మనం వివిధ దేశాలకి చెందిన గూఢచార సంస్థల గురించి చదువుతున్నపుడు అమెరికా కి చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ, రష్యా కి చెందిన కెజిబి, బ్రిటన్ కి చెందిన ఎం16, అలాగే ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ వంటి సంస్థలు విదేశాల్లో చేపట్టే ఆపరేషన్లు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. ఏ దేశ గూఢచార సంస్థ అయినా తన దేశ ప్రయోజనాలు ఇంకా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంటుంది. నిజానికి గూఢచార వ్యవస్థ అనేది ఈ రోజున కొత్తగా పుట్టినది కాదు.రామాయణం లో వాల్మీకీ మహర్షి కూడా దీనిని ప్రస్తావించాడు.
అరణ్యవాసం లో ఉన్నప్పుడు తనని చూడటానికి వచ్చిన భరతుని ఉద్దేశించి రాముడు గూఢచారులను ఏ ఏ ప్రదేశాల్లో నియమించావు అని అడగడం గమనించవచ్చు.ఇక చాణక్యుని ప్రతిభ గురించి ప్రత్యేకం గా చెప్పవలసిన పనిలేదు.
మన దేశానికి సంబంధించిన గూఢచార సంస్థ రా (R&AW) గురించి ఈమధ్య కాలం లో రిలీజైన దురంధర్ హిందీ సినిమా వల్ల ఆబాలగోపాలానికీ తెలిసిపోయింది. ఆ సినిమా లో చూపించినది కేవలం సముద్రం లో పైకి కనిపించే ఐస్ బెర్గ్ మాత్రమే! తెలియవలసింది ఎంతో ఉంది.
దేశ భద్రత దృష్ట్యా ఏ దేశమూ చాలా కార్యకలాపాల్ని వెల్లడి చేయదు. అయితే ఇంగ్లీష్ లో ప్రస్తుతం RAW: A History of India's covert operations అనే పుస్తకం విడుదల అయింది. యతీష్ యాదవ్ అనే జర్నలిస్ట్ దీన్ని రాశాడు. భారత దేశం యొక్క గూఢచార సంస్థ విదేశాల్లో చేసిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లను ఆసక్తిదాయకంగా చెప్పాడు.
యతీష్ యాదవ్ గతం లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ బ్యూరో కి చీఫ్ గా పనిచేశాడు.270 కి పైగా ఉన్న పేజీల్లో ఎంతో సమాచారాన్ని అదీ అధికార వర్గాల నుంచి ఇంకా ఇతరత్రా సేకరించి మనకి అందించాడు.
ఎంత గొప్ప ఆపరేషన్ ని విజయవంతంగా చేసినా వాళ్ళ పేరు బయటకి చెప్పకోవడానికి ఉండదు. అలాగే తమ విధుల్లో భాగంగా మరణించినా వాళ్ళ కీర్తి బయట ప్రపంచం లో వ్యాప్తి చెందే అవకాశమూ ఉండదు.ఒక గూఢచారి జీవితం అలా ఉంటుంది అని రచయిత పుస్తకం మొదట్లోనే చెబుతాడు.
కొన్ని వందల సార్లు టెర్రరిస్ట్ చర్యల్ని జరగకుండా ఆపుతుంటారు. కానీ ఏ రెండు మూడు సార్లు అలాంటివి జరిగినా అవి ప్రజల మది లో నిలిచిపోతుంటాయి. 1968 లో రా అనే సంస్థ ఉద్భవించింది. అంతకుముందు ఇది ఐ బి అంటే ఇంటిలిజెన్స్ బ్యూరో లో భాగంగా ఉండేది.
దేశ,విదేశాల్లో ఈ ఒక్క సంస్థ అన్ని రకాల పనులు చేయడం కుదరదని దీని నుంచి రిసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ అని కొత్త సంస్థని సృష్టించడం జరిగింది.
కేవలం విదేశాల్లో పనిచేయడానికే ఈ సంస్థ తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తుంది. దీని మొదటి అధిపతి రామేశ్వర్ నాథ్ కావో. బంగ్లాదేశ్ యుద్ధం లో జరిగిన కొన్ని అనుభవాలనుంచి విదేశాల్లో ప్రత్యేకించి పనిచేయడానికి గూఢచార వ్యవస్థ అవసరమని అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి భావించారు.
కారణం మన దేశానికి మిత్రుడైన ముజిబుర్ రెహ్మాన్ హత్య ని కొన్ని నెలలు ముందుగా ప్లాన్ చేసినా ,ఇంటిలిజెన్స్ బ్యూరో దేశం లో ఉన్న పని వత్తిడుల వల్ల పసిగట్టలేకపోయింది.
దాని నుంచి గుణపాఠం నేర్చుకున్న ఫలితంగా రా అనే సంస్థ ఆవిర్భవించింది. విదేశాల్లో పనిచేసే ఏ ఒక్కరికీ వాళ్ళ అసలు పేర్లు ఉండవు.
విదేశాల్లో ఉద్యోగులుగా,వ్యాపారులుగా ఇంకా వివిధ సంస్థల్లో పనిచేస్తూనే తమ అసలు కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటారు. అంతేగాక వీళ్ళకి సమాచారం ఇవ్వడానికి ఒక నెట్ వర్క్ ని తయారు చేసుకుంటారు. వీళ్ళని asset అని పిలుస్తారు.
విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్ని జరిపే ముఖ్య నాయకుల కి దగ్గరగా ఉండే వ్యక్తుల్ని,లేదా ఇతర వృత్తుల్లో ఉండి తమకి పనికి వస్తారనుకునే వాళ్ళని కూడా తమకి ఇంఫార్మర్ లుగా ఉండడానికి నియమించుకుంటారు.దాని కోసం అవసరమైతే వాళ్ళ బిజినెస్ లకి పెట్టుబడులు కూడా పెడతారు.కొన్నిసార్లు వాళ్ళకి అవసరమైన పనులు ఉంటే చేసిపెడతారు.
ఉదాహరణకి కెనడా లోని ఉదంతం చెప్పాలి. ఖలిస్తాన్ ఉద్యమానికి విరివిగా నిధులు వసూలు చేస్తూ అమెరికా ఇంకా కెనడా లో నుంచి భారత్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించే ఒక ప్రముఖుని తో చర్చలు జరిపిన ఒక రా ఏజెంట్, అతడి టీం నుంచే ఒక మోల్ ని ఎలా తయారుచేసాడు అనేది ఈ పుస్తకం లో చదవవచ్చు.
సినిమాలో చూస్తున్నట్లు అరుపులు, పెడబొబ్బలు లాంటివి ఏమీ ఉండవు. ఎనభైవ దశకం లో ఫిజీ దేశం లో మహేంద్ర చౌధురి అనే భారతీయ సంతతి వ్యక్తి దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.దాన్ని గిట్టని స్థానిక జాతీయుడైన ఆ దేశపు ఉన్నత సైనికాధికారి సితివేని రబూకా పార్లమెంట్ లోకి సైనికులతో చొచ్చుకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని బంధించి తను గద్దెనెక్కాడు.
అంతేగాక భారతీయులందరూ ఫిజీ విడిచిపెట్టి పోవాలని హుకుం జారీ చేశాడు. భారతీయుల ఆస్తుల్ని కొల్లగొట్టమని అనుచరుల్ని రెచ్చగొట్టాడు. అక్కడ ఉండలేని పరిస్థితి కల్పించాడు. కైలాష్ సింగ్ అనే రా ఏజెంట్ కి మన ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూడమని చెప్పడం తో తను ఫిజీ రాజధాని సువా లో అడుగుపెట్టాడు. అనేక రకాలైన సమాచారాన్ని సేకరించిన దాని మీదట ఈ కుట్ర వెనుక ఒక శత్రుదేశం హస్తం ఉందని అర్థం అయింది.
తగిన ప్లాన్ ని రూపొందించాడు. ఆస్ట్రేలియా,న్యూజి లాండ్ లోని నెట్ వర్క్ ని సిద్ధం చేశాడు.లండన్ లో వున్న ఓ పెద్ద వ్యాపారికి ఫోన్ చేసి ఎవరెవరికి ఎంత డబ్బు పంపించాలనేది చెప్పాడు. ఈ లోపు రబూకా యొక్క బలహీనతల్ని పసిగట్టారు.
యూరోపియన్ వేశ్యలు అతగాడి ప్రధాన బలహీనత. అక్కడి మీడియా కి పెద్ద ఎత్తున నిధులు అందాయి.వాళ్ళు ఈ కోణం లో అనేక కథనాల్ని ఒండి వార్చారు.అంతేగాక రెడ్ హేండెడ్ గా దొరికిన వీడియోల్ని బయటకి వదిలారు.
దాంతో రబూకా ప్రతిష్ట మసకబారింది. వత్తిడి పెరగడం తో మళ్ళీ ఎన్నికలు పెట్టడం జరిగింది. ఈసారి రబూకా చిత్తుగా ఓడిపోయాడు. భారతీయులకి అనుకూలమైన ప్రభుత్వం నెలకొల్పబడింది.
ఆఫ్ఘనిస్థాన్ లో మసూద్ అనుచరులు తాలిబన్ చేజిక్కించుకున్న పట్టణాల్ని తిరిగిపొందడం లో రా ఏజెంట్లు ఎలా సహకరించారు అనేది తెలుసుకొవచ్చు.ఆయుధ సరఫరా జరగడం లోనూ,వివిధ గ్రూపుల మధ్య అగ్నికి ఆజ్యం పోయడం లోనూ ఎలా వ్యవహరించాయో తెలుసుకోవచ్చు.
ఆ పిమ్మట ఇపుడు తాలిబన్ లు వాళ్ళ ప్రభుత్వం నెలకొల్పి మన ప్రభుత్వం తో చక్కటి సంభందాలు ఏర్పరుచుకున్నారు. దీన్నిబట్టి తెలిసేది ఏమంటే శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు.
ఇక శ్రీలంక విషయం లో తమిళ్ టైగర్ల కి మన దేశం లోనే రా శిక్షణ ఇవ్వడం,వివిధ తమిళ గ్రూపుల్ని ప్రభావితం చేయడం లో జరిగిన సంఘటనల్ని తెలుసుకోవచ్చు.
ఎయిర్ ఇండియాబోయింగ్747 (Kanishka) ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు 1985 లో పేల్చివేసి 300 మంది చావు కి కారణమయ్యారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని రా ఏజెంట్లు ముందుగానే పసిగట్టి ఢిల్లీ కి పంపించినప్పటికీ ఒక ఉన్నత అధికారి నిర్లక్ష్యం చేసి పట్టించుకోకపోవడం వల్ల అది జరిగిందని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.
అలాగే కేంద్ర సచివాలయం లో జాయింట్ సెక్రెటరి హోదా లో పనిచేస్తోన్న ఒక అధికారి అమెరికా గూఢచారులకి సమాచారాన్ని పంపిస్తున్న వైనాన్ని కనిపెట్టి అతని డ్రైవర్ ద్వారా ట్రాప్ చేసి దేశం విడిచి పోయేలా చేయడం జరుగుతుంది. అక్కడ ఓ రోడ్డు ప్రమాదం లో ఆయన మరణిస్తాడు.
అలా దొరికినవారిని కొన్నిసార్లు డబుల్ ఏజెంట్ గా మార్చడమూ ఉంటుంది. ఉగ్రవాదుల గ్రూపు ల్లోకి మనుషుల్ని చొప్పించి పై నాయకత్వం లో విభేదాలు సృష్టించడమూ చేస్తారు.
నేపాల్ లో పాకిస్తాన్ గూఢచారుల నెట్ వర్క్ ని విచ్చిన్నం చేసి బోర్డర్ లో జరిగే కార్యకలాపాల్ని తగ్గించడానికి గాను వేసే ఎత్తుగడలు ఆసక్తిగా ఉంటాయి. పై స్థాయి నాయకులకి అందే పెద్ద మొత్తాల్ని కింది స్థాయి వారికి తెలిసేలా బ్యాంక్ అకౌంట్లని వెల్లడి చేయడం తో వాళ్ళలో వాళ్ళు అంతర్గతంగా కొట్టుకుని చస్తుంటారు.
ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాల్ని ఈ పుస్తకం లో చదవవచ్చు.
ఈ పుస్తకం రాసే క్రమం లో యతీష్ యాదవ్ కొంతమంది రా ఏజెంట్లని కలిశారు. విశ్రాంత ఉద్యోగుల్ని కలిశారు. ప్రభుత్వ శాఖల్ని సంప్రదించారు.
అనుభవజ్ఞులైన ఇతర దేశాల ఏజెంట్లనీ కలిశారు. ఏది ఏమైనా మొదటిసారిగా ఇలాంటి ఒక విషయం మీద పుస్తకం రావడం మాత్రం విశేషమే!వెస్ట్ ల్యాండ్ వారు ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ.699/- , స్పై ఆపరేషన్స్ పట్ల ఉత్సూకత ఉండే పాఠకుల్ని ఈ పుస్తకం బాగా అలరిస్తుంది.
---మూర్తి కెవివిఎస్
.jpg)

No comments:
Post a Comment