Showing posts with label Reviews. Show all posts
Showing posts with label Reviews. Show all posts

Friday, March 18, 2022

"నేనూ శాంత కూడా" ఒక జీవన కథ

"నేనూ శాంత కూడా" అనే జీవనకథ ని చదవడం ముగించిన పిమ్మట రెండు మాటలు రాయాలనిపించింది. చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ గారు తన జీవన పయనాన్ని ఈ పుస్తకం లో రమారమి 360 పేజీలలో వివరించారు.నిజానికి ఈ పుస్తకాన్ని కొన్ని నెలల క్రితం ఎక్కడో పుస్తకాల షాప్ లో చూశాను గాని చదవడం కుదరలేదు.కారణం ప్రత్యేకించి ఏమీలేదు.అయితే అలజంగి మురళీధర రావు గారు తమ వాట్సప్ సందేశం లో ఓసారి ఈ పుస్తకం గురించి చెబుతూ భద్రాచలం లో పుట్టి ఆ పరిసరాల్లో పెరిగిన ఓ పోలీస్ అధికారి తమ జీవిత పయనాన్ని ఓ పుస్తకం గా రాశారు మీకు ఏమైనా తెలుసా అని కవర్ పేజీ ని పంపారు.

కొద్దిగా బుర్ర కి పదును పెట్టగా అప్పుడు నాకు గతం అంతా సినిమా రీలు లా నా ముందు తిరిగింది.సుమారుగా మూడున్నర దశాబ్దాల కిందట ఈ మనిషిని కలిశాను,మాట్లాడాను.ఎక్కడా అంటే చర్ల జూనియర్ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉన్న కోటేశ్వర్రావు గారి దగ్గర కి శర్మ గారు ప్రైవేట్ కి వస్తుండేవారు.ఆ విధం గా తెలుసును.అయితే ఆ తర్వాత నిరవధికం గా కొన్ని దశాబ్దాల పాటు తనతో ఎలాంటి మాటామంతీ లేదు. ఓసారి కోటేశ్వర్రావు గారు ఖమ్మం లో కలిసినపుడు ఈయన పోలీస్ శాఖ లో అధికారి గా పనిచేస్తున్నట్లు మాటల మీద తెలిసింది.

వెంటనే పుస్తకాన్ని ఆన్ లైన్ లో తెప్పించుకుని చదివాను.శర్మ గారి శైలి చెయ్యి తిరిగిన రచయిత వలె అనిపించింది. ఒక్కసారిగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను.భద్రాచలానికి గంటన్నర ప్రయాణం లో ఉండే సత్యనారాయణ పురం లో ఉండేవారు.ఆ పక్కనే కలివేరు.భద్రాచలం డివిజన్ లో అనేక సంస్కృతులు కలిసిపోయి ఉంటాయి.గిరిపుత్రుల సంస్కృతి తో పాటు గోదావరి జిల్లా,తెలంగాణా జిల్లా పెనవేసుకున్నట్లుగా ఉంటాయి.మరోవేపు చత్తీస్ ఘడ్,ఇంకో వేపు ఒడియా మనుషులూ తిరుగుతుంటారు నానా పనుల మీద.రెండు రాష్ట్రాల సరిహద్దులూ దగ్గరే. ఇలా ఈ డివిజన్ అనేక జీవ నాడుల సంగమం.

 కూచిభొట్ల పార్ధసారధి గారు,చింతలపూడి వెంకటేశ్వర్లు గారు ఇలాంటి ఉపాధ్యాయుల గురించి చదివినపుడు వారి తో మళ్ళీ మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.ఆ యిద్దరూ నాకు బాగా తెలిసినవారే.పేరంటపల్లి వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం నా అనుభవాల్ని నెమరేసుకునేలా చేసింది. వెంకటేశ్వర్లు గారికి సాహసయాత్రలు చేయడం లో ఆసక్తి ఎక్కువ,ఆయన సకళకళా వల్లభుడు అని చెప్పాలి. కొత్తగూడెం లో శర్మ గారి చదువు ఇంకా ఇతర అనుభవాలు ఆసక్తి గా ఉన్నాయి.

ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఎస్.ఐ .గా ఉద్యోగం సంపాదించడం ఆ తర్వాత రిటైర్ అయ్యే నాటికి  నాన్ కేడర్ ఎస్.పి గా తన ప్రస్థానాన్ని కొనసాగించడం గొప్ప విషయం. జీవితం లో ఎన్నో ఎత్తుపల్లాల్ని,ఒడిదుడుకుల్ని ఎదుర్కొని విజయవంతమైన వ్యక్తి గా నిలిచారు.వాటినన్నిటిని చాలా విపులం గా మనతో పంచుకున్నారు.అన్నివిధాలా సహకరించే అర్ధాంగి దొరకడం అన్నిటికన్నా గొప్పవరం,శాంత గారు ఆయన జీవితం లోకి ప్రవేశించడం తో శర్మ గారి జీవితం సుసంపన్నమైంది.

తన ఉద్యోగ జీవితం లోని అనుభవాల్ని చాలా పేజీల్లో వర్ణించారు. రకరకాల జిల్లాల్లో రకరకాల అనుభవాలు. వ్యక్తిగత జీవితం లోని ప్రత్యేక ఘటనలు,వాటిని అధిగమించిన తీరు హాయిగా రాశారు.కొసావో సందర్శన,అక్కడి పని అనుభవాలు ఆసక్తికరం గా ఉన్నాయి.ఎన్నో వత్తిడుల మధ్య కూడా సాహితీపిపాస ని కలిగిఉండడం ,దాన్ని కొనసాగిస్తూ రచయితల సమావేశానికి ఆతిథ్యమివ్వడం అభినందించదగిన విషయం.ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం లోని కొన్ని ప్రత్యేక అంశాలు మీకు మరెక్కడ కనబడవు, ఎందుకంటే ప్రతి మనిషి జీవితం తనకే సొంతమైన ఒక చిత్రవర్ణ పటం వంటిది. 

(వెల: రూ.250, పేజీలు : 362 , ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు మరియు అమెజాన్ లో కూడా లభ్యం) 

-----  మూర్తి కెవివిఎస్    

Sunday, January 24, 2021

సర్ జాన్ ఉడ్రోఫ్-భారతీయులు గుర్తుంచుకోవలసిన పేరు

   


సర్ జాన్ ఉడ్రోఫ్ , ఈ పేరు  ప్రస్తుత తరానికి ఎంత వరకు తెలుసో మనం ఊహించడం కష్టమే..!కాని ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన బ్రిటీష్ జాతీయుడు ఈయన. భారత దేశం లో వర్ధిల్లిన తంత్ర శాస్త్ర జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత,న్యాయ నిపుణుడు అయిన వుడ్రోఫ్ దాదాపు గా 20 గ్రంథాల్ని రచించాడు. 1915 వరకు కలకత్తా హైకోర్ట్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన ఈయన ఎందుకని భారతీయ తంత్ర శాస్త్రాన్ని శోధించాలని నిర్ణయించుకున్నారు అని తెలుసుకుంటే ఆసక్తికరం గా ఉంటుంది.


కలకత్తా హైకోర్ట్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్న సమయం లో ఓ కేసు విషయమై తీర్పు వెలువరించే ప్రక్రియ లో తనకెదురైన కొన్ని సంఘటనలు ఆయన లో భారతీయ తంత్ర శాస్త్రం పై గొప్ప ఆసక్తి ని కలిగించాయి. శివచంద్ర విద్యారణ్య భట్టాచార్య అనే గురువు వద్ద దీక్ష తీసుకున్నారు.ఎన్నో ఏళ్ళు సాధనలో గడిపారు. సంస్కృత భాష లో ఉన్న ఎన్నో గ్రంథాల్ని ఇంగ్లీష్ భాష లోకి అనువదించారు. చాలా వరకు తంత్ర శాస్త్ర రహస్యాలు లిఖిత రూపం లో కంటే గురు శిష్య పరంపర గా కొనసాగుతున్నట్లు చెప్పారు. తన సాధన లో అనుభవానికొచ్చిన ఎన్నో విషయాల్ని తను రాసిన గ్రంథాల్లో పదిలపరిచారు. 


బౌద్ధ,జైన,హిందూ శాస్త్రాల పరం గా తంత్ర జ్ఞానాన్ని విశదీకరించారు.Introduction to the Tantra Sastra,Tantra of great liberation (Maha nirvana Tantra),Hymns to Goddess,Shakti and Shakta,The Serpent power,Hymn to Kali: Karpuradi Strotra,The World as Power,The Garland of letters,Principles of Tantra ఇలా అనేక రచనలు వెలువరించారు. అయితే ఆయన Arthur Avalon అనే కలం పేరు తో కొన్ని రాశారు. అటల్ బిహారీ ఘోష్ అనే మిత్రుడు ఈ ప్రయత్నం లో ఎంతో సహకరించినట్లు తెలిపారు. భారతీయ తంత్ర శాస్త్రాన్ని మొదటిసారి గా బయట ప్రపంచానికి తన రచనల ద్వారా తెలిపిన ఘనత సర్ జాన్ వుడ్రోఫ్ కే దక్కుతుంది. రిటైరైన తర్వాత బ్రిటన్ కి వెళ్ళి అక్కడ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ లో బోధించారు. అటు తరువాత ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి Beausoleil అనే ఓ గ్రామం స్థిరపడి అక్కడే జనవరి 16, 1936 నాడు మరణించారు. కనుక ఆ మహానుభావుని జ్ఞప్తి కి తెచ్చుకోవడం మన బాధ్యత. 

   -------- మూర్తి కె.వి.వి.ఎస్. 

(Printed in Sakshi Telugu Daily, on 16.01.2021) 

Thursday, May 28, 2020

The Racketeer నవల పై సమీక్ష


"The Racketeer" అనే ఈ ఆంగ్ల నవల ని ఈ కరోనా సమయం లో చదివిన పుస్తకాల లో ఒకటి గా చెప్పాలి.John Grisham రాసిన మరో లీగల్ థ్రిల్లర్ ఇది.అసలు రాకెటీర్ అంటే ఎవరు..?One who obtains money illegally,as by fraud,extortion,etc. అని రచయిత ముందు పేజీ లోనే చెబుతాడు.

ఇలాంటి లీగల్ సబ్జక్ట్స్ తీసుకొని రాయడం లో జాన్ గ్రీషం అందె వేసిన చెయ్యి.  స్వయం గా న్యాయ వాది గా పనిచేసినందు వల్ల అనుకుంటా, ఈయన కోర్ట్ లో జరిగే వ్యవహారాల్ని నైపుణ్యం తో రాసిన అనుభూతి ని మనం పొందుతాము.సరే..అక్కడ అమెరికా లో అటార్నీ అంటారనుకోండి లాయర్ ని.

ఇంతకీ రాకెటీర్ ఎవరు..? అక్కడికే పోదాము. కధ ని ప్రధాన పాత్ర అయిన Malcolm Bannister అనే లాయర్ స్వగతం గా వివరిస్తూంటాడు. "నేను ఒక లాయర్ ని,అయితే ప్రస్తుతం జైలు లో ఉన్నాను.చెప్పాలంటే ఇది ఓ పెద్ద కధ." అంటూ మొదలవుతుంది.Bannister కి 43 ఏళ్ళు.వాషింగ్టన్ డి.సి. లోని ఫెడెరల్ జడ్జ్ విధించిన 10 ఏళ్ళ జైలు శిక్ష ని అనుభవిస్తున్నాడు.సగం శిక్ష దాకా పూర్తి కావచ్చింది.వర్జీనియా స్టేట్ బార్ అతని లైసెన్స్ ని రద్దు చేసింది,కనుక తను టెక్నికల్ గా న్యాయవాది నని చెప్పుకోవడానికి లేదు. అయితే తను ఉంటున్న "Frostburg" జైలు లోని చిన్నా చితకా ఇంకా కొందరు అనుభవం ఉన్న ఖైదీ లకి న్యాయ సలహాలు వారు అడిగితే  ఇస్తూంటాడు. డ్రగ్ సంబంధ నేరాల నుంచి ఇంకా తీవ్ర నేరాలు చేసిన వారు వీరి లో ఉంటారు.

 ఇంతకీ Bannister ఎందుకు జైలు కి వచ్చినట్లు..? లా పూర్తి చేసిన తర్వాత తను ఓ చిన్న పట్టణం లో Winchester లో ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఒక మిత్రుని సలహా మేరకు ఒక బిజినెస్ టైకూన్ కి సంబందించిన ఆస్తుల కొనుగోలు విషయం లో తన సేవలు అందిస్తాడు.అయితే తన ఖర్మ గాలి దీని లో చేయని నేరానికి ఇరుక్కుంటాడు Bannister.ఆ బిజినెస్ టైకూన్ తన ధనాన్ని మనీ లాండరింగ్ ద్వారా దేశం లోకి రప్పించి ఇలాంటివి చేస్తుంటాడు.

అమెరికా చట్ట సభ లో దీని మీద పెద్ద దుమారం రేగి న్యాయ విచారణ కి ఆదేశించినపుడు దాని లో ఈ Bannister ని కూడా చేర్చడం తో తనకీ శిక్ష పడుతుంది.యధాలాపం గా జైలు (వాళ్ళ భాష లో కరెక్షనల్ సెంటర్) లో ని లైబ్రరీ లో పేపర్ చదువుతున్నపుడు ఒక వార్త Bannister ని ఆకర్షిస్తుంది. అదేమిటంటే వర్జీనియా దక్షిణ జిల్లా కి చెందిన ఒక జడ్జ్ హత్య గావింపబడతాడు. అతని పేరు Raymond Fawcett ,తనకి తెలిసి అమెరికా న్యాయ చరిత్ర లో ఇంత వరకు కేవలం నలుగురు జడ్జ్ లు మాత్రమే హత్య చేయబడ్డారు.ఇది అయిదవ ఉదంతం.FBI ఎన్నో గాలింపులు జరుపుతుంది.సరైన ఆధారాలు దొరకడం కష్టం గా మారుతుంది.

అప్పుడు Bannister జైలు అధికారుల ద్వారా ఒక ప్రతిపాదన చేస్తాడు.న్యాయస్మృతి లోని ఒక క్లాజ్ ని ఉదహరించి దాని ప్రకారం తన ని బేషరతు గా విడుదల చేసి ,తన Identity ని అంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపు రేఖలు మార్చి ,సరికొత్త పౌరసత్వం ఇచ్చినట్లయితే ఆ నిందితుడి ని తాను పట్టించేందుకు సహకరిస్తానని,దానిలో ఎలాంటి పొరబాటు జరగడానికి ఆస్కారం ఉండదని ప్రతిపాదిస్తాడు.ఈ సందర్భం లో ఎంతో చర్చ Bannister కి FBI కి మధ్య నడుస్తుంది.మానవ హక్కులకి సంబందించిన విషయం లో ఆ దేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది అనిపిస్తుంది అది చదువుతున్నప్పుడు.

సరే అని ప్రభుత్వం తరపున ఒప్పుకున్నట్లు గా FBI ప్రకటించి తర్వాత కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. (మిగతాది వచ్చే భాగం లో) ----Murthy Kvvs











































































Tuesday, April 14, 2020

Digital Fortress (Novel) and a view



Don Brown  అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. డావిన్సీ కోడ్ నవలా రచయిత గా ప్రసిద్దుడు.ఆయన రాసిందే ఈ Digital Fortress అనే ఈ ఫిక్షన్.దీన్ని టెక్నో థ్రిల్లర్ అనవచ్చును స్వభావ రీత్యా..!  NSA అనగా నేషనల్ సెక్యూరిటి ఏజెన్సీ అనేది అమెరికా యొక్క శక్తివంతమైన గూఢచార సంస్థ.ప్రపంచం లోని ఏ సమాచార వ్యవస్థ నైనా అవలీల గా టాప్ చేసి అమెరికా ప్రయోజనాల కి భంగం వాటిల్లకుండా దేశ రక్షణ కి పాటుపడటమే దీని కర్తవ్యం.CIA,FBI వంటి  శాఖలు కూడా సాంకేతికం గా దీని మీద ఆధారపడుతుంటాయి.అనుమానస్పదుల పై నిఘా పెట్టడానికి,ఇతరుల మెయిల్స్ చదవడానికి  NSA కి చాలా విస్తృతమైన వ్యవస్థ ఉంటుంది.ఎలాంటి కోడ్ భాష లో రాసినా సరే దాన్ని డీకోడ్ చేయగలిగే మెరికల వంటి క్రిప్టో గ్రాఫర్స్ అనేక మంది ఇక్కడ పనిచేస్తూంటారు.

అలాంటి దానికి సంబందించిన నేపధ్యం లో ఈ నవల సాగుతుంది.వీరివద్ద ఒక సూపర్ కంప్యూటర్ ఉంటుంది.దానిపేరు TRANSLTAR ,అసలు ఇలాంటిది ఒకటి ఉన్నట్లు చాలా కొద్దిమంది కి మాత్రమే తెలుసు.ప్రపంచం లోని సకల కంప్యూటర్ల లోని సమాచారాన్ని వడపోసి జరిగే వ్యవహారాల్ని గమనిస్తూంటుంది. సివిల్ లిబర్టీ గ్రూప్ లు కొన్ని వాదిస్తుంటాయి,ఇలాంటి వాటివల్ల పౌరుల వ్యక్తిగత హక్కులు కోల్పోతున్నారని.అయితే అధికారులు మాత్రం అసలు అలాంటి సూపర్ కంప్యూటర్ ఏమీ లేదని ప్రకటిస్తారు,అయితే అది కంటి తుడుపు కి మాత్రమే..!

ఆ సంస్థ కి డిప్యూటీ కమాండర్ Trevar Strathmore అనే ఆయన.అమెరికా ప్రయోజనాల కోసం దేనికైన వెనుకాడని వ్యక్తి.దేశ అధ్యక్షుని తో ఏ సమయం లో నైనా మాట్లాడగలిగే అవకాశం అతనికి ఉంటుంది.యాభై ఏళ్ళ పై చిలుకు వయసు లో ఉంటాడు.తనకు ఒక సవాలు ఎదురు అవుతుంది.ఒకప్పుడు తమ సంస్థ లోనే పని చేసి బయటకి వెళ్ళిన ఓ జపనీయుడు Digital Fortress అనే ఓ కోడ్ ని తయారు చేస్తాడు.అది ఈ సూపర్ కంప్యూటర్ కి ముప్పు లా తయారు అవుతుంది.దాని సీక్రెట్ పాస్ వర్డ్ ని ఆక్షన్ కి పెట్టడానికి అతను ప్రయత్నిస్తాడు.తనకి ఏమైన జరగరానిది జరిగితే ఆ పాస్ వర్డ్ ని ఉచితం గా వెల్లడి చేయమని నార్త్ డకోటా అనే అతడికి పురమాయిస్తాడు ఈ జపనీయుడు.

దీన్ని డీకోడ్ చేయడానికి సుసాన్ అనే NSA క్రిప్టో గ్రాఫర్ చాలా ప్రయత్నిస్తుంది.ఆమె ఫియాన్సీ డేవిడ్ బెకర్ ఓ ప్రొఫెసర్,తను కూడా పాటుపడుతుండగా ,ఉన్నట్లుండి Strathmore ఒక పని చేస్తాడు.డేవిడ్ ని స్పెయిన్ కి వెళ్ళి సీక్రెట్ కోడ్ ఉన్న ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురమ్మని పురమాయిస్తాడు.Seville అనే స్పానిష్ పట్టణం లో డేవిడ్ కి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి.ఈ లోపులో సంస్థ లోనే గ్రెగ్ హేల్ అనే అతని నార్త్ డకోటా నా అనే అనుమానం రేగుతుంది.మరి చివరకి ఏమయింది అని తెలుసుకోవడానికి పుస్తకం చదివితేనే తెలుస్తుంది.

చివర దాకా సస్పెన్స్ తో నడుస్తుంది కధ.ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి.డేవిడ్ స్పెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ నడిచే కధ వల్ల మనకి ఆ దేశం లో విషయాలు చాలా తెలుస్తాయి.స్పానిష్ భాషని ధారళం గా ఉపయోగించాడు.రచయిత డాన్ బ్రౌన్ కూడా పద ప్రయోగాలు కొన్ని కొత్త గా చేసినట్లు అనిపిస్తుంది.



     

Friday, April 3, 2020

"అసురుడు-పరాజితుల గాధ" పుస్తకం పై రివ్యూ (Last Part)



అసురుడు-పరాజితుల గాధ (నిన్నటి భాగం తరువాయి)

నిన్నటి భాగం లో ఎక్కడ ఆగాము..? సీత రావణుడి కి కుమార్తె ఏమిటి అనుకున్న దగ్గర గదా..!అవును ఆనంద్ నీలకంఠన్ రావణాయణం మరి ఇది.కధ ఇపుడు ఇంకో వేపునుంచి గదా సాగుతున్నది.కాబట్టి క్లుప్తం గా రాస్తాను.కొన్ని కొత్త గా నే అనిపిస్తాయి.తప్పదు.అలా రావణుడి యొక్క కూతురు ఆ ఆర్ష రాజ్యం లో జనక మహారాజు కి  దొరికి మిధిలా నగరం లో పెరుగుతూ యుక్త వయస్సు కి వస్తుంది.స్వయం వరం ప్రకటిస్తాడు జనకుడు.ఆ కాలం లో అది ఒక సంప్రదాయం ఆ ప్రాంతంలో. ఈ సంగతి లంక లో ఉన్న రావణుడి కి తెలుస్తుంది. తన కుమార్తె ఎలా పెరుగుతోంది అన్న విషయం మీద అతను ఎప్పటికప్పుడు గూఢచార  నివేదికలు తెప్పించుకుంటూంటాడు.

అతను ఇలాంటి పద్ధతుల్ని నిరసిస్తాడు.స్త్రీ స్వాతంత్రయం ని హరించే ఆర్య సంస్కృతి ని వ్యతిరేకిస్తాడు రావణుడు.ఆడ అయినా,మగ అయినా  వారికి ఇష్టమైన వారి తో కలిసి ఉండే పద్ధతులు లంక లో ఉంటాయి.మధుపానం విషయం లో కూడా అంతే.వేరు వేరు ధర్మాలు అంటూ ఉండవు.అస్పృశ్యత అనేది కూడా తన రాజ్యం లో లేదు.పుట్టుక ని బట్టి ఒక వ్యక్తి సాంఘిక స్థాయిని,తెలివి ని అంచనా వేసే దుస్సంప్రదాయం లేదు.ఎవరు ఏ స్థాయి కి అయినా వెళ్ళవచ్చు.తన రాజ్యం లోని పద్ధతులు అవి.అలా కానట్లయితే బ్రాహ్మణుడికి,అసుర స్త్రీ కి జన్మించిన తనవంటి వాడు ఈ లంకాధిపతి గా అయిఉండగలిగేవాడా..?

అయితే ఇక్కడా కొన్ని జాడ్యాలు లేకపోలేదు. పురుషులకి ఏమో వస్తు సంచయం మీద ఆసక్తి ఎక్కువ.స్త్రీలు మిగతా బయటి వారి తో పోల్చితే దుందుడుకు గా ఉంటారు.ఆ రోజుల్లోనే విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించి మయుడి ద్వారా పుష్పక విమానాన్ని కూడా తయారు చేయిస్తాడు.ఇదిగో ఇప్పుడు ఈ పుష్పక విమానం లోనే రావణుడు లంక నుంచి మిధిలా నగరానికి బయలుదేరి వెళుతున్నాడు.మొత్తానికి స్వయంవర ప్రాంగణం లోనికి వెళ్ళి కూర్చుంటాడు.ముక్కు మొఖం తెలియనివాడెవడో ఈ శివ ధనుస్సు విరిస్తే ఆమె ని తన కుమార్తె వివాహం చేసుకోవాలా..?ఏమిటీ పద్ధతులు అని అనుకుని నువ్వే గనక నా వద్ద పెరిగి ఉన్నట్లయితే నీకు నచ్చినవాడికే ఇచ్చి పెళ్ళి చేసి ఉండేవాడిని కదమ్మా అని విచారపడతాడు.   


ఆ స్వయంవర కార్యక్రమం లో ఫాల్గొనడానికి వచ్చిన రాజకుమారులందరిని చూస్తూ రావణుడు ఒక ముగ్గురు వైపు దృష్టి సారిస్తాడు.ఇద్దరు అన్నదమ్ములు ,ఇంకొకరు వారి ఆస్థాన పురోహితుని లా ఉంటారు.ఆ అన్నదమ్ముల్లో ఒకరైన రాముడి ని చూసి 'ఏమిటి ఇతను చాలా గర్వం గానూ ,గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వాడి లా ఉన్నాడు.మిగతా వారి లా ఏ మాత్రం అణకువ లేదు ' అని  అనుకొని తొలి చూపు లోనే  ఒకలా భావిస్తాడు. మొత్తానికి ఆ ఘట్టం సీతారాముల పరిణయం తో  పూర్తి అవుతుంది.

కొన్నాళ్ళు గడిచిన పిమ్మట రాముడు వనవాసానికి వచ్చి దండకారణ్యం లో సంచరిస్తుంటాడు.అప్పుడు  అది రావణుడి కి తెలిసి ఈ ఉత్తరాది వారి దిక్కుమాలిన వ్యవహారాలు ఏమిటో .. ఆ రాణి కి దశరధుడు మాట ఇవ్వడం ఏమిటి..పర్యవసానంగా తన కుమార్తె కూడా రాముడి తో కలిసి ఈ కష్టాలు పడటమేమిటి అనుకుంటాడు.ఈ లోగా ఒక ఆసక్తికరమైన అంశం జరుగుతుంది.శూర్పణఖ ఒకరోజు బాగా గాయపడి రక్తసిక్తమయి ముక్కు చెవులు తదితరాలు కోయబడి వస్తుంది.దానికి కారణం లక్ష్మణుడు అని తెలుసుకొని పనిలో పని అన్నీ కలిసివస్తాయి..ఇప్పుడు సీత ని తీసుకు వచ్చి నా లంక లో ఉంచితే నా కుమార్తె కి అడవుల్లో తిరిగే కష్టాల్ని తప్పించినవాడిని అవుతాను,అలాగే రాముడు కూడా వియోగ బాధ ని అనుభవించాలి తన సోదరిని అవమానించినందుకు,అనుకుంటాడు.

అప్పటికే భార్య మండోదరి కి కూడా సీత గురించిన వివరాలన్నీ చెబుతాడు రావణుడు.కాబట్టి ఆమె కూడా దానికి అభ్యంతరపెట్టదు.మారీచుని సాయం తో రావణుడు సీతని అపహరించి పుష్పక విమానం లో తీసుకువస్తాడు.ఇదిలా ఉండగా విభీషణుడి సహాయం తో బ్రాహ్మణ వర్గం లంక లోని కీలక పదవులని చేజిక్కించుకుంటారు.తమవైన విధానాలను పాదుకొల్పడానికి ప్రయత్నిస్తుంటారు.మరో వైపు వరుణుడు అనబడే సముద్ర వ్యాపారి,దళారి రావణుడి కి వ్యతిరేకం గా పనిచేస్తుంటాడు.ఇలా ఇంటి గుట్టు లంక కి చేటు అన్నట్లు గా తన అనుకున్నవారే రావణునికి చాప కింద నీరు లా వ్యతిరేకం గా పనిచేస్తుంటారు. 

ఒక రాత్రిపూట హనుమంతుడు లంక లో ప్రవేశించి అక్కడి ఉద్యానవనాల్ని,కోట లోని భాగాలను  తగలబెడుతుండగా అతడిని రావణుడి యొక్క కుమారుడు మేఘనాధుడు బంధించుతాడు.తాను రాముని వద్ద నుంచి దూత గా వచ్చానని ,సీతాదేవి ని రాముని కి అప్పగించి క్షమాపణ వేడుకోమని చెప్పగా రావణుడు నిరాకరిస్తాడు.తన మిత్రుడైన వాలి ని రాముడు వధించి సుగ్రీవుని కి రాజ్యం అప్పగించిన వైనం అదే విధం గా వానర సైన్యం యొక్క అండదండలు అతనికి ఉన్నాయన్నా విషయం రావణునికి బోధపడుతుంది.  అయితే  తన రాజ్యం లోనే సొంత వాళ్ళు ఏ విధం గా రాముని వర్గానికి సహాయపడుతున్నారు అనే విషయాన్ని అంచనా వేయడం లో విఫలమవుతాడు.

యుద్ధ ఘట్టాలు బాగా రాశాడు రచయిత.ఇరు వర్గాల యొక్క వ్యూహ రచనలు ఆసక్తి కరం గా సాగుతాయి.చివరకి రాముడు చాలా పెద్ద సేన ని సమీకరించినప్పటికీ చిన్న సైన్యాలతోనే రావణుడు చాకచక్యం గా పోరాడి యుద్ధభూమి లో ఒరిగిపోతాడు.ఇంకొక ఆసక్తికరమైన సంగతి దీనిలో ఏమంటే యుద్ధఘట్టం లోనే రావణుని యొక్క భార్య మండోదరి ని అంగదుడు బలాత్కరించుతాడు.అంతేగాక ఆమె ని నగ్నం గా వదిలేసి వెళ్ళిపోతాడు. స్పృహ లేని స్థితి లో ఉన్న ఆమె ని రావణుడు కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. అయితే ఆ సంగతి ని రావణుడు ఆమె తప్పిదం గానో,శీలం కి సంబందించిన అంశం గానో తీసుకోకపోవడం ఆ పాత్ర యొక్క ఉదాత్తత ని పెంచినట్లయింది.

చివరకి భద్రుడు పాత్ర బ్రతికి,లంక లోనూ ఆ పిమ్మట అయోధ్య లోనూ జీవించి శంబూక వధ వంటి ఘట్టాల్ని చూసి,చాలా దైన్య స్థితి లో తన స్వగ్రామమైన ఇప్పటి కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న ఊరికి చేరుకొని తన జీవిత చరమాంకాన్ని గడుపుతుంటాడు.అదీ టూకీగా.ఇన్నాళ్ళు మనం నాణేనికి ఒక వేపున విన్నాం.ఇది ఇంకో వేపున అనుకొని తీసుకుంటే ఏ బాధా ఉండదు.చాలా పేజీలు తగ్గించవచ్చు దీనిలో,ముఖ్యం గా కొన్ని ప్రసంగాల్లా ఉండే సన్నివేశాల్ని తొలగించినా లోటు ఉండదేమో అనిపించింది.

మొత్తం మీద ఆనంద్ నీలకంఠన్ కి అవతల పార్శ్యం చూపించాలనిపించి రాశాడు. ఇప్పటికే రామాయణాలు ఎందరో రాశారు తమదైన శైలి లో.ఇది ఇప్పుడు రావణాయణం.చదివి చూసి,మీరే నిర్ణయించుకొండి.కొన్ని అలా చేస్తేనే మంచిది.అమెజాన్ లోను,అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లోనూ లభ్యమవుతోంది.




     
       

Thursday, April 2, 2020

"అసురుడు-పరాజితుల గాధ" పుస్తకం పై రివ్యూ



"కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడి గా,ప్రతి నాయకుడి గా చిత్రిస్తూ వచ్చారు.భారత దేశమంతటా నా మరణాన్ని పండగ లా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తె కోసం దేవతల్ని ఎదిరించాననా? కుల వ్యవస్థ మీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడి లా అణచివేయకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు,నేను అసురుడిని,నాది పరాజితుడి కధ." 

ఇది " అసురుడు-పరాజితుల గాధ " అనువాద నవల వెనుక అట్ట పై ఉన్న మాటల లో కొన్ని!చూద్దాము దీనిలో రావణుడు ఏమి చెప్పాడో అని చెప్పి ఈ 462 పేజీల పుస్తకం కొన్నాను.ఆంగ్ల మూలం ఆనంద్ నీలకంఠన్,కేరళ లోని త్రిపుణితుర  నుంచి వచ్చిన రచయిత.ఆర్.శాంత సుందరి తెలుగు సేత.నేను చిన్నతనం నుంచి రామాయణాన్ని ఎక్కడో ఓ చోట వినడమో చదవడమో చేస్తూనే ఉన్నాను.ఎన్నో భాష్యాలు చెప్పారు తమదైన రామాయాణాల్లో వివిధ రచయితలు,కొంత మూల విధేయం ఇంకొంత ఎవరి వ్యాఖ్యానాలు వారివి.

"Asura - Tale of the vanquished "  అనే పేరు తో ఇంగ్లీష్ లో వచ్చిన ఈ నవల వివాదస్పదం గానే నిలిచింది.సరే..కధ లోకి పోదాము.అసలు  ఇలాటి వాటిని అంత సీరియస్ గా తీసుకోవాలా లేదా అనేది నాకు ఇప్పటికీ ఓ మూలన సందేహమే.ఎందుకంటే ఓ ఏడాది క్రితం జరిగిన సంఘటన ని గుర్తుకు తెచ్చుకుంటానికి ఎంతో తర్జన భర్జన తో గాని చేయలేము.అందునా అంత ఖచ్చితం గా గుర్తు వస్తుందనే భరోసా ఏమీ లేదు.అయితే కొంతమంది మాత్రం వందల,వేల ఏళ్ళ క్రితం జరిగినాయనుకున్న కధల్ని సాక్షాత్తు తాము అక్కడికి వెళ్ళి చూసివచ్చినట్లు చాలా ఆత్మవిశ్వాసం తో రాస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

 దీనిలో రామాయణాన్ని రావణుడి వైపు నుంచి చెప్పడం జరిగింది.పాత్రలు ఏవీ నేల విడిచి సాము చేయవు.అద్భుత శక్తులు ఎవరకీ ఉండవు.అంత మామూలు గానే జరిగిపోతుంది.అయితే రచయిత కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు అర్ధం అవుతుంది.నిజానికి అవి కొన్ని ఇప్పటికే జనసామాన్యం లో ఉన్నవే,ఇంకొన్ని వాటికి తన ఊహా శక్తిని జోడించారు. రావణుడు,భద్రుడు ఈ రెండు పాత్రలు మాత్రమే ఈ కధ అంతటినీ చెబుతుంటాయి,అదీ ఉత్తమ పురుషలో.భద్రుడు అనే పాత్ర రావణుడి యొక్క సేవకుడు.

రావణుడు యుద్ధం లో గాయపడి మరణానికి చేరువ లో ఉంటాడు.ఆ విధం గా కధ ని మొదలు పెట్టి వెనక్కి తీసుకెళతాడు.ఈ కధ పరం గా దేవతలు అంటే ఉత్తరాది కి చెందిన ఆర్య సంస్కృతి ని పాటించే వ్యక్తులని,అసురులు అంటే కుల సంస్కృతి లేని ముఖ్యం గా బ్రాహ్మణ ఆధిక్యత ని అంగీకరించని తెగ అని రచయిత చెబుతాడు.ఎవరైతే బ్రాహ్మణాధిక్యత,సంస్కృతి ని పోషించారో వారు దేవతలు గాను,అంగీకరించక తమవైన స్థానిక ఆచారాలకి కట్టుబడి జీవించారో వారిని అసురులని ముద్ర వేసినట్లు దీని లోని సారాంశం.రచయిత ఆనంద్ నీలకంఠన్ పై ద్రవిడ సిద్ధాంత ప్రభావం బాగా ఉన్నట్లు స్పష్టం గా తెలుస్తుంది.

బలి చక్రవర్తి,గొప్ప అసుర చక్రవర్తి. ఎన్నో ఉత్తరాది రాజ్యాల్ని సైతం జయించి అసుర సామ్రాజ్యం ని ఏర్పాటు చేయగా దానిని విచ్చిన్నం చేయడానికి దేవతలు ఎన్నో కుయుక్తులు పన్నుతుంటారు.చివరకి వామనుడి ద్వారా వారి సంకల్పం నెరవేరుతుంది.ఇహ ఆ తర్వాత నుంచి అగస్త్యుడి నాయకత్వం లో బ్రాహ్మణులు వింధ్య పర్వతాలు దాటి రావడం,ఆ సంస్కృతిని  వ్యాప్తి చెందేలా చేయడం.. జరుగుతుంది.అసురుల దేవుడైన శివుడిని కూడా తమ లో కలుపుకుని ఈ జైత్ర యాత్ర కొనసాగిస్తుంటారు. 

 ఇక్కడ రావణుడి గురించి కొంత చెప్పాలి.అతనితండ్రి బ్రాహ్మణుడు కాగా తల్లి అసుర సంతతి కి చెందిన స్త్రీ.రావణుడు,కుంభకర్ణుడు,శూర్పణఖ వీళ్ళు ముగ్గురు తండ్రి చెప్పే సుద్దులని గాని శాస్త్రాల్ని గాని నమ్మరు.పైగా తండ్రి అంటే కోపం.తమని పట్టించుకోకుండా సవతి సోదరుడు కుబేరుడి ని బాగా చూస్తున్నాడని వీరికి గుర్రు.అయితే విభీషణుడు మాత్రం సౌమ్యంగా తండ్రి వాక్యమే దైవం గా భావిస్తుంటాడు.బలి చక్రవర్తి ఈ రావణుడు జులాయి గా తిరుగుతుండగా చూసి ఇతడిని తాను ఉన్న గుహ వద్ద కి తన అనుచరుల ద్వారా రప్పించుకుంటాడు.అసురులకి నాయకత్వం వహించి  తమ ఘనత ని చాటి చెప్పాలని బోధిస్తాడు.దానికి తగిన శిక్షణ ని తన వద్ద గురువుల ద్వారా ఇప్పిస్తాడు. ఇన్నాళ్ళు చనిపోయాడు అనుకుని అసురులంతా కధలు గా చెప్పుకునే బలి చక్రవర్తే తనకి మార్గ దర్శనం చేయడం రావణుడి కి ఆనందం కలిగిస్తుంది.

చిన్న సేనల్ని ఏర్పరచుకుని ఉత్తరాది లో కొన్ని రాజ్యాల్ని జయిస్తాడు.అలాగే క్రమేపి తన పరిధి ని పెంచుకొని గొప్ప అసుర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.దేవతల రాజు ఇంద్రుడు ఎన్నో అసుర రాజ్యాల్ని వశపరుచుకున్నాడు గతం లో.వాటినన్నిటిని రావణుడు వెనక్కి తిరిగి తెచ్చుకుంటాడు.అయొధ్య ని గాని మిగతా పక్క రాజ్యాల్ని చూసినా గాని రావణుడి కి చాలా చులకన గా అనిపిస్తుంది.సంపద లో గాని,నగర నిర్మాణం లో గాని,నాగరికత లో గాని వీరంతా అధములని రావణుడు భావిస్తాడు.లంకా నగరం ని అన్ని విధాలా శ్రేష్ఠ నగరం గా తీర్చిదిద్దుతాడు.ఈ జైత్ర యాత్ర చేస్తున్నప్పుడు వేదవతి అనే ఆమె ని రావణుడు ఆమె అభీస్టం కి వ్యతిరేకం గా సమాగమిస్తాడు.

ప్రమాదవశాత్తు ఓ నది లో కొట్టుకుపోతుండగా రావణుడు ఇక యుద్ధం లో మరణించాడని భావించి   యుద్ధానికి వచ్చేటప్పుడు రావణుడు తన తో పాటు తెచ్చుకున్న తన కూతురి ని సేనాధిపతి ప్రహస్తుడు చంపివేయమని భద్రుడి కి పురమాయిస్తాడు. భద్రుడికి చేతులు రాక అడవి లో వదిలేసి వస్తాడు.ఆ విధంగా రావణుడి కూతురు మిథిలా రాజ్య చక్రవర్తి కి దొరుకుతుంది.ఆమె యే సీత.   (మిగతాది తర్వాత)
---Murthy Kvvs




  

Sunday, March 29, 2020

గోపీనాథ్ మహంతి గారి "అమృత సంతానం" నవల పై రివ్యూ



గోపీనాథ్ మహంతి గారు ఒరియా భాష లో కోంధ తెగ పై రాసిన అద్భుతమైన నవల ని పురిపండా అప్పలస్వామి గారు "అమృత సంతానం" పేరు తో అనువదించారు.ఆ రకంగా మన తెలుగు అనువాద సాహిత్యం లో ఓ మణిపూస వచ్చి చేరింది.543 పేజీలు గల ఈ పుస్తకాన్ని కాస్త మెల్లగానే చదవ వలసి వచ్చింది.మిగతా లౌకిక వ్యవహారాల సందడి లో బడి..!

నా అభిప్రాయాన్ని పంచుకోవాలని ఎంతో ప్రయత్నించగా ఇప్పటికి పడింది.ఒక మహా తేజస్సు ని కంటి తో చూసినప్పుడు ఒక్కసారి గా మ్రాన్ పడిపోతాము.దాని గురించి ఎక్కడ మొదలు పెట్టి ఏమి చెప్పాలో అర్ధం కాని స్థితి ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది.దేనిని వదిలి వేయాలి దేనిని చెప్పాలి అలా అయింది నా పరిస్థితి. ఎక్కడో అవిభక్త కోరాపుట్ జిల్లా లోని ఓ మారు మూల అరణ్య వాసాల్లోకి వెళ్ళిపోతాము.అక్కడి చెట్లుపుట్టలు,రుతువులు,జంతువులు,కోంధ జీవనం లోని ఎగుడు దిగుళ్ళు ఇంకా అది ఒక్కటే కాక సగటు మానవ జీవనం లోని రంగులు..ఎన్నని ? అన్నిటిని మహంతి గారు రాశారు అనడం కంటే తాను సాక్షి గా నిలిచి మనకి చూపించారు అనాలి.ఆయన లియో టాల్స్ టాయ్ ని అనువదించారు.గొప్పగా అర్ధం చేసుకున్నారు.కనుకనే ఒక సౌందర్యాన్ని ,దాని రెండు వైపుల్ని ఎంతో నేర్పు గా మన కళ్ళముందుంచారు.

ఎంత చిన్న వాక్యాలు.ఎంత గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు.ఏ పాత్ర స్వభావం దానిదే,ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు.అంత అందం గానూ పురిపండా వారి అనువాద నైపుణ్యం సాగింది.ఒరియా సొబగులు క్షుణ్ణం గా ఎరిగిన కళింగాంధ్రుడు ఆయన. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి చొరవ వలన అనేక మంది ఈ నవల పై తమ అభిప్రాయాల్ని రాశారు.అది ఒక చక్కని ప్రయోగం.అక్కడ ప్రస్తావించినవి కాక ఇంకొన్ని ఇతర విషయాలు ముచ్చటించ యత్నిస్తానుసరే..నా వల్ల అయినంత మేరకు రాస్తాను. ఊరి పెద్ద ,వయో వృద్దుడు అయిన దివుడు సావోతా తండ్రి మరణం తో కధ మొదలవుతుంది.దివుడు ఒక ప్రధాన పాత్ర అనాలి.ఎవరినో ఒకరిని నాయకీ నాయకులు గా  ఊహించలేము. చాలా పాత్రలు పోటీకి వచ్చి నిలుస్తాయి.అదే దీనిలోని గమ్మత్తు.దివుడు భార్య పుయు గాని,మన తెలుగు నేల మీద పెరిగి అచటికి వెళ్ళి కొంధ సమాజం లో కలిసిపోవడానికి ప్రయత్నించి చివరికి దివుడిని చేసుకున్న పియోటి గాని,పుబులి అనబడే దివుడి చెల్లెలు గాని,వయస్సు పరం గా తానే తన అన్న తర్వాత ఊరి పెద్ద కావాలని తపించే లెంజు కోదు గాని,ఇంటిలో వెలితి తో బయటికి చూసే సోనా దేయి గాని ఇలా ఏ పాత్ర స్థానం దానిదే.ఇంకా చాలా చిన్న పాత్రలు తారసపడతాయి.

ఒక ముఖ్య విషయం చెప్పాలి.మహాంతి గారు ఎక్కడ కూడా ఎవరి వైపూ నిలబడి తీర్పు ఇవ్వడు.అలాగే శృంగార సన్నివేశాలు కూడా ఒక పరిధి దాటి వర్ణించడు కాని ఆ అనుభూతిని కొన్ని మాటల్లోనే చెప్పి ఆ సంఘటన ని బలపరుస్తాడు.సోనా దేయి ని సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పటి సన్నివేశాన్ని దీనికి ఉదాహరణ గా చెప్పవచ్చును.అలాగే దివుడికి,అతని భార్య కి మధ్య వచ్చే ఎడం కూడా ఎంత సున్నితం గా  ఉంటుందో.అక్కడ ఆ యిద్దరి లో ఎవరిని తప్పని అనలేము.ఎంతో ఏరి కోరి దివుడు ఆమె ని చేసుకుంటాడు.పిల్లవాడు పుట్టినతర్వాత భార్య భర్త మీద కాక ధ్యాస ని ఎక్కువ పిల్లవాడైన హాకినా మీద పెట్టడం,తన సొగసు మీద కూడా దృష్టి పెట్టకపోవడం ,భర్త దగ్గరకి వచ్చినప్పుడు దూరం పోవడం ఇవన్నీ దివుడు లో ఆ భాష లో చెప్పాలంటే సిర్ర పుట్టిస్తుంది.

అందువల్ల తను  బయట కి చూడటం మొదలవుతుంది.మళ్ళీ ఒకవైపు భార్య ని చూసినప్పుడు తన లో ఆత్మశోధన మొదలవుతుంది. ఎంత బక్క గా అయిపొయింది, పిల్లవాని ఆలనా పాలనా ,ఇంటి పనులు ఇవన్నీనూ ఆమెకి అని దివుడు మరోవైపు ఆలోచిస్తాడు.ఊరు కి పెద్ద తలకాయ తను కొరితే ఎంతో మంది వస్తారు కాని అప్పటికీ ఎంతో సమ్యమనం తో వ్యవహరించినట్లే అనుకోవాలి.పియోటి వంటి జాణతనం ఉన్న స్త్రీ తో కూడా ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తాడు,ఆమె ఇతడిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.
సరే..చివరకి ఆమె సఫలమవుతుంది.ఎంత అనుకున్నా మనిషిని నడిపించే చోదకశక్తుల లో ప్రధానమైనది శృంగారమే,అది ఏ సమాజమైనా.డబ్బు మీద ప్రేమ బయటకి కనబడుతుంది.దాన్ని బయటకి చూపించడం లో తప్పు లేదనుకుంటాడు మనిషి.కాని మొదటి దాన్ని ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోడానికి సంఘ నీతి గట్రా అడ్డం గా నిలుస్తాయి.మళ్ళీ ఇంకో కోణాన్ని చూడవచ్చు.సోనా దేయి దివుడు పట్ల ఆసక్తి చూపించి,రెచ్చగొట్టి చివరకి అతను ఆమె ని చేరుదామన్న తరుణం లో ఆమె రచ్చ చేయడం తాను ద్వేషించిన తన మగడిని పైకెత్తినట్లు చేయడం ఒక్కసారిగా నివ్వెరపరుస్తుంది.ఈ పాత్ర స్వభావం ని మనం ఎన్నో చోట్లా చూశామా అనిపిస్తే మన తప్పు కాదు.అలాగే వయసులో నలభై అయిదు దాటి ,భార్య చనిపొయి ఇంకో తోడు కోసం చూసే లెంజు కోదు తో సైతం ఈమె చనువు చూపుతుంది.శృంగార భావనలు రేపడమే తప్పా శృంగారం నెరిపినట్లు ఎక్కడా ఉండదు,ఆ చెకింగ్ అధికారి వచ్చిన సందర్భం లో తప్పా.

బాగా తరచి చూస్తే  ప్రతినాయకుల్లాంటి వారు తెలుగు వారే అని తేలుతుంది.దక్షిణాది నుంచి వచ్చిన వారని వ్యాపారస్తుల గురించి చెప్పడం ,ఆ పేర్లు అవీ ..ఇంకా పియోటి పెరిగిన,ఎరిగిన ఊర్లు మనుషులు గూర్చి రచయిత చెపుతున్నప్పుడు ఈ భావన  మనకి కలుగుతుంది.బారికి వంటి వారు ఆ కొంధ సమాజం లో దళారి వంటి వారే.బెజుణి,డిసారి వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు.పులి అనేది ఎంత గొప్ప భాగమో ఆ జీవితంలో.అచటి కొంధ ప్రజలు  వేటకి తుపాకులు ఉపయోగించడం మన జీవనం తో పోల్చితే కొత్త గా అనిపిస్తుంది.సరే..మిగతా సంప్రదాయ ఆయుధాల తో పాటు. దీనిలో చాలా వర్ణనలు అనేక ఏళ్ళ పాటు మనలో నిలిచిపోతాయి.ఎప్పటికప్పుడు కొత్తగా తోస్తాయి.దానికి కారణం రచయిత జీవితాల్ని మన ముందు ఉంచుతాడే తప్పా ఏ రకమైన గ్లాసు ల్లో నుంచి చూడకపోవడం అని భావిస్తాను.ఈ నవల లోని కొన్ని చక్కటి భాగాల్ని మీ ముందు ఉంచుతాను.వీలు కుదిరినప్పుడల్లా.వాటిని  చదివినప్పుడల్లా మహంతి గారి ఆలోచనా విధానమూ,ప్రత్యేకత మనకి అవగతమవుతాయి.

1955 లో ఈ నవల కి సాహిత్య అకాడెమి బహుమతి ప్రదానం చేయడం వలన ఇతర భాషల్లోకి ఆ సంస్థ కృషి చే వెళ్ళగలిగింది.అందుకు గాను ఆ సంస్థ ని అభినందించవలసిందే.ఆ రకంగా మనం తెలుగు లో చదవగలిగాము.కాని ఒకటి కటక్ లోని రావెన్ షా విశ్వ విద్యాలయం ఎంత గొప్పది అనిపిస్తుంది,అటు ఒరియా సాహిత్యం లో గాని ఇటు ఆంగ్ల సాహిత్యం లో గాని తారా తోరాణాలు గా నిలిచిన జయంత మహా పాత్ర,మనోజ్ దాస్ ఇంకా ఈ గోపీనాథ్ మహంతి  ఇలాంటి వారు కొన్ని డజన్ల మంది అక్కడ ఆంగ్ల సాహిత్యం,ఇతరములు చదువుకుని బయటకి వచ్చారు.ఒక ప్రాంతానికి గాని,ఊరికి గాని ,విద్యాలయానికి గాని వన్నె తెచ్చేది అక్కడినుంచి వచ్చిన మహానుభావులవల్లనే గదా.   .



 

  .



  

Thursday, October 3, 2019

"చప్పుడు" ఆదివాసి కధలు



"చప్పుడు" ఒక విన్నూత్నమైన కధల సమాహారం. దీనిలో ఉన్నవి నాలుగే కధలు.అయితే ప్రత్యేకత ఏమిటంటే ఇవి కోయ ఆదివాసీ జీవితం లోని ఒక ముఖ్యమైన భాగాన్ని స్పృశించిన కధలు. అన్నీ కూడా చావు అనే తంతు ని ఆధారం గా చేసుకుని సాగినవి.నిజానికి మనిషి జీవితం లో అతి ప్రధానమైనవి రెండే.ఒకటి పుట్టుక,మరొకటి మరణం.ఈ మధ్యలో సాగేదంతా ఎవరి గొడవ వారిది.ఈ కధల సంపుటి ని రచించిన వారు పద్దం అనసూయ ,స్వయం గా ఆదివాసి.తన జనుల జీవితాన్ని ప్రపంచానికి ఎత్తి చూపాలన్న ప్రయత్నం లో నుంచే ఈ రచన ను ముందుకు తెచ్చారు. నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిసారి.ఇందుకు గాను ఆమె కి తెలుగు సాహిత్య చరిత్ర లో ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఈ పుస్తకం ఇచ్చే స్ఫూర్తి తో మున్ముందు ఇంకా ఎంతమందో ఆదివాసీ రచయిత్రులు రకరకాల తమ జీవిత పార్శ్వాల్ని,కాలం మరుగున పడి కనిపించని గర్వకారణమైన తమ చరిత్ర ని తప్పకుండా వెలుగు లోకి తీసుకు వస్తారు.అటువంటి ఉత్సూకత ని రేకెత్తించే గుణం ఈ కధా సంపుటి లో నిండుగా ఉన్నది.

బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి నవల వల్ల సంతాల్ ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా యొక్క చరిత్ర ప్రపంచానికి తెలిసింది. అలాగే గోపీనాధ్ మొహంతి ఒరియా లో రాసిన "అమృత సంతాన" నవల కోంధ్ ఆదివాసీ తెగ యొక్క చరిత్ర ని అతి రమ్యంగా చిత్రించింది. ఈ నవల తెలుగు అనువాదం ఇటీవల గొప్ప ప్రాచుర్యానికి నోచుకున్నదని చెప్పాలి.దానికి కారణం వాడ్రేవు చినవీరభద్రుడు గారు అని చెప్పక తప్పదు.ఆయన దీన్ని మహా భారతం కన్నా గొప్ప దని అభిప్రాయపడ్డారు. అలాగే వీటి అన్నిటికి కంటే ముందు బ్రిటీష్ వారు పాలన లోనే ఓ గొప్ప నవల బెంగాలీ లో వచ్చింది.దానిపేరు "అరణ్యక". రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ. క్రమేణా ఇవి అన్నీ అనేక ఇతర భాషల్లోకి అనువదింపబడి అనేక కారణాల వల్ల వెలుగు లోనికి రాని ఈ దేశ మూలవాసుల జీవిత కోణాల్ని  ప్రభావవంతం గా చూపించినవి. అయితే వీటిని రచించిన వారు జన్మతహ ఆదివాసీలు కారు. అది గమనించవలసిన విషయం.

వీటితో సరితూగే నవల గాని కధా సంపుటి గాని తెలుగు లో ఆదివాసీ జీవితాల్ని స్పృశించినవి లేవనే చెప్పాలి.ఒకటీ అరా ఉన్నా అవి రాజకీయ కోణాన్ని చూపినంతగా ఆదివాసుల సంస్కృతిని చూపించలేదనే చెప్పాలి. తరువాత ఆదివాసీ స్వభావం లోని కొన్ని కోణాల్ని అర్ధం చేసుకోలేకపోయినారు. మిగతా అణచబడిన వర్గాల మాదిరి గానే,ఆదివాసులు తమ కన్నా తక్కువ వారని శిష్ట వర్గ రచయితలు భావిస్తూ ఆ కోణం లోనే రాయడం కనబడుతుంది. నిజానికి ఒక ఆదివాసి తాను మిగతా వారికంటే తక్కువ వాడినని గాని,అధికుడిని అని గాని భావించడు.
   
హిందూ మతం లో భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ తో తనకి ఎలాంటి సంబంధమూ లేదు.బయటి ప్రపంచం లోనికి వచ్చినపుడే దీని స్వభావం అర్ధం కావడం మొదలవుతుంది. సరే..ఇలా పరిశోధించుకు పోతున్న కొద్దీ ఎన్నో వైరుధ్యాలు ఉన్నవి.ఒక ఆదివాసి రచయిత తన జీవితాన్ని గురించి రాయడం అంటే ఎన్నో అంశాల్ని సాధికారికంగా  బయటి ప్రపంచానికి అందించడం.ఇదిగో...ఇప్పుడు ఇలా పద్దం అనసూయ గారి రూపం లో ఒకరు ఇక్కడ ఉన్నారు.కాబట్టే ఇది ఒక ప్రత్యేక సమయం. 

సరే...ఇప్పుడు అనసూయ గారి కధల లోనికి కొద్దిగా తొంగి చూద్దాము.మొదటి కధ పేరు "కాకమ్మ". వయో భారం తో ఉన్న ఒక స్త్రీ. తమ జాతికి చెందని సూదర వ్యక్తి ని కూతురు పెళ్ళి చేసుకోవడం దానివల్ల ఆమె పడే వ్యధని దీని లో చిత్రించారు. అలా బాధ పడుతూనే అంగీకరిస్తుంది.ఆ తర్వాత ఎవరి చేత చేయించుకోకుండా,ఎవరి మీద ఆధారపడకుండా తన చావు ని ఆహ్వానిస్తుంది.అదే విధంగా పెళ్ళి తంతులు కూడ తమ ఆచారాల నుంచి దూరం గా అయిపోవడం దీనిలో ప్రధానం గా చోటు చేసుకున్న వైనం కనిపిస్తుంది.ఈ కధలో వాడిన భాష గాని,   వ్యక్తీకరణలు గాని ఒక సగటు ఆదివాసీ స్త్రీ వలెనే ఉంటాయి తప్ప నేల విడిచి సాము చేయడం ఉండదు.కధలోని వర్ణనలు సహజం గా ఉన్నాయి.ఉదాహరణకి గోడకి వేళాడుతున్న ఫోటోని పిచుక తన ముక్కు తో టక టక మని పొడవడం.అది పొగచూరి ఉండిన ఎప్పటిదో అయిన ఫోటో కావడం.గుంపు కి బత్తెం గా పంది ని కోయాలన్న తన కోరిక నెరవేరకపోవడం...ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.

ఇక "చప్పుడు"అనేది రెండవ కధ. ఈ కధ లో ఓ ముఖ్యమైన అంశాన్ని చెప్పారు. ఆదివాసీ ల జీవనం లో చావు కి చాలా ప్రాధాన్యత ఉన్నది.పూర్భం అనే ప్రక్రియ ని ఈ సంధర్భం గా డోలీ కులస్తులు వచ్చి నిర్వహిస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క వంశ చరిత్ర, వివిధ ఇంటి పేర్ల వారి తో వారికి గల సంబంధాలు,జాతి కి సంబందించిన వివిధ అంశాలు దీని లో చోటు చేసుకుంటాయి.డోలి లు వీరికి చరిత్రకారుల వంటి వారు.వీళ్ళు వచ్చి ఆ తంతులు చేస్తేనే ఆత్మ శాంతిస్తుందని నమ్మిక.మరి ఇలాంటి తంతులు పట్టణం లో చేయాలనుకున్నప్పుడు ఒక కోయ ఆదివాసీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కున్నది అన్నది ఈ కధలో చెప్పారు. అడవి లోని గ్రామాల లో రాత్రిళ్ళు కొన్ని రోజుల పాటు లయ బద్ధంగా డోళ్ళు కొడుతూ చేసే ఈ తంతులు దూరం గా ఉండి వింటూ ఉంటేనే చళ్ళని ఆ గాలితో పాటూ ఎక్కడెక్కడి ఆత్మలు అక్కడికి చేరుకున్నవా అని వళ్ళు ఝల్లుమంటూ కూడా అనిపిస్తాయి.
"ముసిలి" అనేది మూడవ కధ. ఈ కధ లో తునికి ఆకులు కోయడానికి వెళ్ళిన ఒక ముసలామె చనిపోవడం. పెంపుడు కుక్క బెంగ పడి ఆ తర్వాత  మరణించడం ఇతివృత్తం.కాని ఈ కధ లో అడివి ని వర్ణించిన తీరు హృద్యం.అల్లి పొదల్లో ఎలుగు గొడ్లు ఉండటం,తునికి ఆకుల పొదకు దండం పెట్టి దీని లో కూడా  తొలాకు తెంపడం,ఆనముంతను పట్టుకోవడం..ఇలా అచటి జీవితాన్ని రమ్యంగా కళ్ళకి కట్టించారు. చావు సమయాల్లో జరిగే తంతుల్ని మరిన్నిటిని చెప్పారు. ముసలామె రాత్రి తాగే చుట్టని మిణుగురు తో పోల్చడం బాగుంది. Both extremes meet అని ఒక మహానుభావుడు చెప్పినది గుర్తుకు వచ్చింది.పొగ త్రాగడం అనేది కేవలం మగవారికి సంబందించిన అంశం కాదు ఏ ఆదివాసీ సమాజం లోనైనా..! అది ఒక టేబూ లాగానూ పరిగణింపబడదు. అలాగే అది పాశ్చాత్య సమాజాల్లోనూ అంతే గదా.

ఇక నాల్గవ కధ "మూగబోయిన శబ్దం" . కోయ ఆదివాసీ సమాజం లో జరుగుతోన్న మతాంతీకరణలు,అవి తెస్తున్న సమస్యల్ని ఈ కధ లో తెలియజేశారు.కన్వర్ట్ కాబడిన వారు తమ చావు ల సమయాల్లో అనూచానం గా వస్తోన్న పూర్బం లాంటి ఆచారాల్ని పాటించక పోవడం ఇంకా అవి ఏ విధంగా ఐక్యత ని భంగపరుస్తున్నవీ వివరించారు.నెక్కర పండ్లు చెట్లు కనబడగానే నోరు ఊరడం, కారంగి చెట్టు మీద ముకు జారుడు పిట్ట టక్ టక్ మని కొట్టుకోవడం వంటి భావ చిత్రాలు పాఠకుల్ని ఎక్కడికో తీసుకు పోతాయి.అనాది గా చావులప్పుడు తమ చరిత్రల్ని గానం చేసి వాటిని కాపాడుకుంటూ వస్తూన్న డోలీ లు ఇక తమ కి దూరం అవ్వవలసిందేనా..అని ప్రశ్నిస్తూ ఈ కధని ముగిస్తారు.

రచయిత్రి యొక్క శైలి ఆహ్లాదకరం గానూ,చదవ దానికి హాయి గానూ ఉంది.పాల్వంచ పరిసర ప్రాంతాలలోని గ్రామాల లోను ఇంకా పాల్వంచ లోనూ ఈ కధలు నడుస్తూ ఉంటాయి.కోయ భాష లోని పదాల్ని అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఉపయోగించినా ఎక్కడా అవి కధాగమనాన్ని అడ్డుకోవు.ఎంచుకున్న అన్ని కధల్లోనూ ఇతివృత్తం "చావు" అనే  చెప్పాలి. అయినప్పటికి వస్తువు ని చెప్పే విధానం లో ఎక్కడా తడబాటు లేకుండా నడిపించారు. ఇక ముందు మరిన్ని ఆదివాసీ జీవితానికి సంబందించిన ఇతివృత్తాల్ని ఎంచుకొని  ముందుకు సాగాలని తద్వారా తెలుగు సాహితీ రంగం లో మరిన్ని నూతన కాంతులు వెదజల్లాలని కోరుకుందాం. ఈ సందర్భం గా రచయిత్రి అనసూయ గారికి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. సంతాల్ ఆదివాసీ గాధల్ని ఎంతో హృద్యం గా ఆంగ్లం లో రాస్తున్న హన్స్దా సౌవేంద్ర శేఖర్ యొక్క రచనల్ని బాగా చదవ వలసిందిగా సూచిస్తున్నాను. The Adivasi will not dance  అనే ఆయన కధా సంపుటి కి " హిందూ" దిన పత్రిక 2015 కు గాను పురస్కారాన్ని సైతం ఇచ్చింది.నేడు ఆదివాసీ సమాజాల్లో వస్తూన్న మార్పులు ఇంకా సమస్యలు వీటన్నిటిమీద ఎంతో అవగాహన తో రాసే ఆయన జార్ఖండ్ లోని తమ సంతాల్ తెగ కు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు.

---మూర్తి కె.వి.వి.ఎస్. 

     




   





Thursday, July 18, 2019

నా ఇంగ్లీష్ కధల పుస్తకం పై ఒక మహారాష్ట్ర పాఠకురాలి సమీక్ష

నా ఆంగ్ల కధల పుస్తకం " The Riversideman and Other Short Stories"  క్రమేణా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పాఠకుల అభిమానం చూరగొంటూ ముందుకు సాగడం ఆనందించదగిన విషయం. దీనిలో 11 కధలు ఉన్నాయి.ఇవి నా జీవితానుభవం నుంచి రావడం ,కొంత ఊహ కూడా జత కలిసింది అనుకొండి..ఆ విధంగా ఉండడం ముందుగా చెప్పదగిన అంశం.

మాహారాష్ట్ర లోని పూణే కి చెందిన డా.రేఖా సహాయ్ అనే పాఠకురాలు తన బ్లాగు లో ఈ కధల పుస్తకం గురించి ఒక చక్కని రివ్యూ రాశారు.దానిలో ఆవిడ ఈ కధా సంకలనం లోని వైశిష్ట్యాన్ని తెలుపుతూ దీనిలోని భాష గురించి,ఇతివృత్తాల్ని ఎన్నుకున్న వైనం గురించి ప్రత్యేకం గా రాశారు."  It's a versatile collection based on many important and pertinent issues and anxieties of the modern Indian life.If slice of life stories interest,excite and enrich you,then you must definitely read and share about this excellent and naunced literary debut in the English language."  ఇది ఆమె అభిప్రాయం లోని కొంత భాగం. పూర్తి రివ్యూ ని ఇక్కడ నొక్కి చూడగలరు. Click here

For Copies, Contact: Navodaya Book House, 3-3-865, Streed opp.Arya samaj Mandir, Kachiguda, Hyderabad-500027  Phone: 90004 13413

Tuesday, June 11, 2019

నా ఇంగ్లీష్ కధల పుస్తకం e-book రూపం లో ఈరోజు నుంచి కినిగె లో లభ్యమవుతోంది

నా ఇంగ్లీష్ కధల పుస్తకం e-book రూపం లో ఈరోజు నుంచి కినిగె లో లభ్యమవుతోంది.దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.ప్రయత్నించండి.చాలా మందికి ఒక అనుమానం రావచ్చును.ఎందుకని ఆంగ్ల భాష లో రాయడం,తెలుగు లో రాస్తే సరిపోదా అని.నాలోని కొన్ని భావాలను తెలుగు తెలియని వారి కి కూడా అందించాలనే నాలోని ఓ స్వార్ధమే వీటిని రాయించిందని చెప్పాలి.అంతే కాదు.రెండు భాషల్లో రాయడం పెద్ద వింతైన విషయం అని కూడా నేను అనుకోను.రెండు భాషల్లో రాసే వారు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు.తెలుగు వారి లోనూ లేకపోలేదు గాని ఎందుకనో ఇంగ్లీష్ లో చదవడం అంత అవసరమా అనుకునేవాళ్ళూ బాగానే ఉన్నారు.

ఆసక్తి కొద్దీ ఇంగ్లీష్ సాహిత్యాన్ని అనేక ఏళ్ళ నుంచి చదువుతూ ఉంటే అనిపించింది ఏమంటే ప్రతి రచయిత కి తనదైన శైలి ఉంది.అలానే భారతీయులు ఆంగ్లం లో రాసినా దాని పరిమళం దానిదే.మనం ఇంగ్లీష్ వాళ్ళ మాదిరి గానే రాయాలని ఏమీ లేదు.మనవైన ప్రయోగాలు మనమూ చేయవచ్చును.అంత మాత్రం చేత బేసిక్ గా తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోవద్దని కాదు.నిరంతరం చదువుతున్నప్పుడు ఆ భాష లోని వ్యక్తీకరణ పరమైన సొగసులు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంటాయి.దానికి కావాలసింది నిరంతర సాధనే.దగ్గరి దారులు ఏమీ లేవు.ముఖ్యం గా ఆసక్తి,అనురక్తి.అవి కావాలి.

ఆర్.కె.నారాయణ్ ని నా డిగ్రీ రోజులనుంచి చదువుతున్నాను.ఆయన కధ ఏది చదివినా అరె..ఇది ఇంగ్లీష్ అయినా ..మాతృభాష లానే భలే అర్ధమవుతున్నదే అనిపించేది.అలా మొదలుపెట్టి ఎంతమంది నో అలా చదువుకుంటూ పోతూనే ఉన్నాను.మాల్గుడి వలె మా వూరి ని కూడా బేస్ చేసుకొని కొన్ని కధలు రాయాలి.తెలుగు తెలియని వారికి కూడా అబ్బా ..ఈ ప్రదేశాన్ని చూడాలి అనిపించాలి ,చదివిన తరవాత! అనేది నా మనసు లో నాటుకుపోయింది. నేను చదివిన ప్రతి పుస్తకం నాకు ముడిసరుకు లా ఉపయోగపడింది.నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.నా అభిమాన రష్యన్ రచయిత చింగీజ్ ఐత్మతోవ్ కూడా ముందు ఆయన మాతృ భాష అయిన కిర్గిజ్ లో రాసి ఆ తర్వాత రష్యన్ భాష లో రాయడం మొదలు పెట్టాడు.అంటే ఒక భాష నుంచి ఇంకో భాష కి మారినా లోపల సరుకు ఉన్నప్పుడు అది ఎవరినైనా తప్పక ఆకట్టుకొంటుంది.

దీనికి తోడు నా దేశాటన లో భాగంగా అనేక ప్రదేశాల్ని,మనుషుల్ని చూసిన తర్వాత మన భావాన్ని విస్తృత బాహుళ్యానికి అందించాలంటే ఇంగ్లీష్ కి మించిన సాధనం లేదని అనిపించింది.ఇలాంటివి అన్నీ కలిసి నాచేత ఇంగ్లీష్ లో ఈ కధలు రాసే లా చేసినవి.నా అనుభవం లో తెలుసుకున్నది ఒకటి ఏమిటంటే ఇంగ్లీష్ లో చదివేటప్పుడు గాని,రాసేటప్పుడు గాని ఆ భాష లోనే ఆలోచన చేయాలి.అప్పుడు బ్రెయిన్ త్వరగా ఆకళింపు చేసుకుంటుంది.ప్రతి దానికి ఇది తెలుగు లో ఏమిటి అనుకుంటూ ఉంటే గందరగోళం కి గురి అవుతాము.ఇంకోటి...మనం ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నా ఓర్చలేక గేలి చేసేవాళ్ళు కొందరు.నిస్సహాయత తో ఏం చేయాలో అర్ధం గాక వాళ్ళ బాధ వాళ్ళది.ఏ భాష ని ద్వేషించవలసిన పని లేదు.ఎంతో అనుభవం మీద గాని అర్ధం కాదు.

సరే...ఇప్పుడు ఇక్కడ కినిగే లో దొరుకుతున్న ఈ బుక్ వెర్షన్ ని ఇక్కడ ఇస్తున్నాను.ప్రింటెడ్ బుక్ ఇంకొన్ని రోజుల్లో వస్తుంది.అది నవోదయా బుక్ హౌజ్  లో లభ్యం అవుతుంది.ఒక విశేషం ఏమిటంటే ..ప్రముఖ సాహితీతపస్వి ,చిత్రకారులు అయిన శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు నా ఈ పుస్తకానికి కవర్ పేజ్ బొమ్మ ని ఉదారం గా ఇవ్వడం నా అదృష్టం గా భావిస్తున్నాను.వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.భారతదేశం లోని ప్రతి రాష్ట్రానికి ఈ పుస్తకాన్ని పంపి కొంతమంది తోనైనా చదివింపచేయాలనేది కోరిక.చూద్దాము.ఆ పై వాని నడిపింపు.
Please Click here .

Wednesday, May 8, 2019

ఇదిగో ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అది.



భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచయితల లో మనోజ్ దాస్ ఒకరు.తన మాతృ భాష ఒడియా లోనూ ఇంకా ఆంగ్లం లోనూ సమానమైన ప్రతిభ తో రచన చేసి రెండు భాష ల లోను పాఠకుల ను అలరించి తనకి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.గతం లో ఆయన రాసిన Mystery of the missing cap అనే కధా సంపుటి పైన ఇంకా Bulldozers అనే నవలిక మీద నేను నా అభిప్రాయాల్ని రాసిఉన్నాను.ఇప్పుడు ఆయన ఆత్మకధ అనదగిన మరియొక పుస్తకం Chasing the Rainbow (Growing up in an Indian village) మీద కొన్ని మాటలు రాస్తాను.

మనోజ్ దాస్ 1934 లో శాంఖరి అనే ఓ గ్రామం లో జన్మించారు.ప్రస్తుతం అది బాలాసోర్ జిల్లా లో ఉన్నది. సముద్రం పక్కనే ఉన్న ఆ చిన్న ఊరి లోను,ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న జమాల్ పూర్ ,జలేశ్వర్ లోనూ ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత విద్య ని అభ్యసించారు.తనకి జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ వయసు లో తను చూసిన జీవితాన్ని ఈ పుస్తకం లో వివరించారు.అవి బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజులు.అప్పటి గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది,ఏ విధమైన పద్ధతులు వివిధ రంగాల్లో కొనసాగేవి మనము కళ్ళకి కట్టినట్లుగా తెలుసుకోవచ్చును.

దీనితో బాటుగా అప్పటి సంస్థానాధీశుల పోకడలు , బ్రిటీష్ అధికారులకి వారు ఇచ్చే అలవిమాలిన గౌరవం కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరి కొన్ని సార్లు అయ్యో అనిపిస్తుంది.మనోజ్ దాస్ గారి కుటుంబం పెద్ద భూస్వామ్య వర్గానికి చెందినది కావడం వల్ల ఆ శాంఖరి గ్రామం లోనూ మిగతా చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఏ లోటు లేకుండానే గడిచినట్లు చెప్పవచ్చు.విద్యార్జన చేసే సమయం లో స్కూల్ లోనూ,హాస్టల్ లోనూ తనకి ఎదురైన అనుభవాలను ఎంతో రమ్యమైన శైలి లో చెప్పారు.మొదటి ప్రపంచ యుద్ధం జరిగే ఆ రోజుల్లో స్కూల్ లో దానిగురించి చర్చించుకోవడం మళ్ళీ దాంట్లో ఓ మేష్టారు జపాన్ దేశ అభిమానిగా ఉండి ఆ దేశమే గెలుస్తుందని పందెం వేయడం ఆ రోజుల్లోకి అలా తీసుకువెళతాయి ఇలాటి సన్నివేశాలు..!

ఈ గ్రామం బెంగాల్ కి బోర్డర్ లో ఉండడం వల్ల అందరికి బెంగాలీ భాష వస్తుంది.కలకత్తా కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడి ఫేషన్ లను అనుసరించడం గురించి చెబుతారు.దాస్ గారి నాన్నగారు కలకత్తా లో ఇల్లు కొందామని వెళ్ళి ఎలా మోసపోయింది వివరించారు.అదే సమయం లో బెంగాలీ బాబు ల సంగీత అభిమానాన్ని చెబుతూ ఇంకో కోణాన్ని చూపుతారు.ఆనాటి స్థానిక రాజుల గురించి చెపుతూ ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది ఒక ప్రిస్టేజ్ ఇష్యూ గా ఉండేది...దాస్ గారికి పరిచయం ఉన్న ఓ యువరాజా వారు ఇంగ్లీష్ తప్ప లోకల్ భాష అసలు మాట్లాడేవాడు కాదుట..అవతలవారికి అర్ధం గాకపోయినా సరే ముందు ఇంగ్లీష్ లో చెప్పి ..ఆ తర్వాత స్థానిక భాష లో చేపేవాడట.

అలాగే సముద్రం సమీపం లో ఉండే ప్రాంతాల యొక్క సొగసు,అదే సమయం లో తుఫాన్లు వచ్చినప్పుడు వారి పాట్లు ఇందులో చదివి తెలుసుకోవచ్చు.రచయిత యొక్క ఇంటి లో మూడుసార్లు దొంగలు పడి దోచుకోవడం అప్పటి స్థితిగతులు అవన్నీ వివరించారు.స్వాతంత్ర్యం వచ్చిన రోజున వీరి బడి లో జరిగిన సంబరాలు, ఏ విధంగా హార్మనీ వాయించుకుంటూ పాటలు పాడి ఆనందించినది వివరించారు.ఇవనే కాదు ఇంకా అనేకం ఉన్నాయి.రమారమి 160 పేజీల్లో,చాప్టర్ల వారీ గా విభజించి ఆనాటి ఆయా ప్రాంతాల జీవన సౌరభాల్ని ఈ పుస్తం లో అందించారు.బ్రిటీష్ ఇండియా లో మన దేశం లో ని వివిధ ప్రాంతాలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు వచ్చినపుడే గదా తెలుసుకోగలం.చరిత్ర ని బోరు కొట్టే ఓ సబ్జెక్ట్ గా కాకుండా ఆసక్తి గా చదివే అంశం గా కూడా చెప్పవచ్చును.ఇదిగో ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అది.

--Murthy Kvvs

Sunday, April 21, 2019

ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం గురించి నాలుగు మాటలు (రెండవ మరియు చివరి భాగం)



వీరాస్వామి గారు 1836 లో మరణించారు.ఆయన రాసిన ఈ లేఖాపూర్వక యాత్రా సాహిత్యమంతా 1838 లో ఆయన మిత్రుడు పిళ్ళై మొదటిగా వెలుగు లోకి తెచ్చారు.ముందు తమిళం లోను ,ఆ తర్వాత మరాఠి భాష లోనూ వెలువడి పాఠకుల  ని ఎంతో ఆకర్షించింది.నాగపూర్ రెసిడెంట్ గా ఉన్న అధికారి ఇంకా కొంతమంది దీన్ని ఇంగ్లీష్ లోకి తేవడానికి ప్రయత్నించారు.అయితే అంతకుముందే తానే దీన్ని ఇంగ్లీష్ లో కి అనువదించాలని వీరాస్వామి కొన్ని భాగాలు అనువదించి అనారోగ్య కారణం చేత విరమించుకుని వారి బంధువు అయిన వెన్నెలకంటి సుబ్బారావు చేత పూర్తి చేయించాలని అనుకున్నా కొన్ని కారణాల వలన వీలుపడలేదు.

దాదాపు గా అయిదు భాషల్లో వీరాస్వామి గారు  తన భావావేశం లో రాసిన ఈ యాత్రా సాహిత్యాన్ని ఒక పద్ధతి గా పెట్టి అందరకీ సులభం గా అర్ధమయ్యే రీతి లో మన ముందు కి ఇప్పుడు తెచ్చిన మాచవరపు ఆదినారయణ గారు బహు ప్రశంసనీయులు.గతం లో కొన్ని వెర్షన్లు రాకపోలేదు కాని దీనికి గల రీడబిలిటి గొప్పది.అలాగని వీరాస్వామి యొక్క ఆత్మ ని ఆయన ఎక్కడా చిన్నబుచ్చలేదు.పుస్తకం చదువుతుంటే ఆ మూల కర్త యే మన ముందు కూర్చొని మాటాడుతున్నట్లు ఉంటుంది.ప్రపంచాన్ని చూడటం లో,వ్యాఖ్యానించడం లో వీరాస్వామి గారి దృస్టి అచ్చెరువు కొలుపుతుంది.దాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఉదాహరణకి 273 పేజీ లో ఇలా అంటారు. "ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నారు..?అని అందరూ అడుగుతూ ఉంటారు."తన డబ్బు తనకి నచ్చిన విధంగా ఖర్చు పెట్టకుండా మరణించడం వలన ప్రయోజనం ఉండదు" అని ధృఢంగా నమ్ముతాను. నేను సుప్రీం కోర్ట్ లో ఉండి ఎన్నెన్నో మరణ శాసనాలు(వీలునామాలు) చదివాను. వారు తమ తరువాత జరుగవలసిన పనుల గురించి రాసి మరణిస్తారు.అయితే వారు చెయ్యమని చెప్పిన పనులు వారి వారసులు ఎవరూ చేయలేదు.పైగా ఆ వారసులందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు.అలా నా జీవితం లో జరుగకూడదు.....అందువలన నా మనసు కి నచ్చిన విధం గా నా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటాను అనే నిర్ణయం తీసుకున్నాను...నా జీవితం నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు చెప్పుకుంటూపోతున్నాను. ఆ ఈశ్వరుడి భాషని నాకు అర్ధమైనంత వరకూ అనువాదం చేసుకున్నాను.అదే చాలు నా జీవితానికి.." అంటారు.

ఇంకోటి ఏమంటే ఈ పుస్తకం లో ప్రస్తావించిన ఉప్పాడ బోయీలు ...వారు నన్ను ఎంతో ఆలోచింపజేశారు.ఇంత మహా ప్రయాణం ని విజయవంతం గా పూర్తి జేశారూ అంటే వాళ్ళ రెక్కల కష్టం ఎంత ఉన్నదో గదా..!ఇంతా జేసీ వాళ్ళ గురించి రాయకుండా ఎలా ఉంటాడు ఆయన..? ఉప్పాడ ఇంకా పరిసర గ్రామాలకి చెందిన ఈ బోయీలు తల్చుకుంటే భూమండలం అంతా తిరిగిరావచ్చును అంటాడు వీరాస్వామి.వీరు ఎంతో కష్టజీవులు.అయితే మద్యపానానికి వాటికి అలవాటు పడి అప్పులు చేసి,జీవిక కోసం దూర ప్రాంతాలైన చెన్నపట్నం వంటి పట్నాలకి వెళ్ళి బోయీలు గా పనిచేస్తూ బ్రతుకుతుంటారు.ఇంటి నుంచి పారిపొయి మళ్ళ్ళీ రమ్మన్నా రాకుండా ఈ విధంగా జీవితం గడుపుతుంటారు.ప్రయాణం లో వీరికి అనారోగ్యం చేసినా వీరికి తన వద్దనున్న మందులు ఇచ్చి వీరాస్వామి గారు ఆదుకున్నాడు.కొంతమంది కి బాగోలేనప్పుడు వారి బదులు ఇంకోళ్ళని రిక్రూట్ చేసుకోవడం అలా ఉంటుంది..వీరికి అయ్యే ఖర్చులు అన్నీ ఆయనే పెట్టుకున్నాడు.ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,అది మోసిన బోయీలెవ్వరు అనే శ్రీ శ్రీ మాటలు గుర్తుకు రాకమానవు.వీరి గురించి ఇంకా ఎక్కడైన ఎవరైనా పరిశోధన చేశారా అనే సంశయం నాకు వచ్చింది.

ఆ రోజుల్లో నెల్లూరు ప్రాంతం వేశ్యావృత్తికి చెందిన వారికి మిరాశి గా ఉండడం గమనించవచ్చు.గోదావరీ పరీవాహ ప్రాంతం లో భూ వసతి లేని బ్రాహ్మలు లేరు.మేజువాణీలు అవీ సరే.వీరాస్వామి గారి బందువర్గమైన కొచ్చెర్లకోట జమీందారుల ఇళ్ళకి వచ్చినపుడు వారు చేసిన సన్మానాలు గురించి రాస్తూ ఆ నృత్యకారిణులని దారుణం గా అంత సేపు నిలబెట్టి ఉంచడం దారుణం అంటాడు.ఓఢ్ర పండితుల సంస్కృత పాండిత్యం గౌడ దేశీయుల తో పోల్చితే చాలా గొప్పది.కళింగ ప్రాంతం లో ఆ రోజుల్లోని బందిపోట్ల భయం.నాగ్ పూర్ ప్రాంతం దాటిన తర్వాత చెట్లకి వేలాడ దీసి ఉన్న శవాలు...దొంగలకి వార్నింగ్ మాదిరి గా వేలాడదీసిన తెల్ల దొరలు.ఇలా ఎన్నో..ఎన్నో ..విషయాలతో ఎక్కడా రవంత బోరు కొట్టకుండా పుతకం అలా సాగిపోతుంది.

మనకాలపు మహా యాత్రికుడు ఆదినారాయణ గార్కి ఒక సెంటిమెంట్ ఉందీ వీరాస్వామి గారి తో..!సరిగ్గా ఈయన మే 18 న జన్మిస్తే,అదే రోజున వీరాస్వామి తన యాత్ర కి శ్రీకారం చుట్టాడు.అంతే కాదు తిరుగు ప్రయాణం లో ఆయన వీరి యొక్క జన్మస్థలం మీదుగా అమ్మనబ్రోలు వెళ్ళి అక్కడ సత్రం లో బస చేయడం విశేషం.ఆ రకంగా భారత యాత్రా సాహిత్యానికి పితామహుడైన వీరాస్వామి ఆయా ప్రాంతాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.ఇప్పుడు మనం రాయలసీమ,ఆంద్ర,తెలంగాణా అని చెప్పుకుంటున్న తెలుగు ప్రాంతాలు ఈ పుస్తకం లో అనేక రంగుల తో దర్శనమిస్తాయి.అప్పుడు ప్రస్తావించిన చాలా ఊళ్ళని గుర్తుపట్టినపుడు థ్రిల్లింగ్ గా అనిపించకమానదు.

ఇక బ్రౌన్ ఎందుకు ఈ యాత్రా పొత్తాన్ని ముద్రించలేదు అని సందేహం గదా ..?ఆ రోజుల్లో ఆయన బందరు మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు.ఈ యాత్రంతా చేసి వచ్చి రాత ప్రతి ని సాపు చేసి బ్రౌన్ కి పంపితే చాన్నాళ్ళు ఉంచుకొని  మద్రాస్ లో ఓ లైబ్రరీ కి ఇచ్చి వెళ్ళిపోతాడు.వీరాస్వామి కి కూడా సందేహం వచ్చి తన ప్రతి లో ఏమన్నా తప్పు రాశానా అని సరి చూసుకుంటే ఓ పొరబాటు తెలుస్తుంది.తాను యాత్ర లో భాగంగా బ్రౌన్ దొరని కలిసి ఆయన ఆతిధ్యం స్వీకరించినప్పటికీ ఆ ప్రస్తావన ఏదీ పుస్తకం లో రాయలేదు.అయితే దానికీ ఓ కారణం ఉన్నది.తన తమ్ముడు కి ఉద్యోగం వేయించమని ఈ సంధర్భం గా కోరుతాడు.ఇవన్నీ వ్యక్తిగత సంగతులు గదా అని పుస్తకం లో రాయడు.సరిగ్గా అక్కడే బ్రౌన్ మనసు బాధపడి ఉంటుంది.

అయితే ఆయన మిత్రులు అంతా కలిసి పుస్తకం మేము ముద్రిస్తాము అని అన్నా వీరాస్వామి తిరస్కరిస్తాడు.ఏనాటికైనా దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ప్రచురిస్తేనే నాకు నిజమైన గౌరవం అని చెబుతాడు.ఆయన చివరి మాటలు కొన్ని ఇక్కడ పొందుపరిచి ఇక నేను కూడా ముగిస్తాను.

"నిన్నటి నుండి నా పరిస్థితి ఏమీ బాగా లేదు(1836,అక్టోబర్ 3), ..ఈ సాయంత్రం నీరెండలో కూర్చుంటే కొంచెం ఫర్వాలేదు అనిపిస్తూ ఉంది.ఈ నవరంధ్రాల పంజరం లోని చిలుక ఎగిరిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను.జీవితం లో అనుకొన్న పనులన్నీ చేయగలిగాను.నా పుస్తకం ముద్రణ జరిగి ఉంటే ఆ సంతోషం తో మరి కొన్నాళ్ళు జీవించి ఉండేవాడినేమో !అయినా నాకు తృప్తి గానే ఉంది.నా జీవితం లెక్క లో నాకు సున్నా వచ్చింది.అదృష్టవంతుణ్ణి.జన్మరాహిత్యం కలుగజేయమని ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాను.కాశీయాత్రికులకి నా పుస్తకం ఒక కరదీపిక లాగా ఉంటే చాలు...దేవుడు నాకు అన్నీ చాలా ఎక్కువగానే ఇచ్చి దీవించాడు.అంతకు మించి కొరుకోకూడదు.ఇచ్చింది తీసుకోవడమే ఇప్పుడు చేయవలసింది.మణికర్ణికా ఘాటు నుండి ఆ కాశీ విశ్వనాధుని ఢమరుక ధ్వని,గంగానదీ తరంగాల మీదుగా నా కుడి చెవుకు లీల గా వినిపిస్తూన్నది.." (సమాప్తము)--Murthy Kvvs

This is a new version brought by Machavarapu Adinarayana garu.(Pages 8+279+16)Contact no:98498 83570

Friday, April 19, 2019

ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం



ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం ఇప్పుడు సులభమైన తెలుగు లోకి రావడం తో చదవడం కుదిరింది.చదివిన తర్వాత కొన్ని అంశాల్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది.1830 మే నెల లో చెన్నపట్నం లో బయలుదేరి మళ్ళీ 1831 సెప్టెంబర్ మాసం లో ఆయన తన పరివారం తో యాత్ర ముగించుకొని వెనక్కి వచ్చారు.ఇది ఒక యాత్ర గురించిన పుస్తకమే కాదు.అప్పటి సామాజిక,సాంస్కృతిక,ఆర్ధిక భారతం చాలా కొత్త కోణం లో కనబడుతుంది.ఎంతో సహనం తో తాను గమనించిన అంశాల్ని రికార్డ్ చేసిన తీరు అమోఘం.యాత్ర లో సాగుతూనే వారానికి ఒక ఉత్తరం చొప్పున తన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కి రాశాడు.ఇచ్చిన మాట ప్రకారం..! అది మొత్తం మనకి ఒక ఉద్గ్రంధమైనది.

దీన్ని పూర్తి చేసిన తర్వాత ప్రచురణ కి గాను సాయం చేయమని బ్రౌన్ దొర కి అందించుతాడు మన ఏనుగుల వీరస్వామి ,అయితే ఎందుకో గాని ఆయన కొన్ని నెలలు తర్వాత ఎటువంటి సాయం ఈ విషయం లో చేయకుండా చెన్నపట్నం లోని ఒక గ్రంధాలయానికి ఈ మాన్యుస్క్రిప్ట్ ని ఇచ్చి లండన్ వెళ్ళిపోతాడు.అయితే దీనికి కారణం ఒకటి ఉంటుంది.అది చివరన చెప్పుకుందాం.వీరాస్వామి తిరుపతి ,శ్రీశైలం,హైదరాబాద్,నిర్మల్,నాగ్పూర్,జబల్పూర్ ప్రయాగ మీదుగా కాశీ చేరి మళ్ళీ పాట్నా,కలకత్తా,బరంపురం,చత్రపురం,శ్రీకాకుళం,రాజమండ్రి,నెల్లూరు ల మీదుగా చెన్నపట్నం చేరుతాడు.మొత్తం మీద రమారమి నదులు దాటింది ,నడిచింది,పల్లకిలో వెళ్ళింది అంతా కలిపి నాలుగు వేల కిలో మీటర్లు గా లెక్క తెలుతుంది.ఇప్పటి మాదిరి గా రోడ్లు లేవు.అరణ్యాలు,రకరకాల నేలలు,మిట్టపల్లాలు,మైదానాలు,పల్లెలు,బస్తీలు ప్రతి యాభై వంద కిమీ దూరానికీ మారిపోయే రాజ్యాలు,జమీందారులు వారి పాలనలు కరెన్సీ కూడా మారి పోతూంటుంది.ఇక మనుషుల తీరులు సరే..!ఈ ప్రయాణాన్ని ఇంచుమించు వంద మంది తో చేయడం ,వారిని ఆర్గనైజ్ చేయడం చాలా గొప్ప గా అనిపిస్తుంది.తన తల్లిని,భార్యని,చుట్టాల్ని,స్నేహితుల్ని అనదరిని తీసుకెళ్ళాడు.ఇక పల్లకీ మోసే బోయీలు. ఆ పల్లకీలు తయారించడం,రకాల డేరాలు సమకూర్చుకోవడం...సత్రాలు దొరకని చో గుడారాలు వేసుకుండానికి..!

వీరాస్వామి గారు పేద కుటుంబం లో జన్మించినప్పటికీ స్వయం కృషి తో ఆంగ్లం,తమిళం,పారశీకం ఇత్యాది అన్య భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ఆనాటి చెన్నపట్నం లోని సుప్రీం కోర్ట్ లో దుబాషీ గా పనిచేసి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.న్యాయమూర్తు లు గా ఉన్న తెల్ల దొరలకి తమిళం,తెలుగు భాషల్లో ఉండే వ్యవహారాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి వారికి ఇవ్వడం ఈయన పని.యాభై ఏళ్ళు దాటిన పిమ్మట ఈ యాత్ర చేయాలనే తలంపు కలుగుతుంది.వాళ్ళమ్మ గారు కాశీ తీసుకెళ్ళమని కోరగా సరే ..నీతో పాటు ఇంకా ఎక్కువమందిని ఆ కాశీ విశ్వనాధుని వద్ద కి తీసుకెళ్ళి ఆ పుణ్యం మూటగట్టుకుంటానని సంకల్పించుకుంటాడు.

తాను పనిచేసే తెల్ల దొరల వద్ద నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటాడు.ఇవి ఆయనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ దూర ప్రయాణం లో..!మధ్యలో తగిలే జమీందారులు,చిన్న తరహా పాలకులు వీటికి విలువనిస్తారు.కొన్ని చోట్ల లెక్కచేయని వారూ ఉన్నారనుకొండి.ప్రతి రోజు 20 లేదా 22 కి.మీ.నడక ఉంటుంది.అక్కడ ఆగడం.గుడారాలు వేసుకోవడం.కొన్ని చోట్ల సత్రాలు ఉంటాయి.కొన్ని చోట్ల ఉండవు.అడవి లో మృగాలు భయపడటానికి తుపాకులు కూడా పేలుస్తుంటారు.ముందు వెళ్ళబొయే ఊరు ని గురించిన వివరాలు తెలుసుకుండానికి గుర్రాల మీదనో ఇంకో రకం గానో కొంతమంది తన మనుషుల్ని పంపించడం..అలాంటి ప్లానింగ్ లు చాల గొప్ప గా ఉంటాయి.దీంతో బాటు గా ఆయన తెచ్చుకునే ఖర్చుల నిమిత్తపు డబ్బు ఇంకా నగల్ని కాపాడుకోవడానికి అనుసరించిన విధానం వీరాస్వామి గారి తెలివితేటలకి నిదర్శనం.

శ్రీ శైలం దగ్గరి ఆలయాల పరిస్థితి దయనీయం గా ఉన్నట్లు రాస్తాడు.హైదరాబాద్ లో ప్రవేశించిన తర్వాత పరిస్థితి ని గురించి రాస్తూ ఆయుధాల్ని ఆభరణాలు గా ధరించి రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించి వర్ణిస్తాడు.ఇక్కడ నోరుండి,కత్తి ఉన్నవానిదే రాజ్యం.అలా ఉంది పరిస్థితి అంటాడు.నాగ్పూర్ రాజ్యం లోకి వచ్చిన తర్వాత నాగరిక ప్రపంచం లోకి వచ్చినట్లు ఉందని అంటాడు.హైదరాబాద్ లో కూరగాయలు,పండ్లు ఆ నేల నీరు వల్లనో ఏమో మంచి రుచిగా ఉన్నాయనీ అంటాడు.నాగ్ పూర్ లో కూడా హైద్రాబాద్ లానే స్వతంత్ర రాజులు ఉన్నా బ్రిటీష్ వారికి కప్పం కట్టుకుంటూనే పాలన సాగిస్తుంటారు.ఇంకా ఆపైన చిన్న రాజ్యాలు ఎన్నో తగులుతుంటాయి.వాటి అన్నిటి వివరాలు ఎవరకి వారు చదవవలసిందే.అక్కడి వ్యవహారాలూ అవన్నీనూ..!

తినే తిండిని బట్టే వంటికి బలమూ పౌరుషమూ వస్తాయి అంటాడు ఓ చోట..ఉత్తరాది వారికి దక్షిణాది వారికి భేదం చెపుతూ..!దూద్ పేడాలు,పెరుగు,పాలు,రొట్టెలు, నెయ్యి ఇట్లాంటి వాటిని తింటూ అరాయించుకునే వీరి దేహాలు స్త్రీ,పురుషులు గాని మంచి బలిష్టం గా ఉంటాయి అని అభిప్రాయపడతాడు.జబల్ పూర్ ,రాయ్ పూర్ లాంటి మధ్య భారత రాజ్యాల్లో సత్రాల్లో దిగుతూ లేదా గుడారాలు వేసుకుంటూ ఉంటూ స్థానిక పరిస్థితులు తెలుసుకుంటూ తన పరివారం తో సాగిపోతుంటాడు.(సరే మిగతాది వచ్చే భాగం లో)           

Thursday, March 21, 2019

డా.చింతలపూడి వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల క్రితం ఒక పుస్తకం పంపించారు


మిత్రులు డా.చింతలపూడి వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల క్రితం ఒక పుస్తకం పంపించారు.అది ఓ అనువాదం.అంతరంగ తరంగాలు అనే ఆశావాది ప్రకాశ రావు గారి  కవిత్వాన్ని తెలుగు నుంచి ఆంగ్లం లోకి తెచ్చారు.వెంటనే రాయలేకపోయాను.అనేక కారణాలు దానికి..!సరే..కొద్దిగా నాకు తెలిసినంత లో నాలుగు ముక్కలు రాస్తాను.నేను అనువాదాలు ముఖ్యంగా తెలుగు నుంచి ఆంగ్లం లోకి ఎవరు చేసినా చదువుతుంటాను.చూద్దాము వీరు అవలంబించిన విధానం ఏమిటో అని..!

ఎప్పుడైనా సరే..నూటికి నూరు పాళ్ళు అచ్చుగుద్దినట్లు అవతల భాష లోకి ఎవరూ తేలేరు.ఎందుకూ అంటే..ప్రతి భాష కి దానిదైన ఒక జీవం,వాసన,రంగు ఉంటాయి.మనం మన భాష లోనిది అర్ధం చేసుకుంటాము.కాని అవతల భాష లోకి ఎంత లోతు గా వెళ్ళావూ అనే దాని మీదే అనువాద విజయం ఆధారపడి ఉంటుంది.అంటే నా అర్ధం అత్యంత కృతకమైన ,కఠినమైన ,మక్కీకి మక్కీ పదానికి పదం సరిపోయిందా అంటూ బేరీజు వేసుకుంటూ సాగే అనువాదమని కాదు.అది మరి ఎలాటిది..?

ఉదాహరణకి చూద్దాము.ఒక కవిత లోనో,కధ లోనో ఓ చోట..."జరిగినది ఏదో అనుమానం గానే ఉంది,అసలు విషయం అది కాకపోవచ్చును" అని ఉంది అనుకొండి.Something,Smelling rat అని చెప్పవచ్చును.లేదా ఇదే అని గాదు దీనికి దగ్గరగా ఉన్నది ఇంకోటి ఉపయోగించవచ్చును.ఆహా..అలా కాదు ,పూర్తిగా మక్కీకి కి మక్కీ ఉండవలసిందే అనువాదం అనేవాళ్ళు కొంతమంది.వీళ్ళకి బాగానే ఉండవచ్చు.కాని ఈ అనువాదం ప్రధానం గా ఎందుకూ చేసేది ..తెలుగు రాని వారి కోసం కదా..వారి ని దృష్టి లో పెట్టుకుని గదా చేయాల్సింది.అకడమిక్ గా ఎంత సారూప్యత ఉన్నదని కాదు భావపరంగా తెలుగేతరునికి అది ఎంత ప్రభావవంతం గా అందించామూ అన్నది ప్రధానం.

ఇట్లా తెలుగు రచన ని ఆకళింపు చేసుకుని తెలుగు రాని వారి కి వారిదైన గుబాళింపు తో తీసుకుపోవాలి బయటకి..!అప్పుడు ఒక అనువాదం విజయవంతమవుతుంది.పావ్లో కొయ్లో రచన లే చూడండి.ఎక్కువ గా మార్గరెట్ జల్ అనే ఆమె అతని యొక్క నవలల్ని పోర్చ్ గీస్ భాష నుంచి ఇంగ్లీష్ లోకి ఎంత చక్కగా అనువాదం చేస్తుందో..!భాష చాలా తేలిక గా ఉంటుంది,అదే సమయం లో ఒక సొగసూ ఉంటుంది.విషయం సూటిగా చెప్పేస్తుంది.ఎక్కడో అవసరమైన చోట తప్పా,డిమాండ్ చేసిన చోట తప్పా కఠినమైన పదాలు వాడదు.అసలు నా ఉద్దేశ్యం లో ఆ విధంగా రాయడానికే గొప్ప పాండిత్యం కావాలి.చాలా అనుభవం ద్వారా నే అది వస్తుందేమో.అయితే ఒకటి..మన తెలుగు వారి లో ఒక మూఢనమ్మకం ఉండిపోయింది.ఎంత పాషాణ పాకం వంటి మాటలు వాడితే అంత గొప్ప ఆంగ్ల రచన యని..!ఇప్పుడు వస్తున్న ఇండో ఆంగ్లికన్ రచనలి,కధల్ని,నవలల్ని పరిశీలించండి.

చాలా అభిప్రాయాలు మారతాయి.ఎందుకో చాలామంది ఇది చేయరు.అక్కడే వస్తుంది తంటా.మనవాళ్ళు ఆంగ్లం లోకి ఎన్నోవాటిని తీసుకెళుతున్నారు.వాటి చదివించే గుణం మీద ఎంతమంది తెలుగేతరుల ఫీడ్ బ్యాక్ ని మనం తీసుకుంటూ ఉన్నాము..?అలాటిది ఎప్పుడైనా చేశారా..?ఆ ఆసక్తి ఉండదు,అనువాదం చేసి వదిలేస్తాము.అవి ఎక్కడో ఉండిపోతాయి.అంతే..! కాదా..!

సరే..చింతలపూడి వారి అనువాదం లోకి వద్దాము.ఆయన గురించి రెండు మాటలు చెప్పాలి.బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో  తెలుగు లో పి.హెచ్.డి.చేశారు.ప్రస్తుతం రిటైర్ అయి ప్రకాశం జిల్లా లోని ఇడుపులపాయ లో నివసిస్తున్నారు.దానికి ముందు ఈనాడు దిన పత్రిక వారి జర్నలిజం కాలేజీ లో కూడా పనిచేసినట్లు గుర్తు.భద్రాచలాని కి కొద్ది దూరం లో ఉన్న సత్యనారాయణ పురం లోని ఒక యైడెడ్ ఉన్నత పాఠశాల లో పనిచేసేప్పుడు ఆయన నాకు పరిచయం అయినారు.అంతకు ముందు కూడా ఏవో ఉద్యోగాలు చేసినట్లు గా చెప్పినట్లు గుర్తు.ఈ సత్యనారాయణపురం ని చూసినట్లయితే గోదావరి జిల్లా లోని గ్రామం గుర్తుకు వస్తే పొరబాటు కాదు.గోదావరి జిల్లాల నుంచి వచ్చిన క్షత్రియకుటుంబాల వాతావరణం ఉంటుంది.అయితే మావోయిస్టుల తాకిడి వలన చాలామంది ఇతర ప్రాంతాలు వెళ్ళినట్లు ఇప్పటి వినికిడి.అలాంటి ఒక స్కూల్ లో...అది ఉచ్చ దశ లో వెలిగిన రోజుల్లో మేము తరచు గా కలుసుకుంటూ వివిధ విషయాలు చర్చించుకునేవాళ్ళము.

తెలుగు లోనూ ,ఆంగ్లం లోనూ మంచి పట్టు ఉన్న మనిషి.ఏ సంగతి అయినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం.మరి ఈ అనువాదం విషయానికి వస్తే ఆశావాది గారి కవిత్వానికి పూర్తి న్యాయం  చేయాలనే తపన కనపడింది.అదే విధంగా పైన నేను చెప్పిన కొన్ని విషయాలు కూడా దీనికి అన్వయిస్తాయి.అదీ చెప్పవలసిందే.ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత కలిగే భావాలను మనము అది నిజమే గదా అనుకున్నామంటే అనువాదం విజయవంతం అయినట్లే.సరే..ఇక్కడ నిలుస్తాను.మళ్ళీ ఎప్పుడైనా కొన్ని సంగతులు. Murthy Kvvs 

Thursday, January 17, 2019

ఈశాన్య రాష్ట్రాల గూర్చి తెలిసినది ఎంత...మన లో చాలా మందికి..?




ఈశాన్య రాష్ట్రాల గూర్చి తెలిసినది ఎంత...మన లో చాలా మందికి..? అవి మన దేశం లో అంతర్భాగాలే..!అక్కడి కధలు ఏవిటో,ఇతర ప్రక్రియలు ఏవిటో తెలిసింది చాలా తక్కువ.ఆసక్తి కూడా తక్కువే.Seven sisters గా పిలువబడే ఆ రాష్ట్రాల్లో చాలా వైవిధ్యం ఉన్నది.దేని ఇది దానిదే.వాళ్ళ భాషల పద్ధతి,ఆచారాల పద్ధతి మిగతా దేశం తో పోలిస్తే భిన్నమే.నాగాలాండ్,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం ..ఇలా మిగిలిన వాటిల్లోనూ దేని దారి దానిదే అయినా అక్కడి ప్రధాన తెగల్లోనూ  మిక్కిలిగా ఉప జాతులు ఉండటం తో బాప్టిస్ట్ చర్చ్ ప్రభావం వల్ల ఇంగ్లీష్ అక్కడ కామన్ భాష గా మారిపోయింది.అలా అని వారి భాషల్ని మాటాడమూ వదల్లేదు..అది వేరే సంగతి.అక్కడ నుంచి జాజ్ సంగీత కారులు ఇంకా ఇండో ఆంగ్లికన్ రచయితలు ఎంతోమంది వచ్చారు.

సరే....అసలు విషయానికి వస్తే నేను ఇప్పుడు ఒక పుస్తకం గురించి చెబుతాను.నాగా తెగ లో అనేక ఉప తెగలు ఉన్నాయి.దానిలో ఒకటి Zeme అనేది.వీరు తమ ప్రాంతం లో చెప్పబడే కొన్ని జానపద కధల్ని సేకరించి వారి రాబోయే తరాల కోసమని అనండి లేదా ఇతరులకి తెలపడం కోసం అనండి ఓ పుస్తకాన్ని వెలువరించారు.అది ఎప్పుడో మైసూర్ లో ఉన్నప్పుడు కొన్నప్పటికి ఈ మధ్యనే చదివాను.కొన్ని వాక్యాలు దాని గురించి రాయాలని ఇలా సంకల్పించాను.  
కధల్ని సేకరించి పుస్తకరూపం లోకి తీసుకువచ్చినవారు Pauning Haikam,Keoutso Kapfo అనే ఇద్దరు.ఈ పుస్తకం పేరు Zeme Folktales,భారత ప్రభుత్వ సంస్థ CIIL,Mysore వారు ప్రచురించారు.మొత్తం 31 కధలు ఉన్నాయి.ప్రకృతి తో మనిషి కి ఉండే అనురక్తత,మనిషి కి మనిషి కి మధ్య గల అనేక రకాల సంబంధాల లో ఉండే రంగులు ఇలాంటివి మనని ఆకట్టుకుంటాయి.ఉదాహరణకి దీనిలోని మొదటి కధ ని వివరిస్తాను.A Step Mother కధ పేరు.అనగా అనగా Benru అనే గ్రామం లో Herielung అనే బాలుడు ఉండేవాడు.అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది.వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు ఈ అబ్బాయిని బాగా చూసుకోవ డానికి ఒకరు ఉండాలని.అయితే ఆమె ఈ కుర్రాడిని మంచి గా చూసుకోదు.కాలం గడుస్తున్న కొద్దీ ఊరికే ఉంటే ఏమి బాగుంటుంది...అందుకే పొలం పనులకి వెళుతుంటాడు.అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇతనికి మంచి నేస్తాలు అవుతారు.ఇతను ఎప్పుడు అన్నం తిన్నా ఒంటరి గా తింటూ ఊంటాడు.ఒకసారి ఇతను వేరే పనిలో ఉన్నప్పుడు ఇతని చద్ది చూస్తే వెగటు పుడుతుంది.ఎలుక గొద్దెలు కూడా ఉంటాయి.ఆ అమ్మాయిలు బాధపడి ఇతడిని అడుగుతారు.మా పినతల్లి ఇలాగే పెడుతుంది.అందుకే అన్నం తినేప్పుడు మీకు కనిపించకుండా తింటాను అని చెపుతాడు.ఆ అమ్మాయిలు ఇతనికి వాళ్ళ అన్నం పెడతారు.

అయిన తర్వాత మీ శాలువ లు నాకు ఇవ్వండి మీకు ఓ అద్భుతం చూపిస్తా అంటాడు ఈ కుర్రాడు.సరే అని ఇస్తారు.తను చెట్టు కొమ్మ ఎక్కి ఈ శాలువ ని కప్పుకొని ఓ పక్షి లా అరుస్తూ ఉంటాడు.ఉన్నట్లుండి అతను hornbill  పక్షి లా మారిపోగా కిందకి దిగి రమ్మని అమ్మాయిలు అడుగుతారు.లేదు లేదు...ఇలాగే నాకు హాయి గా ఉంది.మీరెప్పుడైనా పక్షుల గుంపు ని మీ గ్రామం లో చూశారనుకో..దానిలో నేను ఉంటాను.మీరు నన్ను గుర్తు పడతారు నాకు తెలుసు.అప్పుడు మీకు నేను ఎన్నో రంగురంగుల ఈకలని బహుమతి గా ఇస్తాను..సరేనా..అంటూ తుర్రుమని ఎగిరిపోయాడు.కొన్ని రోజుల తర్వాత చెప్పినట్లుగానే ఆ అమ్మాయిల ఊరి మీదు గా ఎగురుతూ వచ్చి వీళ్ళకి మంచి ఈకలని బహుమతి గా విసిరేస్తూ వెళతాడు.అతను తన గ్రామం మీదుగా ఎగురుతూ ఉండగా పిన తల్లి కూడా నోరు తెరిచి ఏమైనా ఇస్తుందా ఈ పక్షి అని చూస్తూ ఉంటుంది.వెంటనే ఈ పక్షి ఆమె నోటి లో రెట్ట వేసి తుర్రుమంటుంది.ఆ పినతల్లి శపిస్తూ తరుముతుంది.అయితే ప్రతి ఏడు పొలంపనులు అయిపోయిన తర్వాత ఉండే విశ్రాంతి దినం లో ఒక పండుగని చేస్తుంటారు.ఆ పక్షుల గుంపు ఇప్పటికీ వస్తూనే ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు.

అదీ అలా ముగుస్తుంది కధ.దీనిలో ఎన్ని జానర్ లు ఉన్నాయో గదా..!ఒకసారి ఆలోచిస్తే..!ఇంకొన్ని కధల్లో దెయ్యాలూ ఉంటాయి మనుషుల్తో కలిసిపోయి వ్యవహరిస్తూ.కొన్ని నీతి కధలు.కొన్ని భయానకాలు.ఇలా రకరకాలు.ఇంకా ఒకటి ఏమిటంటే కొన్ని అసభ్య పదాల వంటివీ ఉంటాయి గాని అవి కధలో మిక్స్ అయిపోయి మామూలుగా నే అనిపిస్తాయి.దేశం లోనే అత్యంత తక్కువ గా స్త్రీలపై  అత్యాచారాలు నమోదయ్యే రాష్ట్రం ఈ నాగాలాండ్.బహుశా ఒకప్పటి మాతృస్వామ్య ప్రభావం అనుకుంటాను. ఒక వెరైటీ కోసం ,నాగా తెగ లోని జానపద కధల్ని తెలుసుకోవడం కోసం చదవండి.Contact: Central institute of Indian languages ,Manasa Gangotri,Mysore-570006 (Karnata State)/ Price :Rs.235 (They would give 50% discount)  ----Murthy Kvvs 

Sunday, January 13, 2019

వివేకానంద స్వామి లో ఓ గొప్ప భావుకుడు కూడా ఉన్నాడు.


పొద్దుటి నుంచి ఆలోచిస్తున్నాను,ఏది రాయాలి,ఏది రాయకూడదు అని..!అదే ఈ రోజు వివేకానంద స్వామి జయంతి కదా..!ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి ఆయన గూర్చి ..అది నాకు పెద్ద సమస్య ఎప్పుడూ..! కొంతమంది కి ఆయన నీతి ని బోధించే గురువు గా కనిపిస్తే ,ఇంకొంతమందికి అభ్యుదయ భావాలు గల వ్యక్తి గా,మరి కొంతమందికి హిందూ మత విశిష్టత ని జగతి కి చాటిన తాత్వికుని గా ...ఇలా రకరకాలు గా కనిపిస్తారు.నిజానికి ఇలా కనిపించాలని ఓ ప్రయత్నం ప్రకారం చేసినది కాదు..ఆయన జీవితం.ఆయన మాట్లాడిన,రాసిన ప్రతి పలుకు ని అనేక ఏళ్ళుగా చదువుతూనే ఉన్నాను.ఇంకా అంత అద్భుతం గానూ,కొత్త రంగులీనుతూ ఈ రోజు కీ అన్వయింపగలిగే భావ వీచికలు గా అవి గోచరిస్తూ ఉంటాయి.

దానికి కారణం ఏమిటి...తన కాలాన్ని దాటి అనేక వందల ఏళ్ళు ముందు ఉన్నట్టుగా గోచరిస్తారు.మనం చాలామందిమి ఆయన కొటేషన్ లు మంచి గా ఉన్నవి కొన్నిటిని గూర్చి ఉటంకించుకుంటూ ఉంటాము.అయితే అవి అన్నీ ఆయన చెప్పిన విస్తృతమైన భావాల మధ్య లో నుంచి తీసుకున్నట్టివి.ఆ మాటలకి ముందు,వెనుక చాలా గొప్ప ధార ఉంటుంది అది పూర్తి గా ఆ పాఠం అంతా చదివితేనే బోధపడుతుంది.లేదా సగమే చేరుతుంది.అయినప్పటికీ ఆ మాటల్లోని ఉద్వేగం ,ఆకర్షణ అనంతమైనది.అది ఎంత తపో ధార తో,ఎంత హృదయ పరితాపం తో వచ్చినదో ఆయన పుస్తకాల్ని పూర్తి గా చదివితేనే అర్ధం అవుతుంది.

నాకు అర్ధమైనంతవరకు ...చెప్పాలంటే....హిందూ మతం లోని గొప్పతనం ని ఎంత ఉగ్గడించాడో,దానిలో ఉన్న చేర్చబడిన కొన్ని అమానవీయ పద్ధతులను అంత ఖండించాడు.అంతే గాక కొన్ని సాహసోపేత విషయాలను సైతం ఎవరు ఏమని అనుకుంటారో అని ఆలోచించకుండా చెప్పడం కనిపిస్తుంది.ఆ రోజుల లోనే బ్రాహ్మాణాధిక్యాన్ని ఖండించడం మామూలు విషయం కాదు.మీ ఇల్లూ,పరిసరాలు,శరీరాలు అన్నీ బలహీనతనే తలపింపజేస్తాయి.విద్య ,జ్ఞాన సముపార్జన కింది స్థాయి వరకు చేరకపోవడం వల్లనే మన దేశం మీదికి వచ్చిన ప్రతి జాతి కి బానిసల్లా బ్రతికాము.ఇదే గనక కొనసాగితే ఇక్కడి అధోజగతి జనులు చేసే పోరాటం ను మీరు తట్టుకొనలేరు.ఎందుకంటే అనేక వందల  ఏళ్ళ నుంచి వారు చేసిన శ్రమల వల్ల వారి మనసు,శరీరాలు బలవత్తరమైనవి.అని ఇటువంటి ఒక Prophetic call ని ఆ రోజుల్లో నే ఇచ్చారు.ఇది ఒక్కటే కాదు.. ఇలాంటి అనేక విషయాల్ని ఎన్నిటినో వక్కాణించారు..కాని వాటిని పెద్దగా ప్రాచుర్యం లోకి పెట్టరు ..!ఎవరకి కావలసినవి వారు తీసుకోవడం అనేది ఉన్నదే గదా..!
మళ్ళీ ఓ సందర్భం లో అంటారు,ఈ రోజు కీ మన దేశం లో ఏ కొన్ని శాస్త్రాలు మిగిలినా సంస్కృతి మిగిలినా ధనాన్ని తృణప్రాయం గా ఎంచే విప్రుల వల్లనే మిగిలిందని కూడా మరిచిపోరాదు.ప్రపంచం లో అత్యంత పేద పౌరహిత్యం నెరపే వారు వీరే ,అందుకనే వీరి పట్టు ప్రజలపై అంత గట్టిగా ఉంటుంది.నేను ప్రపంచం లోని అనేక దేశాల్లో చూశాను.పౌరహిత్యం నెరపే ఇతర మతాలలోని వారందరూ చాలా ధనవంతులే..!ఇలా ..ఎన్నో ఊహకి అందని అంశాల్ని చర్చించారు స్వామి ఆ రోజుల్లోనే.

పడమటి దేశాల్లోని అనేక విశిష్ట విషయాల్ని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.నల్లని వర్ణం వారు,రాగి వర్ణం వారు,పసుపు వర్ణం వారు ఎవరైతేనేం ..వారందరూ ఈ బ్రిటిష్ వారి ముందు ఎందుకు పాలితులు గా మారారో తెలుసా ...ఇక్కడి సైన్యం లో గాని,ప్రజా జీవనం లో గాని నాయకుడు అనేవాడు తాను ముందు గా త్యాగ ధనుడు గా ఉంటాడు.అందుకే అతని అనుచరులు కూడా అతని మాటని గౌరవిస్తారు.అలా ఎన్ని ..విషయాలో ఆయన చెప్పినవి.ఇవన్నీ ఒక ఎత్తయితే రాజయోగం మీద ఆయన రాసిన భాష్యం చాలా గొప్పది. ఎందుకనో సిద్ధులని ఆయన తిరస్కరించాడు గాని వాటి సాయం తో ఒక మతం నే తను స్థాపించి ఉండేవాడు.ఆత్మల తో మాటాడడం,ఎదుటి మనిషి లోని భావాల్ని ఉనది ఉన్నట్లు చదవడం ఇలా ...అనేకమైన వాటిని తను ఎరుగును.గాని వాటిని సామాన్యులలో ప్రచారం చేయడాన్ని ఇష్టపడలేదు.ఈ కోణం ని ఎవరూ పెద్దగా ప్రచారం లోకి కూడా తేలేదు.

ఇంగ్లీష్ భాష లో కూడా స్వామీజీ ది ఓ ప్రత్యేకమైన శైలి.ఎక్కడ ఏ మాట ఎంత తూకం వేయాలో అంత తూకం గా ప్రయోగిస్తారు.అందుకే వాటిలో అంత దమ్ము ఉంటుంది.కొంత మంది మహానుభావులు ఈయన ని కోట్ చేయకుండానే వాటిని వాడుకొంటూ ఉంటే నవ్వు వస్తుంది. వివేకానంద స్వామి లో ఓ గొప్ప భావుకుడు కూడా ఉన్నాడు.ఆయన కవితల్లో అది వ్యక్తమవుతుంది.Kali the Mother అనే కవితలో ఓ చోట ఇలా అంటారు...The stars are blotted out, The clouds are covering clouds, It is darkness vibrant, sonant.....For Terror is thy name, Death is thy breath, And every shaking step destroys a world for e'ver.....Who dares misery love,
And hug the form of death. Dance in destruction's dance, To him the Mother comes. 

Thursday, November 15, 2018

అమెరికన్ రచయిత హెర్మన్ మెల్విల్లె



ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన "ది ఓల్డ్ మేన్ అండ్ ద సీ" నవల చదివిన వారు ఎవరైనా తెలుగు లో "అతడు అడవిని జయించాడు"నవల ని చదివినప్పుడు కొన్ని సామీప్యాలు కనబడి ఆలోచన కి గురి అవుతాము.అయితే అక్కడ సముద్రం మీద జైత్ర యాత్ర అయితే ఇక్కడ యేమో అడవి లో పంది ఇంకా దాని పిల్లల కోసం సాగే అన్వేషణ.రెండు చోట్లా అస్తమయ దశ లో ఉన్న ఒక మనిషి యొక్క యాతన ఇంకా పడే తపన చిత్రించబడింది.అది తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి సాగించిన యాత్ర.ఈ కధ లో గనక ప్రధాన పాత్ర గా  ముసలివానికి బదులు  యువకుడు ఉన్నట్లయితే అంత రక్తి కట్టేది కాదేమో..!అందుకనే తెలుగు లో కూడా రచయిత ఆ పంధా నే కొనసాగించారు.అది ఫలించింది కూడా.

నిజానికి ఎర్నెస్ట్ హెమింగ్ వే కూడా ఈ సముద్ర సాహస యాత్ర ని ప్రఖ్యాత అమెరికన్ రచయిత హెర్మన్ మెల్విల్లె రాసిన మోబీ డిక్ నుంచి తీసుకున్నాడా అనిపిస్తుంది.అయితే ఒకటే పాత్ర ప్రధానం గా ఉండదనుకోండి.ఆహబ్ అనే నావికుడు ప్రధాన పాత్ర.ఒకసారి సముద్రం పై తిమింగళాల వేట కి వెళ్ళినప్పుడు ఒక తిమింగళం ఇతని మీద దాడి చేసి న ఫలితం గా ఒక కాలు ని కోల్పోతాడు.అయితే ఇతగాడు అంతటి తో ఊరుకోక ఎలాగైన సరే ఆ సముద్రం లో అదే ప్రాంతానికి పోయి ఆ తిమింగళం ని చంపి తీరాలి అని నిర్ణయించుకుంటాడు.తనకి కాలు పోయింది.ఎలా ..అందుకు గాను ఒక గొప్ప యోధుల బృందాన్ని సమకూర్చుకుంటాడు.అలా సముద్రం మీదనే కధ అంతా పోరాట మయం గా సాగుతుంది.దానిలో హీరో ఓ యువకుడు, తాను ...తన జ్ఞాపకాల లో భాగంగా కధ ని చెబుతుంటాడు.ఇతను న్యూయార్క్ నుంచి న్యూ బెడ్ ఫోర్డ్ కి ప్రయాణం చేస్తూంటాడు.చాలా అద్భుతం గా ఉంటుంది.

మొదటి సారి గా ఈ నవల 1851 ప్రాంతం లో ప్రచురింపబడి పెద్ద గా ఆదరణ కి నోచుకోలేదు గాని ఆ తర్వాత చాలానాళ్ళకి 1923 ప్రాంతం లో డి.హెచ్.లారెన్స్ వంటి వాళ్ళు దీన్ని ప్రస్తుతించడం తో దీని వైభవం రచయిత చనిపోయిన తర్వాత పెరిగింది.ఇది వచ్చిన ఇంచు మించు వంద ఏళ్ళకి అంటే 1952 లో ఎర్నెస్ట్ హెమింగ్ వే నవల వచ్చింది.2017 లో బాబ్ డైలాన్ నోబెల్ బహుమతి తీసుకున్న సందర్భం లో తాను హెర్మన్ మెల్విల్లే రచన నుంచి ఇన్స్పిరేషన్ పొంది మూడు గేయాలు రాసినట్లు చెప్పాడు.కనుక దేనికి ఎప్పుడు కాలం వస్తుందో తెలియదు.ఒక గొప్ప రచన ఏ రోజుకైనా తాను పొందవలసిన వాటా తాను పొంది తీరుతుంది.దానిని ఎవరూ ఆపలేరు.ఇది చరిత్ర చెబుతున్న సత్యం.  

Tuesday, November 6, 2018

"ది ఆల్కెమిస్ట్" నవల పై రెండుముక్కలు...!



అసలు ఎప్పుడో చదవ వలసింది.లేటయింది.ఆల్కెమిస్ట్ చదివావా..?చాలా బాగుంది అంటూ ..ఈ మధ్య అడిగిన మిత్రులు ఎందరో..!నేను ఏదో మిస్ అయినట్లుగా నే ఫీలయ్యాను.ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ముగించాను.ఏమి చెప్పాలో అర్ధం కాక కొంతసేపు అలా ఉండిపోయాను.మనం మనసు లో ధృఢంగా విశ్వసించినది సాకారం దాల్చడానికి ప్రకృతి శక్తులు సైతం సాయం చేస్తాయి అనే దీనిలోని డైలాగు బాగా ప్రాచుర్యం పొందినది.నిజానికి ఈ మాట చాలా పాతదే కాని దీని ద్వారా చాలా మందికి చేరింది.
ఈ పాటికే ఈ నవల లోని ఇతివృత్తం  చాలా మందికి తెలుసు గనక మరీ లోనకి వెళ్ళను.సాంటియాగో అనే కుర్రాడు ..అతనికి దేశాటనం అంటే ఇష్టం.పెద్దగా ధనవంతుడు కాదు కాబట్టి గొర్రెల కాపరి గా మారి అటు జీవితాన్ని ఇటు ప్రవృత్తిని సంతృప్తిపరుచుకుంటూ ఉంటాడు.ఒక రోజు ఓ పల్లె లో పాడు బడిన చర్చ్ లో గొర్రెల్ని ఆపుకొని నిద్రకి ఉపక్రమించినపుడు ఈజిప్ట్ లోని పిరమిడ్ ల వద్ద గొప్ప సంపద ఉన్నట్లు కల వస్తుంది.ఒక్కసారి కాదు చాలాసార్లు.ఇతను ఒక జిప్సీ మాంత్రికురాల్ని,ఒక ఇంగ్లీష్ అతన్ని, ఒక స్థానిక రాజు ని,ఓ ఆల్కెమిస్ట్ ని  అలా కలుసుకుంటూ మొత్తానికి చివరకి ఆ గమ్యానికి చేరడం జరుగుతుంది.అక్కడ దీన్ని కాజేయడానికి వచ్చిన ముగ్గురు కలుస్తారు.ఎంత తవ్వుతున్నప్పటికీ ఈ కుర్రాడి కి ఆ నిధి దొరకదు.వాళ్ళు ఈ కుర్రాడిని ఎగతాళి చేస్తారు...అక్కడ ఎక్కడో ఓ పాడుబడిన చర్చ్ లో ఓ నిధి ఉన్నట్లు మాకు కల వచ్చింది.అంతమాత్రాన మేం అక్కడి వెళ్ళామా..అని ఎగతాళి చేస్తారు.అప్పుడు ఈ కుర్రాడికి వెలిగి అసలు అక్కడే తను పడుకున్న చోటనే నిధి ఉందా అని అనుమానం వచ్చి ఇక్కడకి వచ్చి తవ్వుతాడు.కధ సుఖాంతం ..అవుతుంది.

సరే..బాగుంది.కాని దీనిలో ఏమి కొత్త ఎలిమెంట్ ఉందో నాకు అర్ధం కాలా..!పోనీ పాతదయినా కొత్త రకంగా చెప్పినట్లు అనిపించలేదు.అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్నట్లు సన్నివేశాలు ఉంటాయి.బలవంతంగా ఒక దానికి ఇంకో దానికి కుట్లు వేసినట్లు ఉన్నాయి.నామటికి నాకైతే ఓ చందమామ కధ లా అనిపించింది.ఓ పాలు ఫిలాసఫీ,ఓ పాలు చరిత్ర,ఓ పాలు ఉత్తేజపరిచే సెల్ఫ్ డెవెలప్మెంట్ పాఠాలు,ఓ పాలు ఇలా ఎందుకు జరిగింది అని అడగకూడని మేజికల్ రియాలిటి ఇవన్నీ చేర్చి వండిన వంటకం ఇది అనిపించింది.

పావ్లో కోయిలో పనితనం ఎక్కడ ఉంటుంది అంటే జీవితం లోని abstract aspects ని చాలా చిన్న పదాలలో ఒద్దికగా కన్విన్సింగ్ గా చెపుతాడు.అది తన అనుభవం లోనుంచి వచ్చి చెపుతున్నాడా అనిపిస్తుంది.బ్రెజిల్ కి చెందిన ఈయన పోర్చ్ గీస్ భాష లోనే రాస్తాడు.ఆ పిమ్మట ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది.అతని భూమిక కేథలిక్ విశ్వాసాల మీదనే ఉన్నప్పటికీ ఇతర మతాల లోని సారాన్ని బాగా అర్ధం చేసుకున్న ధోరణి కనబడుతుంది.మార్గరెట్ జల్ కోస్టా అనే ఆవిడ ఎక్కువ గా ఇంగ్లీష్ అనువాదం చేస్తూ ఉంటుంది.జటిలత లేకుండా పాఠకుని అలరించే రీతి లో చేసే ఇలాంటి అనువాదాలు అందరి ఆమోదం పొందుతాయి.ఏ మాత్రం కొత్తదనం ఉన్నా అది ఒక అదనపు ఆకర్షణే.  

Friday, September 28, 2018

"The English Teacher " నవల by ఆర్.కె.నారాయణ్...!



The English Teacher ఈ నవల ఆర్.కె.నారాయణ్ మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నలభై వ దశకం లో రాసినది.ఇప్పటికి 41 ముద్రణలు పొందినది.చదువుకునే రోజుల్లో ఆయన రచనలు మన ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఎక్కడో చోట చదుకునే ఉంటాము.అయితే ఈ మధ్య ఎందుకనో దీన్ని చదివాను.మళ్ళీ చదవాలనిపించి..!ఆయన ఎందుకని మాల్గుడి అనే కల్పిత పట్టణాన్ని సృష్టించి కధలు అన్నీ అక్కడ జరుగుతున్నట్లు రాస్తారు అని ఒక సందేహం ఉండేది.ఇంగ్లీష్ లో రాయడం వల్ల క్రమేపి పేరు రావడం వల్ల తమిళేతరులు ఇంకా దక్షిణ భారతీయేతరులు రచనలు చదివినపుడు ఇది ఫలానా రాష్ట్రానికి చెందినది అనే ఆలోచన రాకుండా ఉండటానికి కావచ్చును.నిజానికి నారాయణ్ తన రచనా జీవితాన్ని ఎక్కువ గా మైసూరు లో ఉండే సాగించారు.ఆయన తండ్రి మైసూరు మహారాజా దివాణం లో పనిచేయడానికి పిలువబడిన తమిళుడు.

సరే..ఈ ఇంగ్లీష్ టీచర్ నవల కే వద్దాము.బహుశా ఇది తన జీవితానికి దగ్గర గా ఉన్న నవల కావచ్చును.ఈ కధ లో ఆల్బర్ట్ మిషన్ కాలేజి లో ప్రధాన పాత్ర  కృష్ణన్ ఆంగ్ల అధ్యాపకుని గా పనిచేస్తుంటాడు.ఈ కాలేజ్ లో ఉన్న హాష్టల్ లో ఉంటూ ఉద్యోగం కొనసాగిస్తూ ఉంటాడు.అతని ప్రత్యేకత ఏమిటంటే ఇదే కాలేజ్ లో చదివి ఇక్కడే జాబ్ సంపాదించుకోవడం.

షేక్స్పియర్ డ్రామా,ఎలిజబెతన్ మీటర్,రొమాంటిక్ పోయిట్రీ ఇలాటివి బోధిస్తూ జీవితమంతా ఇదే పనా,ఏదో కొత్త గా చెయ్యాలి అని తపిస్తూ ఉంటాడు.కాని జీతం,జీవితం సాఫీ గా పోతున్నది..ఇప్పుడెందుకు మళ్ళీ ప్రయోగాలు..అని ఇంకో ఆలోచన మరోవేపు.పైగా ఆరు నెలల పాప,భార్య ..వాళ్ళు త్వరలో తమ ఊరి నుంచి ఈ మాల్గుడి రాబోతున్నారు.అద్దె ఇల్లు చూడాలి.

ఆర్కె నారాయణ్ కూడా నిజ జీవితం లో  కాలేజ్ లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాడే.ఇంకా కొంత కాలం పాటు ఒక మిషన్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసి అక్కడి ప్రిన్స్ పాల్ తో గొడవ పడి ఉద్యోగం మానేసిన వాడే. ఆ తర్వాత రకరకాల పత్రికల్లో విలేకరి గా పనిచేసి ఆ తర్వాత రచయిత గానే తాను జీవించాలని నిర్ణయించుకుని చివరి దాకా అలాగే కొనసాగాడు.అదృష్టం కొద్దీ పేరు,సంపద పుష్కలం గానే పొందినాడు.మైసూర్ లోని ఆయన ఇంటికి కొన్నేళ్ళ క్రితం వెళ్ళాను.చక్కటి బంగళా ,చల్లని వృక్షాలు ఉన్న ఆ ప్రదేశాన్ని సందర్శకుల కోసం కర్నాటక ప్రభుత్వం పదిలపరిచింది.

సరే..ఈ అధ్యాపకుని భార్య మాల్గుడి వస్తుంది చిన్న పిల్లతో..!కొన్నాళ్ళపాటు హాయిగా ఉంటారు.కొత్త ఇల్లు కొనుకుందామని ప్లాన్ వేసుకుంటారు.ఆ కాలేజ్ లోనే పని చేసి రియాల్టర్ అవతారమెత్తిన ఒకాయన సాయం తో ఓ యిల్లు ని చూస్తారు.అక్కడ కొన్ని దుశ్శకునాలు పొడసూపుతాయి.ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి ఈమె జ్వరాన పడి చివరకి కన్ను మూస్తుంది.ఇహ చంటి పిల్ల బాధ్యత ఇతని మీద పడుతుంది.అతని తల్లి పిల్ల ని పంపించమన్నా పంపడు.తర్వాతే ఆమె ఇక్కడికి వచ్చి సాయం గా ఉంటుంది.
ఇక్కడ దాకా సాదాగా పోతూ ఉండే కధ గొప్ప మలుపు తిరుగుతుంది.చనిపోయిన భార్య ఆత్మ తో మాట్లాడే కార్యక్రమాలు పెట్టుకుంటాడు.దీనికి ఓ కారణం ఉంది.ఈ కృష్ణన్ పని చేసే కాలేజ్ కి ఒక కుర్రాడు వస్తాడు ఓ ఉత్తరం తీసుకుని..!సరయూ నది ఒడ్డు అవతల ఉన్న ఓ గ్రామం నుంచి ఒక రైతు పంపిన ఉత్తరం అది.తాను సాధన చేస్తుండగా మీ భార్య ఆత్మ తారసపడిందని...ఇంకా కొన్ని గుర్తులు అవీ రాస్తాడు..దానితో ఇతనికి ఆసక్తి మొదలవుతుంది.ఆ రైతు తో కలిసి ఆరుబయల్లో ఈ ప్రయోగాలు చేయడం మొదలుపెడతాడు.కొన్ని రోజులకి ఈ రైతు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళిపోతాడు.ఆ తర్వాత ఇతనే ఆ పనిని కొనసాగిస్తూ ఉంటాడు.

మేజిక్ రియలిజం అనే దాన్ని ఆ రోజుల్లోనే ఆర్కె తన రచనల్లో చొప్పించాడే అనిపించింది.కొన్ని ఉప కధలు కూడా సాగుతుంటాయి.ఈ నవల లో..!మనం చదువుతుంటే బ్రిటీష్ శైలి ఏర్పడి పోతూ ఉంటుంది.అదీ ఈ నాటి అమెరికన్ తరహా ఆంగ్లం రోజూ నెట్ లోనూ ,ఫిక్షన్ లోనూ చదివేస్తూ ఉంటాం గదా...!మన వలస రోజులు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి...ఆ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా డా.బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఉండటం.విద్యార్థులకి ఆంగ్లం నేర్పడం లో చూపించే శ్రద్ధ ,దానికోసం అధ్యాపకులకి సూచనలు ఇచ్చే పద్ధతి ఇలాటివి అన్నీ తెలుస్తాయి.

ఆర్కే లో ఉన్న ఒక మేజిక్ ఏమిటంటే ఇంగ్లీష్ లో రాసినా తమిళ దనాన్ని దానిలో సూక్ష్మ రీతి లో ప్రవేశపెడతాడు.పాత్రల్ని ఇంకా వాటి స్వభావాల్ని యూనివర్సల్ అప్పీల్ ఉండేలా చూస్తాడు.సునిశితమైన హాస్యం,వ్యంగ్యం తొంగిచూస్తూంటాయి.
సగటు భారతీయ జీవనం లోని అన్ని లక్షణాలు మాల్గుడి లో ఉంటాయి.అలా ఓ కాల్పనిక పట్టణాన్నితీర్చిదిద్దడమూ ఒక చెప్పుకోదగ్గ విషయమే.మొదటి మూడు చాప్టర్ లు కొంచెం బోర్ గా ఉన్న మాట వాస్తవం.అలా తోచింది నాకు.Hundred years of solitude అని గాబ్రియల్ గార్షియా మార్క్వేజ్ నవల చదివినపుడు కూడ మొదటి వంద పేజీలు చదవడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చుకోవాల్సి వచ్చింది.ఆ జిప్సీలు కాల్పనిక గ్రామానికి ప్రతి ఏడు రావడం వాళ్ళు తీసుకొచ్చే వింత వస్తువులు,Buendia కుటుంబం యొక్క వంశ వృక్షం యొక్క వర్ణనలు,మళ్ళీ ప్రధానమైన పదుల కొద్దీ పాత్రలు,పేర్లన్నీ చాలా దగ్గర గా ఉండటం...వీటన్నిటికీ కలిపే ఆ మహానుభావుని కి నోబెల్ ఇచ్చారా అనిపించింది.నిస్సందేహంగా మార్క్వేజ్ గొప్ప రచనలు చేశాడు..దాన్ని కాదనడం లేదు.

ఒక స్థాయికి పేరు వచ్చిన తర్వాత చాలామంది గొప్ప వారి ఇతర రచనలు అలానే ఉండటం కద్దు.కాని ప్రవాహం లో సాగిపోతాయి.ఇది ప్రపంచం అంతటా ఉన్నదే.ఆర్కె నారాయణ్ మీద నేటి విమర్శకుల లో ఉండే ఒక అభియోగం ఏమంటే His tone and landscape reflects Brahminical ambiance అని..!అయితే ఒకటి... తాను జీవించిన కాలమూ అప్పటి పరిస్థితులను కూడా మనం గమనం లో ఉంచుకోవాలి.---  Murthy Kvvs