Saturday, November 22, 2014

సంజీవ్ దేవ్ గారు-కొన్ని జ్ఞాపకాలు

సంజీవ్ దేవ్ గారు-కొన్ని జ్ఞాపకాలు

అవి 1984-87 మధ్య రోజులు.డిగ్రీ చదువుతున్న రోజులు.లైబ్రరీ కి వెళ్ళడం,పుస్తకాలు చదవడం అదే ప్రధాన వ్యాపకం గా ఉండేది.క్లాసు పుస్తకాలు ఎక్కువగా పరీక్షలప్పుడే పట్టుకునేవాడిని.ఒక రోజు "తెగిన జ్ఞాపకాలు" అనే సంజీవ్  దేవ్ గారి పుస్తకం చదివాను.ఎందుకనో గాని పాపులర్ నవలని కూడా అంత వేగంగా చదవలేదు నేను..అంతగా అలరించింది.ఆ తర్వాత " రసరేఖలు" అని చెప్పి ఆయనదే ఇంకో పుస్తకం చదివాను.ఒక రచయితని కలవాలని అనుకున్నది మొదటిసారిగా అప్పుడే.ఆ పుస్తకాల ద్వారా ఆయన ఆ రోజుల్లోనే నన్ను వర్చ్యువల్ టూర్ కి అలా తీసుకెళ్ళిపోయారు.ఎంత సరళత.. నిరాడంబరత ఆ శైలి.మళ్ళీ ఒక ఏదో తెలియని గంభీరత కూడానూ.కులూ,మనాలి లోయల్లో విహారం,నికొలాయ్ రోరిక్ వద్ద శిష్యరికం..ఆసిత్ కుమార్ హల్దార్ వద్ద,కుమారస్వామి వద్ద చిత్ర లేఖనం లో సొబగుల పరిశీలన...రవీంద్రుని వద్ద సాంగత్యం..ఇంకా ఒకటనా..రైలు ప్రయాణం లో ఆయన రకరకాల అనుభవాలు..నన్ను ఎక్కడికో తీసుకొని పోయినాయి.ఇల్లు విడిచి అంత చిన్న వయసులో ఎటువంటి జ్ఞానాన్వేషణ..!నాకు అబ్బురంగా తోచింది.

ఆయన చిరునామా కోసం పుస్తకాల్లో వెతికెతే ఎక్కడా లేదు.ఎలాగబ్బా..ఈయనకి ఎలాగైనా నేను ఒక లేఖ రాసి తీరవలసిందే అని తీర్మానించుకున్నాను.

ఓసారి మొత్తానికి ఆ తరుణం రానే వచ్చింది.రాళ్ళబండి కవితాప్రసాద్ గారు మాగంటి సూర్యం గారు నిర్వహించిన ఓ సాహితీ కార్యక్రమం లో కనబడితే అడిగాను..సంజీవ్ దేవ్ గారి అడ్రస్ ఏమైనా తెలుసా అని.దేవ్ గారి పేరు రాసి తుమ్మపూడి పోస్ట్ ,గుంటూరు జిల్లా అంటే చాలు వెళ్ళిపోతుంది అని చెప్పారు.వెంటనే ఆయనకి లేఖ రాసి పోస్ట్ చేశాను.

ఆశ్చర్యంగా ఆయన వారం లోపులోనే నాకు జవాబిచ్చారు.అలా మా స్నేహం ఎన్ని లేఖలకి దారి తీసిందో..ఎన్ని విశేషాల్ని చెప్పుకున్నామో.ఆ అక్షరాలు చూస్తే చాలు ఆ పూటకి అన్నం తినక్ఖర్లేదు.అంత అందంగా ఉంటుంది ఆయన చేతి రాత.కొన్ని సార్లు  ఆ లేఖ తో పాటు కొన్ని చిత్రాలు కూడా వేసి పంపేవారు.నిజానికి ఆయన నాకంటే ఇంచుమించు అప్పటికి నలభై ఏళ్ళు పెద్దవారు.అయినా నన్ను ఒక పిల్లవానిలా కాక స్నేహితుని లానే భావించేవారు.అసలు మంచితనం అనేది మూర్తీభవించి ఏ వ్యక్తి లో నైనా ఉన్నదా అంటే నేను ఇప్పటికి సంజీవ్ దేవ్ గారినే ఉదాహరణ గా చెబుతాను.అంత మృదు స్వభావి.

ఆయనతో నా బంధం బాగా పెనవేసుకోవడానికి ఇంకో కారణం ఆయనకి మల్లేనే నాకు కూడా ఇంగ్లీష్ సాహిత్యం అంటే పిచ్చి.ఒకసారి ముసురుపట్టిన రోజున నేను తుమ్మపూడి లో దిగాను.జోరున వర్షం.వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు.భోజనం చేశాను.ఆయన రీడింగ్ రూం లో చాలా పుస్తకాల గురించి ముచ్చటించాము.పూర్వీకులు కట్టించిన భవంతి ఇది..నేనైతే ఇప్పుడు కట్టించలేను అంటూ తన మీద తనే హాస్యంగా చెప్పారు. ముల్క్ రాజ్ ఆనంద్ గురిచి చెప్పారు.ఆర్కె నారాయణ్ కంటే ముందు ఆయన్ని చదువు అని చెప్పారు.

ఆ తర్వాత కాలం లో కనీసం ఒక వంద ఉత్తరాలైనా మేము రాసుకొని ఉంటాము.నా "స్పర్శ" అనే కవితా సంపుటికి కూడా ఆయన ముందు మాట రాశారు.దానిలో ఒక కవితా ఆయనకి చాలా ఇష్టం..దాని గురించి ప్రత్యేకంగా ఓ టపా రాస్తాను.Click here

No comments:

Post a Comment