The English Teacher ఈ నవల ఆర్.కె.నారాయణ్ మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నలభై వ దశకం లో రాసినది.ఇప్పటికి 41 ముద్రణలు పొందినది.చదువుకునే రోజుల్లో ఆయన రచనలు మన ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఎక్కడో చోట చదుకునే ఉంటాము.అయితే ఈ మధ్య ఎందుకనో దీన్ని చదివాను.మళ్ళీ చదవాలనిపించి..!ఆయన ఎందుకని మాల్గుడి అనే కల్పిత పట్టణాన్ని సృష్టించి కధలు అన్నీ అక్కడ జరుగుతున్నట్లు రాస్తారు అని ఒక సందేహం ఉండేది.ఇంగ్లీష్ లో రాయడం వల్ల క్రమేపి పేరు రావడం వల్ల తమిళేతరులు ఇంకా దక్షిణ భారతీయేతరులు రచనలు చదివినపుడు ఇది ఫలానా రాష్ట్రానికి చెందినది అనే ఆలోచన రాకుండా ఉండటానికి కావచ్చును.నిజానికి నారాయణ్ తన రచనా జీవితాన్ని ఎక్కువ గా మైసూరు లో ఉండే సాగించారు.ఆయన తండ్రి మైసూరు మహారాజా దివాణం లో పనిచేయడానికి పిలువబడిన తమిళుడు.
సరే..ఈ ఇంగ్లీష్ టీచర్ నవల కే వద్దాము.బహుశా ఇది తన జీవితానికి దగ్గర గా ఉన్న నవల కావచ్చును.ఈ కధ లో ఆల్బర్ట్ మిషన్ కాలేజి లో ప్రధాన పాత్ర కృష్ణన్ ఆంగ్ల అధ్యాపకుని గా పనిచేస్తుంటాడు.ఈ కాలేజ్ లో ఉన్న హాష్టల్ లో ఉంటూ ఉద్యోగం కొనసాగిస్తూ ఉంటాడు.అతని ప్రత్యేకత ఏమిటంటే ఇదే కాలేజ్ లో చదివి ఇక్కడే జాబ్ సంపాదించుకోవడం.
షేక్స్పియర్ డ్రామా,ఎలిజబెతన్ మీటర్,రొమాంటిక్ పోయిట్రీ ఇలాటివి బోధిస్తూ జీవితమంతా ఇదే పనా,ఏదో కొత్త గా చెయ్యాలి అని తపిస్తూ ఉంటాడు.కాని జీతం,జీవితం సాఫీ గా పోతున్నది..ఇప్పుడెందుకు మళ్ళీ ప్రయోగాలు..అని ఇంకో ఆలోచన మరోవేపు.పైగా ఆరు నెలల పాప,భార్య ..వాళ్ళు త్వరలో తమ ఊరి నుంచి ఈ మాల్గుడి రాబోతున్నారు.అద్దె ఇల్లు చూడాలి.
ఆర్కె నారాయణ్ కూడా నిజ జీవితం లో కాలేజ్ లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాడే.ఇంకా కొంత కాలం పాటు ఒక మిషన్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసి అక్కడి ప్రిన్స్ పాల్ తో గొడవ పడి ఉద్యోగం మానేసిన వాడే. ఆ తర్వాత రకరకాల పత్రికల్లో విలేకరి గా పనిచేసి ఆ తర్వాత రచయిత గానే తాను జీవించాలని నిర్ణయించుకుని చివరి దాకా అలాగే కొనసాగాడు.అదృష్టం కొద్దీ పేరు,సంపద పుష్కలం గానే పొందినాడు.మైసూర్ లోని ఆయన ఇంటికి కొన్నేళ్ళ క్రితం వెళ్ళాను.చక్కటి బంగళా ,చల్లని వృక్షాలు ఉన్న ఆ ప్రదేశాన్ని సందర్శకుల కోసం కర్నాటక ప్రభుత్వం పదిలపరిచింది.
సరే..ఈ అధ్యాపకుని భార్య మాల్గుడి వస్తుంది చిన్న పిల్లతో..!కొన్నాళ్ళపాటు హాయిగా ఉంటారు.కొత్త ఇల్లు కొనుకుందామని ప్లాన్ వేసుకుంటారు.ఆ కాలేజ్ లోనే పని చేసి రియాల్టర్ అవతారమెత్తిన ఒకాయన సాయం తో ఓ యిల్లు ని చూస్తారు.అక్కడ కొన్ని దుశ్శకునాలు పొడసూపుతాయి.ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి ఈమె జ్వరాన పడి చివరకి కన్ను మూస్తుంది.ఇహ చంటి పిల్ల బాధ్యత ఇతని మీద పడుతుంది.అతని తల్లి పిల్ల ని పంపించమన్నా పంపడు.తర్వాతే ఆమె ఇక్కడికి వచ్చి సాయం గా ఉంటుంది.
ఇక్కడ దాకా సాదాగా పోతూ ఉండే కధ గొప్ప మలుపు తిరుగుతుంది.చనిపోయిన భార్య ఆత్మ తో మాట్లాడే కార్యక్రమాలు పెట్టుకుంటాడు.దీనికి ఓ కారణం ఉంది.ఈ కృష్ణన్ పని చేసే కాలేజ్ కి ఒక కుర్రాడు వస్తాడు ఓ ఉత్తరం తీసుకుని..!సరయూ నది ఒడ్డు అవతల ఉన్న ఓ గ్రామం నుంచి ఒక రైతు పంపిన ఉత్తరం అది.తాను సాధన చేస్తుండగా మీ భార్య ఆత్మ తారసపడిందని...ఇంకా కొన్ని గుర్తులు అవీ రాస్తాడు..దానితో ఇతనికి ఆసక్తి మొదలవుతుంది.ఆ రైతు తో కలిసి ఆరుబయల్లో ఈ ప్రయోగాలు చేయడం మొదలుపెడతాడు.కొన్ని రోజులకి ఈ రైతు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళిపోతాడు.ఆ తర్వాత ఇతనే ఆ పనిని కొనసాగిస్తూ ఉంటాడు.
మేజిక్ రియలిజం అనే దాన్ని ఆ రోజుల్లోనే ఆర్కె తన రచనల్లో చొప్పించాడే అనిపించింది.కొన్ని ఉప కధలు కూడా సాగుతుంటాయి.ఈ నవల లో..!మనం చదువుతుంటే బ్రిటీష్ శైలి ఏర్పడి పోతూ ఉంటుంది.అదీ ఈ నాటి అమెరికన్ తరహా ఆంగ్లం రోజూ నెట్ లోనూ ,ఫిక్షన్ లోనూ చదివేస్తూ ఉంటాం గదా...!మన వలస రోజులు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి...ఆ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా డా.బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఉండటం.విద్యార్థులకి ఆంగ్లం నేర్పడం లో చూపించే శ్రద్ధ ,దానికోసం అధ్యాపకులకి సూచనలు ఇచ్చే పద్ధతి ఇలాటివి అన్నీ తెలుస్తాయి.
ఆర్కే లో ఉన్న ఒక మేజిక్ ఏమిటంటే ఇంగ్లీష్ లో రాసినా తమిళ దనాన్ని దానిలో సూక్ష్మ రీతి లో ప్రవేశపెడతాడు.పాత్రల్ని ఇంకా వాటి స్వభావాల్ని యూనివర్సల్ అప్పీల్ ఉండేలా చూస్తాడు.సునిశితమైన హాస్యం,వ్యంగ్యం తొంగిచూస్తూంటాయి.
సగటు భారతీయ జీవనం లోని అన్ని లక్షణాలు మాల్గుడి లో ఉంటాయి.అలా ఓ కాల్పనిక పట్టణాన్నితీర్చిదిద్దడమూ ఒక చెప్పుకోదగ్గ విషయమే.మొదటి మూడు చాప్టర్ లు కొంచెం బోర్ గా ఉన్న మాట వాస్తవం.అలా తోచింది నాకు.Hundred years of solitude అని గాబ్రియల్ గార్షియా మార్క్వేజ్ నవల చదివినపుడు కూడ మొదటి వంద పేజీలు చదవడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చుకోవాల్సి వచ్చింది.ఆ జిప్సీలు కాల్పనిక గ్రామానికి ప్రతి ఏడు రావడం వాళ్ళు తీసుకొచ్చే వింత వస్తువులు,Buendia కుటుంబం యొక్క వంశ వృక్షం యొక్క వర్ణనలు,మళ్ళీ ప్రధానమైన పదుల కొద్దీ పాత్రలు,పేర్లన్నీ చాలా దగ్గర గా ఉండటం...వీటన్నిటికీ కలిపే ఆ మహానుభావుని కి నోబెల్ ఇచ్చారా అనిపించింది.నిస్సందేహంగా మార్క్వేజ్ గొప్ప రచనలు చేశాడు..దాన్ని కాదనడం లేదు.
ఒక స్థాయికి పేరు వచ్చిన తర్వాత చాలామంది గొప్ప వారి ఇతర రచనలు అలానే ఉండటం కద్దు.కాని ప్రవాహం లో సాగిపోతాయి.ఇది ప్రపంచం అంతటా ఉన్నదే.ఆర్కె నారాయణ్ మీద నేటి విమర్శకుల లో ఉండే ఒక అభియోగం ఏమంటే His tone and landscape reflects Brahminical ambiance అని..!అయితే ఒకటి... తాను జీవించిన కాలమూ అప్పటి పరిస్థితులను కూడా మనం గమనం లో ఉంచుకోవాలి.--- Murthy Kvvs
మాస్టారూ కధ సగమే చెప్పారు. చివరి దాకా చెప్పండి. మాకు చదవటానికి పుస్తకాలు దొరకవు.
ReplyDelete