Saturday, December 31, 2022

బరంపురం లో ఒక రోజు

 2022 వ సంవత్సరానికి ఇది చివరి రోజు. ఇంకా కొన్ని గంటల్లో 2023 వ లోకి ప్రవేశిస్తాము. ఈ సమయాన, ఈ నెలలో బరంపురం లో జరిగిన వికాసం వారి స్వర్ణోత్సవ సంబరాల గూర్చి కొన్ని మాటలు రాయాలని ఈ ప్రయత్నం. 24 వ తేదీన హాజరు కాలేకపోయాను కొన్ని అవరోధాల వల్ల. అయితే 25 వ తేదీన వెళ్ళగలిగాను. మిత్రులు విజయచంద్ర గారు అర్ధరాత్రి అనుకోకుండా నా ఫోన్ కి సమాధానమిచ్చి బస ఏర్పాటు చేసిన గ్రీన్ హౌస్ డార్మిటరి కి దారి చూపారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ 24 అర్ధరాత్రి నాడు,చన్నీళ్ళు స్నానం చేసి చక్కగా పడుకున్నాను.తెల్లారి లేస్తే ఆ రూం లోనే సూర్యరావు గారు (శ్రీశ్రీ మహాప్రస్థానానికి బొమ్మలు వేసిన వారు) ఇంకా రామినాయుడు గారు (కన్యాశుల్కం నాటకం ఫేం) కనిపించినారు.వారితో అనుకోని పరిచయం చాలా ఆనందం కలిగించింది.అదేవిధంగా విజయచంద్ర గారి సోదరులు రొక్కం కామేశ్వర రావు గారు కూడా అక్కడనే ఉన్నారు.

With Sri Gourahari Das


అంతా కలిసి బరంపురం వీథుల్లో తిరుగుతూ టీ టిఫిన్లు లాగిస్తూ కాలక్షేపం చేశాము.ప్రోగ్రాం సమయానికల్లా ప్రొద్దుటే పదింటికి ఆంధ్రా హాల్ కి వచ్చాము.అక్కడ ప్రసిద్ధ సాహితీవేత్తలు కె శివారెడ్డి గారు,అప్పల్నాయుడు గారు,వాసిరెడ్డి నవీన్ గారు ఇంకా తదితరులు కనిపించారు.పలకరించి మళ్ళీ అక్కడ కొద్దిగా అల్పాహారం కానిచ్చాము.ఎంతో మంది సాహితీ అభిమానులు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు.అంతా కళకళ లాడుతూ ఉంది. ఆ తర్వాత సభాప్రాంగణం లోకి వచ్చాము.ప్రముఖ ఒరియా రచయిత ,సంపాదకులు గౌరహరి దాస్ గారు కనిపించారు.వారు ఎంతో అభిమానం తో ఆలింగనం చేసుకున్నారు.ఆయన రాసిన కథలే నేను తెలుగు లోకి "గౌరహరి దాస్ కథలు" అనే పేరు తో  అనువదించాను.అది మీకు తెలుసును.ఆ సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.నిజానికి ఇది పూర్తిగా దాస్ గారి ఆలోచనయే అని చెప్పాలి.అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి.


News coverage in Sambad Oriya daily

సభకి శివారెడ్డి గారు అధ్యక్షత వహించారు.నేను గౌరహరి దాస్ గారి కథలు అనువదించి ఆ విషయం వారికి తెలుపగానే చాలా మంచి పనిచేశావు అని అభినందించారు.గౌరహరి దాస్ గారి ఒరియా కథల్ని అనువదించడానికి ప్రధాన కారణం ఆయన ఆ సమాజం లోని ఎన్నో మానవీయ,సాంస్కృతిక కోణాల్ని గొప్ప ఆసక్తికరం గా మలచడమే,ఆ వైదుష్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయడానికే అనువాదం చేశాను.భూసురపల్లి వారి ప్రసంగం వినడం ఇదే మొదటిసారి.ఇప్పటి సాహితీతీరుతెన్నుల్ని వారి తో పాటు వాసిరెడ్డి నవీన్ ,అప్పల్నాయుడు గార్లు చక్కగా వివరించారు. కొంతమంది ఒరియా సాహితీవేత్తలు పరిచయం అయినారు.ఏది ఏమైనా బరంపురం అనేది తెలుగువారి సాహిత్యప్రపంచం లో గొప్ప వెలుగులీనే రమ్యసీమ అని చెప్పాలి. ఈ కార్యక్రమానికి వెళ్ళడం లో ప్రధానపాత్ర విజయచంద్ర గారు అని చెప్పాలి. చంద్రునికో నూలు పోగులా ఆయనకి దోస్తోవిస్కీ తెలుగు అనువాదం "కరమజోవ్ సోదరులు" ని మాత్రం ఇవ్వగలిగాను.


ఎందరో మహానుభావులు,అందరికీ వందనములు..!!!

--- మూర్తి కెవివిఎస్     

No comments:

Post a Comment