Monday, January 31, 2022

"ద గ్రేప్స్ ఆఫ్ రాత్" అమెరికా మరో ముఖాన్ని చూపించిన నవల

 వైకోం  మొహమ్మద్ బషీర్ అనే ప్రసిద్ధ మళయాళీ రచయిత ఇంటర్వ్యూ లో ఓ చోట జాన్ స్టెయిన్ బెక్ రాసిన  "ద గ్రేప్స్ ఆఫ్ రాత్"  నవల గురించి చెబుతూ, రచనలు మొదలు పెట్టిన కొత్త లో తన వాక్య నిర్మాణం లో ఎంతో కొంత దాని ప్రభావం ఉన్నట్లు చెప్పారు.అప్పటినుంచి ఆ నవల ని చదవాలనే కోరిక బలపడి,అది ఇటీవల తీరింది. ముఖ్యం గా సంప్రదాయ పడికట్టు పదాల్ని విడిచిపెట్టి నూతన ప్రయోగాలు చేయడం,వ్యాకరణ సూత్రాల్ని కూడా కాదని సామాన్యులు నిజ జీవితం లో మాట్లాడుకునే భాషని వాడడం ఇలాంటి ప్రయోగాలు ఈ నవల లో జాన్ స్టెయిన్ బెక్ చేసినట్లు మనం గమనించవచ్చు.

 స్వతహాగా అమెరికన్ అయినప్పటికి స్టెయిన్ బెక్ ఆ వ్యవస్థ లోని లోటుపాట్ల ని ఘాటు గా నే విమర్శించాడు.దానివల్లనే ఆ నవల తొలి దశ లో నిషేధించబడి ఆ తర్వాత కాలం లో వెలుగు చూసి గొప్ప ఆదరణ ని పొందింది. ఆయనకి 1962 లో నోబెల్ బహుమతి వచ్చినపుడు ఆ కమిటీ దీన్ని ప్రత్యేకం గా ప్రస్తావించింది.  

అసలు ఈ ద గ్రేప్స్ ఆఫ్ రాత్ నవల యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడిగితే 1930 ప్రాంతం లో అమెరికా లో సంభవించిన గ్రేట్ డిప్రెషన్ ఏ విధం గా అక్కడి ఆర్దిక, సామాజిక పరిస్థితుల్ని కుంగదీసింది,ఏ విధం గా అక్కడి రైతులు ముఖ్యం గా ఒక్లహామా ప్రాంతం లోని రైతులు బికారులై బతుకు తెరువు కోసం పశ్చిమాన ఉన్న కాలిఫోర్నియా వైపు వలస వెళ్ళారు,ఆ వెళ్ళడం లో ఎన్ని కడగండ్లను ఎదుర్కొన్నారు,ఎన్ని కుటుంబాలు దిక్కు లేని స్థితి కి నెట్టబడ్డాయి ఇవన్నీ మనకి ప్రముఖం గా కనిపిస్తాయి.అంతేకాదు అంతవరకు ఎంతో ఆత్మగౌరవం తో బతికిన రైతులు దీనాతిదీనమైన స్థితి కి నెట్టబడినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా మనం ఈ నవల లో చూడవచ్చు.

ఎలాంటి అరమరికలు శషభిషలు లేకుండా రియలిస్టిక్ ధోరణి లో నవల నడుస్తుంది.నిజజీవితం లో ఆనాటి కాలం లో సగటు గ్రామీణ అమెరికన్ ఏ విధం గా మాట్లాడినాడో సంభాషణలు అలాగే సాగుతాయి.దానిలో బూతులు ఉంటాయి,దైవ నింద,దైవ స్తుతి,ప్రేమ,కరుణ,పగ,హత్య ఇలా అన్ని భావాలు మనల్ని ముప్పిరిగొంటాయి. 

అనేకమార్లు గ్రామర్ సూత్రాల్ని ఉల్లంఘించిన వాక్యాలు మనకు తగులుతూ మనం చదివేది నిజమేనా అనిపిస్తుంది.అదే స్టెయిన్ బెక్ శైలి మరి.అయితే ఈ నవలకే ఇలాంటి తరహా భాష వాడినాడని అర్ధం అవుతూనే ఉంటుంది.తాను అయిదు రకాల పొరలుగా ఈ నవలని రాసినట్లు స్టెయిన్ బెక్ ఒకసారి ఉటంకించాడు.తెలివైన పఠిత వాటిని గమనించగలడని చెప్పాడు.  

సరే...కథ లోకి వెళదాం.అది ఒక్లహామా లోని సాల్లిస అనే గ్రామీణ ప్రాంతం.అక్కడి రైతులు పత్తి పండిస్తూ చక్కగా జీవిస్తున్న సమయం లో గ్రేట్ డిప్రేషన్ అమెరికా ని చుట్టుముట్టి ఆర్దిక వ్యవస్థ ని అతలాకుతలం చేస్తుంది.రైతులు పండించిన పంట కి గిట్టుబాటు ధర ఉండదు.ఇక్కడ కౌలు రైతులు గా ఉన్నవాళ్ళు యజమానుల డిమాండు తట్టుకొలేకపోతుంటారు.అలాగే ఇంకొంతమంది రైతులు అప్పులు ఇచ్చిన బ్యాంక్ లకి తమ భూముల్ని అప్పజెప్పేస్తుంటారు.

పెద్ద పెట్టుబడిదారులు ఇదే అదును గా ప్రవేశించి ఇక్కడి వాళ్ళందర్నీ బయటకి వెళ్ళిపోయేలా వత్తిడి చేస్తుంటారు.ట్రాక్టర్ల్ ని దింపి పంట పొలాల్ని దున్నివేస్తూ చికాకు చేస్తుంటారు. ఊరు ఊరంతా అలా ఉండగా అదిగో అప్పుడే మన కథానాయకుడు టాం జోడ్ దిగుతాడు. తను అప్పటిదాకా ,అంటే నాలుగేళ్ళ జైలు శిక్ష పూర్తి చేసుకుని (హత్యా నేరం మీద)  పెరోల్ మీద మేక్లేస్టర్ అనే ఊరి నుంచి దిగుతాడు. దిగగానే జిం కేసీ అనే మిత్రుడు కలుస్తాడు.గతం లో ఇతను చర్చ్ ప్రీస్ట్ గా పని చేసి దాన్ని అసహ్యించుకొని మానేస్తాడు.

వీళ్ళు జాలీ గా మాట్లాడుకుంటూ ఉండగా మూలే గ్రేవ్స్ అనే పొరుగింటి వాడు వచ్చి ఊరు వాళ్ళంతా వలస పోతున్నారని ఇక్కడ కష్టం గా ఉందని చెబుతాడు.టాం జోడ్,జిం కేసీ ఇద్దరూ జోడ్ కుటుంబం ఉన్న ఇంటివద్ద కి వెళ్ళి చూసి పరిస్థితి అర్ధం చేసుకుంటారు.ఈ జోడ్ కుటుంబానికి చెందిన వాడే టాం కూడా.కాలిఫోర్నియా లో మంచిగా పనులు దొరుకుతున్నాయని,తోటలోకి 800 మంది పనిమనుషులు కావాలని ఒక యాడ్ చూసిన వైనాన్ని టాం యొక్క అమ్మ చెబుతుంది. వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు.అయితే తాత రావడానికి ముందు నిరాకరించి చేసేది లేక సర్లే అంటాడు.అతనికి భూమి పై గల ప్రేమ అలాంటిది. ఈ టాం కి ఓ సోదరి...ఆమె పేరు రోస్ ఆఫ్ షారోన్. గర్భవతి ఆమె కూడా వస్తుంది.  

ఇహ అక్కడనుంచి మహా ప్రయాణం మొదలవుతుంది.వీళ్ళతో పాటు మిగిలిన పేదరైతులు వాళ్ళ కుటుంబాలు కూడా బయలుదేరుతాయి.అంతంత మాత్రం ఉన్న పాడు బడ్డ ట్రక్కుల్లా ఉన్న వాహనాల్లో కిక్కిరిసినట్లు కూర్చొని ప్రయాణం చేస్తుంటారు.దీనికి నాయకత్వం వహించేది టాం జోడ్ అని చెప్పాలి.ఇక్కడ బైబిల్ లోని ఒక సాదృశ్యాన్ని రచయిత మనసు లో ఉంచుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

ఆనాడు మోజెస్ ఏ విధంగా అయితే ఈజిప్ట్ నుంచి తన ప్రజల్ని ఎన్నో కష్టాలు పడి వాగ్ధానభూమి కి నడిపించినాడో అదే విధం గా ఇక్కడ టాం జోడ్ ఎన్నో యాతనలు పడి కాలిఫోర్నియా కి తన ప్రజల్ని నడిపించినాడు. ఇంచుమించు 11 వ చాప్టర్ నుంచి 18 వ చాప్టర్ వరకు ఈ ప్రయాణమే అలా కొనసాగుతూంటుంది. ఈ పోలిక ని పలువురు అమెరికన్ సాహితీ విమర్శకులు తమ వ్యాసాల్లో ఉటంకించారు.  

మొత్తానికి కాలిఫోర్నియా చేరి అక్కడ ఊరి చివరి లో తమ గుడారాలు,తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుంటారు.కొత్త సమస్యలు మొదలవుతాయి.అక్కడ ఉన్న సంపన్న రైతులకి వీళ్ళు తమ ప్రాంతానికి రావడం అసలు ఇష్టం ఉండదు.ఎన్నో ఆటంకాలు కల్పిస్తారు.పోలీసుల్ని వీళ్ళ మీదకి ఉసి గొల్పుతుంటారు.

ఈ గొడవ లో జిం కేసీ ఒక పోలీస్ అధికారిని కొడతాడు.కేసు తీవ్రమై ఇతడిని జైల్లో పెడతారు. దానితో టాం జోడ్ ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఓ కేంప్ లోకి మకాం మార్చుతాడు,తన పరివారం తో సహా..!అక్కడ కూడా పోలీసులు వీరికి కనీస సౌకర్యాలు దక్కకుండా అడ్డుపడుతుంటారు. పేదవాళ్ళ యొక్క శక్తి ఐక్య పోరాటాల్లో నే ఉంటుందని,కనక తమ ప్రజలు అంతా ఐక్యమవడానికి తగిన ఆర్గనైజేషన్ అవసరమని జిం కేసీ బోధిస్తాడు.దాన్ని తుచ పాటిస్తాడు టాం జోడ్.

జిం కేసీ కి మంచి ఆర్గనైజింగ్  నైపుణ్యం ఉన్నదని గ్రహించే స్థానిక భూస్వాములు అతడిని జైలు కి వెళ్ళేలా చేస్తారు.ఇక జిం కేసీ బాధ్యత ని జోడ్ తీసుకుంటాడు.తక్కువ వేతనలు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకం గా సమ్మెలు చేస్తుంటారు.వలస వచ్చిన శ్రామికుల్ని చీప్ లేబర్ గా కొంతమంది ఉపయోగించుకుంటూంటారు. ముఖ్యం గా స్థానిక భూస్వాములకి ఈ వలస ప్రజలంటే ఎందుకు భయమంటే ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న భూములన్నీ వాళ్ళ తాతల కాలం లో మెక్సికన్ల దగ్గరనుంచి భయపెట్టి,మోసగించి అప్పనం గా కొట్టేసినవే.వీళ్ళు కూడా ఏదో నాటికి తలనొప్పి గా మారతారని వీళ్ళ భూములు హుష్ కాకి అవుతాయన వీళ్ళ భయం. 

వలస పోయిన ప్రజల యొక్క యాతనల్ని బహుముఖాల్లో మనకి చూపించుతాడు. సోదరి రోజ్ ఆఫ్ షారోన్ భర్త వీళ్ళ ఆర్ధిక పరిస్థితి గమనించి ప్రయాణం చేసి వచ్చేటప్పుడే తప్పించుకొని కనబడకుండా వెళ్ళిపోతాడు.ప్రయాణం లో నే ఎందరో ఆప్తులు చనిపోతారు. ఒక్కసారి సొంత ఊరిని వదిలిపెట్టి బతుకుతెరువు కోసం వచ్చినవారికి ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి పాత్ర లో ప్రతిఫలిస్తాయి. చివరికి జిం కేసీ ని టార్గెట్ చేసి చంపే పరిస్థితుల్లో మిత్రుని కోసం టాం జోడ్ ఒక పోలీస్ ని చంపుతాడు. 

దానితో అతను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు.అతని తల్లికి తను విడిచిపెట్టిన పోరాట బాధ్యతల్ని అప్పగిస్తాడు.జిం కేసీ కూడా తన చివరి దశ లో అదే మాట చెప్పినట్లు తెలుపుతాడు.అనుకోని విధంగా తన సోదరుని గొప్పదనం గురించి అతను ఉన్న చోటు గురించి ఇంకో ఆమెకి చెబుతుంది షారోన్. ఎంత పనిజేశావే అని...తల్లి గ్రహించి టాం జోడ్ ని అతని స్థావరాన్ని మార్చి వెళ్ళిపోవలసిందిగా రహస్యంగా కబురుచేస్తుంది.

అంతే...ఆ తర్వాత నుంచి ఆ పాత్ర కనబడదు. అతనికి ఏమి జరిగిందనేది మన ఊహ కే విడిచిపెడతాడు రచయిత.ప్రస్తుతం వలస కార్మికులు ఒక తోటలో పనిచేస్తూంటారు.వాళ్ళకి బాక్స్ కార్ లలో వసతి కల్పిస్తారు.తాము కూడా ఇక్కడ ఉండడం క్షేమం కాదని తల్లి తన కుమార్తె ని మిగతా కుటుంబ సభ్యుల్ని వేరేచోటకి తరలించడానికి ప్రయాణం మొదలుపెడుతుంది.బోరున వర్షం పడుతుంది.షారోన్ చనిపోయిన శిశువును ప్రసవిస్తుంది.అదే సమయం లో ఆహారం కొన్ని రోజుల్ని తినక చివరి దశ లో ఉన్న ఓ ఆపన్నుడి కి ఆమె స్థన్యం ఇస్తుంది. అది ఒక దయనీయమైన సన్నివేశం,అలా ఆవిధంగా నవల ముగుస్తుంది. 

జాన్ స్టెయిన్ బెక్ ఈ నవల లో అనేక ప్రతీకల్ని వాడిన తీరు బాగా పరిశీలిస్తేనే అర్ధమవుతుంది.ప్రధాన పాత్ర ఒక హత్యా నేరం లో ఉండి పెరోల్ మీద తన ఊరికి వచ్చినపుడు,ఇతను ఒక దుర్మార్గమైన పాత్ర అనుకుంటాం.కాని అతను కుటుంబం కోసం, మిత్రుని కోసం,సమాజం లోని దీనజనుల కోసం స్థిరం గా నిలిచి త్యాగం చేసిన వైనం మనిషి ఎల్లప్పుడు ఒకేలా ఉండడని చెప్పినట్లయింది.ఇంకా చాలా విమర్శలు ఈ నవల బయటకి వచ్చినపుడు చెలరేగాయి. కమ్యూనిజం ని ప్రాపగండా చేసినట్లు ఉందని కొందరు అంటే కాలిఫోర్నియా ప్రజలు స్టెయిన్ బెక్ రాసినంత  దుర్మార్గులు కాదని కొందరు విరుచుకుపడి ప్రతుల్ని  తగలబెట్టారు.

1939 లో ప్రచురణ జరిగిన తరువాత ఈ విమర్శలు ఇలా ఉండగానే నేషనల్ బుక్ అవార్డ్ ఇంకా పులిట్జర్ బహుమతి పొందినది ఈ నవల. కాలమే గొప్ప తీర్పరి గదా. గ్రేట్ డిప్రెషన్ ని చక్కగా రికార్డ్ చేసిన రచన గా దీనికి ప్రాముఖ్యత పెరిగింది.హై స్కూల్,కాలేజి స్థాయిల్లో పాఠ్యాంశం గా పెట్టారు.హాలీవుడ్ లో కూడా దీని ఆధారం గా 1940 లో ఓ సినిమా తీశారు.ఇంతకీ "ద గ్రేప్స్ ఆఫ్ రాత్" అనే టైటిల్ భావాన్ని రచయిత బైబిల్ లోని వాక్యాలనుంచి తీసుకున్నాడు. అవి ఇలా ఉంటాయి,"And the Angel thrust in his sickle into the earth, and gathered the vine of the earth, and cast it into the winepress of The Wrath of God" (Revelation: 14:19-20).  

----- మూర్తి కెవివిఎస్ (7893541003)      


(Placed in Nava Telangana Daily, 31-1-2022)



2 comments: