Wednesday, May 8, 2019

ఇదిగో ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అది.



భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచయితల లో మనోజ్ దాస్ ఒకరు.తన మాతృ భాష ఒడియా లోనూ ఇంకా ఆంగ్లం లోనూ సమానమైన ప్రతిభ తో రచన చేసి రెండు భాష ల లోను పాఠకుల ను అలరించి తనకి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.గతం లో ఆయన రాసిన Mystery of the missing cap అనే కధా సంపుటి పైన ఇంకా Bulldozers అనే నవలిక మీద నేను నా అభిప్రాయాల్ని రాసిఉన్నాను.ఇప్పుడు ఆయన ఆత్మకధ అనదగిన మరియొక పుస్తకం Chasing the Rainbow (Growing up in an Indian village) మీద కొన్ని మాటలు రాస్తాను.

మనోజ్ దాస్ 1934 లో శాంఖరి అనే ఓ గ్రామం లో జన్మించారు.ప్రస్తుతం అది బాలాసోర్ జిల్లా లో ఉన్నది. సముద్రం పక్కనే ఉన్న ఆ చిన్న ఊరి లోను,ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న జమాల్ పూర్ ,జలేశ్వర్ లోనూ ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత విద్య ని అభ్యసించారు.తనకి జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ వయసు లో తను చూసిన జీవితాన్ని ఈ పుస్తకం లో వివరించారు.అవి బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజులు.అప్పటి గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది,ఏ విధమైన పద్ధతులు వివిధ రంగాల్లో కొనసాగేవి మనము కళ్ళకి కట్టినట్లుగా తెలుసుకోవచ్చును.

దీనితో బాటుగా అప్పటి సంస్థానాధీశుల పోకడలు , బ్రిటీష్ అధికారులకి వారు ఇచ్చే అలవిమాలిన గౌరవం కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరి కొన్ని సార్లు అయ్యో అనిపిస్తుంది.మనోజ్ దాస్ గారి కుటుంబం పెద్ద భూస్వామ్య వర్గానికి చెందినది కావడం వల్ల ఆ శాంఖరి గ్రామం లోనూ మిగతా చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఏ లోటు లేకుండానే గడిచినట్లు చెప్పవచ్చు.విద్యార్జన చేసే సమయం లో స్కూల్ లోనూ,హాస్టల్ లోనూ తనకి ఎదురైన అనుభవాలను ఎంతో రమ్యమైన శైలి లో చెప్పారు.మొదటి ప్రపంచ యుద్ధం జరిగే ఆ రోజుల్లో స్కూల్ లో దానిగురించి చర్చించుకోవడం మళ్ళీ దాంట్లో ఓ మేష్టారు జపాన్ దేశ అభిమానిగా ఉండి ఆ దేశమే గెలుస్తుందని పందెం వేయడం ఆ రోజుల్లోకి అలా తీసుకువెళతాయి ఇలాటి సన్నివేశాలు..!

ఈ గ్రామం బెంగాల్ కి బోర్డర్ లో ఉండడం వల్ల అందరికి బెంగాలీ భాష వస్తుంది.కలకత్తా కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడి ఫేషన్ లను అనుసరించడం గురించి చెబుతారు.దాస్ గారి నాన్నగారు కలకత్తా లో ఇల్లు కొందామని వెళ్ళి ఎలా మోసపోయింది వివరించారు.అదే సమయం లో బెంగాలీ బాబు ల సంగీత అభిమానాన్ని చెబుతూ ఇంకో కోణాన్ని చూపుతారు.ఆనాటి స్థానిక రాజుల గురించి చెపుతూ ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది ఒక ప్రిస్టేజ్ ఇష్యూ గా ఉండేది...దాస్ గారికి పరిచయం ఉన్న ఓ యువరాజా వారు ఇంగ్లీష్ తప్ప లోకల్ భాష అసలు మాట్లాడేవాడు కాదుట..అవతలవారికి అర్ధం గాకపోయినా సరే ముందు ఇంగ్లీష్ లో చెప్పి ..ఆ తర్వాత స్థానిక భాష లో చేపేవాడట.

అలాగే సముద్రం సమీపం లో ఉండే ప్రాంతాల యొక్క సొగసు,అదే సమయం లో తుఫాన్లు వచ్చినప్పుడు వారి పాట్లు ఇందులో చదివి తెలుసుకోవచ్చు.రచయిత యొక్క ఇంటి లో మూడుసార్లు దొంగలు పడి దోచుకోవడం అప్పటి స్థితిగతులు అవన్నీ వివరించారు.స్వాతంత్ర్యం వచ్చిన రోజున వీరి బడి లో జరిగిన సంబరాలు, ఏ విధంగా హార్మనీ వాయించుకుంటూ పాటలు పాడి ఆనందించినది వివరించారు.ఇవనే కాదు ఇంకా అనేకం ఉన్నాయి.రమారమి 160 పేజీల్లో,చాప్టర్ల వారీ గా విభజించి ఆనాటి ఆయా ప్రాంతాల జీవన సౌరభాల్ని ఈ పుస్తం లో అందించారు.బ్రిటీష్ ఇండియా లో మన దేశం లో ని వివిధ ప్రాంతాలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు వచ్చినపుడే గదా తెలుసుకోగలం.చరిత్ర ని బోరు కొట్టే ఓ సబ్జెక్ట్ గా కాకుండా ఆసక్తి గా చదివే అంశం గా కూడా చెప్పవచ్చును.ఇదిగో ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అది.

--Murthy Kvvs

No comments:

Post a Comment