ఈ రాక్షస గూళ్ళు గురించి బయటి ప్రపంచానికి తెలుసా..?పెద్దగా తెలియదనే అనుకొంటున్నాను.భద్రాచలం డివిజన్ కేంద్రానికి కి సుమారు 40 కి.మి.దూరం వుంటుంది కలివేరు అనే గ్రామం.ఇది చర్ల మండలం లో వుంటుంది.ఇక్కడ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఓ గుట్ట మీద "రాక్షస గుళ్ళు" ఉన్నట్లుగా నరేంద్ర బాబు అనే మిత్రుడు చెప్పగా గత ఆదివారం వెళ్ళాను.రాక్షస గుళ్ళు అంటే పాత రాతి యుగం లోను ,కొత్త రాతి యుగం లోను అప్పటి మానవులు నిర్మించిన సమాధులు.
వీటిలో మళ్ళీ monolithic burials ,megalithic burials అని రెండు రకాలు గా పరిశోధకులు విభజించారు.గుట్టని పెద్ద ప్రయాస లేకుండానే ఎక్కాము.ఆ గుట్ట మధ్య లోనుంచి ఒక కాలి బాట వుంది.అటు ఇటు అడవి బాగానే వుంది. ఆ బాటకి ఇరువైపులా కొన్ని గూళ్ళు చూశాము.అవి చాలా వరకు శిధిల స్థితికి చేరుకున్నాయి.చాలా వరకు తవ్వి ఆ రాళ్ళని ఇళ్ళ నిర్మాణం లో ఉపయోగించుకున్నట్లు అనిపించింది.కొన్ని రాళ్ళని చిన్న కంకరగా కొట్టి ఓ రాశి పోశారు.పాపం వాళ్ళకి ఏం తెలుసు వాటి ప్రాధాన్యత..?
మొదట కొన్ని మాత్రమే ఉన్నాయేమో అనుకున్నాము.ఆ దారిన వెళ్ళే సమీప గ్రామం లోని ఒక వృద్దుణ్ణి అడిగితే లోపలికి అడవిలోకి వెళ్ళగలిగితే కొన్ని వందల రాక్షస గూళ్ళు వున్నాయని తెలిపాడు.మేము చూసిన వాటిలో కొన్నిటిని జనాలు బాగా ధ్వంసం చేశారు.కొన్నిటికి పై నున్న రాతి పలకలు ,ఇంకొన్నిటికి కన్నాలు పెట్టి వున్నాయి. మరి కొన్నిటికి లోపలి గుండ్రటి రాళ్ళు పైకి వచ్చేసాయి.ఇంకొన్ని భూమిలోపలికి కుంగి వున్నాయి.
సమీప ప్రజలు ఈ రాక్షస గూళ్ళని పాండవుల సమాధులుగా అభివర్ణిస్తారు. అయితే ఇవి కొత్త రాతి యుగానికి చెందిన megalithic type సమాధులుగా నాకు తోచాయి.నాలుగు వైపులా రాతి పలకల్ని పెట్టి వాటి పైన పెద్ద రాతి పలకని కప్పుతారు.ఇవి ఆ కోవ లొనికి చెందినవే...అయితే శిధిలం కావడం మూలాన ఆకారాలు దెబ్బతిన్నాయి.
"Rectangular dolmens" ఆకారం లో కనిపిస్తున్నాయి నిశితంగా పరిశీలిస్తే..!ఇలాంటి సమాధులు ఉన్న చుట్టు ప్రక్క వూర్లకి ఆ వూరి పేరులో "వీర" అనే పేరు వుంటుందని Babington అనే పురాతత్వవేత్త ఒక Monograph లో రాసినట్టు గుర్తు.వీరుల పాడు,వీరా పురం...ఇలానన్న మాట.బహుశా ఇక్కడున్న "కలివేరు" అనే ఊరిపేరు "కలి వీర" లేదా "కరి వీర" అనే పదం నుంచి వుండవచ్చునని అనిపించింది.
ఆంధ్ర దేశం లో మహబూబ్ నగర్,కరీం నగర్,కృష్ణ లాంటి జిల్లాల్లో వీటిని ఇప్పటికే కనుగొన్నారు.భారత దేశం లో తమిళనాడు లోని అడిచానల్లుర్ లో మొదటిగా ఈ తరహావి కనుగొన్నారు.ఈ కలివేరు లోనివి బహుశా క్రి.పూ.3500-1500 మధ్యలోనివి కావచ్చునని నా భావన.
గుట్ట దాదాపుగా రెండు మైళ్ళ పొడవుంటే ...వీటంతటా ఇవి పరుచుకొని వుండడం ఆశ్చర్యకరం. పరిశోధకులు రంగం లోకి దిగితే కొత్త విషయాలు బయటపడవచ్చు.ఈ అమూలమైన చారిత్రక అవశేషాలని పదిల పరచవలసిన అవసరం ఎంతైనా వుంది.
No comments:
Post a Comment