Thursday, May 5, 2022

గాజుబొమ్మ (అనువాద కథ)

 గాజు బొమ్మ (అనువాద కథ)


ఒరియా మూలం : గౌరహరి దాస్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


మిగలపండిన మామిడి పళ్ళు,పనస పళ్ళ తీపి వాసన మా ఘంటేశ్వర్ గ్రామం లోని అంగళ్ళ దగ్గర నుంచి వచ్చిందీ అంటే "రజా" పండుగ దగ్గరకి వచ్చేసిందని అర్థం..!మామూలుగా అయితే మా ఊరి వీథులు చెత్తా చెదారం గానే ఉంటాయి.

జీడిమామిడి తోటల్లో తేనేటీగలు ముసురుకుంటూండగా, మా ఊరి గుండా ప్రవహించే మాంటేయి నది మీద నల్లని మబ్బులు చింత చెట్టు మీది కాకుల్లా గా కదులుతుంటాయి.ఇక రుతుపవనాలు రాబోతున్నాయని అర్ధం అన్నమాట.    

మా ఊరి రహదారుల్లో కరంజ పూలు "రజ" పండుగ కి స్వాగతం చెబుతున్నట్లుగా పూస్తాయి. ఆ పండుగ మహ గొప్పగా జరుగుతుంది.ఆడపిల్లలందరూ స్నానం చేయడానికి పెద్ద చెరువు దగ్గరకి వెళతారు. ఆ తంతు చాలాసేపు జరుగుతుంది."పొడపిఠ" వంటి తినుబండారాల సువాసన గాలిలో కలిసి ఉంటుంది.

మా ఊరి బడి లోని ప్రాంగణం లో గడ్డి ఏపుగా పెరుగుతుంది.వీథుల్లో రకరకాల గాజుసామాన్లు,దుస్తులు,రిబ్బన్లు ఇలాంటివి అమ్ముతూ చిన్న వ్యాపారులు సందడి చేస్తుంటారు.

బాటా మావయ్య సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే ప్రతి ఏడు మమ్మల్ని చూడటానికి వస్తుంటాడు.ఫ్రెష్ గా,మల్లెపూవు లాంటి కుర్తా వేసుకుంటాడు.ఎర్రటి కండువా భుజాన ధరించి,ఆ కొత్త చెరువు చివరనుంచి వస్తూండగా,పిల్లలం అందరం ఎదురేగి మరీ తీసుకొస్తాము. చక్కటి బ్లూ కలర్ చెప్పులు వేసుకుంటాడు.ఆయన భుజానికి రెండు సంచులు వేలాడుతూంటాయి.దాంట్లో ఎన్నో మా కోసం తీసుకొస్తుంటాడు.   

పిల్లలం అందరం మేం అంటే మేం అంటూ ఆయన తెచ్చే సంచుల్ని మోసుకురావడానికి పోటీ పడుతుంటాం.దాంట్లో ఎన్నో రకాల బహుమతులు అవీ ఉంటాయి మరి.వాటి కోసం మేము కలలు కంటూ ఉంటాము.

మా బాల్యం లో ఎన్నో జరిగాయిలే గాని,బాటా మావయ్య తో ఉండే ఆ క్షణాలు మాత్రం మిగలపండిన మామిడి పళ్ళున్న చెట్ల వంటివి.ఆయన కి దగ్గరగా ఉండాలని ఎంతగానో తపించేవాళ్ళం.ఆయన ఊళ్ళోకి అడుగుపెడుతుండగా,ఆ కొత్త చెరువు దగ్గర దాకా వెళ్ళి చేతులూపుతూ ఉత్సాహం గా ఆహ్వానం పలికేవాళ్ళం. 

"జాగ్రత్తగా పట్టుకో...కింద పడేయకు సుమా" అంటూ మావయ్య నాకు ఓ సంచి ఇచ్చేవాడు.ఆ సంచి లో ఏవో బుట్టెడు పూలు ఉన్నట్టు అంతగా బరువనిపించేది కాదు.నేనంటే ఆయనకి చాలా ప్రేమ.

"స్కూల్ కి ఎండాకాలం సెలవులు ఇచ్చేశారా..?" అంటూ బాటా మావయ్య అడిగితే అందరికన్నా నేనే ముందు సమాధానం చెప్పేవాణ్ణి.పెద్ద చెరువు దగ్గరున్న రాతి మెట్ల వద్ద కాళ్ళూ చేతులు కడుక్కొని ఊళ్ళోని చంద్రశేఖర్ మహదేవ్ గుడి లో ప్రార్థించి,ఇంటికి వచ్చి పెద్దలకి నమస్కరించేవాడు.గుమ్మం లో ఆయన కి స్వాగతం చెప్పడానికి చాలామంది ఎదురుచూస్తుండేవాళ్ళు.మా అమ్మ ఈతచాప ని వరండా లో పరిచేది.అక్క ఓ జగ్గు తో నీళ్ళు తీసుకొచ్చేది.

"అరే...పిల్లలూ మావయ్య ని కొద్దిగా విశ్రాంతి తీసుకోనివ్వండి.ఒంటరిగా ఉండనివ్వడి కాసేపు" అని మా నాన్న అనేవాడు.కానీ అదంతా మేము పట్టించుకునేవాళ్ళం కాదు.మా చూపంతా మావయ్య తెచ్చిన వస్తువుల మీదే ఉండేది.తను తెచ్చిన స్వీట్లని పంచమని అత్తయ్య తో చెప్పేవాడు.మేం నోట్లో పెట్టుకోగానే వడగళ్ళు మాదిరి గా ఆ స్వీట్లు కరిగిపోయేవి.

"ఇంటికి వెళ్ళిపోయి,మళ్ళీ సాయంత్రం రండ్రా...మావయ్య చెప్పే కలకత్తా కబుర్లు విందాం" అంటూ నా తోటి జతగాళ్ళ ని పంపేసేవాడిని.నన్ను అసూయ గా చూస్తూండే వాళ్ళముందు బడాయి గా ఉండేవాడిని. 

వాళ్ళు నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత నేను చేపలకోసం చెరువు దగ్గర కొంగ చేరినట్లుగా మావయ్య దగ్గరకి చేరేవాడిని.

అప్పటికే ప్రయాణం లో అలిసి ఉండటం తో మావయ్య "ఆ సంచుల్లోవి అన్నీ సాయంత్రం ఓపెన్ చేద్దాం లేరా" అనేవాడు నాతో.

అయినా నేను ఆయన వెంట నీడ లా తిరుగుతూండేవాడిని.బాటా మావయ్య టూత్ పేస్ట్ ని బ్రష్ మీద వేసుకుని మొహం కడుక్కోవడం నాకు ఆశ్చర్యం గా అనిపించేది.ఎందుకంటే మేము ఇక్కడ వేప పుల్ల తోనో,కరంజ పుల్ల తోనో తోముకుంటుంటాము పండ్లని. మా నాన్న గుడాకు వాడేవాడు,అదంటే నాకు అసలు గిట్టదు.నేను కూడా పెద్దయిన తర్వాత పేస్ట్ వేసుకుని బ్రష్ తోనే పండ్లని తోముకోవాలని తీర్మానించుకున్నాను. మా యింటి దగ్గర కాకుండా ,పెద్ద చెరువు దగ్గరకి వెళ్ళి స్నానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాను.

బాటా మావయ్య దగ్గరనుంచి ఇంకా కొన్ని విలువైన వస్తువుల్ని సేకరించేవాడిని.ఆయన మేజిక్ సంచి లో ఎన్ని వస్తువులో..!ఆయన స్నానానికి వాడే సబ్బు కి మంచి సువాసన వచ్చే కవర్ ఉండేది.దాన్ని తీసేసినపుడు నేను గబాలున నా జేబు లో వేసేసుకునేవాడిని.ఎవరూలేని సమయం లో దాన్ని తీసి వాసన చూసేవాడిని.ఎంత బావుండేదో..!

బాటా మావయ్య తలకి రాసుకునే నూనె కూడా మంచి సెంట్ వాసన వచ్చేది.దాన్ని గురించి అడిగితే " దీన్ని కియో కార్పిన్  బ్రాండ్ నూనె అంటారు.పట్టుకు రా ...స్నానం చేసిన తర్వాత రాసుకుందాం" అనేవాడు.బోరింగ్ పంపు దగ్గర స్నానం చేయడానికి ఆయనతో పాటు నేనూ టవల్ తీసుకుని వెళ్ళేవాడిని.

"చుట్టుపక్కలా ఎవరైనా ఉన్నారట్రా.." అని ఓ మారు అటూ ఇటూ చూసి సిగరెట్ పెట్టె తీసి ఓ సిగరెట్ వెలిగించుకునేవాడు.ఆ సిగరెట్ పాకెట్ ఖాళీ అవగానే నేను దాన్ని కూడా నా జేబు లో కుక్కుకునేవాడిని.మావయ్య అలా రింగు రింగులుగా పొగ వదులుతుంటే అమ్మమ్మ కథల్లోని రాజకుమారుడే గుర్తొచ్చేవాడు.

నేను బోరింగ్ నీళ్ళు కొడుతుండగా ఆయన స్నానం చేసేవాడు. ఆ సుగంధాల సబ్బు తో ...తోముకుంటుంటే నురగ భలే వచ్చేది. ఆ తర్వాత తలకి ఆ సుగంధాల నూనె పట్టించేవాడు. 

మావయ్య బోరింగ్ కొడుతుండగా నేనూ స్నానం చేసేవాడిని.వీథి లో వస్తోంటే ఆ సబ్బు సుగంధం నా నుంచి ఊరంతా వ్యాపించినట్లు అనిపించేది.ఆ తడి టవల్ తోనే గర్వంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచేవాడిని.మావయ్య ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపించేది. 

అన్నం తిన్న తర్వాత మావయ్య ఓ కునుకు తీసేవాడు.అత్తయ్య కాసేపు బయటకి వెళ్ళమని పంపించేది. "కలకత్తా నుంచి ఇక్కడకి రైలు లో రావాలంటే ఎంత అలసట వస్తుందో తెలుసా..? డం డం ఏరియా నుంచి హౌరా వచ్చి రైలు ఎక్కాలి గదా... కాసేపు మావయ్య ని పడుకోనీ..." అనేదామె.

కలకత్తా,డం డం, హౌరా ...అవన్నీ ఎక్కడున్నాయో నాకేం తెలుసు..? నా ప్రపంచం అంతా ఈ ఘంటేశ్వర్ గ్రామమే..!మా ఊరు కాళీ పూజ కి, దుర్గా పూజ కి పెట్టింది పేరు.మహా అయితే నాన్న ఎప్పుడన్నా చండాబలి కి, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి ఇంకా అయితే కటక్ వరకు వెళతాడు.కటక్ లో శ్రీధరన్న వాళ్ళు ఉంటారు. కానయితే బాటా మావయ్య ఉండేది మాత్రం డం డం లో..! 

"ఏవిటి..?" మీ బాటా మావయ్య ఉండేది "ఆలూడం" లోనేనా..?" అని బగూలీ గాడు ఆట పట్టించేవాడు.

"ఔనులేరా... మీ మావయ్య "పొటాల రస" లో గదా ఉండేది" అని నేను వాడిని తిరిగీఅట పట్టించేవాడిని.

వాడికి నేను సేకరించిన టూత్ పేస్ట్ కవర్లు,సబ్బుల కి చుట్టి వచ్చే కవర్లు,ఖాళీ సిగరెట్ పాకెట్లు కొన్ని ఇస్తుంటాను.అందువల్ల నాతో వాడెప్పుడూ మరీ దురుసు గా వెళ్ళడు.

బాటా మావయ్య ఎపుడు బయటకి వస్తాడా అని తలుపు దగ్గరే కాచుకుని ఉండేవాడిని.అటూ ఇటూ పచార్లు చేస్తూంటే,నిమిషం యుగం లా గడిచేది.మా అత్తయ్య అంటే కోపం వచ్చేది.అమ్మ,అత్తయ్య ఏ వంటగది లోనో బిజీ గా ఉన్నపుడు తలుపు సందు లోనుంచి మావయ్య ఆ సామాన్లు అవీ ఓపెన్ చేద్దామా అని లోస్వరం తో అడిగేవాడిని.

మొత్తానికి ఆయన సరే అనేవాడు.నేను ఆ పక్కనే దర్జాగా కూర్చునేవాడిని.ఒక్కో పాకెట్ ని మావయ్య చాలా జాగ్రత్త గా విప్పేవాడు.దాంట్లో ఉన్న వస్తువులు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది.నాన్నకి పంచెలసాపు,అమ్మకి,అత్తయ్య కి చీరెలు ఇంకా ప్లాస్టిక్ కప్పులు,గ్లాసులు,ప్లేట్లు దేవుడి కోసం గంధపు చెక్క,అగరువత్తుల కట్టలు ఇంకా నాయనమ్మ కి ముతక వులెన్ దుప్పటి ఇలా ఎవరివి వాళ్ళకి తెచ్చేవాడు. ఇంకో సంచి లో జీలకర్ర,ఆవాలు,మషాళా దినుసులు,సెంట్ వాసన వచ్చే, తలకి రాసుకునే నూనెలు ,రిబ్బన్లు,కుంకుమలు ఇలా ఉండేవి.


మరో బ్యాగ్ లో కొత్త పేక ముక్కలు,డిటెక్టివ్ నవలలు,సబ్బులు,మందులు (నాన్నకి) ఇలాంటివి ఉండేవి.ఆ పౌడర్ డబ్బా ని అలా వత్తితే చాలు పౌడర్ పడేది, లైటర్ ని అలా ప్రెస్ చేస్తే నిప్పు వచ్చేది.సరే..ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి.మరి నా సంగతేమిటి...అనుకునేవాణ్ణి.

నా మనసు ని చదివినట్టుగా బాటా మావయ్య గది లో ఓ మూలన పెట్టిన ఎర్రటి కవర్ చుట్టిన వస్తువు ని తీసుకొచ్చేవాడు. తీరా గబుక్కున చింపితే...దాంట్లో ఓసారి రబ్బరు బొమ్మ నో,మరోసారి మోటారు కారు నో, విమానమో  ఉండేది.

అయితే ఈసారి మాత్రం మావయ్య నా కోసం గాజు తో చేసిన ఓ బొమ్మని తీసుకొచ్చాడు.దాన్ని నా చేతిలో పట్టుకుంటే వజ్రం లా మెరిసింది.

"నా బొమ్మ చీకట్లో భలే మెరుస్తోంది గదమ్మా " అని అమ్మ ని అడిగితే "ఏమో...నాయనా ,మరీ అంతగా అగపడటం లేదు " అనేది.ఆమె కి కొద్దిగా దృష్టి లోపం.నా బొమ్మ నాకు గొప్పగా అనిపించేది.

మావయ్య వీటితో పాటు నాకు పిప్పరమెంట్లు,గోళీలు కూడా ఇచ్చేవాడు.నా దృష్టి లో ఆయనకి సాటి వచ్చేవారు ఈ భూప్రపంచం లో లేరనిపించేది.

నిజం చెప్పాలంటే ఆయనకి మా ఊళ్ళో ఓ ప్రత్యేకత ఉండేది.అందుకే ఆయన రాక మహదానందం గా ఉండేది.ఆయన తో రకరకాల పనులు చేసి అలరించాలని ప్రయత్నించేవాళ్ళం. పెద్ద చెరువుకెళ్ళి చేపలు పట్టడం,రజ పండుగ రోజున కబడ్డీ పందేల్లో ఫాల్గోవడం,జాతర లో జరిగే నాటకల్ని చూడటం,విందుల్లో ఫాల్గోవడం...ఇలా ప్లాన్ చేసేవాళ్ళం.అయితే కొన్నింటిలో సమయాభావం వల్ల ఫాల్గోనలేకపోయేవాడు.

రజ పండుగ మహా సందడి గా జరుగుతుంది.మేము తూనీగల్లా స్వేచ్చగా విహరించేవాళ్ళం.బాటా మావయ్య ఏది చెప్పినా చేయడానికి తయారుగా ఉండేవాళ్ళం.

మావయ్య కి సెలవులు దగ్గరపడ్డాయి.కొన్ని రోజుల్లో కలకత్తా వెళ్ళిపోవాలి.ఇంకా మేం హౌరా బ్రిడ్జ్ గురించి,విక్టోరియా మెమోరియల్ గురించి,డం డం లో వాలే విమానాల గురించి ఎంతో వినవలసిఉంది. సెలవులు ముగిసి ఆయన ఊరి నుంచి వెళ్ళిపోయినపుడు,నాకు పరమ విచారం గా అనిపించేది.జీవితం లోని ఆనందం అంతా మాయమైపోయేది.   

మావయ్య కలకత్తా వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వచ్చేది. నా దీనమైన మొహాన్ని అమ్మ కొంగు చాటున దాచుకునేవాణ్ణి. ఆయన ధరించిన మల్లెపూవు లాంటి తెల్లని ధోవతి,భుజం మీద వేసుకున్న ఎర్ర కండువా కనుమరుగయ్యే దాకా చూస్తూండేవాణ్ణి.నాకు మిగిలినవి కేవలం ఇక ఆ తీపిగుర్తులే.అప్పటి ఆట,పాటలే.

 బాటా మావయ్య వెళ్ళిపోయిన చాలా రోజుల వరకు ఆయన ఇచ్చిన తలకి రాసుకునే నూనెల సువాసన మా ఇంట్లో రాజ్యమేలేది.ఆ గ్రామం లో మా దర్జా యే వేరు.కాలక్రమేణా ఆ సువాసన అడుగంటిపోయి గోడకి పిడకలు వేసిన ఆ పాత వాసన గాలి లో తేలియాడుతుండేది.

ఒక రోజున మావయ్య ఇచ్చిన ఆ గాజు బొమ్మ ని స్కూల్ బ్యాగ్ లో నుంచి బయటకి తీశాను.అది ఒక రాజు ని పోలిన బొమ్మ,మీసాలు కూడా ఉండేవి.నాకేసే చూసినట్లుండేది.రకరకాల కోణాల్లోనుంచి మార్చి మార్చి చూసేవాడిని.ఆ బొమ్మ వింత గా ఉండేది. మరో యాంగిల్ లో ఆ బొమ్మ బాధపడుతున్న రాక్షసుని లా ఉండేది.దాన్ని స్కూల్ కి తీసుకెళ్ళే పని మాత్రం చేయలేదు.నందా,బగూలీ గాళ్ళు మహా అసూయాపరులు,కిందపడేసి పగలగొట్టినా ఆశ్చర్యం లేదు. 

ఒకసారి ఆపుకోలేక మాటల్లో నా బొమ్మ గురించి వాళ్ళకి చెప్పాను.గోళీలు,పచ్చళ్ళు,సిగరెట్ రేపర్స్,చాక్ పీస్ లు ఇస్తాం...ఓసారి నీ బొమ్మ చూపించరా అని వాళ్ళు బతిమాలేవాళ్ళు.సరే...అయితే ఓ సెలవు రోజున మా యింటికి రండి చూపిస్తా అనేవాణ్ణి.

వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే ముందు వరకు కూడా చూపించేవాణ్ణి కాదు.మా అమ్మ ఎక్కడో పెట్టేసిందిరా...అనో,అక్క పగల గొట్టేసిందనో అబద్ధం చెప్పేసేవాణ్ణి.అదీ వాళ్ళు గుర్తు చేస్తే..!నిజం చెప్పాలంటే ఆ బొమ్మ పగిలిపోవడం అనే ఊహ నే నేను భరించలేను.బాటా మావయ్య ఇచ్చినదాంట్లో ఇదొక్కటే మిగిలింది.ఆయనిచ్చిన కొత్త రూపాయి ని పెట్టి కొట్లో ఏవో కొనుక్కుతినేశాను.

------- 2---------

పాత జ్ఞాపకాలు అలా ముసురుకుంటున్నాయి.

"ఆ పిల్ల ఆ బొమ్మ ని కావాలని పడేసిందా ...ఏదో తెలియక పడేసింది" అంటోంది నా భార్య అలక. మళ్ళీ తనే అంది" ఈసారి "రజ" పండుగ కి మీ ఊరు వెళతావా ?" అనిచెప్పి.  

నేను ఆలోచనలో పడిపోయాను.ప్రతిదాన్ని రెండు కోణాల్లో ఆలోచించడం అలవాటయిపోయింది, నా బొమ్మకున్న రెండు యాంగిల్స్ లాగా..!

మళ్ళీ బాటా మావయ్య జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.తనని నేను కలవడం అదే ఆఖరిసారి.నా మెట్రిక్యులేషన్ పరీక్షలు అయిపోయాయి.ఎలా రాశాను అన్నది తర్వాత,ముందు ఓ భారం వదిలిందిలే అనిపించింది.కొత్త ప్యాంట్ లు,కొత్త షర్ట్ లు కొనివ్వమని మా తల్లిదండ్రుల్ని అడగసాగాను.బాటా మావయ్య వచ్చేటప్పుడు తీసుకువస్తాడులేరా...అనేది మా అమ్మ.

సరిగ్గా అదే సమయం లో మా కుటుంబానికి బాగా తెలిసిన సనాతన్ సార్ కలకత్తా వెళుతున్నారు. అమ్మా నేను కూడా వెళ్ళి మావయ్య దగ్గర నుంచి బట్టలు తెచ్చుకుంటాను అంటూ గొడవ చేశాను.మా అమ్మ సనాతన్ సార్ తో ఎన్నో విధాలుగా మాట్లాడి చివరకి నా కలకత్తా ప్రయాణానికి ఒప్పుకుంది.మావయ్య అడ్రస్ ఉన్న ఓ పాత కార్డ్ ఇచ్చింది.

సనాతన్ సార్, నేను ఓ ఉదయాన హౌరా స్టేషన్ లో దిగాము.

"మనం ఇపుడు శ్యాం బజార్ కి వెళ్ళి పనిచూసుకుని,ఆ తర్వాత సాయంత్రం బర్సాత్ ప్రాంతానికి వెళదాం...సరేనా?" అడిగారాయన.

"సరే..! అంటే...మనం డం డం మీదుగానే వెళతాం గద సార్" నా అనుమానం నాది.సనాతన్ సార్ కి కలకత్తా నగరం బాగా తెలుసు.

"అవును,మనం వెళ్ళేటప్పుడు అది ఎడమవైపున తగులుతుంది" సందేహ నివృత్తి చేశారాయన.

సాయంత్రం పూట కిక్కిరిసిన బస్ లో ఎక్కాం.మావయ్య వాళ్ళ ఫేక్టరీ కి వెళ్ళేసరికి కొద్దిగా చీకటిపడింది.

"జాగ్రత్తగా బస్ దిగు,ఇక్కడ జనాలు వెనకాముందు చూడరు తోసుకోవడం లో" అన్నారు సనాతన్ సార్.స్టాప్ రావడానికి పావుగంట ముందే దిగడానికి సన్నద్ధం అయ్యాను.అది చూసి సార్ భేష్ అన్నారు.

బాటా మావయ్య అడ్రస్ కనుక్కోవడానికి కొంత సమయం పట్టింది.రోడ్డు మీద వాహనాల రద్దీ బాగా ఉంది.ఉండుండి విమానాలు పైనుంచి పోతున్నాయి.అంత కిందినుంచి వాటిని చూడటం ఇదే ప్రథమం. పైన చెట్ల కొమ్మల్ని తాకుతున్నాయా అన్నట్లుగా పోతున్నాయి.

నోరు తెరుచుకు చూశాను.మావయ్య అన్నట్టు మన ఊళ్ళో ఎడ్లబండ్ల కంటే ఈ డం డం లో విమానాల సంఖ్యే ఎక్కువన్నట్లు తోచింది.

" జాగ్రత్త గా చూసి నడువు, పడిపోగలవు...బస్ లు,కార్లు ఎంత స్పీడ్ గా వెళుతున్నాయో చూశావా" హెచ్చరించారు సనాతన్ సార్.

మా గ్రామానికి బస్ రావడం అంటేనే కలలో మాట.భద్రక్-చండబలి వెళ్ళే రూట్లో చౌక్ దగ్గర బస్ లు ఆగితే మేము వెళ్ళి ఎక్కాలి.అక్కడ ఎవరు దిగినా మా ఊళ్ళోకి రావాలంటే ఎనిమిది మైళ్ళు ఏ సైకిల్ మీదనో రావాలి.

మొత్తానికి టి.కె.పాల్ బ్రిక్ మాన్యుఫేక్చరింగ్ కంపెనీ దగ్గరకి వచ్చాము.మాన్యుఫేక్చరింగ్ అంటే తయారు చేయుట అని అర్ధం ట.ఆ మాట సనాతన్ సారే చెప్పారు.

లోపలున్న గది లోకి వెళ్ళి అడిగితే అక్కడున్న ఓ ముసలాయన " అక్కడ...ఆ పని జరిగేదగ్గర ఉంటాడు " చిరాగ్గా చెప్పాడు బెంగాలీ భాషలో..!

"ఆమీ నాతున్ మానుష్ " అంటూ చెప్పారు సనాతన్ సార్ బెంగాలీ లో. అంటే కొత్తవాళ్ళమని.

"ఆ ఎడమ ప్రక్కనుంచి వెళితే, కుడివేపున పెద్ద ఇనుపగేటు వస్తుంది.అక్కడే ఉంది మా ఫేక్టరీ" అన్నాడు ఆ ముసలాయన.

బాటా మావయ్య ఉండే ఫేక్టరీ దగ్గరకి వెళ్ళేసరికి చీకటి పడింది.అయినా రోడ్లు అవీ బాగానే కనిపిస్తున్నాయి.ముసలాయన చెప్పినట్లే ఆ పెద్ద ఇనుపగేటు దగ్గర కంపెనీ పేరు కూడా ఉంది.ఇంత పెద్ద కాంపౌండ్ లో ఎక్కడని మావయ్య ని వెతకడం..?

కలకత్తా అనేది మహా నగరం.అక్కడ ఏనుగు కూడా తప్పిపోతుంది అనేది మా అమ్మ.ఇక నేనెంత..?బాటా మావయ్య నన్ను చూసి ఎంత ఆశ్చర్యపడతాడో గదా...అని నాలో ఒకటే ఉత్సూకత.నన్ను చూడగానే కౌగిలించుకుంటాడంతే.ఇదే అదనుగా నా కొత్త బట్టలు గురించి చెప్పాలి,ఇంకా కుదిరితే మా అక్క   కి నాలాంటి గాజు బొమ్మ కావాలని కూడా చెప్పాలి.నా బొమ్మ కి మల్లే రాజు,రాక్షసుడి లా కనబడే బొమ్మ కాకుండా రాణి,కుందేలు లా కనిపించే బొమ్మ ని అడగాలి.రెడిమేడ్ బట్టలు కాకుండా ఇక్కడ కలకత్తా టైలర్ కి కొలతలిచ్చి బట్టలు కుట్టించుకోవాలి అని తీర్మానించుకున్నాను. 

నా గాజు బొమ్మ రూపాన్ని చూసి మా అక్క భయపడుతుండేది. "ఈ మాత్రం బొమ్మకే భయపడితే ఎలా..? పిరికిదానా" అని అంటుండేవాడిని. ఆమె కి కావలసిన బొమ్మ గురించి తర్వాత,ముందు నాకు కావలసినవి మావయ్య ని అడగాలి.

"ఇదిగో...మీ బాటా మావయ్య...వచ్చేశాడు" అన్నారు సనాతన్ సార్,ఎవరో వ్యక్తి వస్తూండగా...!ఆ మనిషిని నేను వెంటనే గుర్తు పట్టలేదు.అతని వళ్ళంతా మట్టి అంటుకుని ఉంది.మొహం మీదకూడా దుమ్ము,చెమట..ఏ మాత్రం గుర్తు పట్టలేదు.మాసిపోయిన తలపాగా ఉంది తలకి. నడుముకి టవల్ చుట్టుకున్నాడు.అది ఇంచుమించు మోకాళ్ళదాకా ఉంది.వేసుకున్న స్లిప్పర్లు అరిగిపోయి ఉన్నాయి.నెత్తి మీద నేమో తట్ట ఉంది.బాటా మావయ్య ని ఆ విధంగా చూసి ఖంగుతిన్నాను.అసలు ఆ రూపం లో ఎప్పుడూ ఆయన్ని ఊహించలేదు. అలాగే నిర్ఘాంతపోయి చూస్తుండిపోయాను.

" ఏయ్...ఏమిటి... మీ బాటా మావయ్య ని ఇంకా గుర్తుపట్టలేదా..? నమస్తే పెట్టు.." అన్నారు సనాతన్ సార్.

అప్పటికీ నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను.బాటా మావయ్య అంటే ఇప్పటిదాకా నా మనసు లో ఉన్న రూపం వేరు.తెల్లని మల్లె పూవుల్లాంటి లాంటి దుస్తులు,భుజం మీద ఎర్రని కండువా...అంతే! 

   ఆయన తలకి రాసుకునే సుగంధపు నూనె,జేబులో సిగరెట్ ప్యాకెట్,లైటర్ ...అదీ ఆయన రూపం..!మా గ్రామం లో అందరికీ తెలిసిన బాటా మావయ్య రూపం అది.మరి ఇక్కడ...ఏమిటి...ఇలా ...మా బాటా మావయ్యేనా ఇతను..?

బాటా మావయ్య పంపు దగ్గరకి వెళ్ళాడు మొహం కడుక్కోవడానికి.అక్కడి పనివాళ్ళందరూ అలాగే మాసిపోయిన దుస్తుల్లోనే ఉన్నారు.మావయ్య తలపాగా తీసి మాసిపోయిన గడ్డం తుడుచుకున్నాడు.ఆ సమయం లో ఆయన రాజు లా కాక రాక్షసుని లా కనిపించాడు.

ఆ తెల్లారి బాటా మావయ్య ఊరు లో విశేషాలు గురించి చాలా అడిగాడు. నాకెందుకనో మావయ్య దగ్గర కొత్తబట్టలు కొనమని అడగాలనిపించలేదు.ఆయన అడిగిన ప్రతిదానికి ఒక్కో మాటలో ఏదో సమాధానం చెప్పాను.

"ఇది సుభాష్ చౌక్,ఆ వైపు రోడ్డు నుంచి మనం హౌరా వెళ్ళడానికి బస్ వస్తుంది.అక్కడి నుంచి రైలు ఎక్కడమే" అన్నారు సనాతన్ సార్. మేం ఎక్కిన బస్ శ్యాం బజార్ లో దింపేసింది,ఆలోచనలో ఉండగానే.

నా మనసు మనసు లో లేదు.దీర్ఘాలోచనలో పడిపోయాను.ఎన్నో ఆలోచనలు సుడితిరుగుతున్నాయి.ఒక వైపు రాజు,మరోవైపు రాక్షసుడు ఇద్దరి మొహలు నా ముందు మెరుస్తున్నాయి. 

"ఏమిటి అదోలా ఉన్నావు..?ఏం మాట్లాడటం లేదేం..?" అన్నారు సనాతన్ సార్.

అప్పటికీ నేనేం మాట్లాడలేదు.నా కలలన్నీ ఊర్లోనుంచి  జేబు లో పెట్టుకొచ్చిన కాగితపు ముక్కల్లా చిరిగి పోయాయి.మా తిరుగు ప్రయాణం లో సార్ వాళ్ళ స్వగ్రామం లో దిగిపోయారు.నేను ఒంటరిగా ఇంటికి చేరుకున్నాను.మా అమ్మ వచ్చి కౌగిలించుకుంది.నేను అలాగే ఉండిపోయాను.అత్తయ్య నా వెనకనే ఉంది.మా  అక్క నా బ్యాగ్ ని వెదకసాగింది,ఏమి తెచ్చానో అని..!

"బాటా మావయ్య కలిశాడా..?ఏం చెప్పాడు..?ఎప్పుడు వస్తానన్నాడు..?" అడిగింది మా అమ్మ. ఇపుడు నాకు కబుర్లు చెప్పే ఉత్సాహం లేదు.

"నువ్వు తొందరగా రమ్మన్నావు గదా...అందుకే వచ్చాను.నన్నేమీ అడగకు,సనాతన్ సార్ ని అడుగు ఏమన్నా అడగాలని ఉంటే" చిరాగ్గా చెప్పాను.

-------- 3 --------

"ఆ బొమ్మ పగిలిపోయినందుకు బాధ గా ఉంది గదూ...అవును మరి ఎప్పటి నుంచో దాచుకున్నది గదా"  నా భార్య అలక అంటోంది.

నేను సమాధానం ఇవ్వలేదు.నిజానికి నా బొమ్మ మావయ్య దగ్గరకి వెళ్ళినపుడు ఆ బరసాత్ దగ్గరే పగిలిపోయింది.అదంతా నా భార్య కి చెప్పినా ఏం ప్రయోజనం..?

"అలకా..ఆ పగిలిన గాజుముక్కలు నాకివ్వు.నా చేతులతో పారేస్తాను" అన్నాను ఆమె వెళుతుండగా..!అలకకి ఏమీ అర్థం కాలేదు.తనకి వివరించినా నా బాధ ఎలాంటిదో అర్థం చేసుకోవడం కష్టం. ఏమని చెప్పను..? ఆ గాజుముక్కలన్నీ మళ్ళీ అతికించి నా జ్ఞాపకాల్ని పచ్చగా ఉంచుకోవాలని చెప్పనా..?ఎవరూ నా చుట్టూ లేనపుడు కొన్ని కన్నీళ్ళు కార్చాలని చెప్పనా..?ఈ గాజుముక్కలు నా బాల్యస్మృతుల్లోకి గుచ్చుకుపోయాయని చెప్పనా ..? నగ్నసత్యం నా ముందు కనిపించినపుడు మొదటిసారిగా ఏదో కోల్పోయిన బాధ ... దాన్ని ఎలా వ్యక్తీకరించను..?

(సమాప్తం)   

1 comment:

  1. రచన అనువాదం కధ చివరి వరకూ చదివేటట్లు చేసింది.

    ReplyDelete