పుస్తకపఠనం వల్ల ఊహించని లాభాలున్నాయి!
---------------------------------------------------------------
ఇంకా మీరు ప్రింట్ చేసిన పుస్తకాల్ని చదువుతున్నారా? అంతా సోషల్ మీడియా లోనూ,ఇంకా ఈ పేపర్ల ని, పి.డి.ఎఫ్. ల్ని చదువుతున్నారు. ఎందుకు ఆ పాత పద్ధతి అని ఎవరైనా అంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోలేదని అర్థం. అదేమిటంటే బిల్ గేట్స్,ఎలన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఇంకా ఇప్పటికీ ప్రింట్ పుస్తకాల్ని చదువుతూనే ఉన్నారు. వాళ్ళకి కంప్యూటర్ లు లేకనా లేదా ఉపయోగించటం రాకనా? మరోవైపు ఎలెక్ట్రానిక్ వెర్షన్స్ లో చదువుతున్నప్పటికీ వాళ్ళు ప్రింట్ పుస్తకాలు చదవటం మానలేదు. ప్రింట్ చేసిన పుస్తకానికి ఉండే సౌలభ్యం వేరు. అది పాఠకులకి అందరకీ తెలుసు.
మరొక అంశం ఏమిటంటే పుస్తకపఠనం వల్ల బ్రెయిన్ కి వ్యాయామం జరిగి క్రిటికల్ థింకింగ్,ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఏకాగ్రత,జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. మనం చదువుతున్న కొద్దీ మెదడు లోని న్యూరాన్లు వాటి పనితనాన్ని పెంచుకుంటాయి. అందుకే రోజుకి కొంత సేపు అయినా పుస్తక పఠనం చేయడం మానరాదు. అవసరమైతే కొన్ని గంటల సేపు చదివినా మీ మెదడు అలిసిపోదు.కానీ అదే పనిగా సిస్టం లో చదివితే తప్పనిసరిగా కళ్ళనొప్పి,నిద్ర లేమి, మతిమరుపు లాంటివి చోటు చేసుకుంటాయి. స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించితే మరింత త్వరగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
ఎవరికి వాళ్ళకి ఇవి తెలుస్తూనే ఉంటాయి,కానీ అవి తీవ్ర రూపం దాల్చితే తప్పా చాలా మంది గమనించరు.కాబట్టి కంప్యూటర్ ని తప్పనిసరిగా ఉండే అవసరాలకి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఇంటికి వస్తే చాలు గంటలకొద్దీ విరామం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దీని ప్రభావం వాళ్ళ మీద పడుతూనే ఉంది. తల్లి మందలించిందని,టీచర్ మందలించిందని చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకి పాల్పడటం చేస్తున్నారు. దీని వెనుక సామాజిక కారణాలకంటే వారి మెదడు లోని న్యూరాన్లు పనితనం దెబ్బతినడం ఇంకా ఆందోళన,ఒత్తిడి పెరగడం మూలంగా ఇలాంటి ఆఘాయిత్యాలకి ఒడిగడుతున్నారు.
కనీసం రోజుకి 30 నిమిషాలు పాటు పుస్తక పఠనం చేయడం వల్ల ఫిజికల్ ఇంకా ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కనుక సాధ్యమైనంతవరకు పిల్లలకి ఈ విషయం చెప్పి స్మార్ట్ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించాలి. మన దేశం లో 71 శాతం మంది వార్తల్ని ఆన్ లైన్ లో చూస్తున్నట్లు తేలింది. కేవలం 29 శాతం మంది మాత్రమే ప్రింట్ వెర్షన్స్ చదువుతున్నారు. ముఖ్యమైన హెడ్ లైన్స్ ని, బ్రేకింగ్ న్యూస్ ని ఆన్ లైన్ లో చూసినా వార్తల్ని వివరంగా చదవడానికి ప్రింట్ అయిన పేపర్ ని చదవాలి. దానివల్ల కంటికి,మెదడు కి కలిగే మార్పు ని ఎవరికి వారే అనుభవించగలరు. కేరళ లో ఎక్కువ అక్షరాస్యత ఉన్నప్పటికి ప్రింట్ వెర్షన్స్ ని కొని చదివే విషయం లో మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందున్నాయి.
----- మూర్తి కెవివిఎస్ (78935 41003)
No comments:
Post a Comment