Wednesday, October 27, 2021

డాక్టర్ జివాగో : ఒక ప్రత్యేక తరహా నవల

డాక్టర్ జివాగో అనే నవల పేరు సాహితీప్రియులకు అత్యంత చిరపరిచితమైనది. ప్రపంచ సాహితీ వనం లో విరబూసిన ఈ నవల నోబెల్ బహుమతి ని పొందినది.ఎంతో వివాదస్పదమై రచయిత జన్మస్థలమైన రష్యా లో చాలాకాలం వరకు ప్రచురణ కి కూడా నోచుకోలేదు. నిజానికి సోవియట్ రష్యా లో ఈ పుస్తకాన్ని నిషేధించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత వివాదాలకి మూలమయింది...అంతగా ఏముంది ఇందులో...కొద్దిగా పరిశీలిద్దాం.

డాక్టర్ జివాగో నవల ని రాసిన రచయిత పేరు బోరిస్ పాస్టర్ నాక్.ఇంకా పెద్ద పేరు ఉందిలే గానీ ఈ పేరు తోనే ప్రసిద్ధుడయ్యాడు.మాస్కో లో జన్మించాడు. మొదట్లో పియానో వాయిద్యకారుని గా పేరు పొందిన ఈయన 1912 లో ఆ పని ని వదిలిపెట్టి తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. కవిత్వం రాశాడు.షేక్స్ పియర్ ని ,గేథే ని రష్యన్ భాష లోకి అనువదించాడు.ముఖ్యం గా బోరిస్ పాస్టర్ నాక్ యొక్క శైలి మనోహరం గా ఉంటుంది.కవిత్వం అయినా,వచనం అయినా తనదైన సంతకం తో పాఠకుడి ని అలరిస్తాడు. 

ప్రాచీన కావ్యాలను,సమకాలీన యూరోపియన్ రచనలను గొప్పగా అధ్యయనం చేసిన పాస్టర్ నాక్ తన వచనాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. అతి సామాన్యం గానూ,సూక్ష్మ గర్భితం గానూ,కవిత్వం మారు రూపం తొడుక్కున్నదా అన్నట్లుగా ఉండే విధానం లో ఉంటుంది అతని యొక్క నవల లోని ప్రతి వాక్యం.అదే ఈ డాక్టర్ జివాగో నవల కి ప్రధాన ఆభరణం. మరి ఆంగ్ల అనువాదం లోనే ఇలా ఉంది,రష్యన్ మాతృక లో ఎంత అందం గా ఉన్నదో అనిపించింది.

సరిగ్గా ఇలాంటి భావాన్నే అనువాదకులు మాక్స్ హేవార్డ్,మన్య హరారి కూడా వెలిబుచ్చారు. బోరిస్ పాస్టర్ నాక్ యొక్క రష్యన్ మాతృక కి సాధ్యమైనంత దగ్గరగా వెళ్ళడానికి కృషి చేశాం. నూరు శాతం ఆయన రచన ని అనువదించడం ఎవరివల్లా కాని పని.రష్యన్ భాష లో ఆయన వచనం ఒక వింతైన అందాన్ని,కవిత్వ పరిమళాన్ని,అదే సమయం లో సరళత ని కలిగిఉండి అనువాదకులకి పరీక్ష గా నిలుస్తుంది అని అంటారు ఆ ఇద్దరు అనువాదకులు. 

1958 లో డాక్టర్ జివాగో నవల కి నోబెల్ బహుమతి ప్రకటించారు. అయితే అప్పటి సోవియట్ ప్రభుత్వం, బోరిస్ పాస్టర్ నాక్ దాన్ని స్వీకరించడానికి వీల్లేదని ఆంక్ష పెట్టింది. ఒకవేళ దేశం దాటి గనక బహుమతి తీసుకోవడానికి వెళితే మళ్ళీ దేశం లోనికి అనుమతించమని తేల్చి చెప్పింది.దానితో తాను చనిపొయే వరకు రష్యా లో నే ఉంటానని చెప్పి నోబెల్ కమిటి కి తాను రాలేకపోతున్నట్లుగా టెలిగ్రాం పంపాడు పాస్టర్ నాక్.

ఈ నవల ని మొదట 1957 లో ఇటలీ కి చెందిన మిత్రబృందం మిలన్ నగరం లో ప్రచురించింది. వెంటనే దీనికి మంచి ఆదరణ లభించింది. అనేక ముద్రణలు పొందింది. ఈ నవల లో 1905 నాటి రష్యన్ విప్లవాన్ని,పౌర యుద్ధాన్ని,జపాన్-రష్యా యుద్ధాన్ని, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధాన్ని భూమిక గా చేసుకొని కథ అల్లడం జరిగింది. అయితే వీటన్నిటి ని మించి ఒక ప్రేమ కథ సమాంతరం గా సాగుతుంది. వచ్చిన చిక్కు ఏమిటంటే దీన్ని ఒక సామూహిక చైతన్యానికి ప్రతీక గా కాకుండా ప్రేమ కి,కేవలం వ్యక్తుల మధ్య జరిగే మానవ సంబంధాలకి పెద్ద పీట వేయడం తో సోవియట్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 

అంతేకాదు కొన్ని సన్నివేశాల్లో వ్యక్తి స్వేచ్ఛ,స్వాతంత్రయమే అన్నిటి కన్నా ముఖ్యమనే సంభాషణలు ఉన్నాయి. ఉదాహరణకి నికొలాయ్ నికోలేవిచ్ అనే రచయిత పాత్ర ఓ చోట ఇలా అంటుంది. " నిజమైన ప్రతిభావంతులు ఎప్పుడూ గుంపు లో ఉండరు. ఈ రోజుల్లో ప్రతి దానికీ ఓ సంఘం ఫేషన్ అయిపోయింది. ఈ రచయిత సంఘాల్లో ఉండేవారంతా అత్తెసరు మనుషులే.ఆ గ్రూప్ దేన్ని సమర్ధిస్తే  వీళ్ళంతా దాన్ని సమర్ధిస్తారు. అది కాంట్ ని గాని మార్క్స్ ని గాని..." ! అలా సాగుతుంది.

అలాగే హీరో పాత్ర యూరి జివాగో ని, బోల్ష్విక్ ల్ని సమర్ధించే ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం,ఆ నాయకుడు నల్ల మందు సేవించి కమ్యునిజం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి ఆ నాటి సోవియట్ ప్రభుత్వాన్ని ఈ నవల ని నిషేధించే దిశ గా తీసుకెళ్ళాయి అనడం లో అతిశయోక్తి ఏముంది..?!

సరే...అసలు కథ ని చెప్పుకుందాం,సాధ్యమైనంత సరళం గా..! ఈ నవల అంతా చదివిన తర్వాత ఎంత గొప్ప పాఠకుడి కైనా సరే...మొదటి నుంచి చివరి దాకా చెప్పాలనిపిస్తుంది గాని ఏ సన్నివేశం ఏ సంఘటన నుంచి ఎన్నుకోవాలి అనేది అర్ధం కాదు.ప్రధాన పాత్రలు సైతం ఎప్పుడు వచ్చి ఎప్పుడు నిష్క్రమిస్తాయో అంతా గజిబిజి గా ఉంటుంది.అయితే ఒకటి...రష్యా చరిత్ర,సంస్కృతి గురించి అవగాహన ఉన్నవాళ్ళకి కొంతవరకు బాగా అనిపిస్తుంది.గొప్ప అసాధారణమైన కథ గా అయితే నాకు తోచలేదు. కాని బోరిస్ పాస్టర్ నాక్ యొక్క శైలి ,భావ విన్యాసం లో ఒక మేజిక్ మాత్రం ఉంది. అదే పఠిత ని ముందుకు నడిపిస్తుంది.

ప్రధాన పాత్ర యూరి జివాగో . ఇతనే క్రమేపి డాక్టర్ జివాగో గా పిలువబడతాడు. ప్రతి పాత్రకి రెండు మూడు పేర్లు ఉంటాయి. దానికి మీరు ముందు సిద్ధమై ఉండాలి,లేనిచో చాలా గందరగోళం గా అయిపోతుంది. ప్రస్తుతం ఇక్కడ,నేను మాత్రం పేర్లని సాధ్యమైనంత చిన్నవి వాడుతాను. సౌలభ్యం కోసం.  

ప్రధాన పాత్ర యూరీ జివాగో. చిన్నతనం లో అతని తల్లి చనిపోతుంది. తండ్రి దేశాలు పట్టి పోయాడు. నవల ఈ సన్నివేశాల తో ప్రారంభం అవుతుంది. ఇక అతడిని చూసుకోవడానికి మేనమామ నికొలాయ్ సిద్ధపడతాడు. నికొలాయ్ ఒక పాస్టర్,అంతే కాదు మంచి రచయిత కూడా.అనేక పుస్తకాలు చదవమని యూరీ ని ప్రోత్సహిస్తాడు.తన తో పాటు వివిధ ప్రదేశాలకి తీసుకువెళతాడు. చివరికి మాస్కో లోని గ్రోమెకొ కుటుంబీకుల వద్ద చదువుకోడానికి ఉంచుతాడు.అక్కడ ఉండి వైద్య విద్య అభ్యసిస్తాడు యూరి.వైద్య శాస్త్రం చదివి డాక్టర్ అయినప్పటికి కవితలు,కథలు వంటివి రాయడం అతని హాబీ గా ఉంటుంది.తోచినవి అన్నీ ఓ పుస్తకం లో రాసుకుంటాడు. ఈ యూరి నే తన ఇంటిపేరు తో కలిపి డాక్టర్ జివాగో అవుతాడు.కథ ఇతని చుట్టూ ఇంకొన్ని పాత్రల చుట్టూ తిరుగుతూంది.

గ్రోమెకొ వారి అమ్మాయి టాన్యా ని వివాహమాడతాడు.ఆమె న్యాయశాస్త్రం అభ్యసిస్తుంది.ఇదిలా ఉండగా లారిస్స అనే అమ్మాయి ఉప కథ గా వస్తుంది. ఈ లారిస్స తల్లి బెల్జియం నుంచి మాస్కో కి వచ్చిన వితంతువు.పేరు అమాలియ.దుస్తులు కుట్టి అమ్మే ఓ షాప్ ని నడుపుతూంది. ఆమె వద్ద కొంతమంది పనిచేస్తుంటారు. కొమరస్కీ అనే ఒక జనరల్ తో అమాలియా కి సంబంధం ఉంటుంది. ఇతనితో ఏర్పడిన కొన్ని చేదు అనుభవాల వల్ల లారిస్సా మాస్కో నుంచి దూరం గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఓ చిన్న పట్టణం లో ఓ స్నేహితురాలి ఇంటి లో పిల్లలకి కేర్ టేకర్ గా పనిచేస్తూ ఉంటుంది.     

పనిచేస్తూనే ప్రైవేటు గా చదువుకుని టీచర్ గా ఓ స్కూల్ లో జాయిన్ అవుతుంది. చిన్నప్పుడు తమ వీధి లో ఉండే పాష (పావెల్ కి ముద్దుపేరు)  అనే యువకుడి ని పెళ్ళాడుతుంది. వీళ్ళకి ఒక పాప పుడుతుంది. యూరల్ పర్వత ప్రాంతం లో ఆస్ట్రియా తో యుద్ధం సంభవిస్తుంది.అప్పుడు రష్యా దేశం తరపున వలంటీర్ గా యుద్ధం లో పాల్గొంటాడు. ఆ తర్వాత పాష వివరాలు తెలియరావు. దానితో లారా (లారిస్సా ముద్దుపేరు) నర్స్ గా ఆ ప్రాంతానికి వెళుతుంది. సరిగ్గా ఇక్కడే మన డాక్టర్ జివాగో యుద్ధ భూమి లో డాక్టర్ గా సేవలు అందిస్తుంటాడు.పాష యుద్ధం లో మరణించాడని తెలుసుకుంటుంది లారా. ఆ తర్వాత లారా కి జివాగో కి మధ్య ప్రేమ సంభవిస్తుంది.కొన్ని రోజుల తర్వాత మాస్కో వెళ్ళిపోతాడు జివాగో.భార్య,కూతురు యూరటిన్ అనే పట్టణం వెళ్ళిపోతారు.జివాగో రాసిన ఉత్తరాన్ని అపార్ధం చేసుకుని వెళ్ళిపోతుంది భార్య.  

అలా ఇద్దరు వనితలు అతనికి దూరమవుతారు.జివాగో రాసిన రచనల్ని అతని మిత్రులు ప్రచురిస్తారు.దానితో అతనికి పేరు వస్తుంది.దానివల్ల సవతి సోదరుడు కూడా ఇతనిపట్ల అభిమానం పెంచుకుంటాడు.రష్యా లో జరిగిన విప్లవం వల్ల కమ్యునిస్ట్ లు అధికారం లోకి వస్తారు. ఆ సందర్భం గా జరిగిన ఘటన లో అరెస్ట్ కాకుండా సవతి సోదరుడు సాయపడతాడు. లారా కూడా కనిపించదు.అలాంటి ఒకామె ని చూసి ఆపుదామని పరిగెడుతూ డాక్టర్ జివాగో గుండె ఆగి మరణిస్తాడు. ఆ తర్వాత లారా కి జివాగో కి పుట్టిన కూతురు యుద్ధక్షేత్రం లో ఒక చోట కనిపించిందని ఒక వ్యక్తి చెబుతుండగా నవల కి శుభం కార్డ్ పడుతుంది.అదీ స్థూలం గా కథ.

ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. సన్నివేశాలు ఉన్నాయి.ఆసక్తికరమైన ఘట్టాలూ ఉన్నాయి. అవి అన్నీ చెప్పాలంటే చాలా రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి గ్రోమెకొ సోదరులు సెలవు రోజుల్లో మాస్కో నుంచి వాళ్ళ గ్రామం సివిట్సెవ్ వ్రజెక్ కి వెళ్ళి పియానో సంగీత కచేరీ లు నిర్వహించడం,దానికి గాను వారు చేసే సన్నాహాలు అవన్నీ నాటి రష్యన్ కులీనుల జీవన వైఖరిని తెలుపుతుంది.దాంట్లో ఫాల్గొనే షురా షుల్సింగర్ అనే ఆవిడ కి భారతీయ మంత్రశాస్త్రం గూర్చి తెలిసి ఉండడం ఒక గమ్మత్తు అంశం.

 సైనికుడి జీవితం గూర్చి ఆర్మీ డాక్టర్ గా ఉన్న జివాగో ఓ చోట ఇలా అంటాడు. "తాను వెళ్ళిన చోటు నచ్చక కొన్నాళ్ళు ఇబ్బంది పడుతూ,తీరా ఆ ప్రాంతానికి అలవాటయి ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనుకునే సమయానికి వేరే ప్రాంతానికి పంపించివేయబడేవాడే సైనికుడు." 

రష్యా లో సంస్కరణలు ప్రారంభం కావడం తోనే డాక్టర్ జివాగో నవల కి ఎక్కడిలేని ఆదరణ వచ్చింది.టివి సీరియల్ గా వచ్చింది.అంతకు ముందే వేరే దేశాల్లో సినిమా వెర్షన్లు వచ్చాయి.11 వ తరగతి లో పాఠ్య గ్రంధం గా ప్రవేశపెట్టారు. అయితే కృశ్చేవ్ దీన్ని చదివి నిషేధించవలసింత పుస్తకం ఏమీ కాదని అభిప్రాయపడ్డాడు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)    


No comments:

Post a Comment