Thursday, January 1, 2026

ప్రస్తుతం చైనా లో కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు

 ప్రస్తుతం చైనా లో కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు. చైనా వాళ్ళు మెడిసిన్, ఇంజనీరింగ్, స్పేస్ సైన్స్ ఇలాంటి కోర్సులు అన్నీ వాళ్ళ చైనీస్ భాష లో నే చదువుతారని అనుకునే వాళ్ళం. అయితే మారుతున్న రోజుల్ని బట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 400 మిలియన్ల చైనీయులు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఆయా శిక్షణా కేంద్రాల్లో చేరారు. చైనా,జపాన్ లాంటి దేశాల్లో వాళ్ళ సొంత భాషల్లోనే అన్నీ నేర్చుకుంటున్నారు. మన దేశం లో అది ఎందుకు వీలుపడదు అని కొందరు అంటూ ఉంటారు.

చైనా మొత్తం లో ఒకే భాష అధికార భాష. అది మాండరిన్, దేశం మొత్తం లో 80 శాతం మందికి పైగా ఆ భాష మాట్లాడతారు.అలాగే జపాన్ దేశం లో మిహాంగో అనబడే జపనీయ భాషని 99 శాతం మంది మాట్లాడుతారు. కాబట్టి ఆయా భాషల్లో బోధించడం కష్టమేమీ కాదు.అదే మన దగ్గర చూస్తే దేశ భాష గా చెప్పబడే హిందీ ని 40 శాతం మందే మాట్లాడుతారు.మిగతా వాళ్ళు వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. దానివల్ల పెద్ద సంఖ్య లో ఉండే నిరుద్యోగులకు లింక్  భాష గా ఇంగ్లీష్ ఉంటేనే ఏ ఇతర రాష్ట్రానికి అయినా వెళ్ళి ఉద్యోగం పొందడానికి వీలుగా ఉంటుంది. అందునా చైనా లాంటి దేశం లోనే భేషజాలు విడిచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.

గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం కుగ్రామమై పోయింది. ఇంటర్నెట్ లేనిదే రోజు గడవడం కష్టమైపోయింది.ఇంగ్లీష్ భాష కి ఉన్న ప్రాముఖ్యం మీడియా పరంగా కూడా బాగా పెరిగింది. నెట్ లో ఉన్న 54 శాతం వార్తా చానెళ్ళు ఇతర వెబ్ సైట్ లు ఇంగ్లీష్ లోనే వెలువడుతుండగా, రెండవ స్థానం లో ఉన్న స్పానిష్ భాషలో కేవలం 5.6 శాతం మాత్రమే వెలువడుతున్నాయి. 98 శాతం సైన్స్ మరియు సాంకేతిక పరమైన మేగజైన్లు ఆంగ్లం లో వెలువడుతున్నాయి.2022 లో లభ్యమైన డేటా ప్రకారం అ భాషని నేర్పడానికి వెలసిన శిక్షణా కేంద్రాల మార్కెట్ 19.17 అమెరికన్ బిలియన్ డాలర్లు గా ఉన్నది.

ఇంగ్లీష్ ఈ రోజున 58 దేశాల్లో అధికార భాషగా ఉంది. 142 దేశాల్లో తమ ఎడ్యుకేషన్ పాలసీ లో తప్పనిసరి గా చేశారు. మన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రపంచం అంతటా వ్యాపించడానికి ఆంగ్ల భాషా పరిజ్ఞానమే కారణం.    ఒకప్పుడు ఇంగ్లీష్ లో రాసే భారతీయులు చాలా తక్కువ గా ఉండేవారు. ప్రస్తుతం యువతరం ఐ.టి. రంగం ఇంకా ఇతర కార్పోరేట్ రంగాల నుంచి ఎంతోమంది ఇంగ్లీష్ లో రాస్తూ దేశ విదేశాల్లో మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముతున్నారు. ఆ మేరకు పబ్లిషింగ్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది.అమిత్ త్రిపాఠి,దేవ దత్ పట్నాయక్, దుర్జయ దత్తా, చేతన్ భగత్, ఆనంద్ నీలకంఠన్, రవీందర్ సింగ్, అనూజా చౌహాన్, శరత్ కొమర్రాజు, సుదీప్ నాగర్కర్,ఇలాంటి ఎందరో నేడు ఇంగ్లీష్ లో లవ్,క్రైం,థ్రిల్లర్,స్పిరిచ్యూల్ వంటి జానర్ లలో రాస్తూ భారత దేశ సరిహద్దులు దాటి తమ గళాన్ని వినిపిస్తున్నారు. కనుక ఈ రోజున ఇంగ్లీష్ ఎంత మాత్రం పరాయి భాష కాదు.   

ఒకవైపు ఇంగ్లీష్ లో రాస్తూనే తమ మాతృభాష లోకూడా విరివిగా రాస్తున్న వారు అనేక రాష్ట్రాల్లో అనేకమంది ఉన్నారు. కనుక ఇంగ్లీష్ వచ్చి స్థానిక భాషల్ని నాశనం చేస్తుందనేది పూర్తి సత్యం కాదు. ఉదాహరణకి కేరళ రాష్ట్రం తీసుకుంటే మళయాళ మనోరమ గ్రూప్ "ద వీక్" అనే ఇంగ్లీష్ పక్ష పత్రిక ను నడుపుతుంది.మళయాళ దినపత్రికల్ని కొనేవారు కూడా చాలామంది ఆ వీక్లీ కొంటారు.అంత మాత్రం చేత అక్కడ స్థానిక భాషలో వెలువడే దిన పత్రికలు ఏమీ దెబ్బ తినలేదు.పైగా ఆ ఇంగ్లీష్ పత్రిక వల్ల కేరళ కి చెందిన ఆర్ట్ గ్యాలరీలు,పర్యాటకం,కళలు,వివిధ రంగాల్లోని వ్యక్తులు దేశ సరిహద్దు దాటి ప్రఖ్యాతి పొందుతుంటారు. అలాగే తమిళ నాడు కి ఇంగ్లీష్ లో ప్రచురించబడే ది హిందూ,ఫ్రంట్ లైన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాలకి చెందినవి అవడం మూలంగా, పేరుకి జాతీయ పత్రికలు అయినప్పటికి ఆ రాష్ట్రాల విషయాల్ని చాలా ప్రాధాన్యత ని ఇచ్చి ప్రచురించుకుంటాయి. గమనిస్తే ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి.    

 --- మూర్తి కెవివిఎస్ (7893541003)

No comments:

Post a Comment