Monday, December 6, 2021

కథ కి కొత్త ఊపిరి ఊదిన ఫ్రెంచ్ రచయిత గై డి మపాసా

ఆధునిక కధ కి పితామహులని చెప్పదగ్గ కొద్దిమంది లో "మపాసా"ముందు వరుస లో ఉంటాడు.ఈ ఫ్రెంచ్ రచయితపూర్తి పేరు హెన్రీ రెనె అల్బర్ట్ గై డి మపాసా (1850-1893). ప్రపంచ కధా సాహిత్యం లో ఆయన విశిష్ట స్థానం ని  ప్రత్యేకించి ఇప్పుడు చెప్పనవసరం లేదు.ఈయన స్వతహా గా ఫ్రెంచ్ భాష లో రాసినప్పటికీ ఇంగ్లీష్ లోకి అనువాదమై అందరకీ తెలిసినవాడయ్యాడు.అయినా ఫ్రెంచ్ కి,ఇంగ్లీష్ కీ ఉన్న బేధం ఎంతని..? యూరపు లోని ఏ భాషలో ఎన్నదగిన రచన వచ్చినా అది మిగతా భాషల్లోకి వేగంగా అనువాదమై పోతుంది.

మపాసా కధల గురించి విన్నాను.కొన్ని తెలుగు అనువాదాలు చదివాను.అయితే ఇటీవల నే  ఇంగ్లీష్ లో ఆయన కధల్ని చదవడం తటస్థించింది. రమారమి 120 ఏళ్ళ క్రితం రాసిన ఆ కధలు ఇప్పటికీ వన్నే తగ్గలేదు.వస్తువు ని ఎన్నుకోవడంలోను,దానిని కధ గా మలచడం లోను మపాసా  చారిత్రకమైన పాత్ర పోషించాడు.ఎలాంటి ఒక కోణానికో అంకితం కాకుండా రకరకాలా దారుల్లో కధ చెప్పుకుంటూ పోయాడు.రియలిజం,ఫాంటసీ,వివిధ తాత్విక ధోరణులు కలగాపులగంగా చేసుకుంటూ వెళ్ళాడు.అయితే దానిలోనూ ఓ క్రమం ఉంది.

ఫ్లాబర్ట్,అలెగ్జాండర్ డ్యూమస్ వంటి సహృదయులైన రచయితలు మపాసా కి మిత్రులు గా లభించడం ఆయన అదృష్టం గా చెప్పాలి. మపాసా రాసిన మొట్టమొదటి కథ The Dumpling (ఫ్రెంచ్ మూలం లో Boule de suif) ని చదివి ఫ్లాబర్ట్ దాన్ని ఎంతగానో ఇష్టపడి మాస్టర్ పీస్ గా అభివర్ణించాడు.దానితో ఉత్తేజితుడైన మపాసా ఆ తర్వాత ఏడాది కి నాలుగు కథాసంపుటుల్ని వెలువరించాడు.స్వతహాగా సంఘ జీవితం కంటే ప్రయాణాలు చేయడం లో ఆనందాన్ని వెతుక్కున్న ఆయన అనేక దేశాల్ని సందర్శించి ఆ అనుభవాలతో రకరకాల కథల్ని రాశాడు. ఆధునిక కథ కి చెహోవ్ ఒక కన్ను అయితే మపాసా మరో కన్ను అని చెప్పాలి.

దాదాపుగా 300 కధలు,6 నవలలు,3 ట్రావెలోగ్స్,ఒక కవితా సంపుటి తను రాసినవి.గతం లో మపాసా కధల్ని తెలుగు లో ఒకరు అనువాదం చేస్తే చదివాను.ఓ రెండు చదవగానే ముందుకి వెళ్ళలేకపోయాను.ఆ కధల్లోని పాత్రలకి మపాసా పెట్టిన ఫ్రెంచ్ పేర్లని తీసివేసి తెలుగు వారి పేర్లని పెట్టాడు అనువాదకుడు.కధాక్రమం అర్ధం అవుతుందేమో గాని దానివల్ల ఒరిజినల్ లో ఉన్న ఆత్మ అనేది మిస్ అయి కృత్రిమంగా అనిపించింది.చదవలేకపోయాను.

ఇప్పుడు ఈ ఆంగ్ల అనువాదాన్ని చదివిన పిమ్మట ఇది రాయాలనిపించింది.మపాసా తాను చూసిన ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధ వాతావరణాన్ని ఎక్కువగా కధల్లో ప్రవేశపెట్టాడు.కొన్నిచోట్ల నామ మాత్రం గా కొన్ని వాటిల్లో ప్రధానంగా.అతీంద్రియ శక్తుల గురించి కూడా..!The trip of Le Horla లో మపాసా వర్ణించిన లోకాలు ,తనని ఆవహించిన ఏదో శక్తి గురించి చాలా సుదీర్ఘంగా చెపుతాడు.భారత దేశం లోని ఏ సాధు పుంగవుల అనుభవాలకి అవి తక్కువ గా ఉండవు.

ఇక మపాసా యొక్క నెక్లెస్ కధ చాలా సుప్రసిద్ధమైనది.ఆ కొసమెరుపు ని అనుకరిస్తూ సోమర్సెట్ మాం లాంటి వాళ్ళు కొన్ని కధలు రాశారు.Two friends కధ లో ఆ చేపలు పట్టే మిత్రుల్ని జర్మన్ సైనికాధికారి పాస్ వర్డ్ చెప్పలేదని కాల్చి చంపడం ...చివరకి వాళ్ళు పట్టిన చేపల్ని కూడా ఫ్రై చేసుకు తినడం ..ఒక సింబాలిక్ గా యుద్ధ భీభత్సాన్ని చూపించాడు.18 వ శతాబ్దం లో ని వినోదపు అలవాట్లని దానిలోనే కళాభిరుచిని మనకి పరిచయం చేస్తాడు.

మపాసా లో ప్రధానం గా కనపడేది జటిలత లేని కధనం.జీవితం లోని అనుభవాలు ఎలా కధలోకి ఒదుగుతాయో అది మపాసా చక్కగా చూపించాడు.కొన్ని కధల్లో ఒక్కోసారి డైలాగ్ లు ఉండవు.ఉత్తమ పురుషలో చెప్పుకుపోతాడు.కొన్ని సార్లు ఒకే ఒక్క పాత్ర తో తన జ్ఞాపకాలు తల్చుకుంటూ కధనడపడం..ఉదాహరణకి సూసైడ్స్ అనే కధ.అలా ఒక ఫ్రేం అని పెట్టుకోకుండా కధ ని ముందుకి తీసుకుపోతాడు.లియో టాల్స్ టాయ్ లాంటివాడే మపాసా కధల గురించి ఒక వ్యాసం రాశాడు.ఫ్రెడెరిక్ నీషే తన ఆత్మ కధ లో ఈయన రచనల్ని ప్రస్తావించాడు.

మపాసా యొక్క నవల ఆ రోజుల్లో Bel Ami నాలుగు నెలల్లో 37 ముద్రణల్ని పొందినది.తన Yacht కి కూడా ఆ నవల పేరు నే పెట్టుకున్నాడు.లీ ఫిగారో,లీ గాలౌస్ లాంటి పత్రికల్లో వార్తాకారుని గా పనిచేసి ,రచయిత గా కూడా తగినంత గా సంపాదించి అనేక దేశాలు చుట్టివచ్చాడు.అతని చివరి రోజుల్లో పేరానోయా కి గురయి గొంతు కోసుకుని మరణించాలని ప్రయత్నించి విఫలమై ఒక చికిత్సాలయం లో కొంత కాలం గడిపి మరణించాడు.ప్రపంచ కధా చక్రవర్తి గా మపాసా స్థానం ఎప్పటికీ శాశ్వతమైనదేనని చెప్పవచ్చును. 

--- Murthy Kvvs

(Printed in Nava Telangana Daily, 6.12.2021)
------- మూర్తి కెవివిఎస్ (7893541003)

No comments:

Post a Comment