Thursday, March 29, 2018

దంతెవాడ (కధ) --మూర్తి కె.వి.వి.ఎస్.

దంతెవాడ (కధ)
 --మూర్తి కె.వి.వి.ఎస్.

కుంటకి చేరుకునేసరికి రమారమి ఉదయం పది అయింది.బస్ ఊరి పొలిమేరలోనే ఆగింది...బస్ స్టాండ్ లో కాకుండా!చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన బస్సులు మాత్రమే ఆ స్టాండ్ దాకా అనుమతింప బడతాయిట.ఆ తర్వాత తెలిసింది.భద్రాచలం నుంచి కుంట సుమారు గా అరవై అయిదు కిలో మీటర్లు ఉంటుంది.ఆ ఊరు ఉండేది చత్తీస్ ఘడ్ లో అయినా తెలుగువాళ్ళు ఎక్కువ కావడం మూలాన వాళ్ళు ఇక్కడ భద్రాచలం డివిజన్ ప్రాంతం తో అవినాభావ సంబంధం కలిగిఉండేవారు.వ్యాపారాలకో ,ఉద్యోగాలకో ,వ్యవసాయానికో అక్కడికి వెళ్ళిన తెలుగు కుటుంబాల పిల్లలు ఇక్కడకి వచ్చినప్పుడల్లా అక్కడి విశేషాలు తెలుస్తుండేవి. అయితే ఇప్పుడంతా పరిస్థితులు మారిపోయినవి.దుమ్ముగూడెం,చర్ల ,వెంకటాపురం ఇలా డివిజన్ లోని ఏ మండలం నుంచి అడ్డంగా పడిపోయినా కొంతసేపటికి చత్తీస్ ఘడ్ లోని ఏదో ఊరికి చేరుకుంటాము.

బస్ దిగి అలా ఊళ్ళోకి మెల్ల గా నడవసాగాడు శ్రీను.కుంట మరీ గ్రామం కాదు,అలా అని పెద్ద పట్టణమూ కాదు.చాలా రాష్ట్రాల్లో మాదిరిగా ఇంకా అడవుల విధ్వంసం మొదలవలేదు ఇక్కడ. అందుకనే కాబోలు నలువేపులనుంచి చల్లని స్పర్శతో కూడిన గాలులు హాయిగా శరీరాన్ని తాకుతున్నాయి.వీధులు శుభ్రంగా ఉన్నాయి.ఇరువేపులా ఎలాంటి మానవ విసర్జితాలూ లేకుండా...! ఒక ప్రదేశం లోని సభ్యతా సంస్కారాలు ఇలాంటి చిన్న విషయాల్లోనే వెల్లడవుతుంటాయి.ఎర్రని నేల.ఊరినిండా పచ్చదనం.కాంక్రీట్ రోడ్ కి అటూ ఇటూ దుఖాణాలు.డాబాలు ఉన్నాయి.పెంకిటిళ్ళూ ఉన్నాయి.కొన్ని రెండు మూడూ అంతస్థుల ఇళ్ళు...అలా ఆ రోడ్డు గుండా తిన్నగా వెళ్ళి ఎడమ వేపు తిరగ్గా అక్కడ బస్ స్టాండ్ కనిపించింది. దానికి ఒక పక్కగా ఒక చిన్న ఇడ్లీ బండి కనిపించింది.

" ఏక్ చాయ్ లావ్ భాయ్" అన్నాడు శ్రీను.

ఒక గ్లాస్ లో నిండుగా పోసి ఇచ్చాడు ఆ టీ బండి వాలా..!చాలా వేడిగా ఉంది.ఊదుకుంటూ మధ్య మద్య లో కొద్దిగా సమయం తీసుకుంటూ తాగుతున్నాడు శ్రీను..!

" తెలుగు వాళ్ళా" అడిగాడు ఆ బండి యజమాని.తాగే టీ లోపలకెళ్ళి పొలమారింది శ్రీనుకి.

" అవును ..ఏంటి మీకు తెలుగు వచ్చా " అన్నాడు.

" మెం తెలుగు వాళ్ళమేనండి ..వ్యాపారం మీద ఇటు వచ్చేశాం"

" అలాగా ..ఏ ఊరు మీది"

" అసలు మా పూర్వీకులది తూ గో జి జిల్లా రాజోలు అండి...భద్రాచలం లో బ్రిడ్జ్ కట్టే సమయం లో పనికోసం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.అక్కడి నుంచి క్రమేపి మేము ఇక్కడ హోటల్ పెట్టుకుందామని వచ్చాము.వచ్చి సుమారు గా ఏడేళ్ళు అవుతోంది " అన్నాడాయన.


"ఏం ..ఏడు సంవత్సరాలు! దాదాపు గా పది ఏళ్ళు దాటుతోంది " అంతలోనే అతని భార్య అందుకొని అన్నది.అలా అనేసి దగ్గర్లో ఉన్న బోరింగ్ దగ్గర కెళ్ళింది నీళ్ళ బిందె తీసుకురావడానికి.

" ఆ..ఆ..అవుద్దండి...అసలు సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయో  అర్ధం కావట్లేదు.యమ స్పీడ్ గా ఎల్లిపోతందండి కాలం" అన్నాడతను.

" ఫర్లేదా ..ఎలా ఉంది బిజినెస్..."

" మన వైపు వేసే దోసె అంటే చచ్చిపోతారండీ ఇటు"

" అయితే ఓకె అన్నమాట.అన్నట్టు రామ్మోహన్ అని ఒక మాస్టార్ ..ఇక్కడ ...ఏమైనా ఐడియా ఉందా మీకు " డబ్బులిస్తూ అడిగాడు శ్రీను.

" ఆ..గుర్జీ...అండి..!తెలియదు కాని ఇలా ముందు నుంచి వెళ్ళిపోయి ..ఆ మూలమలుపు దగ్గర ఇళ్ళలో ఎవరినైనా అడగండి ..గుర్జీ లు అక్కడ కొంతమంది ఉన్నట్లున్నారు "

గుర్జీ ..ఏంటబ్బా..? అనుకున్నాడు.అంతలోనే తట్టింది అది గురూజీ కి వచ్చిన తిప్పలని.  
మొత్తానికి రామ్మోహన్ ఇల్లు ఈజీగానే దొరికింది.ఒక చిన్న సంస్థానం లా ఉంది.ముందు బిజినెస్ కాంప్లెక్స్ లా కొన్ని పోర్షన్లు ఉన్నాయి.దాని పక్కనుంచి వెళితే ఆయన ఇల్లు ఉంది.మంచి గార్డెన్ ఉంది...దాని ముందు.విశాలంగా హాయి గా ఉంది ఆ నివాసం.లోనికి వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించాడు రామ్మోహన్.లోపల ఇల్లు అదీ చూస్తే మంచి టేస్టే ఉందీయనకి అనిపించింది.

కుశల ప్రశ్నలు అయినతర్వాత ఫ్రెష్ అయ్యాడు శ్రీను  .ఆ తర్వాత  అతని కాసేపు విశ్రాంతి తీసుకోమని ఓ రూం లోకి పంపాడు.అలసట గా ఉందేమో శరీరం ..పన్నెండు గంటలకి గాని మెలకువ వచ్చింది.హాల్లోకి వచ్చి కూర్చున్నాడు శ్రీను


" మీ గురించి మా బావ గారు ఫోన్ చేశారు" నవ్వుతూ చెప్పాడు రామ్మోహన్.కాదు నేనే చేయించాను అందాం అనుకొని ఆగిపోయాడుశ్రీను.
.లోపలకి వెళ్ళి భార్య కి వంట చేయమని పురమాయించి అతని కొడుకు ని తీసుకొచ్చి శ్రీను కి పరిచయం చేశాడు రామ్మోహన్.

" వీడు మా చిన్నాడు...ఇక్కడే టెంత్ చదువుతున్నాడు హిందీ మీడియం.అలాగే మాకు వ్యాపారం లో కూడా సహకరిస్తుంటాడు "

" అదేమిటి...మీరు మాస్టారు గదా ఇక్కడ"

" మా బావ గారు చెప్పాడా...కరక్టే.కాని ఇక్కడ బడిపంతుళ్ళకి అంత జీతాలేమీ ఉండవండి.నేను సిమెంట్ షాప్ చూసుకుంటాను.మా ఆవిడ కిరాణం షాప్ ..అంతా మా ఎదురు కాంప్లెక్స్ లోనే"

" మరి బడికి వెళ్ళకపోతే ఎలా... సమస్య కాదా "

" భలే వారే...అసలు వెళితేనే సమస్య"

" అదేమిటి.."

" నేను చేసేది కుంట బ్లాక్ లోని ఒక గ్రామంలో...అక్కడకి రోజు వెళితే అలా రావద్దని అనే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు."లోపల వాళ్ళ"  ప్రభావం ఎక్కువ లెండి.ఇంకో వైపు ఊళ్ళో వాళ్ళతో కొద్దిగా ఎక్కువ సాన్నిహిత్యం గా ఉన్నా పోలీస్ ల కన్ను ఉంటుంది.ఎందుకొచ్చిన తంటాలు మనకి...అవన్నీ అవసరమా..?అందుకే నెలకి ఒకటి రెండుసార్లు ఊర్లో పెద్దలకి కనబడి వచ్చేస్తుంటాను"

"ఓహో ఆ సమస్య ఉందా.. మరి మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు..చెప్పలేదు"

" చెన్నై లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు "

" ఎందుకు..ఇక్కడ దగ్గర్లో జగ్దల్ పూర్ లో ఆ కాలేజీలు లేవా"

" ఉన్నాయిలే గాని..బయట ప్రపంచం కూడా తెలియాలిగదా పిల్లలకి " ఎందుకనో అసలు కారణం అది కాదనిపించింది.రెట్టించదలచలేదు.

అంతలోనే వాళ్ళవిడ వచ్చి వంట సిద్ధమయినట్లు తెలిపింది.మాటల్లో పడి కాలాన్ని గమనించలేదు.ఒంటి గంట కావస్తున్నది.తను లేస్తూ శ్రీను వేపు తిరిగి అడిగాడు రామ్మోహన్ " అన్నట్లు శ్రీను గారు ..ఒక బీర్ ఏమైనా తీసుకుంటారా" అని.

" హ్మ్..ఎప్పుడైనా...రేర్ గా"

" పదండి" అంటూ ఇద్దరూ కలసి ఎదురు గా ఉన్న కాంప్లెక్స్ లో ఒక రూం లోకి వెళ్ళారు.లోపల నాలుగు కుర్చీలు ,ఓ టీపాయ్ ,ఒక బీరువా ఉంది.ఇలాంటి కార్యక్రమాలకి ఈ రూం ని కేటాయించుకున్నట్లు అర్ధమయింది.కూర్చున్న తర్వాత బీర్ ల మూతలు తీసి జాగ్రత్త గా ద్రవాన్ని రెండు గ్లాస్ ల్లో నింపాడు రామ్మోహన్. ఇద్దరూ చెరో బీర్ ని లేపిన తర్వాత,రామ్మోహన్ మెల్లిగా లేచి బీరువా తాళం తీసి దానిలో నుంచి ఒక పెద్ద వోడ్కా బాటిల్ తీశాడు. రెండు గ్లాస్ ల్లో సగం దాకా బీర్ ని పోసి మిగతా సగాన్ని వోడ్కా తో నింపాడు.శ్రీను కి కంగారు పుట్టింది.

" రామ్మోహన్ గారు...ఏమిటండీ అది.అసలే నా కెపాసిటి ఒక బీరున్నర ..అలాంటిది మీరు అలా కాక్ టైల్ చేసి పారేస్తే ఎలా.."

" అబ్బా..ఊరుకొండి గురూ గారు...మీరు మళ్ళీ మళ్ళీ కలుస్తారా ఏమిటి ..?తాగితే కొద్దిగా అయినా కిక్ ఎక్కాలిగదండి ..లేకపోతే ఎందుకు...తాగడం..! ఒమర్ ఖయ్యాం ఏమన్నాడో తెలుసా ..తాగడం తప్పు కాదు...తాగి తెలివి లో ఉండడం తప్పు అని..!"

సరే..కానీ..!ఒక్కోళ్ళకి ఒక్కో రోజు వస్తుంది.వాళ్ళేం చెప్పినా వినాలి తప్పదు..!మెల్లిగా ఆ ద్రవాన్ని ఆస్వాదించసాగారు.

" ఆ ..చెప్పండి శ్రీను గారు...ఎందుకు ఇటు వేపు ప్రయాణం పెట్టుకున్నారు " అడిగాడు రామ్మోహన్.

" మా నాన్న గారికి మోకాలు నొప్పులండి ..ఇక్కడ దంతెవాడ లో ఎవరో నాటు  మందు ఇస్తామంటేనూ బయలుదేరా ...మీ బావగారు నా క్లాస్ మేట్ లేండి...మాటల్లో చెప్పాడు మీరు ఇక్కడ కుంట లో ఉంటారని..వీలుంటే కలిసి వెళ్ళమని చెప్పాడు.."

" బస్ లు ఇక్కడనుంచి ఉంటాయిలే గాని...రోడ్ మాత్రం అద్వానం గా ఉంటుంది..అయిదారు గంటల ప్రయాణం ! ఓ పని చేయండి ఎదైనా వెహికిల్ ఎంగేజ్ చేసుకుంటే తొందర గా వెళ్ళచ్చు"

" నాకు మాత్రం పనేం ఉంది గనక..మెల్లగా బస్ లోనే వెడతా"

" సరే మీ ఇష్టం"

" రామ్మోహన్ గారు..ఎలా ఉంది ఇక్కడ పరాయి రాష్ట్రం లో జీవితం"

" ఇంకా ఏం పరాయి...మా చిన్నప్పుడే ఇక్కడకి వచ్చేశాం. మా నాన్నగారు ఆర్.ఎం.పి . వైద్యుని గా పనిచేసేవారు.అప్పుడు ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతం గా ఉండేది.ఒక పదేళ్ళ నుంచే బాగా డిస్టర్బ్ అయింది.ఈ కుంట లో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు.మిగతా అంతా నార్త్ నుంచి వచ్చిన మార్వాడీలు ఇంకా బెంగాలీ వాళ్ళు ఉంటారు.వ్యాపారం కూడా ఎక్కువ గా వీళ్ళ చేతి లోనే ఉంది"

" ఎందుకని అలజడి..ఇదంతా"

"రకరకాల వాళ్ళు రకరకాలు గా చెబుతారు.ఇక్కడ ఆదివాసీల్లో కొంతమంది మాత్రం  తెలుగు వాళ్ళు వచ్చి మా ప్రాంతమంతా కల్లోలం చేశారు అని ఆరోపిస్తుంటారు.."

" అది నిజమా"

" హ్మ్..పాక్షిక సత్యం"

" పేపర్ లో చత్తిస్ ఘడ్ గురించి వార్తలంటూ చదివితే...హింసాత్మక ఘటనల గురించే చదువుతుంటాం"

" అటువాళ్ళు ఇటు వాళ్ళ మధ్య లో పాపం అనేక గ్రామాలు మనుషులు లేకుండా ఖాళీ అయిపోయాయి.బతుకు తెరువు కోసం బోర్డర్ లో తెలుగు ప్రాంతాలకి వలస వస్తుంటారు..."

" అవును ఆ వార్తలు కూడా చదువుతుంటాము. అక్కడ కూడా నివాసం ఇంకా ఇతర సౌకర్యాల కోసం వాళ్ళ దిన దిన పోరాటం..మిర్చి పొలాల్లో నూ,భద్రా చలం లో బస్ స్టాండ్ కి దగ్గర్లోను ,పాల్వంచ ఇంకా ఆ పైనకి పనుల కోసం గుంపులు గుంపులు గా వెళుతూ కనిపిస్తుంటారు..ఇతరులు ఎవరి తోను వాళ్ళు మాటాడగా నేను చూడలేదు..వాళ్ళ పనేమిటో అంతే..అన్నట్లుగా ఉంటారు ..లౌక్యం అనేది ఒకటుంది అని వీరికి తెలుసా అని తోస్తుంది చూసినప్పుడల్లా  "

" ఈ అతివాదం వేపు ఎక్కువగా ఆకర్షింపబడింది మడియా ఆదివాసిలు.వీరితో పోలిస్తే ముడియా తెగ వారు అభివృద్దిపొందిన వారు గా చెప్పవచ్చు.ఒకప్పుడు సల్వా జుడుం లో ఎక్కువ గా వీరే ఉండే వారు.సరే..జరిగి పోయిన చరిత్ర అనుకొండి"

" నెల్లిపాక అవతల ఓ గ్రామం లో ఒక రైతు చెపుతుండగా విన్నాను.ఈ చత్తిస్ ఘడ్ నుంచి వచ్చిన  కూలీలే చక్కగా పనిచేస్తారండి ..ఎక్కువ మాట్లాడరు..ఒక్క మిరప కాయ కూడా కింద వదిలి పెట్టరు ..శుబ్రంగా మిర్చి కోసి వాళ్ళకి రావాల్సింది తీసుకొని వెళ్ళిపోతారు అని"

" నాగరికత కానీ మాయ తెలివితేటలు గాని ఎంత మనిషి లో అభివృద్ధి చెందుతుంటే అంత కమ్మ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఆయా సమాజల్లో పెరుగుతుంటాయి.అసలు ప్రేమ ఏదో నకిలీ ప్రేమ ఏదో కనిపెట్టలేనంత ఇది గా మనుషుల ప్రవర్తనలు రూపుదాల్చుతుంటాయి.ఇదొక రకమైన వార్.కనిపించని వార్.ఒకడిని మించి ఒకడు ఎదగాలని లేదా తనను తాను రక్షించుకోవాలని...ఒక ఎన్ జి వో వాళ్ళు అదే హెల్త్ కేర్ కి సంబందించి  పిలిస్తే వెళ్ళాను ఒకసారి ఎఫెక్ట్  అయిన గ్రామానికి...!అక్కడ జరిగిన సంఘటన లో నలుగురైదుగురు గ్రామస్తులు మృత్యు వాత బడ్డారు.దానిలో ఒక సంవత్సరం వయసున్న చిన్న పిల్ల కూడా ఉంది..."

" అరే..చాలా దారుణం గా అనిపిస్తోంది..ఆ తల్లిదండ్రులు ఎంత విలపించిఉంటారో " బాధ గా అన్నాడు శ్రీను.

" అక్కడకే వస్తున్నా.ఒక నిజం చెప్పనా...నువు నమ్మవు...ఆ చంటి పిల్ల యొక్క తల్లి అక్కడే కూర్చుని ఉంది.ఆమె కంటిలో చుక్క నీరు లేదు.ఎవరితోనూ తన బాధనీ చెప్పుకోవడం లేదు. ఆ పిల్ల శవం ముందే ఏ శబ్దమూ లేకుండా కూర్చుని ఉంది.బాధ లేదని అనడానికి లేదు.అయితే దాన్ని వ్యక్తపరిచి తోటి వారి నుంచి జాలిని పొందే విధానం ఆమె కి తెలియదు"  చెప్పుకుపోతున్నాడు రామ్మోహన్. లోపలకి వెళ్ళిన మందు అతనిలోని కొన్ని తెరలని చింపి వేసింది.

ఇంతలో మొబైల్ మోగింది.సరే ..పదమని భోజనం కి లేచాము. ఇవాళ దంతెవాడ కి ప్రయాణం కుదరని పని.విశ్రాంతి తీసుకొని రేపు బయలు దేరాలి.ఇలా తనలో శ్రీను అనుకుంటూ ఉండగానే రామ్మోహన్ లోకి ఆ వార్త ప్రసారం అయిందో ఏమో .." ఇవ్వాళ ఏం వెళతారు లే గాని రేపు బయలు దేరండి" అన్నాడు. -- మూర్తి కె.వి.వి.ఎస్.      

1 comment:

  1. “దంతెవాడ” కథ ఆసక్తికరంగా ఉంది. దీనికి తరువాయి భాగం ఉందా, మూర్తి గారూ? ఎందుకంటే దంతెవాడకు బయల్దేరిన శ్రీను ఇంకా ఆ ఊరికి జేరుకోలేదు కదా, అందుకని కొనసాగింపు ఉంటుందేమోనని ఎదురుచూసి అడుగుతున్నాను.

    ReplyDelete