ఈశాన్య రాష్ట్రాల సాహిత్యాన్ని ఎందుకంత తక్కువగా అనువాదం చేసుకుంటున్నాం ?
---------------------------------------------------------------------------------------------------------
మనకి తెలిసిన ఇంకా తెలుగు భాష లోనికి అనువాదం చేసుకున్న ఈశాన్య భారతం కి చెందిన రచయితలు ఎవరు అని ప్రశ్నించుకుంటే మనకి చప్పున గుర్తు వచ్చేవారు ఇందిరా గోస్వామి,బీరేంద్ర కుమార్ భట్టాచార్య, మమోని రైసాం గోస్వామి,రీటా చౌధురి ఇలాంటి వారు. వీరంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారు. అస్సామీ ఇంకా ఇంగ్లీష్ భాషలోని వారి రచనల్ని తెలుగు లోనికి అనువాదం చేయడం తో ఈశాన్య రాష్ట్రాలు అనగానే వాళ్ళే గుర్తుకి వస్తారు.
కాని అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం,మణిపూర్,మేఘాలయా,త్రిపుర,మిజోరం ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన సాహిత్యాన్ని మనలో ఎంతమందిమి చదివి ఉంటాము? నిజానికి చాలా తక్కువ గా ఉంటుంది ఆ సంఖ్య, అని చెప్పక తప్పదు.ఆ రాష్ట్రాల నుంచి ఎంతో ఆసక్తిదాయకమైన సాహితీ కృషి జరిగింది.అయితే తెలుగు లోనికి అనువాదం చేసుకోవడం లో ఎందుకో అంత చొరవ తీసుకోలేదు.
ఆయా రాష్ట్రాల్లో దాదాపుగా 200 గిరిజన ఉప తెగలు ఉన్నాయి. మనకి బాగా తెలిసిన తెగలు కుకీ,మైటీ,లెప్చా,భూటియా,త్రిపురి,రియాంగ్,మిజొ,గారో,ఖాసీ,బోడో,ఆది,మిషింగ్ లాంటివి. అయితే ఆ రాష్ట్రాల్లోని రచయితలు చాలా మంది ఇంగ్లీష్ లో రాయడం వల్ల ఒక తరహా పాఠకులకి అక్కడి సమస్యలు,సంప్రదాయాలు,జీవన విధానాలు తెలిశాయి.అయితే ఇంగ్లీష్ భాష లో వచ్చే సాహిత్యాన్ని చదివే అలవాటు మన పాఠకుల్లో తక్కువ.అందునా మన సాహితీపరులకి కూడా ఎందుకో గాని, అస్సాం దాటి అవతలి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సాహిత్యం పెద్దగా ఆకర్షణ కలిగించలేదు.
దానివల్ల తెలుగు అనువాద సాహిత్యం లో పెద్ద లోటు ఆ మేరకు ఏర్పడిందని చెప్పాలి. మరి పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాల విషయం ఏమిటా అని పరిశీలిస్తే తమిళులు,మళయాళీలు, కన్నడిగులు ఒక్క అస్సామీస్ నుంచి మాత్రమే గాక ఇతర ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన పుస్తకాల్ని చక్కగా వాళ్ళ భాషల్లోనికి ఈపాటికే అనువదించుకున్నారు.
అసలు ఎందుచేత ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా మంది ఇంగ్లీష్ లో రాస్తారు అనేదాన్ని ముందుగా తెలుసుకోవాలి. దీనికి కొన్ని చారిత్రక,సామాజిక కారణాలు ఉన్నాయి.స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ వారి హయాం లో అమెరికా,ఫ్రాన్స్,ఇంకా బ్రిటన్ నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలు దుర్గమమైన అరణ్యాల్లో కి కూడా చొచ్చుకిపోయి పాఠశాలలు తెరిచారు.స్థానికంగా ఉన్న భాషలకి లిపి లేకపోవడం తో ఇంగ్లీష్ నే అనుసంధాన భాష గా చేశారు.
అలా మాట్లాడటానికి ,రాయడానికి ఇంగ్లీష్ అనేది ప్రాధాన్యత వహించింది. అనేకమైన తెగలతో,స్థానిక భాషలతో అలరారే ఆయా రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఒక లింగా ఫ్రాంకా గా మారిపోయింది. మొదటి తరం రచయితలు అందరూ కూడా ఇంగ్లీష్ లోనే రాయడానికి పూనుకోవడం తో ఆ తర్వాత అదే సంప్రదాయాన్ని అందరూ కొనసాగించారు. ఇప్పటికీ,కవిత్వం,కథ,నవల,నాటకము ఇలా అన్ని ప్రక్రియలు వాళ్ళు ఇంగ్లీష్ లోనే కొనసాగిస్తున్నారు.
అంత మాత్రం చేత వాళ్ళు స్థానిక భాషల్ని పూర్తిగా మర్చిపోలేదు. వాటిని కూడా అభివృద్ధి పరుచుకుని కొంతమంది వాటిల్లోనూ రాస్తుంటారు.ఇంకా చాలామంది స్థానిక భాషల్లోనూ, ఇంగ్లీష్ లోనూ రాస్తుంటారు.పర్యావరణం,సామాజిక సమస్యలు,తెగల మధ్య ఘర్షణలు,కేవలం ఈశాన్య రాష్ట్రాల్లోనే చూడగలిగే ఆచార సంప్రదాయాలు,ఇలా ఎన్నో వైవిధ్యం కలిగిన ఇతివృత్తాలతో వాళ్ళు రచనలు చేస్తున్నారు.
వారి జానపద సాహిత్యం ని ఎక్కువగా ఇంగ్లీష్ భాషలోనికి అనువదించారు. ఇంకా ఆ కృషి సాగుతూనే ఉన్నది.కింఫోం సింగ్ నాంకిన్రి "ఖాసీ లెజెండ్స్" అనే పేరు తో ఒక పుస్తకం వెలువరించాడు.ఈస్టరైన్ కైర్ అనే రచయిత్రి " వెన్ రివర్ స్లీప్స్" అనే ఇంగ్లీష్ నవలలో నాగా లాండ్ యొక్క సంస్కృతిని చక్కగా స్పృశించారు. సిక్కిం రచయిత ఈషే డోమా "లెజెండ్స్ ఆఫ్ లెప్చాస్ లో స్థానిక జానపద కధల్ని అక్షరబద్ధం చేశాడు. మిజోరం కి చెందిన జానపద గాధల్ని లాల్తుంగ్ లియాన్ ఖియాంతె రాశాడు.
అలాగే ఆధునిక ఇతివృత్తాలతోనూ టెంసులా ఆవో,జానైస్ పేరియట్,మమాంగ్ డాయ్ ఇలాంటి రచయిత్రులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన మమాంగ్ డాయ్ ని ఈశాన్య రాష్ట్రాల సాహిత్య చరిత్ర కి ఘన కీర్తిని తెచ్చిన రచయిత్రి గా గౌరవిస్తారు. ఆమె రాసిన ద బ్లాక్ హిల్స్ అనే ఇంగ్లీష్ నవల దేశ విదేశాల్లో విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది.
అరుణాచల్ నుంచి మొదటి ఐ.ఏ.ఎస్. అధికారిగా 1979 లో సెలెక్ట్ అయిన ఆమె కొన్నాళ్ళ తర్వాత స్వచ్చంధ విరమణ చేసి పూర్తి స్థాయి రచయిత్రి గా చాలా పుస్తకాలు రాశారు.హిందూస్థాన్ టైంస్,టెలిగ్రాఫ్ దిన పత్రికల్లో కాలమిస్ట్ గా ప్రఖ్యాతి వహించారు.పద్మశ్రీ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఇలా ఎన్నో గౌరవాలు పొందారు. ఆమె రాసిన ద లెజెండ్స్ ఆఫ్ పెన్సన్,ద స్టుపిడ్ క్యుపిడ్,ఎస్కేపింగ్ ద ల్యాండ్,ద స్కై క్వీన్,ఒన్స్ అపాన్ ఏ మూన్ టైం అలాంటి నవలలు అన్నీ మంచి ఆదరణ పొందాయి.
ఇటీవల ఏంజల్ చక్మా అనే త్రిపుర రాష్ట్రానికి చెందిన యువకుడిని ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చైనా వాడిలా ఉన్నావు అంటూ వేధించి చనిపోయేలా చేసిన దుండగులు ఈశాన్య రాష్ట్రాల చరిత్ర ని , సాహిత్యాన్ని చదివి ఉంటే అలా చేసి ఉండేవారు కాదు.ఒకరి గురించి లేనిపోని అపోహలు పెంచుకోవడం,సరైన జ్ఞానం లేకపోడం ఇవి చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి దారి తీస్తాయి. నిజానికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బర్మా,టిబెట్,ఆగ్నేయాసియా దేశాల ప్రజలకి జన్యుపరంగానూ,సంస్కృతి పరం గానూ దగ్గరగానూ ఉంటారు.
అరుణాచల్ ప్రదేశ్,మిజోరం,సిక్కిం,త్రిపుర,మేఘాలయా వంటి రాష్ట్రాలకి పర్యటనకి వెళుతున్న తెలుగువారు ముక్త కంఠం తో ఒక మాట చెబుతుంటారు. రోడ్ల మీద గాని, హోటల్స్ లో గాని అక్కడి ప్రజల యొక్క సివిక్ సెన్స్ ఎంతో బాగుంటుందని,పర్యావరణాన్ని శ్రద్ధగా కాపాడుకుంటారని చాలా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి మంచి అలవాట్లు చూడగలం అని చెబుతుంటారు. ఈశాన్య రాష్ట్రాల లోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సాహిత్యాన్ని ఇకనైనా తెలుగు లోకి ఎక్కువ గా అనువాదం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
----- మూర్తి కెవివిఎస్ (7893541003)
No comments:
Post a Comment