Sunday, July 11, 2021

నేరము - శిక్ష (ఒరియా అనువాద కథ)

 ఒరియా మూలం: గౌరహరి దాస్

తెలుగుసేత: మూర్తి కెవివిఎస్


యశోద ఆగి ఆకాశం కేసి కాసేపు అలాగే చూసింది. చాలా దూరం నడవడం వల్ల అలసట గా అనిపించింది.ఇంకా ఎంత దూరం ఈ బ్లాక్ ఆఫీసు..? ఖైరిగడ్ బజార్ అగపడుతోంది.దాని వెనకనే ఓ మామిడి తోట...అదిగో దానికి ఎడమ వైపునే ఉంటుంది బ్లాక్ ఆఫీసు.పొద్దుటి నుంచి ఆమె కడుపు లో నొప్పి గా ఉంది. గతరాత్రి ఏమీ తినలేదు. ఆమె,కూతురు ఇద్దరూ కొద్దిగా ఏదో పిండి ఉంటే నీళ్ళు కలుపుకుని దాన్నే తిన్నారు. ఇద్దరు చిన్నపిల్లలూ అదే తిన్నారు.ఆకలికి ఎంతకని తట్టుకుంటారు...ఓ రాత్రి పూట పిల్లలు లేచి ఒకటే ఏడుపు.చిన్నపిల్లది  ఏదో తల్లి వద్ద పాలు తాగుతుండగా,పెద్దపిల్లాడు ని ఊరుకోబెట్టడం అంత సులభతరం కాలేదు. ఆ ముసలామె, అదే అమ్మమ్మ యశోద వాళ్ళని బులిపించుతూ ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది.అంతకంటే ఏమి చేయడానికి ఉందని..!

    కూతురు వైపు,కూతురి పిల్లల వైపు జాలిగా చూసింది యశోద. ఆకలి బాధల వల్ల, కూతురు పేరు కి వయసు లో ఉన్నా చూడటానికి దయ్యం లా అయిపోయింది.దేవుడు కనక తనకి ప్రత్యక్షమయితే ఏమిటయ్యా మాకు ఈ చిత్ర హింస అని అడగాలనిపిస్తుందామెకి.దీని వల్ల నువ్వు పొందే ఆనందం ఏమిటీ అని కూడా..! ఇదేనా దైవత్వం అంటే..!


ఈ గాధ కి అంతు లేదు.ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి దీన్ని..? ఈ ఏడుపుగొట్టు కథ ఎవరు వింటారు గనక.తమ లాంటి వాళ్ళ బాధల్ని వినడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారులకి జీతాలు ఇస్తుంది.కాని వాళ్ళు బంగళా ల్లో నివసిస్తూ,కార్ల లో తిరుగుతుంటారు.వాళ్ళు అన్నీ తెలుసు అంటారు.బాధల్ని తీర్చుతామని వాగ్ధానాలు చేస్తారు.తన లాంటి పేదరాలు వారి తో కలిసిమాట్లాడాలనుకుంటే మాత్రం ఎక్కడ లేని కోపం వస్తుంది వాళ్ళకి.సమయం లేదంటారు ఇంకా అప్లికేషన్ రాసి అక్కడ ఇచ్చి పో అంటారు.రాయించుకోవాలంటే మళ్ళీ ఎవరినో పట్టుకోవాలి.

 పిల్లవాడిని ఇంకో చేతి లోకి మార్చుకుంది యశోద. మధ్య దారి లో నిద్రపోయినట్లుంది.అందుకే వాడు కాస్త బరువు గా అనిపించాడు.ఇందాకనే ఏదో తినాలని ఏడ్చీ ఏడ్చీ పడుకున్నాడు.దగ్గరకి వచ్చేస్తున్నది గదా ఆఫీసు... ఆ ముసలోళ్ళ పెన్షన్ ఇస్తే ముందు మనవడికి బిస్కెట్ పాకెట్ కొనివ్వాలి అనుకుంది.మిగతావి తరవాత.


తీరా బ్లాక్ ఆఫీసు దగ్గరకి వస్తే అక్కడ ఏ వాహనం ఉన్న జాడా లేదు.అక్కడక్కడ కొద్దిమంది బయట నిలబడి ఉన్నారు,అంతా తన లాగా ముసలి వాళ్ళే.అంతా తన లాగా వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాడానికి వచ్చిన వాళ్ళే కనక అందులో చాలామంది తనకి బాగానే తెలుసు. అయినా ఇంకా జీపు రాలేదెందుకో..? 


జీపు అనేది ఏమైనా చెట్టు లేదా కొట్టు లాంటిదా ఒకే చోట ఉండానికి,ఎక్కడెక్కడో అవసరం ఉన్న చోటకి తిరుగుతుంది గదా.ఏమి అజ్ఞానం నాది అనుకుంది.


"ఇదిగో స్వైన్ వాళ్ళ కోడలా...ఏమిటి ఇవాళ మనకి పెన్షన్ ఇస్తారటనా..?" తనకి తెలిసిన మరో ముసలామె ని అడిగింది యశోద.


"ఈరోజు ఇవ్వరట. ఇచ్చే అధికారి రాలేదు.మనం శుక్రవారం రావాలట" ఆమె జవాబిచ్చింది.   

ఆ మాట వినేసరికి గుండె గుభేలుమంది.ఇలా అవుతుందని తను అసలు ఊహించలేదు.ఎంతో ఆశ తో ఇంత దూరం వచ్చింది.ఇప్పుడు ఒట్టి చేతులతో ఎలా వెళ్ళడం..?ఈ రోజు పతాపూర్ వెళ్ళకపోతే ఆ మధు సాహు కోప్పడతాడు.


"మాకు పిల్లలు పుట్టలేదు.నీ మనవడిని నా దగ్గర ఉంచేసెయ్. వాడికి ఏ లోటు రాకుండా సొంత బిడ్డ లా పెంచుకుంటాను" అన్నాడు మధు సాహు.అతను పతాపూర్ లో ఒక వ్యాపారి.గతనెల లోనే పిల్లాణ్ణి ఉంచేయ్ మన్నాడు గాని,తాను ఏదో బతిమాలి బామాలి తనతోనే పిల్లాణ్ణి అట్టిపెట్టుకుంది. 


"ఈ రోజు కానీ వెళ్ళకపోతే మాట పోతుంది" అనుకుంది యశోద.మధు సాహు కైతే చెప్పింది లే గాని కూతుర్ని ఒప్పించడం కష్టమే.పెంచుకుండానికి ఓ బిడ్డ ని ఆ మధు సాహు కి ఇద్దామని తను అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు.


"ఇప్పుడు అలాగే తీయటి మాటలు చెబుతారు.కొద్దిగా పెరిగిన తర్వాత ఇంట్లో కూలీగా మార్చుతారు.ఆ ఇంట్లో ఎప్పటికీ బానిస లా పనిచేయాల్సిందే...మనం తర్వాత ఏమి చేయలేము.నా కొడుకు అలాంటి చావు చావడం నాకు ఇష్టం లేదు"  అన్నది కూతురు.


యశోద కి కాలిపోయింది. "మనదేమైనా జమీందారీ కుటుంబమా...ఏ కష్టం లేకుండా పిల్లలు పెరగడానికి..? ఇక్కడ ఉంటేనేం...ఎక్కడ ఉంటేనేం..?మనతో ఉంటే పస్తులతో చస్తాడు...అక్కడ ఉంటే కనీసం ఓ పూట తిండైనా దొరుకుతుంది" అని గట్టిగా జవాబిచ్చింది తను.


"తిండి పెడతారో పెట్టరో ఎవరికి తెలుసు" అంది కూతురు.


"అవును మరి నువ్వు ఒక్కదానివే తల్లివి, మిగతా వాళ్ళంతా దెయ్యాలు మరి"  యశోద గయ్ మంది.కూతుర్ని ఒప్పించలేకపోయింది,తనకీ ఎక్కడో ఇష్టం లేకుండానూ ఉన్నది.అయితే భరించలేనంత కష్టం లో ఉన్నప్పుడే గదా ఎవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకునేది.  

"వసుదేవుడంతటి వాడే తన కొడుకు ని వేరే వాళ్ళ ఇంటి వద్ద విడిచిపెట్టవలసి వచ్చింది బిడ్డా. మనం ఎంతా..?" అంది యశోద కూతురు ని అనునయిస్తూ.


 ఆ మాట తో కాస్త ఊరడిల్లింది కూతురు. 


ఆఫీసు ముందర ఏదో కలకలం రేగింది.పెన్షన్ ఇచ్చే అధికారి వచ్చాడనుకుంటా,అనుకుంటూ లేచింది యశోద.కానీ ఎవరూ వచ్చినట్టు లేదు.అసలివాళ పెన్షన్ ఇస్తారో లేదో ఎవరు చెబుతారు.పొద్దున్నే లేచి అయిదు మైళ్ళు నడుచుకుంటూ వచ్చింది.ఆఫీస్ రూం ముందు కునికిపాట్లు పడుతున్న ప్యూన్ ని అడిగింది.శీతవేళ ఉదయాన కునుకు తీస్తూన్న ఆ మనిషి ఆకలిగొన్న కుక్క లా మొరిగాడు.


"ఈరోజు పెన్షన్ ఇవ్వరని చెప్పానా లేదా...ఎన్నిసార్లు అడుగుతావ్" అన్నాడు. "ఎక్కడ నుంచి వస్తారో ఏమో అడుక్కుతినే విధవలు...ఆ దేవుడికే తెలియాలి" అటెక్కడో ఉన్న మామిడి కొమ్మ ని చూస్తూ ఈసడించుకున్నాడు.తర్వాత యధా ప్రకారం నిద్ర లోకి జారుకున్నాడు. 

 మధ్యాహ్నం.సూర్యుడు బాగానే ప్రకాశిస్తున్నా శీతాకాలం కావడం వల్ల పెద్ద ఎండగా లేదు.యశోద కి నడుము నొప్పి గా అనిపించింది.దీనికి తోడు చిన్న పిల్లాడు.వాడు ఆకలయి,ఏడుస్తున్నాడు.చుట్టూ ఉన్న బిల్డింగ్ గోడల మీద,చెట్ల మీద దుమ్ము మూగి పాత గా అనిపిస్తున్నాయి.కాన్ పూర్ గ్రామానికి చెందిన ఈ యశోద ప్రధాన్ లాగే అవీనూ.ఇక్కడ ఉన్న పెద్ద వరండా దగ్గరా జనాలు చాలామంది గుమికూడతారు.ప్రతి నెల పదిహేనో తారీఖున వంద రూపాయలు పెన్షన్ తను ఇక్కడే తీసుకుంటుంది.దానికోసం నెల అంతా ఎదురుచూపులు చూస్తుంది.తనలాంటి పేద వితంతువులకి ప్రభుత్వం ఎంతో దయ తో ఇస్తున్నది.


దానితో తనకి కావలసిన కిరోసిన్,గోధుమలు,ఉప్పు,నూనె,పసుపు,కొన్ని పొగాకు ఆకులు లాంటివి కొంటుంది. వ్యాపారి కాశీ సాహు ఎంతో మంచి వాడు,తనకోసం ఓ లీటర్ కిరోసిన్ తీసి పక్కన పెడతాడు.లేకపోతే బ్లాక్ మార్కెట్ లో కొనడం తన వల్ల అవుతుందా..?  

యశోద కి అరవై ఏళ్ళు. కూతురు ని,కూతురు సంతానాన్ని తనే పోషించాలి.మనవడికి ఈ ఫిబ్రవరి వస్తే రెండేళ్ళు వస్తాయి.మనవరాలికి నాలుగో నెల.ఎలాంటి భూ వసతి లేదు.పిడకలు చేసుకోడానికి పేడ ఎత్తుకుంటూ,అక్కడక్కడా దొరికిన కూరగాయలు అవీ సేకరించుకుంటూ కాలం గడుపుతుంది.రైతులు ధాన్యం పనులన్నీ చేసుకున్నతర్వాత వాళ్ళ పొలం లో పడిన మిగులుధాన్యాన్ని కూడా సేకరించుకుంటుంది.అలా జీవితాన్ని లాగిస్తుంటారు. 


పెళ్ళి అయిన తర్వాత కూతురు ఏదో విధంగా బతుకుతుందిలే అనుకుంది.అల్లుడు ఎందుకూ పనికిరాని వాడు అయ్యాడు.అమ్మాయి జీవితం బుగ్గిపాలయింది.ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎటో వెళ్ళిపోయాడు.కొంతమందికి ఎక్కడో చబిష్ పరగణా ల్లో కనబడ్డాడని చెప్పారు.ఇంకొంతమంది సూరత్ మిల్లు లో పనిచేస్తున్నాడని అన్నారు.ఏదైతేనేం అతని జాడ కనుక్కోలేకపోయారు.తన లాంటి ముసల్ది ఎంత కాలం పోషించగలదు..? అది ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది.దానికితోడు కంటికి వ్యాధి సోకి చూపు మసకబారింది. కూతురు ఈ సమయం లో తన వద్ద ఉండటం వల్ల ఆమె కి మంచిదయింది,లేకపోతే మరీ గోస అయ్యేది. అల్లుడు వస్తాడో రాడో ఎవరికి తెలుసు..?తను ఎంత కాలం బతుకుతుందని...తన తర్వాత కూతురు ఎలా బతుకుతుందో ఏమో..!   

మనవడిని మధు సాహు అనే పతాపూర్ కి చెందిన కిరాణా వ్యాపారి పెంచుకోవడానికి ఒప్పుకున్నాడు.రెండు వేల రూపాయలు దానికి గాను ఇస్తానన్నాడు.నెలకి రెండు వందల రూపాయల చొప్పున రెండు ఏళ్ళ పాటు ఇన్స్టాల్మెంట్ రూపం లో చెల్లిస్తానన్నాడు. డబ్బు సంగతి అటుంచి రోజుకి రెండు పూటలైనా తిని పిల్లవాడు చక్కగా జీవిస్తే చాలు అనేది తన తపన.బ్లాక్ ఆఫీసు లో ఈరోజు పెన్షన్ వచ్చి ఉంటే తను పతాపూర్ వెళ్ళేది.ఇప్పుడేమో ఈరోజు కాదని అంటున్నారు,మరెప్పుడు వస్తుందో ...?


యశోదా అక్కడున్న మామిడి చెట్టుకి ఆనుకుంది.మనవడు గులకరాళ్ళ తో ఆడుకుంటున్నాడు.ఇంకొద్దిసేపు తను ఆదమరిచి ఉంటే వాడు అక్కడున్న పురుగు ని నోట్లో పెట్టుకునేవాడే.ముసలామె గట్టిగా అరిచింది.వాడు ఏడవడం మొదలెట్టాడు.వాడి ఆకలి వాడిది.ముక్కూ ,నోరు అంతా చీమిడి ..!వాడు వేసుకున్న బనీను అదీ కూడా మట్టి కొట్టుకుపోయి ఉంది.మనవడి ని ఎప్పుడు చూసినా ముసలామె కి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఎందుకంటే వాడి మొహం లో తండ్రి పోలికలు ఉంటాయి.వాడు ఒక దొంగ.


అయితే ఈరోజు మాత్రం కోపం రాలేదు ఆమెకి.ఇంకా పాలు తాగే ఈడే.అదీ గాక మధు సాహు కి తను మనవడిని ఇచ్చేయ్యబోతున్నది.తప్పని పరిస్థితి.ప్రతిదీ లలాట లిఖితమే...!మధు సాహు భార్య కి పిల్లలు కలగలేదు.ఎన్ని నోములు నోచినా ఫలితం లేకుండా పోయింది.చెవులు ఉన్నా ,వాటిని అలంకరించడానికి నగలు ఉండాలి గదా అనేది సామెత.కొంతమందికి నగలు ఉన్నా,అలంకరించుకునేందుకు చెవులు ఉండవు. సూర్య చంద్రుల్ని సృష్టించిన ఆ పై వాడే అన్నిటినీ నిర్ణయించేది.   


యశోద పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుందీ.వాడు తన చిన్న చేతుల తో అమ్మమ్మ మొహం లోని ముడతల్ని తడమసాగాడు.ఆమె లోని అలసట అంతా మటు మాయమైంది.ఆ పిల్లవాడు తనని వివరణ కోరితే తాను వాడికి జవాబు చెబుతున్నట్లుగా మాట్లాడసాగింది  " నీ రాత నిన్ను తీసుకువెళ్ళే చోటు కి వెళ్ళు నాయనా..!నేనా ఎక్కువ కాలం జీవించను.నీ మనసు లో ఏదైనా ఉంటే ఇప్పుడే అడుగు.నేను ఏ పాపం చేయడం లేదు.నీ ఆకలి కేకలు నేను చూడలేను.కొత్త ఇంటికి వెళ్ళి సంతోషం గా ఉండు. నీ తండ్రి ఒక పనికిరాని కుక్క,నీ తల్లిది ఏమో దిక్కు లేని బతుకు. ముసలిదాన్ని ..నేను ఏమి చేయగలను..? లేకపోతే నిన్ను ఎందుకు పోగొట్టుకుంటాను..?" 


వాడికి ఏమీ అర్ధం కాలేదు.చిన్న చేతులతో అమ్మమ్మ ముఖాన్ని తడిమాడు.రెండు వెచ్చని కన్నీటి చుక్కలు ఆమె కళ్ళనుంచి జాలువారాయి.

---2---

"సబ్ కలెక్టర్ గారు ఇంట్లో ఉన్నారా" అప్పుడే వంటా వార్పు ముగించి రాత్రి పూట తీరిగ్గా టి.వి. చూస్తూన్న దేవకి ని అడిగాడు స్టెనో. ప్రస్తుతం ఆమె ఏదో టి.వి.తెర నైతే చూస్తున్నది గాని, ధ్యాస అంతా పొద్దుట చూసిన వార్త మీదే ఉన్నది.అదే సమయం లో కంగారు గా వచ్చాడు స్టెనో.


దేబబ్రత ఎవరో కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆఫీసు లో అనే కాదు ఇంటికి వచ్చినా తను బిజీ గానే ఉంటాడు.బాగా రాత్రి అయినా ఏదో చేస్తూనే ఉంటాడు. పెళ్ళయిన మొదట్లో కోపగించుకునేది గాని ఇప్పుడు తను పట్టించుకోవడం మానేసింది. తను ఇలాంటివి పట్టించుకోకపోతేనే లాభం మరి.దేబబ్రత ఇంటికి ఎన్ని రోజులు దూరం గా ఉంటే అంత సంపాదిస్తాడు.దేవకి కి ఖరీదైన బహుమతులు వస్తాయి. ఆమె అల్మైరా లో ఎంతో విలువైన ఆభరణాల రాశి ఉంది. కొన్ని కటక్ లో,కొన్ని సంబాల్ పూర్,బ్రహ్మపూర్ లలో కొన్నవి.దేబబ్రత చూస్తే చాలు, ప్రతి నగ ని బాగా గుర్తు పడతాడు. వాటిని అన్నిటిని అలంకరించుకో అని దేబబ్రత అంటాడు గాని బుట్ట బొమ్మ లా అన్ని నగలు వేసుకోవడం దేవకి కి ఇష్టం ఉండదు.


దేబబ్రత ఫోన్ లో మాట్లాడడం పూర్తి చేశాడు.స్టెనో తో కలిసి ఆఫీసు రూం లోకి వెళ్ళాడు.డ్రైవర్ కూడా వచ్చి ఉన్నాడు.ఆమె కి ఎవరూ చెప్పకపోయినా విషయాన్ని ఊహించింది.ఇవాళ పొద్దుట న్యూస్ పేపర్ లో చిన్న పిల్లవాడి ని ఎవరో అమ్మిన వార్త వచ్చింది.దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వెళుతున్నట్లు అర్ధమయింది.

దేవకి తలుపు వేసి కూర్చుంది. శీతాకాలం...రాత్రి...చల్లగా,నిశ్శబ్దం గా ఉంది.ఇంటి నిండా ప్రాణం లేని ఎంతో వస్తు రాశి.ఇంకో మనిషి చప్పుడు లేదు.ఆమె కళ్ళ లో కన్నీళ్ళు తిరిగాయి.ఈ మధ్య కాలం లోనే మూడు గర్భస్రావాలు జరిగాయి.మొదటి రెండు నెలలు బాగానే ఉంటుంది.ఆ తర్వాత శిశువు కడుపు లోనే పోవడం జరుగుతోంది.ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది పిల్లల కోసం. ఈ ఒక్క కోరిక నెరవేరితే జీవితం లో లేని సంపద అంటూ లేదామెకి.తన ప్రార్ధనలు ఫలించడం లేదు.అక్కడెక్కడో ఎనభై మైళ్ళ దూరం లో ఉన్న కాన్ పూర్ అనే గ్రామం లో యశోదా ప్రధాన్ అనే ఆవిడ ఇద్దరు పిల్లల్ని బొమ్మల మాదిరి గా అమ్మిపారేసిందిట..!   

దేవకి ఆలోచనల్లో మునిగిపోయింది.తమ దేశం లో ఉన్న ప్రజలకి రోజుకి రెండు పూటలు తిండి పెట్టలేని పాలకులు ఎందుకు..?పేద ప్రజలకి భూమి న్యాయంగా పంచి కనీసం వాళ్ళ తిండిని వాళ్ళు పండించుకునేలా కనీసం అయిదేళ్ళు అలా జరిగేలా చూడాలి.ముసలితనం లో పట్టెడు అన్నం దొరకకపొతే ఇంకెందుకు ఇన్ని కోట్ల రూపాయాల పథకాలు..!ఆకలి బాధ తో పిల్లల్ని అమ్ముకునే తల్లి శోకం ఎంత ఘోరం గా ఉంటుందో...!ఆమె కి వచ్చే ఈ ఆలోచనలు అన్నీ మిగతావాళ్ళకి ఏదో సెంటిమెంట్ కబుర్లు లా ఉంటాయి.దేబబ్రత నవ్వి ఊరుకుంటాడు.


"అలాగే ఉండు...ఏదో రోజు నీకే తెలుస్తుంది. మల్కాన్ గిరి ప్రాంతం నుంచి ఇటు వేపే వస్తున్నారు.నీ తలకే గన్ గురిపెడతారు.అప్పుడు పర్యవసానాలు అనుభవిస్తావు...నాకేం" అంటుంది దేవకి వ్యంగ్యం గా.


దేబబ్రత ఇలాంటి మాటలు అసలు పట్టించుకోడు.ఓ సారి నవరంగ్ పూర్ అనే గ్రామానికి చెందిన స్కూల్ మేస్టారు, అక్కడి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కబుర్లే చెప్పాడు. పాఠ్య పుస్తకం చూపిస్తూ "గ్రేప్స్,చీజ్,ఆపిల్స్ ఇలాంటి బొమ్మలన్నీ ఎందుకు సార్,మా పిల్లలకి వీటి గురించి ఏమి తెలుసు...వాళ్ళ ఇళ్ళని పుస్తకాల్లోని ఇళ్ళని పోల్చుకున్నప్పుడు సంతోషం గా ఎలా అనిపిస్తుంది..? విమానాలు,సిమెంట్ రోడ్లు,కార్లు వాళ్ళకి సంబందించని విషయాలు.ఎక్కడో కూర్చుని ఇక్కడ వాళ్ళ గురించి ప్రణాళికలు వేస్తే ఎలా..?" అన్నాడు.ఆ గ్రామస్తులంతా చోద్యం గా చూశారు.మేస్టారు ఏదో పిచ్చి పిచ్చిగా మాటాడుతాడులెండి అన్నారు.ఇప్పుడు అలాంటి వాదనే భార్య నోటి నుంచి వస్తుందని తను అనుకోలేదు.సబ్ కలెక్టర్ దేబబ్రత కి ఇలాంటి వాదనలు అంటే అసలు గిట్టవు.  


  దేవకి అప్పుడప్పుడు ఇలాంటి వాదనే చేస్తుంది.తనకి అవి రుచించవు.ఇంకా పూయని పూల గురించి,కాయని పళ్ళ గురించి ఏవో ఆలోచనలు ఆమెకి. ఆమె అలా తన సమయాన్ని గడుపుతుంది.తల్లిదండ్రులకి ఆమె ఒక్కతే కూతురు,బైటకి వెళ్ళి చూసింది తక్కువ.కనుక ఇలాంటి పగటి కలలు వస్తుంటాయి.దేవుడు ఆమె కి ప్రత్యక్ష్యమయి ఏమి కావాలో కోరుకో అంటే కూడా చెప్పలేని మనిషి ఆమె.లాటరీ లో కోటి రూపాయలు వస్తే ఎలా ఖర్చు చేయాలో కూడా ఆమెకి తెలియదు.పదివేల ని ఖర్చు చేయమన్నా కష్టమే.ఇదిగో ఇలాంటి వాటితో కాలం పాస్ చేస్తుంది.ఒంటరి గా ఉండే వ్యక్తి కి అదే హిమవన్నగం లా అనిపిస్తుంది.భూకంపాలకి కూడా చలించని హిమవన్నగం.


డాక్టర్ జెనా చెప్పాడు ఈ సారి కానుపు క్షేమకరం గా అవుతుంది, బయపడవలసిన అవసరం లేదని..! ప్రస్తుతం ఆమె కి మళ్ళీ అయిదవ నెల. కొద్దిగా జాగ్రత్త గా ఉంటే చాలు,ఆందోళన పడనవసరం లేదు.మందులు రెగ్యులర్ గా వాడుతూ,అప్పుడప్పుడూ చెకప్ చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్ భరోసా ఇచ్చాడు.


ఆ మాటలు దేవకి కి ఆనందాన్ని కలిగించాయి.చిన్న పిల్లకి వివరించినట్లుగా వివరించాడు.అతను వెళ్ళిపోగానే తలుపు వేసుకుంది.ఈసారైనా నన్ను ఈ గొడ్రాలి గా ఉండే స్థితి నుంచి బయటపడేయరా అంటూ పుట్టబోయే శిశువునుద్దేశించి కూనిరాగాలు పాడుకుంది.


---3---


సబ్ డివిజన్ మొత్తం లో వార్త దావానలం లా వ్యాపించింది.చలికాలం లో కూడా దేబబ్రత కి చెమటలు పట్టసాగాయి.కాకుల్లాగా ప్రెస్ రిపోర్టర్లందరూ వచ్చేశారు.ఏదో బాంబు పడ్డట్లుగా ఉంది వాళ్ళకి,ఈ చిన్న విషయం.అప్పటికీ ఏడాదంతా  సమయం కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఏవో గిఫ్ట్ లు ఇప్పిస్తూనే ఉంటాడు.విందులూ వాటికీ ఆహ్వానిస్తుంటాడు.ఏదో మిష మీద వాళ్ళకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తుంటాడు. చెడు గా వార్తలు రాయకుండా ఈ ఫేవర్ లు అన్నీ చేసినా ఒక్కోసారి ఫలితం ఉండి చావదు.ఇదిగో ఇప్పుడు "ఖైరి గడ్ లో పిల్లల" అమ్మకం గురించి ముఖ్యమైన పేపర్ల లో వచ్చి రాజధాని దాకా వార్త పాకింది.

 కాని దేబబ్రత రిలాక్స్ గానే ఉన్నాడు.తెలివి గా హేండిల్ చేసి రెండు ఉపద్రవాల నుంచి తప్పించుకున్నాడు.లేకపోతే ఈ పిల్లల అమ్మకం పెద్ద పొలిటికల్ ఇష్యూ అయి ఉండేది.ఇక్కడికి సబ్ కలెక్టర్ గా రావడానికి ఎంతో లాబీ చేయించాడు.చేతులు తడపడం అటుంచి,స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ మొహంతి తోడ్పాటు లేకపోతే తాను ఇక్కడికి రాగలిగేవాడు కాదు.ఇంకా నవరంగ్ పూర్ లోనే దుమ్ము కొట్టుకుంటూ ఉండేవాడు.తాను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అవుతోంది.మళ్ళీ బదిలీ అంటే,చాలా ఇబ్బంది.పైగా దేవకి కూడా కష్టం అవుతుంది.    

    దేబబ్రత ఆఫీసు లో టీ తాగుతుండగా కలెక్టర్ ఫోన్ చేశాడు.అలాగే కటక్ లోని అర్.డి.సి. నుంచి ఫోన్ వచ్చింది.కాన్ పూర్ గ్రామం లో పిల్ల వాడిని అమ్మివేసిన ఘటన కి సంబందించి పూర్తి సమాచారం పంపించమని తాఖీదులు వచ్చాయి.ప్రస్తుతం అసెంబ్లీ సెస్షన్స్ జరుగుతున్నాయి.ఎప్పుడు ఏమి అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కలెక్టర్ చాలా పరుషం గా మాట్లాడాడు.రిసీవర్ విసిరికొట్టాలనిపించింది.తనపై అధికారి కాబట్టి వినయం గా వినకతప్పలేదు.


ఆ తర్వాత మినిస్టర్ కూడా ఫోన్ చేశాడు.తను కాన్ పూర్ కి సాయంత్రం మళ్ళీ వెళ్ళాలి.తప్పదు.చిన్న పిల్లోడిని అమ్మిన ఘటన చోటు చేసుకుంది.నిజమే.కాని తను అధికారికం గా దాన్ని చెప్పలేడు.పొలిటీషియన్స్ కి ఆఫీసర్స్ కి అక్కడే తేడా ఉంది.పొలిటీషియన్స్ తాము ఇచ్చిన స్టేట్ మెంట్ ని మార్చుకోగలరు.కాని ఒక సారి చెప్పినదానికి ప్రభుత్వాధికారి కట్టుబడి ఉండాలి.రిటైర్ అయ్యేంత వరకు కూడా..! లోపల రెండు అభిప్రాయాలు ఉండవచ్చు గాక,కాని ఒకదాన్ని ఆ లోపలే ఉంచుకోవాలి.రూల్స్ ని అతిక్రమించిన కారణం గా పై అధికారులనుంచి రిమార్క్ రావడం జరుగుతుంది.ఇంకా కాన్ ఫిడెన్షియల్ రిపోర్ట్ లో రాయడం వంటివి ఉంటాయి.  


 సరైన సమయానికే,యశోదా ప్రధాన్ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లు గా ఇపుడు రికార్డు ల్లో చూపించాలి.దానికి గాను ఆమె వేలిముద్ర ని కూడా తీసుకున్నారు.డబ్బుల్ని,వ్యక్తిగతం గా ఒక ఉద్యోగి వెళ్ళి అందజేయడం జరిగింది. బ్లాక్ స్థాయిలోగాని,సబ్ డివిజన్ స్థాయి లో గాని చట్ట ప్రకారం తమ తప్పులేదని చెప్పగలిగే ఎవిడెన్స్ లు తయారయ్యాయి.ఇంతటితో దేబబ్రత తలనొప్పి తగ్గలేదు.పిల్లాడి అమ్మకం అనేది ఒకటి ఉంది.దీన్ని కవర్ చేయాలి.అయితే తనకి ఇది ఒక లెక్క కాదు.అనేక వేలమంది ని పోటీ లో తట్టుకొని సివిల్ సర్వెంట్ అయ్యాడు.ఈ కాన్ పూర్ కి చెందిన ముసలామె లేదా పతాపూర్ బజార్ లో ని వ్యాపారి వీళ్ళ చేతి లోనా తాను ఓడిపోయేది..?


ముసలామె కూతురు కేరక్టర్ అంత మంచిది కాదని ఎవిడెన్స్ లు సృష్టించాడు.దానితో సమస్య తీరినట్లే.ఈ పతాపూర్ వ్యాపారి కి పుట్టిన కొడుకే అమ్ముడైన పిల్లాడని ,వాడిని కన్న తండ్రి గా ఆ వ్యాపారి ఆ పిల్లోడిని తీసుకున్నాడు తప్పా అసలు అమ్మకాలు అనేవి ఏమీ జరగలేదని ముందు జరగబొయే ఎంక్వైరీ లో రాస్తారు.ఆ విధం గా ప్లాన్ తయారైపోయింది.


"మరి ముసలామె ని ఏమి చేద్దాం,ఆమె పేరు ఏమిటి?,యశోదా గదా " అన్నాడు సబ్ కలెక్టర్.


"ఆమె గురించి బాధ లేదు సర్.ఆ విధంగా ఒక వీడియో తయారు చేశాము.ఆ ముసల్ది ఇక ఊరి లో ఎవరికీ తల చూపించుకోలేదు.అంతే.గ్రామీణ ప్రాంతాల్లో శీలానికే ఎక్కువ విలువ ఇస్తారు" అన్నాడు స్టెనో.


"నువు చెప్పింది నిజమే,రేపు పదింటికల్లా ఈ కేసెట్ లు తీసుకొని భుబనేశ్వర్ వెళ్ళు.ఆర్.డి.సి. ఆఫీస్ లో ఒకటి అందజెయ్యి.అలాగే నీతో బాటు బిడివో ని కూడా తీసుకు వెళ్ళు..సరేనా" 


"అలాగే సర్" 


దేబబ్రత గోడ వేపు చూశాడు.గడియారం లో తొమ్మిది అవుతోంది.అమ్మయ్యా ...మొత్తానికి ఒక సమస్య తీరిపోయింది.కాని అంతరాత్మ మరోవేపు హెచ్చరిస్తోంది." నీకున్న స్థాయి తో,ధనం తో ఎంతో సాధారణ జీవితం గడిపే మనుషుల్ని మోసం జేశావు" అని. 


దేబబ్రత నవ్వుకున్నాడు. ఈ లోకం లో మోసం చేసేవారు,మోసం చేయబడేవారు...ఈ రెండు రకాల మనుషులే ఉన్నారు.తను మోసం చేయకపోతే దెబ్బతింటాడు.దాన్ని తను ఎంతమాత్రం అంగీకరించడు.


ఆఫీసు నుంచి పక్కనే ఉన్న తన నివాసానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అసెంబ్లీ జరుగుతున్నది,తను సరైన సమయానికి వెళ్ళాలి.మినిస్టర్ అవతల తనకోసం వెయిట్ చేస్తూంటాడు.

అంతలోనే,బిడివో సర్బేశ్వర ఆందోళన గా లోపలికి వచ్చాడు.తుఫాన్ లో ఊగిపోతున్న చెట్టు లా ఉన్నాడు.అతను తెచ్చిన వార్త విని దేబబ్రత కి ముచ్చెమటలు పట్టాయి.


గతరాత్రి,ఆ ముసలామె ఇంకా ఆమె కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పాడు.ఇద్దరు పిల్లలకి కూడా విషమిచ్చి చంపారని కూడా బిడివో తెలిపాడు.


దేబబ్రత షాక్ కి గురయ్యాడు. కాళ్ళకింద భూమి చీలిపోయినట్లు తోచింది.కుర్చీ ని గట్టిగా పట్టుకున్నాడు.ఆ గది లో నిశ్శబ్దం రాజ్యమేలింది కాసేపు.ఏమి మాట్లాడటానికి నోరు పెగల్లేదు ఇద్దరికీ..!దేబబ్రత తేరుకొని చెప్పాడు.


"మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు.పతాపూర్ లో ఉన్న ఎన్ జి వో ఉంది గదా ...సంవేదన అని చెప్పి...దాని బాధ్యుడు మొహంతి ని వాళ్ళ కెమెరామేన్ తో సహా వెంటనే రమ్మని కబురు చెయ్యి.అలాగే చౌత్రాయ్ ని కూడా రమ్మని చెప్పు"  


"చౌత్రాయ్.." 


"కాంట్రాక్టర్ చౌత్రాయ్ తెలియదా..?ఎమర్జెన్సీ అని చెప్పు.టివి బృందాన్ని తీసుకొని టాక్సీ లో వెంటనే కాన్ పూర్ కి వెళ్ళమని చెప్పు" 


"కాని...ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయడం ..." నసిగాడు బిడివో.


"నీకెవరయ్యా బిడివో ఉద్యోగం ఇచ్చింది..?స్టుపిడ్" అరిచాడు. ఈ ఆందోళన లో బడి, ఆఫీసు కి తన నివాసం కి మధ్య ఉన్న తలుపు మూయడం మర్చిపోయాడు దేబబ్రత.


"మన వద్ద విట్నెస్ లు ఉన్నాయి గదా.వాళ్ళు ఇపుడు టివి బృందాల ముందు ఏమని చెప్పాలంటే,అవమానభారం తో భరించలేక ఆ తల్లీ కూతుర్లు ఇద్దరూ పిల్లలకి విషం ఇచ్చి ఆ తరువాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాలి.అప్పుడు గవర్మెంట్ సైడ్ నుంచి సింపతీ వస్తుంది,దహన ఏర్పాట్లు జరుగుతాయి..అర్ధమయిందా?" 


ఒక్కసారిగా స్టెనో నోరు వెళ్ళబెట్టాడు. తరువాత చిన్నగా నవ్వాడు..లోపల పాన్ తో పండిన ఎర్రదనం.సబ్ కలెక్టర్ శ్రీకృష్ణునిగా తాను గీతాసారం వినే ఉద్ధవుని గా ఆ క్షణం లో తోచింది.   

    బిడివో కి సబ్ కలెక్టర్ మీద తిట్టినందుకుగాను ఉన్న కోపం పోయి అభిమానం పెరిగింది.


"వెంటనే కదలాలి మనం.ఆట్టే టైం లేదు.మనం ముందు వెళదాం,ఆ తరువాత చౌత్రాయ్ వస్తాడు.శవాల దహనం అదీ కానిచ్చేయాలి.ప్రతిదీ సూసైడ్ యాంగిల్ లో ఫోకస్ చేయాలి.పేపర్ల లో,టివీ ల్లో న్యూస్ ఆ విధం గా వచ్చేటట్లు చేయాలి. సర్బేశ్వర ...ముందు నువు ఆ ఖర్చులన్నీ పెట్టుకో...అర్ధమయిందిగా..?"


"సార్...మీరు నా పాలిట రక్షకులు.తండ్రి...లా నన్ను ఈ కేసు లో నుంచి బయట పడేస్తున్నారు" ఆరాధన గా అన్నాడు బిడివో.


వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.థడ్ మంటూ శబ్దం వచ్చింది.అందరూ ఆ వైపు చూశారు.దేవకి ...డోర్ కర్టెన్ ని పట్టుకుని అలాగే కిందపడిపోయింది.దేబబ్రత వేగంగా ఆమె వద్ద కి వెళ్ళాబోయాడు.


"ఆగు..నా వైపుకు రావద్దు" దేవకి గట్టిగా అరిచింది.ఆమె ఎంతో బాధ లో ఉంది.పళ్ళ బిగువున మాటాడుతోంది. ఆమె ముఖ కవళికల్ని బట్టి తాము అనుకున్నదంతా విన్నదని అర్ధమయింది.


"దేవకి...ఏం మాటాడుతున్నావు,అయ్యో దేవుడా...నీ చీరకి ఎంత రక్తం అంటిందో చూడు"అంటూ, దేబబ్రత మిగతా కొలీగ్స్ ని బయట కి వెళ్ళమని కోరాడు.స్టెనో ని కార్ పంపించమని చెప్పాడు,డాక్టర్ జెనా దగ్గరకి వెళ్ళడానికి.   

   "ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు.బిడ్డ...అయిదునెలలు నేను మోసిననాకు పుట్టబొయే బిడ్డా చనిపోయాడు. బిడ్డ చనిపోయిపడున్నాడు" దేవకి బుస కొట్టినట్లుగా అన్నది.


"ఎలా..ఎలా జరిగింది?" దేబబ్రత అడిగాడు.


"ఒక్కసారి నీ చేతులు చూసుకో..ఒక పిల్లవాడి రక్తం తో ఇప్పటికే తడిసిఉన్నాయి. నీ వల్లనే నా బిడ్డా చనిపోయాడు.నువు మనిషి వి కాదు.అలనాటి కంసుడివి.రాక్షసుడివి" అలా అంటూ దేవకి స్పృహ తప్పింది.


దేబబ్రత చలనం లేకుండా,ఒంటరి గా నిలుచుండిపోయాడు.తన అర చేతుల్ని చూసుకున్నాడు.వాటినుంచి రక్తబిందువులు కారుతున్నట్లు అనిపించింది.అవి ఎక్కడినుంచి వచ్చినట్లు..?


అతని ముందు భార్య నిస్త్రాణ గా పడి ఉంది.ఆమె కి మళ్ళీ గర్భం పోయిందని అర్ధమయింది.లోపలే బిడ్డ చనిపోయాడు.ఏ విధంగా ప్రతిస్పందించాలో అర్ధం కాని దిగ్భ్రాంతి లో కూరుకుపోయాడు.కింద అంతా రక్తమయం, ధార అలా కారుతూ గుమ్మం దాటి బయటకి వెళుతోంది.కంప్యూటర్ లాంటి తన మస్తిష్కం స్థాణువై పని చేయడం మానేసింది.


భార్య ని చేతుల తో లేపడానికి ప్రయత్నించాడు.దేవకి గట్టిగా అరిచింది.అతని పట్ల అసహ్యం తో." నా వద్దకి రావద్దు.నువు మనిషివి కావు.మానవ హంతకుడివి.మనుషుల్ని చంపడం నీకు ఒక ఆట.దూరం గా..వెళ్ళు...వెళ్ళిపో" 


(సమాప్తం)   

( Sri Gourahari Das is a renowned Writer, Columnist and Journalist in Odisha. He penned more than forty books. Winner of Kendra Sahitya Academy Award. And many more. Worked as the editor of ETV Odiya. Presently with the Kanak TV as a director. I extend my profound gratitude to him for giving me the opportunity to translate his stories)

   

No comments:

Post a Comment