ఆలశ్యమే కాని చదవ గలిగాను.ఎంత గాఢమైన ముద్ర మనసు మీద.ఒక గొప్ప నవల చదివిన అనుభూతి,ఎన్నో జీవితాల లోకి..ఎన్నో మనం ఊహించలేని ప్రదేశాల లోకి ,అరణ్యం యొక్క నిజ హృదయం లోకి ప్రవేశించిన అనుభూతి.ఎప్పుడో 1930 ల లో రాయబడినది.అప్పటి బతుకు చిత్రాల్ని అత్యంత చేరువ గా చూస్తున్న రసోద్వేగం.ఇది అంతా దేని గురించి చెబుతున్నానా ..ఇటీవలనే చదివిన "వనవాసి" అనే అనువాద నవల గురించి.బెంగాలీ మూలం భిభూతి భూషణ్ బంధోపాధ్యాయ.అనువాదం చేసిన వారు సూరంపూడి సీతారాం.
ఉత్తమ పురుష లో సాగుతూ పోయే ఈ నవల కాల పరీక్షకి తట్టుకొని నిలిచిన రచన.అసలు అరణ్యం యొక్క ఆ సౌందర్య జ్వాల ఇంత సమున్నతమైనదా అనిపించక మానదు.ఆంగ్లేయులు పాలిస్తున్న కాలం అది.కలకత్తా మహా నగరం లో ఒక సగటు నిరుద్యోగి ..ఉద్యోగ అన్వేషణ లో భాగంగా వెదుకుతూ పోగా బీహార్ లోని ఒక ఎస్టేట్ కి మేనేజర్ గా నియమించబడతాడు.ఫూల్కియ,లవటూలియ వంటి పేర్లున్న చిన్న జనావాసాలు..వేల ఎకరాల దట్టమైన అరణ్యాలు,దానిలోని రకరకాల జంతు జాలం,కొండకోనలు ..వీటి అన్నిటి మధ్య ఈ కధానాయకుని కేంప్ కార్యాలయం...రాత్రయితే చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దం..దూరమ్నుంచి ఏవో జంతువుల అరుపులు..అందాల వెన్నెల లో దారి తెన్ను లెక్క చేయక గుర్రం పై చేసే ప్రయాణాలు..!
అంతులేని పేదరికం, అవిద్య ,అమాయకత్వం నిండిన జనాలు కొంతమది అయితే ప్రతి అవకాశాన్ని తమకి అనుకూలం గా మార్చుకోవాలనే తపన మరికొందరకి.అటువంటి పాత్రల లో ఎంతో వైవిధ్యం.అరణ్యం లోని భూమిని వాస యోగ్యం గా చేసి సాగు చేయడానికి జనాలకి ఇచ్చి తరువాత దాని నుంచి శిస్తులు వసూలు చేయడం ..అదీ అందుకు గాను ప్రధాన పాత్ర అయిన సత్య చరణ్ ఇక్కడకి పంపబడతాడు. ఈ అడవి లోకి వచ్చి ఒక రోజు కాగానే అతనికి విచారం పొంగుకు వస్తుంది.మళ్ళీ కలకత్తా పోయి నిరుద్యోగి గా ఉన్నా ఫర్వాలేదు అనుకుంటాడు.అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అరణ్యం లోని అంతరంగం అతడిని ఆకట్టుకొంటుంది.క్రమేపి దాన్ని విడిచి ఉండలేని స్థితి కి వస్తాడు.
ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఈ దేశం లో ..అయినా ప్రజలు తమకి పట్టనట్లు గానే జీవిస్తుంటారు.వారి అవసరాలు చాలా తక్కువ.ఎక్కువగా ఉండేది గంగోతా తెగ ప్రజలే.మటుక్ నాధ్ అనబడే పూజారి ఈ అటవీ ప్రాంతానికి వచ్చి చిన్న పాఠశాల పెట్టుకోవడానికి స్థలం అడిగి తీసుకొని ఉన్న ఒక్క శిష్యుని తో కాలక్షేపం చేస్తుంటాడు.రాస్ బిహారి సింగ్ అనే రాజ్ పుత్ వడ్డీ వ్యాపారి అక్కడి గంగోతా లకి వడ్డీలకి ఇచ్చి బాగా గడిస్తుంటాడు.పగటి వేషగాళ్ళు ..వారి యొక్క ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఉండే స్వభావం,యుగళ ప్రసాద్ అనే అతని అడవి లో మొక్కలు నాటుతూ దాన్ని సమ్రక్షించే పద్దతి...ఎంతో చరిత్ర కలిగినప్పటికీ బయట ప్రపంచానికి తెలియకుండానే ఆ అడవి లో కాలం గడిపే సంతాల్ తెగ ప్రజలు...ఇంకా ఇలా ఎన్నో వైవిధ్య భరిత ప్రపంచం లో తలమునకలవుతూ ...అడవి భూమి ని ..అక్కడి వన సంపద ని ..అభివృద్ది పేరు తో రూపు మార్చి చివరకి అక్కడనుంచి కలకత్తా ప్రయాణమవుతాడు.
తను వచ్చినప్పటి అరణ్యాన్ని ,ఇప్పటి ఈ అడవి ని చూసి బాధపడతాడు.ఇప్పుడు మనం అనుకునే పర్యావరణ పరిరక్షణ అనే భావన ని ఆ రోజుల్లోనే ఆలోచించినందుకు రచయిత ని అభినందించకుండా ఉండలేము.ఈ నవల లో ఆయా ఋతువుల లో ని వన శోభ ని వర్ణించిన విధానం నాకు తెలిసి నభూతో నభవిష్యతి.భిభూతి భూషణ్ యొక్క ప్రతిభ బహుముఖీనమైనది..అటు సంస్కృత కావ్యాలను ఇటు పాశ్చాత్య రచనా సంప్రదాయాలను బాగా అర్ధం చేసుకొని దానికి తనదైన శైలి ని అద్దినాడని చెప్పవచ్చును.మన కళ్ళ ముందు పాత్రలన్నీ తిరుగుతూ నర్తిస్తున్నవా అనిపిస్తాయి.ఒక్క మాట కూడా పొల్లు ఉండదు.అయితే దీనిలోని అతి ప్రధాన పాత్ర అరణ్యం.ప్రతి తెలుగు పాఠకుడు ఈ నవల తప్పక చదవాలి.లేనట్లయితే ఆ లోటు ఎప్పటికీ లోటే.
No comments:
Post a Comment