Saturday, June 22, 2024

జర్నలిజం లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్ర

మన దేశం లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క ప్రాధాన్యత, జర్నలిజం పరంగా ఊహించనంత వేగంగా రోజురోజుకీ పెరిగిపోతోంది. న్యూస్ రూం లో ఎన్నో ప్రయోగాలు, నూతన పోకడలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో బాటు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. పెద్ద ఎత్తున ఉండే డేటా నిల్వని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా ప్రాసెస్ చేస్తుంది.ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ లోనూ , డేటా ని ఉపయోగించుకుని కథనాలు తయారు చేసుకునే విషయం లో దీని పాత్రఎనలేనిది. 

కొత్త కొత్త ఆర్టికల్స్ తయారు చేయడం లోనూ , ఉన్న కంటెంట్ ని ఎడిట్ చేయడం లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతం గా పనిచేస్తుంది.జటిలమైన వార్తాకథనాల వైపు దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది. పాఠకుల చదివే ధోరణుల్ని విశ్లేషించవచ్చు. దీనివల్ల మీడియా సంస్థలు  నూతన ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు.అయితే కొన్ని ఉపద్రవాలు లేకపోలేదు.

 ఇతరుల ప్రైవసీ కి భంగం వాటిల్లకుండా, నైతిక సమస్యలు సృష్టించకుండా బాధ్యత తో ఈ కృత్రిమ మేధ ని ఉపయోగించవలసి వుంటుంది.అదే సమయం లో కంటెంట్ ని ఉత్పత్తి చేయడం లో దీని పరిమితులు దీనికున్నాయి. అత్యున్నత ప్రమాణాల తో కూడిన వార్తాకథనాలు కేవలం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నే వస్తాయి అనేదానికి వీల్లేదు. మానవుని హృదయం లో నుంచి వచ్చే సహానుభూతి,ప్రేమ వేరు. దానికి సాంకేతిక విజ్ఞానం ప్రత్యామ్నాయాం ఎప్పటికీ కాబోదు.

ఒక్కోసారి స్టీరియోటైప్ సమాచారం కూడా అందుబాటు లోకి వచ్చే వీలుంది. జర్నలిజం లో దీని పాత్రపై తగిన నియంత్రణలు , విధివిధానాలు రూపొందించవలసిన అవసరం ఉంది. ఈ డిజిటల్ యుగం లో సమాచారం కుప్పతెప్పలుగా వచ్చిపడుతోంది. ఏ సమాచారం ఎంతవరకు అవసరమో గుర్తించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో జర్నలిజం లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ,దానివల్ల కలిగే మార్పులు ప్రస్తుతం మనం ఊహించలేని విధంగా ఉండవచ్చు.       

భవిష్యత్ లో జర్నలిజం అనేది పబ్లిక్ సర్విస్ గానో, వృత్తిగానో, కళ గానో ఉండే అవకాశం లేదని ప్రముఖ పాత్రికేయుడు అలిసన్ హిల్ అంటున్నారు. అర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ ప్రక్రియలు ఇంకొన్ని వృత్తుల్ని కూడా బాగా ప్రభావితం చేస్తుందని , ఉదాహరణకి బేసిక్ కంప్యూటర్ సర్విసెస్, డేటా ఎంట్రీ, బుక్ కీపింగ్ లాంటి పనులు రోబోలు మనుషులకంటే వేగంగా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. 

న్యూస్ రిపోర్టింగ్ కి సంబంధించి చైనా లోని జిన్ హువా న్యూస్ ఏజెన్సీ రోబోల్ని ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డిజిటల్ పత్రికలు సంప్రదాయ మీడియా ని దాటుకుని ముందుకి పయనిస్తున్నాయి. 2024,జనవరి లో బహిర్గతమైన గణనాంకాల ప్రకారం 751.5 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని 462.0 మిలియన్ల మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్నారని వెల్లడైంది.ఇంకా ముందు ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం. 

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)       



No comments:

Post a Comment