Sunday, April 28, 2019

"జెర్సీ" సినిమా గురించి రెండు మాటలు..!



ఎంతో బాగుంది అని టాక్ వస్తేనో,ఎవరైనా ఒక సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తేనో ఈ మధ్య కాలం లో సినిమాలు చూడటం జరుగుతోంది.అదీ ఒక్కోసారి కుదరటలేదు కూడా ..పెద్ద రిగ్రెట్స్ కూడా ఉండవనుకోండి.ఇటీవలనే కొన్ని రోజుల క్రితం ఈ జెర్సీ అనే సినిమా ని చూడటం జరిగింది.ఈ సినిమా ముందుకు పోతున్న కొద్దీ ఒక నవల చదివిన చందం గా అనిపించసాగింది.కొన్ని చోట్ల బోరు గా ,బోలు గా ఉండి మళ్ళీ అంత లోనే ప్రేక్షకుడి ని కదిలిస్తూ సాగిపోయింది.కొన్ని హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారు.మొత్తం గా చెప్పాలంటే ఇది దర్శకుని సినిమా...ఆ తర్వాత అందరిదీ.

సెంట్రల్ పాయింట్ చెప్పాలంటే అన్ కండిషనల్ లవ్ అనేది మనుషులను ఏ విధంగా ఉత్తేజపరుస్తుంది ,ఏ త్యాగానికైనా ఎలా ప్రేరేపిస్తుంది అనేది అంతర్లీనంగా చెప్పబడింది.కొడుకు ని కోపం తోనూ నిష్కారణం గా తన మీద తనకి వచ్చే ఉక్రోషం తోనూ కొట్టినప్పటికీ ,ఇంకా ప్రపంచం తనని చూసే వైనం తెలిసినప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఆ చిన్న హృదయం తనపై చూపే ప్రేమ హీరో ని కదిలించడం అనేది చూసేవారిని కదిలింపచేస్తుంది.ఉద్యోగం పోయి ఇలాంటి బాధల్ని అనుభవిస్తూ బయటకి చెప్పుకోలేని స్థితి లో ఉండే వారిని మనం నిజజీవితం లో ఎంతో మందిని చూస్తాము.ఒక చిన్న మొత్తం కోసం ప్రపంచం మొత్తాన్ని దేబిరించినా దొరకని రోజులు ఉంటాయి.ఎత్తు పల్లాలు ఎంత వారికీ సహజం.వాటిని అన్నిటిని అర్ధం చేసుకొని సినిమా గా అనువాదం చేయడం గొప్ప విషయం.

కొన్ని సీన్లు కన్నీళ్ళు తెప్పించేవి గానూ ఉన్నాయి.ఈ మధ్య కాలం లో ఈ తరహా చిత్రం ఇదే అని చెప్పవచ్చు.జెర్సీ కొనడానికి 500 కోసం చేసే ప్రయత్నం,తన ఉద్వేగాన్ని వ్యక్తం చేయడానికి కదులుతున్న రైలు సౌండ్ ని ఎంచుకోవడం,తన పేరు లిస్ట్ లో చూసుకోడానికి కూడా భయపడుతూ దూరం గా నిలబడిపోవడం,అంతలోనే ఇంకో వ్యక్తి ఇతడిని చూసి చిన్నగా నవ్వడం ,అప్పుడు చూసుకోవడం ఇలా ఇంకా కొన్ని సన్నివేశాలు ఎంతో చక్కగా ఉండి అలరిస్తాయి.అయితే కొన్ని చోట్ల మరీ నసిగినట్లుగాను,ఏ భావం లేనట్లు గా ఉండడం ..అవసరమైన చోట కూడా ...అలా పాత్రలు బిహేవ్ చేయడం అసంతృప్తి గా అనిపించినా అవి పెద్ద గా నిరాశ పరచవు ప్రేక్షకుడిని.ఈ టైప్ దాన్ని అండర్ ప్లే అంటారు గాని కొన్ని సార్లు అది ఓకే.

సత్యరాజ్ కి ఇంకా చిన్న కుర్రాడు రోనీ కి ఎక్కువ మార్కులు వేశాను.ఆ పిమ్మట నాని,హీరోయిన్ శ్రద్ధ కి.ఇక మిగతా క్రూ ఓ.కె.నన్ను చెప్పమంటే ఏ కొత్తవాళ్ళు దీంట్లో హీరో హీరోయిన్ లు గా నటించినా సినిమా ఇదే విధంగా హిట్ అయి ఉండవచ్చు.కొత్తవాళ్ళు అయితే టాక్ బయటకి రావడానికి కొద్ది సమయం పట్టేది.అది వేరే విషయం.చాన్నాళ్ళకి మెదడు ఒక్కదానితోనే కాక హృదయం తో కూడా ఆలోచించి తీసిన సినిమా గా అనిపిస్తుంది.ఒక వెంటాడే సినిమా ని చూసిన తర్వాత ,ఆ సినిమా చూసి వస్తూంటే మనసు  లోపల అంతా ఖాళీ అయి నిశబ్దం అయిన అనుభూతి కలుగుతుంది.జెర్సీ కూడా అటువంటిదే.తెలుగు సినీ చరిత్ర లో ఆణిముత్యాల వంటి సినిమాల్లో ఇది ఒకటి గా నిలిచిపోతుంది.   

No comments:

Post a Comment