Friday, May 11, 2018

అసలు ఒక కధ ఎప్పుడు పాఠకుడిని కదిలిస్తుంది...?



ఈ మధ్య కాలం లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు రచయితలు గా పరిణామం చెంది ఆ రంగం లో చక్కగా పురోగమించడం చూస్తున్నాము.ఆ విధంగా భారతీయ ఆంగ్ల రచనా ధోరణులపై తమదైన ముద్ర వేసి దూసుకుపోతున్నారు.దానితో పాటు కుదురైన మార్కెటింగ్ వ్యూహాలతో పేరు కి పేరు,డబ్బు కి డబ్బు రెండిటిని అందిపుచ్చుకుంటున్నారు.చేతన్ భగత్ తో ప్రారంభమై ఇప్పుడు అనేకమంది తమ జాతకాన్ని ఈ రచనా రంగం లో పరీక్షించుకుంటున్నారు.ఆ కోవ లోకే చెందిన మరో రచయిత రవీందర్ సింగ్.ఇంఫోసిస్ లో కొంత కాలం పని చేసి దానికి రిజైన్ చేసి పూర్తి కాలం రచయిత గా అవతరించాడు.ఇప్పటిదాకా ఎనిమిది నవలలు రాశాడు.I too had a love story,Your dreams are mine అలాంటివి.ఇంకా నలభై ఏళ్ళు లోపులోనే ఉన్న ఈ యువకుడు దేశం లోని ప్రముఖ రచయితల్లో ఒకరి గా రూపొందాడు.సంవత్సరం మొత్తం మీద మెట్రో లు,నాన్ మెట్రోలు ఇలా అదీ ఇదీ అనకుండా దేశం లోని వివిధ నగరాలు,పట్టణాలు తిరుగుతూ తన పాఠకుల్ని కలుసుకుంటూ ఉంటాడు.

ఈయన ఒరిస్సా రాష్ట్రం లోని బర్లా అనే చిన్న పట్టణం నుంచి వచ్చాడు.ప్రస్తుతం బ్లాక్ ఇంక్ అనే సంస్థ స్థాపించి అనేక ప్రయోగాలు చేస్తున్నాడు రచనా రంగం లో.అనేకమంది యువ రచయితల్ని దీనినుంచి పరిచయం చేశాడు.ఓ మూడు ఏళ్ళ క్రితం రవీందర్ సింగ్ ఒక కధా సంకలనాన్ని ఎడిట్ చేశాడు.దీనిలో మొత్తం 21 కధలు ఉన్నాయి.మిమ్మల్ని బాగా కదిలించిన ఏదైనా సంఘటన ఆధారంగా కధ రాసి పంపమని కొత్త వాళ్ళకి పిలుపు ఇచ్చాడు.కొన్ని వందల కధలు దేశ వ్యాప్తం గా రాగా,వాటిని వడపోసి 21 కధల్ని ఓ సంకలనం గా వేశారు.పెంగ్విన్ వాళ్ళు.ఆ సంకలనం పేరు Tell me a story .రోజువారి జీవితం లోనుంచి అనేక కోణాల్ని చూపించే కధలు దీని లో ఉన్నాయి.తాను చిన్నప్పుడు అంబాలా లోని మిలటరీ క్వార్టర్ లో ఉన్నప్పుడు కలిగిన అనుభవాలను ,యుద్ధం జరిగే సమయం లో సైనిక కుటుంబం లోని వాతావరణం గురించి And then the planes came కధ లో సంఘమిత్ర బోస్ వర్ణించింది.

The end of the tunnel లో మృత్యువు ని బయట ఎక్కడో చూడటం ,తన ఇంట్లోనే చూడటం మధ్య గల తేడాని కృష్ణాషిష్ జెనా చిత్రించాడు.జార్ఖాండ్ రాష్ట్రం లో ని ఒక గ్రామం లో కరెంట్ లేని ఓ రాత్రి జరిగిన విషాద సంఘటన కదిలిస్తుంది.అపరాజిత దత్తా అనే ఆమె రాశారు.దీని లోని ప్రతి కధ మనల్ని కదిలిస్తుంది.మన దేశ పరిస్థితులని చిత్రిక పడుతుంది.ముఖ్యంగా చదివించే గుణం ఆసాంతామూ అన్ని కధల్లోనూ కనిపించింది.అసలు ఒక కధ ఎప్పుడు పాఠకుడిని కదిలిస్తుంది.దానిలో ఉండవలసిన గుణాలు ఏమిటి..?అని ప్రశ్నించినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఏ సంఘటన అయితే రచయిత మస్తిష్కం లో నాని నాని అనేక విధాలుగా గిలకొట్టబడి ఇక బయటకి రాక తప్పదు అనుకున్నప్పుడు వచ్చే ఆ కధ ,దాని కధయే వేరు.ఆనందం అనిపించింది ఏమిటంటే ఈ కధాసంపుటి లో ఒక తెలుగు రచయిత్రి కూడా ఉన్నది ఆమె పేరు పోతిన ప్రశాంతి అని విశాఖపట్టణం వాసి.Suicide అనే ఆ కధ వైవాహేతర సంబంధాలు ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయి అనేది విశదీకరించింది.వీలుంటే ఈ పుస్తకాన్ని చదవండి.అమెజాన్ లో కూడా లభ్యమవుతుంది.---Murthy Kvvs   

No comments:

Post a Comment