Tuesday, November 29, 2022

గౌరహరి దాస్ కథలు - సమకాలీన ఒరియా సమాజానికి ప్రతిబింబం (Review)


 మనకి పొరుగునే ఉన్న ఒరిస్సా రాష్ట్రం లో ఎలాంటి అద్భుతమైన కథలు వెలువడుతున్నాయో ఈ మధ్యనే తెలిసింది. అదీ ఇటీవల వెలువడిన "గౌరహరి దాస్ కథలు" అనే అనువాద కథా సంపుటి చదివిన తర్వాత తప్పకుండా ఆ అనిర్వచనీయ అనుభూతిని కొంతైనా పంచుకోవాలని అనిపించింది. వస్తువు ని ఎన్నుకోవడం లోనే గాక,దాన్ని పాఠకుని హృదయానికి చేరువ అయ్యేలా తీర్చిదిద్దటం లోనూ మూలరచయిత గౌరహరి దాస్ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించారు. దాన్ని అంత సొగసుగానూ తెలుగు భాష లోకి అనువదించారు మూర్తి కెవివిఎస్. మొత్తం ఈ కథా సంపుటి లో పన్నెండు కథలు ఉన్నాయి.ప్రతి కథ లోనూ ఏదో ఒక విన్నూత్న అంశం ఉంది.

భువనేశ్వర్,కటక్ ల వంటి నగరాల నుంచి, దాని మీదుగా తాళబంధ ,పతాపూర్ వంటి ఒరియా గ్రామీణ సీమల్లో కి మనల్ని తీసుకుని వెళతారు రచయిత.అచటి   సంస్కృతి,పండుగలు,రాగద్వేషాలు ఒకటేమిటి ఎన్నో మానవ ఉద్వేగాలని ఎంతో గొప్పగా మనముందు ఉంచుతారు.ఈ అనువాద కథల్ని చదివిన తర్వాత ఒరియా రాష్ట్రం గురించి మనకి ఎంతో సదాభిప్రాయం కలుగుతుంది. ఆ రాష్ట్రం పేరెత్తగానే మనకి గుర్తు వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు మాత్రమే. కాని అది అత్యంత దురదృష్టకరమైన విషయం. దాన్ని కూడా రచయిత వివిధ కథల్లో ప్రస్తావిస్తారు.  

  గాజుబొమ్మ అనే కథ లో గ్రామ సీమ నుంచి కలకత్తా నగరానికి ఇటుకబట్టీ లో పనిచేయడానికి వెళ్ళిన ఓ మామయ్య ,తన చిన్నారి మేనల్లుడికి ఇంకా ఇతర కుటుంబ సభ్యులకి బహుమతులు తేవడానికి ఎలా కష్టపడి చెమట కార్చుతుంటాడో చదివితే కళ్ళ వెంబడి నీరు వస్తుంది. మహానగరం లో ఎన్ని వెతలు ఉన్నాయో ఎంతో హృద్యం గా చెప్పారు రచయిత. తండ్రి అనే కథ లో నిజాయితీ గా పనిచేసి చివరి దశ లో జబ్బు పడినపుడు అతని కొడుకు ఎందుకు ఆయన చావుని కోరుకున్నాడో చెప్పిన వైనం జీవితం ని కొత్తగా మరో కోణం లో చూపిస్తుంది.

పాపం అనే కథ ఒరియా రాష్ట్రం లో ఉన్న వైష్ణవ సంప్రదాయ కుటుంబ జీవనాన్ని వివరిస్తూనే ఇప్పటి యువతరం లో వచ్చే మార్పుల్ని వినోదాత్మకంగా చెప్పారు.మన తెలుగు వారికి ఏడుకొండల వాడు ఎలాగో వాళ్ళకి జగన్నాధ స్వామి అలా అన్న మాట. నటదాది అనబడే బ్రహ్మచారి వైఖరి నవ్విస్తూనే మనలో విషాదం నింపుతుంది. కసింద చెట్టు అనే కథ లో పూరి కి వెళ్ళి జగన్నాధుని రథ యాత్ర వీక్షించడానికి ఒక స్త్రీ పడిన కష్టాన్ని వివరిస్తూనే ,సాటి స్త్రీ పట్ల ఆమె మానవత్వం తో వ్యవహరించకపోవడాన్ని గర్హిస్తాడు రచయిత.ఈ కథ చదువుతుంటే మనం పూరీ క్షేత్రం లో తిరుగాడుతున్న అనుభూతి కలుగుతుంది.

ఇల్లు అనే కథ లో ఓ నిర్భాగ్యుడైన తండ్రి వేదన ని వర్ణిస్తూ తరతరానికి వచ్చే మార్పుల్ని చెప్పారు.మధ్య తరగతి జీవితం లో ఉండే ఒరిపిడిని ఈ కథ లో చూడవచ్చు.ఏకుమేకు కథ లో నకుల నాయక్ వంటి వారు మనకి కోర్ట్ ప్రాంగణం లో కనిపిస్తూనే ఉంటారు.రచయిత న్యాయ శాఖ వ్యవహారాల్ని ఎంతో పరిశోధించి ఈ కథ రాశారు అని చెప్పాలి.అహల్య పెళ్ళి కథ లో కనిపించే కథానాయిక ఒక పట్టాన మన మనసుల్లో నుంచి తొలిగిపోదు.బంగారపు ముక్క,సరిపోయింది,నేరము శిక్ష,మాయవృక్షం ఇలాంటి కథలు పాఠకుడిని చాలాకాలం పాటు వెంటాడుతాయి. 

మూలరచయిత గౌరహరి దాస్ సమకాలీన ఒరియా సాహిత్య రంగం లో ఎంతో పేరెన్నికగన్న వ్యక్తి. సంబంధ్ అనే దిన పత్రిక కి సంపాదకులు గా పని చేశారు.యాభై కి పైగా పుస్తకాల్ని ప్రచురించారు.కేంద్ర,రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల్ని పొందారు.ఆయన కథల్ని ఇప్పటికైన తెలుగు లోకి తెచ్చి తెలుగు పాఠకులకి అందించిన అనువాదకులు మూర్తి గారు ఎంతైన అభినందనీయులు.అనువదించిన విధానం కూడా చదువరి కి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఎంతో ఆసక్తికరమైన శైలి లో ఉన్నది. ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్,హైద్రాబాద్ వారి వద్ద లభ్యమౌతుంది. పేజీలు 144 , వెల రూ.150.

            --- కంభంపాటి పవన్ కుమార్


( Printed in Prajakaanksha weekly 27.11.2022)

        

No comments:

Post a Comment