Wednesday, May 6, 2015

సిడ్నీ షెల్డన్ మరో నవల Master of the Game గూర్చికొన్ని విషయాలు..!

సిడ్నీ షెల్డన్ మరో నవల Master of the Game గూర్చికొన్ని విషయాలు..!


థ్రిల్లర్స్ విషయం లో సిడ్నీ షెల్డన్ యొక్క ప్రత్యేకతే వేరు.గతం లో కొన్ని నవలలు పరిచయం చేశానుగదా..!ఈ సారి Master of the Game అని చెప్పి దాని గురించి చర్చించుకుందాము.ఈ నవల పూర్తయిన తరవాత అనిపించింది.అసలు సెంటిమెంట్ రాయాలన్నా కూడా ఘటికులే వీళ్ళు.అయితే వ్యక్తీకరణ రూపం లో తేడా అనిపిస్తుంది.అది నిజజీవిత వాతావరణానికి దగ్గరగా ఉంటుంది.సంపద కోసం చేసే పోరులో పడే కష్టం లో రాక్షసంగా పోతుంటారు.ఈ నవల దక్షిణాఫ్రికా భూమికగా జరుగుతూంటుంది.అక్కడ గల వజ్రాల గనుల్లోకి లోకి వచ్చి సంపన్నులుగా కావాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.18 శతాబ్దం తో కధ ఆరంభం అవుతుంది.

ఈ నవలని సిడ్నీ షెల్డన్ అతని సోదరునికి అంకితమిచ్చాడు.ముందు పేజీలో రెండే రెండు వాక్యాల్లో ఎంత పవర్ఫుల్ గా అంటాడొ ఆ మాటల్ని." For my brother,Richard-The lion hearted" ( సిమ్హ హృదయుడైన నా సోదరుడు రిచర్డ్ కోసం) ..!

ప్రొలోగ్,ఆంగ్ల నవల్లో ఇది ఓ షరా మామూలు.. 1982 లో సాగుతూంటుంది.Kate Blackwell తన తొంభైవ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటూ ఉంటుంది.ప్రపంచం లోని గొప్ప పారిశ్రామికవేత్తల లో ఆమె ఒకరు.స్కాటిష్,డచ్ తల్లి దండ్రుల సంతానం ఆమె.ఎంతోమంది ఆ వేడుకలో ఫాల్గొంటున్నప్పటికీ ఆమె అది పరికిస్తూ గత కాలపు జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఉంటుంది.అదిగో అలా స్వాతిముత్యం లో కమల్ హాసన్ మాదిరిగా తన గతం గూర్చి యోచిస్తూండగా ఇహ మన అసలు కధ 1883 నుంచి మొదలు అవుతుంది.అన్నట్లు ఆ వేడుక లో ఆమె ముని మనవడు ఎనిమిది ఏళ్ళ  రాబర్ట్ కూడా ఫాల్గొని పియానో కచేరి చేస్తాడు.ఆమె ఎంతో సంతోషించి తన వ్యాపార బాధ్యతల్ని అప్పగించేందుకు ఒక వారసుడు దొరికినందుకు ఆహ్లాదంగా ఫీలవుతుంది.

తన తండ్రి ఎన్ని కష్టాలు పడి ఈ క్రగర్ అండ్ బ్రెట్ కంపెనీ ని స్థాపించాడు.ఆయన పోయిన తరువాత తల్లి ఎలా నడిపించుకుంటూ వచ్చింది.ఆ వజ్రాల కంపెనీ ని తాను వివిధ రంగాల్లోకి ఎలా నడిపించి వివిధ దేశాల్లో విస్తరించింది..ఇదంతా చేసి ఏ సమర్ధత లేని అనామకుల చేతిలో ఈ సంస్థల్ని పెట్టదలచుకోలేదు.ఆమె కి కలిగిన ఇద్దరి కుమార్తెల్లో ఏ ఒక్కరికీ కట్టబెట్టలేకపోయింది.ఆ కధంతా ముందు వస్తుంది.

సరే....ప్రొలోగ్ నుంచి మొదటి చాప్టర్ లోకి వద్దాము.Jamie McGregar (1883-1906) స్కాట్ లాండ్ లోని ఒక చిన్న ఊరి లో ఉండే పద్దెనిమిది ఏళ్ళ యువకుడు.దక్షిణాఫ్రికా లోని వజ్రాల గనుల గూర్చి విని ,ఎలాగైనా అక్కడకి పోయి బాగా సంపాదించాలని ఆశించి తల్లి దండ్రుల్ని ఒప్పించి బయలుదేరుతాడు.అయితే అక్కడిదాకా ఓడలో వెళ్ళాలంటే సరిపడా డబ్బులుండవు.కేవలం 50 పౌండ్లు మాత్రం ఉంటాయి.ఎలాగా అని చెప్పి లండన్ కి దగ్గర్ లోని ఎడింబర్గ్ అనే టవున్ కి వెళతాడు.అక్కడ ఒక హోటల్ సప్లయర్ గా చేరి పని చేస్తూ మరో 50 పౌండ్లు కూడబెడతాడు.ఆ పిమ్మట లండన్ కి చేరుకుంటాడు.ఎందుకంటే ఓడలు అక్కడినుంచే బయల్దేరుతుంటాయి.ఒక మహా నగరాన్ని దాని శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు.వారానికి 10 షిల్లింగులు ఖర్చయ్యే ఓ చవకైన లాడ్జి లోదిగి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ మొత్తానికి ఒక ఓడలో స్టీవార్డ్ గా పనిలోకి కుదురుతాడు.అలా కేప్ టవున్ కి చేరుకుంటాడు.దక్షిణాఫ్రికా లోని ఓ గ్రామానికి చేరుకుని KLIPDRIFT అనే ఏరియాలో ఉండటం మంచిదని నిర్ణయించుకుంటాడు.అదో చిన్న కేంప్ లాంటిది.అనేక జాతుల వాళ్ళతో,గుడారాలతో,చిన్న దుకాణాలు ఇట్లాంటి వాటితో నానా చికాగుగా ఉంటుందది.దానిమీదట విపరీతమైన దోమలు రాత్రి పూట.పారిశుధ్యం కూడా అంతంత మాత్రం.

అక్కడ ఓ డచ్ దుకాణదారుడు పరిచయం అయి వజ్రాల వేటలో సహకరిస్తానని చెప్పి తవ్వడానికి సరంజామాని ,అడివి లోకి వెళ్ళడానికి ఓ గాడిదని ఇస్తాడు.దొరికిన వజ్రాల్లో సగం సగం తీసుకుందామని కాంట్రాక్ట్ రాసుకుంటారు.ఈ డచ్ వ్యాపారి పేరు Soloman Van Der Merwe.కుక్క కష్టాలు పడి మొత్తానికి ఎలానో కొన్ని వజ్రాలు తవ్వి తీసుకురాగా ,ఈ డచ్ వ్యాపారి మోసం చేసి మొత్తం వజ్రాల్ని కొట్టేస్తాడు.అంతేగాక Jamie ని చంపించాలని చూస్తాడు.కొన ఊపిరి తో బయటబడిన అతనికి Banda అనే నల్లజాతి వ్యక్తి కలుస్తాడు.డచ్ వ్యాపారి చేతి లో ఇతనూ దెబ్బతిని ఉంటాడు.అతని కుటుంబం కూడా.అతను Jamie తో ఆ Soloman బ్యాక్ గ్రవుండ్ అంతా చెపుతాడు.ఇక్కడకొచ్చే వాళ్ళనంతా అతగాడు అలాగే మోసం చేస్తూ ఉంటాడని ,నిజానికి బాగా వజ్రాలు ఉన్న ప్రాంతాన్ని వాడు ఆక్రమించి అక్కడ ఓ ఫ్యాక్టరీ ని సైతం నడుపుతుంటాడని వెల్లడిస్తాడు.

అయితే ఇతగాడికి గుణపాఠం చెప్పకుండా వదలరాదని నిర్ణయించుకుంటాడు Jamie.చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ వజ్రాల గని వద్దకి పోయి ఇద్దరు బస్తాల కొద్దీ దొంగిలించుకు వచ్చేస్తారు.అక్కడ విపరీతమైన సెక్యూరిటి ఉంటుంది.అయినప్పటికి ఒక అర్ధరాత్రి పూట ఇద్దరు సెక్యూరిటి గార్డుల అజాగ్రత్త వీళ్ళిద్దరికి కలిసివస్తుంది.అందుకే గమ్మత్తుగా క్రగర్ అండ్ బ్రెంట్ అనే వాళ్ళ పేర్ల తోనే ఈ Jamie ఓ వజ్రాల కంపెని ని స్థాపిస్తాడు. ఆ తర్వాత క్రమ పద్ధతిలో డచ్ వ్యాపారిని చావుదెబ్బ తీస్తాడు.అదంతా చదువుతేనే ఆహ్లాదంగా ఉంటుంది.అతని కుమార్తె మార్గరెట్ ద్వారా ఒక మగబిడ్డ కి తండ్రి అవుతాడు.అయితే వీళ్ళిద్దర్నీ ఇంట్లో ఎలాగో ఉంచుకున్నా మామ కి తగిన పరిహారం చేయాలనే ఉద్దేశ్యం తో భార్యని ఒక పనిమనిషి గా ట్రీట్ చేస్తూ పెద్దగా పట్టించుకోడు.వ్యాపారం లో బాగా పైకి వచ్చి ఆ ఊరి ప్రముఖునిగా మారతాడు Jamie.ఇక్కడ ఒక సెంట్ మెంట్ సీను గమ్మత్తుగా తెలుగు సినిమా ని గుర్తుకు తెస్తుంది.ఒక అర్ధరాత్రి పూట కొడుకు ఊయల్లో  ఏడుస్తూంటాడు.అప్పటికి మార్గరెట్ ఇంట్లొకి రాదు. ఆ పిల్లాణ్ణి ఇంట్లో చూసుకుంటూ ఉండే గవర్నెస్ ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది.ఎందుకబ్బా అనుకుంటు ఆ రూం లోకి వస్తాడితను.అతణ్ణి చూడగానే ఊయల్లో ఏడ్చే ఆ పసివాడు వెంటనే ఏడ్పు ఆపి చిరునవ్వులు చిందిస్తుంటాడు.దగ్గరకి వెళ్ళి ఆ పసి వాని చెయ్యి పట్టుకోగానే ,అతను దృఢంగా ఆ చిన్న వేళ్ళతో తండ్రి చేతిని పట్టుకుంటాడు.వెంటనే Jamie ఒక సర్జ్ ని ఫీలవుతాడు.అవును..ఇది నా యొక్క రక్తమే ...ఈ పసి వాడే తన అన్నిటికి కూడా కొనసాగింపు.ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఇవ్వడానికి వారసులు లేకపోతే అది ఎలాంటి జీవితం..!అనిపిస్తుంది..ఇక అప్పటినుంచి ఆ కుర్రవాణ్ణి తన ఇంటిలోపలనే ఉంచి పెంచుతుంటాడు.రాత్రుళ్ళు అడవుల్లోకి వెళ్ళి అక్కడ కుమారునితో పాటు Camping చేస్తుంటాడు.విశాలమైన, చుక్కలతో మెరుస్తూ ఉండే ఆకాశం వేపు చూస్తూ ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాడు. భావి జీవితం గూర్చి శిక్షణ ఇస్తూంటాడు.ఐతే దురదృష్టవశాత్తు అక్కడి నల్లవారితో జరిగిన ఘ్రషణల్లో (వజ్రాల గని) భాగంగా ఈ కుర్రవాడు చనిపోతాడు.ఆ తరువాత పుట్టిన కుమార్తె పేరు Kate.మరి ఈమె గూర్చి వచ్చే భాగం లో తెలుసుకుండాము.
  

No comments:

Post a Comment