Friday, April 3, 2020

"అసురుడు-పరాజితుల గాధ" పుస్తకం పై రివ్యూ (Last Part)



అసురుడు-పరాజితుల గాధ (నిన్నటి భాగం తరువాయి)

నిన్నటి భాగం లో ఎక్కడ ఆగాము..? సీత రావణుడి కి కుమార్తె ఏమిటి అనుకున్న దగ్గర గదా..!అవును ఆనంద్ నీలకంఠన్ రావణాయణం మరి ఇది.కధ ఇపుడు ఇంకో వేపునుంచి గదా సాగుతున్నది.కాబట్టి క్లుప్తం గా రాస్తాను.కొన్ని కొత్త గా నే అనిపిస్తాయి.తప్పదు.అలా రావణుడి యొక్క కూతురు ఆ ఆర్ష రాజ్యం లో జనక మహారాజు కి  దొరికి మిధిలా నగరం లో పెరుగుతూ యుక్త వయస్సు కి వస్తుంది.స్వయం వరం ప్రకటిస్తాడు జనకుడు.ఆ కాలం లో అది ఒక సంప్రదాయం ఆ ప్రాంతంలో. ఈ సంగతి లంక లో ఉన్న రావణుడి కి తెలుస్తుంది. తన కుమార్తె ఎలా పెరుగుతోంది అన్న విషయం మీద అతను ఎప్పటికప్పుడు గూఢచార  నివేదికలు తెప్పించుకుంటూంటాడు.

అతను ఇలాంటి పద్ధతుల్ని నిరసిస్తాడు.స్త్రీ స్వాతంత్రయం ని హరించే ఆర్య సంస్కృతి ని వ్యతిరేకిస్తాడు రావణుడు.ఆడ అయినా,మగ అయినా  వారికి ఇష్టమైన వారి తో కలిసి ఉండే పద్ధతులు లంక లో ఉంటాయి.మధుపానం విషయం లో కూడా అంతే.వేరు వేరు ధర్మాలు అంటూ ఉండవు.అస్పృశ్యత అనేది కూడా తన రాజ్యం లో లేదు.పుట్టుక ని బట్టి ఒక వ్యక్తి సాంఘిక స్థాయిని,తెలివి ని అంచనా వేసే దుస్సంప్రదాయం లేదు.ఎవరు ఏ స్థాయి కి అయినా వెళ్ళవచ్చు.తన రాజ్యం లోని పద్ధతులు అవి.అలా కానట్లయితే బ్రాహ్మణుడికి,అసుర స్త్రీ కి జన్మించిన తనవంటి వాడు ఈ లంకాధిపతి గా అయిఉండగలిగేవాడా..?

అయితే ఇక్కడా కొన్ని జాడ్యాలు లేకపోలేదు. పురుషులకి ఏమో వస్తు సంచయం మీద ఆసక్తి ఎక్కువ.స్త్రీలు మిగతా బయటి వారి తో పోల్చితే దుందుడుకు గా ఉంటారు.ఆ రోజుల్లోనే విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించి మయుడి ద్వారా పుష్పక విమానాన్ని కూడా తయారు చేయిస్తాడు.ఇదిగో ఇప్పుడు ఈ పుష్పక విమానం లోనే రావణుడు లంక నుంచి మిధిలా నగరానికి బయలుదేరి వెళుతున్నాడు.మొత్తానికి స్వయంవర ప్రాంగణం లోనికి వెళ్ళి కూర్చుంటాడు.ముక్కు మొఖం తెలియనివాడెవడో ఈ శివ ధనుస్సు విరిస్తే ఆమె ని తన కుమార్తె వివాహం చేసుకోవాలా..?ఏమిటీ పద్ధతులు అని అనుకుని నువ్వే గనక నా వద్ద పెరిగి ఉన్నట్లయితే నీకు నచ్చినవాడికే ఇచ్చి పెళ్ళి చేసి ఉండేవాడిని కదమ్మా అని విచారపడతాడు.   


ఆ స్వయంవర కార్యక్రమం లో ఫాల్గొనడానికి వచ్చిన రాజకుమారులందరిని చూస్తూ రావణుడు ఒక ముగ్గురు వైపు దృష్టి సారిస్తాడు.ఇద్దరు అన్నదమ్ములు ,ఇంకొకరు వారి ఆస్థాన పురోహితుని లా ఉంటారు.ఆ అన్నదమ్ముల్లో ఒకరైన రాముడి ని చూసి 'ఏమిటి ఇతను చాలా గర్వం గానూ ,గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వాడి లా ఉన్నాడు.మిగతా వారి లా ఏ మాత్రం అణకువ లేదు ' అని  అనుకొని తొలి చూపు లోనే  ఒకలా భావిస్తాడు. మొత్తానికి ఆ ఘట్టం సీతారాముల పరిణయం తో  పూర్తి అవుతుంది.

కొన్నాళ్ళు గడిచిన పిమ్మట రాముడు వనవాసానికి వచ్చి దండకారణ్యం లో సంచరిస్తుంటాడు.అప్పుడు  అది రావణుడి కి తెలిసి ఈ ఉత్తరాది వారి దిక్కుమాలిన వ్యవహారాలు ఏమిటో .. ఆ రాణి కి దశరధుడు మాట ఇవ్వడం ఏమిటి..పర్యవసానంగా తన కుమార్తె కూడా రాముడి తో కలిసి ఈ కష్టాలు పడటమేమిటి అనుకుంటాడు.ఈ లోగా ఒక ఆసక్తికరమైన అంశం జరుగుతుంది.శూర్పణఖ ఒకరోజు బాగా గాయపడి రక్తసిక్తమయి ముక్కు చెవులు తదితరాలు కోయబడి వస్తుంది.దానికి కారణం లక్ష్మణుడు అని తెలుసుకొని పనిలో పని అన్నీ కలిసివస్తాయి..ఇప్పుడు సీత ని తీసుకు వచ్చి నా లంక లో ఉంచితే నా కుమార్తె కి అడవుల్లో తిరిగే కష్టాల్ని తప్పించినవాడిని అవుతాను,అలాగే రాముడు కూడా వియోగ బాధ ని అనుభవించాలి తన సోదరిని అవమానించినందుకు,అనుకుంటాడు.

అప్పటికే భార్య మండోదరి కి కూడా సీత గురించిన వివరాలన్నీ చెబుతాడు రావణుడు.కాబట్టి ఆమె కూడా దానికి అభ్యంతరపెట్టదు.మారీచుని సాయం తో రావణుడు సీతని అపహరించి పుష్పక విమానం లో తీసుకువస్తాడు.ఇదిలా ఉండగా విభీషణుడి సహాయం తో బ్రాహ్మణ వర్గం లంక లోని కీలక పదవులని చేజిక్కించుకుంటారు.తమవైన విధానాలను పాదుకొల్పడానికి ప్రయత్నిస్తుంటారు.మరో వైపు వరుణుడు అనబడే సముద్ర వ్యాపారి,దళారి రావణుడి కి వ్యతిరేకం గా పనిచేస్తుంటాడు.ఇలా ఇంటి గుట్టు లంక కి చేటు అన్నట్లు గా తన అనుకున్నవారే రావణునికి చాప కింద నీరు లా వ్యతిరేకం గా పనిచేస్తుంటారు. 

ఒక రాత్రిపూట హనుమంతుడు లంక లో ప్రవేశించి అక్కడి ఉద్యానవనాల్ని,కోట లోని భాగాలను  తగలబెడుతుండగా అతడిని రావణుడి యొక్క కుమారుడు మేఘనాధుడు బంధించుతాడు.తాను రాముని వద్ద నుంచి దూత గా వచ్చానని ,సీతాదేవి ని రాముని కి అప్పగించి క్షమాపణ వేడుకోమని చెప్పగా రావణుడు నిరాకరిస్తాడు.తన మిత్రుడైన వాలి ని రాముడు వధించి సుగ్రీవుని కి రాజ్యం అప్పగించిన వైనం అదే విధం గా వానర సైన్యం యొక్క అండదండలు అతనికి ఉన్నాయన్నా విషయం రావణునికి బోధపడుతుంది.  అయితే  తన రాజ్యం లోనే సొంత వాళ్ళు ఏ విధం గా రాముని వర్గానికి సహాయపడుతున్నారు అనే విషయాన్ని అంచనా వేయడం లో విఫలమవుతాడు.

యుద్ధ ఘట్టాలు బాగా రాశాడు రచయిత.ఇరు వర్గాల యొక్క వ్యూహ రచనలు ఆసక్తి కరం గా సాగుతాయి.చివరకి రాముడు చాలా పెద్ద సేన ని సమీకరించినప్పటికీ చిన్న సైన్యాలతోనే రావణుడు చాకచక్యం గా పోరాడి యుద్ధభూమి లో ఒరిగిపోతాడు.ఇంకొక ఆసక్తికరమైన సంగతి దీనిలో ఏమంటే యుద్ధఘట్టం లోనే రావణుని యొక్క భార్య మండోదరి ని అంగదుడు బలాత్కరించుతాడు.అంతేగాక ఆమె ని నగ్నం గా వదిలేసి వెళ్ళిపోతాడు. స్పృహ లేని స్థితి లో ఉన్న ఆమె ని రావణుడు కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. అయితే ఆ సంగతి ని రావణుడు ఆమె తప్పిదం గానో,శీలం కి సంబందించిన అంశం గానో తీసుకోకపోవడం ఆ పాత్ర యొక్క ఉదాత్తత ని పెంచినట్లయింది.

చివరకి భద్రుడు పాత్ర బ్రతికి,లంక లోనూ ఆ పిమ్మట అయోధ్య లోనూ జీవించి శంబూక వధ వంటి ఘట్టాల్ని చూసి,చాలా దైన్య స్థితి లో తన స్వగ్రామమైన ఇప్పటి కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న ఊరికి చేరుకొని తన జీవిత చరమాంకాన్ని గడుపుతుంటాడు.అదీ టూకీగా.ఇన్నాళ్ళు మనం నాణేనికి ఒక వేపున విన్నాం.ఇది ఇంకో వేపున అనుకొని తీసుకుంటే ఏ బాధా ఉండదు.చాలా పేజీలు తగ్గించవచ్చు దీనిలో,ముఖ్యం గా కొన్ని ప్రసంగాల్లా ఉండే సన్నివేశాల్ని తొలగించినా లోటు ఉండదేమో అనిపించింది.

మొత్తం మీద ఆనంద్ నీలకంఠన్ కి అవతల పార్శ్యం చూపించాలనిపించి రాశాడు. ఇప్పటికే రామాయణాలు ఎందరో రాశారు తమదైన శైలి లో.ఇది ఇప్పుడు రావణాయణం.చదివి చూసి,మీరే నిర్ణయించుకొండి.కొన్ని అలా చేస్తేనే మంచిది.అమెజాన్ లోను,అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లోనూ లభ్యమవుతోంది.




     
       

1 comment:

  1. once vakati panduranga rao written a review on some new authors first ramayana book.At the end of that review he mentioned a golden line.THat line says,"several hundreds of authors[he used the word sathkoti] wrote
    their own ramayanas and this one is one of them".why i mentioned this was now-the recent books by tamilian-keralite-north indian authors on epics reflecting a total negitive views which is not a digestible stuff for south indian[esply sanskrit-telugu-kannada]people.Tamil writers insert their dravidian paytas and keralites to their communism paytas in their Epical re-writes.so i totally stopped to read their translations ad also their original works.

    ReplyDelete