Sunday, April 21, 2019

ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం గురించి నాలుగు మాటలు (రెండవ మరియు చివరి భాగం)



వీరాస్వామి గారు 1836 లో మరణించారు.ఆయన రాసిన ఈ లేఖాపూర్వక యాత్రా సాహిత్యమంతా 1838 లో ఆయన మిత్రుడు పిళ్ళై మొదటిగా వెలుగు లోకి తెచ్చారు.ముందు తమిళం లోను ,ఆ తర్వాత మరాఠి భాష లోనూ వెలువడి పాఠకుల  ని ఎంతో ఆకర్షించింది.నాగపూర్ రెసిడెంట్ గా ఉన్న అధికారి ఇంకా కొంతమంది దీన్ని ఇంగ్లీష్ లోకి తేవడానికి ప్రయత్నించారు.అయితే అంతకుముందే తానే దీన్ని ఇంగ్లీష్ లో కి అనువదించాలని వీరాస్వామి కొన్ని భాగాలు అనువదించి అనారోగ్య కారణం చేత విరమించుకుని వారి బంధువు అయిన వెన్నెలకంటి సుబ్బారావు చేత పూర్తి చేయించాలని అనుకున్నా కొన్ని కారణాల వలన వీలుపడలేదు.

దాదాపు గా అయిదు భాషల్లో వీరాస్వామి గారు  తన భావావేశం లో రాసిన ఈ యాత్రా సాహిత్యాన్ని ఒక పద్ధతి గా పెట్టి అందరకీ సులభం గా అర్ధమయ్యే రీతి లో మన ముందు కి ఇప్పుడు తెచ్చిన మాచవరపు ఆదినారయణ గారు బహు ప్రశంసనీయులు.గతం లో కొన్ని వెర్షన్లు రాకపోలేదు కాని దీనికి గల రీడబిలిటి గొప్పది.అలాగని వీరాస్వామి యొక్క ఆత్మ ని ఆయన ఎక్కడా చిన్నబుచ్చలేదు.పుస్తకం చదువుతుంటే ఆ మూల కర్త యే మన ముందు కూర్చొని మాటాడుతున్నట్లు ఉంటుంది.ప్రపంచాన్ని చూడటం లో,వ్యాఖ్యానించడం లో వీరాస్వామి గారి దృస్టి అచ్చెరువు కొలుపుతుంది.దాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఉదాహరణకి 273 పేజీ లో ఇలా అంటారు. "ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నారు..?అని అందరూ అడుగుతూ ఉంటారు."తన డబ్బు తనకి నచ్చిన విధంగా ఖర్చు పెట్టకుండా మరణించడం వలన ప్రయోజనం ఉండదు" అని ధృఢంగా నమ్ముతాను. నేను సుప్రీం కోర్ట్ లో ఉండి ఎన్నెన్నో మరణ శాసనాలు(వీలునామాలు) చదివాను. వారు తమ తరువాత జరుగవలసిన పనుల గురించి రాసి మరణిస్తారు.అయితే వారు చెయ్యమని చెప్పిన పనులు వారి వారసులు ఎవరూ చేయలేదు.పైగా ఆ వారసులందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు.అలా నా జీవితం లో జరుగకూడదు.....అందువలన నా మనసు కి నచ్చిన విధం గా నా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటాను అనే నిర్ణయం తీసుకున్నాను...నా జీవితం నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు చెప్పుకుంటూపోతున్నాను. ఆ ఈశ్వరుడి భాషని నాకు అర్ధమైనంత వరకూ అనువాదం చేసుకున్నాను.అదే చాలు నా జీవితానికి.." అంటారు.

ఇంకోటి ఏమంటే ఈ పుస్తకం లో ప్రస్తావించిన ఉప్పాడ బోయీలు ...వారు నన్ను ఎంతో ఆలోచింపజేశారు.ఇంత మహా ప్రయాణం ని విజయవంతం గా పూర్తి జేశారూ అంటే వాళ్ళ రెక్కల కష్టం ఎంత ఉన్నదో గదా..!ఇంతా జేసీ వాళ్ళ గురించి రాయకుండా ఎలా ఉంటాడు ఆయన..? ఉప్పాడ ఇంకా పరిసర గ్రామాలకి చెందిన ఈ బోయీలు తల్చుకుంటే భూమండలం అంతా తిరిగిరావచ్చును అంటాడు వీరాస్వామి.వీరు ఎంతో కష్టజీవులు.అయితే మద్యపానానికి వాటికి అలవాటు పడి అప్పులు చేసి,జీవిక కోసం దూర ప్రాంతాలైన చెన్నపట్నం వంటి పట్నాలకి వెళ్ళి బోయీలు గా పనిచేస్తూ బ్రతుకుతుంటారు.ఇంటి నుంచి పారిపొయి మళ్ళ్ళీ రమ్మన్నా రాకుండా ఈ విధంగా జీవితం గడుపుతుంటారు.ప్రయాణం లో వీరికి అనారోగ్యం చేసినా వీరికి తన వద్దనున్న మందులు ఇచ్చి వీరాస్వామి గారు ఆదుకున్నాడు.కొంతమంది కి బాగోలేనప్పుడు వారి బదులు ఇంకోళ్ళని రిక్రూట్ చేసుకోవడం అలా ఉంటుంది..వీరికి అయ్యే ఖర్చులు అన్నీ ఆయనే పెట్టుకున్నాడు.ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,అది మోసిన బోయీలెవ్వరు అనే శ్రీ శ్రీ మాటలు గుర్తుకు రాకమానవు.వీరి గురించి ఇంకా ఎక్కడైన ఎవరైనా పరిశోధన చేశారా అనే సంశయం నాకు వచ్చింది.

ఆ రోజుల్లో నెల్లూరు ప్రాంతం వేశ్యావృత్తికి చెందిన వారికి మిరాశి గా ఉండడం గమనించవచ్చు.గోదావరీ పరీవాహ ప్రాంతం లో భూ వసతి లేని బ్రాహ్మలు లేరు.మేజువాణీలు అవీ సరే.వీరాస్వామి గారి బందువర్గమైన కొచ్చెర్లకోట జమీందారుల ఇళ్ళకి వచ్చినపుడు వారు చేసిన సన్మానాలు గురించి రాస్తూ ఆ నృత్యకారిణులని దారుణం గా అంత సేపు నిలబెట్టి ఉంచడం దారుణం అంటాడు.ఓఢ్ర పండితుల సంస్కృత పాండిత్యం గౌడ దేశీయుల తో పోల్చితే చాలా గొప్పది.కళింగ ప్రాంతం లో ఆ రోజుల్లోని బందిపోట్ల భయం.నాగ్ పూర్ ప్రాంతం దాటిన తర్వాత చెట్లకి వేలాడ దీసి ఉన్న శవాలు...దొంగలకి వార్నింగ్ మాదిరి గా వేలాడదీసిన తెల్ల దొరలు.ఇలా ఎన్నో..ఎన్నో ..విషయాలతో ఎక్కడా రవంత బోరు కొట్టకుండా పుతకం అలా సాగిపోతుంది.

మనకాలపు మహా యాత్రికుడు ఆదినారాయణ గార్కి ఒక సెంటిమెంట్ ఉందీ వీరాస్వామి గారి తో..!సరిగ్గా ఈయన మే 18 న జన్మిస్తే,అదే రోజున వీరాస్వామి తన యాత్ర కి శ్రీకారం చుట్టాడు.అంతే కాదు తిరుగు ప్రయాణం లో ఆయన వీరి యొక్క జన్మస్థలం మీదుగా అమ్మనబ్రోలు వెళ్ళి అక్కడ సత్రం లో బస చేయడం విశేషం.ఆ రకంగా భారత యాత్రా సాహిత్యానికి పితామహుడైన వీరాస్వామి ఆయా ప్రాంతాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.ఇప్పుడు మనం రాయలసీమ,ఆంద్ర,తెలంగాణా అని చెప్పుకుంటున్న తెలుగు ప్రాంతాలు ఈ పుస్తకం లో అనేక రంగుల తో దర్శనమిస్తాయి.అప్పుడు ప్రస్తావించిన చాలా ఊళ్ళని గుర్తుపట్టినపుడు థ్రిల్లింగ్ గా అనిపించకమానదు.

ఇక బ్రౌన్ ఎందుకు ఈ యాత్రా పొత్తాన్ని ముద్రించలేదు అని సందేహం గదా ..?ఆ రోజుల్లో ఆయన బందరు మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు.ఈ యాత్రంతా చేసి వచ్చి రాత ప్రతి ని సాపు చేసి బ్రౌన్ కి పంపితే చాన్నాళ్ళు ఉంచుకొని  మద్రాస్ లో ఓ లైబ్రరీ కి ఇచ్చి వెళ్ళిపోతాడు.వీరాస్వామి కి కూడా సందేహం వచ్చి తన ప్రతి లో ఏమన్నా తప్పు రాశానా అని సరి చూసుకుంటే ఓ పొరబాటు తెలుస్తుంది.తాను యాత్ర లో భాగంగా బ్రౌన్ దొరని కలిసి ఆయన ఆతిధ్యం స్వీకరించినప్పటికీ ఆ ప్రస్తావన ఏదీ పుస్తకం లో రాయలేదు.అయితే దానికీ ఓ కారణం ఉన్నది.తన తమ్ముడు కి ఉద్యోగం వేయించమని ఈ సంధర్భం గా కోరుతాడు.ఇవన్నీ వ్యక్తిగత సంగతులు గదా అని పుస్తకం లో రాయడు.సరిగ్గా అక్కడే బ్రౌన్ మనసు బాధపడి ఉంటుంది.

అయితే ఆయన మిత్రులు అంతా కలిసి పుస్తకం మేము ముద్రిస్తాము అని అన్నా వీరాస్వామి తిరస్కరిస్తాడు.ఏనాటికైనా దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ప్రచురిస్తేనే నాకు నిజమైన గౌరవం అని చెబుతాడు.ఆయన చివరి మాటలు కొన్ని ఇక్కడ పొందుపరిచి ఇక నేను కూడా ముగిస్తాను.

"నిన్నటి నుండి నా పరిస్థితి ఏమీ బాగా లేదు(1836,అక్టోబర్ 3), ..ఈ సాయంత్రం నీరెండలో కూర్చుంటే కొంచెం ఫర్వాలేదు అనిపిస్తూ ఉంది.ఈ నవరంధ్రాల పంజరం లోని చిలుక ఎగిరిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను.జీవితం లో అనుకొన్న పనులన్నీ చేయగలిగాను.నా పుస్తకం ముద్రణ జరిగి ఉంటే ఆ సంతోషం తో మరి కొన్నాళ్ళు జీవించి ఉండేవాడినేమో !అయినా నాకు తృప్తి గానే ఉంది.నా జీవితం లెక్క లో నాకు సున్నా వచ్చింది.అదృష్టవంతుణ్ణి.జన్మరాహిత్యం కలుగజేయమని ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాను.కాశీయాత్రికులకి నా పుస్తకం ఒక కరదీపిక లాగా ఉంటే చాలు...దేవుడు నాకు అన్నీ చాలా ఎక్కువగానే ఇచ్చి దీవించాడు.అంతకు మించి కొరుకోకూడదు.ఇచ్చింది తీసుకోవడమే ఇప్పుడు చేయవలసింది.మణికర్ణికా ఘాటు నుండి ఆ కాశీ విశ్వనాధుని ఢమరుక ధ్వని,గంగానదీ తరంగాల మీదుగా నా కుడి చెవుకు లీల గా వినిపిస్తూన్నది.." (సమాప్తము)--Murthy Kvvs

This is a new version brought by Machavarapu Adinarayana garu.(Pages 8+279+16)Contact no:98498 83570

No comments:

Post a Comment