Thursday, October 3, 2019

"చప్పుడు" ఆదివాసి కధలు



"చప్పుడు" ఒక విన్నూత్నమైన కధల సమాహారం. దీనిలో ఉన్నవి నాలుగే కధలు.అయితే ప్రత్యేకత ఏమిటంటే ఇవి కోయ ఆదివాసీ జీవితం లోని ఒక ముఖ్యమైన భాగాన్ని స్పృశించిన కధలు. అన్నీ కూడా చావు అనే తంతు ని ఆధారం గా చేసుకుని సాగినవి.నిజానికి మనిషి జీవితం లో అతి ప్రధానమైనవి రెండే.ఒకటి పుట్టుక,మరొకటి మరణం.ఈ మధ్యలో సాగేదంతా ఎవరి గొడవ వారిది.ఈ కధల సంపుటి ని రచించిన వారు పద్దం అనసూయ ,స్వయం గా ఆదివాసి.తన జనుల జీవితాన్ని ప్రపంచానికి ఎత్తి చూపాలన్న ప్రయత్నం లో నుంచే ఈ రచన ను ముందుకు తెచ్చారు. నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిసారి.ఇందుకు గాను ఆమె కి తెలుగు సాహిత్య చరిత్ర లో ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఈ పుస్తకం ఇచ్చే స్ఫూర్తి తో మున్ముందు ఇంకా ఎంతమందో ఆదివాసీ రచయిత్రులు రకరకాల తమ జీవిత పార్శ్వాల్ని,కాలం మరుగున పడి కనిపించని గర్వకారణమైన తమ చరిత్ర ని తప్పకుండా వెలుగు లోకి తీసుకు వస్తారు.అటువంటి ఉత్సూకత ని రేకెత్తించే గుణం ఈ కధా సంపుటి లో నిండుగా ఉన్నది.

బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి నవల వల్ల సంతాల్ ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా యొక్క చరిత్ర ప్రపంచానికి తెలిసింది. అలాగే గోపీనాధ్ మొహంతి ఒరియా లో రాసిన "అమృత సంతాన" నవల కోంధ్ ఆదివాసీ తెగ యొక్క చరిత్ర ని అతి రమ్యంగా చిత్రించింది. ఈ నవల తెలుగు అనువాదం ఇటీవల గొప్ప ప్రాచుర్యానికి నోచుకున్నదని చెప్పాలి.దానికి కారణం వాడ్రేవు చినవీరభద్రుడు గారు అని చెప్పక తప్పదు.ఆయన దీన్ని మహా భారతం కన్నా గొప్ప దని అభిప్రాయపడ్డారు. అలాగే వీటి అన్నిటికి కంటే ముందు బ్రిటీష్ వారు పాలన లోనే ఓ గొప్ప నవల బెంగాలీ లో వచ్చింది.దానిపేరు "అరణ్యక". రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ. క్రమేణా ఇవి అన్నీ అనేక ఇతర భాషల్లోకి అనువదింపబడి అనేక కారణాల వల్ల వెలుగు లోనికి రాని ఈ దేశ మూలవాసుల జీవిత కోణాల్ని  ప్రభావవంతం గా చూపించినవి. అయితే వీటిని రచించిన వారు జన్మతహ ఆదివాసీలు కారు. అది గమనించవలసిన విషయం.

వీటితో సరితూగే నవల గాని కధా సంపుటి గాని తెలుగు లో ఆదివాసీ జీవితాల్ని స్పృశించినవి లేవనే చెప్పాలి.ఒకటీ అరా ఉన్నా అవి రాజకీయ కోణాన్ని చూపినంతగా ఆదివాసుల సంస్కృతిని చూపించలేదనే చెప్పాలి. తరువాత ఆదివాసీ స్వభావం లోని కొన్ని కోణాల్ని అర్ధం చేసుకోలేకపోయినారు. మిగతా అణచబడిన వర్గాల మాదిరి గానే,ఆదివాసులు తమ కన్నా తక్కువ వారని శిష్ట వర్గ రచయితలు భావిస్తూ ఆ కోణం లోనే రాయడం కనబడుతుంది. నిజానికి ఒక ఆదివాసి తాను మిగతా వారికంటే తక్కువ వాడినని గాని,అధికుడిని అని గాని భావించడు.
   
హిందూ మతం లో భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ తో తనకి ఎలాంటి సంబంధమూ లేదు.బయటి ప్రపంచం లోనికి వచ్చినపుడే దీని స్వభావం అర్ధం కావడం మొదలవుతుంది. సరే..ఇలా పరిశోధించుకు పోతున్న కొద్దీ ఎన్నో వైరుధ్యాలు ఉన్నవి.ఒక ఆదివాసి రచయిత తన జీవితాన్ని గురించి రాయడం అంటే ఎన్నో అంశాల్ని సాధికారికంగా  బయటి ప్రపంచానికి అందించడం.ఇదిగో...ఇప్పుడు ఇలా పద్దం అనసూయ గారి రూపం లో ఒకరు ఇక్కడ ఉన్నారు.కాబట్టే ఇది ఒక ప్రత్యేక సమయం. 

సరే...ఇప్పుడు అనసూయ గారి కధల లోనికి కొద్దిగా తొంగి చూద్దాము.మొదటి కధ పేరు "కాకమ్మ". వయో భారం తో ఉన్న ఒక స్త్రీ. తమ జాతికి చెందని సూదర వ్యక్తి ని కూతురు పెళ్ళి చేసుకోవడం దానివల్ల ఆమె పడే వ్యధని దీని లో చిత్రించారు. అలా బాధ పడుతూనే అంగీకరిస్తుంది.ఆ తర్వాత ఎవరి చేత చేయించుకోకుండా,ఎవరి మీద ఆధారపడకుండా తన చావు ని ఆహ్వానిస్తుంది.అదే విధంగా పెళ్ళి తంతులు కూడ తమ ఆచారాల నుంచి దూరం గా అయిపోవడం దీనిలో ప్రధానం గా చోటు చేసుకున్న వైనం కనిపిస్తుంది.ఈ కధలో వాడిన భాష గాని,   వ్యక్తీకరణలు గాని ఒక సగటు ఆదివాసీ స్త్రీ వలెనే ఉంటాయి తప్ప నేల విడిచి సాము చేయడం ఉండదు.కధలోని వర్ణనలు సహజం గా ఉన్నాయి.ఉదాహరణకి గోడకి వేళాడుతున్న ఫోటోని పిచుక తన ముక్కు తో టక టక మని పొడవడం.అది పొగచూరి ఉండిన ఎప్పటిదో అయిన ఫోటో కావడం.గుంపు కి బత్తెం గా పంది ని కోయాలన్న తన కోరిక నెరవేరకపోవడం...ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.

ఇక "చప్పుడు"అనేది రెండవ కధ. ఈ కధ లో ఓ ముఖ్యమైన అంశాన్ని చెప్పారు. ఆదివాసీ ల జీవనం లో చావు కి చాలా ప్రాధాన్యత ఉన్నది.పూర్భం అనే ప్రక్రియ ని ఈ సంధర్భం గా డోలీ కులస్తులు వచ్చి నిర్వహిస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క వంశ చరిత్ర, వివిధ ఇంటి పేర్ల వారి తో వారికి గల సంబంధాలు,జాతి కి సంబందించిన వివిధ అంశాలు దీని లో చోటు చేసుకుంటాయి.డోలి లు వీరికి చరిత్రకారుల వంటి వారు.వీళ్ళు వచ్చి ఆ తంతులు చేస్తేనే ఆత్మ శాంతిస్తుందని నమ్మిక.మరి ఇలాంటి తంతులు పట్టణం లో చేయాలనుకున్నప్పుడు ఒక కోయ ఆదివాసీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కున్నది అన్నది ఈ కధలో చెప్పారు. అడవి లోని గ్రామాల లో రాత్రిళ్ళు కొన్ని రోజుల పాటు లయ బద్ధంగా డోళ్ళు కొడుతూ చేసే ఈ తంతులు దూరం గా ఉండి వింటూ ఉంటేనే చళ్ళని ఆ గాలితో పాటూ ఎక్కడెక్కడి ఆత్మలు అక్కడికి చేరుకున్నవా అని వళ్ళు ఝల్లుమంటూ కూడా అనిపిస్తాయి.
"ముసిలి" అనేది మూడవ కధ. ఈ కధ లో తునికి ఆకులు కోయడానికి వెళ్ళిన ఒక ముసలామె చనిపోవడం. పెంపుడు కుక్క బెంగ పడి ఆ తర్వాత  మరణించడం ఇతివృత్తం.కాని ఈ కధ లో అడివి ని వర్ణించిన తీరు హృద్యం.అల్లి పొదల్లో ఎలుగు గొడ్లు ఉండటం,తునికి ఆకుల పొదకు దండం పెట్టి దీని లో కూడా  తొలాకు తెంపడం,ఆనముంతను పట్టుకోవడం..ఇలా అచటి జీవితాన్ని రమ్యంగా కళ్ళకి కట్టించారు. చావు సమయాల్లో జరిగే తంతుల్ని మరిన్నిటిని చెప్పారు. ముసలామె రాత్రి తాగే చుట్టని మిణుగురు తో పోల్చడం బాగుంది. Both extremes meet అని ఒక మహానుభావుడు చెప్పినది గుర్తుకు వచ్చింది.పొగ త్రాగడం అనేది కేవలం మగవారికి సంబందించిన అంశం కాదు ఏ ఆదివాసీ సమాజం లోనైనా..! అది ఒక టేబూ లాగానూ పరిగణింపబడదు. అలాగే అది పాశ్చాత్య సమాజాల్లోనూ అంతే గదా.

ఇక నాల్గవ కధ "మూగబోయిన శబ్దం" . కోయ ఆదివాసీ సమాజం లో జరుగుతోన్న మతాంతీకరణలు,అవి తెస్తున్న సమస్యల్ని ఈ కధ లో తెలియజేశారు.కన్వర్ట్ కాబడిన వారు తమ చావు ల సమయాల్లో అనూచానం గా వస్తోన్న పూర్బం లాంటి ఆచారాల్ని పాటించక పోవడం ఇంకా అవి ఏ విధంగా ఐక్యత ని భంగపరుస్తున్నవీ వివరించారు.నెక్కర పండ్లు చెట్లు కనబడగానే నోరు ఊరడం, కారంగి చెట్టు మీద ముకు జారుడు పిట్ట టక్ టక్ మని కొట్టుకోవడం వంటి భావ చిత్రాలు పాఠకుల్ని ఎక్కడికో తీసుకు పోతాయి.అనాది గా చావులప్పుడు తమ చరిత్రల్ని గానం చేసి వాటిని కాపాడుకుంటూ వస్తూన్న డోలీ లు ఇక తమ కి దూరం అవ్వవలసిందేనా..అని ప్రశ్నిస్తూ ఈ కధని ముగిస్తారు.

రచయిత్రి యొక్క శైలి ఆహ్లాదకరం గానూ,చదవ దానికి హాయి గానూ ఉంది.పాల్వంచ పరిసర ప్రాంతాలలోని గ్రామాల లోను ఇంకా పాల్వంచ లోనూ ఈ కధలు నడుస్తూ ఉంటాయి.కోయ భాష లోని పదాల్ని అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఉపయోగించినా ఎక్కడా అవి కధాగమనాన్ని అడ్డుకోవు.ఎంచుకున్న అన్ని కధల్లోనూ ఇతివృత్తం "చావు" అనే  చెప్పాలి. అయినప్పటికి వస్తువు ని చెప్పే విధానం లో ఎక్కడా తడబాటు లేకుండా నడిపించారు. ఇక ముందు మరిన్ని ఆదివాసీ జీవితానికి సంబందించిన ఇతివృత్తాల్ని ఎంచుకొని  ముందుకు సాగాలని తద్వారా తెలుగు సాహితీ రంగం లో మరిన్ని నూతన కాంతులు వెదజల్లాలని కోరుకుందాం. ఈ సందర్భం గా రచయిత్రి అనసూయ గారికి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. సంతాల్ ఆదివాసీ గాధల్ని ఎంతో హృద్యం గా ఆంగ్లం లో రాస్తున్న హన్స్దా సౌవేంద్ర శేఖర్ యొక్క రచనల్ని బాగా చదవ వలసిందిగా సూచిస్తున్నాను. The Adivasi will not dance  అనే ఆయన కధా సంపుటి కి " హిందూ" దిన పత్రిక 2015 కు గాను పురస్కారాన్ని సైతం ఇచ్చింది.నేడు ఆదివాసీ సమాజాల్లో వస్తూన్న మార్పులు ఇంకా సమస్యలు వీటన్నిటిమీద ఎంతో అవగాహన తో రాసే ఆయన జార్ఖండ్ లోని తమ సంతాల్ తెగ కు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు.

---మూర్తి కె.వి.వి.ఎస్. 

     




   





No comments:

Post a Comment