Monday, January 13, 2020

ఆత్మహత్యా యత్నం-నా అనుభవం



ఈ రోజు స్వామి వివేకానంద యొక్క జయంతి.నా మనసు సరిగ్గా డోలాయమాన స్థితి లో పడుతుంది ఈరోజు. ఒక వేపు ఆయన గూర్చి ఒక పోస్ట్ పెడదాము అనిపిస్తుంది.మరో వైపు అనిపిస్తుంది మొక్కుబడి గా ఆయన కి సంబందించిన ఏవో కొటేషన్ లు చదివి అవి అందరి తో పంచుకోవడం ,మళ్ళీ తెల్లారి ప్రపంచ ప్రవాహం లో కలిసిపోయి ఇంకో ఎవరి జయంతి కో ఏవో ఇలాటి పోస్ట్ పెట్టడం అలా సాగిపోవడం అది నాకు సంబందించని పని అనిపిస్తుంది.

ఎందుకు అలా అని మీరడగవచ్చు..? కారణం ఉన్నది.రమారమి 27 ఏళ్ళ క్రితం ఆయన నా జీవితం లో ప్రవేశించాడు.ఆలోచనలు,జీవితపు నడక ఈ రెంటిని ఆయన ప్రభావితం చేశాడు.ఒక్క రోజు కూడా దాని నుంచి విడివడి నా జీవితం లేదు.ఆయనతో వచ్చిన చిక్కు ఏమిటంటే ఎవరు ఏ విధంగా అయినా ఆయన్ని అర్ధం చేసుకోవచ్చు.కొంతమంది కి ఆయన ఉత్సాహ ప్రదాత,ఇంకొంతమందికి దేశభక్తి ప్రభోధకుడు,మరికొంతమందికి హైందవ ఝంఝామారుతం ఇంకా ఎన్నో..!

మొదటి లో నాకూ అంతే.కాని ఆయన ఉపన్యాసాలు,రచనలు,ఉత్తరాలు,వ్యాఖ్యానాలు ఇలాంటి వాటిని అన్నిటిని చదివిన తర్వాత నా దృక్పధం మారింది.వాటిని ఇప్పటికి ఇంచుమించు మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాను.కొత్త ద్వారాలు ఎప్పటికి అప్పుడు తెరుచుకుంటూనే ఉంటాయి.నాలో లోకానికి పనికి వచ్చే గుణం ఏదైనా ఉన్నదీ అంటే అదంతా ఆయనకే చెందుతుంది.చాలా జటిలమైన విషయాన్ని సూటి గా సులభం గా హృదయం లోకి వెళ్ళేలా చెప్పడం,దానికి తగిన పదాలను గొప్ప ప్రభావ వంతం గా ఉపయోగించడం ఆయన లోని ప్రధాన ఆకర్షణ.బాగా గమనించండి ఆయన చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్కదాన్ని నేను గుర్తుపట్టగలను.కొంతమంది ఎప్పుడైన దానిలో ఏవైనా మార్పులు చేసి ఉటంకించితే వెంటనే అక్కడ ఏదో లోటు ఏర్పడింది,ఉండవలసిన ఆత్మ దెబ్బ తిన్నదే అనిపించి బాధకలుగుతుంది.నా మటికి నాకు ఆయన గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం.ప్రాచ్య,పాశ్చాత్య తత్వ భూమికల్ని లోతు గా అర్ధం చేసుకుని రెండిటి లోని వాటి యొక్క రెండు వైపుల్ని ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పిన మహానుభావుడు. భారతదేశం యొక్క ఔన్నత్యం ఎక్కడున్నదీ ఇంకా దీని యొక్క దౌర్భాగ్య స్థితి ఎక్కడున్నదీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఆయన అటు పశ్చిమ దేశాల గొప్పదనాన్ని,అల్పత్వాన్ని అదే స్థాయి లో చెప్పాడు.ఒక్క అమెరికా లోనే ఆయన పర్యటించినట్లు భావిస్తారు చాలామంది గాని యూరపు లోని దేశాల్ని కూడా ఆయన సందర్శించాడు.వాళ్ళ దైనందిన అలవాట్లను స్వభావాన్ని చాలా సూక్ష్మం గా చెప్పాడు.నేను ఎన్నో ట్రావెలోగ్ ల్ని చదివాను గాని అలాంటి పరిశీలనల్ని నేను ఏ రచన లోనూ చూడలేదు.

అలాగే పతంజలి యోగ సూత్రాలకి ఆయన రాసిన భాష్యం ,ప్రతి వాక్యం లో ఎంతో లోచూపు,బరువు ఉంటుంది.అది చదివితేనే అనుభవం లోకి తెచ్చుకోగలం.ఈ లోకం లోని ప్రతి జీవికి,ముఖ్యంగా బుద్ధి జీవి కి ఒక బలహీన క్షణం ఉంటుంది.జీవితం మీద విరక్తి కలిగి భూ ప్రయాణాన్ని విరమించాలని అనిపిస్తుంది. అలాంటి సమయం కూడా నా జీవితం లో రెండు దశాబ్దాల క్రితం ప్రవేశించింది.అప్పటికి నేను నాస్తికుడిని.కనిపించే ప్రపంచమే నిజమని దాన్ని మించిన ఉనికి మరేది లేదని అనుకునేవాడిని.వాదించేవాడిని.ఆ బలహీన క్షణాల్ని అధిగమించడానికి గాను ఫ్రాయిడ్ ని,కారల్ యంగ్ ని ఇంకా ఇలాటి మానసికవేత్తల పుస్తకాల్ని చదివే వాడిని.అసలు మనసు దాని గమనాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించే వాడిని. విజ్ఞానమైతే  పెరిగింది గాని ఎక్కడో ఓ ఖాళీ అలానే ఉండిపోయింది.

సరిగ్గా అదే సమయం లో ఎందుకో నా చేతి లోకి ఓ పుస్తకం వచ్చింది. అది అనుష్టాన వేదాంతం అని చెప్పి వివేకానందుని యొక్క రచన ,ఆంగ్లం లో "ద ప్రాక్టికల్ వేదాంతా " అది ఒరిజినల్ అన్నమాట.అప్పటికి నాకు ఆయన మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు.Worn out than rust out   అంటూ ఆయన ఒక పేజి లో చెబుతుంటే నా అంతరాంతరాళాల్లోకి అది ఇంజక్షన్ లా ఎక్కింది నాలోకి. దాని అర్ధం స్థూలం గా చెప్పాలంటే చిలుము పట్టి నాశనం కావడం కంటే ఏదో ఒక పని చేస్తూ దాని లో మరణించు అని..!ఇక అప్పుడు ప్రారంభమైన ఆయనతో నా పయనం ఇలా సాగుతూనే ఉంది.ధ్యానం లోకి నన్ను ప్రవేశింపజేసి ఎన్నో లౌకిక,పారలౌకిక అనుభవాల్ని  కలుగజేస్తూ అలా..అలా...! చూడండి సమయం ఇప్పుడు సరిగ్గా 13 వ తేదీ లోకి వచ్చేసింది.---Murthy Kvvs



 


4 comments:



  1. చాలా మంచి విషయాన్ని , వివేకానంద వారి Practical Vedanta ని పరిచయం చేసారు మీ జీవితానుభవం మీద ఆధారపడి.

    Really good article.

    Keep writing more of your Vedantic experiences.

    జిలేబి

    ReplyDelete
  2. ఈ వ్యాసం లో ఎంతో నిజాయితీ గా వ్రాశారు మూర్తి గారు. మీ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోండి.

    ReplyDelete
  3. THANKS YOU HAVE UNDERSTOOD GKK GARU.

    ReplyDelete