Wednesday, October 10, 2018

నా శ్రీలంక ప్రయాణం..!(సీతమ్మ వనవాస ప్రదేశం)

సెప్టెంబర్ 29 వ తేదీ రాత్రి ఒకటిన్నర కి బెంగుళూరు లో కెంపె గౌడ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కొలంబో వెళ్ళే విమానం ఎక్కి క్షేమంగా అక్కడి బండార నాయకే విమానాశ్రయం లో దిగడం జరిగింది.సమయం ఒకటిన్నర గంటలు పట్టింది.మళ్ళీ అక్కడినుంచి ముందు అనుకున్న ప్రకారం అక్కడినుంచి అనురాధ పుర పట్టణానికి బస్ లో బయలు దేరాను.అంటే దక్షిణం నుంచి పైకి ఉత్తరం గా ప్రయాణిస్తున్నాము.రమారమి 200.కి.మీ.ప్రయాణం.రోడ్లు శుభ్రంగా ఉన్నాయి.పచ్చదనానికి కొదవ లేదు. దేశం పరంగా ఇది ఓ కేరళ వంటిదే ఆ విషయం లో..!కొబ్బరి చెట్లు,రబ్బరు చెట్లు,అరటి చెట్లు ఇంకా అనేక రకాల చెట్లు విరివి గా ఉన్నాయి.ఎటు చూసినా పచ్చదనం పిచ్చెక్కించేలా ఉన్నది.


దానిమీదట ఒకటి..వర్షపాతం కూడా ఎక్కువ.మంచి భూమి..ఇక ఏది మటుకు పండదు..?బస్ లో వెళుతూ ఉంటే దారి పొడుగూతా కేరళ లో మాదిరి గానే కిందికి స్లోప్ గా దిగినట్లు ఉండే ఇళ్ళు.ఈ తరహా ఇళ్ళ నిర్మాణం.ఇక్కడినుంచి అక్కడి కి వెళ్ళిందా లేదా అక్కడినుంచా..ఏమో ..!కాని ఇవి మాత్రం బాగా అనిపించాయి.ఇళ్ళముందు శుభ్రత,పూలమొక్కలు అందంగా ఉండి వారి అభిరుచిని తెలియబరుస్తున్నాయి.


ఇక్కడి అమ్మాయిలు గాని స్త్రీలు గాని, షర్ట్ ని ఫ్రాక్ ని ధరించి ఉన్నారు.కొంతమంది గౌనులు కూడా వేసుకున్నారు.అయితే కొన్ని చోట్ల చీర లు ధరించడం కూడా ఉన్నది.కట్టే విధానం లో మన దేశానికి వారికీ తేడా ఉంది.అనురాధ పుర నుంచి నుంచి ట్రింకోమలి అక్కడినుంచి కిందికి కాండీ పట్టణానికి చేరుకున్నాను.ఈ ప్రాంతాల్లో అంతటా ఇదే వస్త్రధారణ.బోర్డులు సిమ్హళ,తమిళ,ఇంగ్లీష్ ల్లో ఉన్నాయి..ఏ ఊరి లోనూ ఇదే పద్ధతి.


కాండీ నుంచి మళ్ళీ కొలొంబో కి తిరిగి వచ్చాను.అయితే నాకు ఈ మధ్య న కనిపించిన ఓ ప్రదేశం గురించి ముచ్చటిస్తాను.నువార ఏలియ కి అయిదు కిలోమీటర్లు ఉండే ఒక ప్రదేశం సీతా ఏలియా.ఇక్కడ దిగడం జరిగింది.రావణుడు సీతమ్మ వారిని ఇక్కడ నే ఓ వనం లో ఉంచినట్లు కధనం.ఇక్కడ ఓ గుడి కూడా కట్టారు.ఈ చుట్టుపక్కల ప్రకృతి శోభ అద్భుతం గా ఉన్నది.టీ తోటలు.జలపాతాలు ఇంకో పక్కన.పొగలు కమ్మినట్లు ఉండే పర్వతాలు.ఎప్పుడూ సన్నని చినుకులే ఎక్కడ చూసినా.ఆ వెంటనే తెరిపి వచ్చినట్లు అవడం మళ్ళా.
ఏమిటి..నిజం గా రామాయణం జరిగిందనా నీ ఉద్దేశ్యం..?ఇంత దూరం హనుమంతుడు ఎగిరి రావడం సాధ్యమా..అని మీరు అడగవచ్చు. నిజానికి నాలోనూ ఆ ప్రశ్నలు లేకపోలేదు.కాని ఏదో చెప్పలేని ఒక భావం.కధ ఏదైనా సరే కొన్ని వందల ఏళ్ళు జనాల్లో నిలిచి ఉందీ అంటే దాని వెనుక ఏదో ఒక మహత్తు నిండి ఉంటేనే నిలుస్తుంది.ఎన్ని కాల ప్రవాహం లో అలా లుప్తమవలేదు..?ఒక కధ గా చూసుకున్నా వాల్మీకి నిర్మించిన విధానం గొప్పదే.నా దృష్టిలో అయితే అది.ఎప్పటి కధని అప్పటి కాలం దృష్టి తో చూడాలి తప్పా ఇప్పటి కళ్ళద్దాల తో చూసి ఆ పాత్ర ఎలా ప్రవర్తించింది అలా అంటే..దానికి జవాబు ఉండదు. అదేమిటో గాని ఈ శ్రీలంక కి రావడానికి ముందు కిష్కింధ కాండ అనే మర్కటాధార కధ ని రాయడం జరిగింది.అది గుర్తొచ్చి కొంపదీసి ఇదేమైనా దైవ ఘటన అనిపించింది.మీరు నాస్తికులా ..ఆస్తికులా అని నన్ను ఎవరైనా అడిగితే ఈ రెండూ కాదని చెబుతాను.వివరించాలంటే ఇక్కడ చాలా ఉంది కనక ఎక్కువ గా వెళ్ళను.

సరే..అదంతా నాలోని సంఘర్షణ.అలా ఉంచితే...ఈ చోటికి హనుమాన్ వచ్చి సీతమ్మ కు రాముని సమాచారం చెప్పడం ,ఆమె వద్ద నుంచి అంగుళీయం తీసుకుని బయలుదేరటం ,పనిలో పనిగా లంకా దహనం చేసి రావడం ఇవన్నీ గుర్తొచ్చి వళ్ళు పులకించినట్లు అయింది.దేశం నుంచి దేశానికి ఎలాంటి వారధి నిర్మించాడో వాల్మీకి అని గమ్మత్తు గా అనిపించింది.అక్కడ కొన్ని ఫోటోలను తీసుకున్నాను.అవన్నీ ఇక్కడ పొందుపరుస్తున్నాను.ఇలా అప్పుడప్పుడు శ్రీలంక ప్రయాణ విశేషాల్ని రాస్తూ ఉంటాను.నాకు తోచిన పద్ధతి లో..! --Murthy Kvvs

No comments:

Post a Comment