Thursday, September 5, 2019

మనోజ్ దాస్: ఆంగ్ల, ఒడియా భాషల్లో వారి కృషి



మనోజ్ దాస్. ఈ పేరు ఒడిస్సా లో ప్రతి ఇంటికి తెలిసిన పేరు. ఒరియా భాష లో అసంఖ్యాక రచనలు చేసి ఓ లెజెండ్ గా నిలిచిన సుప్రసిద్ధ రచయిత. అది మాత్రమే కాదు,ఆంగ్ల భాష లో కూడా అదే అభినివేశం తో అసంఖ్యాక రచనలు చేసి భారతీయ ఆంగ్ల రచయితల్లో ముందు వరుస లో ఉన్న రచయిత గా ద జర్నల్ ఆఫ్ కామన్ వెల్త్ వర్ణించింది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మొదటిసారి గా ఆయన ఆంగ్ల రచనల తో పరిచయం ఏర్పడింది.ఆయన కధలు,నవలలు ఇంకా ఇతర రచనలు చదివినప్పుడు ఈయన కేవలం ఇంగ్లీష్ లోనే రాస్తారని అనుకునేవాడిని.నా ప్రయాణాల్లో భాగంగా ఒరియా ప్రజల్ని కలిసినపుడు తెలిసినది ఏమంటే ఒరియా సాహిత్యం లో ఆయన మేరు నగధీరుడు అని. అంతేకాదు శైలి పరంగా ఆయనకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది.

నేను అచ్చెరువొందాను. ఆంగ్లం లో అంత చక్కని పాండితీ ప్రకర్ష తో రాసే ఆయన ఒరియా భాష లో కూడా తనకంటూ ఒక గొప్ప స్థానం ని ఏర్పరుచుకోవడం ద్విభాషా రచయిత గా రెండు భాషల్లోనూ చదివే వారిని అలరించడం మామూలు విషయం కాదు.అప్పుడు నాకు కొన్ని సందేహాలు కలిగినవి. ఈయన ఆలోచించేప్పుడు ఏ భాషలో ఆలోచించి రాస్తారు అని.అలాగే రెండు భాషల మీద సాధికారత ఎలా సంపాదించగలిగారు అని. ఇలా ఇంకా కొన్ని. అయితే ఆయన వివిధ పత్రికలకి అనగా ది హిందూ,హిందూస్థాన్ టైంస్,ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి వాటికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల నా సందేహాలు చాలా తీర్చుకోగలిగాను.



ప్రకృతి లో ఏదో మాయ ఉంది.ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలని పరితపిస్తుంటామో ,లోపల అలజడి కలిగి ఆవేదన చెందుతుంటామో అది ఒకనాటికి సాకారమై మన ముందు నిలుస్తుంది. యావత్తు సృష్టి అంతా అలా సమకూడి చేయిస్తుంది.మరి లేకపోతే ఏమిటి...మనోజ్ దాస్ గారికి ఎంతో ఆత్మీయుడు,దాస్ గారి సాహిత్యాన్ని ఇంకా ప్రజల్లో కి తీసుకు వెళ్ళడానికి ఎంతో కృషి చేస్తోన్న సమీర్ రంజన్ దాస్ గారు నాకు మంచి మిత్రులు కావడం ఏమిటి..ఆయన నేనూ ఆ చత్తిస్ ఘడ్ ,ఒడిసా సీమల్లో ఆహ్లాదం గా సంచరించడం ఏమిటి...మా భద్రాద్రి గోదావరి ఒడ్డున కూర్చొని ఫోన్ లో మనోజ్ దాస్ గారి తో మాట్లాడటం ఏమిటి...అంతా ఓ కల లా తోచే నిజం. ఇక్కడ సమీర్ రంజన్ దాస్ గారి గురించి కొంత చెప్పాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ స్థాయి లో ఉన్న ఆయనకి కూడా దేశ సంచారం అంటే ఇష్టం.అందువల్ల బ్యాంక్ శాఖల్ని తనిఖీ చేసే సెక్షన్ కి వెళ్ళి ఆ విధంగా వివిధ రాష్ట్రాల్ని చూస్తూ అదే విధంగా తన విధి నిర్వహణ కూడా చేస్తుంటారు.

మనోజ్ దాస్ గారి సాహిత్యం,జీవిత కృషి వీటన్నిటిని వివరించే ఒక వెబ్ సైట్ ని నిర్వహిస్తూ ప్రతి రోజూ ఆయన దానిలో ఎన్నో పోస్ట్ లు పెడుతుంటారు. వార్తల వివరాలు,ప్రసంగ వివరాలు,సాహిత్య వ్యాసాలు,రచనల్ని మౌఖికంగా రికార్డ్ చేయడం ఇలా చాలా పని చేస్తుంటారు. ఏ మాత్రం దొరికినా ఆయన సమయం అంతా ఇలానే వెచ్చిస్తూ ఉంటారు. ప్రతి రోజు మనోజ్ దాస్ గారి అసంఖ్యాక రచనల లోనుంచి గుళికల్ని ఏరి వివిధ సందర్భాలకి అనుగుణంగా పాఠకులకి ఫేస్ బుక్ ద్వారా అందిస్తుంటారు.

సరే...మనోజ్ దాస్ గారు పుట్టింది ఒడిసా లోని శాంఖరి అనే సముద్ర తీరం లోని గ్రామం లో.అది బాలాసోర్ జిల్లా లో ఉన్నది.అక్కడే ఆయన బాల్యం గడిచింది. దాన్ని కేంద్రం గా చేసుకుని Chasing the Rainbow అనే పుస్తకం రాశారు. 1934 లో తాను పుట్టింది మొదలు ప్రాధమిక విద్యాభ్యాసం వరకు తన స్మృతులు అన్నిటిని కడు రమ్యంగా చిత్రించారు. తన కాలేజీ రోజుల్లో వామపక్ష భావాల తో బాగా ప్రభావితమయ్యి ఎన్నో ఉద్యమాల్లో  ఫాల్గొన్నారు. ఇండోనేషియా లోని బాండుంగ్ లో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో తన వాణి ని వినిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని ఏళ్ళ కి విచిత్రం గా ఆయన పై అరవిందుని ప్రభావం బలం గా పడింది. 1963 వ సంవత్సరం నుంచి పాండిచ్చేరి లోని అరవింద ఆశ్రమం కి మళ్ళి అక్కడే స్థిరపడి ఆశ్రమం లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ సాహిత్యం ,అరవింద తత్వాన్ని బోధించే ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు.     

దేశ,విదేశ భాషలు ఎన్నిటి లోనికో మనోజ్ దాస్ గారి రచనలు అనువాదం అయినాయి. బ్రిటిష్ రచయిత గ్రాహం గ్రీన్ దాస్ గారి గురించి రాస్తూ ఆర్.కె.నారాయణ్ తర్వాత తనకి నచ్చిన ఇండో ఆంగ్లికన్ రచయిత గా పేర్కొన్నారు. లండన్ లోనూ,ఎడింబర్గ్ లోనూ అరవిందుని గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాల్ని శోధించారు.ఆ కృషి కి గాను ఆయన కి మొట్ట మొదటి అరబిందో పురస్కార్ ని పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ తో గౌరవించింది.సరస్వతి సమ్మాన్ వరించింది.పద్మశ్రీ తోనూ గౌరవించబడ్డారు.ఎన్నో యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఎంతో ఉన్నది.సింగపూర్ ప్రభుత్వం అక్కడి ఉపాధ్యాయులకి శిక్షణ ఇప్పించేందుకు గాను కొంతకాలం నియమించింది.దాదాపు 83 ఏళ్ళు దాటిన ఈ వయసు లోనూ సమావేశాల్లో ఫాల్గోవటానికి దేశ విదేశాలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రసిద్ధ ఆంగ్ల మాస పత్రిక Heritage కి కొంత కాలం సంపాదకత్వం వహించారు. ప్రసిద్ధ ఒడియా,ఆంగ్ల పత్రికల్లో నేటికీ మనోజ్ దాస్ గారి కాలంస్ వస్తూనే ఉంటాయి.

అటువంటి మనోజ్ దాస్ గారు వివిధ సమయాల్లో వివిధ పత్రికల కి ఇచ్చిన ఇంటర్వ్యూలను తెలుగు లోకి అనువదించితే ఎన్నో మంచి విషయాలు తెలుగు పాఠకులకి తెలుస్తాయి. ఈ విషయమై సమీర్ రంజన్ దాస్ గారిని అడిగినప్పుడు సంతోషం గా అంగీకరించారు.వీలు వెంబడి  తెలుగు లోకి అనువాదం చేసి అందించుతాను.అవి నూతన ద్వారాలు తెరిచేవి గా ఉంటాయని భావిస్తున్నాను.         

No comments:

Post a Comment