Wednesday, October 11, 2017

"The Adivasi will not dance" ఆంగ్ల కధా సంపుటి పై కొన్ని మాటలు...!


ఈ కధా సంపుటి ని జార్ఖండ్ రాష్ట్రం లోని సంతాల్ ఆదివాసి తెగ కి చెందిన ఒక మెడికల్ ఆఫీసర్ డా.హన్స్దా సౌవేంద్ర కుమార్ అనే ఆయన రాశారు.2015 లో ఈ పుస్తకానికి సాహిత్య అకాడెమి యువ పురస్కార్ పురస్కారం దక్కింది.
ఇనుము,బొగ్గు,ఇంకా విలువైన రాళ్ళ గనులు పుష్కలంగా ఉన్న ఆ సంతాల్ పరగణాల్లో వెలుస్తున్న పారిశ్రామిక వాడలు,వారి భూముల లో వారే పరాయి అవుతున్న తీరు,అక్కడి మార్వాడీలు,సింధీలు,మండల్ లు ఇంకా ఇతరులు  వారి వ్యాపార అభివృద్ది కోసం చేసే యత్నాలు...కలుషితం అవుతున్న సకల పర్యావరణ వనరులు,అయినా తమ రాజకీయ ప్రాబల్యం చేత యధేచ్చగా సాగిపోయే వరుస సంఘటనలు అన్నీ దీనిలో చిత్రించారు.అది మాత్రమే కాదు సంతాల్ ఆదివాసీ ల్లో చదువుకున్న వారి లో ,ఉద్యోగుల్లో వస్తోన్న పరిణామాలు ఇంకా వారి అనుభవాలు అన్నీ దీనిలో రంగరించారు.

దీని లో మొత్తం పది కధలు ఉన్నాయి.చివరి కధ యొక్క టైటిల్ ని పుస్తం పేరు గా పెట్టారు.ఈ పుస్తకం ఇంగ్లీష్ లో వచ్చినపుడు హిందూ,టైంస్ ఆఫ్ ఇండియా ,ఇంకా అనేక దేశ విదేశీ పత్రికలు ప్రశంసలు కురిపించాయి.భారతీయ సాహిత్య చరిత్ర లో ఒక కొత్త అధ్యాయం గా అభివర్ణించాయి.అయితే ఇదే పుస్తకం హిందీ లో అనువాదం కాగానే జార్ఖండ్ లో పెద్ద దూమారం రేగింది.ఒక ప్రముఖ సంతాల్ తెగ నాయకుడిని పరోక్షం గా విమర్శించారని ,స్థానిక దేవతల్ని,వ్యక్తుల్ని అవమానించారని పెద్ద ర్యాలీలు అవీ తీసి గొడవలు కావడం తో హిందీ అనువాదాన్ని ఆ రాష్ట్రం లో నిషేదించారు.అంతే కాదు రచయిత సౌవేంద్ర కుమార్ తన ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.దీనితో ఆయనకి దేశం లోని అనేకమంది మేధావులు మద్ధతు గా సంతకాల ఉద్యమం మొదలు పెట్టారు.ఆ రకంగా ఈ పుస్తకం కి మరింత పబ్లిసిటీ పెరిగింది.
సరే...ఆ కధల్ని మచ్చు కి కొన్ని చూద్దాము.టైటిల్ కధ " The Adivasi will not dance" గూర్చి చెప్పుకుందాము.ఈ కధ ని మంగల్ ముర్ము అనే సంతాల్ ఆదివాసి చెపుతుంటాడు.ఇతను ఒక డాన్స్ ట్రూప్ కి పెద్ద గా ఉంటాడు.ఆ ప్రాంతం లో ఏ ప్రముఖుడు వచ్చినా ఈయన ఆధ్వర్యం లోని బృందం అంతా వచ్చి డాన్స్ లు చేసి వారిచ్చే కానుకలు తీసుకుంటూ ఉంటాడు.అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి.సభ్యులు తగ్గిపోతూ ఉండటం తో..!వాళ్ళు ఉండే గ్రామం ఇంకా ఇతర ప్రక్కనున్న కొన్ని ప్రాంతాలు వాటిని కొంతమంది వ్యాపారులు  తమకి అప్పగించమని అవి గనుల కేంద్రాలు గా అవతరించడానికి సహకరించమని కోరగా , ఈ ప్రదేశం నుంచి ఎక్కడకీ వెళ్ళబోమని కొన్ని వందల ఏళ్ళు గా తాము ఉండే ప్రదేశాల్ని అప్పగించబోమని చెపుతారు.ఎన్నో వత్తిడులు,పోరాటాలు సాగుతాయి.ఏ అధికారి కి చెప్పినా ఎవరూ ఆలకించరు.ఏమి చెయ్యాలా ..అని ఆలోచిస్తున్న తరుణం లో ..సరిగ్గా అదే ప్రాంతానికి ఒక శంకుస్థాపన నిమిత్తం రాష్ట్రపతి వస్తున్నారని ,ఆ సమయం లో డాన్స్ ట్రూప్ తో రమ్మని అధికారులు కబురుపెడతారు.ఈ సమయాన్ని ఉపయోగించుకొని రాష్ట్రపతి కి తమ బాధలు చెప్పవచ్చునని ఆశిస్తాడు ఈ మంగల్ ముర్ము.అయితే సరిగ్గా డాన్స్ అయిపొయి తమ వినతి పత్రం ఇద్దామని వెళ్ళే తరుణానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి వీరందరిని తరిమి వేస్తారు.ఇంతకీ శంఖు స్థాపన దేనికి జరిగిందీ..అంటే తాము వ్యతిరేకించి పోరాడిన ఆ వ్యాపారులకి అనుకూలంగా ఉన్న తమ భూముల్లోనే జరిగింది.దీనికి కారణం ..ఢిల్లీ స్థాయి లో వారికి గల పలుకుబడి..పెద్దల తో వ్యాపార లావాదేవీలు..!తమ వైపు పోరాడుతారనుకున్న ఒక్కో సంఘం ఒక్కో తరుణం లో చెయ్యి ఇస్తారు.

మా భూముల్లో మమ్మల్ని నిరాశ్రయుల్ని చేసి అవే భూముల్లో మా చేత వినోద నృత్యాలు చేయిస్తారా..ఇక మీదట ఎప్పుడు ఇలాంటి వాటికి తమ ప్రజలు రాకూడదు..అని ధృఢంగా నిర్ణయించుకుంటాడు..అలా కధ చివరకి వస్తుంది.

" They eat meat అనే కధ లో ఒక సంతాల్ వ్యక్తి ..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి..అతని పేరు బీరం సొరేన్ ..అతనికి భుబనేశ్వర్ నుంచి గుజరాత్ లోని వడోదర కి బదిలీ అవుతుంది.అద్దె ఇంటి కోసం ఆ ఊరి లో తిరిగినపుడు గమ్మత్తు విషయాలు అతనికి తెలుస్తాయి.ఎక్కడికి వెళ్ళినా మాంసాహారులకి ఇళ్ళు ఇవ్వం అంటారు.ముస్లింస్,క్రైస్తవులు వారికి ఇళ్ళు ప్రత్యేక ప్రాంతాల్లో ఉంటాయి.మిగతా హిందువుల తో కలిసి ఉండవు..ఎవరూ వారికి అక్కడ అద్దెకి కూడా ఇవ్వరు.మొత్తానికి ఒక తెలుగు కుటుంబం వీరికి ఇల్లు ఇస్తుంది ..రెండు కండీషన్ల మీద...ఒకటి మాంసాహారం తిరాదు...ఇంకోటి వాళ్ళ గురించి ఎవరు అడిగినా కేవలం జార్ఖండ్ నుంచి వచ్చాము లేదా భుబనేశ్వర్ నుంచి వచ్చాము అని మాత్రమే చెప్పాలి.

అయితే ఈ కుటుంబం వారికి జిహ్వా చాపల్యం చావక వారం వారం కొద్ది దూరం లో ప్రభుత్వ క్వార్టర్ లో ఉండే తమ బంధువుల వద్ద కి వెళ్ళి తిని వస్తుంటారు..మొత్తానికి కొంత కాలానికి వీరికి శాఖాహారం బాగా అలవాటు అవుతుంది.బుద్ధి పుట్టినపుడు దొంగ చాటుగా ఒక గుడ్డు తెచ్చుకొని వాసనలు రాకుండా వండుకొని తింటూ ఉంటారు.అయితే ఆ ఇంటి ఓనర్ భార్య కూడా గుడ్లని దొంగ చాటు గా లాగిస్తూనే ఉంటుంది.మొత్తానికి అక్కడ వీళ్ళ టేస్టు లు కలిసి ఒక అంగీకారానికి వస్తారు. రోజులు హాయిగా గడుస్తూండగా ప్రసిద్ధి చెందిన గుజరాత్ అల్లర్లు చెలరేగుతాయి.దినమొక యుగంగా గడుస్తుంది.చివరకి జార్ఝండ్ కి ట్రాన్స్ఫర్ అవగా చాలా సంతోషిస్తారు..ఇక మన ఇష్టం వచ్చిన కూరల్ని తినొచ్చురా బాబూ అని..!

Mearly a whore, November is the month of migration   ఇంకా రెండు కధ ల్లో నిజం చెప్పాలంటే కొన్ని అసభ్య సన్నివేశాలు లేకపోలేదు.అయితే ఆ మేరకు చెప్పకపోతే కూడా ఆ సంధర్భాలు పండవేమో కూడా.ఏమైనా జార్ఖండ్ లోని పకూర్ జిల్లా లోని గ్రామాలు,అక్కడి గాధల్ని  మన కళ్ళ ముందు నిలబెట్టాడురచయిత.బ్యాంక్ లో ఉద్యోగి గా పనిచేస్తూ ఒక స్కాం లో ఇతరులతో కలిసి ముందుకెళ్ళే సందర్భం లో అతని ఇంట్లోని ఒక వృద్ధుడు ముందు చూపు తో హెచ్చరించడం ఆలోచింప చేస్తుంది.సంతాల్ తెగ కి చెందిన ముఖ్య మంత్రి మధు కోడా లాంటి వాడినే ఎలా ఇతరులు వాడుకొని మైనింగ్ కేసు లో జైలు కి వెళ్ళాలా చేశారో నీకు తెలుసా ..దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అని ఒక పాత్ర అంటుంది.అమెజాన్ లో దొరుకుతుంది..వీలైతే చదవండి... Murthy KVVS.   

No comments:

Post a Comment