Thursday, March 21, 2019

డా.చింతలపూడి వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల క్రితం ఒక పుస్తకం పంపించారు


మిత్రులు డా.చింతలపూడి వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల క్రితం ఒక పుస్తకం పంపించారు.అది ఓ అనువాదం.అంతరంగ తరంగాలు అనే ఆశావాది ప్రకాశ రావు గారి  కవిత్వాన్ని తెలుగు నుంచి ఆంగ్లం లోకి తెచ్చారు.వెంటనే రాయలేకపోయాను.అనేక కారణాలు దానికి..!సరే..కొద్దిగా నాకు తెలిసినంత లో నాలుగు ముక్కలు రాస్తాను.నేను అనువాదాలు ముఖ్యంగా తెలుగు నుంచి ఆంగ్లం లోకి ఎవరు చేసినా చదువుతుంటాను.చూద్దాము వీరు అవలంబించిన విధానం ఏమిటో అని..!

ఎప్పుడైనా సరే..నూటికి నూరు పాళ్ళు అచ్చుగుద్దినట్లు అవతల భాష లోకి ఎవరూ తేలేరు.ఎందుకూ అంటే..ప్రతి భాష కి దానిదైన ఒక జీవం,వాసన,రంగు ఉంటాయి.మనం మన భాష లోనిది అర్ధం చేసుకుంటాము.కాని అవతల భాష లోకి ఎంత లోతు గా వెళ్ళావూ అనే దాని మీదే అనువాద విజయం ఆధారపడి ఉంటుంది.అంటే నా అర్ధం అత్యంత కృతకమైన ,కఠినమైన ,మక్కీకి మక్కీ పదానికి పదం సరిపోయిందా అంటూ బేరీజు వేసుకుంటూ సాగే అనువాదమని కాదు.అది మరి ఎలాటిది..?

ఉదాహరణకి చూద్దాము.ఒక కవిత లోనో,కధ లోనో ఓ చోట..."జరిగినది ఏదో అనుమానం గానే ఉంది,అసలు విషయం అది కాకపోవచ్చును" అని ఉంది అనుకొండి.Something,Smelling rat అని చెప్పవచ్చును.లేదా ఇదే అని గాదు దీనికి దగ్గరగా ఉన్నది ఇంకోటి ఉపయోగించవచ్చును.ఆహా..అలా కాదు ,పూర్తిగా మక్కీకి కి మక్కీ ఉండవలసిందే అనువాదం అనేవాళ్ళు కొంతమంది.వీళ్ళకి బాగానే ఉండవచ్చు.కాని ఈ అనువాదం ప్రధానం గా ఎందుకూ చేసేది ..తెలుగు రాని వారి కోసం కదా..వారి ని దృష్టి లో పెట్టుకుని గదా చేయాల్సింది.అకడమిక్ గా ఎంత సారూప్యత ఉన్నదని కాదు భావపరంగా తెలుగేతరునికి అది ఎంత ప్రభావవంతం గా అందించామూ అన్నది ప్రధానం.

ఇట్లా తెలుగు రచన ని ఆకళింపు చేసుకుని తెలుగు రాని వారి కి వారిదైన గుబాళింపు తో తీసుకుపోవాలి బయటకి..!అప్పుడు ఒక అనువాదం విజయవంతమవుతుంది.పావ్లో కొయ్లో రచన లే చూడండి.ఎక్కువ గా మార్గరెట్ జల్ అనే ఆమె అతని యొక్క నవలల్ని పోర్చ్ గీస్ భాష నుంచి ఇంగ్లీష్ లోకి ఎంత చక్కగా అనువాదం చేస్తుందో..!భాష చాలా తేలిక గా ఉంటుంది,అదే సమయం లో ఒక సొగసూ ఉంటుంది.విషయం సూటిగా చెప్పేస్తుంది.ఎక్కడో అవసరమైన చోట తప్పా,డిమాండ్ చేసిన చోట తప్పా కఠినమైన పదాలు వాడదు.అసలు నా ఉద్దేశ్యం లో ఆ విధంగా రాయడానికే గొప్ప పాండిత్యం కావాలి.చాలా అనుభవం ద్వారా నే అది వస్తుందేమో.అయితే ఒకటి..మన తెలుగు వారి లో ఒక మూఢనమ్మకం ఉండిపోయింది.ఎంత పాషాణ పాకం వంటి మాటలు వాడితే అంత గొప్ప ఆంగ్ల రచన యని..!ఇప్పుడు వస్తున్న ఇండో ఆంగ్లికన్ రచనలి,కధల్ని,నవలల్ని పరిశీలించండి.

చాలా అభిప్రాయాలు మారతాయి.ఎందుకో చాలామంది ఇది చేయరు.అక్కడే వస్తుంది తంటా.మనవాళ్ళు ఆంగ్లం లోకి ఎన్నోవాటిని తీసుకెళుతున్నారు.వాటి చదివించే గుణం మీద ఎంతమంది తెలుగేతరుల ఫీడ్ బ్యాక్ ని మనం తీసుకుంటూ ఉన్నాము..?అలాటిది ఎప్పుడైనా చేశారా..?ఆ ఆసక్తి ఉండదు,అనువాదం చేసి వదిలేస్తాము.అవి ఎక్కడో ఉండిపోతాయి.అంతే..! కాదా..!

సరే..చింతలపూడి వారి అనువాదం లోకి వద్దాము.ఆయన గురించి రెండు మాటలు చెప్పాలి.బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో  తెలుగు లో పి.హెచ్.డి.చేశారు.ప్రస్తుతం రిటైర్ అయి ప్రకాశం జిల్లా లోని ఇడుపులపాయ లో నివసిస్తున్నారు.దానికి ముందు ఈనాడు దిన పత్రిక వారి జర్నలిజం కాలేజీ లో కూడా పనిచేసినట్లు గుర్తు.భద్రాచలాని కి కొద్ది దూరం లో ఉన్న సత్యనారాయణ పురం లోని ఒక యైడెడ్ ఉన్నత పాఠశాల లో పనిచేసేప్పుడు ఆయన నాకు పరిచయం అయినారు.అంతకు ముందు కూడా ఏవో ఉద్యోగాలు చేసినట్లు గా చెప్పినట్లు గుర్తు.ఈ సత్యనారాయణపురం ని చూసినట్లయితే గోదావరి జిల్లా లోని గ్రామం గుర్తుకు వస్తే పొరబాటు కాదు.గోదావరి జిల్లాల నుంచి వచ్చిన క్షత్రియకుటుంబాల వాతావరణం ఉంటుంది.అయితే మావోయిస్టుల తాకిడి వలన చాలామంది ఇతర ప్రాంతాలు వెళ్ళినట్లు ఇప్పటి వినికిడి.అలాంటి ఒక స్కూల్ లో...అది ఉచ్చ దశ లో వెలిగిన రోజుల్లో మేము తరచు గా కలుసుకుంటూ వివిధ విషయాలు చర్చించుకునేవాళ్ళము.

తెలుగు లోనూ ,ఆంగ్లం లోనూ మంచి పట్టు ఉన్న మనిషి.ఏ సంగతి అయినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం.మరి ఈ అనువాదం విషయానికి వస్తే ఆశావాది గారి కవిత్వానికి పూర్తి న్యాయం  చేయాలనే తపన కనపడింది.అదే విధంగా పైన నేను చెప్పిన కొన్ని విషయాలు కూడా దీనికి అన్వయిస్తాయి.అదీ చెప్పవలసిందే.ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత కలిగే భావాలను మనము అది నిజమే గదా అనుకున్నామంటే అనువాదం విజయవంతం అయినట్లే.సరే..ఇక్కడ నిలుస్తాను.మళ్ళీ ఎప్పుడైనా కొన్ని సంగతులు. Murthy Kvvs 

No comments:

Post a Comment