ఆ మధ్య డా.కులమణి దాస్ గారు పంపిన కధాసంపుటి Mystery of the Missing cap and other short stories లో కొన్ని కధలు చదవటం జరిగింది.జగమెరిగిన భారతీయ సాహిత్యకారుడు, ఒడియా మరియు ఆంగ్ల భాషలలో సమాన దక్షత తో రాసి మెప్పించిన ప్రొ.మనోజ్ దాస్ గారి యొక్క కధా మాలిక ఇది.1950 నుంచి 1972 మధ్య కాలం లో ఆయన రాసిన ఈ కధలు "మనోజ్ దాసాంక కధా ఓ కహిని" అనే టైటిల్ తో 1972 లో వెలువడి సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందినది.వాటినే ఆయన ఇంగ్లీష్ భాష లోనికి అనువదించుకున్నారు.స్వయం గా అనువదించుకోవడం వల్ల ఒక సౌలభ్యం ఉంటుంది.మూల భావం ఎరుగును గనక అనువాదం లో అది ప్రతిఫలిస్తుంది.అవసరమైన చోట అనుసరించవలసిన వ్యూహాలు సులభతరమౌతాయి.
అనువాదం చేయడానికి ఎంత రసికత అవసరమో ,చదివే వారికి కూడా అంత రసికత అవసరం.అప్పుడే ఆ సంధానత పరిపూర్తి అవుతుంది.మక్కీ కి మక్కీ అర్ధం ఒక్కటి తెలుసుకొని ఒక యాంత్రికత తో చేసే అనువాదం ఎన్నటికీ మెప్పించజాలదు.అంతకు మించినది కావాలి.కాబట్టే అనువాదాలు మిగిలితే చాలా గొప్పగా మిగిలిపోతాయి లేదా చాలా పేలవంగా ఉండి పాఠకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.
నేను ఒడియా భాష లో మనోజ్ దాస్ ని చదవ లేదు.అయితే ఆయన ఆంగ్ల రచనల్ని ఈ పాటికే కొన్ని చదివి ఉన్నాను.గతం లో రూపా వాళ్ళు వేసిన Selected fiction లో కధలు చదివాను.నవలికలు Bull dozers ,The tiger at twilight లాంటివి చదివాను.నాకు అనిపించింది ఏమిటంటే మనోజ్ దాస్ యొక్క రీతి నేల విడిచి సాము చేయదు.సగటు ఒరియా గ్రామీణా మరియు పట్టణ సంస్కృతి నుంచే తన ముడి వస్తువులను లాఘవంగా ఎన్నుకుంటారు.వాటికి ఒక ప్రాపంచిక దృక్పధం కల్పిస్తారు.అందువల్ల ఏ భాష కి చెందిన పాఠకుడైనా మమేకమౌతాడు.
ఉదాహరణకి పైన నేను చెప్పిన కధా సంపుటి లోని మొదటి కధ నే తీసుకుందాం.రచయిత తన బాల్యం లో ని ఒక గమ్మత్తు సన్నివేశాన్ని తీసుకుని కధ గా మలిచారు.ఆ గ్రామం లో మహారాణా అని ఓ కామందు.ఆయనకి సంపాదన పెరిగిన తర్వాత ఏదో రాజకీయ పదవి కావాలనిపించి ,దానికి గాను ముందు చూపు గా ఓ మంత్రి ని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాడు.సన్మాన కార్యక్రమం కి ఆహ్వానించి విందు అదీ ఘనం గా ఇస్తాడు.పానకం లో పుడక లా ఓ కోతి ,ఆ మినిస్టర్ గారు నిద్రపోతున్నప్పుడు ఆయన యొక్క టోపి ని దొంగిలించి పారిపోతుంది.ఆ మహారాణా కి ఏం చెప్పాలో పాలుపోక ..మంత్రి గారి అభిమాని అయిన ఓ పెద్ద మనిషి దాన్ని అభిమానం తో దొంగిలించాడని ,దానికి గాను కొంత డబ్బు కూడా అక్కడ పెట్టి పోయాడని మహారాణా అబద్ధం చెప్పి తన డబ్బు ని ఇస్తాడు.ఈ లోగా పిచ్చాపాటి మాటాడుతుండగా ఈ కోతిపిల్ల టోపి పట్టుకొని వచ్చి వీళ్ళ ఇరువురికే గాక అందరకీ షాక్ ఇస్తుంది.దీని లో అంతటా హాస్య ధోరణి సాగినప్పటికీ...అంతర్లీనంగా ఇంకా చాలా స్థానిక అంశాల్ని కధ లో భాగం గా ప్రస్తావిస్తారు.ఉదాహరణకి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో సామాజిక రాజకీయ పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ ..ఆ కాలం లో ఒక కొత్త కులం పుట్టుకొచ్చిందని దాని పేరు patriots అని చమత్కరిస్తారు.
ఇక Return of the Native అనే కధ లో ఎంతో పేరెన్నిక గన్న ఒక మానసిక వైద్యుడు Dr.Saha జీవిత చరమాంకం లో తన స్వగ్రామం వెళ్ళి విశ్రాంత జీవితం గడపదలుచుకుంటాడు.అయితే తనకి అలవాటైన ధోరణి లో నే తోటి ప్రముఖుల యొక్క మానసిక సమస్యలు ఏమిటో వారికి వివరిస్తూ ఉండడం తో తన ప్రదేశం లో తానే ఒంటరి అయి ఇక ఉండలేక తన ఆసుపత్రి కి చేరుకుంటాడు.ప్రతి మనిషి ఏదో కోణం లో ఏదో మానసిక సమస్య ఉన్నవారే అని దీని లో అనిపిస్తుంది.మానసిక శాస్త్రాన్ని ఎంతో అవగాహన చేసుకొని రాసిన కధ ఇది.అలా మిగతావి ..!
సమీర్ రంజన్ దాస్ అని ఓ బ్యాంక్ అధికారి మనోజ్ దాస్ సాహిత్యాన్ని భద్రపరిచే విషయం లో (website,e-books,audio books etc.) చాలా కృషి చేస్తున్నారు.వీరి అభిమానులతో కలిసి ఓ టీం గా ఏర్పడి ముందుకు సాగుతున్నారు.ఆయన ని నేను ఓ సారి కలిశాను.ఆయన అనేదేమిటంటే మనోజ్ దాస్ తానంతట తాను ఏ అవార్డ్ కోసమో ఇంకో దానికోసమో ప్రయతినించరు.తాను దారి లో తాను రాసుకుంటూ వెళుతుంటారు.ఆయనకి పద్మశ్రీ వచ్చినా ,ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కి ఎడిటర్ గా చేసినా ,అయిదు యూనివర్శిటీలు డాక్టరేట్ లు ఇచ్చినా ,అకాడెమీ అవార్డ్ లు ఇలాంటివి ఇంకేవి వచ్చినా దానంతట అవి వచ్చినవే తప్ప ప్రయత్నించటం అనేది ఉండదు.పాండిచ్చేరి లోని అరవింద ఆశ్రమం కి చెందిన కళాశాల లో ఆంగ్లోపాన్యాసకులు గా పనిచేసి ప్రస్తుతం అక్కడే విశ్రాంత జీవితం గడుపుతూన్నారు.ప్రస్తుతం The new indian express డైలీ లో ఆదివారం రోజున ఓ కాలం రాస్తున్నారు.ఇంకా ఉపన్యాసాలు అవీ ఇస్తూ తన జ్ఞాన ధార ని ప్రపంచానికి పంచుతున్న మనోజ్ దాస్ ఒడియా లోను,ఇంగ్లీష్ లోనూ మొత్తం కలిపి ఎనభై పైగా పుస్తకాల్ని వెలువరించారు.ఎనభైవ పడి లో ఉండి ఇంకా ఎంతో చురుకు గా ఉత్సాహంగా ఉండే ఆ మహానుభావుడి తో సమీర్ గారి వల్ల ఆయన తో ఫోన్ లో మాట్లాడాను.అది ఒక మరపురాని అనుభవం.
No comments:
Post a Comment