరే..!వారిని అందరని వాళ్ళకి కేటాయించిన బల్లల పై కూర్చోపెట్టాము.టైం అయింది ..బేలట్ బాక్స్ ని తెరిచి చూపించి..సీల్ వేయడం...ట్యాగ్ లు కట్టడం ...మాక్ పోలింగ్ చేయడం అంతా క్రమంగా చేశాము.ఏజెంట్లకి గుర్తింపు కార్డ్ ల్ని ఈ పనులు అన్నిటికి ముందర ఇచ్చేశాము.వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చాను.

గతం లో ఎన్నికల డ్యూటీ చేసిన గ్రామం లో అక్కడి ప్రజలంతా చక్కని సహకారం ఇచ్చారు.వద్దన్నా వినకుండా టిఫిన్ లు,భోజనాలు పంపేవారు.ఫ్రీగా తీసుకోవడం రూల్స్ కి విరుద్ధం అని వారికి బలవంతం గా డబ్బులు ఇచ్చేవాళ్ళం.కానీ ఈ గ్రామం ఏమిటో ..డబ్బులిస్తాం...అన్నం పెట్టమన్నా దానికి దిక్కు లేదు.మా బాగోగులు చూడాల్సిన స్థానిక అధికారి పత్తా లేడు.ఏమిటో..రకరకాల మనుషులు..!
పది అవుతుంది అనగా..ఇక ఓటర్ల రద్దీ పెరిగింది.వచ్చేవాళ్ళు వస్తున్నారు.ఓటేసి పోతున్నారు.కడుపు లో ఎలుకలు పరిగెడుతున్నాయి.మా టీం అంతా ఒకరి మొకాలు ఒకరం చూసుకున్నాం.తలా కాసిన్ని మంచి నీళ్ళు తాగాం.కాసేపు ఉన్నాక ఎందుకనో ఓ ఏజెంట్ అడిగాడు " సార్ ..ఏమైనా తిన్నారా?" అని.

"ఏం చెప్పాలి.రాత్రీ అన్నం లేదు.ఏవో బిస్కెట్ లూ అవీ తిన్నాం.ఇక్కడ ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు.ఇదిగో ఈ లోగా ఓటర్ల రద్దీ పుంజుకుంది.దీనికోసమే గదా మేము వచ్చింది.సరే ఎలాగో కానిస్తాం" అన్నాను నీరసంగా..!

"అలా అయితే ఎలా సార్.ఉండండి మా ఏజెంట్లు అందరి తరపున మేం మీకు తెప్పిస్తాం" అన్నాడతను,మిగతా ఏజెంట్ల వైపు చూస్తూ.వాళ్ళు సరే అన్నట్టు తలాడించారు.

"అయితే..ఒకటి ..మీరు తప్పకుండా మా దగ్గర డబ్బులు తీసుకోవాలి దానికి" అన్నాను.

"సర్లేండి.." అన్నాడతను.తను బయటకి వెళ్ళి ఎవరో కుర్రాడిని పురమాయించాడు.ఆ కుర్రాడు సైకిల్ వేసుకుని బయలు దేరాడు.ఈ లోగా మా పని సాగిపోతూనే ఉంది.ఓటర్ల పేరు ని తనిఖీ చేయడం,వేలికి చుక్క పెట్టడం,బేలట్ పేపర్ ఇవ్వడం  ఇలా పని ఆగకుండా నడిపిస్తూనే ఉన్నాము.మధ్యానం రెండు దాటింది.ఉన్నట్లుండి వాచ్ చూస్తే గుండె గుభేల్ మంది.మా సిబ్బంది బాటిల్ మీద బాటిల్ నీళ్ళు తాగుతున్నారు.వారితో బాటు నేను.ఇంతకీ వెళ్ళిన కుర్రాడు ఏమయ్యాడు..ఇంకా రాడే..!

ఇంతలో స్టేట్ అబ్జర్వర్స్ వస్తే వాళ్ళకి ఓటింగ్ జరుగుతున్న సరళిని చెప్పగా నోట్ చేసుకున్నారు.అదే సమయం లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్ది వచ్చాడు.వాల్ పోస్టర్ ని బయట అటు వేపు ఎందుకు అంటించారు అక్కడ ఎవరకి కనబడుతుంది అంటూ ఏదో ప్రశ్నించసాగాడు.అయ్యా మాకు ఉన్న ఆదేశాల మేరకే మేము అక్కడ అంటించాము అంటూ సర్ది చెప్పాము.ఎవరి హంగామా వాళ్ళది.బేలట్ బాక్స్ రంద్రం చిన్నగా ఉంది..ఇంకొంచెం పెద్ద గా ఉంటే బాగుంటుంది అంటూ మరో ఓటర్ యొక్క సూచన.సరే..పై వాళ్ళకి చెపుతాములే..అది మేము చేసేది గాదు అంటూ అనునయించాను.
మా అందరి సిబ్బంది మొకాల్లో కళ తప్పింది.ఆకలి బాధ తో అల్లాడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి.అన్నట్టు ఈ కుర్రాడు ఎక్కడ..ఇంతసేపు పోయాడేమిటి అన్నట్టు గా ఒక ఏజెంట్ ని చూశాను.అతను ఇబ్బంది గా  మొకం పెట్టి ఓ సారి కిటికీ లో నుంచి చూశాడు.వాడి జాడ లేదు.అన్నం లేకపోయినా కేవలం నీళ్ళు తాగి కొన్ని రోజులపాటు మనిషి బతకవచ్చుననే విషయం గుర్తొచ్చి ఊరట గా ఫీలయ్యాను.బాటిల్ ఎత్తి యధాశక్తి దానిలోని నీళ్ళన్నీ తాగేశాను.మా సిబ్బంది కూడా అదే బాట లో నడిచారు.వాడిన తోటకూర లా అయిపోయాయి మా మొకాలు.ఏజెంట్ లు కూడా ఏం చెయ్యాలో అర్ధం కాక అదోలా అయిపోయారు.ఈలోగా ఈ ఏజెంట్లని రిలీవ్ చేయడానికి కొత్త ఏజెంట్లు వచ్చారు.వాళ్ళు పోతూ పోతూ ..ఆ కుర్రాడిని మేం తొందరగా పంపిస్తాం సార్ మీరు వర్రీ గాకండి అన్నారు.ఏడవలేక నవ్వి ఊరుకున్నాను.

సమయం సాయంత్రం  అయిదు అయింది.గేటు మూసేసి లోపల ఉన్న ఓటర్లకి స్లిప్ లు ఇచ్చాము.మొత్తానికి ఓటింగ్ కార్యక్రమం విజయవంతం అయింది.బేలట్ బాక్స్ కి సీల్ వేసి ఆ తర్వాత ఏజెంట్లకి సర్టిఫికెట్లు ఇచ్చేశాం, వాళ్ళు వెళ్ళిపోయారు.సామాగ్రి అంతా సదురుకున్నాము.ఇక మమ్మల్ని తీసుకు వెళ్ళే ప్రభుత్వ వాహనం కోసం ఎదురుచూస్తున్నాం.బేలట్ బాక్స్ ని,తదితర పేపర్ అకౌంట్ లని డివిజన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కౌంటర్ లో మేం అప్పగించాలి.అప్పుడు మా పని పూర్తి అవుతుంది.
ఆ కార్యక్రమం అంత తొందరగా పూర్తి అవదు.మా లాగే వచ్చిన సిబ్బంది చాలామంది ఉంటారు గదా,ఒక్కో బూత్ వారీ గా వాళ్ళు అడిగిన క్రమం ప్రకారం అప్పగించాలి.పేపర్ సీల్ అకౌంట్ మిగతా పత్రాలు అన్నీ తనిఖీ చేసి తీసుకుంటారు.అంతా కలిపి రాత్రి పది దాటినా దిక్కు లేదు.ఆ ఏజెంట్ లు పంపిన కుర్రాడు రొప్పుకుంటూ వచ్చాడు సైకిల్ మీద.ఏమిటి ఇంత ఆలశ్యం అయిందని అడిగితే అక్కడ టిఫిన్ రడీ గా ఉండదు.చేయించుకొని వచ్చాను.అందులో మళ్ళీ వస్తూంటే సైకిల్ కి పంక్చర్ పడింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఏం చేస్తాం ..ఇక..!సరే ..మీరు కానివ్వండి అంటూ మిగతా మా సిబ్బంది కి చెప్పాను.వాళ్ళు తలా నాలుగు బోండాలు తిని మంచి నీళ్ళు తాగి బతుకు జీవుడా అంటూ ఓ మూలకి పోయి కూర్చున్నారు.ఈ లోగా నేను బయటకి వెళ్ళాను లఘుశంక తీర్చుకోడానికి..!లోపలికి వచ్చేప్పుడు కాళ్ళూ మొహం చేతులు శుభ్రంగా కడుక్కున్నాను ఆ టిఫిన్ ని లోపల వేసుకోడానికి..!మీ వాటా టిఫిన్ ఆ కిటికీ దగ్గర పెట్టాం సార్ అన్నాడు మా పోలింగ్ ఆఫీసర్.తీరా వెళ్ళి చూస్తే దాని మీద లటుక్కున ఓ బల్లి దూకింది గోడ మీద నుంచి.ఓరి దేవుడా దీనికీ సమయం ఇప్పుడే దొరికిందా అంటూ నవ నాడులూ కుంగిపోయాయి.
అంతలోనే మమ్మల్ని తీసుకు వెళ్ళడానికి ప్రభుత్వ వాహనం వచ్చింది.దానిలో అప్పటికే మా రూట్ లో ఉన్న ఇతర బూత్ ల సిబ్బంది కొంతమంది ఎక్కి కూర్చొని ఉన్నారు.టిఫిన్ ని తినబుద్ధి కాలేదు.బయట పారేశాను.అదీ కంటి తో ఆ బల్లి ని దాని మీద చూసిన తర్వాత ఇహ నా వల్ల కాలేదు.మా పోలింగ్ సామాగ్రి అంతా సర్దుకుని బస్ ఎక్కేశాము.ఆ గ్రామం సరిహద్దులు దాటుతూ బై బై చెప్పాను.ఈ గ్రామం నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది.ఇలాంటి అత్యవసర విధి నిర్వహణ లో భాగంగా ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్త గా మనకంటు కొంత ఆహార పదార్థాల్ని తీసుకు వెళ్ళాలి లేదా ఇదిగో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది తెలిసి వచ్చింది.

బస్ రివ్వున సాగిపోతోంది.నాకు తెలుసు ఈ మాత్రం ఆకలి కి మనిషి మరణించడు.ఆ ఎరుక కలగగానే హాయి గా అనిపించి బాటిల్ లోని ఇంకొన్ని మంచి నీళ్ళు తాగాను.కిటికీ లోనుంచి చూస్తే దారి పొడుగూతా అరణ్యం.అలా పోతూనే ఉన్నది మా బస్సు.(సమాప్తం) ---మూర్తి కె.వి.వి.ఎస్. 

Thursday, September 20, 2018

కిష్కింద కాండ (కధ)--మూర్తి కెవివిఎస్

కిష్కింద కాండ (కధ)--మూర్తి కెవివిఎస్

వెంకట్ మేష్టార్ని ఆ కోతి కరవకపోయి ఉన్నట్లయితే ఇంత దాకా వచ్చేది కాదు.వాటికి ఇప్పుడు కౌంట్ డౌన్ ప్రారంభమయింది.అలాగని వాటిని తుదముట్టించే పనులేం చేయట్లేదు సుమా ...!ఎలాగైనా సరే వాటిని బంధించి ఏ వ్యాన్ లోనో ఎక్కించి చత్తిస్ ఘడ్ బోర్డర్ లో ఉన్న దట్టమైన అడవుల్లో వదిలేసి రావాలని ఊరంతా కలిసి నిర్ణయించుకున్నాం.ఒకటా రెండా ముప్ఫై కి పైనే ఉంటాయి చిన్నవీ పెద్దవీ అన్నీ కలిపి..!ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది చూస్తున్న కొద్దీ.మొదట్లో రెండో మూడో కనిపిస్తే పోనీలే వాటి మానాన అవే తిరుగుతున్నాయి,ఎవర్నీ ఏమి అనకుండా అనుకునేవాళ్ళం.కానీ అవి తమ పరిధిల్ని దాటుతున్నాయి.తాము నిజమైన కోతులమని నిరూపించుకుంటున్నాయి.
ఎలెక్ట్రానిక్,ప్రింట్ మీడియా మిత్రులు ఈ కోతుల అలజడి గురించి ఓ స్టోరీ చేసుకుంటాం అంటే రమ్మని చెప్పాను.ఆ విధంగా అయినా వీటి ఆగడాలు అధికారులకి ఊరి జనాలకి తెలుస్తాయని నా ఆశ.ఎందుకంటే వీటి మీద స్ట్రిక్ట్ చర్య తీసుకోడానికి చాలామంది సెంటి మెంట్ గా ఫీలవుతున్నారు.కొంతమంది వీటికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు.అదీ సంగతి.
బెల్ కొట్టారు.పిల్లలు బిల బిల మంటూ క్లాస్ గదుల్లోనుంచి వస్తున్నారు.సరిగ్గా అదే సమయానికి మీడియా మిత్రులు కూడా తమ కెమెరాల తో స్కూల్ లోపలకి వచ్చారు.అంతా కలిసి నలుగురు ఉంటారు.వారిని ఆహ్వానించాను.
"రండి.మంచి వేళ కి వచ్చారు..అలా అటు వేపు పోదాం" అంటూ  వారిని తీసుకుని ముందుకి నడిచాను.కిచెన్ కి దగ్గర గా ఉన్న ప్రాంతం వైపు నడిచాము.స్కూల్ ప్రాంగణం అంతా కలిపి రెండు ఎకరాలు దాకా ఉంటుంది.చెట్లు కూడా చాలా ఉండి చల్లగా ఉంటుంది వాతావరణం.
ఆశ్చర్యం.ఒక్క కోతీ లేదు.కనీసం చిన్న పిల్ల కోతి కూడా..!ప్రతి రోజూ ఈ టైము కి వచ్చేవి ,ఎక్కడికి పోయాయి ఈ రోజు..?వీళ్ళు వస్తున్నట్లు వాటికి ముందే తెలిసి పోయిందా ...!వింత గానే ఉంది.

" ఏది మేస్టారూ...ఏవీ కోతులు..ఎక్కడా కనబడటం లేదు.ఈ టైము కి ఠంచన్ గా వచ్చేస్తాయని చెప్పారు" ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు.

" అదేనండి..నాకూ వింత గా ఉంది.అసలు ఈ పాటికి వచ్చేస్తాయి రోజు.కొన్ని చెట్టు కొమ్మలు పట్టుకుని ఊగుతూ ఆడుకుంటూ ఉంటాయి.కొన్ని గోడ మీద తిరుగుతూ హడావిడి చేస్తుంటాయి.సరిగ్గా పిల్లలు అన్నాలు తినేసి లోపలకి వెళ్ళగానే వాళ్ళు పారేసిన మిగిలిన అన్నపు మెతుకులు తిండానికి దిగుతాయి.." వివరించాను.

" గమ్మత్తు గా ఉంది.మా రాకని పసి గట్టాయా ఏమిటి" ఇంకోతను అడిగాడు.

"అయినా అయి ఉండచ్చు.మీరు కెమేరాలు అవి తీసుకు వచ్చారు గదా ..చూసి ఈ కొత్త వ్యక్తులు హాని తలపెడతారేమో నని ఊహించాయేమో" అన్నాను.

ఆ తర్వాత రమారమి రెండు గంటలు పాటు వాళ్ళు పడిగాపులు కాశారు.ఒక్క కోతీ జాడ లేదు.ఇక చేసేది లేక సరే మళ్ళీ ఎప్పుడైనా వస్తాం అనేసి మీడియా మిత్రులు వెళ్ళిపోయారు.కాని అప్పటి నుంచి ఈ కోతుల జీవన శైలి మీద నాకు ఆసక్తి పెరిగింది.వాటికి మనలా నోరు లేదనే గాని ఎంత తెలివి.ఎంత కలిసి కట్టుగా కూడబలుక్కున్నట్లుగా జాడ లేకుండా పోయాయి.ఇంకా గొప్ప విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం బడి విడిచి పెట్టే వేళకి అవి ఒక్కొక్కటే రాసాగాయి.అమ్మ భడవల్లారా ..ఏమి చాకచక్యం..నాకు మతి పోయింది..!
అసలు వీటి జీవన శైలి ఏమిటి అని నాకు ఆసక్తి పెరిగింది.ఆ రోజు నుంచి ఏ మాత్రం వీలు దొరికినా వాటిని గమనిస్తుండేవాడిని.నేను డిగ్రీ చదివే రోజుల్లో జాక్ లండన్ రాసిన "వైట్ ఫాంగ్ " అనే ఓ పెద్ద కధ చదివాను.ఒక  కుక్క తన ఆత్మ కధ రాసుకుంటే తన కష్ట సుఖాల్ని ఇంత ఇది గా రాసుకుంటుందా అనిపించింది.తీసిపారేస్తాం గాని ప్రతి జీవి తన జీవన పోరాటాన్ని నోరు విప్పి చెపితే ఆ గాధ ఏ మనిషి పోరాటానికీ తీసిపోదు.నిజం చెప్పాలంటే మనకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్ని అవే ఎదుర్కుంటూ ఉంటాయి.

ఒక రోజు నేను  మా పాఠశాల ఎదుట ఉన్న కానుగ చెట్టు నీడ లో కూర్చొని ఉన్నాను.ఆ రోజు ఏదో విషయం మీద భారత్ బంద్.ఆందోళనకారులు వచ్చి పిల్లల్ని పంపించివేశారు.ఇక మేము ఎలా ఉండవలసిందే..ఖాళీ గా..!కుర్చీ వెనక భాగం లో ఏదో కదిలినట్టయితే వెనక్కి తిరిగి చూశాను.ఒక కోతి.బలం గా నే ఉంది.అది గాని దాడి చేస్తే చేసేది నాస్తి.

నేను దాన్ని  చూసి చూడనట్లు గానే ఏటో చెట్టు పైకి చూడసాగాను.ఆ కోతి నా ముందు కి వచ్చింది.దాని కళ్ళ లో ఒక చంటి పిల్లవాడిలో ఉన్న అమాయకత్వం.ఏ మాత్రం ఆందోళన చెందకుండా నా తో ఇంకో మనిషే ఉన్నాడు అనే ధ్యాస లో నేను ఉన్నాను.దానిని బెదిరించదలచుకోలేదు.సరే..అది కరిచినా ఫరవాలేదు ..ఏమైతే అది కానీ ..అని నిశ్చలం గా ఉన్నాను.నన్ను అది తదేకం గా పరిశీలించసాగింది.ఏమిటి వీడు నా మీదికి కళ్ళు ఉరిమి చూడటం లేదు.కర్ర తీసుకు రావడం లేదు.అలా ప్రశాంతం గా ఉన్నాడు.అసలు మనిషా..బొమ్మా ..అని తర్కించుకుంటున్నదేమో..!

ఓ రెండు నిమిషాలు గడిచాయి.నాకే ఆ మౌనం ని భగ్నం చేయాలనిపించింది.

" ఇక్కడ ఏమీ లేదు తినడానికి.ఈ రోజు మిడ్ డే మీల్స్ కూడా లేదు నీకు.సెలవనుకో ఈ రోజు సరేనా.." నెమ్మెది గా దానివైపు చూస్తూ అన్నాను.దానికి భాష తెలుసా అంటే ఏమీ చెప్పలేను.అలా అనిపించి అన్నాను.

ఆ మాట కి కోతి చిన్న గా కళ్ళు చికిలించిది.కొద్ది గా నోరు తెరిచి మళ్ళీ మూసి చప్పరించింది.ఏదో ఆలోచిస్తున్నట్లు గా మౌనం గా ఉండిపోయింది.ఏ చప్పుడూ చేయలేదు.కాసేపాగి ఏదో తప్పు చేసిన పిల్లాడిలా తల వంచింది.మళ్ళీ తల ఎత్తి నాకేసి అలాగే చూసి మెల్లిగా వెళ్ళిపోయింది.
అయితే ఆ తెల్లవారి బడి కి వెళ్ళగానే ఓ చెడు వార్త.అది కోతి కి సంబందించినదే. ఎనిమిదవ తరగతి పిల్లవాడిని కోతి గాయపరిచింది.వెళ్ళి చూస్తే దారుణం గా ఉంది.వాడి కాలి మీద కోతి పళ్ళ గాట్లు దిగి ఉన్నాయి.రక్తం వస్తోంది.వెంటనే మా స్కూల్ పక్కనే ఉన్న పిహెచ్సి కి తీసుకెళ్ళి ప్రాధమిక చికిత్స చేయించి ఇంటికి పంపించి వేశాము.

నాకు మతి పోయింది.ఇదేమిటబ్బా ఇవేళ ఈ పిల్లాడిని కరిచింది.నిన్న నాతో బాగానే ఉందే ఆ కోతి.పిచ్చి గాని చాలా కోతులు ఉన్నాయి.ఏదని గుర్తుపట్టి దానికి కౌన్సిలింగ్ ఇస్తాం..?అసలు ఎందుకు కరిచిందో..!నాలో ఆసక్తి మొదలైంది.వెంటనే ఎనిమిదవ క్లాస్ కే చెందిన శ్రీను ని పిలిచాను.

" శ్రీను...ఎందుకురా కోతి కరిచింది..వాడిని ?" ప్రశ్నించాను.

" ఏమో సార్...వాడు బస్ దిగి స్కూల్ లోపలకి వస్తూంటే పక్కనే పొంచి ఉండి కరిచింది..." అన్నాడు శ్రీను.

" మొన్న ..ఆ మధ్య ఈ రంజిత్ గాడు కొన్ని కోతుల్ని రాళ్ళు వేస్తూ తరిమాడు సార్.." పక్కనే ఉన్న ఇంకో కుర్రాడు చెప్పాడు.

"అదీ ...విషయం.అంటే అది జ్ఞాపకం పెట్టుకుని రంజిత్ ని వొంటరి గా దొరికిన సమయం లో ఓ పీకు పీకిందన్నమాట" ఆశ్చర్యపోయాను.

"అంతే కావచ్చు సార్" అన్నాడా కుర్రాడు.

"అనవసరం గా వాటివెంటబడి కొట్టకండి ...మనం హాని తలపెట్టము అనే ఆలోచన వాటికి కలిగినప్పుడు అవీ మనని ఏమనవు.." చెప్పాను.అలా చెప్పానే గాని లోపల నాకూ బెరుకు గానే ఉంది.
ఇంటర్వెల్ సమయం లో స్టాఫ్ రూం లో ఉండగా ఈ విషయమే చర్చ కి వచ్చింది.మా సీనియర్ రామేశ్వర రావు గారు వెంటనే తన అనుభవాల్ని చెప్పుకొచ్చారు.గతం లో ఆయన నారాయణ పురం అనే ఊరి లో పనిచేస్తున్నప్పుడు కోతుల తో తనకి ఉన్న అనుబంధాన్ని వివరించారు.

"అవి చాలా తెలివైనవండి బాబు.ఆ రోజుల్లో నేను పని చేస్తుండే ఆ ఊరి లోనే కాపురముండేవాడిని.మా ఇంటి ప్రాంగణం మామిడి చెట్లు ఇంకా ఇతర చెట్ల తో కళ కళ లాడుతూ ఉండేది.ఒక కోతుల గుంపు ఎప్పుడూ వాటి మీదే తిరుగుతుండేది.అయితే ఒకటి...సరిగ్గా మధ్యానం వొంటి గంట కి నేను భోజనానికి ఇంట్లోకి అడుగుపెడుతుంటానా...ఆ సమయం లో అవి అన్నీ చాలా క్రమశిక్షణ గా నాకు ఎదురు రాకుండా ఒద్దికగా ఓ పక్కన ఉండేవి.నేను భోజనం చేసి స్కూల్ కి వెళ్ళిపోగానే మళ్ళీ ఆ చెట్ల మీద ఇష్టారాజ్యంగా దూకూతూ పాకుతూ కిష్కింద కాండ ని తలపించేవి.ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ ఊళ్ళో కొంతమంది కి చికాకు లేచి వీటిలో కొన్ని కోతులకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు.చిన్న వాటిని కూడా మట్టుబెట్టారు.బహుశా వాటి తల్లి కోతులనుకుంటా ...అందినవారినల్లా కోపం తో కొరికి పారేశాయి.దానితో ఊరి జనాలు ఇంకా ప్రిష్టేజ్ గా తీసుకుని వీటినన్నిటినీ చంపివేశారు.మీరు నమ్మరు...అలా జరిగిన ఏడాది లోగానే ఆ ఊరు అన్నిరకాలుగా దెబ్బతింది.రకరకాల కారణాలతో ఆ చంపిన వాళ్ళంతా ఊరు విడిచి పెట్టి పోవలసిన పరిస్థితి ఏర్పడింది.." చెప్పుకుపోతున్నారు రామేశ్వర రావు గారు.

" అది సరే...ఈ కోతులు ఇప్పుడెందుకని ...పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రతి చోటా విస్తరించి చికాకు చేస్తున్నాయి.మా చిన్నతనం లో ఎవరో కోతులు ఆడించే వాళ్ళదగ్గర తప్పా బయట ఎక్కడా కనిపించేవి కావు.నేను ఆ మధ్య బెంగుళూరు వెళ్ళాను.అక్కడా అదే బాధ.మా ఇంట్లోకి వచ్చి ఫ్రిజ్ తీసి ఫ్రూట్స్ అవీ కూడా ఎత్తుకుపోతుంటాయి అని వాపోతున్నారు అక్కడి మిత్రులు"

"అక్కడిదాకా ఎందుకు...?మొన్న మా ఇంట్లోకే ఓ కోతి వచ్చింది"

"ఆ..అప్పుడు ఏమయింది" ఆసక్తి గా అడిగాను.

" వాటితో ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి.వాటిని రెచ్చగొట్టకుండా ఉంటే వాటి పని అవి చేసుకుపోతాయి.మా ఆవిడ దాన్ని చూసి అరవబోయింది.సైలెంట్ గా ఉండమని సైగ చేశాను. ఇద్దరం కాసేపు అలాగే మాకు ఏమీ తెలీదు అన్నట్లు ఉండిపోయాము.అది అక్కడా ఇక్కడా వెతుక్కుని కొన్ని బియపు గింజలు బుక్కి వెళ్ళిపోయింది..మనం మనుషులము ,వాటికన్నా కొన్ని మెట్లు పైన ఆలోచించాలి తప్పా ..అవీ మనం ఒకే వేవ్ లెంగ్త్ లో ఆలోచిస్తే ఎలా "

"అది కరెక్టే సార్.అలాంటి అనుభవమే నాకు  జరిగింది.మరి వీటిని జనారణ్యం నుంచి ఎలా బయటకి పంపించడం..?"

" ఏ అరటిపండు లోనో మత్తు మందు పెట్టి ,అవి తిన్నాకా వ్యాన్ లో తీసుకు వెళ్ళి మన కి దగ్గరలో ఉన్న అరణ్యాల్లో వదిలిపెట్టడమే సరైన పని.చుట్టుపక్కలా గ్రామాలు లేకుండా ఉన్న అరణ్యాల్లో వదిలెయ్యాలి.."
ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళతో మాటాడాం.అందరూ సహకరిస్తామని చెప్పారు.ఈ కోతుల్ని పట్టి బంధించి వేరే దూర ప్రదేశాల్లోని అరణ్యం లోకి పంపించడానికి ఏర్పాట్లు చక చకా జరిగాయి.దానికి కావలసిన మనుషులు పని వత్తిడి లో ఉండటం వల్ల నాలుగు రోజులు పోయిన తర్వాత వస్తామని కబురెట్టారు.నెమ్మెదిగా సమస్య ఓ దారికి వస్తున్నట్లే..!

కిటికీ లోనుంచి చూస్తే హాయి గా విహరిస్తున్నాయి వానరాలు.ఒక కోతి పొట్టకి దాని పిల్ల కోతి అతుక్కు పోయినట్లుగా పట్టుకుని ఉంది.ఆ తల్లి కోతి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ కి ఇష్టం వచ్చినట్లుగా చెంగు చెంగు న దూకుతోంది.ఆ పిల్ల కోతి ఎక్కడ పడుతుందో అని అదే పనిగా చూడసాగాను.అబ్బే ...అది పట్టుకోవడమూ పర్ఫెక్ట్..ఇది దూకడం లోనూ పర్ఫెక్ట్.రెండూ రెండే.ఇంకో కోతి యేమో తీరిగ్గా పడుకుని ఉన్న మరో కోతి దగ్గరకి పోయి దానికి పేనులు చూస్తున్నట్లు చర్మం మీది వెంట్రుకల లోనుంచి పీకసాగింది.కాసేపున్నాక ఈ పీకించుకున్న కోతి తనకి సేవ చేసిన కోతి కి పేలు చూడసాగింది.ఎంత స్నేహ ధర్మం..!మిగతావి అన్నీ రకరకాల భంగిమల్లో విహరిస్తున్నాయి.ఏదీ కుదురు గా ఉండటం లేదు.

ఉన్నట్లుండి ఒక పిల్ల కోతి కీచ్ కీచ్ మంటూ మొత్తుకుంది.ఇక చూడండి...ఎక్కడెక్కడ కోతులన్నీ గుర్ గుర్ అంటూ దీని దగ్గర కి పరిగెత్తుకొచ్చాయి.వాటి భావి తరాల పట్ల ఎంత సమ్రక్షణా భావం..!అసలు సంగతి ఏమిటంటే ఓ కుక్క పోతూ పోతూ పిల్ల కోతిని చూసి బెదిరించింది.అందుచేత పిల్ల కోతి అరిచింది.సరే...ఇవన్నీ దగ్గరకి చేరుతుండడం తో ఆ కుక్క తోక ముడిచి పారిపోయింది.
నాలుగు రోజులు గడిచిన తర్వాత అనుకున్నట్లుగానే వానరాల్ని తీసుకెళ్ళిపోయారు.ఇప్పుడు మా బడి అంతా ప్రశాంతం గా ఉంది.మిడ్ డే మీల్స్ సమయం లో వానరాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండే సన్నివేశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.అందరం ఊపిరి పీల్చుకున్నాం.ముఖ్యం గా కోతి కరిచిన వెంకట్ మేష్టారు చాలా సంతోషించారు.ఈయన్ని మాత్రమే ఎందుకు కరిచాయి మిగతా మేష్టార్లని వదిలి పెట్టి అనుకుంటున్నారా..? దానికీ ఓ చిన్న కత ఉంది.

ఈయన ఎప్పుడూ బల్లెం లాటి ఒక పొడవాటి కర్ర పట్టుకుని కోతి ఎక్కడ కనిపించినా గెదిమి పారేసేవాడు.అందితే దెబ్బలు కూడా వేసేవాడు.మిగతా వాళ్ళు ఎంత చెప్పినా వినేవాడు కాదు.కోతి కి భయపడే వాడు ఏం మనిషండీ అంటూ మిగతా వాళ్ళని హేళన చేసే వాడు.ఐతే అవి గొప్ప ప్లాన్ వేశాయి ఓ రోజున.మధ్యానం మూడు గంటల సమయం లో మిగతా వాళ్ళంతా ఎవరి క్లాస్ ల్లో వాళ్ళు బోధిస్తున్నారు.ఆ రోజు హెడ్ మాస్టర్ గారు సెలవు.ఈయన ఒక్కడే ఆఫీస్ రూం లో ఏదో రాసుకుంటున్నాడు.మరి అవి ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకున్నాయో యేమో గాని సుశిక్షితులైన సైనికుల్లా ముప్పేట దాడి చేశాయి ఈయన మీదకి..!

అంటే ఒక కోతుల బ్యాచ్ గది ఎడమ వైపు నుంచి దూసుకురాగా,ఇంకో బ్యాచ్ కుడి వైపు నుంచి వచ్చింది.మరొక బ్యాచ్ సరాసరి గది లోకి ప్రవేశించి ఎటాక్ చేశాయి.దానితో మన మేష్టారికి తప్పించుకునే వీలు లేకపోయింది.చెడా మడా కరిచి పారేసి తమ కసి ని తీర్చుకున్నాయి ఆ వానరాలు.మేష్టారి హాహాకారాలు మిన్ను ముట్టడం తో మిగతా స్టాఫ్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు.అందర్నీ చూసి అవి నిష్క్రమించాయి.అవి దాడి చేసిన ముప్పేట విధానాన్ని మేష్టారి నోట్లోంచి వింటుంటే ఆయనతో బాటూ మాకు కూడా వళ్ళు కంపించింది. ఇహ ఎలాగైనా వీటికి మంగళం పాడాలని అప్పుడే మేం నిర్ణయించుకున్నాం.

"మరి అందుకే ..అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే అలనాడు వాల్మీకి ఆంజనేయుణ్ణి ఆ విధంగా వర్ణించాడు" అంటూ ముక్తాయించాడు మారుతీ భక్తుడైన ఓ మేస్టారు.
ఆ రోజు ని తల్చుకుంటూ వెంకట్ మేస్టారు బిక్కు బిక్కున గడిపేవారు.మొత్తానికి ఈ రోజుకి వాటి  టైం వచ్చింది.మత్తు అరటి పళ్ళు తిన్న ఆ కోతులన్నిటిని వ్యాన్ లో వేసుకుని తీసుకుపోయారు...మనుషులు..!" సార్ ..ఇక మీదట మీరు భయం లేకుండా గడపండి" అన్నాం ఆయన తో..!ఆనందం గా నవ్వాడు ప్రతి గా...!

కొన్ని నెలలు గడిచిపోయాయి.వర్షా కాలం...!  ఆ రోజుల్లో అటాచ్డ్ బాత్ రూంస్ అవీ లేవు.ఓ రోజు రాత్రి పూట లఘుశంక నిమిత్తం లేచి బయటకి వచ్చాను.మా డాబా కి వెనుక భాగం లో సన్ షేడ్ మీద ఏదో మెదిలి నట్లు అయింది.తల ఎత్తి పైకి చూశాను.ఒక కోతి దగ్గరకని ముడుచుకుని కూర్చుని ఉంది.దాని పొట్ట ని కౌగిలించుకుని ఒక పిల్ల కోతి ఉంది.ఏదో తప్పు చేసినట్లు గా నా వేపు చూసింది పెద్ద కోతి.పిల్ల కోతి మొహం అవతల వేపు ఉంది.మీరు అక్కడే ఉండండి.ఈ వాన లో మిమ్మల్ని ఎక్కడకి పంపనులే ..అనుకుని ,నా పని చూసుకుని లోపలకి వెళ్ళిపోయాను.

తెల్లవారింది.బయటకి వచ్చి మళ్ళీ ఆ సన్ షేడ్ మీద చూశాను.రాత్రి కనిపించిన కోతులు ఉన్నాయేమోనని..!లేవు...!వెళ్ళిపోయాయి.ఆ తర్వాత వర్షం పడిన ప్రతి రాత్రి అక్కడ చూస్తూనే ఉన్నాను.అవి మళ్ళీ ఎప్పుడూ రాలేదు. (సమాప్తం) (Written by Murthy K v v s )

Monday, August 6, 2018

కొట్టాయం (కధ) --మూర్తి కెవివిఎస్

కొట్టాయం (కధ) --మూర్తి కెవివిఎస్

పొగడ పూల వాసన ఎటునుంచో...గాలి లో తేలుతూ వచ్చి నాసికా పుటాల్ని తాకింది.ఒక్కసారి గా ఏవో పాత జ్ఞాపకాలు ఉన్నట్లుండి ముప్పిరిగొన్నాయి.నిన్న మొన్నటివి కావు.ఎక్కడో అణిగి మణిగి ఉన్న ఆలోచనలు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి.ఏవిటి...ఆ పూల సువాసన మస్తిష్కంలోని దొంతరల్లోకి ఎలా ప్రవేశించి నిద్రోతున్న గతాన్ని జీవింపజేయగలదు అని ఎవరైనా అడిగితే సమాధానం అంత సంతృపికరం గా చెప్పలేను.కాని అది ఒక ఇంద్రజాలం.
ఉమ ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా కొన్ని సార్లు అలాజరిగిపోతుంది.అంతే.కొన్ని కాలానికి వదిలేస్తామా...కాలం మరిచిపోదు.తగిన సమయం లో తాను చేయవలసిన పని తాను చేస్తుంది.కొన్ని సార్లు దాన్నే విధి అని కూడా అంటాము.సరే ..ఏదైనా కానీ ..!జరిగింది అయితే అది.మంచికా..చెడుకా ..ఇంకో అందుకా ...చెప్పలేను ఒక మాట లో..!

కాలేజీ రోజులు గుర్తు కు వస్తే ఉమ లేకుండా ఆ  జ్ఞాపకాలు ముగియవు.పాటల కోకిల ఆమె గూర్చి మరో మాట లో చెప్పాలంటే..!ఇంకా ఏవో ఊహించుకోవద్దు.అక్కడ ప్రేమా దోమా లాటివి ఏమీ లేవు.అంత సాహసం చేసే రోజులు కావవి.అయితే ఆమె లో ఏదో ప్రత్యేకత ఉంది.అదే ఉమ పట్ల ఆకర్షణ కి లోను చేసింది.అది ఇప్పటికీ అంతరంతరాళాల్లో కొనసాగుతూనే ఉన్నది.అదిగో అలాటి సమయం లోనే మళ్ళీ ఆమె కనిపించి ఆ రోజుల్ని జ్ఞప్తికి తెచ్చింది.

కొంత సాహసం చొరవ వంటివి తోడయితే ఆ రోజుల్లో మాది ఓ ప్రేమ కధ గా రూపొంది ఉండేదేమో...ఇంకా ఏమేమి జరిగి ఉండేవో ఇప్పుడు ఊహించలేను గాని ఏదో ఒక గుర్తు ఉంచుకునే విషయమే జరిగి ఉండేదేమో..!అయితే ఒకటి...ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళందర్నీ ఒకే గాటన గట్టను గాని ..అసలు నిజంగా ప్రేమించిన వాళ్ళని పెళ్ళి చేసుకోవడం అందరకీ కలిసిరాదు కూడా ..!ఒకే ఇంటి కప్పు కింద రొటీన్  జీవితం ప్రారంభించిన తర్వాత ఒకరి మీద ఒకరికి విరక్తి కలిగి విడిపోయే స్థితికి రావడం..ఎంతమందిని చూడలేదు..!గనక కొన్ని సార్లు ప్రేమ ఫలించకపోవడమే మధురం..అది కొంత కాలం పోయిన తర్వాత గాని తెలియదు.
"ఆర్ యూ స్టిల్ ఇన్ రెవ్ రి...వస్తున్నావా... మీటింగ్ మొదలయింది" అడిగాడు జోస్.

"లేదు.చిన్న పని ఉంది.కాసేపటిలో జాయిన్ అవుతా.నువు నడువు"చెప్పాను.

నేను ఊహా లోకం లో తేలుతున్నట్లు ఇతను ఎలా కనిపెట్టాడు.ఈ మళయాళీలు చురుకయిన వాళ్ళే.తెరిచి ఉంచిన ఆ కిటికీ ని మూసివేశాను.పొగడ పూల వాసన ఇపుడు లోనికి రావడం లేదు.ప్రస్తుతం నేను ఉన్నది ఒక కాలేజ్ హాస్టల్ లో...అంటే విద్యార్థి గా కాదు.ఒక డెలిగేట్ గా .!ఒక అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆహ్వానం మేరకు కేరళ లోని ఈ కొట్టాయం నగరానికి రెండు రోజుల క్రితం వచ్చాను.అతిథుల సంఖ్య ఎక్కువ గా ఉండటం తో కొంత మందికి బస ఇక్కడ ఏర్పాటు చేశారు.

సెయింట్ మార్తోమా సంస్థలకి చెందిన ఈ కాలేజ్ కేంపస్ విశాలం గా ఉన్నది.అటానమస్ విద్యాసంస్థ.మాకు బస ఇచ్చిన కాంప్లెక్స్ పక్కనే ఇంకో భవనం ఉంది.దాని ముందు "అరమన" అని రాసి ఉంది.దాని అర్ధం బిషప్ యొక్క ఇల్లు అని ట.జోస్ ఇక్కడ కి దగ్గర లో నే ఉన్న తిరువళ్ళా అనే ఊరి లో ఒక కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.ఈ మీటింగ్ ఏర్పాట్లు చూడటం,అతిథులను చూడటం ఇంకా ఇలాటి పనులు అన్నిటిలో నిర్వాహకులకి  సాయం గా ఉండటానికి తను ఈ కొట్టాయం వచ్చాడు.

జోస్ పూర్తి పేరు జోసెఫ్ పరంబిల్.ఇక్కడ నాకు గైడ్ లేని లోటు కూడా తన వల్ల తీరి పోయింది.కలిసి నిన్నంతా కొన్ని ప్రాంతాలు తిరిగాము.దేశం లోనే ఒక గమ్మత్తైన రాష్ట్రం కేరళ.అవసరానికి మించి ఇతరులతో మిత్రత్వం ని పెద్ద గా నెరపరు.ఆడంబరం తక్కువ.ఉన్నంత లో తమ పరిసరాల్ని అన్నిటి ని శుభ్రంగా ఉంచుకుంటారు.కేరళ లోకి మా రైలు ప్రవేశించడం తోనే పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు బిల బిల మంటూ మా కోచ్ ల్లోకి ప్రవేశించి వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు.దిన,వార, మాస పత్రికల నుంచి కధల పుస్తకాలు నవలలు ఒకటేమిటి అన్ని రకాల పుస్తకాల్ని జనాలు పరిశీలిస్తూ కొనసాగారు.వేరు శనక్కాయలు ,సమోసాలు లాంటివి సరే గాని ఈ సంస్కృతి వింత గానే తోచింది.కేరళీయుల పుస్తక ప్రేమ ఇక్కడనుంచే కనిపించింది.శాస్త్రి రోడ్ లోని ఒక హోటల్ లో మొదటి రోజు ఉండి ఆ తర్వాత ఇక్కడకి మారాను.ఎంత దూరం పోయి చూసినా పాన్ షాప్ లు ఎక్కడా కనపడలేదు గాని పుస్తకాల షాప్ లు మాత్రం బాగా ఉన్నాయి.ఇంగ్లీష్,మళయాళం పుస్తకాలు ఎక్కువగా కనిపించాయి.
మీటింగ్ జరుగుతున్న హాల్ లోకి ప్రవేశించాను.దక్షిణాది వారితో బాటు ఉత్తరాది వాళ్ళు,ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఉన్నట్లు తోచింది.ముఖ్య అతిధులు గా ఈ సంస్థ చైర్మన్ డేవిడ్ కొచెరిల్ తో పాటు మార్తోమా చర్చ్ కి చెందిన బిషప్ ఇంకా కొంతమంది ఉన్నారు.ఇక్కడ బిషప్ కి ఉండే ప్రాభవం ఒక కలెక్టర్ కంటే కూడా ఎక్కువ అని చెప్పవచ్చు.

నిశ్శబ్దం గా వెళ్ళి నాకు కేటాయించిన వరుస లో కూర్చున్నాను.గత సంవత్సరం చేసిన కార్యక్రమాల గురించి చర్చ నడుస్తోంది.

" మీరు ఎక్కడ నుంచి వచ్చారు..?" నా పక్కనే కూర్చున్న ఒకాయన్ని అడిగాను.నన్ను నేను పరిచయం చేసుకుంటూ ..!ఇక్కడ జరిగే సంభాషణలన్నీ ఇంగ్లీష్ లోనే సాగుతున్నాయి.అది వేరే చెప్పనవసరం లేదు.

"నేను బెంగళూరు నుంచి వచ్చాను...పేరు రామె గౌడ " అన్నాడతను చిరు నవ్వుతో.

" మీ ప్రాంతం లో సంస్థ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి.."

" మన చేతిలో ఉన్నది మనం చేస్తున్నాము.పరవా లేదు...ఎప్పుడైనా మా ఏరియా కి రండి"

"తప్పకుండా .."

మా వంతు వచ్చి మాటాడేసరికి సాయంత్రం దాటింది.విచిత్రం గా గౌడ కి కేటాయించిన రూం నా ముందు ఉన్నదే..గనక రాత్రి భోజనాలు అవడానికి ముందు ఏదైనా డ్రింక్ తీసుకుందాం రమ్మని ఆహ్వానించాడు.నేను సున్నితం గా తిరస్కరించాను.అయితే ఆ తెల్లారి పొద్దున స్నానాలు అవీ కానిచ్చేసి నా రూం కి వచ్చాడు.

" ఎలా గడిచింది రాత్రి.." అడిగాను అతడిని.

" సూపర్. మీరు కూడా వస్తే బాగుండేది..." అన్నాడు గౌడ.

" రాష్ట్రం దాటి వస్తే వాటన్నిటికి దూరం గా ఉండాలనేది నా ఫిలాసఫి ...దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి " చెప్పాను.

" ఒక రకంగా మంచిదే అది.ఈ రోజు మనని అందరని సైట్ సీయింగ్ ట్రిప్ కి తీసుకెళుతున్నారు.వస్తున్నారుగా .."

"అయ్యో రాకపోవడమా ...ఈ కేరళ లో చివరి దినాన్ని కాస్త ఆనందం గా నే ముగిద్దాము.."

పది గంటలకి మా బస్ లు బయలు దేరాయి.ముందుగా కుమారకోం వద్ద నున్న బర్డ్ సాక్చ్యూరి నుంచి మొదలు పెట్టి వెంబనాడ్ లో ని సముద్ర జలాల్లో  బోట్ షికారు ఆ తరవాత వైకోం లోని ఓ ప్రాచీన ఆలయం అలా చూసుకుంటూ పోతున్నాం.ఏ వైపు చూసినా పచ్చదనమే పచ్చదనం.ఇవి చాలవన్నట్లు ఇళ్ళలో కూడా తోటల పెంపకం.అసలు ఎక్కడకి వెళ్ళినా మతి పోయే పచ్చదనం..అడవుల మధ్యన ఇళ్ళూ కట్టుకుని నివసిస్తున్నారా వీళ్ళు అనిపించింది.ప్రకృతి ఇచ్చినదాన్ని కాపాడుకోవడం కూడా ఓ గొప్ప విషయమే.ఇది చాలాదన్నట్లు ఊర్ల మధ్య లోకి చొచ్చుకు వచ్చిన సముద్ర జలాలు.ఒక వీధినుంచి మరో వీధి లోకి పోవాలంటే కొన్ని మార్లు పడవ దాటి వెళ్ళవలసిందే.
బస్ లో రామె గౌడ,నేను పక్క పక్క నే కూర్చున్నాము.

"ఇది వరకు ఎప్పుడైనా కేరళకి కి వచ్చారా మీరు" ప్రశ్నించాను.

"అనేక సార్లు వచ్చాను.నా వైఫ్ ది ఈ రాష్ట్రమే.అయితే వాళ్ళు కర్నాటక లో స్థిరపడ్డారు.కాబట్టి వస్తూనే ఉంటాము.." చెప్పాడు రామె గౌడ.

" చాలా అదృష్టవంతులు.ప్రకృతి మధ్యలో గడిపే అవకాశం...మీకు బాగానే లభిస్తుంది .."

"ఈ కేరళ కి ఉన్న ఆస్తులు రెండే రెండు ..ఒకటి విద్య రెండవది ప్రకృతి సంపద.పెద్ద పెద్ద పరిశ్రమలు చాలా తక్కువ  "

"కనుకనే ప్రకృతికి సంబందించి పర్యాటక రంగం లో ముందున్నది.దేశం లో కెల్లా గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ గా కేరళీయులే ఉన్నట్లు ఒక సర్వే..."

"ఆ వ్యవహారాలు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖయే ఈ రాష్ట్రం లో ఉన్నది.ఎక్కువ ఆదాయం ఆ విధం గానే వస్తుంది"

బస్ రివ్వున సాగిపోతోంది.రోడ్డు కి అటూ ఇటూ ఎత్తుగా పెరిగిన రబ్బరు చెట్లు.చెట్ల కి చుట్టూతా కట్టిన ముంతలు.గ్రామాల లోని,పట్టణం లోని వాతావరణం అంతా పచ్చ గా నే ఉన్నది.జనాలు ఇంటి ముందు నిలబడో కూర్చొనో మాట్లాడుకునే దృశ్యాలు కనబడటం లేదు.కొన్ని ఇళ్ళు నిర్జనం గా ,తాళాలు వేసి కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని గౌడ ని అడిగాను.

" మెరుగైన సంపాదన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం వీరికి సర్వ సహజం.యువతులు కూడా చేపల ప్రాసెసింగ్ యూనిట్ లలో పని చేయడానికి కలకత్తా కి కూడా వెళ్ళిపోతుంటారు.ఇక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ల లో ఇక్కడి టీచర్లకి ఉండే డిమాండ్ తెలిసినదే.మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఆడ మగా అని తేడా లేకుండా ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోతుంటారు.మంచి వేతనం లభిస్తే చాలు..!" చెప్పాడు గౌడ.

"సరే...వీళ్ళ వ్యాపార కళ మనకి తెలిసిందే. మా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేరళ వారి హోటల్స్ ఉండేవి.ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు ఉంది ఉరవడి.."

"ఏముంది...ఇతర రంగాలు బాగున్నాయనుకుంటే దాని లోకి పోతారు.మోడలింగ్,సినీ పరిశ్రమ ఇలా ఎన్నో చెప్పుకుటూ పోతే..ఎటు తిరిగి ఇంజనీరింగ్ ,మెడిసిన్ పిచ్చి మన కర్నాటక ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే జాస్తి.." నవ్వుతూ అన్నాడు గౌడ.
అంతలోనే జోస్ ముందు సీటు లో నుంచి లేచి నిలబడ్డాడు.గౌడ చేయి ఊపి మళయాళం లో ఏదో గట్టిగా చెప్పాడు.అలాగే అన్నట్టు తను తల ఊపాడు.

"ఏమిటి విషయం.." అడిగాను గౌడ ని.

"దగ్గర్లో "పుట్టు" అనే టిఫిన్ దొరికే హోటల్ ఉంటే అక్కడ ఆపమని చెప్పాను.కేరళ స్పెషల్స్ లో అది ఒకటి.రుచి చూడండి.."

"బాగుంటుందా .."

"అదంతా ..తర్వాత.ఏ ప్రాంతం వెళ్ళినా లోకల్ వంటకాల్ని కొన్ని రుచి చూడాలి.కొబ్బరి తో  చేస్తారు దాన్ని..."

బస్ ఆపిన తర్వాత ఆ పుట్టు ని రుచి చూశాము.కొబ్బరిని కోరి దానికి మిరియాలు ఇంకా ఏవో కలిపి తయారించారు దాన్ని.అనుకున్నంత గొప్ప గా లేదు అలాని చెత్త గానూ లేదు.నాకు అది ఆనక ఇంకా ఏదైనా టిఫిన్ ఇమ్మంటే ఒక గుడ్డు,దానిలో కి బఠానీ కూర ఇచ్చాడు.ఇదేదో గమ్మత్తు గా ఉందని లాగించాను.బాగానే అనిపించింది.

" మిత్రమా ..ఎలా ఉంది పుట్టు " అడిగాడు జోస్.కొన్నిసార్లు నిజాలు చెప్పడం అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు.

"చాలా అద్భుతం గా ఉంది.." నవ్వుతూ చెప్పాను.

" మీరు అనుకున్నట్లుగా ఉందా మా ప్రాంతం ..ఎలా ఉంది..?" జోస్ ప్రశ్నించాడు.

" దేశం మొత్తం లో ఎక్కడ మత కల్లోలాలు జరిగినా ఇక్కడ మూడు మతాల జనాభా గణనీయం గా ఉన్నప్పటికీ అలాంటివి జరిగిన దాఖలాలు ఉండవు.అది మేము ఆదర్శం గా చెప్పుకుంటాము మీ గూర్చి.."

"ఇక్కడ మతాంతర వివాహాలు కూడా అతి సహజం.ఇంచు మించు ప్రతి రెండు మూడు కుటుంబాలలో వేరే మతం వారి తో వివాహాలు జరిగిన దృష్టాంతాలు కనబడతాయి.గొడవలు వేరే రకంగా ఏమైనా ఉంటాయేమో గాని మతపరమైన అల్లర్లను ఏ వర్గమూ ఇక్కడ అనుమతించదు.."

అంతలోనే రామె గౌడ అందుకుని చెప్పాడు."జోస్ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం" అని..!
ఆ రోజు ఆనందం గా అలా గడిచిపోయింది.తెల్లారితే తిరుగు ప్రయాణం.రామె గౌడ కి నాకు ఒకే కోచ్ లో సీట్లు దొరక లేదు గాని ఎలాగో ప్రయత్నించి నా ముందు ఉన్న ఖాళీ బెర్త్ ని ఆక్రమించాడు.బెంగళూరు చేరే దాకా ఏదో మాటాడుతూనే ఉన్నాడు.మధ్య మధ్య లో కునికిపాట్లు పడుతూనే..!కర్నాటక రాష్ట్రం లో రైలు ప్రవేశించేసరికి మన వాడి టోన్ లో మార్పు వచ్చింది.

" ఒక సంగతి తెలుసా..?ఈ కేరళ లో అమ్ముడైనంత మద్యం ఇంకెక్కడా అమ్ముడు కాదు దేశం లో..!బీఫ్ తినడం లో వాళ్ళూ వీళ్ళూ అని లేదు ..హిందువులూ పోటీ పడతారు.ఏ పారిశ్రామికవేత్త ని సరిగా వ్యాపారం చేసుకోనివ్వరు..యూనియన్ల పేరు మీద..!అందుకే పెద్ద ఇండస్ట్రీ లు రావు...దాని మీదట ఇలా వలసలు పోతుంటారు..." అలా చెప్పుకుపోతున్నాడు.

" ఏ రాష్ట్ర ప్రత్యేకతలు వాటికి ఉంటాయి. నూటికి నూరు శాతం అక్షరాస్యత ,వైద్యం ని ప్రతి గ్రామానికి  తీసుకుపోవడం,స్త్రీ సాధికారత ని సాధించడం ఇలా చాలా వాటిల్లో అభివృద్ది సాధించారు గదా .." నా అభిప్రాయాన్ని చెప్పాను.అయినా కేరళ లో ఉన్నప్పుడు ఒక్క ముక్క వ్యతిరేకంగా మాటాడని ఈయన ఇలా ప్లేట్ ఫిరాయించాడేమిటబ్బా ఇప్పుడు..ఓహో స్థాన బలం అనుకుంటాను.ఇక ఎక్కువ వాదించదలచుకోలేదు.రైలు దిగితే ఎవరం ఎక్కడో ..ఈ మాత్రం దానికి వేడి వేడి డిస్కషన్ లు ఎందుకులే అనిపించింది.ఎట్టకేలకు తను దిగిపోయాడు.

తెలుగు రాష్ట్రం లో కి ఎంటర్ అవుతూనే నా మొబైల్ నుంచి అతనికి ఒక మెసేజ్ పెట్టాను." భారత దేశం లోని ఏ రాష్ట్రం మరో రాష్ట్రం లా ఉండదు.అదే సమయం లో సారూప్యతలూ ఉంటాయి.ఎంత ఎక్కువ ఈ నేల లో తిరుగుతుంటే అంత ఎక్కువ ఈ ప్రజల పై ,ప్రాంతాలపై అభిమానం పెరుగుతుంది. నాకైతే అదే అనుభూతి కలిగింది.నేనేదో ఊరికే చెప్పడం లేదు.ఏదో ఒకరోజు కి నీకూ అదే అనుభూతి కలుగుతుంది.మిత్రమా ,సర్వేంద్రియాల్ని తెరిచి ఉంచు..చాలు ..!"   --- Murthy Kvvs  

Sunday, July 1, 2018

ముసలావిడ (కధ)---మూర్తి కె వి వి ఎస్

ఆ ముసలావిడ అందరకీ పరిచయమే..!అలాగని ఆమె గురించి ఎవరికైనా తెలుసా అంటే అనుమానమే..!అసలు ఆమె మాటాడే భాష ఏమిటో చాలా మందికి తెలియదు.మాటాడితే వినడమే..అంతే తప్పా ఆ వ్యక్తి ఏమి మాటాడుతోందో ఎవరకీ తెలియదు.అది ఒక వింత భాష.కొత్త గా ఉంటుంది.కనక కాసేపు ఆగి, విని నవ్వుకుని వెళ్ళిపోతుంటారు.అంతకు మించి ఎవరకీ అవసరం లేదు.ఒక్కొక్క మారు ఆకాశం కేసి చూస్తూ పట్టరాని కోపం తో ఏదో మాటాడుతుంది ఊగిపోతూ..!మరోసారి తనలో తాను ఏదో గొణుగుకుంటూ మురిసిపోతూంటుంది.ఒక్కోసారి ఎవరో తన ముందు ఉన్నట్టు వాళ్ళతో చాలా ముఖ్యమైన విషయాలు మాటాడుతున్నట్లు ఏదో లోకం లో తేలియాడుతూ కనిపిస్తుంది.

 పుణ్య క్షేత్రం  అంటే ఎంత గౌరవమో ...ఇలాంటి నయం కాని బాధలేవైనా వస్తే ఇదిగో ఇలా ఎక్కడినుంచో మరీ తీసుకొచ్చి ఈ ప్రదేశం లో విడిచి పెట్టి మరీ పోతుంటారు.భారం ఆ దేవుడి మీద వేసి.ఈ మనిషి ఎలా అయినా చావనీ..జంతువు లా రోడ్ల వెంబడి తిరుగుతూ ,ఆ మురుగు కాలవల పక్కన పడుకుంటూ దొరికినది ఏదో తింటూ ,ఏమీ దొరక్క పోతే ఏ మూలనో మునగదీసుకుని ఉంటూ,ఏదో రోజున ఊపిరి పోయి ఓ కుక్క శవం లానే కుళ్ళిపోయి ఉంటుంది.
పడితే ఓ చిన్న వార్త ఏ డైలీ లోనో పడచ్చు.అనాధ శవం ఏదో ఉందనో,యాచకురాలు ఎవరో పోయారనో..!అంతకు మించి ఎవరకి అవసరం..?అసలు వాళ్ళకే లేనప్పుడు..!జిరాక్స్ షాప్ గోపాలం ఏదో మాటల్లో చెప్పాడు."నీకు ఓ విషయం తెలుసా,మా షాప్ కి ముందు ఉన్న రోడ్డు మీద ..సరిగ్గా మధ్యన డివైడర్ మీద..ఎప్పుడూ ఓ మతి భ్రమించిన ముసలామె కాపురం ఉంటుంది" అని.

"ఆ..చూశాను.నిజం చెప్పాలంటే రోజూ చూస్తూనే ఉన్నాను,బజారు లోకి ఏదో పని మీద వచ్చినపుడు..!మాంచి ఎండలో కూడా ఆ డివైడర్ మీదనే పడుకుంటూ ఉంటుంది.పొద్దున ,రాత్రి అలాంటి తేడాలు ఏమీ లేవు.అక్కడే మొహం కడగడం,స్నానం చేయడం అన్నీనూ.కానీ మన జనాలు కూడా మంచి ఓపికమంతులు.చూసి వెళ్ళిపోతుంటారు తప్పా ఇంకో ఆలోచన చేయరు..."

"ఏం చేయాలంటావు..ఆమె కి ఏ ఆపద కల్పించడం లేదు.అంతవరకు నయమే గదా .."

" నువ్వు చెప్పిందీ నిజమేలే ఇప్పుడున్న రోజుల్లో..!"
ఆ తర్వాత ఎవరి గొడవ వారిది.ఎవరి ప్రపంచం వారిది.గోపాలాన్ని కలవడం పడలేదు.అయితే వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆ రోడ్డు మీద ఆ ముసలామె ని గమనిస్తూనే ఉన్నాను.ఆమె ప్రపంచం ఆమె దే.సరిగ్గా రోడ్డు డివైడర్ మీదనే కూర్చునేది.అది ఎండ అయినా...వాన అయినా...చలి అయినా ...!గమ్మత్తు పిచ్చిదే..!పూర్తి గా పిచ్చిదీ అనీ అనలేము. మన పిచ్చి గాని ఈ లోకం లో ప్రతి వాడూ ఓ పిచ్చి వ్యక్తే ..కాకపోతే లోకం ఆమోదించిన పిచ్చి.అంతే.

ఒకసారి మాట్లాడాలని ప్రయత్నించాను.కాని విఫలమైంది.ఎందుకా..అంతలోనే ఎవరో తెలిసిన వ్యక్తి తారసపడటం తో నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.పిచ్చి వాళ్ళతో మాటాడినా వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళు గా జమ కట్టే లోకం ఇది.నా పై నాకే అసహ్యం వేసింది.ఎటువంటి లోకం లో రా నువ్వు బతుకుతున్నది.

ఆ ముసలావిడ దగ్గర ఎప్పుడూ ఒక దుడ్డు కర్ర ఉండేది.మరి అది ఆమె ఎందుకు ఎన్నుకున్నదో తెలియదు.ఇరవై నాలుగు గంటలు అది ఆమె తో ఉండాల్సిందే.దానితో గనక బలం గా నెత్తి మీద ఒక్కటి వేస్తే చచ్చి ఊరుకోవలసిందే.కాళీ మాత చేతి లోని త్రిశూలం లా అది ఎప్పుడూ అలా ఉండవలసిందే.అందుకు కొంత జనాలు ఆమె జోలికి రావడానికి జడిసేవారు.ఏమో చికాకు లేసి ఒకటి మోదితే..!సరే ..ఆ మేరకు తెలివైన  ఘటమే..!

అయితే మా గోపాలం ఒకసారి అన్నమాట గుర్తు వచ్చింది." నేను ఓ సారి ఆమె తో మాట్లాడాను.ఆమె మాట్లాడేది ఒరియా భాష.అయితే హిందీ కూడా ఆమె కి తెలుసు.ఆ ముసలామె కి మాటాడాలనిపిస్తే బాగా మాటాడుతుంది.లేకపోతే అసలు నోరు విప్పదు " అని.

"సరే ..నీతో ఏమి మాట్లాడింది..." అడిగాను.

" ఏదో మాట్లాడింది లే గానీ..ఒక మాటకి ఇంకో మాటకీ పొంతన లేదు.నాకు అర్ధం అయింది ఏమిటంటే కొంచెం పట్టించుకొని శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉంటే ఆమె చక్కని మనిషి గా అవుతుంది.దానిలో సందేహం లేదు.వాళ్ళ కుటుంబం లోని వ్యక్తులు ఎవరూ  ఆ దిశ గా ఆలోచించే వాళ్ళు లేకపోవడం దురదృష్టం."

" అవును..గోపాలం ..బాగా చెప్పావు.ఈ సృష్టి లో ఎంత అర్ధం చేసుకున్నా ఇంకా మిగిలిపోయేది ఏదైనా ఉందీ అంటే అది మనిషి మెదడు మాత్రమే..అక్కడ జరిగే చిన్న మార్పులు అతని జీవితాన్నే మార్చి వేస్తాయి.ఎవరి కోసమైతే తపన పడి ఆ బుర్ర ని పగలగొట్టుకుంటాడో ..అది పాడయి తేడా వస్తే ..ఆ పక్కనున్న మనుషులే అతడిని ఎందుకూ కొరగాని వాని గా భావించి ఇదిగో ఇలా రోడ్ల మీద పారేస్తుంటారు..."

సరే...!ఒకసారి జనవరి నెల లో ఏదో ఇంటర్వ్యూ కి అటెండ్ అయి తిరిగి వస్తున్నాను.సమయం అర్ధరాత్రి దాటింది.నడిచి వస్తున్నాను.ఏమిటి ఏ శబ్దం లేని ...నడిరేయి దాటిన తర్వాత నా పట్టణం ఇలా ఉంటుందా అని అనిపించింది.దేని అందం దానిదే.ఎంత నిశ్శబ్దం.ఎంత ధ్యానావస్థ ఎటుచూసినా..!ఆ మూల మలుపు తిరగగానే వీధి దీపం కింద ..ఆ డివైడర్ మీద పాత జంపకానా ఒకటి కప్పుకొని నిద్ర పోతోంది.ఆ ముసలామె.నిద్ర లో అంతా సమానమే అని ఎందుకు అన్నారో అర్ధం అయింది.ఇప్పుడు ఏ లారీ నో వచ్చి ఢీ కొడితే ఆమె ప్రాణానికి దిక్కేమిటి..?ఆ ఆలోచనే నాకు వణుకు తెప్పించింది.ఇలా దేశం లో ఎంతమందో..ప్రతి రోజు వాళ్ళ ప్రాణం లాటరీ మీద ఉండవలసిందే.

ఎంత నాగరిక సమాజం మనది..?ఒక మనిషి జంతు ప్రాయం గా బ్రతికే సమాజం.మనిషి మార్స్ మీదకి వెళితేనేం..?అంతరిక్షం లో గిరికీలు కొడితేనేం...?సాటి మనిషి ఓ కుక్క మాదిరి గా ,పంది మాదిరి గా మన మధ్యనే మెసలుతూ దీనం గా తిరుగుతుంటే ఆ సమాజం ఎంత గొప్పదైతే ఏమిటి..?ఎంత గొప్ప ఆలోచనలు చేస్తే ఏమిటి..?ఎంత గొప్ప సంస్కృతి అని వగలు పోతే ఏమిటి..?అన్నీ పనికిరాని శుష్క ప్రేలాపనలే...!

ఆసక్తి కొద్దీ ఆలుబాక గ్రామం కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు సంధించాను మిత్రుడు నరేన్ కి..!నరేన్ నా కాలేజ్ మేట్.ఇంకా సన్మిత్రుడు.ఇప్పటి దాకా మా స్నేహం కొనసాగుతున్నదంటే ఇక మీరు అర్ధం చేసుకోవచ్చు.ఎంత గాఢమైనదో..!తను ఆ గ్రామం లోని హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.ఎక్కడ లేని పుస్తకాలన్నీ తెప్పించి చదువుతూ ఉంటాడు. కనుక నాకు అర్ధం కాని కొన్ని విషయాలు అతడిని అడుగుతుంటాను.అదే గ్రామం లో ఒక గుట్ట మీద బ్రిటీష్ వాళ్ళు ఎప్పుడో నిర్మించిన శిధిల దశ లో ఉన్న నిర్మాణాన్ని చూడటానికి మేము ఇద్దరం వెళ్ళినప్పుడు అడిగాను.

"మిత్రమా...అసలు ఈ పిచ్చి అంటే ఏమిటి..? ఎందుకని మెదడు లో అలా మార్పులు జరిగి ఉన్నట్లుండి అలా అవుతాడు..?ఏ ఊరి లో చూసినా ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు..పట్టించుకునే నాధుడే ఉండడు...దీనికి నిష్కృతి లేదా..?"

" ఈ దేశం లో వాళ్ళ ని పట్టించుకునే వ్యక్తి నీ రూపం లో ఒకరు ఉన్నందుకు ధన్యవాదాలు.ఎందుకంటే అసలు దీన్ని ఒక సమస్య గానే మన సమాజం లో గుర్తించరు.అదీ అసలు సమస్య.మన దేశం లో ప్రతి ముగ్గురి లో ఒకరు ఏదో ఓ మానసిక సమస్య తో బాధపడుతున్నవారే అని సర్వే లో తేలింది.కాని ఎవరూ మానసిక వైద్యుణ్ణి కలవాలని అనుకోరు.మనిషి మెదడు చాలా సున్నితమైనది.ఏ కారణం చేత అది రిపేర్ కి వస్తుందో చెప్పలేము.శారీరక వ్యాధుల్ని పట్టించుకున్నట్లుగా వీటిని పట్టించుకోరు..."

" దీనికి మరి సొల్యూషన్ ఏమిటి?"

" షిజోఫ్రెనియ అనే మానసిక రుగ్మత తోనే ఎక్కువ మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది.దీనిలో అయిదు రకాలు ఉన్నాయి.జీన్స్ పరంగా వచ్చేవి...బ్రెయిన్ లోని ద్రవాలు సమతులనం తప్పడం తో వచ్చేవి...ఇలా ఉన్నాయి.డిల్యూఝన్స్,హెల్యూసినేషన్స్ ఇలాంటివి ముందు మొదలై...మొదటి దశ లో పట్టించుకోకపోతే అవి తీవ్ర రూపం దాలుస్తుంటాయి.దీనికి కారణాలు కూడా ఫలానా అని ఒక్కోసారి చెప్పలేము. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ ని సంప్రదించడమే మంచిది.. విచిత్రంగా చాలా మంది ప్రపంచ స్థాయి మేధావులు గా పేరుపొందిన వారి లో కూడా ఏదో దశ లో ఇలాంటి స్థితి ని అనుభవించిన వారే.."

" అలాంటి వారు ఎవరున్నారు.."

"మన దగ్గర చెప్పుకోడానికి సిగ్గుపడుతుంటారు గాని వెస్ట్ లో బాహాటం గా ఒప్పుకుంటారు.దానివల్ల అక్కడ చికిత్స సమయానికి జరుగుతుంది..అంతార్జాతీయం గా చెప్పాలంటే..అల్బర్ట్ ఐన్ స్టీన్ కొడుకు ఎడ్వర్డ్ కూడా కొంత కాలం షిజొఫ్రెనిక్ గా ట్రీట్ మెంట్ తీసుకున్నాడు.చిత్రం ఏమిటంటే తను స్వయం గా మానసిక వైద్యుడే.టాం హారెల్ అనే విఖ్యాత జాజ్ కళాకారుడు,జాన్ నాష్ అనే నోబెల్ విజేత ఇలా ఎంతో మంది.అలాగే మన ఇండియా లో ప్రఖ్యాత నటి పర్వీన్ బాబీ విషయం తెలిసిందే.అమెరికా గూఢచార సంస్థలు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాయని చెపుతుండేది.మనీషా కోయిరాలా ,హనీ సింగ్,షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా తాము ఒకానొక దశ లో ఆ స్థాయి లో బాధపడి కోలుకున్నామని చెప్పినది మనకు తెలుసు గదా ...అంత దాకా ఎందుకు శ్రీ శ్రీ కూడా ఒకానొక సమయం లో అలాంటి దశని చవి చూసిన వాడే.అతని వ్యతిరేకులు ఆ సమయం లో తనకి పిచ్చి ఎక్కినట్లు గా ప్రచారం చేసి ఆనందించారు. "

"మన దగ్గర తీరా ముదిరిన తర్వాత ఏ దూరపు ప్రాంతం లోనో బంధువులు వదిలేసి పోతుంటారు,అదీ అసలు సమస్య..పట్టించుకునే నాధుడు ఉండడు.."

" అలా అనకు...ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మార్పు వస్తోంది.ఇదిగో ఈ పేపర్ చూడు" అంటూ జిల్లా ఎడిషన్ నా చేతికి ఇచ్చాడు.
ఆశ్చర్య పోయాను అది చదివి..!నిజంగా ఇంకా మానవత్వం అంతరించిపోలేదు.ఇలాటి దీనులను గురించి ఆలోచించి..కేవలం ఆలోచించడమే కాదు ..దానికి తగిన తరుణోపాయాన్ని వెదికి చేతల్లో చూపించే ఒక మనీషి ఇంకా ఉన్నారు.కొదవలేదు.ఈ ఒరవడి ఇలాగే సాగితే ఎంత బాగుంటుంది..?మా పుణ్య క్షేత్రానికి సంబందించిన వార్తే అది.నేను రోజూ చూసే ఆ ముసలామె గురించినదే అది.ఆమె ఫోటో కూడా ఉంది..ఆమె చక్కగా గుండు చేయించుకుంటున్న ఫోటో అది.విచ్చలవిడిగా తైల సంస్కారం లేకుండా పెరిగిన పిచ్చిపొదల్లాటి ఆ జుట్టు ని ఒక క్షురకుడు కత్తిరిస్తున్నాడు. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆమె ని ఒక మంచి హాస్పిటల్ కి పంపిస్తున్నారు.ఎవరూ అని చూస్తే...మా పుణ్య క్షేత్రపు సబ్ కలెక్టర్ యోగితా రాణా అనే ఆవిడ.ఇంకా ఎంత కాలం అంటారు ..ప్రభుత్వ అధికారులు... బ్యూరోక్రసీ అంతా ... ఆ పాత ధోరణి లోనే ఉన్నారని.విన్నూత్నం గా,మానవత నిండిన హృదయం తో యోచించే  ఇలాంటి ఒక్కర్ని అభినందించితే అది ఎంతమందికి స్ఫూర్తి దాయకంగా ఉంటుందో..!ఈ ప్రపంచం లో ఎప్పుడూ మానవత్వం ఉంది..కాకపోతే దాన్ని గుర్తించడం లోనే తేడా ఉంది. (సమాప్తం) --Murthy kvvs   

Sunday, June 17, 2018

రజనీ కాంత్ (కధ)---మూర్తి కె వి వి ఎస్

 రజనీ కాంత్ (కధ)---మూర్తి కె వి వి ఎస్

నిన్న పార్క్ లో రజనీ కాంత్ అనుకోకుండా కలిశాడు.వాళ్ళ ఊరి సంగతులు ఏవో చెప్పుకుంటూ వచ్చాడు.అప్పటి రోజులు మళ్ళీ కళ్ళ ముందు నిలిచినట్లుగా అనిపించాయి.గతం లో అన్నీ సంతోషకరమైన విషయాలే ఉండవు,చాలా చేదు విషయాలూ ఉంటాయి.ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడతాం రా బాబూ అనిపించిన సన్నివేశాలూ లేకపోలేదు.ఎంత భరించలేని రోజులు గా ఉక్కిరి బిక్కిరి అయ్యాడో తను ...ఆ ఊరి లో ఉద్యోగం చేసినన్నాళ్ళు..!కారణాలు చెప్పాలంటే అనేకం.కాని అవి ఇప్పుడు తల్చుకుంటే ఆ మాత్రం దానికే తను ఎందుకు అంతలా ఫీలయ్యాడు ..అని ఇప్పుడు అనిపిస్తోంది.బహుశా కాలం తనని అనేక అనుభవాల ద్వారా గట్టి పరచడం కూడా ఓ కారణమేమో..!

ఈ రజనీ కాంత్ అనేవాడి కి ఆ సినిమా సూపర్ స్టార్ కి ఎలాంటి సంబంధమూ లేదు.ఈ రజనీ పేరు తో ప్రసిద్దుడైన వికాస్ అనబడే ఇతను ప్రస్తుతం ఓ కార్పోరేట్ కాలేజ్ లో డిగ్రీ  చదువుతున్నాడు.నేను వాళ్ళ గ్రామం లో ఓ నాలుగేళ్ళ క్రితం దాకా హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి రిటైర్ అయి ప్రస్తుతం ఖమ్మం లో విశ్రాంత పర్వం లో ఉన్నాను.భద్రాచలం కి ఇరవై కిలో మీటర్ల కి పైగా దూరం ఉండే ఆ గ్రామం లో అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలేదు.కాని వచ్చిన ప్రమోషన్ వదులుకోవడం ఇష్టం లేక అక్కడ స్కూల్ లో జాయిన్ అయ్యాను.

రజనీ కాంత్ అప్పుడు పదవ తరగతి చదువుతున్నాడు.అతని అసలు పేరు వికాస్.కాని ఎందుకో వాడి పేరు రజనీ కాంత్ గా మార్చుకోవాలని తెగ ఇదవుతుండేవాడు.స్కూల్ లో జరిగే హోం ఎగ్జాంస్ లో గాని ,టెక్స్ట్ పుస్తకాల మీద గాని వాడి పేరు ని ఎప్పుడూ రజనీ కాంత్ అని రాసుకునేవాడు.టీచర్లు చెప్పినా ఆ ధోరణి మార్చుకునేవాడు కాదు.ఇక వాళ్ళకి విసుకు పుట్టి ఈ కేస్ ని నా రూం లోకి పంపించారు.

" ఒరేయ్ అబ్బాయ్...నీ పేరు ఏమిటి" ప్రశ్నించాను.

"వికాస్ ..సార్" మర్యాద గా చెప్పాడు తను.

"చాలా మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు.మరి పుస్తకాల మీద ,పరీక్షల్లోనూ రజనీ కాంత్ అని రాసుకుంటున్నావట..ఏమిటి కధ..!మీ పెద్ద వాళ్ళు అడ్మిషన్ రిజిస్టర్ లో  ఏ పేరైతే ఎక్కించారో అదే ఎప్పటికీ ఉంటుంది..గుర్తు పెట్టుకో...నీ కంతగా మార్చుకోవాలని అనిపిస్తే ..దానికీ ఓ లీగల్ ప్రొసీజర్ ఉంది.పెద్దయిన తర్వాత ఆ దారి లో పోయి ..నీ యిష్టం వచ్చిన పేరు పెట్టుకో ..అర్ధమయిందా..?" కొద్దిగా సీరియస్ గా నే చెప్పాను.

"సరే..సార్" అని వెళ్ళిపోయాడు.

అయితే మళ్ళీ ఆ వికాస్ మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు.టీచర్ల ని అడిగితే వాడు ఇప్పుడు వికాస్ అనే తన పేరు ని రాసుకుంటున్నట్లు చెప్పారు.పోనీలే దారిన బడ్డాడు అని కుదుటబడ్డాను.అయితే వింతగా కొన్ని పరిణామాలు జరిగాయి.క్లాస్ లో పిల్లలందరకీ ఈ విషయం తెలిసి వీడిని వికాస్ అని కాకుండా రజనీ అనే నిక్ నేం తో పిలవసాగారు.ఆ విధంగా వాడు వద్దనుకున్నా ఆ పేరు వాడిని వదల్లేదు.గ్రామం లో కూడా ఈ పేరు తోనే వాడు ప్రసిద్దుడైనాడు.అది వాడికి ఓ రహస్య ఆనందం కలిగించసాగింది.

భద్రాచలం లో దైవ దర్శనం చేసుకుని అభయాంజనేస్వామి పార్క్ కి ఎదురు గా ఉన్న గెస్ట్ హౌస్ కి వచ్చాను.అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఊరి లో.సెలవు ల్లోను,వారాంతాల్లోనూ యాత్రికులు బాగా పెరిగారు.అదృష్టం బాగుండి మామూలు రోజుల్లో వచ్చాను.ఏ శ్రీరామనవమి రోజునో,ముక్కోటి రోజుల్లోనో వస్తే వసతి గృహాలకి కొంత ఇబ్బందే ఎన్ని వందల గదుల సత్రాలున్నా..!గెస్ట్ హౌస్ లో సాయంత్రం దాకా రెస్ట్ తీసుకున్నాను.ఆ తర్వాత గోదావరి కరకట్ట మీద ఆ చల్ల గాలి కి కాసేపు తిరిగాను.బాపురమణల సృష్టి కి గుర్తు గా ఉన్న రామాయణ దృశ్యాల కి సంబందించిన విగ్రహాలు ఆ పొడవునంతా..!

కాసేపున్నతర్వాత పార్క్ లోకి ప్రవేశించాను.అక్కడ ఉన్న కుందేళ్ళ ను చూస్తుండగా మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ రజనీ కాంత్ అనే పాత విధ్యార్ధి కనిపించాడు.తనే నన్ను గుర్తు పట్టి పలకరించాడు.ఎదిగే వయసు గనక తనలో వచ్చిన మార్పుల వల్ల మొదట గుర్తించలేకపోయాను.రజనీ కాంత్ అనే పేరు కి సంబందించిన ఉదంతం తను గుర్తు చేయగానే చటుక్కున నేను ఆ రోజుల్లోకి కనెక్ట్ అయిపోయాను.

" ఓ..నువ్వా..ఏం చేస్తున్నావు ఇప్పుడు " అడిగాను.

" హైద్రా బాద్ లో బి.బి.ఏ .చేస్తున్నాను సార్..నేను గుడికి వచ్చాను సార్.ఒక ఫ్రెండ్ వస్తానంటే ఈ పార్క్ లోకి వచ్చాను..ఇంతలో మీరు కనిపించారు.." ఆనందం గా చెప్పాడు ఆ కుర్రాడు.

" సంతోషం ..మంచిగా చదువుకుంటున్నందుకు..!ఏమిటి మీ ఊరు విశేషాలు ..అంతా బాగున్నారా..?స్కూల్ కి అప్పుడు గ్రౌండ్ చుట్టూతా కాంపౌండ్ వాల్ కట్టాలని ఎందరికో విన్నపాలు చేశాము.ఇప్పటికైనా అది పూర్తి అయిందా..?ఆ కొత్త గేట్ ..అదే మనం పెట్టినది ..అలాగే ఉందా ..?"

" మీరు ఉన్నప్పుడు ఆ ఊరు ఉమ్మడి రాష్ట్రం లో ఉండేది.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం చుట్టుపక్క ప్రాంతాలన్ని ముఖ్యంగా దక్షిణం వైపు అరకిలోమీటర్ కూడా భద్రాచలం పరిధి లో లేకుండా పోయింది.రాముడి కి చెందిన వందలాది ఎకరాలు ఆంధ్ర ప్రాంతం లోకి వెళ్ళాయి.ఇక ఉత్తరం కూడా అంతే.పర్ణశాల వెళ్ళాలంటే తూర్పు గోదావరి జిల్లా లోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణా లోకి ప్రవేశించాలి.భద్రాచలం లోని కొన్ని వీధులే వేరే రాష్ట్రం లో కలిసిపోయాయి..పరిస్థితి గందర గోళం గా తయారయింది"

" అంటే..పోలవరం ప్రాజెక్ట్..ఏదో ముంపు ప్రాంతాలు అని పేపర్ లో చదివాను.దానికోసమే కలిపి ఉంటారు లే..!కొత్త రాష్ట్రం లో కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది రా అబ్బాయ్"

" పిల్లలు హాస్టల్ లో,స్కూల్ లో చేరే దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి సార్.సర్టిఫికేట్లు తీసుకునేదగ్గర కూడా చికాకులు గానే ఉన్నాయి.పిల్లలకి బస్ పాస్ లు కూడా సమస్య గా మారింది.ఇంకా ఇట్లా సమస్యల రాజ్యం లానే ఉంది సార్..."

"కొత్త గదా ..కాస్త సర్దుకునేదాకా అలాగే ఉంటుందిలే..." అనునయించాను.

వాడి పరిధి లో ని విషయాలు వాడు చెప్పాడు.అయితే దానికి మించిన సమస్యలే రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైనాయి.ముఖ్యంగా భద్రాచలం డివిజన్ కి సంబందించి అనేక సామాజిక ,భౌగోళిక ప్రశ్నలు కొత్తగా ఆవిర్భవించాయి.ఎవరి రాజకీయ క్రీడ లో వారు బిజీ ..ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకునే నాధుడేడి..?ఇవన్నీ ఆవిష్కరిస్తూ వాడికి బోధ చేసే సమయం నాకు ఇప్పుడు లేదు.టాపిక్ మారుస్తూ అడిగాను.

" ఇప్పుడు నువు వికాస్ అనే రాసుకుంటున్నావా నీ పేరు ..? లేకపోతే మార్చుకున్నావా "

"లేదు సార్.అప్పుడు ఏదో అలా రాసుకున్నా గానీ ..నా అసలు పేరే నాకిష్టం సార్ .." చెప్పాడు వికాస్.

"వెరీ నైస్.ఇంకా మిగతా స్టాఫ్ అప్పటి వాళ్ళు ..ఎవరైనా కలుస్తుంటారా..బాబూ" ప్రశ్నించాను.

"రఘు సార్,వాసు సార్ ..ఎప్పుడైనా కలుస్తుంటారు సార్.రమేష్ సార్ చనిపోయారట.నేను అప్పుడు సిటీ లో ఉన్నాను.."

"అప్పుడు నేను సెర్మనీ కి వచ్చాను వికాస్.అది ఏమిటో ఒక మిస్టరీ గా మిగిలిపోయిందిలే..!సరే మరి...అందరని అడిగినట్టు చెప్పు" అని నేను ముందు కి సాగిపోయాను.పార్క్ లోనే ఆ చివరి లో ఉన్న సిమెంట్ బెంచ్ నా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఖాళీగా కనిపించింది.(సమాప్తం)
---Murthy Kvvs

Wednesday, May 2, 2018

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

బహుశా అదే కృష్ణారావు గారి ఇల్లు కావచ్చుననుకుంటూ అటువైపు గా నడిచాడతను.చుట్టుపక్కల పెద్ద గా ఇళ్ళు లేవు.కానీ కూతవేటు దూరం లో మాత్రం ఓ రెండు మూడు కుటుంబాలు ఉన్న జాడ అగుపిస్తున్నది.కాసేపు ఆగి ఆ భవనాన్ని అలాగే చూశాడు.భవనానికి రాయి,సున్నం వాడినట్లు తోచింది.గాలి రావడం కోసం పెద్ద పెద్ద కిటికీలు...లోపలకి ప్రవేశించగానే విశాలమైన హాలు ,దానికి రెండు వేపులా చిన్న హాళ్ళు,వెలుతురు రావడానికి పైన నిర్మించిన జాలీలు,మధ్యలో ఉన్న హాలు కి అనుసంధానం గా వెనుక మరో విశాలమైన గది ఉన్నది.కింద నిర్మాణం గాక పైన కూడా ఇలాగే ఇంచు మించు ఉన్నది ఇంకో అంతస్తు.ప్రస్తుతం దీని లో ఒక హాస్టల్ వంటిది ఉన్నది.ఆ పాత భవంతి కే సున్నాలు వేసి నడిపిస్తున్నారు.

దుమ్ముగూడెం కి దగ్గర లోని లక్ష్మి నగరం లో ఇంకా ఆ పరిసర ప్రాంతం లో బ్రిటీష్ వారు అలనాడు నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయని ఓ మిత్రుడు చెపితే తను ఇక్కడకి చూడటానికి వచ్చాడు.అంతే కాదు అక్కడ కొన్ని తెల్ల వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయని దాని మీద వారి పేర్లూ అవీ కూడా చెక్కి ఉన్నాయని తెలిసింది.మన కి దగ్గర లోని చరిత్ర ని మనం తెలుసుకోలేకపోతే ఎలా ..అదే తనని ఇక్కడకి రప్పించింది.అయితే తను ఇప్పుడు తిరుగాడుతున్నది వర్క్ షాప్ ప్రాంతం లో...అలాగని ఇప్పుడేదో వర్క్ షాప్ అక్కడుందని అనుకోకండి.బ్రిటీష్ వాళ్ళు ఇక్కడ గోదావరి మీద లాకులు నిర్మించారు.ఇక్కడ నుంచి కలప ఇంకా ఇతర వస్తువులు పైకి వెళ్ళేవి జలరవాణా ద్వారా..!అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడకి అనేక ఉత్పత్తులు దిగేవి.అలా ఆ లాకుల్ని మెయింటైన్ చేయడానికి ఏర్పరిచిందే ఆ వర్క్ షాప్.ప్రస్తుతం అది లేదు,గాని పేరు మాత్రం మిగిలిపోయింది.

ఆ ప్రాంతం లో అర్ధ శతాబ్దం పైబడి ఇంకా అదృష్టవశాత్తు జీవించి ఉన్న ఆ చింత,రావి ఇంకా ఇతర వృక్షాలకి గనక నోళ్ళు ఉండి ఉంటే అప్పటి గాధల్ని ఏమేమి చెప్పి ఉండేవో..?!అక్కడ తిరుగాడుతున్న ఒక పిల్లవాడిని అప్పటి సమాదుల్ని గురించి ప్రశ్నించగా అవి రోడ్డు కి పక్కనున్న ములకపాడు చివరి లో ఉన్నాయని చెప్పాడు.తను కలవాలనుకున్న కృష్ణా రావు గారి ఇల్లు కూడా అటే ఉంటుందని చెప్పాడు.

ఒక పది నిమిషాల్లో అటు చేరుకున్నాడు.ఆయన బయటకి వచ్చి ఈ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూడసాగారు.తను ఫలానా పత్రిక విలేకరి అని అలనాటి బ్రిటీష్ వారి నిర్మాణాల్ని పరిశీలించి ఒక వార్తా కధనాన్ని రాయడానికి వచ్చానని చెప్పడం తో కృష్ణారావు గారు ఎంతో సంతోషించారు.

" అవును..నా గురించి ఎలా తెలుసు" రావు గారే అడిగారు.

" మీరు ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నట్లు మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు.ఈ పరిసరాల మీద మీకు మంచి అవగాహన ఉందని నాకు తెలుసు" అన్నాడు తను.

" ఓ..మొత్తానికి మీరు సామాన్యుల్లా లేరే..!ఈ కాలం లో కూడా మీ వంటి జిజ్ఞాసువులు ఉండటం ఆనందం గా ఉంది.." రావు గారు నవ్వుతున్నప్పుడు వార్ధాక్యం వల్ల వేలాడుతున్న బుగ్గల పైని చర్మం ఒక గంభీరత ని కలిగిస్తోంది.

" మీ సహకారం కావాలి..రావు గారు,ఆ తెల్ల సమాధుల దగ్గరకి దారి చూపించగలరా "

" అదిగో...అక్కడ దూరం గా పాత ప్రహరీ కనిపిస్తున్నదే... ఆ లోపలే బ్రిటీష్ వారి సమాధులు కొన్ని ఉన్నాయి ..వెళ్ళి చూస్తూ ఉండండి..ఇంట్లో చిన్న పని చూసుకొని వచ్చి మీతో జాయిన్ అవుతా "
సరే..అని చెప్పి కదిలాడు తను.ఇంచు మించు ఓ వంద గజాల దూరం ఉంటుందేమో..అది..!నాలుగు వేపులా పాతబడిన గోడలు..! ముందు ఒక ఇనుప గేటు..నామ మాత్రం గా ఉంది.చుట్టూతా పొలాలు ఇంకా కొన్ని చెట్లు ..నివాసాలు మాత్రం ఏమీ కనిపించలేదు.మనం పెద్దగా గమనించము గాని ఒక ప్రాంతం దగ్గరకి గాని ఒక మనిషి దగ్గరకి గాని వెళ్ళినపుడు దానికే పరిమితమైన కొన్ని వైబ్రేషన్స్ మన చుట్టూ అల్లుకుంటాయి.అవి మన ఆలోచనల సూక్ష్మ లోకం లో ఏవో వ్యక్తీకరించడానికి వీలుపడని ప్రభావాలని మోపుతుంటాయి.

వేసవి కావడం వల్ల చిరు చెమటలు పడుతున్నాయి తనకి.అస్థిపంజరం లా ఉంది స్మశానం.లోనికి ప్రవేశించగానే తనలో కలిగిన భావమది.ఇక్కడ ఈ సమాధుల్లో తిరిగి లేవలేని గాఢ నిద్ర లో ఉన్న వీరి వెనుక ఎలాంటి ఆవేదనలు ఉండేవో,ఆకాంక్షలు ఉండేవో ..!తమ తమ జీవిత కాలాల్లో వారు అనుభవించిన సుఖమేమిటో ,దుఖమేమిటో..! రవి అస్తమించని సామ్రాజ్యమని గర్వించిన బ్రిటీష్ ప్రాభావం నేడు లుప్తమైపోయింది.ఇక్కడ సమాధి చేయబడ్డ బ్రిటీష్ జాతీయులలో ఎన్ని రకాలు ఉన్నారో...ఒక డయ్యర్ ఉండి ఉండవచ్చును లేదా ఒక బ్రౌన్ ఇంకా ఓ కాటన్ ఉండివుండవచ్చును.ఆనాటి బ్రిటీష్ మహా సామ్రాజ్యం లో వీరు చిన్న మర మేకులు గా పనిచేసినవారు కావచ్చు.స్థానిక ప్రజలతో వారి సంభందాలు ఎన్ని కోణాలలో ఉండేవో ...!

కొన్ని సమాధులు పాలరాతి తో ఫ్రేం చేయబడి ఉన్నాయి.ఇంకొన్ని నున్న గా ఉన్న నల్ల రాతి తో నిర్మించబడిఉన్నాయి.పిచ్చి మొక్కలు బాగా పెరిగిన ఆ ప్రాంగణం తైల సంస్కారం లేని కుర్రాడిలా ఉంది.ప్రతి సమాధి పైన చనిపొయిన వ్యక్తి వివరాలు ఉన్నాయి.తనకి మొదటి గా కనబడిన సమాధి "అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్ " అనే అతనిది.దాని మీద చెక్కిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో భద్రాచలం ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్ గాను స్పెషల్ ఏజెంట్ గానూ పనిచేశాడు.తను ఇరవై ఐదవ ఏటనే సమాధి కాబడ్డాడు దాని మీద ఉన్న జనన మరణ వివరాల ప్రకారం..!ఆ రోజుల్లో సివిల్ సర్విసెస్ లో సెలెక్ట్ కావడానికి గరిష్ట వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే అనేది గుర్తుకు వచ్చింది.మరి అంత పిన్న వయసు లో ఎలా చనిపోయాడు..కారణమేమిటో..? ఈ.ఎం.ఫోరెస్టర్ రాసిన ఏ పాసేజ్ టు ఇండియా నవల లోని యువ సివిల్ సర్విస్ అధికారులు గుర్తుకు వచ్చారు.

ఈ ఏజెన్సీ లో పనిచేయడం మా వల్ల కాదు అంటూ ఆరోగ్య కారణాలతో బయటకి వెళ్ళడానికి ప్రయత్నించే నేటి ఉద్యోగులు ఆ రోజు ల్లో అయితే ఇక్కడ పని చేయగలిగేవారా..?సరే... కారణాలు ఏమైనా గాని వాళ్ళ ఉద్యోగం కోసమో,జీతం రాళ్ళ కోసమో..అటువంటి ఒక మొక్కవోని లాయల్టి తమ ప్రభుత్వం మీద ఉండటం వల్లనే గదా ఈ మారు మూలకి వచ్చింది.బ్రిటిష్ వారికి ప్రభుత్వం అంటే రాణి యొక్క ఆజ్ఞ యే.కల లో కూడా దానిని వారు మీరరు.ఆ ఏకతా సూత్రమే ,ఆ బంధనమే వాళ్ళ ని ప్రపంచ విజేతలు గా నిలిపింది.  

ఇంకొంచెం ముందుకి వెళితే...ఒక సమాధి పై మిస్ సారా క్లెయిర్ అని ఉంది,దాని పక్క నే ఉన్న మరో సమాధి పై మిస్ డొరోతి అని చెక్కి ఉంది.వాటిమీద వివరాల్ని బట్టి వాళ్ళు ఇద్దరూ మిషనరీ టీచర్స్.ఆ స్మశానం లో అన్నిటికన్నా అందం గా ఉన్న సమాధి సరిగ్గా మధ్య లో ఉంది.అది ఒక పదిహేనేళ్ళ అమ్మాయిది పేరు చూస్తే మిస్ హెన్రిటా చార్లోట్ అని ఉంది.ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ హాస్పిటల్స్,మద్రాస్ అని ఉంది.మరి ఇక్కడ ఎందుకు సమాధి చేయబడిందో..!

దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే చాలా సమాధులు ఘోరంగా తవ్వబడి ఉన్నాయి.లోపల నిధులు లాంటివి ఉంటాయనేమో పిచ్చి పిచ్చి గా తవ్వి పడేశారు కొంతమంది పనికిమాలిన వెధవలు.లేదా ఒక కాలక్షేపం కోసమైన ధ్వంసం చేసే మనుషులున్న దేశం మనది.ఏమీ ప్రయోజనం ఉండనక్కరలేదు.అదో సరదా..అంతే..!తను ఇలాంటి సంఘటనల్ని ఎన్నైనా చెప్పగలడు.

" హలో.." వెనుక నుంచి ఓ స్వరం.

వొళ్ళు ఝల్లుమంది.వెనక్కి తిరిగి చూస్తే రావు గారు.ఎంతైనా తాను ఉన్నది స్మశానం లో గదా..!

"రండి..రండి..మీ గురించే అనుకుంటున్నా"

" ఏమిటి..వీటిలో లీనమై పోయినట్లున్నారే.."

" అవును ..ఆ కాలం లోకి వెళ్ళిపోయా.."
" నాకు ఇరవై ఏళ్ళు వచ్చేదాక ఇక్కడే ఉన్నా.అప్పట్లో ఈ పరిసరాలన్నీ కోలాహలం గా ఉండేవి.." చెప్పారు రావు గారు.

"ఆ వైభవమంతా ఏమైనట్లు.."

" అదే నాకూ అనిపిస్తుంది..కాలం చిత్రమైనది.నగరం వెలసిన చోటు దిబ్బ అవుతుంది.ఒకనాటి దిబ్బ అవసరాన్ని బట్టి నగరం అవుతుంది"

" అంత పెద్ద గా ఉండేదా"

" చెప్పుకోదగ్గ ఊరే...భద్రాచలం కంటే ఈ ప్రాంతం జనాల తో కళ కళ లాడుతూ ఉండేది.పైగా జలరవాణా కి ప్రాధాన్యత వల్ల ఇక్కడ కొన్ని బ్రిటీష్ కుటుంబాలు ఉండేవి.ఈ పక్కనే దుమ్ముగూడేం దగ్గర గోదావరి నది మీద ఆనకట్ట కట్టారు.కొంత మంది తెల్లవాళ్ళతో నాకు పరిచయం ఉంది."

"ఆ విశేషాలు కొన్ని చెప్పండి.."

"నాకూ చెప్పాలనే ఉంది.మళ్ళీ మీలాంటి శ్రోత నాకు దొరకకపోవచ్చు.భద్రాచలం పరిసర ప్రాంతాల లోని గిరిజన  పల్లెల్లో సాధ్యమైనన్ని  యెయిడెడ్ పాఠశాలల్నిపెట్టడం వల్ల విద్య ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది.అవతల వర్క్ షాప్ ప్రాంతం లో పీడిత వర్గాలకి చెందిన బాల బాలికలకి హాస్టల్స్ నడిపేవారు.ఇంకా వారికి లేసులు అల్లకం లో ,కార్పెంట్రి లో శిక్షణ ఇచ్చేవారు.ఎనిమిదవ తరగతి దాకా చదివిన వారిని టీచర్ ట్రైనింగ్ కి పంపి ఉద్యోగాలు ఇప్పించేవారు...సారా క్లెయిర్ ,డొరోతి అమ్మగార్లు ఇక్కడ ఇంచార్జ్ లు గా ఉండేవారు" చెప్పారు రావు గారు.

"కాని బ్రిటీష్ వారు మనల్ని దోచుకున్నది నిజం కాదా .." ప్రశ్నించాడు తను.

" అభివృద్ది చెందిన జాతి ,చెందని ప్రాంతానికి వెళ్ళి సంపద ని ఆర్జించడం లోక స్వభావం లోనే ఉంది.ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నదదే...రూపాలు వేరు కావచ్చు.కాసేపు చరిత్ర పుస్తకాల్లో చదివినది అవతల ఉంచండి.బ్రిటీష్ వాళ్ళు చేసినదంతా రైట్ అని అనను.అయితే ఒకటి మాత్రం నిజం...మనం పైకి ఎన్ని చెప్పినా ...ఈ దేశం లోని అధో జగత్తు వర్గాలకి విద్య అనే ద్వారం తెరిచింది బ్రిటీష్ వారు మాత్రమే..అంటే కాదనగలమా!వాళ్ళు ప్రారంభించిన కొన్ని పనులు మన అభివృద్ధిని వేగిరపరిచాయి.అనేక మూఢనమ్మకాల తో కునారిల్లే సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన రాజారాం మోహన్ రాయ్,వీరేశలింగం పంతులు,ఫూలే ఇంకా ఇలాంటి వారికి చేయూతనిచ్చారు.ఈ రోజున ఇంగ్లీష్ అనే కిటికీ ద్వారా ఎంత ప్రపంచాన్ని చూస్తున్నాం..ఎన్ని దేశాలలో కి పరుగులు తీస్తున్నాం..?"

" చైనా ,జపాన్ లాంటి దేశాలు ఇంగ్లీష్ కాకుండా వారి మాతృ భాషల తోనే అభివృద్ది చెందలేదా" వాదించాడు తను.

" వాటి ఆత్మ వేరు.మన దగ్గర ఉన్నన్ని వందల ఉపకులాలు,భాషలు అక్కడలేవు.అవసరమైనప్పుడు ఐక్యం గా పోరాడే జాతీయ సమైక్యత అక్కడి సంస్కృతి లో ఇమిడి ఉంది.ఏరోజునా చైనా గాని జపాన్ గాని యూరోపియన్ల చేత రాజకీయం గా పరిపాలింపబడలేదు ..దాని కారణం అదే..!కాని మనం.. దేశం అనే భావన ఎక్కడుంది..? కుల ప్రయోజనాలు,ప్రాంత ప్రయోజనాలు ఆ తర్వాతనే ఏదైనా..!" రావు గారి లోక జ్ఞానం ఎంత లోతైనదో అర్ధం అవుతోంది.

"మరోలా అనుకోకపోతే ఓ సందేహం...మీరు ఇంత మారుమూల ప్రదేశం లో ఎందుకున్నారు రిటైర్ అయిన తరువాత"

" నేను రిటైర్ అయ్యే ఇరవై ఏళ్ళు దాటింది...ఎక్కడ మనసు ఉంటే అక్కడ నివసించాలి.అన్నీ అవే వస్తాయి.మనం బద్ధకించనపుడు.మనకి ఇష్టమైనపుడు.."

"మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు.నాకు ఇంత గా సహకరించినందుకు.."

" ఆ ..దానిదేముందిలెండి...!మరి ఈ ఆర్టికల్ కి ఏమి పేరు పెడతారు..?"

"ఒక స్మశానం -కొన్ని స్మృతులు "

"బావుంది.." నవ్వుతూ అభినందించారు రావు గారు. (సమాప్తం)  

Tuesday, April 24, 2018

ఆ రోజు (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఆ రోజు  (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఇది నిజమేనా...! ఊహా గానమా..! లేదా ఇంకేమైనా ఉందా ఆ వార్త వెనుక...?ఏమైనా కానీ..!ఆ వార్త చదివిన తర్వాత కాసేపు ఒళ్ళు జలదరించిన మాట మాత్రం వాస్తవం.ఎన్ని రకాలుగా సర్ది చెప్పుకున్నా అది నిజం.ఇంతకీ ఏమిటది ..అంటున్నారా..అక్కడకే వస్తున్నా..!రెండు రోజుల క్రితం "ఒరిస్సా పోస్ట్" ఇంగ్లీష్ డైలీ ని నా లాప్ టాప్ లో చదువుతుండగా ఒక విచిత్రమైన వార్త తారసపడింది.అయినా ఆ దిన పత్రిక తో నీకేం పని..అనవద్దు.ఒరిస్సా గురించిన రోజువారి వార్తలు,ఇంకా సాంస్కృతిక, సాహిత్య,సామాజిక పరిణామాలు దానిద్వారా తెలుసుకుంటూ ఉంటాను.అది అనే కాదు వివిధ రాష్ట్రాల్లో నుంచి వెలువడే రకరకాల న్యూస్ పోర్టల్స్ ని ఆన్ లైన్ లో చదవడం నాకు ఓ హాబీ.ముఖ్యంగా ఆంగ్లంలో మరీ సులువు.తధాగత శతపథి సంపాదకుడు గా వెలువడే ఈ ఒరిస్సా పోస్ట్ ఇంగ్లీష్ డైలి యొక్క శైలి కూడా నాకు నచ్చుతుంది.

సరే..ఇంకా ముందుకి వస్తాను.ఆ రోజు నేను చదివిన విచిత్ర వార్త ఏమిటంటే అది ఆత్మల గురించిన విషయం.అవును మీరు సరిగానే చదివారు. భువనేశ్వర్ లోని రైల్వే స్టేషన్ నుంచి జన్ పథ్ మార్గ్ లోని బిగ్ బజార్ వరకు ఉన్న మార్గం అంతా "ఆత్మల" కి ఆలవాలమైన ప్రదేశమని ...ముఖ్యంగా అర్ధరాత్రిళ్ళు వేళ ..కొంతమందికి కొన్ని అనుభవాలు కలిగాయని ..అదీ ఆ వార్త సారాంశం.ఇంతకీ ఇదెవరు చెప్పారని అనుకుంటున్నారు ...?ఆ భువనేశ్వర్ లోనే ఉన్న ఇండియన్ పేరా నార్మల్ సొసైటి వాళ్ళు.అతీంద్రియ శక్తుల మీద పరిశోధన చేసే ఓ సభ్యుల బృందం అది.

మరయితే దానికీ నీకు లంకె ఏమిటి అని నన్ను అడగవచ్చు.ఉంది.ఒక నెల క్రితం నేను భువనేశ్వర్ వెళ్ళి ఉండకపోతే ...ఆ  రోడ్డు మీదుగా నడిచి ఉండకపోతే ..సవాలక్ష వార్తల్లో ఇది ఒకటిగా చదివి మర్చిపోయే వాణ్ణి..!

*  *  *  *   *

ఆ రోజు నాకు బాగా గుర్తు.నాకున్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే ఒక ప్రణాళిక వేసుకొని నేను ప్రయాణాలు చేయను.మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు కూడా.దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతుంటాను.అయినా వాటిని వెంటనే మర్చిపోతుంటాను.ప్రయాణం ఇచ్చే అనుభూతి ముందు అవెంతా..?ఓ బ్లాగర్ మిత్రుణ్ణి కలవడానికి ఇంకా భువనేశ్వర్ ని మళ్ళీ ఓసారి దర్శించడానికి బయలుదేరాను.ఆన్ లైన్ లో చెక్ చేస్తే సమీప రైల్వే స్టేషన్ నుంచి టికెట్ దొరికే పరిస్థితి లేదు.వెంటనే విశాఖ బస్ ఎక్కేశాను.అక్కడ దిగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ని అందుకున్నాను.మధ్యానం రెండున్నర దాటింది.మాస్టర్ కేంటిన్ ఏరియా లోని రైల్వెయ్ స్టేషన్ లో దిగేసరికి.భువనేశ్వర్ లోని విశేషం ఏమిటంటే పచ్చదనం బాగా ఉండటం వల్ల నో ఏమో పెద్ద వేడి గా అనిపించలేదు.రైల్వెయ్ స్టేషన్ ముందు నుంచి అశోక్ నగర్ మెయిన్ రోడ్ మీదకి పోవడానికి రెండు దారులు ఉన్నాయి.మళ్ళీ అవి పోయి జన్ పథ్ మార్గ్ కి కలుస్తాయి .అక్కడ ఒక చౌరస్తా.నేను ఎడమ వేపున బస్ స్టాప్ ముందు నుంచి దారి తీశాను.గతం లో నేను దిగిన హోటల్ కి అది దగ్గర మార్గం.మళ్ళీ ఎడమ వేపు ఉన్న గల్లీ లోకి తిరిగాను.దాన్ని ఝన్ ఝన్ వాలా అని పిలుస్తారు.అక్కడ వరసాగ్గా ఉన్న హోటళ్ళ లో రెండవదే అమృత హోటల్.

గతం లో రెండేళ్ళ క్రితం వచ్చినపుడు అప్పుడప్పుడే నిర్మాణం పూర్తయిన దశ లో ఉంది.ఒక కొత్త వాసన.ఇప్పుడు కొద్దిగా పాతబడింది ..అయినా శుభ్రత కి వచ్చిన లోటు ఏమీ లేదు.ముందర పూల మొక్కలు ఆహ్లాదకరం గా ఉన్నాయి.అప్పుడు రెసెప్షన్ లో గణేశ్ మిశ్రా అనే యువకుడు ఉండేవాడు.అతని స్థానం లో ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తి.హోటల్ రేట్లు అప్పటికీ ఇప్పటికీ పెద్ద గా పెరగలేదు అనిపించింది.సింగిల్ రూం నీట్ గా ఉంది.మల్లె పూవు లాంటి బెడ్,ఒక కుర్చి,ఒక టీ పాయ్ ,కప్ బోర్డ్ ..అంతా హాయి గా ఉంది.రిసెప్షన్ కౌంటర్ ఎదురు గా ఇంతలేసి కళ్ళ తో పూరీ జగన్నాధుని చిత్ర పటం.తన సోదరీ సోదరుని తో..!

సాయంత్రం కాగానే తలారా స్నానం కానిచ్చాను.ప్రయాణం వల్ల కలిగిన నిద్ర మత్తు వదిలిపోయింది. హోటల్ నుంచి బయటబడ్డాను.ఆ ఝన్ ఝన్ వాలా నుంచి తిన్నగా నడుచుకుంటూ వచ్చి ప్రధాన రహదారి మీద కి వచ్చాను.కనుచూపు మేర వరకు నగరం దేదీప్యమానం గా వెలిగిపోతోంది.ఇంకా ముందుకు సాగుతూ పండా మార్ట్ దాకా వచ్చి వీధి తిండి ఏదైనా ప్రయత్నించుదాం అనుకున్నాను.
దహి వడ-ఆలూ దం ని రుచి చూశాను.ఫరవాలేదు అనిపించింది.అక్కడే ఉన్న ఓ హోర్డింగ్ లో పరిశీలనగా చూస్తే తోశాలి ప్రాంగణం లో హేండి క్రాఫ్ట్స్ కి సంబందించిన ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లు గా రాసి ఉంది.అంత కన్నా ముందు అదే చోట జరుగుతున్న  సత్యజీత్ జెనా యొక్క మ్యూజికల్ ప్రోగ్రాం నన్ను ఆకర్షించింది.సరెగమ లిటిల్ చాంప్స్ లో తను మంచి ప్రతిభని కనబరిచిన బాల గాయకుడు.కియోంజర్ జిల్లా కి చెందిన అతను ఆ ఒక్క ప్రొగ్రాం తో ఎంతోమందిని ఆకర్షించాడు.
అది రాత్రి ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుందని ఉంది.ఇక ఆలశ్యం ఎందుకని బారా ముండా వెళ్ళే బస్ ఎక్కాను.చేరుకునేసరికి అక్కడ అంతా కోలాహలం గా ఉంది.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ ఉన్నాయి.తెలుగు వారి స్టాల్స్ ఉన్నాయా అని చూశాను.ఉన్నాయి.అదేమిటో గాని మనాళ్ళు గదా అని పరాయి రాష్ట్రం లో పలకరించామో మనల్ని ఇంకా చులకన గా చూసి చెప్పిన దానికి ఒక్క పైసా తగ్గించరు.కొన్ని గతానుభవాలు అలా ఉన్నాయిలెండి.

భువనేశ్వర్ ఈ రాష్ట్రానికి రాజధాని అయితే ,కటక్ సాంస్కృతిక రాజధాని గా భావిస్తారు.ప్రాచీనమైనవీ,ఆధునికమైనవీ అన్నీ కలిపి  ఒక నగరం లో కొన్ని వందల గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది ఈ భువనేశ్వర్ లోనే.ఒక ప్లాన్ ప్రకారం ఏర్పడిన నగరాల్లో ఇది ఒకటి.విపరీతమైన నగరపు  వత్తిడి అనేది ఎక్కడా ఫీలవ్వము.అంతా చూసుకొని హోటల్ కి బయలు దేరాను.అప్పటికి రాత్రి పది అయింది.ప్రధాన వీధుల్లో తప్పా మిగతా చోట్లా పెద్ద గా జనాలు కనిపించడం లేదు.ఝున్ ఝున్ వాలా కి దారి తీసే మొదట్లో నే ఆటో దిగాను.దాని పక్కనే యూకో బ్యాంక్ శాఖ.ఇంకో పక్క సగం కూలిన అపార్ట్మెంట్ ..ఏమిటో ఒక ప్రేత కళ గోచరించింది ఆ పరిసరాల్లో..!

  ఎక్కడో ఒక కుక్క దూరంగా మొరుగుతున్న శబ్దం...!ఆ యూకో బ్యాంక్ పక్కనున్న చిన్న వీధి నుంచి ముందుకు సాగుతున్నాను.జనాలు బయట ఎవరూ కనబడటం లేదు.మా హోటల్ లోకి వచ్చి రిసెప్షన్ లో తాళాలు తీసుకుని రూం తెరిచి బెడ్ మీద వాలిపోయాను.కాసేపు రెస్ట్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళి ఫ్రెష్ అయి నిద్ర పట్టక టి.వి. ని ఆన్ చేశాను.దామోదర్ రౌత్ అనే మినిస్టర్ ని అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదవి నుంచి తొలగించారు.ఓ టివి,కళింగ టివి,ఈ టివి ఒడియా ఇలా ప్రాంతీయ చానెళ్ళు అన్నిట్లో అదే చర్చ,వార్తలూనూ.బ్రాహ్మల మీద ఆయన తీవ్ర విమర్శలు చేసిన దరిమిల ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందట.దాని మీద రెండు వర్గాలు గా చీలి రగడ జరుగుతోంది..!

ఒరియా సమాజం మౌలికం గా ఉత్తరాది కే దగ్గరగా ఉంటుంది,దక్షిణ జిల్లాల్లో కొంత తెలుగు వారి ప్రాధాన్యత ఉన్నప్పటికీ..!అక్కడ రాజకీయ ,వ్యాపార,సామాజిక ఇంకా అన్ని రంగాలన్నిటిలోను పై భాగం లో ఉండేది పట్నాయక్ లు అనబడే  కరణాలు ఇంకా బ్రాహ్మణులు.ఆటో రిక్షా నడిపే వారి దగ్గర నుండి ముఖ్యమంత్రి పీఠం దాకా వీరు తారసపడటం మనం చూడవచ్చు.ఇదొక రకమైన సామాజిక చిత్రపటం.

అలా చానెళ్ళు తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడు వొచ్చిందో నిద్ర వచ్చేసింది.ఓ గంట పాటు సోయి లేనట్లు గా నిద్రపోయాను.ఎందుకో కళ్ళు తెరిచి చూస్తే టి.వి. వాగుతూనే ఉంది.లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.ఓపిక తెచ్చుకొని లేచి బట్టలు విప్పేసి లుంగి కట్టుకున్నాను.టి.వి.ని ఆఫ్ చేశాను.జీరో బల్బ్ ఆన్ చేసి మిగతా లైట్లు ఆఫ్ చేశాను.మళ్ళీ బెడ్ మీద ఒరగడం తో జీవుడు నిద్ర లోకి జారుకుంటున్నాడు.ప్రాణం హాయి గా ఏ లోకాలకో చేరుకుంటోంది ..విశ్రాంతి లో..!ఇహ కాసేపు అలాగే గాఢ నిద్ర లోకి జారుకుంటే మళ్ళీ తెల్లవారు జామునే తెలివి వచ్చెదేమో..!

ఒక వైపు ఒత్తిగిల్లి పడుకున్నాను గదా..!ఉన్నట్లుండి ఎవరో తన వెనుక భాగాన్ని నాకు ఆనించి కూచున్నట్లుగా అనుభూతి కలిగింది. నా లోపల జీవుడు ఎలర్ట్ అయ్యాడు..ఎవరది అని ప్రశ్నిస్తూ..! కళ్ళు తెరవాలని ప్రయత్నించాను.ఎవరో ఫెవికోల్ తో నా రెప్పల్ని అలా అంటించేసినట్లు అవి తెరుచుకోవడం లేదు.మళ్ళీ ప్రయత్నించాను.అబ్బే లాభం లేదు.ఏమయింది నాకు...!ఎవరది 'అని అడుగుదామని నోరు మెదపబోయాను.ఈ పెదాలు తెరుచుకోవడం లేదు.ఈ అవయవాలు అన్నిటిని నేనేగా నియంత్రించవలసింది..? మరి నా మాట వినడం లేదేమిటి ఇవి..?  
అశక్తుడనై అలాగే పడుకుని నిశితం గా గమనిస్తున్నాను..!జరుగుతున్న దాన్ని కళ్ళు తెరవకుండానే..!కొన్ని సెకండ్లు గడిచిన తర్వాత నా కటి ప్రదేశం పై ఎవరో చేతి తో తడుముతున్న అనుభూతి కలుగుతోంది.వెన్ను లో చలి పుట్టడం అంటే ఏమిటో మొదటిసారి గా అర్ధమయింది.వెంటనే నా ఆధ్యాత్మిక గురువులు గుర్తుకు వచ్చి మనసు లోనే  ప్రార్దించాను. ఈ సంకటం నుంచి దాటించమని.నా గది చుట్టూరా మీ రక్షణ వలయాన్ని ఏర్పరచండి అని..!అలా పది నిమిషాలు గడిచాయి.వాన వెలిసి పొయినట్లుగా అయింది.ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి,పెదాలూ  తెరుచుకున్నాయి..ఇప్పుడు ఒక కొత్త మనిషిని అయినట్లయింది.మెల్లిగా లేచి బెడ్ చివరనే కూర్చున్నాను.కాసిన్ని నీళ్ళు తాగి ట్యూబ్ లైట్ వేసుకున్నాను.బాత్ రూం కి వెళ్ళి వచ్చి నిద్రకి ఉపక్రమించాను.లేచేసరికి తెల్లవారింది.ఇక ఎలాటి అసుర శక్తులు దరి జేరినా ఇక భయపడను.ఆ తర్వాత మరో మూడు రోజులు అదే రూం లో ఉన్నాను.మళ్ళీ ఆ సంఘటన పునరావృతమవుతుందా అని చూశాను గాని ఎందుకనో అలా జరగలేదు...!దానికి కారణం ఏమిటి అంటే ఏదో ఒకటి మీకు నేను చెప్పగలను.కాని అదేదీ సరైనది కాదు అని నాకు తెలుసు .

నేను తిరుగుప్రయాణం చేసే రోజు అది..!చెక్ అవుట్ చేసేటప్పుడు అడిగాను రిసెప్షన్ లో ఉన్నతన్ని" ఈ మధ్య కాలం లో ఎవరైనా మీ హోటల్ చుట్టుపక్కలా సూసైడ్ చేసుకొని చనిపోయారా " అని..!ఆ హోటల్ లో జరిగిందా అంటే బాగోదు గదా..!

" లేదు..లేదు..అలాంటిది ఏమీ లేదు" అన్నాడతను,నిర్ఘాంతపోతూ..!

"ధన్యబాద్" అని చెప్పి నా లగేజ్ తీసుకొని బయటకి నడిచాను.గేటు దగ్గర ఉన్న చౌకీదార్ నన్ను చూసి ఒద్దికగా సేల్యూట్ చేశాడు.
ఓ పది నోటు తీసి అతని చేతి లో పెట్టాను.తలవని తలంపు గా వెనక్కి తిరిగి చూస్తే రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి అక్కడి నుంచే నా వేపు తదేకం గా చూస్తున్నాడు.ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా తను..!తెలియదు..!ఇంకో పావు గంట లో నా రైలు పట్టుకోవాలి ,నాకిప్పుడు టైం కూడా లేదు ,పిలిచినా వెనక్కి వెళ్ళడానికి..! (సమాప్తం)    

Thursday, March 29, 2018

దంతెవాడ (కధ) --మూర్తి కె.వి.వి.ఎస్.

దంతెవాడ (కధ)
 --మూర్తి కె.వి.వి.ఎస్.

కుంటకి చేరుకునేసరికి రమారమి ఉదయం పది అయింది.బస్ ఊరి పొలిమేరలోనే ఆగింది...బస్ స్టాండ్ లో కాకుండా!చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన బస్సులు మాత్రమే ఆ స్టాండ్ దాకా అనుమతింప బడతాయిట.ఆ తర్వాత తెలిసింది.భద్రాచలం నుంచి కుంట సుమారు గా అరవై అయిదు కిలో మీటర్లు ఉంటుంది.ఆ ఊరు ఉండేది చత్తీస్ ఘడ్ లో అయినా తెలుగువాళ్ళు ఎక్కువ కావడం మూలాన వాళ్ళు ఇక్కడ భద్రాచలం డివిజన్ ప్రాంతం తో అవినాభావ సంబంధం కలిగిఉండేవారు.వ్యాపారాలకో ,ఉద్యోగాలకో ,వ్యవసాయానికో అక్కడికి వెళ్ళిన తెలుగు కుటుంబాల పిల్లలు ఇక్కడకి వచ్చినప్పుడల్లా అక్కడి విశేషాలు తెలుస్తుండేవి. అయితే ఇప్పుడంతా పరిస్థితులు మారిపోయినవి.దుమ్ముగూడెం,చర్ల ,వెంకటాపురం ఇలా డివిజన్ లోని ఏ మండలం నుంచి అడ్డంగా పడిపోయినా కొంతసేపటికి చత్తీస్ ఘడ్ లోని ఏదో ఊరికి చేరుకుంటాము.

బస్ దిగి అలా ఊళ్ళోకి మెల్ల గా నడవసాగాడు శ్రీను.కుంట మరీ గ్రామం కాదు,అలా అని పెద్ద పట్టణమూ కాదు.చాలా రాష్ట్రాల్లో మాదిరిగా ఇంకా అడవుల విధ్వంసం మొదలవలేదు ఇక్కడ. అందుకనే కాబోలు నలువేపులనుంచి చల్లని స్పర్శతో కూడిన గాలులు హాయిగా శరీరాన్ని తాకుతున్నాయి.వీధులు శుభ్రంగా ఉన్నాయి.ఇరువేపులా ఎలాంటి మానవ విసర్జితాలూ లేకుండా...! ఒక ప్రదేశం లోని సభ్యతా సంస్కారాలు ఇలాంటి చిన్న విషయాల్లోనే వెల్లడవుతుంటాయి.ఎర్రని నేల.ఊరినిండా పచ్చదనం.కాంక్రీట్ రోడ్ కి అటూ ఇటూ దుఖాణాలు.డాబాలు ఉన్నాయి.పెంకిటిళ్ళూ ఉన్నాయి.కొన్ని రెండు మూడూ అంతస్థుల ఇళ్ళు...అలా ఆ రోడ్డు గుండా తిన్నగా వెళ్ళి ఎడమ వేపు తిరగ్గా అక్కడ బస్ స్టాండ్ కనిపించింది. దానికి ఒక పక్కగా ఒక చిన్న ఇడ్లీ బండి కనిపించింది.

" ఏక్ చాయ్ లావ్ భాయ్" అన్నాడు శ్రీను.

ఒక గ్లాస్ లో నిండుగా పోసి ఇచ్చాడు ఆ టీ బండి వాలా..!చాలా వేడిగా ఉంది.ఊదుకుంటూ మధ్య మద్య లో కొద్దిగా సమయం తీసుకుంటూ తాగుతున్నాడు శ్రీను..!

" తెలుగు వాళ్ళా" అడిగాడు ఆ బండి యజమాని.తాగే టీ లోపలకెళ్ళి పొలమారింది శ్రీనుకి.

" అవును ..ఏంటి మీకు తెలుగు వచ్చా " అన్నాడు.

" మెం తెలుగు వాళ్ళమేనండి ..వ్యాపారం మీద ఇటు వచ్చేశాం"

" అలాగా ..ఏ ఊరు మీది"

" అసలు మా పూర్వీకులది తూ గో జి జిల్లా రాజోలు అండి...భద్రాచలం లో బ్రిడ్జ్ కట్టే సమయం లో పనికోసం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.అక్కడి నుంచి క్రమేపి మేము ఇక్కడ హోటల్ పెట్టుకుందామని వచ్చాము.వచ్చి సుమారు గా ఏడేళ్ళు అవుతోంది " అన్నాడాయన.


"ఏం ..ఏడు సంవత్సరాలు! దాదాపు గా పది ఏళ్ళు దాటుతోంది " అంతలోనే అతని భార్య అందుకొని అన్నది.అలా అనేసి దగ్గర్లో ఉన్న బోరింగ్ దగ్గర కెళ్ళింది నీళ్ళ బిందె తీసుకురావడానికి.

" ఆ..ఆ..అవుద్దండి...అసలు సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయో  అర్ధం కావట్లేదు.యమ స్పీడ్ గా ఎల్లిపోతందండి కాలం" అన్నాడతను.

" ఫర్లేదా ..ఎలా ఉంది బిజినెస్..."

" మన వైపు వేసే దోసె అంటే చచ్చిపోతారండీ ఇటు"

" అయితే ఓకె అన్నమాట.అన్నట్టు రామ్మోహన్ అని ఒక మాస్టార్ ..ఇక్కడ ...ఏమైనా ఐడియా ఉందా మీకు " డబ్బులిస్తూ అడిగాడు శ్రీను.

" ఆ..గుర్జీ...అండి..!తెలియదు కాని ఇలా ముందు నుంచి వెళ్ళిపోయి ..ఆ మూలమలుపు దగ్గర ఇళ్ళలో ఎవరినైనా అడగండి ..గుర్జీ లు అక్కడ కొంతమంది ఉన్నట్లున్నారు "

గుర్జీ ..ఏంటబ్బా..? అనుకున్నాడు.అంతలోనే తట్టింది అది గురూజీ కి వచ్చిన తిప్పలని.  
మొత్తానికి రామ్మోహన్ ఇల్లు ఈజీగానే దొరికింది.ఒక చిన్న సంస్థానం లా ఉంది.ముందు బిజినెస్ కాంప్లెక్స్ లా కొన్ని పోర్షన్లు ఉన్నాయి.దాని పక్కనుంచి వెళితే ఆయన ఇల్లు ఉంది.మంచి గార్డెన్ ఉంది...దాని ముందు.విశాలంగా హాయి గా ఉంది ఆ నివాసం.లోనికి వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించాడు రామ్మోహన్.లోపల ఇల్లు అదీ చూస్తే మంచి టేస్టే ఉందీయనకి అనిపించింది.

కుశల ప్రశ్నలు అయినతర్వాత ఫ్రెష్ అయ్యాడు శ్రీను  .ఆ తర్వాత  అతని కాసేపు విశ్రాంతి తీసుకోమని ఓ రూం లోకి పంపాడు.అలసట గా ఉందేమో శరీరం ..పన్నెండు గంటలకి గాని మెలకువ వచ్చింది.హాల్లోకి వచ్చి కూర్చున్నాడు శ్రీను


" మీ గురించి మా బావ గారు ఫోన్ చేశారు" నవ్వుతూ చెప్పాడు రామ్మోహన్.కాదు నేనే చేయించాను అందాం అనుకొని ఆగిపోయాడుశ్రీను.
.లోపలకి వెళ్ళి భార్య కి వంట చేయమని పురమాయించి అతని కొడుకు ని తీసుకొచ్చి శ్రీను కి పరిచయం చేశాడు రామ్మోహన్.

" వీడు మా చిన్నాడు...ఇక్కడే టెంత్ చదువుతున్నాడు హిందీ మీడియం.అలాగే మాకు వ్యాపారం లో కూడా సహకరిస్తుంటాడు "

" అదేమిటి...మీరు మాస్టారు గదా ఇక్కడ"

" మా బావ గారు చెప్పాడా...కరక్టే.కాని ఇక్కడ బడిపంతుళ్ళకి అంత జీతాలేమీ ఉండవండి.నేను సిమెంట్ షాప్ చూసుకుంటాను.మా ఆవిడ కిరాణం షాప్ ..అంతా మా ఎదురు కాంప్లెక్స్ లోనే"

" మరి బడికి వెళ్ళకపోతే ఎలా... సమస్య కాదా "

" భలే వారే...అసలు వెళితేనే సమస్య"

" అదేమిటి.."

" నేను చేసేది కుంట బ్లాక్ లోని ఒక గ్రామంలో...అక్కడకి రోజు వెళితే అలా రావద్దని అనే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు."లోపల వాళ్ళ"  ప్రభావం ఎక్కువ లెండి.ఇంకో వైపు ఊళ్ళో వాళ్ళతో కొద్దిగా ఎక్కువ సాన్నిహిత్యం గా ఉన్నా పోలీస్ ల కన్ను ఉంటుంది.ఎందుకొచ్చిన తంటాలు మనకి...అవన్నీ అవసరమా..?అందుకే నెలకి ఒకటి రెండుసార్లు ఊర్లో పెద్దలకి కనబడి వచ్చేస్తుంటాను"

"ఓహో ఆ సమస్య ఉందా.. మరి మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు..చెప్పలేదు"

" చెన్నై లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు "

" ఎందుకు..ఇక్కడ దగ్గర్లో జగ్దల్ పూర్ లో ఆ కాలేజీలు లేవా"

" ఉన్నాయిలే గాని..బయట ప్రపంచం కూడా తెలియాలిగదా పిల్లలకి " ఎందుకనో అసలు కారణం అది కాదనిపించింది.రెట్టించదలచలేదు.

అంతలోనే వాళ్ళవిడ వచ్చి వంట సిద్ధమయినట్లు తెలిపింది.మాటల్లో పడి కాలాన్ని గమనించలేదు.ఒంటి గంట కావస్తున్నది.తను లేస్తూ శ్రీను వేపు తిరిగి అడిగాడు రామ్మోహన్ " అన్నట్లు శ్రీను గారు ..ఒక బీర్ ఏమైనా తీసుకుంటారా" అని.

" హ్మ్..ఎప్పుడైనా...రేర్ గా"

" పదండి" అంటూ ఇద్దరూ కలసి ఎదురు గా ఉన్న కాంప్లెక్స్ లో ఒక రూం లోకి వెళ్ళారు.లోపల నాలుగు కుర్చీలు ,ఓ టీపాయ్ ,ఒక బీరువా ఉంది.ఇలాంటి కార్యక్రమాలకి ఈ రూం ని కేటాయించుకున్నట్లు అర్ధమయింది.కూర్చున్న తర్వాత బీర్ ల మూతలు తీసి జాగ్రత్త గా ద్రవాన్ని రెండు గ్లాస్ ల్లో నింపాడు రామ్మోహన్. ఇద్దరూ చెరో బీర్ ని లేపిన తర్వాత,రామ్మోహన్ మెల్లిగా లేచి బీరువా తాళం తీసి దానిలో నుంచి ఒక పెద్ద వోడ్కా బాటిల్ తీశాడు. రెండు గ్లాస్ ల్లో సగం దాకా బీర్ ని పోసి మిగతా సగాన్ని వోడ్కా తో నింపాడు.శ్రీను కి కంగారు పుట్టింది.

" రామ్మోహన్ గారు...ఏమిటండీ అది.అసలే నా కెపాసిటి ఒక బీరున్నర ..అలాంటిది మీరు అలా కాక్ టైల్ చేసి పారేస్తే ఎలా.."

" అబ్బా..ఊరుకొండి గురూ గారు...మీరు మళ్ళీ మళ్ళీ కలుస్తారా ఏమిటి ..?తాగితే కొద్దిగా అయినా కిక్ ఎక్కాలిగదండి ..లేకపోతే ఎందుకు...తాగడం..! ఒమర్ ఖయ్యాం ఏమన్నాడో తెలుసా ..తాగడం తప్పు కాదు...తాగి తెలివి లో ఉండడం తప్పు అని..!"

సరే..కానీ..!ఒక్కోళ్ళకి ఒక్కో రోజు వస్తుంది.వాళ్ళేం చెప్పినా వినాలి తప్పదు..!మెల్లిగా ఆ ద్రవాన్ని ఆస్వాదించసాగారు.

" ఆ ..చెప్పండి శ్రీను గారు...ఎందుకు ఇటు వేపు ప్రయాణం పెట్టుకున్నారు " అడిగాడు రామ్మోహన్.

" మా నాన్న గారికి మోకాలు నొప్పులండి ..ఇక్కడ దంతెవాడ లో ఎవరో నాటు  మందు ఇస్తామంటేనూ బయలుదేరా ...మీ బావగారు నా క్లాస్ మేట్ లేండి...మాటల్లో చెప్పాడు మీరు ఇక్కడ కుంట లో ఉంటారని..వీలుంటే కలిసి వెళ్ళమని చెప్పాడు.."

" బస్ లు ఇక్కడనుంచి ఉంటాయిలే గాని...రోడ్ మాత్రం అద్వానం గా ఉంటుంది..అయిదారు గంటల ప్రయాణం ! ఓ పని చేయండి ఎదైనా వెహికిల్ ఎంగేజ్ చేసుకుంటే తొందర గా వెళ్ళచ్చు"

" నాకు మాత్రం పనేం ఉంది గనక..మెల్లగా బస్ లోనే వెడతా"

" సరే మీ ఇష్టం"

" రామ్మోహన్ గారు..ఎలా ఉంది ఇక్కడ పరాయి రాష్ట్రం లో జీవితం"

" ఇంకా ఏం పరాయి...మా చిన్నప్పుడే ఇక్కడకి వచ్చేశాం. మా నాన్నగారు ఆర్.ఎం.పి . వైద్యుని గా పనిచేసేవారు.అప్పుడు ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతం గా ఉండేది.ఒక పదేళ్ళ నుంచే బాగా డిస్టర్బ్ అయింది.ఈ కుంట లో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు.మిగతా అంతా నార్త్ నుంచి వచ్చిన మార్వాడీలు ఇంకా బెంగాలీ వాళ్ళు ఉంటారు.వ్యాపారం కూడా ఎక్కువ గా వీళ్ళ చేతి లోనే ఉంది"

" ఎందుకని అలజడి..ఇదంతా"

"రకరకాల వాళ్ళు రకరకాలు గా చెబుతారు.ఇక్కడ ఆదివాసీల్లో కొంతమంది మాత్రం  తెలుగు వాళ్ళు వచ్చి మా ప్రాంతమంతా కల్లోలం చేశారు అని ఆరోపిస్తుంటారు.."

" అది నిజమా"

" హ్మ్..పాక్షిక సత్యం"

" పేపర్ లో చత్తిస్ ఘడ్ గురించి వార్తలంటూ చదివితే...హింసాత్మక ఘటనల గురించే చదువుతుంటాం"

" అటువాళ్ళు ఇటు వాళ్ళ మధ్య లో పాపం అనేక గ్రామాలు మనుషులు లేకుండా ఖాళీ అయిపోయాయి.బతుకు తెరువు కోసం బోర్డర్ లో తెలుగు ప్రాంతాలకి వలస వస్తుంటారు..."

" అవును ఆ వార్తలు కూడా చదువుతుంటాము. అక్కడ కూడా నివాసం ఇంకా ఇతర సౌకర్యాల కోసం వాళ్ళ దిన దిన పోరాటం..మిర్చి పొలాల్లో నూ,భద్రా చలం లో బస్ స్టాండ్ కి దగ్గర్లోను ,పాల్వంచ ఇంకా ఆ పైనకి పనుల కోసం గుంపులు గుంపులు గా వెళుతూ కనిపిస్తుంటారు..ఇతరులు ఎవరి తోను వాళ్ళు మాటాడగా నేను చూడలేదు..వాళ్ళ పనేమిటో అంతే..అన్నట్లుగా ఉంటారు ..లౌక్యం అనేది ఒకటుంది అని వీరికి తెలుసా అని తోస్తుంది చూసినప్పుడల్లా  "

" ఈ అతివాదం వేపు ఎక్కువగా ఆకర్షింపబడింది మడియా ఆదివాసిలు.వీరితో పోలిస్తే ముడియా తెగ వారు అభివృద్దిపొందిన వారు గా చెప్పవచ్చు.ఒకప్పుడు సల్వా జుడుం లో ఎక్కువ గా వీరే ఉండే వారు.సరే..జరిగి పోయిన చరిత్ర అనుకొండి"

" నెల్లిపాక అవతల ఓ గ్రామం లో ఒక రైతు చెపుతుండగా విన్నాను.ఈ చత్తిస్ ఘడ్ నుంచి వచ్చిన  కూలీలే చక్కగా పనిచేస్తారండి ..ఎక్కువ మాట్లాడరు..ఒక్క మిరప కాయ కూడా కింద వదిలి పెట్టరు ..శుబ్రంగా మిర్చి కోసి వాళ్ళకి రావాల్సింది తీసుకొని వెళ్ళిపోతారు అని"

" నాగరికత కానీ మాయ తెలివితేటలు గాని ఎంత మనిషి లో అభివృద్ధి చెందుతుంటే అంత కమ్మ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఆయా సమాజల్లో పెరుగుతుంటాయి.అసలు ప్రేమ ఏదో నకిలీ ప్రేమ ఏదో కనిపెట్టలేనంత ఇది గా మనుషుల ప్రవర్తనలు రూపుదాల్చుతుంటాయి.ఇదొక రకమైన వార్.కనిపించని వార్.ఒకడిని మించి ఒకడు ఎదగాలని లేదా తనను తాను రక్షించుకోవాలని...ఒక ఎన్ జి వో వాళ్ళు అదే హెల్త్ కేర్ కి సంబందించి  పిలిస్తే వెళ్ళాను ఒకసారి ఎఫెక్ట్  అయిన గ్రామానికి...!అక్కడ జరిగిన సంఘటన లో నలుగురైదుగురు గ్రామస్తులు మృత్యు వాత బడ్డారు.దానిలో ఒక సంవత్సరం వయసున్న చిన్న పిల్ల కూడా ఉంది..."

" అరే..చాలా దారుణం గా అనిపిస్తోంది..ఆ తల్లిదండ్రులు ఎంత విలపించిఉంటారో " బాధ గా అన్నాడు శ్రీను.

" అక్కడకే వస్తున్నా.ఒక నిజం చెప్పనా...నువు నమ్మవు...ఆ చంటి పిల్ల యొక్క తల్లి అక్కడే కూర్చుని ఉంది.ఆమె కంటిలో చుక్క నీరు లేదు.ఎవరితోనూ తన బాధనీ చెప్పుకోవడం లేదు. ఆ పిల్ల శవం ముందే ఏ శబ్దమూ లేకుండా కూర్చుని ఉంది.బాధ లేదని అనడానికి లేదు.అయితే దాన్ని వ్యక్తపరిచి తోటి వారి నుంచి జాలిని పొందే విధానం ఆమె కి తెలియదు"  చెప్పుకుపోతున్నాడు రామ్మోహన్. లోపలకి వెళ్ళిన మందు అతనిలోని కొన్ని తెరలని చింపి వేసింది.

ఇంతలో మొబైల్ మోగింది.సరే ..పదమని భోజనం కి లేచాము. ఇవాళ దంతెవాడ కి ప్రయాణం కుదరని పని.విశ్రాంతి తీసుకొని రేపు బయలు దేరాలి.ఇలా తనలో శ్రీను అనుకుంటూ ఉండగానే రామ్మోహన్ లోకి ఆ వార్త ప్రసారం అయిందో ఏమో .." ఇవ్వాళ ఏం వెళతారు లే గాని రేపు బయలు దేరండి" అన్నాడు. -- మూర్తి కె.వి.వి.ఎస్.      

Tuesday, September 27, 2016

సర్ అర్థర్ కోనన్ డోయల్ అంటే తెలియని వారికి కూడా షేర్లాక్ హోంస్ అంటే తెలిసి ఉంటుంది

సర్ అర్థర్ కోనన్ డోయల్ అంటే తెలియని వారికి కూడా షేర్లాక్ హోంస్ అంటే తెలిసి ఉంటుంది,అంతలా ఆ పాత్ర నిలిచి పోయింది.కేవలం ఒక డిటెక్టివ్ అనే కాదు ,అతని లాజికల్ థింకింగ్ కి అని కాదు అంతకి మించినది ఉన్నది ఆ కధల్లో..!1859 నుంచి 1930 దాకా జీవించిన డోయల్ ఈ అపరాధ పరిశోధకుని సృష్టించి తాను అలా నిలిచిపోయాడు.సగటు బ్రిటిష్ వ్యక్తి లో ఉండే చురుకైన ఆలోచన,కార్య దక్షత,సునిశిత తత్వం విభిన్న కోణాల్లో ఈ కధల్లో కనిపిస్తుంది.దాదాపు 56 దాకా రాయబడిన ఈ కధలు దేనికదే అన్నట్లుగా ఉంటాయి.మళ్ళీ అతనికి సహాయకుని గా డా.వాట్సన్ ఒకడు..చాలా కధలు అతని నుంచే మొదలవుతాయి,చెబుతున్నట్లుగా..!వాళ్ళు నివసించే ఆ బేకర్ స్ట్రీట్,ఆ ఇంటి లోని వీళ్ళ ఆలోచనల తో కూడిన పచార్లు.

సంభాషణలు వీళ్ళిద్దరి మధ్య నడిచే విధానం కూడా గమ్మత్తు గా ఉంటాయి.ఇంగ్లీష్ వారి ఆత్మ వాటి మధ్య లో  దోబూచు లాడూతూ ఉంటుంది.మొదటి కధ A Scandal in Bohemia నే తీసుకుంటే,మొదలవడమే వాట్సన్ అతని స్నేహితుడు షేర్లాక్ హోంస్ గురించిన యోచనల తో మొదలవుతుంది.బేకర్ వీధి లోని ఆ ఇంటి లోకి వెళ్ళగానే అడుగుతాడు " ఏమిటి..నువ్వు ఈ మధ్య కొకైన్ బాగా సేవిస్తున్నావు ..అది ఆరోగ్యానికి మంచిది కాదు గదా" అని," నీకు తెలుసు గదా ..నాకు ఎప్పుడు చేతి నిండా పని ఉంటేనే హాయి గా ఉంటుంది,లేకపోతే ఇదిగో ఇంతే" అంటాడు హోంస్.

అప్పటికే దీర్ఘంగా ఆలోచిస్తూ గదిలో పచార్లు చేస్తుంటాడు అతను. అంతలోనే అందిన ఒక లెటర్ ని వాట్సన్ ఈ హోంస్ కి ఇస్తాడు.దాన్ని నిశితం గా పరిశీలించి ..ఆ కాగితం క్వాలిటిని,అది ముద్రించబడిన కంపెనీ ని కొన్ని ఆధారాలతో ఊహిస్తాడు.రాత లోని శైలిని బట్టి ఇది ఇంగ్లీష్ వాడు రాసింది కాదు జర్మన్ వ్యక్తి ది అంటాడు.కాసేపయినాకా  బొహిమియా ప్రిన్స్ మారు వేషం లో వచ్చి ఒక సాయం ని సీక్రెట్ గా చేయాలని కోరుతాడు.ఓ దాన్ని వెనక్కి తీసుకు రావాలని కోరుతాడుదానికి మరి ఏమి పైకం ఇస్తారు అని అనగా నా రాజ్యం లో ఓ భాగం ఇస్తాను అంటాడు ఆ ప్రిన్స్. అయితే హోంస్ వెంటనే ఎగిరి గంతు వేస్తాడు అనుకుంటాము,కాని చాలా తాపీ గా " అది సరే..For my present expenses your Magesty " అంటాడు..వెంటనే ఆ ప్రిన్స్ కొన్ని బంగారు నాణేలు అవీ ఇస్తాడు.ఇక్కడే బ్రిటిష్ వారి చమత్కారం కనబడుతుంది.అసలు ఈ ప్రిన్స్ సమస్య ఏమిటంటే వార్సా నగరం కి వెళ్ళినప్పుడు ఒక నటీమణి తో తాను కలిసి ఉన్న  ఉన్న ఫోటోని ఆమె వద్దనే మర్చిపోతాడు.పెళ్ళి సమయం లో అది పంపిస్తానని చెబుతుంది,అలాగనక జరిగితే స్కాండినేవియా రాకుమారి తో తన పెళ్ళి చెడిపోతుంది ..ఎలా అని యోచించి ఇలాంటి వాటిని మూడో కంటి కి తెలియకుండా పరిష్కరించే హోంస్ దగ్గరకి వస్తాడు.

ఈ పనిలో భాగంగా ఒక వేషం వేస్తాడు హోంస్..గెటప్ అంతా సమూలంగా మార్చుకొని వచ్చిన అతన్ని ముందు వాట్సన్ కూడా గుర్తు పట్టడు.చివరకి అనుకుంటాడు" The stage lost a fine actor అని..!" నాకు ఓ సాయం చేయాలి.. You don't mind breaking the law"  అడుగుతాడు హోంస్..! "  Not the least" అంటాడు వాట్సన్.! మొత్తానికి బురుడి కొట్టించే ఒక ఎత్తు వేస్తారు అయితే అంత కంటే చక్కగా ఆ నటీమణి మారు వేషం లో వీరు ఇరువురిని బోల్తా కొట్టిస్తుంది. చివరకి హోంస్ ఆమె కి అభిమాని గా మారిపోతాడు.ఆ ఫోటొని తనకి ఇమ్మని అదే పెద్ద రివార్డ్ అని ప్రిన్స్ దగ్గర్నుంచి తీసుకుంటాడు.

ఈ కధ లో డైలాగ్ లు ఆలోచనా పూరితం గానూ వినోదం గాను ఉంటాయి.వర్ణనలు అన్నీ నాటి బ్రిటీష్ రోజు వారి జీవితాన్ని ప్రతిఫలిస్తాయి.ఏ మాత్రం తొట్రు పడకుండా ప్లాన్ వేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఏ భాగం వరకు అసిస్టెంట్ కి చెప్పాలో అంత దాకే చెబుతుంటాడు హోంస్,అంచెలు గా చేస్తుంటాడు పనిని.కంఫ్యూజ్ లేకుండా..!డిటెక్టివ్ బలహీనతల్ని కూడా వినోదాత్మకంగా చెబుతాడు.ఏదైనా బ్రిటీష్ వారి శైలీ విలాసమే వేరు భాషని ఉపయోగించే తీరు లో...ప్రతి Noun ని Adjective గాను Verb గాను మార్చేసి మా భాషని అమెరికన్లు భ్రష్టుపట్టిస్తున్నారు అని సగటు బ్రిటిష్ రచయితలు వాపోవడం లోను  కొంత అర్ధం లేకపోలేదు. ఏమి చేస్తాం మార్పు అనివార్యం కదా..! ...Murthy Kvvs

Monday, September 5, 2016