Wednesday, July 29, 2026

RORSCHACH ...ఈ స్పెల్లింగ్ ని ఎలా ఉచ్ఛరించాలి


 RORSCHACH ...ఈ స్పెల్లింగ్ ని చూడగానే ఎలా ఉచ్ఛరించాలి అని కాసేపు ఆలోచన రావడం సహజమే. దీన్ని రోర్షాక్ అని అనాలి. ఒక స్విస్ శాస్త్రవేత్త యొక్క సర్ నేం. 1921 నుంచి ఈ పేరు మానసికశాస్త్రం తో పరిచయం ఉన్నవారికి ఎక్కడో తగులుతుంది. రోర్షాక్ సైకలాజికల్ టెస్ట్ అనేది కొన్ని రకాల మానసిక రోగులపై జరుపుతారు.పది తెల్లని కార్డుల్ని తీసుకుని వాటి మీద ఇంక్ ని ఇష్టం వచ్చినట్లు చల్లుతారు. ఆ కార్డుల్ని రోగి కి చూపించి వాటిల్లో తనకి ఎలాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. తన మెదడులో ఏ ఊహలు వస్తున్నాయి అనేది ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పమని అడుగుతారు. ఈ ప్రక్రియ ని హెర్మన్ రోర్షాక్ మొదలుపెట్టడం వల్ల దీనికి ఆయన పేరునే పెట్టారన్నమాట.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రెండురోజుల క్రితం ఓ మళయాళ సినిమా చూశాను.దానిపేరు రోర్షాక్. మమ్ముట్టి హీరో. 2022 లో విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి విజయమే సొంతం చేసుకుంది. అసలు ఇలాంటి ఒక టైటిల్ ని మనం తెలుగు లో ఊహించగలమా? కథ విన్నూత్నమైన విధానం లో సాగుతుంది. నిసాం బషీర్ దర్శకుడు.ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాలి. మమ్ముట్టి గాని,మోహన్ లాల్ గాని..అగ్ర హీరోలు కూడా సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు.

అందుకే మళయాళం లో తక్కువ బడ్జెట్ తో వెరైటీ సినిమాలు వస్తాయి. ఈ ఓటిటి ల పుణ్యమా అని అవన్నీ చూస్తుంటే అక్కడి ఆడియన్స్ యొక్క పరిణితి కూడా అర్థమవుతుంది. సినిమా కథ రివెంజ్ కి సంభందించినదే అయినప్పటికి తీసిన విధానం చివరి దాకా కూర్చోబెడుతుంది. లూక్ ఆంటోనీ అనే దుబాయ్ లో ఉండే వ్యాపారి కేరళ లోని చలకుడి సమీపం లోని చిన్న గ్రామం లో ఓ ఇల్లు కొని ఒంటరిగా ఉంటూంటాడు. అది ఊరికి దూరంగా ఉంటుంది.తన భార్య సోఫి ఆక్సిడెంట్ లో మరణించినట్లు స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.

బాలన్ అనే వ్యక్తి కి సంభందించిన కుటుంబం లో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటి వెనుక లూక్ ఆంటోనీ ఉన్నాడనే అనుమానం ఎక్కడా రాదు, ఒక్కొక్క ముడి చివరికి విప్పుతూ సినిమా ఆఖరికి వచ్చేసరికి ఆశ్చర్యపోతాము.కళ్ళకి ఇంపైన పచ్చని ప్రకృతి ...ఆ ఊరిలో దృశ్యాలు బాగున్నాయి.పూర్తిగా కథ చెబితే బాగుండదు. ఈ సినిమాని వీలైతే చూడండి,చక్కని రోటీన్ కి భిన్నం గా ఉన్న సినిమా చూసిన  అనుభూతి కలుగుతుంది.  Available on JioHotstar.

No comments:

Post a Comment