Saturday, February 6, 2021

"ఏ క్రిస్మస్ కెరోల్" చార్లెస్ డికెన్స్ నవల: ఒక పరిశీలన

ఇంగ్లీష్ సాహిత్య చరిత్ర లో చార్లెస్ డికెన్స్ ది ఒక సుస్థిరమైన స్థానం. ఆయనకి ఉన్న అభిమానులు ప్రపంచ వ్యాప్తం గా ఎందరో లెక్కించడం కష్టమే. విక్టోరియా శకానికి చెందిన ఈయన ఇంగ్లాండ్ లోనే కాక అనేక దేశాల్లో తన ప్రభావాన్ని ప్రసరించాడు. డేవిడ్ కాపర్ ఫీల్డ్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్,అలివర్ ట్విస్ట్ వంటి నవలలు తెలియని సాహిత్యాభిమాని ఎవరూ ఉండరు. దాదాపు గా 20 నవలలు ,5 నవలికలు ఇంకా వందలాది కథల ను ఆయన రాశాడు.ఇంకో విశేషం ఏమిటంటే ఆయన రాసిన లేఖలు చాలా ప్రత్యేకమైనవి. లేఖలు రాయడం డికెన్స్ కి చాలా ఇష్టమైన విషయం.అలా లేఖా సాహిత్యం లోనూ ఓ ప్రత్యేకత ఉన్నది.


ఇంగ్లండ్ లోని పోర్ట్ మౌత్ వద్ద ఫిబ్రవరి 7 వ తేదీ న, 1812 వ సంవత్సరం లో జన్మించాడు చార్లెస్ డికెన్స్.పేదరికం వల్ల మధ్య లోనే చదువు ఆపివేసి తన పదవ యేట నుంచే ఫేక్టరీ లో పనికి వెళ్ళడం ప్రారంభించాడు.తండ్రి అప్పులు పాలయి ఆ పిమ్మట జైలు లో వేయబడటం తో అతని చదువు ఒక పద్ధతి లో సాగలేదు.అయితే స్వయం కృషి తో విద్య ని కొనసాగించి ఒక వారపత్రిక ని 20 ఏళ్ళ పాటు దిగ్విజయం గా నడిపాడు.


సరే...ఇప్పుడు మనం చార్లెస్ డికెన్స్ రాసిన ఓ నవలిక గురించి చెప్పుకుందాం.దాని పేరు 'క్రిస్మస్ కెరోల్ ' , దీనికి ఇంగ్లీష్ నవలా సాహిత్యం లో ఒక ఆసక్తికరమైన స్థానం ఉంది. ఇది బయటకి చూడటానికి క్రైస్తవమత పరమైన ఇతివృత్తం వలె ఉన్నా లోతుగా చూస్తే మానవీయ విలువలకి పట్టం గట్టే అనేక అంశాలు మార్మికం గా చెప్పబడ్డాయి. హాస్యము,వ్యంగ్యము,జాలి,నైతికత వంటి వాటిని ఈ నవలిక లో తనదైన శైలి లో మిళితం చేశాడు.కొండొకచో కొంత భయానకం కూడా. అసలు క్రిస్మస్ కెరోల్ అంటే ఏమిటి..అంటే క్రిస్మస్ పర్వ దిన సందర్భం గా సామూహికం గా గానం చేసే కీర్తనలు అని చెప్పవచ్చు. 


కథలోకి వద్దాము. ఎబినెజెర్ స్కౄజ్ ఒక పిసినారి వ్యాపారి.క్రిస్మస్ ఈవ్ రోజున తన షాపు లో కూర్చుని ఉంటాడు.అతని పార్టనర్ జాకబ్ మార్లే చనిపోయి ఏడు ఏళ్ళు అవుతోంది.అతని దగ్గర క్లర్క్ గా పనిచేసే బాబ్ క్రచిట్ ఈయన దగ్గర కి వచ్చి చలి బాగా పెరిగిందని కాబట్టి బొగ్గులు కొనడానికి మరి కొంత డబ్బులు ఇవ్వవలసింది గా అడుగుతాడు.చలిదేశాల్లో ఇళ్ళలో చలికాగడానికి నెగళ్ళు వంటి పొయ్యిలు వేసుకునేది మనకి తెలిసిందే గదా..!


కాని స్కౄజ్ ససేమిరా ఒక్క షిల్లింగ్ ఇవ్వను,పో అవతలికి అని ఈసడించుకుంటాడు.ఇంతలో అతని మేనల్లుడు ఫ్రెడ్ వచ్చి రేపు జరగబొయే క్రిస్మస్ విందు కి రమ్మంటాడు. క్రిస్మస్ అయితే ఏమిటట..అంతా హంబగ్,నేను ఎక్కడికి రాను పో అని ఈసడించుకుంటాడు. ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, కొంత విరాళం ఇవ్వవలసింది గా కోరుతారు.వాళ్ళని కూడా అవతలికి పో ...అంతా హంబగ్ అని గెంటేస్తాడు.హంబగ్ అనేది అతని ఊతపదం.    


         ఆ సాయత్రం ఇంటికి వెళ్ళగానే స్కౄజ్ కి అతని పార్ట్నర్ మార్లే యొక్క ప్రేతాత్మ కనిపిస్తుంది.చనిపొయిన మార్లే తను ప్రస్తుతం పొందుతున్న కష్టాల్ని ఏకరువు పెడతాడు.ఒక్క పుణ్యకార్యమూ చేయనందువల్ల ప్రస్తుత స్థితి లో దైన్యం గా ఉన్నానని,నాలాగా నువు కాకు మిత్రమా అని హెచ్చరించి ..ఇదంతా ఎందుకులే గాని నీకు వరస గా మూడు రోజులు పాటు మూడు ఆత్మలు కనబడతాయి,అవి నీకు అన్నీ చూపిస్తాయి అని మాయమవుతాడు.


అన్నట్లుగానే ఆ తర్వాత రాత్రి ఒక ఆత్మ వచ్చి స్కౄజ్ ని అతని గత రోజుల్లోకి తీసుకు వెళుతుంది.ఇక్కడ స్కౄజ్ తన బాల్య జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు చూస్తాడు. బాల్యం లోని తన పేదరికమూ,ఒక షాప్ లో సహాయకుని గా పనిచేయడమూ,ఒక యువతి తో పెళ్ళి కుదరడం,ఆ తర్వాత ఆమె ఇతని చర్యలు నచ్చక వెళ్ళిపోవడం ఇవన్నీ చూసి బాధపడతాడు.


రెండో రోజు రాత్రి మరో ఆత్మ వచ్చి ప్రస్తుత కాలం లోని కొన్ని ప్రదేశాలకి తీసుకువెళుతుంది.లండన్ లోని వీధుల్లో విహరిస్తూ ఉంటాడు.ఒక ఇంట్లో కోలాహలం గా ఉంటుంది,తీరాచూస్తే అది తన వద్ద క్లర్క్ గా పనిచేసే క్రచిట్ ది. పేద వాడైనా ,తనకి కలిగినంత లో క్రిస్మస్ పండుగ ని చేసుకుంటున్నాడు తన కుటుంబ సభ్యులందరి తో కలసి..!అతని కొడుకు టైనీ టిం అవిటి వాడు.కుమార్తె మార్తా పట్టణం లో జాబ్ చేస్తోంది,ఈ పండుగ కోసం ఇంటికి వచ్చింది.ఇంకో కొడుకు పీటర్ కూడా ఉన్నాడు.ఆనందం గా ఉన్న  ఆ కుటుంబాన్ని చూసి స్కౄజ్ చాలా సంతోషిస్తాడు.అవిటి పిల్లవాని పరిస్థితి కి బాధపడతాడు.   


     ఇక మూడవ రోజున మరో ఆత్మ వస్తుంది.అది స్కౄజ్ కి జరగబోయే కాలం లోకి అంటే భవిష్యత్ లోకి తీసుకువెళుతుంది. ఒక వింత ప్రదేశానికి తీసుకువెళుతుంది.అక్కడ ఒక మనిషి చనిపోయి ఉంటాడు.ఆ పక్కనే కొంతమంది ఇతర వ్యాపారులు వీడి ఆస్తి ఎంత ఉండవచ్చు అని లెక్కలు వేస్తుంటారు. మరో వేపున ఒక పేద జంట ఆ మనిషి చావు కి సంతోషిస్తుంటారు,వీడు చావటం వల్ల మన అప్పులు రద్దయిపోయాయి అని హాయిగా ఫీలవుతుంటారు. ఆత్మ స్కౄజ్ ని స్మశానం లోని ఓ సమాధి వద్ద కి తర్వాత తీసుకువెళుతుంది. అక్కడున్న సమాధి వివరాలు చదివితే స్కౄజ్ కి మతి పోయినంత పని అవుతుంది. ఆ సమాధి తనదే. ఏమిటి ..నా చావు ఇలా ఉంటుందా అని బాధపడి తరుణోపాయం ఏమిటి అని అడుగుతాడు.ఇకనైనా మంచి పనులు చేసి నీ చావు ఇలా కాకుండా చూసుకో అంటుంది ఆత్మ.అతనికి జ్ఞానోదయం అవుతుంది. ఇకమీదట క్రిస్మస్ పండుగ ని అందరి తో కలిసి చేసుకుంటాను.మంచి కార్యాలకి సహకరిస్తాను అని నిర్ణయం తీసుకుంటాడు.


ఆ తర్వాత ఏడు క్రిస్మస్ రాగానే స్కౄజ్ సంతోషం గా క్రచిట్ ఇంటికి కానుకలు పంపిస్తాడు.అతని కొడుకు టైనీ టిం అవిటితనం బాగుచేసుకోమని డబ్బులు ఇస్తాడు.అలాగే మేనల్లుడు ఫ్రెడ్ ఇంటికి వెళ్ళి క్రిస్మస్ విందు లో ఫాల్గొంటాడు.సంక్షేమ కార్యక్రమాలకి విరాళాలు ఇస్తాడు.ఈ మార్పు చూసి అంతా ఆశ్చర్యపోతారు.సత్కార్యాల ఫలితం గా స్కౄజ్ కి మంచి పేరు వస్తుంది.


ఆ విధంగా కథ సాగిపోతుంది.దీనిలో డికెన్స్ అనేక సమకాలీన అంశాల్ని ప్రస్తావించాడు.అదే విధంగా ధనం సంపాదించడమే గాకా అవసరమైన సమయం లో పేదలకి ఇవ్వడం లో దైవికమైన ఆనందం కలుగుతుందని చెబుతాడు.ఇంగ్లండ్ లోగల పారిశ్రామిక వాడల లోని సామాన్యుల జీవితాల్ని దీనిలో చిత్రించాడు. నిజమైన పండుగ అందరి తో కలిసి ఆనందాన్ని పంచుకోవడం లో ఉంది తప్పా పై పై ఆడంబరాల్లో లేదని దీని ద్వారా తెలుపుతాడు డికెన్స్.


ఈ నవలిక 1843 లో మొదటిసారి ప్రచురితమైంది.ఆ సంవత్సరం గడిచి మరో సంవత్సరం వచ్చేసరికి ఇది 13 సార్లు ప్రచురితమైంది.చక్కని రివ్యూలు వచ్చాయి.చివరికి ఎందుకనో గాని పబ్లిషర్ కి,డికెన్స్ కి గొడవ జరిగి కోర్ట్ కి వెళ్ళడం జరిగింది.ఆ దెబ్బ తో పబ్లిషర్ దివాళా తీశాడు. చార్లెస్ డికెన్స్ మురికివాడల్లోకి కూడా వెళ్ళి అక్కడి నిరక్షరాస్యులకి సైతం తన రచనలు చదివి వినిపించేవాడు.ఏదైనా తృణమో పణమో వాళ్ళు ఇస్తే పుచ్చుకునేవాడు.అంతే కాదు అమెరికా లోని వివిధ నగరాలకి వెళ్ళి స్వయం గా తన రచనలు చదివి వినిపించేవాడు. శ్రోతలు టికెట్లు కొని మరీ వచ్చేవారు,విక్టోరియన్ శకానికి చెందిన ఆణిముత్యం చార్లెస్ డికెన్స్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.


     -----మూర్తి కె.వి.వి.ఎస్. (7893541003)

No comments:

Post a Comment