Saturday, November 16, 2019

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం - నా అభిప్రాయాలు

ఇంగ్లీష్ మీడియం ని ప్రభుత్వ పాఠశాల లో ప్రవేశ పెట్టడం మంచిదా కాదా అనే విషయం మీద అనేక విధాలైన అభిప్రాయాలను గత కొన్ని రోజులు గా సోషల్ మీడియా లో చదువుతున్నాను. ఇక ఉండబట్టలేక నా వంతు పని నేను కూడా చేయాలనిపించి ఈ నాలుగు ముక్కలు రాయదలుచుకున్నాను.ముందుగా మిత్రులు ఒకటి గమనించవలసింది గా మనవి చేస్తున్నాను.

నా అభిప్రాయాలు మీకు భిన్నం గా ఉండి ఉండవచ్చును.అంత మాత్రం చేత మీ ఇతర అభిప్రాయాలకు నేను వ్యతిరేకిని అని కాను.అది గమనించి ఈ చర్చ కి మాత్రమే ఇది పరిమితమని గుర్తెరిగి ముందుకు పోదాము.ముందుగా,అసలు ఒకటి చెప్పుకుందాము.హిపోక్రసీ అంటే ఏమిటి..? ఒకటి మనసు లో పెట్టుకొని ఇంకొకటి బయటికి వెల్లడించడం,నేను ఒక పని చేస్తాను.కాని అదే పని నువు చేస్తే మాత్రం అబ్బే..అది చేయదగిన పని కాదు అంటూ పెదవి విరవడము. ఇటువంటిదేగదా..!

గుండె మీద చెయ్యి వేసుకొని మాట్లాడుకుందాము.నా తెలుగు భాషని, సంప్రదాయాన్ని,సంస్కృతి ని నిలబెట్టడానికి తెలుగు మీడియం లోనే మా పిల్లల్ని చదివించుతాను అనుకునే తల్లిదండ్రులు ఈ రోజున ఎంత మంది ఉన్నారు..? అలా గనక ఉంటే ఇన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మన చుట్టూ మనగలిగేవేనా..?అసలు తెలుగు ని ఒక సబ్జెక్ట్ గా కూడా బోధించని పాఠశాలలు ఉన్నాయి.వాటి ముందుకు పోయి ధర్నాలు ఎవరూ ఎందుకు చేయరు..?మరొకటి...ఇంగ్లీష్ మీడియం లో చదవడం వల్ల క్రైస్తవీకరణ జరుతుందట.

ఆయా పాఠశాలల్లో కావాలనే గదా చేర్చేది.కేథలిక్స్ ఇంకా ఇతర శాఖల వారు స్థాపించిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ లో కాలేజీల్లో చేర్పించడానికి ఘనత వహించిన రాజకీయనాయకులు,పెద్ద వ్యాపారస్తులు,బ్యూరోక్రాట్లు బారులు తీరుతుంటారు.వారికి తెలియదా అక్కడ ఏమి జరుగుతుందో..!వారు తల్చుకుంటే ఈ క్రైస్తవీకరణ చేస్తున్న విద్యా సంస్థల్ని నీరు గార్చలేరా..? వారికి కావాలసింది ఒక పద్ధతి ప్రకారం విద్యని సక్రమంగా బోధిస్తారని..!చేర్చుతారు. అవకాశం లేనివారు ఇంకా కొద్ది కింద స్కూళ్ళకి వెళతారు.అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం లోనే సుమా..!ఫలానా ప్రైవేట్ స్కూల్ లో తెలుగు అసలు చెప్పరట అని  పేరు వస్తే అసలు ఆ స్కూల్ కుండే క్రేజ్ మామూలు గా ఉండదు.ఇదంతా జరిగేది మన మధ్యనే.కాని ఈ సంప్రదాయ తెలుగు వాదులు అక్కడికి పోయి ఏ ధర్నాలు చేయరు.

నిజంగా బ్రిటీష్ వాళ్ళు మనల్ని అందర్ని క్రైస్తవులు గా చేయాలి అనుకుంటే సునాయాసం గా ఎప్పుడో చేయగలిగేవారు.పిడికెడంతమంది వచ్చి కోట్లమంది ఉన్న ఈ ఉపఖండాన్ని జయించి పాలించగలిగిన వారికి అది ఒక లెక్కా..? కానే కాదు. మరి ఎక్కడ ఉంది కీలకం. వారి భాష లోకి వెళ్ళు.సాహిత్యం లోకి వెళ్ళు.సాంఘిక జీవనం లోకి వెళ్ళు.వారి సామెతల లోకి వెళ్ళు.నానుడి లోనికి వెళ్ళు.అప్పుడు తెలుస్తుంది దాని ఆత్మ.

మన భాష లోని గొప్ప విషయాలు మీకు ఆనవా..? వాళ్ళకి పద్యాలున్నాయా..అవధాన ప్రక్రియ ఉందా ..అది ఉందా ,ఇది ఉందా అని అంటారా..? కాదని అన్నదెవరు..?అది వచ్చింది చిక్కు. ఒక భాష గురించి చెబితే వెంటనే ఆ భాష పనికిరానిదా అంటూ గాయ్ న లేవడం. ఏ భాష లోని ప్రక్రియలు దానికి ఉంటాయి.ఇతర బావుల లోతు తెలుసుకోవాలని లేనప్పుడు నా బావి ని మించినది లేదని అనిపిస్తుంది.

 ఈరోజున ఇంగ్లీష్ అవసరం ఏమిటో ఎవరికి పని గట్టుకుని చెప్పక్కర్లేదు.కాలాన్ని బట్టి,అవసరాన్ని బట్టి ఒక్కో కాలం లో ఒక్కో భాషకి వెలుగు లభిస్తుంది. ఒకానొక కాలం లో సంస్కృత భాషలో మాట్లాడడం  రాయడం గొప్ప విషయం.దాని అవసరం తీరింది కొద్ది గా పక్కకి తప్పుకుంది.అంత మాత్రం చేత ఆ భాష ని మరణించింది అనగలమా..?ఏ భాషని ఎవరూ పనిగట్టుకుని చంపలేరు.అసలు ఎవరూ మాట్లాడని సంస్కృతమే ఈ రోజు కీ నిలిచి ఉంది.అలాగే ఏ లిపి లేని ఆదిమ తెగ భాషలూ నిలిచే ఉన్నాయి,మాట్లాడుకోవడం వల్ల,కనక మనిషి కి మాట ఉన్నత వరకు ఫలానా భాషలో మాట్లాడకూడదు అనుకునేంత వరకు ఏ భాషనీ ఎవరూ చంపలేరు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తో బాటు తెలుగు నీ ఓ సబ్జెక్ట్ గా బోధిస్తారు అన్నప్పుడు ఇక తెలుగు ని ,మాతృ భాష నీ చంపినదెక్కడ..?మరి అవతల ప్రైవేట్ స్కూళ్ళలో ఆ మాత్రం తెలుగు కూడా లేదుగా. మరి ఆ పిల్లలకి తేట తెలుగు అవసరం లేదా..?ఇవే ద్వంద్వ విలువలు అంటే.నాకు ఇంకోటి అర్ధం అయినదేమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనేది తప్పనిసరిగా కార్పోరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని ఏదో మేరకు దెబ్బ తీస్తుంది.ఈ ప్రచారం వెనుక ఆయా శక్తుల హస్తం కూడా ఉండి ఉండవచ్చును.సరే...పది మందీ అంటున్నారు గా అని చెప్పి ఆ గుంపు లో నడిచి పోయే వాళ్ళు ఇంకొంతమంది.


 నేను ఓ తెలుగు రాష్ట్రం లోను,రెండు పరాయి రాష్ట్రాల్లోనూ విద్యార్జన చేశాను.అభిలాష చేత ఇతర అనేక రాష్ట్రాలు తిరిగాను.నాకు బాగా కనిపించింది ఏమంటే ఇంగ్లీష్ భాష లో చక్కని అభినివేశం గల వర్గాలు రెండు నాకు ప్రతిచోటా తారసపడ్డాయి. ఒకరు బ్రాహ్మణులు కాగా రెండవ వారు క్రైస్తవులు (దళిత మరియు దళితేతర వర్గాలనుంచి వచ్చినవారు),దీనికి కారణం ఏమిటి అని ఆలోచించినపుడు దీని వెనుక నాకు వారికి గల ఆర్దిక ప్రయోజనాలు ఏమీ కనిపించలేదు.కొన్ని చారిత్రక కారణాలు అగుపించాయి.మొదటి వారు బ్రిటీష్ వారి కొలువు లో చేరి జీవిక ని సాగించడానికైతే,రెండవ వర్గాన్ని బ్రిటీష్ వారు భారతీయ సమాజం నుంచి తమకి మత పరంగా మద్దతు పలక గల వర్గంగా చేరదీశారు. స్వాభావికం గా బ్రిటీష్ వారు  మతం తో కలుపుకొని అన్ని అంశాల్ని రాజకీయ దృష్టి తోనే చూస్తారు. ఈ దేశ కుల స్వభావాన్ని వారు బాగా అర్ధం చేసుకున్నారు.పై కులాల వారు మతం మారినప్పటికి తమ కుల స్వభావాన్ని ఎంత మాత్రం వదులుకోరు.దానిలో అయాచితంగా అందివచ్చే అధికారం,గౌరవం,హోదా ఇమిడి ఉంటాయి.అందుకనే వారు వంద శాతం క్రైస్తవీకరణ చేసే మిషన్ లాంటి దాని మీద మనసు పెట్టకుండా ఇతర విషయాల మీద కేంద్రీకరించారు.

సరే..ఇంగ్లీష్ మీడియం లో సరైన టీచర్ల లేరు.లేరు కాదు మన వ్యవస్థ దాని మీద దృష్టి పెట్టలేదు.అంతే.ఇప్పుడున్న వారికి ప్రతి ఏటా రిఫ్రెష్మెంట్ కోర్స్ లు ఏర్పాటు చేయవచ్చు.అలాగే బాగా అభిరుచి ఉన్న వారి చేత పాఠశాలల్లో శిక్షణలు ఏర్పాటు చేయవచ్చు.అలాగే మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్ళి అక్కడ వాతావరణాన్ని గమనించవచ్చు.ఇలా ఎన్నిటి ద్వారానో లబ్ది పొందవచ్చు.ఇంగ్లీష్ లోకి వెళితే అదే మనిషిని ముందుకు కొనిపోతుంది.ఏ భాష అయినా అంతే.అనుకున్నత ఇబ్బంది ఉండదు.వ్యవహారిక భాష ఇబ్బంది అని చెప్పి అక్కడే ఉంటే ఇంకా గ్రాంధిక భాష లోనే ఉండేవారము గాదా..! ఇంకొకటి స్టేట్ సిలబస్ కాకుండా CBSE or ICSE  సిలబస్ పెడితే చాలా బాగుంటుంది.పిల్లలు జాతీయ స్థాయిలో చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది.అబ్బే..అది కష్టం అని సన్నాయి నొక్కులు నొక్కే టీచర్లను నిర్దాక్షిణ్యం గా తొలగించడమో లేదా ఇతర శాఖలకి పంపించడమో చేయాలి.నిజానికి ఆ విషయం పెద్ద కష్టమేమీ కాదు రోజుకి కనీసం గంట కేటాయించినా..కాని దాన్ని నిరాకరించేవాళ్ళుంటారు,దాని వల్ల ఇంగ్లీష్ మీడియం వెనుక ఉన్న అసలు లక్ష్యమే దెబ్బ తింటుంది. --- Murthy Kvvs 
       




1 comment: