Saturday, August 24, 2019

ఆమె ఆత్మహత్య నివ్వెరపరిచింది....!



ఇప్పుడే జగద్దాత్రి గారి ఆత్మహత్య వార్త చూశాను.సాహిత్యం తో పరిచయం ఉన్న వారికి ఆమె సుపరిచతం. అందునా ఫేస్ బుక్ వలన ఇంకా ఎక్కువ  తెలుసుకోగలిగాను. ఆమె భావ జగత్తు ని అనేక కోణాల నుంచి దర్శించగలిగాను.అందువల్లనే అనుకుంటా ఆమె మరణ వార్త  తో కలత చెందినది నా
 మనసు. మొదటి సారిగా ఫేస్ బుక్ మీద అవ్యాజానురాగం  కలిగింది,ఎటువంటి మానసిక బంధాలను ఈ మాధ్యమం ఏర్పరిచింది అని ..? తెలుగు వారు కళ్ళారా చూసిన గొప్ప విదుషీమణి జగద్దాత్రి.తెలుగు తో పాటు ఇంగ్లీష్ లోను చాలా బాగా రాస్తుందావిడ. రెండు భాషల్లోనూ అంత ఈజ్ తో రాసే వారు నాకు తెలిసీ చాలా తక్కువ.

ఒక పది రోజుల క్రితం అనుకుంటా.నేను ఆమెకి ఫోన్ చేశాను.నా ఇంగ్లీష్ కధల గురించి చెబుతూ పూర్తిగా చదివి తర్వాత నేనే ఫోన్ చేస్తాను అని చెప్పారు. ఆమె వాట్సాప్ ప్రొఫైల్ ఆత్మ జ్ఞానాన్ని తెలియజేసే పిక్స్ ని పెట్టుకునేవారు.కొన్నిసార్లు తన బాల్యం లో ని ఫోటోల్ని పెట్టుకునేవారు.ఎందుకనో అవి తను తీరని బాధలో ఉన్నట్లుగానే తెలుపుతుండేవి. ఆ పెద్ద బొట్టు ,నిండైన గుండ్రని ముఖము,మెరిసే కళ్ళు గుర్తుకు వచ్చినప్పుడు మన ఇంటి లోని పెద్దక్క లా అనిపించేది తప్పా మరో రకంగా తోచేది కాదు. ఒక్కొక్కరూ  మనలో అలా ఫిక్స్ అయిపోతుంటారు దానికి కారణాలు చెప్పమంటే కష్టం.

సరే...ఏ మనిషి అయినా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలని అనుకుంటాడు..? ఈ ప్రపంచం లో ఇమడటం ఇష్టం లేనప్పుడే కదా ,దానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి.జగతి గారికి మనం ఎవరం చెప్పనవసరం లేదు...జీవితాశ గురించి..ఎంతో పరిణితి గలిగిన వారు.అన్ని రకాలుగా ఆలోచించగలిగే వ్యక్తి. నిజానికి ఆలోచన ఎక్కువ కలిగిన వారిలోనే ఈ ధోరణి ఎక్కువ ప్రబలుతుంది. కొన్ని  నిముషాలు బాధ పడితే చాలు, శాశ్వతం గా ఉండే బాధలనుంచి పూర్తి గా విముక్తి పొంద వచ్చును అనే ఆలోచనే మనిషిని ఆత్మహత్య కి పురికొల్పుతుంది. పిరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అనేది అర్ధ సత్యం.     


ఆత్మహత్య కి పాల్పడి అనుకోని విధంగా బతికి బయటబడిన రష్యన్ రచయిత దోస్తోవిస్కీ తన అనుభవాన్ని ఇలా వివరిస్తాడు."ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను అనే ఆలోచన నన్ను శాంతి మయుడిని చేసింది. నా కన్నీరు శరీరం బయటకి కారడం తో బాటు లోపలికి కారడం కూడా గమనించాను." 

 --మూర్తి కెవివిఎస్
       


      

No comments:

Post a Comment