Saturday, June 1, 2024

‘నిరంతర యాత్రికుడు’నవలిక సమీక్ష

 

                                           “ కల నెరవేరకపోవడం కూడా కొన్ని సార్లు వరం లాంటిదే..!”.  ఎంత గొప్ప వాక్యమో కదా! ఇది తెలియకనే కదా నేడు నిరాశ, నిస్పృహలకు బలైపోయిన ఎన్నో జీవితాలను చూస్తున్నాం.అపజయం అనేది మనకు అనుకోకుండా దరిచేరే అదృష్టమని  తెలుపుతూ పై వాక్యంతో “ నిరంతర యాత్రికుడు” అనే నవలిక ప్రయాణం మొదలవుతుంది. జీవిత ప్రయాణం ఎలా మొదలయిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రయాణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అద్భుతాలు,అదృష్టాలు,అపజయాలు,ఆనందాలు,సాహసాలు,

సాధకబాధకాలు, సంబంధభాంధవ్యాలు.ఇవన్నీ ఎవరో ఒక్కో మెట్టుగా పేర్చి మనకు ఈ జీవితాన్ని ప్రసాదించినట్టు అనిపిస్తోంది కదా! అలా గడిచిన తన జీవితంలోకి ఒకసారి తొంగి చూసుకుని, వారి జీవన ప్రయాణంలో మనల్ని కూడా యాత్రికులను చేసే విధంగా ‘ నిరంతర యాత్రికుడు’నవలికను రచించారు కె.వి.వి. ఎస్. మూర్తి గారు.

                    ఇందులో సివిల్ సర్వీస్ లో చేరాలనే కోరికతో కష్టపడి చదువుకున్న యువకుడి జీవన ప్రయాణం ఇది. ఒక సందర్భంలో రచయిత “ నాకు సివిల్ సర్వీస్లో ర్యాంకు వస్తుందో లేదో తెలియదు గానీ చదవడంలో ఉన్న మాధుర్యాన్ని, జ్ఞానంలో ఉన్న తేజాన్ని నాకు పరిచయం చేసింది కాలం. అది నా జీవితాన్ని మొత్తం ప్రభావితం చేసింది” అని పేర్కొన్నారు.నాకెంతో నచ్చిన మాటలు ఇవి. ఇదే కదా నేడు మనం చూడలేకపోతున్నది.ఫలితం ఇచ్చే లాభం చూస్తున్నాం కానీ ప్రయత్నం ఇచ్చే అమూల్యమైన అనుభవం చూడట్లేదు.

అలాంటి అనుభవంతోనే అనుకోకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తాడు. దమ్ముగూడెం అనే చిన్న ఊరు, అక్కడి పరిసరాలు, ప్రజలు, పిల్లలు వారి మనస్తత్వాలు అన్నిటినీ అక్షర రూపంలో భద్రపరిచారు.ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళను ఎలా పరిచయం చేసుకుని, అక్కడి పరిస్థితులను గమనించి ఎలా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారో రచయిత చాలా చక్కగా వివరించారు.ఇది ఎంతో అవసరమైన జీవన నైపుణ్యం. నేటి తరంలో కొరవడుతున్న కళ. ఆరెంకల జీతం సునాయసంగా సంపాదించగలుగుతున్నాం గానీ ఆరుగురు మనుష్యులను మన వాళ్ళని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం.ఈ  నవల చదివినప్పుడు మానవ సంబంధాలెంత ముఖ్యమో తెలుస్తుంది.

           మన జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని ఎంతో ప్రభావితం చేసే వ్యక్తులు కొందరు తారసపడతారు. అలాంటి వారి పరిచయానికి ఎదో పరమార్ధం ఉంటుంది. అదేంటో మనకు వెంటనే తెలియకపోయినా, మనకు దిశానిర్దేశం చేస్తూ మనకొక లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది.ఈ నవలికలో రచయితను ప్రభావితం చేసిన వ్యక్తిని మనకు పరిచయం చేశారు. నవల చదువుతున్నప్పుడు ఆ వ్యక్తిని మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది. రచయితకే కాదు మనకు కూడా ఆ పాత్ర ఎంత ముఖ్యమో అనిపిస్తుంది. రచయితకు ఆయన పరిచయం ఒక అదృష్టం అని ప్రస్తావించారు. ఆ స్ఫూర్తితో మనం కూడా అలాంటి గొప్ప వ్యక్తుల నుండి వారి జీవిత సారాన్ని, జ్ఞానాన్ని గ్రహించాలి.

            ప్రపంచాన్ని చూస్తేనే మనుష్యులని చదవగలం. మనకేంటి ఉపయోగం అంటారా? మన జీవిత దృక్పథం మార్చేది యాత్రలే! ఈ నవలికలో మూర్తిగారు పర్యటించిన ప్రతీ ప్రదేశానికి మనల్ని కూడా తీసుకెళతారు. అక్కడి భౌగోళిక పరిస్థితులని, సామాజిక స్థితులని, సామాన్య ప్రజల జీవనాన్ని చూపించారు.ఒక జీవితంలో సంపూర్ణత్వాన్ని పొందడానికి ఖండాంతరాలు తిరగాల్సిన పని లేదు.. మన భారతదేశాన్ని చూస్తే చాలు.ఆయన అనుభవాల్లో పొందిన మానసిక సంఘర్షణను,ఆధ్యాత్మిక చింతనను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. మన జీవితంలో సంపాదించుకున్న జ్ఞానం, అనుభవాలు, అనుబంధాలే కదా నిజమైన ఆస్తి. ఆ విషయంలో మూర్తిగారు కుబేరుడని చెప్పవచ్చు.ఈ నవలికలో నిక్షిప్తమైన తన నిధిని మనతో పంచుకున్న ఆయనకు అభినందనలు. ‘నిరంతర యాత్రికుడు’లో యాత్రకు సిద్ధంకండి.

( పేజీలు : 112, వెల : రూ.100/- ప్రతులకు : 7893541003 )

                                             ----- డా. హారిక చెరుకుపల్లి  ( 9000559913)


                                                

No comments:

Post a Comment