Sunday, March 28, 2021

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (నవల)- ఒక పరిశీలన

 ద వర్జిన్ అండ్ ద జిప్సీ (నవల)- ఒక పరిశీలన


డి.హెచ్.లారెన్స్ రాసిన నవల ఇది. బ్రిటీష్ రచయితల లో అత్యంత వివాదస్పద రచనలు చేసిన వ్యక్తి గా ఈయనని పరిగణిస్తుంటారు.మనిషి లోపల అణిగిఉండే స్వభావాలను తేటతెల్లం గా తన పాత్రల ద్వారా నిర్మొహమాటం గా వ్యక్తపరిచాడు. శృంగార పరమైన ఉద్వేగాలను,సహజమైన మానవ సంవేదనలను అదీ స్త్రీ పురుషుల మధ్య కలిగే భావాత్మక తుఫాన్లను ఎలాంటి శషభిషలు లేకుండా తన రచనల్లో వెల్లడించాడు లారెన్స్.


సన్స్ అండ్ లవర్స్,ద రెయిన్ బో,విమెన్ ఇన్ లవ్,లేడీ చాటర్లీస్ లవర్ ఇలాంటి నవల ల ద్వారా లారెన్స్ సుప్రసిద్దుడు. ఇవే గాక అనేక కథలు,కవితలు,వ్యాసాలు కూడా రాశాడాయన.తను బ్రతికి ఉన్న కాలం లోనే అనేకమంది శత్రువుల్ని సంపాదించుకున్నాడు.ఆ కాలానికి బ్రిటీష్ సమాజం లో ఉన్న మత పరమైన,నైతికమైన విలువలను లారెన్స్ ఉల్లంఘించాడని తన రచనల్లో విపరీతమైన స్థాయి లో శృంగార భావాల్ని,అసభ్యత ను గుప్పిస్తుంటాడని విమర్శించేవారు. కొన్ని నవలలు నిషేధానికి గురికాబడి ఆ తర్వాత మళ్ళీ ప్రచురణకి నోచుకున్నాయి.


ఇ.ఎం.ఫారెస్టర్ మాత్రం లారెన్స్ యొక్క భావాల్ని మెచ్చుకుని కుండబద్దలు కొట్టినట్లు గా తన అభిప్రాయాన్ని చెప్పడం తో ఒక్కసారిగా లారెన్స్ కి సాహితీవేత్త గా గుర్తింపు లభించింది.విచిత్రం గా ఆయన చనిపోయిన తర్వాతనే ఆయనకి దక్కవలసిన గౌరవం దక్కింది.స్వదేశం లో కంటే ఇతర దేశాల్లో తిరుగుతూ రాయడం ఆయనకి ఇష్టం. ఆ విధం గా బ్రిటన్ లోని తన విమర్శకులకి దూరం గా ఉండేవాడు.పుట్టింది,తొలినాళ్ళ లో ఎక్కువ గా పెరిగింది నాటింగ్ షైర్ లోని ఈస్ట్ వుడ్ లోనే..!    

సరే...మరి మనం అసలు కథ లోకి వెళదాము. ద వర్జిన్ అండ్ ద జిప్సీ అనే ఈ నవల పేరు లోనే కొంత వరకు ఊహించవచ్చు. ఇది ఒక యువతి కి ,ఒక జిప్సీ యువకుడు కి మధ్య జరిగిన కథ అని. అయితే దీనిలో ఇంకా కొన్ని పాత్రలు ఉంటాయి.వాటి ఉద్వేగాలూ ఉంటాయి. ఈ నవల మొదలు కావడమే పేపల్ విక్ కి చెందిన వైకార్ యొక్క భార్య ఓ యువకుని తో లేచిపోయిన ఉదంతం తో మొదలు అవుతుంది.ఆమె పేరు సింథియా.ఒక పుష్పం పేరు,ఆమె కూడా ఓ పుష్పం వంటిదే. మరి లేచిపోవడానికి తగిన కారణం ఎక్కడా సూటిగా చెప్పడు గాని వివిధ పాత్రలు వివిధ రకాలుగా అనుకుంటూంటాయి.


ఈ వైకర్ కి ఒక చెల్లి ,ఒక తమ్ముడు,ముసలి తల్లి ఉంటారు.అంతే కాదు ఆయనకి ఇద్దరు కుమార్తెలు.ఒక అమ్మాయి పేరు లూసీ,ఇంకో అమ్మాయి పేరు ఈవ్. భార్య అలా వెళ్ళిపోవడం వైకార్ లో ఆవేదన కలిగిస్తుంది.ఆ ముసలితల్లి కూడా లేచిపోయిన కోడల్ని సూటి పోటి గా తిడుతూ ఉంటుంది. ఆ కూతుర్లకి ఈ పద్ధతి నచ్చదు.అయితే ఎలా ప్రతిస్పందించాలో కూడా తెలియదు. మొత్తానికి అందరూ ఒక ఇంట్లోనే ఉంటారు. కాని ఏదో తెలియని ఓ అసౌకర్యం.


లూసీ పెద్ద కుమార్తె.పక్కనే ఉన్న ఓ పట్టణం లో సెక్రటరి గా పని చేస్తూంటుంది. ఈవ్ లూసీ కి చెల్లెలు.విద్యా సంస్థ కి సెలవులు కావడం తో స్వగ్రామం లోనే ఉంటూన్నది. స్నేహితులు అందరి తో కలిసి పిక్నిక్ కి వెళతారు.అక్కడ ఊరికి దూరం గా గుడారాలు వేసుకుని నివసిస్తున్న జిప్సీ కుటుంబాన్ని కలుస్తారు. జిప్సీ స్త్రీ వీళ్ళకి జాతకాలు చెబుతుంది. ఆమె భర్త గా అనిపించే జిప్సీ యువకుని తో కళ్ళు కలుస్తాయి.అతని తీరు ప్రవర్తన ఈవ్ కి నచ్చుతాయి.ఆ విధం గా బయట కి చెప్పరాని ఒక బంధము ఏర్పడుతుంది. మానసికం గా ఊగిసలాట వంటిది. సామాజికం గా బ్రిటీష్ జీవనం లో జిప్సీ లు కింది స్థాయి వ్యక్తులు గా పరిగణింపబడతారు. అయితే జిప్సీ ల జీవన వ్యవస్థ ఆమె కి ఆసక్తికరం గా ఉంటుంది. వస్తువులు అమ్ముకుంటూ వాళ్ళు ఈ ఊరి లో మకాం వేస్తారు. ఇక్కడ అయిపోగానే వేరేచోటకి వెళ్ళిపోతుంటారు.


ఈవ్ తో డేటింగ్ కోసం లియో అనే బ్రిటిష్ యువకుడు ప్రయత్నిస్తుంటాడు.కాని ఈవ్ కి అతని పట్ల ఏ ఆసక్తి కలగదు.అలా అని జిప్సీ తోనూ తన అభిప్రాయం చెప్పదు.ఇద్దరి మధ్య తన మనసు ఊగిసలాడటమూ,దానికి ఏ కారణమూ చెప్పుకోలేకపోవడమూ అలా సాగుతుంది. ఇంట్లో ఉండే సిస్సీ ఆంటీ ,బామ్మా వీళ్ళ పాలిట చికాకు మనుషులు గా ఉంటారు. ఓ సారి గుర్రపు బండి సామాన్లు అమ్ముతూ ఈ జిప్సీ యువకుడు వీరి ఇంటికి వస్తాడు.అలా వీరి అనుబంధం పెరుగుతుంది.


ఈ మధ్యలో ఇంకోటి జరుగుతుంది. భర్త ని వదిలేసిన జ్యూయిష్ స్త్రీ ఒకామె ఉంటుంది,ఆమె ప్రస్తుతం వేరే ఒక వ్యక్తి తో ఉంటూంది.ఈవ్ ఈ స్త్రీ తో మాట్లాడటము తండ్రి కి నచ్చదు. ఆమె కూడా మీ అమ్మ వంటి లేచిపోయిన స్త్రీ యే కనక అలాంటి వారి తో కట్ చేయ్యమని చెబుతాడు. మనుషుల మధ్య ఏర్పడే నైతిక సంబంధాల పై మతం ఏ విధం గా ప్రభావం చూపుతుందో ఈవ్ కి లీల గా అర్ధమవడం మొదలవుతుంది.


ఇది ఇలా ఉండగా తమ ఇంటి వద్ద ఉన్న డాం కూలి వాగు ఉప్పొంగడం తో ఈవ్ ని జిప్సీ వ్యక్తి కాపాడుతాడు.ఆమె స్పృహ లేని స్థితి లో ఉన్నప్పుడు ఆమె కి సపర్యలు చేసి కాపాడుతాడు. అప్పుడు ఇంట్లో బామ్మ తప్పా ఎవరూ ఉండరు.కొన్ని రోజులు గడిచిన తరవాత ఒక ఊతరం వస్తుంది,అది జిప్సీ వ్యక్తి రాసినది.తాము వేరే ఊరి కి వెళ్ళిపోయామని మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని ఆశిస్తూ తన సంతకం చేస్తాడు దానిలో.అప్పుడు చూస్తుంది అతని పేరు. జో బాస్వెల్ అని.ఒక్క క్షణం తనలో తనే అనుకుంటుంది,ఇంతవరకు అతని పేరు కూడా తెలుసుకోలేదేమిటి నేను అని.అంతే అలా నవల ముగుస్తుంది. అది ఇతివృత్తం.    


ఈ నవల లో ప్రధానం గా కొన్ని విషయాలు చర్చించాడు. మనిషి లో ప్రేమ ఉద్భవించడానికి పెద్దగా కారణాలు అవసరం లేదని కొన్ని సార్లు అలా జరుగుతుందని,ఇంకా వివిధ సమయాల్లో తమకు కలిగిన అనుభవాల్ని బట్టి సమాజం లోని వివిధ వ్యక్తుల జీవితాల పై తీర్పు ఇవ్వడం సరయినది కాదని అంతర్లీనం గా చెబుతాడు రచయిత. నాటి బ్రిటీష్ గ్రామీణ వ్యవస్థ మనకి కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. పేపల్ విక్ వంటి చిన్న గ్రామాల్లో సైతం మూసివేయబడిన ఒకటి రెండు పరిశ్రమలు ఉండడం అనేది పారిశ్రామికం గా మన పల్లెలకి ,వారి పల్లెలకి గల తేడా ని తెలుపుతుంది.ఇంకా జిప్సీ ల యొక్క సంచార జీవనం,యూరపు లో వారికి గల స్థానం అవన్నీ మనకి దీనిలో తెలుస్తాయి.ఒకటి రెండు చోట్ల సింబాలిక్ గానే తప్పా పెద్దగా శృంగార సన్నివేశాలు,అసభ్యత లేవు అనే చెప్పాలి.


లారెన్స్ కి కొన్ని అభిప్రాయాలు ఉండేవి.ఏమిటంటే ఎవరూ ఎవరిని దోచుకోని,ఎవరి స్వేచ్చకి ఆటకం కలిగించని,ధనం తో ఏ మాత్రం అవసరం లేని ఆనందమయ ప్రపంచాన్ని సృష్టించాలని.అందుకోసం పదహారు ఎకరాల స్థలం కొని కొన్ని ప్రయోగాలు చేశాడు.కాని అవి ఫలితాన్ని ఇచ్చినట్లు లేవు.ఆ తర్వాత కొంతకాలానికే 1930 లో మే 2 వతేదీన లారెన్స్ మరణించాడు.మన తెలుగు రచయిత చలం మీద కూడా ఈయన ప్రభావం ఉన్నదని ఒకచోట చదివిన గుర్తు. ఏది ఏమైనా ఆంగ్ల సాహిత్యప్రపంచం లో డి.హెచ్.లారెన్స్ విస్మరింపజాలని మైలురాయి అని చెప్పక తప్పదు.


  ------- మూర్తి కె.వి.వి.ఎస్.

No comments:

Post a Comment