Friday, February 17, 2023

నా కేరళ యాత్రా విశేషాలు

 ఇటీవల కేరళ రాష్ట్రాన్ని పర్యటించాను. ఓ మిత్రుని ఆహ్వానం మేరకు వెళ్ళాను. ఈసారి తిరువనంతపురం. సరే ట్రివేండ్రం అని కూడా అంటారనుకొండి. గతం లో చాన్నాళ్ళ క్రితం కొట్టాయం వెళ్ళాను, మళ్ళీ ఈసారి ఇలా.అసలు ఈ రాష్ట్రం లో జీవించడానికి అలవాటు పడినవాళ్ళు వేరే చోట ఎలా జీవించగలరా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కంటికి ఎటు చూసినా చక్కటి ప్రకృతి శోభ.శుభ్రంగా,తగినంత స్థలం లో కుటీరాల్లా త్రికోణాకారం లో ఉండే ఇంటి పైకప్పులు,ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ సాగిపోయే ప్రశాంత జీవనం, చదువరితనం వల్ల మనిషి లో వచ్చే ఓ రకమైన పోలిష్డ్ నెస్ ఇలా ఎన్నో విభిన్నతలు ఆ రాష్ట్రం లో చూడగలం.మరి దీనికి భిన్నంగా నెగిటివ్ కోణం లేదా ఉండచ్చు లేదన్నది ఎవరు ? కాని అది కూడా చాలా పాలిష్డ్ గానే ఉంటుంది. అదే కేరళ ప్రత్యేకత,మతం వల్లనో కులం వల్లనో ఇక్కడ ఘర్షణ రేపడం చాలా కష్టం. ప్రజలు ఆ విషయం లో చాలా జాగరూతత తో ఉంటారు.



హోటళ్ళు,పరిశ్రమలు,మీడియా,ఇతర అనేకానేక వ్యాపారాల్లో ముస్లిములు,క్రైస్తవుల వాటా ఇతర రాష్ట్రాల తో పోల్చితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.మీరు అలా బయట తిరుగుతున్నా చాలు ఆ తేడా కనబడుతుంది.ప్రెస్ రోడ్ లో ఉన్న క్యూనైన్ అనే హోటల్ లో భోజనం చేస్తూ మెనూ చూస్తే చికెన్,మటన్,ఫిష్ తో బాటుగా బీఫ్ కూడా ఉంది.అక్కడే అని కాదు మీరు హిందూ హోటల్స్ కి వెళ్ళినా అలాంటి మెనూ కనబడుతుంది.సరే..తినడం అనేది ఎవరిష్టం వాళ్ళది. అవతలే ఉన్న అన్నమయం (పేరు బాగుంది గదా)  అనే హోటల్ లో ఓ రోజు భోంచేశాను. అక్కడ కిళి పరోటా అనే దాన్ని ఆర్డర్ ఇవ్వగా అరిటాకులో కర్రీ తో బాటు ఇచ్చారు.విప్పుకుని తిన్నాను.అదొక అనుభూతి. ఇక కొబ్బరి తో చేసే పుట్టు ,బఠాణీ కూర్మా కూడా బాగానే అనిపించింది.చిన్నా,పెద్దా హోటల్ అనే తేడా లేకుండా ప్రతిచోటా గోరు వెచ్చటి నీళ్ళని తాగడానికి అందుబాటు లో ఉంచడం మంచిగా అనిపించింది.    



తమిళనాడు లోని తిరుప్పూర్,కోయంబత్తూర్ జిల్లాలు దాటి పాలక్కాడ్ లో రైలు ప్రవేశించడం తో కేరళ లో అడుగు పెట్టినట్లయి అటూ ఇటూ ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని ప్రకృతి ఆనందింపజేయసాగింది. ఆ పిమ్మట ఓట్టపాలెం,వడకంచెరి, కొల్లం,త్రిస్సూర్,ఇరెంజిలకుడి,చలకుడి,అంగామలి,అళువ,ఎర్నాకులం,కొట్టాయం,చెంగనస్సెరి,తిరువల్లా,చెంగనూర్,మావెలికర,కాయంకులం,కరుంగనపల్లి,కొల్లం,పరవూరు,వర్కాల,కడకవూర్ ఇలా ఒక్కో స్టేషన్ దాటుకుంటూ తిరువనంతపురం లో కి వచ్చాను. కేరళ లో రైలు పోతున్నపుడు బాగా పరిశీలిస్తే ఇళ్ళ ముందర గాని,రోడ్ల మీదగాని ఏదో ఊసులు చెప్పుకుంటూ జనాలు గుంపులు గా అసలు కనబడరు.నూటికి ఎనభై శాతం తలుపు దగ్గరకి వేసి ఉండి మనుషులు ఎవరూ ఇళ్ళ బయట కనబడరు.అయితే మిగతా రాష్ట్రాల్లో నాకు ఎక్కడా అలా కనబడలేదు. అదో గమ్మత్తు విషయం. 



నాకు ఓ నాలుగు నక్షత్రాల హోటల్లో బస కల్పించారు.అయితే ఒక్క రోజు మాత్రం దాంట్లో ఉండి ఒలీవియా అనే మామూలు హోటల్లోకి మారాను.సింప్లిసిటి,పరిశుభ్రత ఇళ్ళ నిర్మాణాల విషయం లో వీటినే సగటు మళయాళీలు అనుసరిస్తారు. ప్రతి ఒక్కరూ చదువుకునే రోజుల్లో ఏదో ఒక కళా రూపాన్ని అభ్యసిస్తారు.సంగీతం,డాన్స్,నటన, చిత్రకళ ఇలా ఏదో ఒకదాన్ని.అందుకనేనా...వివిధ చిత్రపరిశ్రమ లలో వెలిగిన హీరోయిన్లు అనేకమంది కనిపిస్తారు,మిగతా వాటితో బాటు అనిపించింది.చాలామంది తెలుగు వాళ్ళు పద్మనాభ స్వామి వారి గుడి కి వెళ్ళినపుడు కనిపించారు.



ట్రావెంకూరు పాలకులు నిర్మించిన ఈ గొప్ప కట్టడాన్ని చూసినట్లయితే చేర మరియు ద్రావిడ నిర్మాణ శైలి కలగలిసినట్లు అనిపిస్తుంది. ఈ పద్మనాభ స్వామి గుడిని చూసి చాలామంది వచ్చేస్తుంటారు గాని దీనికి పక్కనే ఉన్నా కోట ని,మ్యూజియం ని తప్పకుండా చూడాలి. ఈ కోట ని పుథెన్ మాలిక లేదా కుత్తిర మాలిక అని పిలుస్తారు.దీనిలో రమారమి 122 గదులు ఉన్నాయి.18 వ శతాబ్దం లో తిరునాళ్ మార్తాండ వర్మ కట్టించిన ఈ నిర్మాణం ని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ది చేశారు.దీనిలో ఆనాడు ఉపయోగించిన కత్తులు,కళాకృతులు,తాళపత్రాలు,పాత్రలు,కలప తోనూ ,పింగాణీ తోనూ చేసిన ఎన్నో రకాల వస్తువులు ఇంకా రకరకాల చిత్రకారులు వేసిన చిత్రాలు మనల్ని వేరే లోకానికి తీసుకుపోతాయి. ఇంకా ఎన్నెన్నో ఆనాటి దైనందిన జీవితానికి సంబందించిన వస్తువులు ఉన్నాయి. వీటన్నిటిని సేకరించి ఇంతలా కాపాడి నేటితరాలకి చూపెడుతున్న వీరు ధన్యులు అనిపించింది.



ఇక్కడున్న చిత్రాల్ని చూసి ఓ చోట మనం చప్పున ఆగిపోయి ఆలోచన లో పడతాము.అది ఏమిటంటే ట్రావెంకూర్ పాలకుడైన మార్తాండ వర్మ ముందు ఓ యూరోపియన్ మోకాళ్ళ పై కూర్చుని వినతి పత్రం ఇవ్వడం.దాని వద్దగల వివరాలు చదివితే కొలాచల్ అనే ప్రాంతాం లో డచ్ సైన్యాన్ని ఓడించి అనేకమంది సైనికుల్ని ఇంకా Eustachus De Lennoy అనే సైనిక అధికారిని మార్తండ వర్మ బంధించాడు.దానికి సంబందించిన చిత్రం అది.ఒక భారతీయ రాజు యూరోపియన్ సైన్యాన్ని ఓడించి పట్టుకోవడం చాలా అరుదైన విషయం కాని మన చరిత్ర పుస్తకాల లో ఇలాంటివి పెద్దగా కనబడవు.ఇది ఆగస్ట్ 10,1741 లో జరిగింది. 

ఇక దానికి పక్కన ఉండే మ్యూజియం కూడా తప్పక చూడదగినది. ఆ తర్వాత తరాలలో ప్రముఖులైన బలరామ వర్మ,రామ వర్మ ఇలాంటి వారు సేకరించిన వస్తువులు ఇంకా వాళ్ళు తీసిన ఫోటోలు ఉన్నాయి. దీనిలో స్వామి వివేకానంద ఫోటో కూడా ఉన్నది,ఆయన ఈ సంస్థానాన్ని సందర్శించినప్పుడు అప్పటి రాజుగారే ఈ ఫోటో తీశారని అక్కడి గైడ్ చెప్పారు. 1949 వరకు ఈ సంస్థానాన్ని పాలించిన ఈ రాజవంశం వారే ఇప్పటికీ పద్మనాభ స్వామి ఆలయానికి ట్రస్టీలు గా ఉన్నారు.ఇక్కడ ఉన్న బంగారం,విలువైన వజ్ర వైఢూర్యాల వల్ల పద్మనాభ స్వామి ఆలయం అత్యంత ధనవంతమైనదిగా పేరెన్నికగన్నది. 

ఈ గుడి ముందు ఉన్న వీధి అంతా బంగారపు షాపులే ఉన్నాయి. మిగతావి హోటళ్ళు,ఆఫీస్ లు ఉన్నాయి.స్వాతి తిరునాళ్ సంస్థానాధీశుని పేరు మీద ఓ సంగీత విద్యాలయం ఉన్నది. అక్కడున్న ఓ హోటల్ లో భోజనం కానిచ్చాను.యాలకులు,లవంగాలు,మిరియాలు,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల్ని కూరల్లో బాగా వాడారు.ఎంతైనా వాటికి మాతృ భూమి గదా.కొన్ని వీధుల్లో నడుస్తుంటే కూడా వీటి సువాసన ముక్కు పుటాల్ని తగులుతుంటాయి.మళ్ళీ ఎక్కడా...కూర్గు , అక్కడ కూడా అంతే,కొన్ని వీధుల్లో వాటి సువాసన గుబాళించి కొడుతుంది.బయట బస్తాల్లో పెట్టి అమ్మేవారు,ఇప్పుడెలా ఉందో తెలీదు మరి.

సరే..ఇప్పటికిది,గుర్తు వచ్చినప్పుడు ఇంకొన్ని మరోసారి. 

--- Murthy Kvvs

2 comments:

  1. మీ శ్రీలంక యాత్రలాగా కేరళ విశేషాలు ఫొటోలతో వివరంగా వ్రాసారు. చాలా బావుంది.

    ReplyDelete