పులి అనేది కౄర మృగమైనప్పటికి మానవ సమాజం లో దానికి ఒక విశిస్ఠ స్థానం ఉన్నది. ఫలానా వాడు పులి లాంటి వాడురా అంటే అది చాలాగౌరవం గా పరిగణింపబడుతుంది. నిజానికి అడవికి రాజు గా సింహాన్ని చెబుతాము. దానికి పోటీ వచ్చే మృగం ఏదన్నా ఉన్నదా అంటే పులి నే చెప్పాలి. అయితే వీటి మధ్య ఓ ప్రధానమైన తేడా ఏమిటంటే సింహాలు 10 నుంచి 15 వరకు ఓ మంద గా జీవిస్తాయి. పులి మాత్రం ఎప్పుడూ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది.
పులి జీవన ప్రమాణం 15 నుంచి 20 ఏళ్ళు మాత్రమే.సగానికి సగం పులి పిల్లలు మొదటి రెండు సంవత్సరాల్లోనే వివిధ కారణాలతో మరణిస్తుంటాయి. ప్రపంచం లో ఎక్కువగా వీటి సంఖ్య మన దేశం లోనే ఉండగా అదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం లో గణనీయం గా ఉన్నాయి. దాదాపుగా 3,167 గా ఉన్న మొత్తం పులుల్లో 300 కి పైగా మధ్యప్రదేశ్ లో ఉన్నాయి.
ఆ తర్వాత ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి.పులి రాత్రి పూట మాత్రమే తన ఆహారానికి కావలసిన వేట చేస్తుంది. మనిషి కళ్ళ కంటే ఆరు రెట్లు చీకట్లో చూడగలిగే శక్తి దానికి ఉంది. కనుక పొదల్లోనూ ,చెట్ల మధ్య లోనూ నక్కి ఉండి తనకి కావలసిన జంతువు యొక్క శబ్దాల్ని వింటూ అనువైన సమయం లో విరుచుకు పడుతుంది.
పులి పంజా సింహం యొక్క ముందు కాళ్ళ కంటే కూడా శక్తివంతం గా ఉంటుంది.ఎలాంటి జంతువునైనా ఒకటి రెండు దెబ్బలతో నే పడేస్తుంది.ఆ తర్వాత పీకని కొరికేస్తుంది. దాని ప్రధాన ఆహారం దుప్పి,లేడి,అడివి పంది,ఎద్దు,కుందేలు ఇలా చాలా వాటిని తింటుంది.పక్షులు,చేపలు ఇంకా చిన్న జంతువుల్ని కూడా తింటుంది.
పులి స్వభావాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెప్పేదేమంటే సాధ్యమైనంతవరకు మనిషి ని చూస్తే తప్పుకుని వెళ్ళిపోతుందని. మనం అడివి లో నివసిస్తూ, ఒక్కసారి పులిని చూశాము అంటే దాని అర్థం దానికి ముందే మనల్ని కనీసం ఆ పులి యాభై సార్లు చూసి ఉంటుందని!అయితే దాన్ని ప్రతిఘటించినట్లయితే తప్పకుండా చంపితీరుతుంది. పెద్ద జంతువు ని వేట చేస్తే దాన్ని తింటూ ఓ వారం గడుపుతూ విశ్రాంతి తీసుకుంటుంది.
ముఖ్యం గా చల్లగా ఉన్నచోట అంటే వాగుల పక్కన,పొదల మాటున,గుహల్లో,ఇంకా చెట్ల నీడన కూడా గంటలకొద్దీ గడుపుతుంది. నీళ్ళలో చాలాసేపు ఈదుతూ కాలం గడపడం పులికి చాలా ఇష్టం.తోటి పులులు కనబడితే కళ్ళ తోనే మాట్లాడుకుంటాయి. తన ఆధిపత్య ప్రాంతం లోకి మరో మగ పులి వస్తే సహించదు. అయితే ఎద కి వచ్చిన సమయం లో అడివి లో పెద్ద గా గర్జన చేస్తుంటాయి. ఆ శబ్దం మూడు మైళ్ళ దాకా వినిపిస్తుంది. అది విన్న ఆడ పులి జత కట్టడానికి వస్తుంది.
ఆడపులి తన ఆధిపత్య ప్రాంతం గా 15 నుంచి 20 కి.మీ. ని ఉంచుకుంటుంది. మగ పులి ఇంత కంటే ఎక్కువ ప్రాంతాన్ని తన ఆధీనం లో ఉన్నట్లు ప్రకటిస్తుంది.అంటే అక్కడ ఉన్న జంతుజాలం అంతా తనది అన్నట్లుగా భావించుకోవడం.ఒకరి ప్రాంతం లోకి మరొక పులి వచ్చినట్లయితే పోరు జరుగుతుంది.గెలిచినది విజయవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది.అయితే పులిని మించిన కౄర మృగం వంటి మనిషి అడవుల్లోకి వెళ్ళి వాటి టెరిటరీ ని ఆక్రమిస్తుంటాడు.
దాని ప్రభావం వల్ల పులుల జనాభా గణనీయం గా తగ్గిపోయింది. వాటికి ఎక్కడకి వెళ్ళాలో అర్థం గాక గ్రామాల మీద పడితే వాటిని హతమారుస్తుంటారు. పులి ముసలిదై , పళ్ళు ఊడిపొయిన స్థితి లో మరే జంతువు ని వేటాడే శక్తి ఉండదు. అలాంటి సమయం లో మాత్రం ఆహారం కోసం మనిషి ని కూడా వేటాడుతుంది. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఏనుగులకి,ఎలుగుబంట్లకి పులి భయపడుతుంది.వాటి జోలికి పోదు. అయితే బెంగాల్ టైగర్ ఏనుగు పైకి కూడా లంఘించి చంపుతుంది. పులి గంటకి ముప్ఫై నుంచి నలభై మైళ్ళ దాకా పరుగెడుతుంది. అంటే చీతా కంటే తక్కువ వేగమే,కాని శక్తి విషయం లో పులి ముందంజ లో ఉంటుంది. మూడున్నర నెలలు గెస్టేషన్ పీరియడ్. ఆడ పులి గర్భం తో ఉన్నప్పటికీ చివరి 12 రోజులలో మాత్రమే అలా కనిపిస్తుంది.
ఉత్తరాఖండ్ లోని జిం కార్బెట్ నేషనల్ టైగర్ పార్క్ 500 ఎకరాల విస్తీర్ణం లో విస్తరించి ఉంది.అక్కడ పులులు స్వేఛ్చగా తిరుగుతుంటాయి.వేటాడానికి అనుమతి లేదు. బాంధవ్ గఢ్,రణతం బోర్ వద్ద ఉన్న పార్క్ లలో సైతం వేటాడడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అక్కడ కూడా స్వేఛ్చగా తిరుగుతుంటాయి. నాగార్జున సాగర్-శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశం లోని రిజర్వ్ ల్లో పెద్దది.నల్లమల అడవి లో నల్గొండ,మహబూబ్ నగర్,కర్నూలు,ప్రకాశం జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది.
తరించిపోతున్న పులుల సంఖ్య ని పెంచడానికి అంతర్జాతీయం గా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేవలం 13 దేశాల్లో మాత్రమే పులులు మనుగడ సాగిస్తున్నాయి.మిగతా దేశాల్లో వాటి శరీర భాగాలకి ఉన్న డిమాండ్ వల్ల వేటగాళ్ళ చేతుల్లో కనుమూస్తున్నాయి. మన దేశం లోని రేవా ప్రాంతం లో ఉండే తెల్ల పులి దాదాపుగా అంతరించిపోయింది.అరుదైన జంతువుల్ని సంరక్షించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో దినోత్సవాల్ని జరిపి ఆ తర్వాత మర్చిపోవడం కాదు,ఆ స్ఫూర్తిని భావితరాల్లో కూడా ప్రభావవంతం గా పాదుకొల్పాలి.అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది.
----- మూర్తి కెవివిఎస్ (చర వాణి: 78935 41003)
No comments:
Post a Comment