Friday, April 19, 2019

ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం



ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం ఇప్పుడు సులభమైన తెలుగు లోకి రావడం తో చదవడం కుదిరింది.చదివిన తర్వాత కొన్ని అంశాల్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది.1830 మే నెల లో చెన్నపట్నం లో బయలుదేరి మళ్ళీ 1831 సెప్టెంబర్ మాసం లో ఆయన తన పరివారం తో యాత్ర ముగించుకొని వెనక్కి వచ్చారు.ఇది ఒక యాత్ర గురించిన పుస్తకమే కాదు.అప్పటి సామాజిక,సాంస్కృతిక,ఆర్ధిక భారతం చాలా కొత్త కోణం లో కనబడుతుంది.ఎంతో సహనం తో తాను గమనించిన అంశాల్ని రికార్డ్ చేసిన తీరు అమోఘం.యాత్ర లో సాగుతూనే వారానికి ఒక ఉత్తరం చొప్పున తన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కి రాశాడు.ఇచ్చిన మాట ప్రకారం..! అది మొత్తం మనకి ఒక ఉద్గ్రంధమైనది.

దీన్ని పూర్తి చేసిన తర్వాత ప్రచురణ కి గాను సాయం చేయమని బ్రౌన్ దొర కి అందించుతాడు మన ఏనుగుల వీరస్వామి ,అయితే ఎందుకో గాని ఆయన కొన్ని నెలలు తర్వాత ఎటువంటి సాయం ఈ విషయం లో చేయకుండా చెన్నపట్నం లోని ఒక గ్రంధాలయానికి ఈ మాన్యుస్క్రిప్ట్ ని ఇచ్చి లండన్ వెళ్ళిపోతాడు.అయితే దీనికి కారణం ఒకటి ఉంటుంది.అది చివరన చెప్పుకుందాం.వీరాస్వామి తిరుపతి ,శ్రీశైలం,హైదరాబాద్,నిర్మల్,నాగ్పూర్,జబల్పూర్ ప్రయాగ మీదుగా కాశీ చేరి మళ్ళీ పాట్నా,కలకత్తా,బరంపురం,చత్రపురం,శ్రీకాకుళం,రాజమండ్రి,నెల్లూరు ల మీదుగా చెన్నపట్నం చేరుతాడు.మొత్తం మీద రమారమి నదులు దాటింది ,నడిచింది,పల్లకిలో వెళ్ళింది అంతా కలిపి నాలుగు వేల కిలో మీటర్లు గా లెక్క తెలుతుంది.ఇప్పటి మాదిరి గా రోడ్లు లేవు.అరణ్యాలు,రకరకాల నేలలు,మిట్టపల్లాలు,మైదానాలు,పల్లెలు,బస్తీలు ప్రతి యాభై వంద కిమీ దూరానికీ మారిపోయే రాజ్యాలు,జమీందారులు వారి పాలనలు కరెన్సీ కూడా మారి పోతూంటుంది.ఇక మనుషుల తీరులు సరే..!ఈ ప్రయాణాన్ని ఇంచుమించు వంద మంది తో చేయడం ,వారిని ఆర్గనైజ్ చేయడం చాలా గొప్ప గా అనిపిస్తుంది.తన తల్లిని,భార్యని,చుట్టాల్ని,స్నేహితుల్ని అనదరిని తీసుకెళ్ళాడు.ఇక పల్లకీ మోసే బోయీలు. ఆ పల్లకీలు తయారించడం,రకాల డేరాలు సమకూర్చుకోవడం...సత్రాలు దొరకని చో గుడారాలు వేసుకుండానికి..!

వీరాస్వామి గారు పేద కుటుంబం లో జన్మించినప్పటికీ స్వయం కృషి తో ఆంగ్లం,తమిళం,పారశీకం ఇత్యాది అన్య భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ఆనాటి చెన్నపట్నం లోని సుప్రీం కోర్ట్ లో దుబాషీ గా పనిచేసి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.న్యాయమూర్తు లు గా ఉన్న తెల్ల దొరలకి తమిళం,తెలుగు భాషల్లో ఉండే వ్యవహారాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి వారికి ఇవ్వడం ఈయన పని.యాభై ఏళ్ళు దాటిన పిమ్మట ఈ యాత్ర చేయాలనే తలంపు కలుగుతుంది.వాళ్ళమ్మ గారు కాశీ తీసుకెళ్ళమని కోరగా సరే ..నీతో పాటు ఇంకా ఎక్కువమందిని ఆ కాశీ విశ్వనాధుని వద్ద కి తీసుకెళ్ళి ఆ పుణ్యం మూటగట్టుకుంటానని సంకల్పించుకుంటాడు.

తాను పనిచేసే తెల్ల దొరల వద్ద నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటాడు.ఇవి ఆయనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ దూర ప్రయాణం లో..!మధ్యలో తగిలే జమీందారులు,చిన్న తరహా పాలకులు వీటికి విలువనిస్తారు.కొన్ని చోట్ల లెక్కచేయని వారూ ఉన్నారనుకొండి.ప్రతి రోజు 20 లేదా 22 కి.మీ.నడక ఉంటుంది.అక్కడ ఆగడం.గుడారాలు వేసుకోవడం.కొన్ని చోట్ల సత్రాలు ఉంటాయి.కొన్ని చోట్ల ఉండవు.అడవి లో మృగాలు భయపడటానికి తుపాకులు కూడా పేలుస్తుంటారు.ముందు వెళ్ళబొయే ఊరు ని గురించిన వివరాలు తెలుసుకుండానికి గుర్రాల మీదనో ఇంకో రకం గానో కొంతమంది తన మనుషుల్ని పంపించడం..అలాంటి ప్లానింగ్ లు చాల గొప్ప గా ఉంటాయి.దీంతో బాటు గా ఆయన తెచ్చుకునే ఖర్చుల నిమిత్తపు డబ్బు ఇంకా నగల్ని కాపాడుకోవడానికి అనుసరించిన విధానం వీరాస్వామి గారి తెలివితేటలకి నిదర్శనం.

శ్రీ శైలం దగ్గరి ఆలయాల పరిస్థితి దయనీయం గా ఉన్నట్లు రాస్తాడు.హైదరాబాద్ లో ప్రవేశించిన తర్వాత పరిస్థితి ని గురించి రాస్తూ ఆయుధాల్ని ఆభరణాలు గా ధరించి రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించి వర్ణిస్తాడు.ఇక్కడ నోరుండి,కత్తి ఉన్నవానిదే రాజ్యం.అలా ఉంది పరిస్థితి అంటాడు.నాగ్పూర్ రాజ్యం లోకి వచ్చిన తర్వాత నాగరిక ప్రపంచం లోకి వచ్చినట్లు ఉందని అంటాడు.హైదరాబాద్ లో కూరగాయలు,పండ్లు ఆ నేల నీరు వల్లనో ఏమో మంచి రుచిగా ఉన్నాయనీ అంటాడు.నాగ్ పూర్ లో కూడా హైద్రాబాద్ లానే స్వతంత్ర రాజులు ఉన్నా బ్రిటీష్ వారికి కప్పం కట్టుకుంటూనే పాలన సాగిస్తుంటారు.ఇంకా ఆపైన చిన్న రాజ్యాలు ఎన్నో తగులుతుంటాయి.వాటి అన్నిటి వివరాలు ఎవరకి వారు చదవవలసిందే.అక్కడి వ్యవహారాలూ అవన్నీనూ..!

తినే తిండిని బట్టే వంటికి బలమూ పౌరుషమూ వస్తాయి అంటాడు ఓ చోట..ఉత్తరాది వారికి దక్షిణాది వారికి భేదం చెపుతూ..!దూద్ పేడాలు,పెరుగు,పాలు,రొట్టెలు, నెయ్యి ఇట్లాంటి వాటిని తింటూ అరాయించుకునే వీరి దేహాలు స్త్రీ,పురుషులు గాని మంచి బలిష్టం గా ఉంటాయి అని అభిప్రాయపడతాడు.జబల్ పూర్ ,రాయ్ పూర్ లాంటి మధ్య భారత రాజ్యాల్లో సత్రాల్లో దిగుతూ లేదా గుడారాలు వేసుకుంటూ ఉంటూ స్థానిక పరిస్థితులు తెలుసుకుంటూ తన పరివారం తో సాగిపోతుంటాడు.(సరే మిగతాది వచ్చే భాగం లో)           

2 comments:

  1. ఇది ఎన్ని పేజీల పుస్తకం? ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? వెల ఎంత? దయచేసి చెప్పగలరా?

    ఇదివరలో ఆన్-లైన్ లో ఎంత వెదికినా ... దిగవల్లి వెంకట శివరావు గారి సంపాదకత్వంలో వెలువడి పుస్తక పరిచయం, ఊళ్ళ పట్టిక వగైరాలతో ఉన్న చిన్న పుస్తకం (50, 60 పేజీలు) మాత్రమే దొరుకుతోంది.

    ReplyDelete
  2. This is a new version brought by Machavarapu Adinarayana garu.(Pages 8+279+16)Contact no:98498 83570

    ReplyDelete