Sunday, May 30, 2021

కథల్లోని ప్రదేశాలు వెంటాడతాయి

 మనం అనేక రచనలు చదువుతుంటాము. వాటిల్లోని ఆ కథ ఎక్కడో ఓ ప్రదేశం లో జరుగుతూంటుంది.అది నగరమో,పట్టణమో,పల్లెనో...కానీ ఒకసారి చదివేసి అవతల పెట్టేసిన తరువాత కూడా ఆయా ప్రదేశాలు మనల్ని అంత త్వరగా వదలవు. మనం మానసికంగా అక్కడికి ప్రయాణం చేస్తూనే ఉంటాము.రచయిత ఎంతో మమేకమై రాస్తే తప్పా దాన్ని మనం అంతగా అనుభూతి చెందలేము. ఈ కళ అందరి లోనూ సమానంగా ఉండదేమో..!వారి పరిశీలనాశక్తి ఇంకా దాన్ని అక్షరాల్లోకి మార్చే వారి మంత్రజాలం లో ఉంటుందేమో.


ఉదాహరణకి చార్లెస్ డికెన్స్ ని చదివితే లండన్ లోకి,థామస్ హార్డీ ని చదివితే వెసెక్స్ లోనికి,మార్క్ ట్వైన్ ని చదివితే మిసిసిపి లోకి, విలియం ఫాల్క్నర్ ని చదివితే అమెరికా దక్షిణ భాగం లోని లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాము.ఇక పారిస్ ప్రయాణం చేయాలంటే గై డి మపాసా ని ,పీటర్స్ బర్గ్ లోకి వెళ్ళాలంటే దోస్తోవిస్కీ ని చదవవలసిందే. జేన్ ఆస్టిన్ ఆవిడ తన జీవితమంతా ఓ పల్లె ప్రాంతం లోనే ఉన్నది,ఆ అందాలన్నీ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ వంటి నవలల్లో చూడవచ్చు. 

అసలు ఆ అందమంతా ఎక్కడనుంచి వస్తుంది.ఏ ప్రదేశమైనా గానీ దానికి ఓ రంగు ,రుచి ఉంటుంది.అది అక్కడి పరిసరాల్లోనూ,మనుషుల్లోనూ,వాతావరణం లోనూ గూడు కట్టుకుని ఉంటుంది.దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా చిత్రించినపుడు ఒక నిజాయితీ ఉట్టిపడుతుంది.సరైన మాటలు పడాలి.అవి పఠిత కి దృశ్యాన్ని చూపించాలి.అలా అన్ని సార్లు జరుగుతుందా కష్టమే.కాని కొంతమంది లో ఆ నేర్పు పిసరంత ఎక్కువగా ఉంటుంది. 


అలాగే జోసెఫ్ కోన్రాడ్ ని చదివితే మనం సముద్రం మీద తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే తను అలానే జీవించాడు కాబట్టి.అలా అని సముద్రం మీద తిరిగినవాళ్ళు అందరూ అలా రాశారా అంటే లేదనే చెప్పాలి.ఒక భావాన్ని ఎంతో నేర్పుగా దృశ్యమానం చేసే కళ ఇలాంటి వారి లో చాలా ఎక్కువ గా ఉన్నదని అనిపిస్తుంది.ఇది నాకోసం,నేను నా హృదయభారాన్ని ఆపుకోలేక రాసుకున్నది ...మీకు నచ్చిందా సరి లేదా మంచిది అన్నట్లుగా ఉంటాయి కొన్నిసార్లు వారి రాతలు.అక్కడే వస్తుంది ఓ నిజాయితీ తో కూడిన అందం.    

సోమర్సెట్ మామ్ ,గ్రాహం గ్రీన్ కథలు వాళ్ళ పర్యటనా ప్రభావం అనుకుంటాను,వివిధ ప్రదేశాల్లో ఆయా పాత్రలు జవ జీవాలతో ఉంటాయి. ఇక మన దేశం లోని ముస్సోరి లో నివసించే రస్కిన్ బాండ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన రచనలు చదువుతుంటే హిమాలయ సానువుల్లోని గుట్టలు,మిట్టలు,చెట్లు చేమలు,జంతువులు,కీటకాలు,అక్కడి శిధిల నిర్మాణాలు ఒక్కటేమిటి ఆ ప్రాంతం లోకి వెళ్ళి విహరించినట్లుగా ఉంటుంది. 

----- Murthy Kvvs


No comments:

Post a Comment