Tuesday, June 11, 2019

నా ఇంగ్లీష్ కధల పుస్తకం e-book రూపం లో ఈరోజు నుంచి కినిగె లో లభ్యమవుతోంది

నా ఇంగ్లీష్ కధల పుస్తకం e-book రూపం లో ఈరోజు నుంచి కినిగె లో లభ్యమవుతోంది.దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.ప్రయత్నించండి.చాలా మందికి ఒక అనుమానం రావచ్చును.ఎందుకని ఆంగ్ల భాష లో రాయడం,తెలుగు లో రాస్తే సరిపోదా అని.నాలోని కొన్ని భావాలను తెలుగు తెలియని వారి కి కూడా అందించాలనే నాలోని ఓ స్వార్ధమే వీటిని రాయించిందని చెప్పాలి.అంతే కాదు.రెండు భాషల్లో రాయడం పెద్ద వింతైన విషయం అని కూడా నేను అనుకోను.రెండు భాషల్లో రాసే వారు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు.తెలుగు వారి లోనూ లేకపోలేదు గాని ఎందుకనో ఇంగ్లీష్ లో చదవడం అంత అవసరమా అనుకునేవాళ్ళూ బాగానే ఉన్నారు.

ఆసక్తి కొద్దీ ఇంగ్లీష్ సాహిత్యాన్ని అనేక ఏళ్ళ నుంచి చదువుతూ ఉంటే అనిపించింది ఏమంటే ప్రతి రచయిత కి తనదైన శైలి ఉంది.అలానే భారతీయులు ఆంగ్లం లో రాసినా దాని పరిమళం దానిదే.మనం ఇంగ్లీష్ వాళ్ళ మాదిరి గానే రాయాలని ఏమీ లేదు.మనవైన ప్రయోగాలు మనమూ చేయవచ్చును.అంత మాత్రం చేత బేసిక్ గా తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోవద్దని కాదు.నిరంతరం చదువుతున్నప్పుడు ఆ భాష లోని వ్యక్తీకరణ పరమైన సొగసులు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంటాయి.దానికి కావాలసింది నిరంతర సాధనే.దగ్గరి దారులు ఏమీ లేవు.ముఖ్యం గా ఆసక్తి,అనురక్తి.అవి కావాలి.

ఆర్.కె.నారాయణ్ ని నా డిగ్రీ రోజులనుంచి చదువుతున్నాను.ఆయన కధ ఏది చదివినా అరె..ఇది ఇంగ్లీష్ అయినా ..మాతృభాష లానే భలే అర్ధమవుతున్నదే అనిపించేది.అలా మొదలుపెట్టి ఎంతమంది నో అలా చదువుకుంటూ పోతూనే ఉన్నాను.మాల్గుడి వలె మా వూరి ని కూడా బేస్ చేసుకొని కొన్ని కధలు రాయాలి.తెలుగు తెలియని వారికి కూడా అబ్బా ..ఈ ప్రదేశాన్ని చూడాలి అనిపించాలి ,చదివిన తరవాత! అనేది నా మనసు లో నాటుకుపోయింది. నేను చదివిన ప్రతి పుస్తకం నాకు ముడిసరుకు లా ఉపయోగపడింది.నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.నా అభిమాన రష్యన్ రచయిత చింగీజ్ ఐత్మతోవ్ కూడా ముందు ఆయన మాతృ భాష అయిన కిర్గిజ్ లో రాసి ఆ తర్వాత రష్యన్ భాష లో రాయడం మొదలు పెట్టాడు.అంటే ఒక భాష నుంచి ఇంకో భాష కి మారినా లోపల సరుకు ఉన్నప్పుడు అది ఎవరినైనా తప్పక ఆకట్టుకొంటుంది.

దీనికి తోడు నా దేశాటన లో భాగంగా అనేక ప్రదేశాల్ని,మనుషుల్ని చూసిన తర్వాత మన భావాన్ని విస్తృత బాహుళ్యానికి అందించాలంటే ఇంగ్లీష్ కి మించిన సాధనం లేదని అనిపించింది.ఇలాంటివి అన్నీ కలిసి నాచేత ఇంగ్లీష్ లో ఈ కధలు రాసే లా చేసినవి.నా అనుభవం లో తెలుసుకున్నది ఒకటి ఏమిటంటే ఇంగ్లీష్ లో చదివేటప్పుడు గాని,రాసేటప్పుడు గాని ఆ భాష లోనే ఆలోచన చేయాలి.అప్పుడు బ్రెయిన్ త్వరగా ఆకళింపు చేసుకుంటుంది.ప్రతి దానికి ఇది తెలుగు లో ఏమిటి అనుకుంటూ ఉంటే గందరగోళం కి గురి అవుతాము.ఇంకోటి...మనం ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నా ఓర్చలేక గేలి చేసేవాళ్ళు కొందరు.నిస్సహాయత తో ఏం చేయాలో అర్ధం గాక వాళ్ళ బాధ వాళ్ళది.ఏ భాష ని ద్వేషించవలసిన పని లేదు.ఎంతో అనుభవం మీద గాని అర్ధం కాదు.

సరే...ఇప్పుడు ఇక్కడ కినిగే లో దొరుకుతున్న ఈ బుక్ వెర్షన్ ని ఇక్కడ ఇస్తున్నాను.ప్రింటెడ్ బుక్ ఇంకొన్ని రోజుల్లో వస్తుంది.అది నవోదయా బుక్ హౌజ్  లో లభ్యం అవుతుంది.ఒక విశేషం ఏమిటంటే ..ప్రముఖ సాహితీతపస్వి ,చిత్రకారులు అయిన శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు నా ఈ పుస్తకానికి కవర్ పేజ్ బొమ్మ ని ఉదారం గా ఇవ్వడం నా అదృష్టం గా భావిస్తున్నాను.వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.భారతదేశం లోని ప్రతి రాష్ట్రానికి ఈ పుస్తకాన్ని పంపి కొంతమంది తోనైనా చదివింపచేయాలనేది కోరిక.చూద్దాము.ఆ పై వాని నడిపింపు.
Please Click here .

No comments:

Post a Comment