Thursday, November 29, 2018

పోలింగ్ డ్యూటి (కధ) ---మూర్తి కె.వి.వి.ఎస్.

పోలింగ్ డ్యూటీ(కధ)--మూర్తి కె.వి.వి.ఎస్.
ఈ రోజున పేపర్ లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చదవ గానే కొన్ని ఏళ్ళ కిందటి విషయాలు మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. పోలింగ్ బూత్ ఉన్న ఆ వూరు లో దిగేసరికి సాయంత్రం నాలుగు దాటింది.ఎలక్షన్ డ్యూటీ చేసే సిబ్బంది మొత్తం మేము అయిదు మందిమి ఉన్నాము. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్,ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్,మిగతా ముగ్గురు పోలింగ్ క్లర్క్ లు.ఈ మారు మూల పల్లె లో ఉన్న ఓ పాఠశాల ని పోలింగ్ బూత్ గా పెట్టారు.మా అందర్నీ దింపేసిన బస్ ఇంకా ముందు కి సాగిపోయింది.మరింత మంది సిబ్బందిని వారి వారికి కేటాయించిన ప్రదేశాల్లో దింపడానికి..!

చూడటానికి ఇంతేనా అన్నట్లు ఉంటుంది గాని ప్రభుత్వ అధికారులకి ఆ ఎలెక్షన్ తతంగం అంతా జరిపించడానికి ఎంత యాతనో..ఎంత చికాకు వ్యవహారాలో..!ఏ మాత్రం ఎక్కడ పొరబాటు జరిగినా వెనకా ముందు చూడకుండా ఎన్ని అక్షింతలో..!మేము అయిదుగురం అయిదు ప్రదేశాల్లో పనిచేస్తున్నవాళ్ళం.ఈ ఎన్నికల డ్యూటీ పుణ్యమా అని ఇక్కడ ఇలా ఓ చోటా కలుసుకున్నాం.దేశం లో ప్రజాస్వామ్యమనే ఈ జగన్నాధ రధాన్ని కదిలించే యజ్ఞం లో మేమూ ఇలా మా పాత్ర నిర్వహించబోతున్నాము.

అయితే ఇలాంటివి గతం లో చేయక పోలేదు.కాని ఏ సారి అనుభవం ఆ సారిదే.దానిలో అన్ని రుచులూ కలిసి ఉంటాయి.ఎన్ని రకాల మనుషులు..ఎన్ని రకాల అనుభవాలు.సరే...పాఠశాలలో కి దిగిన వెంటనే మా ప్లానింగ్ ప్రారంభించాము.ఇప్పటి లా అప్పుడు ఈవిఎం మెషిన్ లు లేవు.అప్పటి వ్యవహారం వేరు.ఓటర్లు రావడానికి,మళ్ళీ వెళ్ళడానికి వీలు గా కర్రల తో కట్టాము.బ్యాలట్ బాక్స్ ఎక్కడ పెట్టాలి..అది సీక్రెట్ గా ఉండాలి,మళ్ళీ వెలుతురు వచ్చేలా ఉండాలి కనక ఓ కిటికీ మూలకి పెట్టాలి అనుకున్నాము.ఆ విధంగా అక్కడ టేబిల్ వేసి దానికి చుట్టూ దుప్పటి తో కట్టాము.వెదుర కర్రల సాయం తో..!
మొత్తానికి ఎలాగో ఆ పని అంతా పూర్తి చేశాము.ఓటర్లు రావడానికి,ఓటేసిన తర్వాత బయటకి వెళ్ళడానికి..అదంతాట్రయిల్స్ కూడా వేశాము.సంతృప్తి గా తోచింది.బ్యాలట్ పేపర్ల మీద సంతకాలు,వాటిని జాగ్రత్త గా లెక్క పెట్టుకోవడం,ఇంకా ఇతర స్టేట్యూటరీ పత్రాల్ని పూరించి పెట్టుకోవడం, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాము.ఈ పోలింగ్ డ్యూటీ అనేది సమిష్టి కృషి తో సాఫీ గా సాగిపోతుంది.ఉన్న పోలింగ్ సిబ్బంది లో నువు చిన్న నేను పెద్ద అనుకుంటే సరిగా సాగదు.ఆ విషయం ని మిగతా వారికి అర్ధం అయ్యేలా చెప్పాను.ఉన్నవారి లో అంతా సమానమేనని అందరం కలిసి ఈ కార్యాన్ని సఫలం చేద్దామని ఉత్సాహపరిచాను.అదృష్టవశాత్తు అంతా మంచి సిబ్బందే నా టీం లో పడ్డారు.

రాత్రి రమారమి ఎనిమిది అయింది.ఆ గ్రామం లో ఉన్నది ఒకటే వీధి.బల్బులు గుడ్డి గా వెలుగుతున్నాయి.పెద్ద వెలుగని చెప్పడానికి లేదు.ఉన్నదానితోనే సరిపుచ్చుకోవాలి.ఆ చివరి నుంచి ఈ చివరకి ఓ సారి సర్వే చేశాను.జనాల అలికిడి లేదు.చిన్న బడ్డీ కొట్టు కూడా లేదు.ఒక వేళ ఉన్నా మూసేసి ఉంటారు.దారి కి అటూ ఇటూ రకరకాల తుప్పలు ఉన్నాయి.ఈ గ్రామం కి ఆనుకొని ఉన్న మరో నాలుగు చిన్న గ్రామాలు..ఆ ప్రజలు కూడా ఇక్కడకే ఓటు వేయడానికి వస్తారు.మాకు ఉన్న లిస్ట్ లోని సమాచారం మేరకు..!

బడి కి వచ్చేసరికి ఏజెంట్లు వచ్చారు.రేపు ఉదయమే ఏడు లోపల రమ్మని వారికి చెప్పాను.వాళ్ళకి గుర్తింపు కార్డ్ లు ఇవ్వడం,మాక్ పోలింగ్ నిర్వహించడం అలాంటివి ఉంటాయని వారికి వివరించాను.వాళ్ళకి తెలియదని కాదు గాని మా పని మేం చేయాలి గదా..!మాకు కేటాయించిన స్థానిక గ్రామాధికారి రాలేదని ,ఈ రాత్రికి భోజనాలు ఎక్కడైన వండించితే వారికి డబ్బులిస్తామని మేము ఏజెంట్ లకి చెప్పాము.ఎందుకనో వాళ్ళు పెడ మొగం గా ఉన్నారు.ఈ రాత్రికి కష్టమండీ..అంటూ తప్పించుకు పోయారు.ఊళ్ళో చూస్తేనేమో తలుపులు బిడాయించుకుని ఉన్నారు.హోటల్స్ దగ్గర లో ఏమీ లేవు.లోపల ఆత్మారాముడు మూలుగుతున్నాడు.
"సార్ ..నేను వచ్చేటపుడు మూడు బిస్కెట్ పాకెట్ లు,మూడు బన్ లు తెచ్చాను.ఈ రాత్రికి వాటిని లాగిద్దాం.రేపు తెల్లారిన తర్వాత మిగతా సంగతి చూద్దాం" అన్నాడు మా టీం లోని పోలింగ్ క్లర్క్.హమ్మయా అని నిట్టూర్చి చాలా జాగ్రత్త గా వాటిని వాటాలు వేసుకుని తిన్నాము.కొంతలో కొంత నయం.ఆ బడి ప్రాంగణం లోనే ఓ బోర్వెల్ ఉంది.నీటి కి ఇబ్బంది లేదు లే..అని ఇంకొంచెం ధైర్యం వచ్చింది.నీళ్ళు కడుపు నిండా పట్టించాము.నిద్ర కి ఉపక్రమించాము.ఒకే దుప్పటిని అడ్డం గా పరిచి బయట వరండా లో పడుకున్నాము.నా జన్మకి నేనెప్పుడూ ఈ ఊరి లో ఇలా ఇక్కడ పడుకుంటానని ఊహించలేదు.అదే విధి మరి.విచిత్రం గా ఒక్క దోమా లేదు.నక్షత్రాల కాంతి వింత గా పరుచుకుంటోంది.ఉన్నట్టుండి ఒక చల్లని తెమ్మెర మమ్మల్ని జోల పుచ్చుతున్నట్లు గా వీయసాగింది.మెల్లగా నిద్ర లోకి జారుకున్నాము.ఎంత లోపల రేపటి పోలింగ్ గురించిన ఆందోళన ఉన్నప్పటికీ..!

పొద్దుటే అయిదు కల్లా తెలివి వచ్చింది.లేచి మొహం కడుక్కుని స్నానం కానిచ్చాను.చేయవలసిన కార్యక్రమాల ఎజెండాని రాసుకున్నాను.మళ్ళీ సామాగ్రి మొత్తాన్ని ఓ సారి సమీక్షించుకున్నాను.మిగతా నలుగురు సిబ్బంది ఓ గంటకి లేచారు.చకచకా వారి పనులు కానిచ్చారు.ఏజెంట్ లు వస్తున్నారు ఒక్కొక్కరే..!వారిని అందరని వాళ్ళకి కేటాయించిన బల్లల పై కూర్చోపెట్టాము.టైం అయింది ..బేలట్ బాక్స్ ని తెరిచి చూపించి..సీల్ వేయడం...ట్యాగ్ లు కట్టడం ...మాక్ పోలింగ్ చేయడం అంతా క్రమంగా చేశాము.ఏజెంట్లకి గుర్తింపు కార్డ్ ల్ని ఈ పనులు అన్నిటికి ముందర ఇచ్చేశాము.వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చాను.

గతం లో ఎన్నికల డ్యూటీ చేసిన గ్రామం లో అక్కడి ప్రజలంతా చక్కని సహకారం ఇచ్చారు.వద్దన్నా వినకుండా టిఫిన్ లు,భోజనాలు పంపేవారు.ఫ్రీగా తీసుకోవడం రూల్స్ కి విరుద్ధం అని వారికి బలవంతం గా డబ్బులు ఇచ్చేవాళ్ళం.కానీ ఈ గ్రామం ఏమిటో ..డబ్బులిస్తాం...అన్నం పెట్టమన్నా దానికి దిక్కు లేదు.మా బాగోగులు చూడాల్సిన స్థానిక అధికారి పత్తా లేడు.ఏమిటో..రకరకాల మనుషులు..!
పది అవుతుంది అనగా..ఇక ఓటర్ల రద్దీ పెరిగింది.వచ్చేవాళ్ళు వస్తున్నారు.ఓటేసి పోతున్నారు.కడుపు లో ఎలుకలు పరిగెడుతున్నాయి.మా టీం అంతా ఒకరి మొకాలు ఒకరం చూసుకున్నాం.తలా కాసిన్ని మంచి నీళ్ళు తాగాం.కాసేపు ఉన్నాక ఎందుకనో ఓ ఏజెంట్ అడిగాడు " సార్ ..ఏమైనా తిన్నారా?" అని.

"ఏం చెప్పాలి.రాత్రీ అన్నం లేదు.ఏవో బిస్కెట్ లూ అవీ తిన్నాం.ఇక్కడ ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు.ఇదిగో ఈ లోగా ఓటర్ల రద్దీ పుంజుకుంది.దీనికోసమే గదా మేము వచ్చింది.సరే ఎలాగో కానిస్తాం" అన్నాను నీరసంగా..!

"అలా అయితే ఎలా సార్.ఉండండి మా ఏజెంట్లు అందరి తరపున మేం మీకు తెప్పిస్తాం" అన్నాడతను,మిగతా ఏజెంట్ల వైపు చూస్తూ.వాళ్ళు సరే అన్నట్టు తలాడించారు.

"అయితే..ఒకటి ..మీరు తప్పకుండా మా దగ్గర డబ్బులు తీసుకోవాలి దానికి" అన్నాను.

"సర్లేండి.." అన్నాడతను.తను బయటకి వెళ్ళి ఎవరో కుర్రాడిని పురమాయించాడు.ఆ కుర్రాడు సైకిల్ వేసుకుని బయలు దేరాడు.ఈ లోగా మా పని సాగిపోతూనే ఉంది.ఓటర్ల పేరు ని తనిఖీ చేయడం,వేలికి చుక్క పెట్టడం,బేలట్ పేపర్ ఇవ్వడం  ఇలా పని ఆగకుండా నడిపిస్తూనే ఉన్నాము.మధ్యానం రెండు దాటింది.ఉన్నట్లుండి వాచ్ చూస్తే గుండె గుభేల్ మంది.మా సిబ్బంది బాటిల్ మీద బాటిల్ నీళ్ళు తాగుతున్నారు.వారితో బాటు నేను.ఇంతకీ వెళ్ళిన కుర్రాడు ఏమయ్యాడు..ఇంకా రాడే..!

ఇంతలో స్టేట్ అబ్జర్వర్స్ వస్తే వాళ్ళకి ఓటింగ్ జరుగుతున్న సరళిని చెప్పగా నోట్ చేసుకున్నారు.అదే సమయం లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్ది వచ్చాడు.వాల్ పోస్టర్ ని బయట అటు వేపు ఎందుకు అంటించారు అక్కడ ఎవరకి కనబడుతుంది అంటూ ఏదో ప్రశ్నించసాగాడు.అయ్యా మాకు ఉన్న ఆదేశాల మేరకే మేము అక్కడ అంటించాము అంటూ సర్ది చెప్పాము.ఎవరి హంగామా వాళ్ళది.బేలట్ బాక్స్ రంద్రం చిన్నగా ఉంది..ఇంకొంచెం పెద్ద గా ఉంటే బాగుంటుంది అంటూ మరో ఓటర్ యొక్క సూచన.సరే..పై వాళ్ళకి చెపుతాములే..అది మేము చేసేది గాదు అంటూ అనునయించాను.
మా అందరి సిబ్బంది మొకాల్లో కళ తప్పింది.ఆకలి బాధ తో అల్లాడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి.అన్నట్టు ఈ కుర్రాడు ఎక్కడ..ఇంతసేపు పోయాడేమిటి అన్నట్టు గా ఒక ఏజెంట్ ని చూశాను.అతను ఇబ్బంది గా  మొకం పెట్టి ఓ సారి కిటికీ లో నుంచి చూశాడు.వాడి జాడ లేదు.అన్నం లేకపోయినా కేవలం నీళ్ళు తాగి కొన్ని రోజులపాటు మనిషి బతకవచ్చుననే విషయం గుర్తొచ్చి ఊరట గా ఫీలయ్యాను.బాటిల్ ఎత్తి యధాశక్తి దానిలోని నీళ్ళన్నీ తాగేశాను.మా సిబ్బంది కూడా అదే బాట లో నడిచారు.వాడిన తోటకూర లా అయిపోయాయి మా మొకాలు.ఏజెంట్ లు కూడా ఏం చెయ్యాలో అర్ధం కాక అదోలా అయిపోయారు.ఈలోగా ఈ ఏజెంట్లని రిలీవ్ చేయడానికి కొత్త ఏజెంట్లు వచ్చారు.వాళ్ళు పోతూ పోతూ ..ఆ కుర్రాడిని మేం తొందరగా పంపిస్తాం సార్ మీరు వర్రీ గాకండి అన్నారు.ఏడవలేక నవ్వి ఊరుకున్నాను.

సమయం సాయంత్రం  అయిదు అయింది.గేటు మూసేసి లోపల ఉన్న ఓటర్లకి స్లిప్ లు ఇచ్చాము.మొత్తానికి ఓటింగ్ కార్యక్రమం విజయవంతం అయింది.బేలట్ బాక్స్ కి సీల్ వేసి ఆ తర్వాత ఏజెంట్లకి సర్టిఫికెట్లు ఇచ్చేశాం, వాళ్ళు వెళ్ళిపోయారు.సామాగ్రి అంతా సదురుకున్నాము.ఇక మమ్మల్ని తీసుకు వెళ్ళే ప్రభుత్వ వాహనం కోసం ఎదురుచూస్తున్నాం.బేలట్ బాక్స్ ని,తదితర పేపర్ అకౌంట్ లని డివిజన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కౌంటర్ లో మేం అప్పగించాలి.అప్పుడు మా పని పూర్తి అవుతుంది.
ఆ కార్యక్రమం అంత తొందరగా పూర్తి అవదు.మా లాగే వచ్చిన సిబ్బంది చాలామంది ఉంటారు గదా,ఒక్కో బూత్ వారీ గా వాళ్ళు అడిగిన క్రమం ప్రకారం అప్పగించాలి.పేపర్ సీల్ అకౌంట్ మిగతా పత్రాలు అన్నీ తనిఖీ చేసి తీసుకుంటారు.అంతా కలిపి రాత్రి పది దాటినా దిక్కు లేదు.ఆ ఏజెంట్ లు పంపిన కుర్రాడు రొప్పుకుంటూ వచ్చాడు సైకిల్ మీద.ఏమిటి ఇంత ఆలశ్యం అయిందని అడిగితే అక్కడ టిఫిన్ రడీ గా ఉండదు.చేయించుకొని వచ్చాను.అందులో మళ్ళీ వస్తూంటే సైకిల్ కి పంక్చర్ పడింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఏం చేస్తాం ..ఇక..!సరే ..మీరు కానివ్వండి అంటూ మిగతా మా సిబ్బంది కి చెప్పాను.వాళ్ళు తలా నాలుగు బోండాలు తిని మంచి నీళ్ళు తాగి బతుకు జీవుడా అంటూ ఓ మూలకి పోయి కూర్చున్నారు.ఈ లోగా నేను బయటకి వెళ్ళాను లఘుశంక తీర్చుకోడానికి..!లోపలికి వచ్చేప్పుడు కాళ్ళూ మొహం చేతులు శుభ్రంగా కడుక్కున్నాను ఆ టిఫిన్ ని లోపల వేసుకోడానికి..!మీ వాటా టిఫిన్ ఆ కిటికీ దగ్గర పెట్టాం సార్ అన్నాడు మా పోలింగ్ ఆఫీసర్.తీరా వెళ్ళి చూస్తే దాని మీద లటుక్కున ఓ బల్లి దూకింది గోడ మీద నుంచి.ఓరి దేవుడా దీనికీ సమయం ఇప్పుడే దొరికిందా అంటూ నవ నాడులూ కుంగిపోయాయి.
అంతలోనే మమ్మల్ని తీసుకు వెళ్ళడానికి ప్రభుత్వ వాహనం వచ్చింది.దానిలో అప్పటికే మా రూట్ లో ఉన్న ఇతర బూత్ ల సిబ్బంది కొంతమంది ఎక్కి కూర్చొని ఉన్నారు.టిఫిన్ ని తినబుద్ధి కాలేదు.బయట పారేశాను.అదీ కంటి తో ఆ బల్లి ని దాని మీద చూసిన తర్వాత ఇహ నా వల్ల కాలేదు.మా పోలింగ్ సామాగ్రి అంతా సర్దుకుని బస్ ఎక్కేశాము.ఆ గ్రామం సరిహద్దులు దాటుతూ బై బై చెప్పాను.ఈ గ్రామం నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది.ఇలాంటి అత్యవసర విధి నిర్వహణ లో భాగంగా ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్త గా మనకంటు కొంత ఆహార పదార్థాల్ని తీసుకు వెళ్ళాలి లేదా ఇదిగో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది తెలిసి వచ్చింది.

బస్ రివ్వున సాగిపోతోంది.నాకు తెలుసు ఈ మాత్రం ఆకలి కి మనిషి మరణించడు.ఆ ఎరుక కలగగానే హాయి గా అనిపించి బాటిల్ లోని ఇంకొన్ని మంచి నీళ్ళు తాగాను.కిటికీ లోనుంచి చూస్తే దారి పొడుగూతా అరణ్యం.అలా పోతూనే ఉన్నది మా బస్సు.(సమాప్తం) ---మూర్తి కె.వి.వి.ఎస్. 

No comments:

Post a Comment