ఒక కొత్త భావన తో ముందు కి వెళ్ళాలనే తపన తో తీసిన సినిమా గా చెప్పవచ్చు.సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు నావి రాయాలనిపించింది.మొత్తం మీద చెప్పాలంటే ఈ మధ్య వచ్చే చాలా సినిమాల కంటే రియలిస్టిక్ అప్రోచ్ తో ఉన్నది..అది ఒప్పుకుతీరాలి.హీరో ఇల్లు గాని పరిసరాలు గాని మిగతా పాత్రల హావభావాలు గాని నేల విడిచి కాకుండా సహజత్వానికి దగ్గర గా ఉన్నాయి.
కధ ఈనాటి మన సమాజం లోని విషయాల్ని ఎత్తి చూపింది.చర్చించింది.ప్రతి చోట కనిపించే సన్నివేశాలే సాధ్యమైనంత వినోదాత్మకం గా తెర పైకి ఎక్కించారు. అసలు పిల్లలు సెటిల్ అవడం అంటే ఏమిటి..దానిలో పేరేంట్స్ పోషించే పాత్ర ఏమిటి.. ఫాల్స్ ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపొయి ఫలానా జాబ్ చేస్తేనే గొప్ప లేదా ఆ పిల్లలు చెత్త అనుకునే తత్వం దాని పర్యావసానాలు ..ఇవన్నిటిని బేస్ చేసుకొని కధ అల్లుకున్నారు.
అన్నిటి కన్నా ముందు తను చేసే పని తనకి ఆనందం ఇవ్వాలి.అదీ మొత్తం మీద చెప్పింది.దాని తర్వాతనే ఆదాయమూ ,ప్రిస్టేజ్ ఇంకా అదీ ఇదీను ..! డాక్టర్లు,సాఫ్ట్ వేర్ నిపుణులు ఇంకా ఇలాంటి హై ప్రొ ఫైల్ వృత్తులు తప్ప మిగతావేవి గౌరవ నీయమైనవీ కావా.. వారు ఆనందం గా బ్రతకడం లేదా ..ఇలాంటి అంశాల్ని లేవనెత్తింది ఈ సినిమా..!
అసలు ఈ గొర్రె దాటుడు మనస్తత్వం తెలుగు వాళ్ళ లో ఉన్నట్లుగా ఎవరిలో ను కనిపించదు.దానికి కారణం ఇదే, కొన్ని పనులు మాత్రమే గొప్పవనీ ఇంకొన్ని కానివని ఒక మూఢ నమ్మకం.న్యూజి లాండ్ లో ప్లంబర్ కి ఉన్న గిరాకీ మరెవరకీ ఉండదు.చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయులకి ఉన్న విలువ మన దేశం లో కలెక్టర్ కన్నా ఏ మాత్రం తక్కువ కాదు.అంతదాకా ఎందుకు...మృదంగం,వీణ,వేణువు ఇంకా ఎన్నో సంగీత వాయిద్యాలు వాయించే కళాకారులకు,లలిత కళలకు తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలలో ఇచ్చే విలువ మనము ఇవ్వము.ఏమిటి దానివల్ల వచ్చే సంపాదన..ఇదే మన ఆలోచన.ఒక స్థాయి దాటిన తర్వాత అవీ ఆదాయాన్ని ఇస్తాయి.కీర్తి నీ ఇస్తాయి.కాని ఏమాత్రం పేరేంట్స్ ధైర్యం చేయరు..ఎందుకు...అదే సెటిల్ మెంట్ ప్రాబ్లం..!
మారుతున్న కాలాన్ని బట్టి ప్రాధాన్యాలు మారాలి.మారతాయి.తప్పదు.అందుకని సెంటిమెంట్ కోణం లో చూసి ఒకరిని అనుకోవడం వ్యర్ధం.ఒకప్పటి మన జీవితాలు వేరు.ఇప్పుడు వేరు.దానికి తగ్గట్లు జీవన శైలి మారాలి.ఒకరిని పోషించవలసిన అవసరం లేనప్పుడు మనిషి తన ఆనందం కోసం తాను ఏదైనా చేయవచ్చు.ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి జీవితం వారు నిర్మించుకోవాలి అనే ఆలోచన సమాజం లో రానంతవరకు ఇలాంటి రాపిడులు తప్పవు.మనం పాశ్చాత్య సమాజాల్ని వారి పై పైని అలవాట్లని అనుకరిస్తాం గాని వ్యక్తి నిర్మాణం లో వారు అనుసరించే పద్ధతుల్ని అమానవీయం అంటూ తీసిపారేస్తాము.
సరే..సినిమా కి వద్దాము.మొదటి సగం అంతా ఎక్కువ గా హీరో తెంపరి తనం లాంటి,అతి తెలివి లాంటి శైలి లో ఉంటాడు.అదేమిటో గాని మన తెలుగు సినిమాల్లో హీరో ప్రవర్తన చాలా వల్గర్ గా వంకర గా అడ్డ దిడ్డం గా చూపెట్టి ఇలా ఉంటేనే యూత్ అని కంఫర్మ్ చేయడం ఒక ఫేషన్ గా తయారయింది.ఇది మారవలసిన అవసరం ఉంది.పర్సనాలిటీ డెవెలప్మెంట్ పేరు తో వచ్చే పుస్తకాల్లోని డొల్లని ఈ సినిమాల్లో తూర్పార బట్టారు.ఎన్ ఎల్ పి ట్రైనర్స్ ని కూడా ..పోసాని పాత్ర ద్వారా..!ఇలాంటివి ముందు విదేశాల్లో ఎప్పుడో వచ్చినవే ..మనకా ట్రెండ్ కాస్త లేట్ గా ప్రారంభమయింది.మనం ఎవరినుంచైతే ఈ పనుల్ని కాపీ కొట్టామో వారి రంగ భూమి వాళ్ళ ఒక్క దేశమే కాదు ఈ ప్రపంచం అంతా.అక్కడే వచ్చింది గేప్ అంతా అన్వయించుకోవడం లో.
పోసాని వెనుక స్వామి వివేకానంద పెద్ద బొమ్మ ని చూపెట్టడం ఏమిటో...అర్ధం కాలేదు.ఆయన బోధనల్లో సందార్భానుసారం గా వచ్చే కొన్ని గొప్ప ప్రభోదాత్మక వాక్యాలు వాడుకోవడం అనేది మన సమాజం లో ఉన్నదనా..నిజానికి వాటి యొక్క పొడిగింపు చాలా దీర్ఘం గా ఉంటుంది.వాటి ఉద్దేశ్యం మౌలికం గా వేరు ..అది పొడి పొడి గా ఆయన కొటేషన్లు చదివే వాళ్ళకి అంతరార్ధం బోధపడదు.అందులోను మనకి అనువైనవే తీసుకుంటామాయే.
హీరో చెల్లె పాత్ర డబ్బింగ్ కృతకంగా ఉంది.తండ్రి పాత్రధారి సహజం గా ఉన్నాడు.ఆ మధ్య వచ్చిన ధనుష్ సినిమా లోని తండ్రి పాత్ర జ్ఞప్తికి వచ్చింది.హీరోయిన్ పాత్ర ఓకె.ఎందుకో ఆమె చెప్పే వెర్షన్ కన్విన్సింగ్ గా అనిపించలేదు.ఇలాంటి లోతైన సినిమా కి డైలాగ్స్ ఇంకా చక్కగా రాయవచ్చునేమో అనిపించింది.మొత్తం మీద వివిధ వృత్తుల వారిని సమీకరించి తండ్రి వద్ద వారి తో చెప్పించే సీను...ఇలాంటివి ఇంకొన్ని బాగా పండాయి.మొదటి అటెంప్ట్ లోనే ఒక నూతన ఒరవడిని చూపెట్టగలిగినందుకు దర్శకుడిని సంగీత దర్శకుడిని ఇలా ఈ టీం అంతటిని అభినందించవలసిందే. Murthy Kvvs
No comments:
Post a Comment