Tuesday, July 6, 2021

ఫాదర్స్ అండ్ సన్స్ - ఇవాన్ తుర్గనెవ్ నవల

 "ఫాదర్స్ అండ్ సన్స్" - ఇవాన్ తుర్గనెవ్ నవల 

----------------------------------------

నిహిలిజం అనే మాట గుర్తుకు రాగానే రష్యన్ రచయిత ఇవాన్ తుర్గనెవ్ రాసిన "ఫాదర్స్ అండ్ సన్స్ " అనే నవల గుర్తుకు రాకమానదు.ఆ భావ వాదం యొక్క లోతు ఏమిటి..? పంధొమ్మిదవ శతాబ్ది కి చెందిన యువ తరం పై దాని ప్రభావం ఏమిటి..? దాని పర్యవసానం ఏమిటి..? అదీ ముఖ్యం గా ఫ్రాన్స్,జర్మనీ లకి చెందిన ఆలోచనావేత్తల యొక్క తాత్విక ధార రష్యా లోనూ ఏ విధం గా ప్రభావం చూపింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ నవల చదవవలసిందే..!అంతే కాదు నాటి పశ్చిమ యూరపు దేశాల సంస్కృతి ని వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన స్లావ్ సంస్కృతి అభిమానుల యొక్క భావధార ను అంతర్లీనం గా మనం దీనిలో గమనించవచ్చు.ఇలాంటి వారిని స్లావొ ఫైల్స్ అన్నారు.రష్యా కి గాని దాని చుట్టూ ఉన్న బల్గేరియా,పోలాండ్ వంటి దేశాలకి గాని ఉమ్మడిగా ఒక సాంస్కృతిక చట్రం ఉంది.దానికి ఇరుసు వంటిది రష్యన్ అర్థోడాక్స్ చర్చ్.వీటి ప్రత్యేకత ని నిలబెట్టుకోవడానికి అచటి కళాకారులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.

సరే...అసలు నిహిలిజం అంటే ఏమిటి..? స్థూలం గా చెప్పాలంటే అన్నిరకాల మత పరమైన,నైతిక పరమైన విలువలను తోసిపుచ్చడం అని చెప్పవచ్చు.ఇంకా అన్ని రకాలైన అధికారాన్ని వ్యతిరేకించడం.ప్రతి దాన్ని శోధించి తెలుసుకుని అప్పుడు మాత్రమే దాన్ని నమ్మాలని భావించడం. ఈ విలువల్ని నమ్మి ఆచరించే వారిని నిహిలిస్టులు అని పిలిచారు. ఇదిగో ఇలాంటి ఒక నిహిలిస్ట్ జీవితాన్ని ఆధారం గా చేసుకొని నిర్మించినదే ఈ నవల.మరి ఈ నవల ని రాసినవారు ఇవాన్ సెర్గెవిచ్ తుర్గనెవ్. మాస్కో కి రమారమి మూడువందల కి.మీ.దూరం లో ఉన్న ఒరైల్ అనే గ్రామం లో అక్టోబర్ 8 వ తేదీన,1818 లో జన్మించాడు.గై డి మపాసా కి,లియో టాల్ స్టాయ్ కి సమకాలికుడు.

సంపన్న కుటుంబం లో జన్మించడం వల్ల బాల్య దశ లో గ్రామం లోని విశాలమైన ఎస్టేట్ లో జీవించాడు. ఆ తర్వాత ఎక్కువగా విదేశాల్లో పర్యటించాడు.రష్యా లోనూ,జర్మనీ లోనూ ఉన్నతాభ్యాసం చేశాడు. ఒక ఫ్రెంచ్ గాయని ని ప్రేమించి పారిస్ లోనే ఎక్కువ గా నివసించాడు.ఆమె కి అప్పటికే పెళ్ళయి భర్త ఉన్నప్పటికీ అతని అనుమతి తోనే వారి ఇంటి చేరువ లోనే ఉండేవాడు.ఈ పారిస్ నివాసం వల్లనే అతనికి అనేకమంది మేధావులతో పరిచయమైంది.తన జీవిత కాలం లో రాసిన గొప్ప పుస్తకాలన్నీ ఇక్కడనే రాశాడని చెప్పాలి.అయితే వేసవి కాలం లో మాత్రం తప్పకుండా రష్యా కి వచ్చేవాడు.   

    1862 లో రష్యన్ భాష లో వెలువడిన ఈ నవల ఆ రోజుల్లో సంచలనం రేపింది. అయితే ఆంగ్లం లోకి మొదటి గా అనువాదం చేయబడింది మాత్రం 1867 వ సంవత్సరంలో..!అనువాదకుడు యూజిన్ షుల్లర్. ఆ తర్వాత కాలం లో పీటర్ కార్సన్ కూడా ఆంగ్లం లోకి అనువదించాడు.పెంగ్విన్ బుక్స్ వారు ప్రచురించగా, ప్రస్తుతం దాన్ని నేను చదవడం జరిగింది.మూల రచయిత దీన్ని విసారియన్ బెలిన్స్కి అనే విమర్శకుని కి అంకితమిచ్చాడు. తుర్గనెవ్ తన రచనా జీవితానికి ఎంతో సహకరించిన వ్యక్తి గా ఈయన్ని గౌరవించేవాడు. మొట్ట మొదటి గా ఒక రష్యన్ నవల యావత్ యూరపు లోని దేశాల్ని ఆకర్షించడం అనేది ఈ ఫాదర్స్ అండ్ సన్స్ తోనే ప్రారంభమయింది.ఆ తర్వాత లియో టాల్ స్టాయ్ తో అని చెప్పాలి.వీరిద్దరి మధ్య ఒక అంతర్గత వైరం కొనసాగి గొడవలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.సరే...ఆ విషయం మరోసారి చెప్పుకుందాం.

ఇప్పుడు స్థాలీపులాక న్యాయంగా కథ లోకి వెళదాం..!అది 1859 వ సంవత్సరం,మే 20 వ తారీకు. మేరినో గ్రామానికి కాస్త దూరం లో ఉన్న ఓ చిన్న పట్టణం.రోడ్డు కి పక్కనే ఉన్న ఓ సత్రం.అక్కడ ఓ పెద్ద మనిషి ఎదురుచూస్తున్నాడు... సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్శిటీ లో చదువు ముగించుకుని వస్తూన్న తన కొడుకు కోసం. ఆ తండ్రి పేరు నికొలాయ్ పెత్రొవిచ్ కిర్సనోవ్. కొడుకు పేరు ఆర్కడి నికొలొయ్ విచ్ కిర్సనోవ్.రష్యన్ పేర్లు కాస్త పొడుగ్గానే ఉంటాయి గనక షార్ట్ గా నికొలాయ్ అని,ఆర్కడి అని అనుకుందాం. కొడుకు తనతో పాటు బజరోవ్ అనే తన మిత్రుడిని కూడా తీసుకొచ్చాడు.వీరిద్దర్నీ గుర్రపు బండ్ల లో తమ గ్రామానికి తోడ్కొని వచ్చాడు తండ్రి. ఆ మేరినో గ్రామం లో ఓ పెద్ద భూస్వామి ఈయన. రమారమి 200 మంది సెర్ఫ్ లు ఇతని కింద ఉంటారు.5000 ఎకరాల భూమి.ఈ నికొలాయ్ గాని ,ఈయన తండ్రి గాని అంతా ఒకప్పుడు సైన్యం లో పనిచేసినవారే.ప్రస్తుతం రిటైర్ అయి గ్రామం లో వ్యవసాయం చేస్తున్నాడు.       

   పాతకాలపు పెద్ద భవనం.దాంట్లో నికొలాయ్ తో పాటు అతని సోదరుడు పావెల్ కూడా ఉంటూంటాడు. నికొలాయ్ భార్య చనిపోతుంది.ఆ తర్వాత ఒక పనిచేసే అమ్మాయిని చేరదీస్తాడు.ఆమె పేరు ఫెనెష్కా.ఆమె కూడా ఇక్కడే ఉంటుంది.తాను ఇలాంటి పని చేసినట్టు కొడుక్కి ఎంతో బిడియం గా చెబుతాడు.ఆర్కడి అదేమీ తప్పుగా అనుకోడు.అది నీ వ్యక్తిగత విషయం సిగ్గుపడనవసరం లేదు అంటాడు.ఆ ఫెనెస్కా కి ఓ చిన్న బిడ్డడు వాడి పేరు మిత్యా.ఈ ఇద్దర్నీ ఆదరం గానే చూస్తాడు ఆర్కడి.

ఇక తనతో వచ్చిన బజరోవ్ ని తండ్రికి,అంకుల్ పావెల్ కి పరిచయం చేస్తాడు.ఈ సెలవుల్లో కొంతకాలం మన ఇంట్లో ఉంటానికి వచ్చాడని చెబుతాడు. సరే...దానిదేముంది లే అంటారు వాళ్ళు. అయితే పోను పోను బజరోవ్ వ్యవహార శైలి ఈ ఇద్దరు పెద్ద వాళ్ళ కి ససేమిరా నచ్చదు.అంటే సంస్కృతి,సంగీతం,సాహిత్యం,రష్యా చరిత్ర ని చూసి గర్వించడం ఇలాంటివి ఏవీ బజరోవ్ కి నచ్చదు.పైగా వాటిని నిక్కచ్చిగా విమర్శిస్తూంటాడు. పాతవి అయినంత మాత్రాన ప్రతిదాన్ని గౌరవించనవసరం లేదని అంటాడు.అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి...ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూలగొట్టాలా అంటాడు అంకుల్ పావెల్.అలా ఈ బజరోవ్ కి ఈ పావెల్ కి మానసిక ఘర్షణ తలెత్తుతుంది. ఏమిట్రా వీడు లోకానికి విరుద్ధం గా ఉన్నాడు నీ స్నేహితుడు అని తండ్రి,పెద తండ్రి ఆర్కడి ని అడుగుతారు.తన స్నేహితుడు నిహిలిస్ట్ అని పరిశీలించకుండా దేన్ని నమ్మడని తన పద్ధతులు వేరు అని చెబుతాడు.  

నికొలాయ్ ఓసారి పుష్కిన్ పద్యాలు చదువుతుండగా ...ఆ దాంట్లో ఏముంది ,దానికంటే జర్మన్ ఫిలాసఫర్ పుస్తకం చదివితే మంచిదని అంటాడు ఈ బజరోవ్. అంతేనా...రష్యన్ శాస్త్రీయ సంగీతం పియానో పై వాయిస్తుంటే దాన్నీ విమర్శిస్తాడు.అలాగే పావెల్ తన డ్రెస్ ఇంకా అలవాట్ల విషయం లో ఇంగ్లీష్ వారిని అనుకరిస్తే దాన్నీ విమర్శిస్తాడు. ఈ ఇద్దరు పెద్దవాళ్ళ తరానికీ,ఈ యువతరం కి గల ఆలోచనల లోని తేడాని ఇలా అనేక విధాలుగా చూపిస్తాడు రచయిత. ఆ పేరు మీద గత కాలం లోని మంచి విషయాల్ని సైతం ఖండించడం మాత్రం నికొలాయ్ కి పావెల్ కి గిట్టదు.       

ఈ బజరోవ్ యూనివెర్శిటి లో డాక్టర్ కోర్స్ చదువుతుంటాడు.ఇక్కడికి వచ్చినా,ఊరికే ఉండడు కప్పల్ని వాటిని పడుతూ కోసి ప్రయోగాలు చేస్తుంటాడు. ఏమిటి ...మీ అంకుల్ పావెల్ ఎప్పుడూ ఇంత గ్రామం లో కూడా ప్రతి రోజు మంచి ఫేషన్ గా డ్రెస్ చేసుకుంటాడు ,మళ్ళీ ఏదో కోల్పోయినవాడిలానూ ఉంటాడు అని చెప్పి బజరోవ్ మిత్రుడు ఆర్కడి ని అడుగుతాడు.తను ఒకప్పుడు సైన్యం లో పెద్ద ర్యాంక్ లో పనిచేశాడని,ఆ తర్వాత విదేశాలు వెళ్ళి అక్కడ ఒక లవ్ విషయం లో దెబ్బతిని అలా అయ్యాడని చెబుతాడు ఆర్కడి. ఒక లవ్ విషయం లో ఫెయిల్ అయినంతమాత్రాన అలా అయిపోతే అతనికి ఏం జ్ఞానం ఉన్నట్లు..అతనేం మగాడో అని ఈసడించుకుంటాడు బజరోవ్.

అయితే విచిత్రం గా ఇదే బజరోవ్, అన్నా సెర్గెనొవ్ ఒడింత్సోవా అనే ఆవిడ ప్రేమ లో పడినప్పుడు ఆలోచనా రహితం గా వ్యవహరిస్తాడు.అంటే ఎంత నిహిలిస్ట్ అయినా ,ఎంత సైంటిఫిక్ గా ఆలోచించే శక్తి ఉన్నా మనిషి కొన్నిసార్లు తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం జీవించలేడు అని అర్ధం అవుతుంది.ఆ తర్వాత ఇద్దరు మిత్రులు తమ పొరుగునే ఒక ఊరి లో ఉన్న అన్నా,కాత్యా అనే ఇద్దరిని ప్రేమిస్తారు.అది కూడా బజరోవ్ ఆలోచనా ధోరణికి పరీక్ష గా నిలుస్తుంది.ఇద్దరూ కొత్త విషయాల్ని నేర్చుకుంటారు,ఈ సంఘటనల నుంచి.

    ఆ తర్వాత బజరోవ్ తన సొంత ఊరికి మిత్రుడు ని తీసుకువెళతాడు.అక్కడ తల్లిదండ్రులు చానాళ్ళకి కొడుకు వచ్చాడని సంతోషిస్తారు.అక్కడ కూడా బజరోవ్ తన నిహిలిస్ట్ ధోరణి లోనే ఎక్కువ గా ఎంతవరకో అంతవరకే అన్నట్లుగా ఉంటాడు.ఆ తల్లిదండ్రులకీ ఇతని పరిస్థితి ఏమిటా అనిపిస్తుంది.అక్కడ మిత్రులు ఇద్దరకీ గొడవై మళ్ళీ ఆర్కడి వాళ్ళ ఊరికి వస్తారు.నికొలాయ్ తో సహజీవనం చేస్తున్న ఫెనెష్కా తో చొరవ పెంచుకొని ఒకసారి ఆమె ని ముద్దు పెట్టుకుంటాడు. ఇది పావెల్ చూసి,ఇక ఎలాగైనా వీడిపైన కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుని పిస్టల్స్ తో యుద్ధం చేయాల్సింది గా కోరుతాడు.ఆ దొమ్మి లో పావెల్ గాయపడతాడు.బజరోవ్ ఇక ఉండలేక తమ సొంత ఊరికి వచ్చేస్తాడు.

అక్కడ టైఫాయిడ్ వచ్చి మరణించిన ఒక శవానికి అటాప్సీ చేసి ,పొరబాటున తను గాయపడి ,రక్తం పాయిజన్ అయి కొన్ని రోజులు బెడ్ మీద ఉండి మరణిస్తాడు.చివరకి మిగతా అందరి విషయం లో శుభం కార్డు పడుతుంది.కాత్యా,ఆర్కడి పెళ్ళిచేసుకుంటారు.నికొలాయ్,ఫెనెష్కా కూడా అదే బాట లో నడుస్తారు.పావెల్ జర్మనీ వెళ్ళిపోయి కాలం గడుపుతుంటాడు.అలా నిహిలిస్ట్ గా జీవించిన బజరోవ్ అర్ధాంతరం గా తనువు చాలిస్తాడు. ఈ నవల ద్వారా తుర్గనెవ్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక కొత్త భావం తలెత్తినపుడు దానిని అనుసరించే వారు అపార్ధం చేసుకోబడతారు.

అలాగే పాతవి మొత్తం కూల్చదగినవి అని కూడా కాదు దానిలోనూ పనికి వచ్చేవి ఉంటాయి.ఇలా అనేక భావాల సమాహారం తో ఈ నవల రాయబడింది.రష్యన్ గ్రామీణ జీవితం లోనికి ప్రయాణిస్తూ అదే సమయం లో నాటి యూరపు లోని ఆలోచనా ధోరణులు ఆ సమాజం లో ఎలా ప్రభావాన్ని చూపాయి అనేది ఈ నవల లో చూడవచ్చు. ఇవాన్ తుర్గనెవ్ మంచి వేటగాడు కూడా. తన అనుభవాలతో "స్కెచెస్ ఫ్రం ఏ హంటర్స్ ఆల్బం" అనే గ్రంధాన్ని వెలయించాడు.ఇంకా రుడియన్ (1855) ,ఏ నెస్ట్ ఫర్ జెంటిల్ ఫోక్(1859) ,ఆన్ ది ఈవ్ (1860) అనే రచనలు కూడా ఈయనవే.కొన్ని కవితలు,డ్రామాలు సైతం ముద్రించబడ్డాయి.

                        ---------- మూర్తి కెవివిఎస్ 

(Printed in Nava Telengana Daily, dt. 28.6.2021)

No comments:

Post a Comment