Friday, September 7, 2018

గోమాత మీద నిజం గా గౌరవం ఉంటే ఈ పని ఎవరైనా చేస్తారా...?


అదేమిటో గాని ఈ మధ్య రోడ్డున పోయే ఏ ఆవు ని చూసిన కుంకుమ,పసుపు బొట్లు వగైరాల తో అలంకరింప బడి కనబడుతోంది.మా చిన్నప్పుడు కూడా గోమాత ని పూజించే వాళ్ళు లే గాని,మరీ ఈ విధంగా రోడ్డున పోయే ఆ మూగ జీవాల్ని ఇంతగా చికాకు చేసే వాళ్ళు కాదు.టోకున పుణ్యం తమ ఖాతా లో వేసుకోవాలనే గాని పాపం ఆ గోవుల వేదన ని పట్టించుకునేదెవరు..?

ఆ ఆవులకి మేలు చేస్తున్నాము ఇంకా పూజిస్తున్నాము అనే ధ్యాస లో బడి చాలామంది భక్త జనాలు వాటికి అసహజమైన ఆహారాన్ని పెడుతున్నారు.అన్నము,అరటికాయలు ఇంకా ఇలాటి వి తమకి అందుబాటు లో ఉన్నవాటిని పెడుతున్నారు.ఎండుగడ్డి గాని,పచ్చ గడ్డి గాని ఏ కొద్దిగైనా ఎలాగో సంపాయించి వాటికి పెట్టండి.అవి వాటి స్వాభావిక ఆహారం.కొంతలో కొంత మేలు,కాని వాటి జీర్ణ ప్రక్రియ కి పొసగని ఆహారం పెట్టడం వల్ల వాటి లో అనేక మార్పులు వస్తున్నాయి.పరిశీలించినట్లయితే వాటి పేడ కూడా తేడా గా ఉంటున్నది.ఒక కృత్రిమమైన రంగు,వాసన కలిగి ఉంటున్నది.లోపల ఎంత చిత్ర హింసలో వాటికి ఎవరకి ఎరుక,ఆవు లు అవి తినే కెపాసిటికీ కన్నా ఎక్కువ అసహజ ఆహారాన్ని తినిపిస్తున్నారు. భారమైన పొట్టలతో నడవలేక నడుస్తున్నాయి భారంగా ..మిగతా ఆవులతో  పోలిస్తే..!ఓసారి గమనిస్తే ప్రతి  వారికీ తెలుస్తుందది.

మా చిన్నప్పుడు ఎవరైనా యజమాని తన ఆవుల్ని బయట వదిలేస్తే అలాంటి వాటిని బందెల దొడ్డిలో పెట్టేవారు.వాళ్ళు డబ్బులు కట్టి విడిపించుకునేవారు.ఇప్పుడదేం కనపడటం లేదు.వాడుకున్నన్నాళ్ళు ఈ ఆవుల్ని వాడుకుని ఆనక రోడ్ల మీదకి వదిలేస్తున్నారు.ఈ యజమానుల్ని ఎందుకు జైళ్ళ లో పెట్టరు..?ఏమిటీ అలసత్వం..?ఎక్కడ సమస్య ఉందో అక్కడే మందు వేయాలి.నోరూ వాయీ లేని ఆ ఆవులు ఆ రోడ్ల మీద తిరుగుతూ యాక్సిడెంట్ లకి కూడా గురవుతున్నాయి.కొన్ని సార్లు పాపం కాళ్ళు విరిగి దీనంగా పడి ఉంటున్నాయి.అప్పుడు ఏ భక్తులూ వచ్చి ఆదుకోరు అదేమిటో..!అన్నిటికన్నా ముందు ఈ గోవుల యజమానుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.ఆ విధంగా రోడ్ల మీద కి వదిలేసే వాళ్ళని ఉపేక్షించరాదు. 

1 comment:

  1. ఎందుకంటే మనకి సుఖమైన పుణ్యం కావాలి కాని నిజమైన పుణ్యం అక్కర్లేదు.

    ReplyDelete