Thursday, April 2, 2020

"అసురుడు-పరాజితుల గాధ" పుస్తకం పై రివ్యూ"కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడి గా,ప్రతి నాయకుడి గా చిత్రిస్తూ వచ్చారు.భారత దేశమంతటా నా మరణాన్ని పండగ లా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తె కోసం దేవతల్ని ఎదిరించాననా? కుల వ్యవస్థ మీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడి లా అణచివేయకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు,నేను అసురుడిని,నాది పరాజితుడి కధ." 

ఇది " అసురుడు-పరాజితుల గాధ " అనువాద నవల వెనుక అట్ట పై ఉన్న మాటల లో కొన్ని!చూద్దాము దీనిలో రావణుడు ఏమి చెప్పాడో అని చెప్పి ఈ 462 పేజీల పుస్తకం కొన్నాను.ఆంగ్ల మూలం ఆనంద్ నీలకంఠన్,కేరళ లోని త్రిపుణితుర  నుంచి వచ్చిన రచయిత.ఆర్.శాంత సుందరి తెలుగు సేత.నేను చిన్నతనం నుంచి రామాయణాన్ని ఎక్కడో ఓ చోట వినడమో చదవడమో చేస్తూనే ఉన్నాను.ఎన్నో భాష్యాలు చెప్పారు తమదైన రామాయాణాల్లో వివిధ రచయితలు,కొంత మూల విధేయం ఇంకొంత ఎవరి వ్యాఖ్యానాలు వారివి.

"Asura - Tale of the vanquished "  అనే పేరు తో ఇంగ్లీష్ లో వచ్చిన ఈ నవల వివాదస్పదం గానే నిలిచింది.సరే..కధ లోకి పోదాము.అసలు  ఇలాటి వాటిని అంత సీరియస్ గా తీసుకోవాలా లేదా అనేది నాకు ఇప్పటికీ ఓ మూలన సందేహమే.ఎందుకంటే ఓ ఏడాది క్రితం జరిగిన సంఘటన ని గుర్తుకు తెచ్చుకుంటానికి ఎంతో తర్జన భర్జన తో గాని చేయలేము.అందునా అంత ఖచ్చితం గా గుర్తు వస్తుందనే భరోసా ఏమీ లేదు.అయితే కొంతమంది మాత్రం వందల,వేల ఏళ్ళ క్రితం జరిగినాయనుకున్న కధల్ని సాక్షాత్తు తాము అక్కడికి వెళ్ళి చూసివచ్చినట్లు చాలా ఆత్మవిశ్వాసం తో రాస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

 దీనిలో రామాయణాన్ని రావణుడి వైపు నుంచి చెప్పడం జరిగింది.పాత్రలు ఏవీ నేల విడిచి సాము చేయవు.అద్భుత శక్తులు ఎవరకీ ఉండవు.అంత మామూలు గానే జరిగిపోతుంది.అయితే రచయిత కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు అర్ధం అవుతుంది.నిజానికి అవి కొన్ని ఇప్పటికే జనసామాన్యం లో ఉన్నవే,ఇంకొన్ని వాటికి తన ఊహా శక్తిని జోడించారు. రావణుడు,భద్రుడు ఈ రెండు పాత్రలు మాత్రమే ఈ కధ అంతటినీ చెబుతుంటాయి,అదీ ఉత్తమ పురుషలో.భద్రుడు అనే పాత్ర రావణుడి యొక్క సేవకుడు.

రావణుడు యుద్ధం లో గాయపడి మరణానికి చేరువ లో ఉంటాడు.ఆ విధం గా కధ ని మొదలు పెట్టి వెనక్కి తీసుకెళతాడు.ఈ కధ పరం గా దేవతలు అంటే ఉత్తరాది కి చెందిన ఆర్య సంస్కృతి ని పాటించే వ్యక్తులని,అసురులు అంటే కుల సంస్కృతి లేని ముఖ్యం గా బ్రాహ్మణ ఆధిక్యత ని అంగీకరించని తెగ అని రచయిత చెబుతాడు.ఎవరైతే బ్రాహ్మణాధిక్యత,సంస్కృతి ని పోషించారో వారు దేవతలు గాను,అంగీకరించక తమవైన స్థానిక ఆచారాలకి కట్టుబడి జీవించారో వారిని అసురులని ముద్ర వేసినట్లు దీని లోని సారాంశం.రచయిత ఆనంద్ నీలకంఠన్ పై ద్రవిడ సిద్ధాంత ప్రభావం బాగా ఉన్నట్లు స్పష్టం గా తెలుస్తుంది.

బలి చక్రవర్తి,గొప్ప అసుర చక్రవర్తి. ఎన్నో ఉత్తరాది రాజ్యాల్ని సైతం జయించి అసుర సామ్రాజ్యం ని ఏర్పాటు చేయగా దానిని విచ్చిన్నం చేయడానికి దేవతలు ఎన్నో కుయుక్తులు పన్నుతుంటారు.చివరకి వామనుడి ద్వారా వారి సంకల్పం నెరవేరుతుంది.ఇహ ఆ తర్వాత నుంచి అగస్త్యుడి నాయకత్వం లో బ్రాహ్మణులు వింధ్య పర్వతాలు దాటి రావడం,ఆ సంస్కృతిని  వ్యాప్తి చెందేలా చేయడం.. జరుగుతుంది.అసురుల దేవుడైన శివుడిని కూడా తమ లో కలుపుకుని ఈ జైత్ర యాత్ర కొనసాగిస్తుంటారు. 

 ఇక్కడ రావణుడి గురించి కొంత చెప్పాలి.అతనితండ్రి బ్రాహ్మణుడు కాగా తల్లి అసుర సంతతి కి చెందిన స్త్రీ.రావణుడు,కుంభకర్ణుడు,శూర్పణఖ వీళ్ళు ముగ్గురు తండ్రి చెప్పే సుద్దులని గాని శాస్త్రాల్ని గాని నమ్మరు.పైగా తండ్రి అంటే కోపం.తమని పట్టించుకోకుండా సవతి సోదరుడు కుబేరుడి ని బాగా చూస్తున్నాడని వీరికి గుర్రు.అయితే విభీషణుడు మాత్రం సౌమ్యంగా తండ్రి వాక్యమే దైవం గా భావిస్తుంటాడు.బలి చక్రవర్తి ఈ రావణుడు జులాయి గా తిరుగుతుండగా చూసి ఇతడిని తాను ఉన్న గుహ వద్ద కి తన అనుచరుల ద్వారా రప్పించుకుంటాడు.అసురులకి నాయకత్వం వహించి  తమ ఘనత ని చాటి చెప్పాలని బోధిస్తాడు.దానికి తగిన శిక్షణ ని తన వద్ద గురువుల ద్వారా ఇప్పిస్తాడు. ఇన్నాళ్ళు చనిపోయాడు అనుకుని అసురులంతా కధలు గా చెప్పుకునే బలి చక్రవర్తే తనకి మార్గ దర్శనం చేయడం రావణుడి కి ఆనందం కలిగిస్తుంది.

చిన్న సేనల్ని ఏర్పరచుకుని ఉత్తరాది లో కొన్ని రాజ్యాల్ని జయిస్తాడు.అలాగే క్రమేపి తన పరిధి ని పెంచుకొని గొప్ప అసుర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.దేవతల రాజు ఇంద్రుడు ఎన్నో అసుర రాజ్యాల్ని వశపరుచుకున్నాడు గతం లో.వాటినన్నిటిని రావణుడు వెనక్కి తిరిగి తెచ్చుకుంటాడు.అయొధ్య ని గాని మిగతా పక్క రాజ్యాల్ని చూసినా గాని రావణుడి కి చాలా చులకన గా అనిపిస్తుంది.సంపద లో గాని,నగర నిర్మాణం లో గాని,నాగరికత లో గాని వీరంతా అధములని రావణుడు భావిస్తాడు.లంకా నగరం ని అన్ని విధాలా శ్రేష్ఠ నగరం గా తీర్చిదిద్దుతాడు.ఈ జైత్ర యాత్ర చేస్తున్నప్పుడు వేదవతి అనే ఆమె ని రావణుడు ఆమె అభీస్టం కి వ్యతిరేకం గా సమాగమిస్తాడు.

ప్రమాదవశాత్తు ఓ నది లో కొట్టుకుపోతుండగా రావణుడు ఇక యుద్ధం లో మరణించాడని భావించి   యుద్ధానికి వచ్చేటప్పుడు రావణుడు తన తో పాటు తెచ్చుకున్న తన కూతురి ని సేనాధిపతి ప్రహస్తుడు చంపివేయమని భద్రుడి కి పురమాయిస్తాడు. భద్రుడికి చేతులు రాక అడవి లో వదిలేసి వస్తాడు.ఆ విధంగా రావణుడి కూతురు మిథిలా రాజ్య చక్రవర్తి కి దొరుకుతుంది.ఆమె యే సీత.   (మిగతాది తర్వాత)
---Murthy Kvvs
  

No comments:

Post a Comment